గాజువాగు ఒడ్డున యుద్ధ శిబిరం

విభజన రేఖలాంటి దారిలో
ఓ పొడుగుచేతులవాడు
అడుగులకీ ఆశకీ నడుమ
కొన్ని ఎత్తైన కంచెల్ని మొలిపిస్తుంటాడు
ఓ పెద్దతల బాపతు ధనమాలి
కొన్ని రంజుభలే తళుకు తెరల్ని
కళ్లకీ చూపులకీ మధ్య అడ్డుగోడల్లా పరుస్తుంటాడు

మరో కట్టుబానిస సృజనకారుడు
కనుగుడ్లు గుక్కతిప్పుకోలేనంత రసాత్మకంగా
ఆండ్రాయిడ్,ఆపిల్ స్క్రీన్ల మీద
మనిషిని కోతిలా మార్చి బుద్ధిని ఏమార్చే
కోట్లాది బొమ్మల్ని కుమ్మరిస్తుంటాడు
దృశ్యాలనేవి విశృంఖలమై
దృష్టిని మింగేస్తున్నపుడు
మనమంతా కబోదులుగా మిగిలిపోతుంటాం

అడుగానని ఆరాటాల అతిశయమంతా
ఒకే బాటలో సాగుతున్నట్టు భ్రమపడుతుంటాం
ఉదయం పాదం కదపకముందే
మధ్యాహ్నపు మగతలో తలోదారిని పలవరిస్తుంటాం
మబ్బుపట్టిన మనసు జార్చే
ఆవేదనల పొడిపొడి చినుకుల్లో
ఒకరికొకరం గొడుగు పడుతుంటాం

తడారిపోయిన మనసుల అధోయవనికపై
నిద్దుర ఎరుగని ఒద్దిక ఊయలలో
వినమ్రంగా విశ్రమిస్తుంటాం
మనకు మనమే ఉత్తుంగ తరంగాలమని ఊహించుకుంటాం
మబ్బుల్ని తాకే మైత్రీశృంగాలమని
భావించుకుంటాం

వాస్తవ ప్రపంచంలో మాత్రం
ఒకరికొకరం ఎదురుపడుతున్నప్పుడు
అధాటున తప్పుకొని ముఖం తిప్పుకుంటుంటాం
అయోమయ ద్రోనులుగానే మిగిలిపోతుంటాం
పలకరింపులు కూడా ఉండని
అపరిచితులంగానే కుములిపోతుంటాం
మనసు కంటికి కళాయి పూసి
ముఖాన్ని అద్దంలా మెరిపించే గాజువాగులో
ఒంటరొంటరిగా ఈదులాడుతుంటాం

రంగాలుగా విచ్ఛిన్నమైన బ్రతుకు నాటకంలో
నవరసాలను అభినయించే పాత్రధారులం!
కానీ ఎప్పటికీ మన దారులు కలవనివ్వని
సూత్రధారి విన్యాసం మనకు అంతుపట్టదు
ఏరోజుకారోజు యుద్ధం అనివార్యమయ్యే
ఆకలిగొన్న ఆశల సంఘర్షణ మనది
ఎప్పటికీ సఖ్యత సాధ్యంకాని
తరగని తపనల సహచర్యం మనది

ఊరంత నోరేసుకుని ఊదరగొడుతున్న మంత్రవాదులు
మనమనీ మనదనీ మచ్చికచేసుకొని
మనకంటూ ఏదీ మిగలనివ్వకుండా
దశాబ్దాల చెమట పోగుల్ని గట్టు దాటిస్తుంటే
అడ్డుతెరలూ, ఆటంకాలూ దాటి
నిజమేంటో పట్టి చూపగల లోచూపు కావాలి!
ద్రోహాన్ని నిరసించగల చప్పట్లు కావాలి !
సత్యాన్ని ఎలుగెత్తిచాటే గుండె ధైర్యం కావాలి!

ఆ గుండె ధైర్యం… ఆ ధిక్కార స్వరం…
ఆ విముక్త నినాదం…
ఒకే కూడలిలో యుద్ధ సన్నాహమై కలుసుకున్నప్పుడు
త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే పిడికిళ్ళ జెండాది!!

కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.

Leave a Reply