గాజా చిన్నారులకు లేఖ

క్రిస్ హెడ్జెస్
తెలుగు: శివలక్ష్మి

(క్రిస్ హెడ్జెస్ జర్నలిస్ట్, పులిట్జర్ ప్రైజ్ గ్రహీత. ఆయన పదిహేనేండ్లు ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు విదేశీ పత్రికా ప్రతినిధి గా వ్యవహరిస్తూ మిడిల్ ఈస్ట్ బ్యూరో చీఫ్ గా, బల్కం బ్యూరో చీఫ్ గా పని చేశాడు. ఆయన ‘ద డాలస్ మార్నింగ్ న్యూస్’, ‘ద క్రిస్టియన్ సైన్స్ మానిటర్’, ‘ఎన్. పి. ఆర్’ సంస్థలకు కూడా విదేశాల నుండి రిపోర్టర్ గా పనిచేశాడు.

క్రిస్ హెడ్జెస్ రాసిన ఈ రిపోర్ట్ 8 నవంబర్ 2023న ScheerPost పత్రికలో ప్రచురించబడింది.)

*

ప్రియమైన గాజా చిన్నారులారా,

నా పేరు క్రిస్ హెడ్జెస్. నేనొక విలేఖరిని. అర్ధరాత్రి దాటింది. నేను చీకటిలో, అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వేల అడుగుల ఎత్తులో, గంటకు వందలమైళ్ళ వేగంతో నేనెక్కిన విమానం గాలిలో ఎగురుతుంది. నేను ఈజిప్ట్ కు ప్రయాణిస్తున్నాను. రఫా వద్ద గాజా సరిహద్దుకి చేరుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. నేను మీగురించే బయలుదేరాను.

మీరు ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. ఆ మాటకొస్తే మీరసలు గాజానే విడిచిపెట్టి ఎరగరు. దట్టంగా మనుషులతో కిక్కిరిసిన వీధులు, సన్నని సందులు, గొందులు, గుడిసెలు, కుటీరాలు, మహా అయితే కాంక్రీట్ శిబిరాలు మాత్రమే మీకు తెలుసు. గాజా చుట్టూ గట్టి నిఘాతో పహారా కాస్తూ మీ భద్రతకు అడ్డంకులు సృష్టిస్తున్న సైనికులు, ముళ్ళ కంచెలు మాత్రమే తెలుసు మీకు. భయంకరంగా దాడులు చేసే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు మిమ్మల్ని భీతిల్లజేస్తాయి. వాళ్ళు మీ పైన తిరుగుతూ గురి పెట్టి క్షిపణులు, బాంబులు వేస్తారు.

మీచుట్టూ చెవులు అదిరిపోయే ఉరుములవంటి పెద్ద పెద్ద పేలుళ్లు సంభవిస్తుంటాయి. ఆ శబ్దాలకు భూమి కంపిస్తుంది. ఆ కంపనలకు పెద్ద పెద్ద భవనాలు సైతం అమాంతంగా కూలి పడిపోతుంటాయి. కొంతమంది నిశ్శబ్దంగా మరణిస్తారు. కెవ్వు మంటూ కేకలు, పెద్ద పెద్దగా హాహాకారాలు, పేలవమైన గొంతులతో శిధిలాలకింద చిక్కుకుపోయిన వ్యక్తులు సహాయం కోసం అర్ధించే పిలుపులు వినిపిస్తుంటాయి. రేయీ పగలూ ఇది ఆగదు. మీతో ఆటలాడిన మీ స్నేహితులు, మీ పాఠశాల విద్యార్ధులు, మీ క్లాస్ మేట్స్, మీ పొరుగువారు కొన్ని సెకన్లలో కాంక్రీట్ కుప్పలకింద చిక్కుకుపోతారు. వాటిని తవ్వి వారిని బయటికి తెచ్చినప్పుడు దుమ్ముతో నిండిన తెల్లటి సుద్ద ముఖాలు, కుంటుతూ వంగిపోయి నడిచే శరీరాలను చూస్తారు. నేనొక రిపోర్టర్ని. ఇలాంటివాటిని చూడడం నా పని కాబట్టి ఇది నాకలవాటే. కానీ మీరు చిన్నపిల్లలు. మీరు ఇలాంటి భయం కలిగించే దృశ్యాలను ఎప్పటికీ చూడకూడదు.

మరణపు దుర్వాసనలు గుప్పుమంటుంటాయి. ఫెళ్ ఫెళ్ మంటూ భీకరశబ్దంతో విరిగే కాంక్రీటు గోడలు, శిధిలాల కింద కుళ్లిపోతున్న శవాలు. మీరు వీటన్నిటినీ చూసి తట్టుకోలేరు. మీరు మీ నోటిని గుడ్డతో కప్పుకుని మీ శ్వాసను చెడు వాయువులు సోకకుండా కాపాడుకోండి. అంతేకాదు. మీరక్కడ నుండి వేగంగా పారిపోండి. మీకు తెలిసిన మీ పరిసరాలన్నీ శ్మశాన వాటికలుగా మారాయి. మీకు తెలిసినవన్నీ క్షణాల్లో బొగ్గులుగా మారిపోయాయి. మీరు మేమెక్కడ ఉన్నామా అని పోల్చుకోలేక కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటారు. మీరు దిగ్భ్రాంతికి గురవుతారు.

మీరు భయంతో వణికిపోతున్నారు. పేలుడు తర్వాత పేలుడు విజృంభించడంతో మీరు భీతిల్లిపోతున్నారు. విపరీతమైన భయంతో ఏడుస్తూ అమ్మను గానీ నాన్నను గానీ అతుక్కుపోతూ అంటిపెట్టుకుని ఉంటారు. క్షిపణుల తెల్లని కాంతులు చూస్తూ జరగబోయే పేలుడు శబ్దాలకు మీ చెవుల డయాఫ్రమ్ లు బద్దలు కాకుండా గట్టిగా మూసుకోండి. వాళ్ళు పిల్లలను ఎందుకు చంపుతున్నారు? మీరు ఎవరికి ఏమి హాని చేశారు? మిమ్మల్ని ఎవరూ ఎందుకు రక్షించలేకపోన్నారు? మీరు దారుణంగా గాయపడుతున్నారా? మీరు కాళ్ళు గానీ చేతులు గానీ కోల్పోబోతున్నారా? గుడ్డివాళ్ళయిపోతారా? చక్రాల కుర్చీకీ అంకితమైపోయి నడవలేకపోతారా? మీరు ఎందుకు పుట్టారు? ఏదైనా సమాజానికి మంచి చేయడం కోసమా? లేక మరణం కోసమా? మీరు పెరిగి పెద్దవుతారా?? మీరు సంతోషంగా జీవిస్తారా? మీ స్నేహితులు లేకుండా బతకడమంటే మీకు ఎలా ఉంటుంది? తర్వాత చనిపోబోయేది ఎవరు? మీ అమ్మా? మీ నాన్నా? మీ అన్నతమ్ములా? మీ అక్క చెల్లెళ్ళా? మీకు తెలిసిన ఎవరైనా క్షణాల్లో గాయాలపాలవుతారు. మీకు తెలిసిన ఎవరైనా త్వరలోనే చనిపోతారు.

రాత్రిపూట మీరు చల్లని సిమెంట్ నేలపై చీకటిలో పడుకుని ఉంటారు. ఫోన్లు కట్ అవుతాయి. ఇంటర్నెట్ సర్వీసులు ఆపివేయబడతాయి. ఏం జరుగుతుందో అని మీకు అయోమయంగా ఉంటుంది. అక్కడ ఫ్లాష్ లైట్లు వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఒకదానితో ఒకటి కొట్టుకునే తీవ్రమైన పేలుళ్ళ శబ్దాల ప్రకంపనలకు నేల కంపించిపోతూ ఉంటే మనుషుల మెదళ్ళు అదిరిపోతుంటాయి. అలలు అలలుగా వినిపించే అరుపులు ఆగవు. మీ తండ్రి లేదా తల్లి ఆహార పానీయాల కోసం వెతుకుతూ వెళ్ళినప్పుడు మీరు వారికోసం ఎదురుచూస్తుంటారు. మీకు భయంకరమైన ఆకలి బాధతో పేగులు కడుపుకి అతుక్కుపోయి అలమటిస్తుంటారు. కానీ వారు మళ్ళీ తిరిగి వస్తారా? మీరు వారిని మళ్లీ చూస్తారా? మీ పక్కన మీ చిన్న ఇల్లు ఉంటుందా? బాంబు దాడులు మిమ్మల్ని మట్టుపెట్టకుండా ఉంటాయా? భూమిమీద మీ చివరి క్షణాలు అవేనా?

మీరు మురికి ఉప్పు నీరు తాగుతారు. అది మిమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తుంది. మీ కడుపులో అంతులేని బాధ మొదలవుతుంది. మీకు ఆకలిగా ఉంది. కానీ బేకరీలన్నీ ధ్వంసమయ్యాయి. రొట్టె లేదు. మీరు రోజుకు ఒక్కసారే ఏదో ఒకటి తినగలుగుతారు. పాస్తా గానీ ఒక దోసకాయ గానీ దొరకడమే గగనమవుతుంది. కానీ త్వరలో అదే ఒక విందులా తయారవుతుంది. ఇక మీరు గుడ్డతో చేసిన మీ సాకర్ బంతితో ఆడలేరు. పాత వార్తాపత్రికలతో తయారు చేసిన మీ గాలిపటాన్ని మీరు ఎగరవేయలేరు.

మీరు విదేశీ రిపోర్టర్లను చూశారు కదా? మేము మందమైన బట్టమీద మెటల్ తో చేయబడిన స్లీవ్‌లెస్ జాకెట్ ను ధరిస్తాం. అవి బుల్లెట్ల నుంచి మాకు రక్షణ కవచాలలాగా పనిచేస్తాయి. వాటి మీద ప్రెస్ అని రాసి ఉండడం కూడా మీరు చూశారు. మా దగ్గర హెల్మెట్లు ఉన్నాయి. అంతేకాదు కెమెరాలు కూడా ఉన్నాయి. మేము జీపులు నడుపుతాం. మేము బాంబు దాడులు, కాల్పుల విరమణ తర్వాత కనిపిస్తాం. కులాసాగా కాఫీ తాగుతూ చాలా సేపు కూర్చుని మీ పెద్దవారితో మాట్లాడతాం. ఆ తర్వాత కనిపించకుండా అదృశ్యమవుతాం. సాధారణంగా మేము పిల్లలను ఇంటర్వ్యూ చేయం. కానీ మీ పిల్లల గుంపులు గుమిగూడి నన్ను చుట్టుముట్టినప్పుడు, మీరు నవ్వుతూ, మిమ్మల్ని చూపిస్తూ, మీ చిత్రాలను తీయమని అడుగుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేశాను.

నేను గాజాలో జెట్‌ల బాంబు దాడికి గురయ్యాను. మీరు పుట్టక ముందు జరిగిన ఇతర యుద్ధాలలో, నేను బాంబు దాడికి గురయ్యాను. ఆ సమయంలో నేను కూడా చాలా చాలా భయంతో వణికిపోయాను. నాకు ఇప్పటికీ దాని గురించి కలలు వస్తుంటాయి. నేను మీ గాజా చిత్రాలను చూస్తున్నప్పుడు గతకాలపు ఆ యుద్ధాలు ఉరుములు మెరుపుల శక్తితో నాకు తిరిగి గుర్తొస్తాయి. అందుకే నా జ్ఞాపకాల్లో నేను మీ గురించి ఈ భీకరమైన యుద్ధాన్ని పసివాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారో అని ఆలోచిస్తుంటాను. యుద్ధాన్ని కళ్ళ చూసిన వాళ్ళం పిల్లలపై అది చేసే అంతులేని దుర్మార్గపు హాని కలిగించే పనుల కారణంగా యుద్ధాన్ని మనందరం ద్వేషిస్తున్నాం.

నేను మీ కథ ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. “మీరు (ఇజ్రాయేల్ ప్రభుత్వవర్గాలు) పాలస్తీనా ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, దశాబ్దాలకు దశాబ్దాల తరబడి, మీరు ప్రజల స్వేచ్ఛను, గౌరవాన్ని నిరాకరిస్తున్నప్పుడు, మీరు వారిని ప్రతి సందర్భంలోనూ అవమానిస్తూ బహిరంగ జైలులో బంధిస్తున్నారు” అని నేను ఇదంతా వాళ్ళకి వివరించి చెప్పడానికి ప్రయత్నించాను. “మీరు వారిని మృగాల్లాగా చంపుతున్నప్పుడు, వారు చాలా పట్టరాని ఆగ్రహంగా రగిలిపోతుంటారు. వారికి జరిగిన అవమానాలకు, హననాలకు ప్రతీకారంగా, మీరు వారికి చేసినట్లే వారు ఇతరులకు కూడా చేస్తారు.” ఇదే విషయాన్ని పదే పదే చెప్పాను. ఏడేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నాను. కొద్దిమంది విన్నారు. మరికొంతమంది వినలేదు. ఇప్పుడు ఇది సంభవించింది.

పాలస్తీనాలో చాలా ధైర్యస్తులైన, సాహసవంతులైన జర్నలిస్టులున్నారు. ఈ బాంబు దాడి ప్రారంభమైనప్పటి నుండి వారిలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు. వారే అసలు నిజమైన హీరోలు. అలాగే మీ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు కూడా అంతే. యునైటెడ్ నేషన్స్ కార్మికుల ధైర్య సాహసాలు కూడా అంతే ప్రశంసించదగ్గవి. వీరిలో ఎనభై తొమ్మిది మంది చనిపోయారు. అలాగే అంబులెన్స్ డ్రైవర్లు, వైద్యులు కూడా. కాంక్రీటు స్లాబ్‌లను తమ చేతులతో పైకి ఎత్తే రెస్క్యూ టీమ్ పార్టీలు కూడా అంతే. బాంబుల నుండి మిమ్మల్ని రక్షించే తల్లులు, తండ్రులు కూడా అంతే. వీరంతా ఎంతో గొప్పవారు. కానీ ఈ దుఃఖ సమయంలో మీ కష్టాన్ని పంచుకోవడానికి మమ్మల్ని అక్కడికి ప్రవేశించనివ్వలేదు. ఈసారే కాదు. మేము అసలు లోపలికి రాలేము. మేము బయటే లాక్ అయి ఉన్నాం.

ప్రపంచం నలుమూలల నుండి విలేఖరులు సరిహద్దు దాటడానికి రఫా వద్దకు వస్తున్నారు. మేము ఈ వధను చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి మేము కూడా రఫా సరిహద్దు వద్దకు వెళ్తున్నాం. రోజుకు వందల మంది పాలస్తీనా ప్రజలతో పాటు 160 మంది పిల్లలతో సహా హతులవుతున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం. ఈ మారణహోమం ఆగాలి కాబట్టి మేము వెళ్తున్నాం. మాకు కూడా మీలాంటి పిల్లలు ఉన్నారు కాబట్టి మేము వెళ్తున్నాం. అమూల్యమైన, అపురూపమైన, అమాయకమైన మీ లాంటి చిన్నారులను ప్రేమిస్తున్నాం కాబట్టి మీరు కలకాలం జీవించాలనే తపనతో ఉన్నాం కాబట్టి మేము రఫా సరిహద్దుకు వెళ్తున్నాం.

ఏదో ఒక రోజు మనం కలుసుకుంటామని ఆశిస్తున్నాను. మీరు అప్పటికి యుక్తవయస్కులవుతారు. నేను ఇప్పటికే చాలా పెద్దవాడిని, కనుక ముసలివాడిని అవుతాను. నేను మిమ్మల్ని నా కలల ప్రపంచంలో సురక్షితంగా, సంతోషంగా, స్వేఛ్చాజీవులుగా నిలుపుకుంటాను. అక్కడ మిమ్మల్ని చంపడానికి ఎవరూ ప్రయత్నించరు. మీరు బాంబులతో నిండిన విమానాలలో కాకుండా ప్రేమాభిమానాలతో ఉన్న నిజమైన మనుషులతో నిండిన విమానాలలో హాయిగా ఎగురుతూ విహరిస్తారు. అప్పుడు మీరు కర్కశమైన నిర్బంధ శిబిరాలలో చిక్కుకోలేరు. మీరు సుందరమైన ప్రపంచాన్ని చూస్తారు. మీరు ఎదుగుతూ పిల్లా పాపలతో సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. మీరు వృద్ధులవుతారు. మీరు ఈ మారణ హోమాలను, ఈ బాధల నరక యాతనలను గుర్తుంచుకుంటారు. మీకు ఈ కష్టాలు తెలుసు కాబట్టి అలాంటి బాధల్లో ఉన్నవారికి, అలాంటి నరకకూపాల్లో పడి సహాయం అందక మగ్గుతున్న వారికి కొండంత అండగా ఉండి సహాయ పడాలని నా ఆశ. ఇది నా విజ్ఞప్తి.

మేము మీకు సహాయ పడడంలో పూర్తిగా విఫలమయ్యాం. ఇది మేము ఇప్పుడు మోస్తున్న, కలకాలం మోయవలసిన ఆమోదించలేని ఘోరమైన మహాపరాధం. మేము మా శక్తికొద్దీ ప్రయత్నించాం. కానీ మేము దుష్టశక్తులకు దీటుగా తగినంతగా ఎదురొడ్డి నిలవలేకపోయాం. చాలా మంది విలేఖరులం రఫాకు వెళ్తున్నాం. మేము నిరసనగా గాజా సరిహద్దు వెలుపల నిలబడతాం. మీ గురించి రాసి, సినిమాలు చేసి ప్రపంచానికి తెలియజేస్తాం. ఇప్పటికి మేము చేయగలిగింది ఇదే. ఇది చాలా తక్కువే! కానీ అందులోనే మాకు ఎంతో కొంత ఊరట దొరుకుతుంది. మేము మీ కథను మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాం!

ఈ మా ప్రయత్నాలు మీ క్షమాపణ కోసం అడిగే హక్కును సంపాదించి పెడతాయనుకుంటున్నాను.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply