ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాను స్థిమితపరచగలదన్న ఆశలన్నీ ఆడియాసలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం మరికొంతకాలం కొనసాగింపు గురించి చర్చించుకోబోతున్న తరుణంలో, ఇజ్రాయెల్ గాజాపై 200 యుద్ధ విమానాలతో మార్చి 17 తెల్లవారు జామున 80 ప్రదేశాల పైన దాడి చేసింది. ఈ వైమానిక దాడుల్లో నాలుగొందలకు పైగా ప్రాణాలు పోయాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఆహార పదార్థాలు, తాగునీరు, నిత్యావసరాలు, మందులు, విద్యుత్ సరఫరాలను ఇజ్రాయెల్ స్తంభింపజేయడంతో ఇరవై లక్షల మంది గాజావాసులు ఇప్పటికే ఆకలిని చవిచూస్తున్నారు. అలాంటి అసహాయ వాతావరణంలో శరణార్థి శిబిరాలు, పాఠశాలలు వంటి వాటిపై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ తన రాక్షసత్వాన్ని మరోసారి ప్రదర్శించింది. గాజాను పూర్తిగా తుడిచిపెట్టాలన్న వికృత కోరికతో ఇజ్రాయెల్ పరమ కిరాతకంగా కొనసాగిస్తున్న జాతి హననమిది! చుట్టూ శిథిలాలు… అంతటా మృతదేహాలు… ధ్వంసం కాగా మిగిలిన ఆసుపత్రుల్లో నేల మీద నెత్తుటిమడుగుల్లో మనుషులు… వాళ్లను కాపాడాలని కన్నీళ్లతో ప్రయాసపడుతున్న డాక్టర్లు…. ఆపత్కాలంలో అందుబాటులో లేని అత్యవసర ఔషధాలు… కనీస వైద్యవసతులకూ దిక్కులేని దయనీయ పరిస్థితులు… ప్రస్తుతం గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలు.
2025 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగే సమయానికి దాదాపు 50 వేల ప్రాణాలను బలిగొంది. లక్షా 12 వేల మంది గాయపడ్డానికి కారణమైంది. ఈ పోరులో సమిధలుగా మారుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. దాడుల సమయంలో నెతన్యాహు ప్రభుత్వం అన్ని మానవీయ విలువలను, చట్ట నిర్దేశాలను కాలరాసింది. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ప్రజలను గాజా ప్రాంతం వైపు తరుముతూ, అక్కడ కిక్కిరిసిన జనాలపై వైమానిక దాడులకు దిగింది. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు, వివాహ ఊరేగింపులు, సహాయక కేంద్రాలూ… ఇలా అన్నింటిపైనా బాంబుల వర్షం కురిపించి, పెద్ద సంఖ్యలో సామాన్యుల ప్రాణాలను పొట్టన పెట్టుకొంది. ఈ దుర్మార్గం పట్ల ఐక్యరాజ్య సమితి, అనేక దేశాలూ అభ్యంతరం వ్యక్తం చేసి, దాడులను నిలిపివేయాలని కోరినా ఇజ్రాయెల్ లక్ష్య పెట్టడం లేదు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధానికి తెర పడుతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్… కొద్ది రోజులకే తన అసలు రూపం బయట పెట్టుకున్నాడు. కాల్పుల విరమణ ఒప్పంద కాలంలోనే ఇజ్రాయెల్ అమెరికా రూ.6.38 లక్షల కోట్ల విలువైన బాంబులు, క్షిపణులను విక్రయించే ఒప్పందం కుదిరింది. పాలస్తీనాను విధ్వంసం చేసిన ఇజ్రాయెల్ కు వంత పాడడం మొదలు పెట్టాడు.
రఫా, ఉత్తరగాజా, గాజాసిటీ ఇత్యాది గాజాపట్టీలోని పలుప్రాంతాలమీద ఇజ్రాయెల్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. కాల్పుల విరమణ అమలు జరుగుతున్న కాలంలో ఇంతటి దుర్మార్గాన్ని కలలో కూడా ఊహించని కారణంగా పెద్దసంఖ్యలో స్త్రీలు, పిల్లలతో సహా వందలాదిమంది ఇజ్రాయెల్ వైమానిక దాడులకు బలైపోయారు. పదిహేడు నెలల యుద్ధంలో ఒకేరోజున అత్యధిక సంఖ్యలో జనహసనం జరిగిన సందర్భం ఇదే కావచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోగల అవకాశమైనా జనానికి మిగిలి ఉంటుంది. కానీ, యుద్ధం ఆగి, కాల్పుల విరమణ అమలు జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఈ దుశ్చర్యకు ఒడిగట్టింది. ఇంతకుముందు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన పాలస్తీనియన్లు సైతం ఎంతో నమ్మకంగా తిరిగివచ్చినందున, పెద్దసంఖ్యలో ఈ మారణకాండకు బలైపోయారు. కాల్పుల విరమణ కాలంలో గాజాకు తిరిగివచ్చిన పాలస్తీనియన్ల సంఖ్య ఓ ఐదు లక్షల వరకూ ఉంటుంది. తమ ఇళ్ళు నేలమట్టమైన చోటే టెంట్లు వేసుకొని వారంతా ఉంటున్నారు. రాత్రివేళ దాడికావడంతో నిద్రలో ఉన్న వారు సులువుగా దొరికిపోయారు, శిథిలాల్లోనే నిక్షిప్తమైపోయారు. ఒకేమారు గాజా నలుదిక్కుల్లోనూ ఈ దాడి జరిగింది. ఎఫ్-16, ఎఫ్-35 వంటి యుద్ధ విమానాలతో పాటు, హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తుంటే. నేల మీద ట్యాంకులు విరుచుకుపడ్డాయి. పరుగులు తీస్తున్నవారిని కూడా ఇజ్రాయెల్ సైనికులు కాల్చి పారేశారు. మందులూ, వైద్యులు లేని స్థితిలో ఇప్పుడు జరిగిన భయానకమైన దాడి మరింత తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించింది.
తనపై దాడికి దిగిన హమాస్ ను నామరూపాల్లేకుండా చేస్తానంటూ యుద్ధ క్షేత్రంలోకి అడుగు పెట్టిన ఇజ్రాయెల్- పదిహేడు నెలలుగా గాజాలో నెత్తుటేళ్లు పారిస్తోంది. పదిహేడు నెలల క్రితం యుద్ధం ప్రారంభం కాగానే తన దగ్గర బందీలుగా ఉన్న 251 మందిని విడిచి పెట్టిస్తామనీ, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా వారందరిని విడుదల చేయాలని హమాస్ ప్రతిపాదించింది. అయితే ఇజ్రాయెల్ బందీల విడుదల చేయించుకోవడం కంటే ఎక్కువ ప్రాధాన్యత హమాస్ అంతం లక్ష్యంగా యుద్ధం సాగించింది. జనవరిలో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని టెల్అవీవ్ కనీసంగా 350 సార్లు ఉల్లంఘించింది. సైనిక చొరబాట్లు, తుపాకీ కాల్పులు, నిఘా పెంపు, గాజావాసులకు అందాల్సిన సాయానికి మోకాలడ్డటం వంటి వాటికి నిరంతరం పాల్పడుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా వైమానిక దాడులకు దిగిన టెల్అవీవ్ అమానవీయ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. బందీలను విడిచిపెట్టడానికి హమాస్ ఒప్పుకోకపోవడంతోనే సమరభేరి మోగించాల్సి వచ్చిందని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ నమ్మబలుకుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాను ఖాళీ చేయాలన్న కాల్పుల విరమణ ఒప్పందం గురించి నోరెత్తని ఆయన శాంతి చర్చలను ఉద్దేశ్య పూర్వకంగానే కాలదన్నారు. వినాశకర యుద్ధాలకు వ్యతిరేకిననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నెతన్యాహూను ఇప్పుడు పల్లెత్తు మాటనడం లేదు. తమకు చెప్పాకే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసిందన్న వైట్ హౌస్ వర్గాల ప్రకటన హింసోన్మాద టెల్అవీవ్ కు వెనుదన్నుగా ఉంటోంది ఎవరో స్పష్టంగా వెల్లడిస్తోంది! ట్రంప్ యుక్రెయిన్లో శాంతి, పశ్చిమాసియాలో యుద్ధం అనే ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నాడు.
20 లక్షల మంది పాలస్తీయన్లకు జోర్డాన్ లో ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని ఆ దేశ రాజును ట్రంప్ ఆదేశించాడు. చెప్పినట్టు చేయకపోతే తమ దేశం నుంచి సహాయం నిలిపివేస్తామని బెదిరించాడు. ఈ విధంగా పశ్చిమాసియాలో నిత్యం అశాంతిని రాజేయటానికి, ఉద్రిక్త పరిస్థితులు కొనటానికి అమెరికా అజ్యం పోస్తోంది. తాము చెప్పినట్టు వినాలని, లేకుంటే దాడులనో, సహాయ నిరాకరణనో ఎదుర్కోవాల్సి ఉంటుందని నేరుగా బెదిరించటం సమస్యలను మరింత జఠిలం చేస్తోంది. గాజా ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని, అక్కడి ప్రజలు ఇతర దేశాల రక్షణలోకి వెళ్లిపోవాలంటూ చేసిన సూచనను అరబ్ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. హమాస్ ను ఉద్దేశించి తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలు శాంతిని నెలకొలిపే మధ్యవర్తిలా కాక దురాక్రమణదారు బెదిరింపుల్లా ఉన్నాయి. పశ్చిమాసియా మీద ఆధిపత్యం సాధించాలనేది ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జనవరి 19న కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఆరు వారాల పాటు సాగే ఒప్పందం మొదటి దశలో భాగంగా హమాస్ తన చెరలో ఉన్న బందీల్లో 33 మందిని విడిచిపెడితే, తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీల్లో రెండువేల మందిని ఇజ్రాయెల్ విముక్తుల్ని చేయాలి, మొదటి దశ ముగిసి రెండో దశ అమలుకోసం చర్చలు మొదలు కావలసిన తరుణంలో కథ అడ్డం తిరిగింది. ఒప్పందం కొనసాగించాలంటే హమాస్ చెరలో ఉన్న బందీలలో సగం మందిని విడిచి పెట్టాలని, రంజాన్ నేపథ్యంలో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకూ కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ విట్కాఫ్ అనూహ్యంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడంతో చర్చలకు ప్రతిష్టంభన ఏర్పడింది. కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరాక, అది అమలు జరుగుతున్న తరుణంలో ఇలా కొత్తగా షరతులు విధించడమేమిటని ప్రశ్నించే ధైర్యం ఒప్పందానికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ దేశాల ప్రతినిధులకు లేకపోయింది. కాల్పుల విరమణకు సంబంధించి తాజా షరతులు అంగీకరించేలా హమాస్ పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పన్నిన వ్యూహంలో భాగమే తాజా దాడులని అర్ధమవుతోంది. తమ వ్యూహానికి అమాయక ప్రజలు, ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారనే ఇంగిత జ్ఞానం వారికి కొరవడటమే అత్యంత బాధాకరమైన విషయం.
ఖతార్, ఈజిప్టు దేశాల కృషితో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలో భాగంగా 25 మంది బందీలు, మరో ఎనిమిది మంది మృతదేహాలను ఇజ్రాయెల్ కు హమాస్ అప్పగించింది. అందుకు ప్రతిగా తన చెరలో మగ్గిపోతున్న దాదాపు రెండు వేల మంది పాలస్తీనియన్లను టెల్అవీవ్ విడిచిపెట్టింది. ఒప్పందం రెండో దశలో హమాస్ మిగిలిన బందీలందరినీ వదిలేయడం, ఇజ్రాయెల్ సేనలు గాజాను వీడటం ప్రధానమైనవి. వాటిపై చర్చలు కొలిక్కిరాకమునుపే నెతన్యాహూ మళ్లీ యుద్దరక్కసికి ఎందుకు ఆవాహన పలికారు? అంటే, పాలస్తీనియన్లతో శాంతిని ఎంతమాత్రం కోరుకోని జాత్యహంకారుల మద్దతుతో తన సంకీర్ణ సర్కారును నిలబెట్టుకోవడం, అలా ఈ నెలాఖరులోగా బడ్జెట్ ను ఆమోదింపజేసుకుని దీర్ఘకాలం తానే అధికారం చలాయించడం ఆయన అసలు లక్ష్యాలు, జాతీయ భద్రత పేరిట తన అవినీతిపై సాగుతున్న కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడమూ నెతన్యాహూ కుతంత్రంలో భాగమనే కథనాలూ ఇజ్రాయెల్ నుంచి వెలువడుతున్నాయి. స్వప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయ నాయకుడు ఆడుతున్న మృత్యుక్రీడ మానవ నాగరికతకే మాయనిమచ్చ.
అమెరికా ప్రతిపాదించిన అడ్డగోలు షరతులకు హమాస్ ససేమిరా అనడంతో ఇజ్రాయెల్ మరోసారి తన క్రూర స్వభావాన్ని బయట పెట్టుకుంది. యుద్ధం కారణంగా కకావికలమై, ప్రాణభయంతో చెట్టుకొకరు, పుట్టకొకరు చందంగా పోయిన గాజావాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న తరుణంలో వారికి బయటనుంచి వస్తున్న సహాయం అందకుండా అడ్డుకట్ట వేసింది. రంజాన్ మాసంలో కూలిన భవంతుల తాలూకు శిథిలాల మధ్యే రోడ్డుపై గాజావాసులు ఇఫ్తార్ విందును ఆరగిస్తున్న దృశ్యాలు ఎంతటి పాషాణ హృదయాలనైనా కరగిస్తాయి. కానీ, అధికారం నిలుపుకునేందుకు యుద్ధాన్ని ఆయుధంగా చేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు, ఇజ్రాయెల్ కు ఆయుధ సంపత్తిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న అమెరికాకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. మొండివాడు రాజు కంటే బలవంతుడనేది సామెత. రాజే మొండివాడైతే ఇక చెప్పిందేముంది? డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆయనకు ఎవరి సలహాలూ అక్కర్లేదు. ఎవరి మాటనూ పట్టించుకోరు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే రీతిలో మొండిగా వ్యవహరిస్తూ, ఇతర దేశాలతో కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పశ్చిమాసియా మీద ఆయన దృష్టి పడింది.
హమాస్ కు భారీ నష్టం:
ఇజ్రాయెల్ దాడులతో హమాస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. హమాస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు మరణించారు. హనియే, సిన్వర్ వంటి హమాస్ అగ్రనాయకులు అంతమైనా… వ్యూహాత్మక పోరాటాలకు సహకరిస్తున్న ఇస్లామిక్ జిహాద్ నేత అబూ హమ్జా తాజా దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. క్షిపణుల కమాండర్ గా పనిచేస్తున్న హమ్జా భార్య ఇతర కుటుంబ సభ్యులూ చనిపోయినట్లు తెలిపింది. ఇక హనియేకు కుడిభుజంగా ఉంటూ… ఆయన మరణం తర్వాత హమాస్ ప్రధాని పదవిని చేపట్టిన ఇసామ్ డాలిస్, ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు మనవరాళ్లు కూడా మృతి చెందారు. డాలిస్ మరణంతో హమాస్ దారి తెన్నూ లేకుండా పోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి జరిపిన సమయంలో ఇజ్ అద్-దీన్ అల్-ఖాసమ్ బ్రిగేడ్లకు సీనియర్ నేతగా… రఫా బ్రిగేడ్ కు డిప్యూటీ కమాండర్ గా డాలిస్ పనిచేశారు. డాలిస్ మరణాన్ని ఆయన సోదరుడు ధ్రువీకరిస్తూ, మార్చి 17న అల్-జజీరాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇతర నేతలు: బహత్ అబూ సుల్తాన్ హమాస్ లెఫ్టినెంట్ జనరల్, ఇజ్రాయెల్ పై దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. అహ్మద్ ఒమర్ అల్-హట్టా హమాస్ న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ… ఇస్లామిక్ చట్టాల అమలులో కీలక పాత్ర పోషించారు. గాజా అంతర్గత వ్యవహారాల ఇంచార్జిగా కూడా కొనసాగారు. మహమ్మద్ అబూ వత్సా హమాస్ పోలీసు, భద్రత విభాగాల అధిపతిగా అంతర్గత వ్యవహారాల డిజిగా సేవలందించారు. యాసిర్ హర్బ్ హమాన్ పాలిట్ బ్యూరో సభ్యుడు, ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఈయన ఐదుగురు కుమారులు కూడా మరణినిచారని బకార్ వార్తాపత్రిక అల్ – అరబీ అల్-జదీద్ వెల్లడించింది. అబూ ఒబేదా మహమ్మద్ అల్-జమాసీ హమాన్ లో మానవహక్కులను పర్యవేక్షించారు. పాలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా దక్షిణ గాజాకు ప్రభుత్వాధినేతగా పనిచేశారు. బర్దావీల్ హమాస్ రాజకీయ కార్యాలయ సభ్యుడు, అతని భార్య మరణించారు.
ముగింపు :
ఒప్పందం రెండో దశలోకి ప్రవేశిస్తే, గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. అంటే, గాజాను ఏలుకోమని మళ్ళీ హమాస్ కు ఇచ్చేయడమే అవుతుంది. అటువంటి సూచనలు ఏ మాత్రం కనిపించినా, నెతన్యాహూ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటాయి. ఇప్పటికే ఆయనకు దూరం జరిగినవారు ఉన్నందున రాబోయే రోజుల్లో ఆయన అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి రావచ్చు. కోర్టులో అవినీతికేసులు కొలిక్కివచ్చాయనీ, తప్పించుకోవడానికి మళ్ళీ ఈ యుద్ధం రాజేశాడు నెతన్యాహు. మొత్తానికి మార్చి 17 ఊచకోతతో పరిస్థితి మొదటికి వచ్చింది. హమాన్ -ఇజ్రాయెల్ మధ్య రెండునెలల కాల్పుల విరమణ ఒప్పందం స్థానంలో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హమాస్ దగ్గర ఇంకా 69 మంది ఇజ్రాయెలీ పౌరులు బందీలుగా ఉన్నారని లెక్క కానీ, వారిలో అత్యధికం ఇప్పటికే మరణించారన్న సమాచారం ఉండటంతో ఇజ్రాయెల్ ఈ దూకుడు నిర్ణయం తీసుకుందని అంటారు. కానీ, తమవారిని రక్షించుకునే పేరిట గాజాలో అది మున్ముందు సాగించబోయే విధ్వంసం ఊహకు అందనిది. యుద్ధానికి స్వస్తి చెప్పే ఉద్దేశం నెతన్యాహుకు లేదనిపిస్తోంది. హమాస్ ను నిర్మూలించడమనే ముసుగులో తిరిగి తమ ఇళ్ళకు చేరుకుంటున్న పాలస్తీనియన్లను తరిమికొట్టే స్వామికార్యాన్ని కూడా నెతన్యాహూ నెరవేర్చబోతున్నారు. అమెరికా కనుసన్నల్లో జరుగుతున్న ఈ దారుణ మారణకాండకు నిరసిస్తూ శాశ్వత శాంతి నెలకొనేలా చర్చల ప్రక్రియ ప్రారంభించే విధంగా అంతర్జాతీయ సమాజం గొంతెత్తాలి.