ప్రపంచీకరణ విధ్వంసాన్ని చెప్పిన “గబ్బగీమి”

పల్లె జీవితాలను నాస్టాల్జిక్ గా చెప్పుకునే పట్టణవాసులను చూస్తున్న తరాన్ని దాటుకుని మరొక తరం వచ్చేసింది. చిన్నప్పటి ఆ పల్లెలను వదిలి పట్నాలలో మెరుగైన సౌకర్యవంతమైన జీవితాల కోసం వచ్చిన వ్యక్తుల తరం దాటిపోయింది. ఇప్పుడు వారి పిల్లల ప్రపంచం ఏర్పడింది. పల్లెజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ది పేరుతో ఎన్నో కొత్త పోకడలు మనకు ఆ జీవితంలో కలిసిపోయి కనిపిస్తాయి. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఎన్నో మార్పులు మనుష్యులను తేరుకోనివ్వకుండా ఒక్కసారిగా పల్లె జీవితాలను చుట్టూముట్టాయి. నమ్మిన నేల, ప్రకృతి కన్నెర్ర జేసి తమను కనికరించట్లేదని అలిగిన రైతు తాను కూడా నగర వాసిగా జీవించాలని, నీడ పట్టున బ్రతకాలని కలలు కంటూ చివరకు నీడ లేని బ్రతుకుల వైపుకు ప్రయాణించడం కనిపిస్తుంది. పొలం అమ్ముకుని వ్యాపారాలలో దిగే రైతు, మట్టికి, ప్రకృతికి దూరం అవుతున్నాడు. నాగరిక మనిషిని నమ్ముకుంటున్నాడు కాని మనిషికి ముంచడం, నమ్మించి మోసం చేయడం మాత్రమే తెలుసన్న సంగతి మర్చిపోయి మట్టినేల కన్నా మనిషి మేధస్సు గొప్ప అని ఆశపడి చివరకు మనిషి చేతులో హతం అవుతున్నాడు. పల్లెటూరి జీవితాలన్నీ ఈ దారిలో సాగిపోవడం గమనిస్తూనే ఉన్నాం.

ఎంతో వేగంగా జరుతున్న ప్రపంచీకరణ ఎందరి జీవితాలనో చిదిమేస్తుంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమిష్టిగా జీవించడం వల్ల వ్యక్తిగత ధనం కూడట్లేదని, ధనాన్ని అర్జించడమే సమస్త సుఖాలకు మూలం అని నమ్మి, పల్లె వాసులు నమ్ముకున్న భూమిని, వనరులని అమ్ముకుంటున్నారు. ఇదే కాక ఫైనాన్స్ కంపెనీలు, రకరకాల స్కీమ్ లు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. సులువుగా రుణాలు లభిస్తుంటే లాభం పొందుదామని ఉన్నవి తాకట్టు పెట్టుకుని పైకి ఎగబాకాలని ఆర్ధికంగా పుంజుకోవాలని రైతు తన పంధా మార్చుకుంటున్నాడు. వ్యవసాయమే రుణాల తో నిండి ఉన్నప్పుడు, రుణం అలవాటు చేసిన వ్యవస్థ అప్పు పట్ల పాత తరాలలోని దృక్పధాన్ని మార్చి అది చాలా తెలివైన పనిగా ప్రకటిస్తున్నప్పుడు రైతు అప్పు తీసుకోవడానికి సిగ్గుపడట్లేదు. ఒక రెండు తరాల క్రితం అప్పు తప్పు అన్న నానుడు వుండేది. కాని ఇప్పుడు లోన్ అన్నది తెలివైన పని. సర్కారు ఉద్యోగం చేసే వారికి తమ నెల జీతంపై ఇన్కమ్ టాక్స్ కట్టేటప్పుడు అప్పు తీసుకుని ఇల్లు లేదా ఆస్తులు కొంటే అది జీతం లో నెల నెలా కడ్తూ వెళితే కొన్ని ఎక్జెంప్షెన్స్ ఉంటాయని అర్ధమయి అన్నిటినీ లోన్ ద్వారా కొనుక్కునే తెలివైన పని చేయవలసి రావడం మారుతున్న ఆర్ధిక వ్యవస్థకు దర్పణం. వ్యవసాయంలో రుణం లేకుండా పని జరగకపోవడం రైతు జీవితాన్ని అయోమయంలో పడేసింది.

ఇక పల్లెటూరిలో ఫైనాన్స్ కంపెనీలు స్కీమ్లు, సెల్ప్ హెల్ప్ గ్రూపులు, ఆడుతున్న డ్రామా అంతా ఇంతా కాదు. ఎప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు చూడని రైతు కుటుంబాలకు ముందు ఒక పెద్ద మొత్తం కళ్ళ జూసేలా చేసి ఆ తరువాత వడ్డి చక్రవడ్డిలతో వారి జీవితాలను బంధిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశ్నిస్తూ రాసిన నవల ఈ “గబ్బగీమీ”. ఒంగోలు ప్రాంతపు యాసతో ప్రాసతో అక్కడి జీవభాషతో రాయబడిన ఈ నవలలో ఎన్నో ప్రాంతీయ పదాలు కనిపిస్తాయి. “గబ్బగీమి” అంటే కటిక చీకటి అని అర్థం. సూర్యరశ్మి కోసం నిరంతరం శ్రమిస్తూ గబ్బగీమి లో కూరుకుపోతున్న ఎన్నో రైతు కుటుంబాల ప్రస్తుత స్థితి ఈ నవల లో కనిపిస్తుంది. అయితే ఒక స్త్రీ జీవితం నేపద్యంతో ఈ నవల అంతా సాగుతూ, ఆమె జీవితంలోని మార్పుల వెనుక రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలను వెతికే ప్రయత్నం చేస్తాం మనం. నవలలో రచయిత ఒక్క ఒంగోలులోనే 500 ఫైనాన్స్ కంపెనీలు వున్నట్లు రాసుకున్నారు. ఈ విషవలయాలలో కొట్టుకొని ఎన్ని కుటుంబాలు నేల రాలిపోయాయో. గ్రనైట్ కంపెనీలు, రొయ్యల చెరువులు అంటూ రైతు కుటుంబాలలో పురుషులను ఆకర్షించిన ఆ మాయా ప్రప్రంచం, ఇప్పుడిప్పుడే భావ స్వాతంత్ర్యాన్ని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న స్త్రీలను వివిధ స్కీముల పేరుతో ఆకర్షించి ఆ ఊబిలోకి లాక్కుని నాశనం చేస్తుంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కొత్తపట్టణం, సింగరాయకోండ, కొప్పోలు లాంటి పల్లెటూర్లన్నీ ఈ ఆకర్షణల దాడిలో దెబ్బతిన్న జనంతో నిండి ఉన్నాయి. పెరుగుతున్న మద్యం దుకాణాలు, ఊరిచివర నుండి ఊరి మధ్యకు ఇండ్ల మధ్యకు చేరుకున్నాక, యువత దారితప్పిన విధానం కనిపిస్తూనే ఉంది. ఇక ఆడపిల్లల జీవితాలలోని చీకటి మరో కోణం. వీటన్నిటీ ఈ నవల నిజాయితీగా ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

సుబ్బులమ్మ ఒక పెద్ద రైతు కుటుంబంలోని స్త్రీ. పాడి పంటలతో నలుగురు కొడుకులతో దర్జాగా బతికే ఆ కష్టజీవి ఇంటిలోకి ప్రపంచీకరణ దూసుకు వస్తుంది. వ్యవ్యసాయం లాభసాటిగా లేదని ఇంటికి పెద్ద కొడుకు శివరామయ్య వేర్లు పడదాం అంటాడు. ఉద్యోగస్తుడయిన రెండవ కొడుకు సుధాకర్ కూడా పల్లెటూరిలో జీవితం వద్దని పొలాన్ని భాగాలు చేసుకుంటారు. రొయ్యల చెరువుల వ్యాపారంలో దిగి శివరామయ్య ఎన్నో అప్పులు చేసి డబ్బు సంపాదించాలని పెద్ద స్థాయిలో వ్యాపారం మొదలెడతాడు. ఎవర్ని చూసి తాను ఆ పని పట్ల ఆకర్షితుడయ్యాడో వారి నక్కజిత్తుల వ్యవహారం చేతకాక భారీ స్థాయిలో వ్యాపారం మొదలెట్టి తీవ్రంగా నష్టపోతాడు. చివరకు తన భాగం పొలం, ఆస్తి అన్నీ పోగొట్టుకుని బికారి అవుతాడు. రెండవ కొడుకు సుధాకర్ గ్రనైట్ వ్యాపారంలోకి దిగి ఉన్నదంతా అమ్ముకుంటాడు. అప్పులు పిలిచి మరీ ఇచ్చిన ఫైనాన్స్ వ్యాపారస్తులకు డబ్బు కట్టలేక, వారికి భయపడి ఊర్లు పట్టుకుని తిరుగుతుంటాడు.

నాణ్యమైన పొలం అన్నలిద్దరూ తీసుకుంటే మిగిలిన ఇద్దరు తమ్ములు వారి వారి భాగాల్లో వచ్చిన మిగులు భూములలో వ్యవసాయం మొదలెడతారు. అన్న ఆధ్వర్యంలో వ్యవసాయం చేసిన మూడవ కొడుకు మాలకొండయ్య, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేక ప్రతి సంవత్సరం వ్యవసాయంలో నష్టపోతూనే ఉంటాడు. అన్న ఉన్నప్పుడు బండెడు చాకిరీ చేసిన మాలకొండయ్య అండ లేక ఒంటరి అయ్యి పత్తి పంట నష్టం రావడంతో పూర్తిగా అప్పులయి కృంగి పోతాడు. మందుల వ్యవసాయం, నాణ్యత లేని విత్తనాల విక్రయం రైతుకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఎందరో రైతులు అప్పులకు భయపడి ఆత్మహత్యలు చేసుకున్నారు. భార్య కూడా అవమానంగా చూస్తుంటే తట్టుకోలేక మాలకొండయ్య కూడా అదే దారిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. పంటలోని పురుగులను నాశనం చేయలేని ఆ మందులు మనుషుల ప్రాణాలను హరించడంలో మాత్రం విజయం సాధించాయి.

ఇక నాలుగవ కొడుకు నారాయణ మొదటి నుండి మెతకవాడు. ఉమ్మడి కుటుంబంలో అన్నీ సజావుగా జరిగిపోయినా విడిపోయాక ఇక తన కుటుంబాన్ని ఆ విపత్కర పరిస్థితులలో తానే లాక్కురావల్సిన పరిస్థితి. ఇతని భార్యే రంగమ్మ. నవల అంతా రంగమ్మ చూట్టూ నడుస్తుంది. రచయిత రంగమ్మ ద్వారా కథ నడిపిస్తారు. ఒకప్పటి రైతులు కూలీలుగా మారి రోజు కూలి పనికి వెళ్తూ తెచ్చుకునేది సరిపోక రంగమ్మ తన స్నేహితురాలు రమణమ్మ ప్రోద్భలంతో పల్లె వదిలి పట్టణానికి చేరుకుంటుంది. తమతో పాటు ముసలి అత్త బాధ్యత కూడా తీసుకుంటుంది. అయితే పట్టణంలో ని జీవితం పైకి కనిపించేటంత ఆకర్షణీయంగా ఉండదని చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది. ముందు పాల వ్యాపారం మొదలెట్టి భర్త కు తోపుడు బండి కోసం మొదటి సారి వడ్డీ వ్యాపారస్తుని దగ్గర నోటు రాసి అప్పు తీసుకుంటుంది. భార్యభర్తలిద్దరూ కష్టపడుతూ ఉంటారు. రమణమ్మ చేసే చిట్టీల వ్యాపారం గమనించి తానూ ఆ పని మొదలెడుతుంది రంగమ్మ. అయితే డబ్బు రొటేషన్ కొన్ని సార్లు ఇబ్బంది అయి అప్పులు తీసుకుంటూ ఉండవల్సిన పరిస్థితి ఆమెది. భర్త ఆరోగ్యం బాగోలేనప్పుడు డబ్బులు ఇవ్వవలసిన వారికి ఇవ్వలేక ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చాలదన్నట్లు సిటీలో అద్దెలు తప్పించుకోవడానికి అప్పు చేసి మరీ ఇల్లు కొంటుంది. ఆ ఇంటి లోన్ కోసం బాంక్ పనులకు సాయం చేస్తానని చెప్పిన వడ్డీ వ్యాపరి రంగమ్మను లోబర్చుకుంటాడు. ఒక సారి నారాయణ కంట ఈ సంబంధం బైటపడినప్పుడు తట్టుకోలేక అతను ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. పల్లెటురిలో ఆస్తి హరించుకు పోయి బ్యాంక్ వాళ్ళు కొన్న ఇల్లు జప్తు చేస్తె చివరకు రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని మళ్ళీ చిన్న చిన్న అప్పులు చేస్తూ డబ్బు రొటేషన్ చేస్తూ జీవితం గడుపుతుంటుంది రంగమ్మ.

రంగమ్మ కొడుకు రాంకోటయ్య చదువు అబ్బక లారీ మీద పనికి వెళ్ళి చెడు తిరుగుళ్ళతో ఎయుడ్స్ బారిన పడతాడు. అతనికి ఆఖరి ఘడియల్లో సేవ చేసే ఓపిక, తీరిక రెండూ లేక రంగమ్మ అతన్ని హోమ్ లో చేర్పిస్తుంది. ఆమె కూతుర్లిద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పని చేసే దగ్గర పెద్ద అమ్మాయి శారీరికంగా ఎక్స్‌ప్లాయిట్ అవుతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి రంగమ్మది. చిన్న పిల్ల ప్రేమించానన్న వాడితో వెళ్ళిపోయి చివరకు నిరాశగా మళ్ళీ తల్లిని చేరుతుంది. ఈ పరిస్థితుల మధ్య రంగమ్మ అత్త సుబ్బులమ్మ చనిపోవడం, నలుగురు కొడుకుల్ని కన్నా తల కోరివి పెట్టడానికి ఎవరూ లేక ఆమెను తోపుడు బండిలో తీసుకువెళ్ళి దహనం చేయవలసి రావడం తో నవల ముగుస్తుంది. ఒక పెద్ద రైతు భార్యగా పుష్కలమైన పాడి పంటలతో జీవితాన్ని గడిపి, పెద్ద సంసార భారాన్ని మోసిన ఒక పెద్ద రైతు భార్య సుబ్బులమ్మ జీవితం అలా ఆఖరవ్వడం చూపిస్తూ ఆ పాత్ర ద్వారా భారత రైతు ఈ వ్యవస్థ లో పడుతున్న ఘోష ను రచయిత చర్చిస్తారు. సుబ్బులమ్మ గతానికి ప్రతీక… రంగమ్మ నేటి తరానికి అలాగే ఆమె పిల్లలు సుధారాణీ, సుజాతలు భవిష్యత్తరానికి ప్రతినిధులు. మారుతున్న పరిస్థితులు ఈ మూడు తరాల జీవితాలను చిధ్రం చెసిన వైనం లో కేవలం కుటుంబపరమైన కారణాలే కాదు ఎన్నో సామాజిక కారణాలు ఉన్నాయి. మారిన ఆర్థిక వ్యవస్థ, మానవ విలువలను ఎంతగా దిగజార్చిందో ఈ కథలో కనిపిస్తుంది. డబ్బు ఆడుతున్న నాటకంలో విలువల పతనం మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటి నేపథ్యంలో స్త్రీలు అనుభవిస్తున్న సామాజిక హింసను చిత్రిస్తారు రచయిత.

ఈ నవల పూర్తి ప్రకాశం జిల్లా మాండలికంలో రాసారు మంచికంటి గారు. ఆ ప్రాంతపు పదాలు, సామెతలు కనిపిస్తాయి. అప్పా, అన్నాయ్మ్ రమణాయ్ లాంటి సంబోధనలు చూడవచ్చు. ఏరువాక పండగ, సింగరాయకొండ జాతర వర్ణనలు ఆ ప్రాంతపు సంస్కృతిని పరిచయం చేస్తాయ్. నీలి మందు తయారీ ఒకప్పుడూ బ్రీటీష్ పాలకుల కాలంలో ఆ ప్రాంతాలలో జరిగేది. వారప్పుడు తవ్వించిన ఉప్పు బావులు ఇప్పుడూ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. జీవితంలోని కష్టాలనుంచి తప్పించుకోవడానికి ఆ బావిని ఆత్మహత్యల కోసం ఎందరో వాడుకుంటూనే ఉన్నారు. ఆ బావుల ప్రస్తావన వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. ఆడపిల్ల పెద్దమనిషి అయినప్పుడు సమిష్టి కుటుంబాలలో చేసే వేడుక, పండుగ వెనుక కారణాలు ఎన్నో. అయితే పట్నం వలస వెళ్ళిన కుటుంబాలలో చిన్న ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు ఆ సమయంలో కూడా కావల్సిన విశ్రాంతి దొరకకుండా పరుగులెత్తుతూ జీవించవలసిన అవసరం, స్త్రీ శరీరం పట్ల నగర జీవితంలో ఉన్న నిర్లక్ష్యాన్ని చూపుతుంది. చాలా వస్తువులు పల్లెటూరిలో చవకగా, సులువుగా దొరికితే, ప్రతి దానికి డబ్బు పెట్టి కొనుక్కుని ఖర్చులు పెంచుకోవలసిన అగత్యం అనుభవిస్తున్న రైతు కుటుంబాలలోని ఇబ్బందిని కూడా రచయిత చాలా సున్నితంగా ప్రస్తావిస్తారు. ఎన్నో విషయాల పట్ల సమాచారాన్ని అందిస్తూనే ఒక కుటుంబలో స్త్రీలపై జరుగుతున్న హింస ను కథావస్తువుగా తీసుకుని దాని వెనుక సామాజిక కారణాలను ప్రపంచీకరణ నేపథ్యంలో రచయిత చర్చించే ప్రయత్నం చేసారు. అందుకే ఎన్నో గంభీరమైన విషయాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అనుభవం ఇచ్చే నవల ఇది.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply