ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ గద్దర్‌

గద్దర్‌. కవి. కళాకారుడు. జననాట్య మండలి నాయకుడు. విప్లవకారుడు. ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ. అతని పాట ఓ ‘తరగని గని’. రగల్‌జెండా రాగాలాపన. గుండె గుండెనూ మీటిన నిప్పుల పాట. ఇప్పవనాల్లో నెత్తుటి పూలై వికసించిన పాట. వెన్నెల రాత్రుల్లో హోరెత్తే రేలా పాట. అతని మాటయుద్ధభూమిలో నినదించే విప్లవ గీతిక. అతని కవిత్వంనెత్తుటి నరాల్లో సంద్రాలై పోటెత్తే రక్తచలన సంగీతం. అడవుల్నీ మైదానాల్నీ రగిలించిన సంగీతం. అతని కల దోపిడీ, పీడనల్లేని సమాజం. వివక్ష, వెలివేతల్లేని సమాజం. అంతరాల్లేని సమసమాజం. విప్లవోద్యమం అతని కలలకు తొవ్వజూపింది. అది నక్సల్బరీ తొవ్వ. శ్రీకాకుళం గిరిజన వీరులు చిందిన నెత్తుటి తొవ్వ. అది భూస్వామ్యాన్ని కూల్చిన విముక్తి బాట. అట్లాంటి దారుల్లో సాగిపోయాడు గద్దర్‌. ‘నీ దారి నా దారి`పోరు దారేరో’ దచ్చన దారిలో అంటూ. పుట్లకొద్ది పంటదీసి పూటకు సచ్చే జనం కోసం. పాటను ఎత్తుకున్నాడు. రైతన్నల భుజాన నాగలిలా. కూలితల్లుల ఒడిలో రాలిన చెమట సుక్కల్లా. వాళ్ల బతుకుల్ని రక్తరాగ రంజితం చేశాడు. అతడు అణగారిన బతుకుల్లోంచి ఎగసిన ‘దళిత పులుల’ పాట. కూలినాలన్నల బతుకు పాట. దండకారణ్యం కొండల్లో కొలిమిని రాజేసిన పాట. కొండల నుండి కోనల నుండి ఎగసిన పాట. వానై. వరదై. నదై. ఉప్పొంగే సంద్రమై. హోరెత్తిన పాట. మనిషి మనిషినీ అల్లుకున్న కవిత. నిలువెల్లా అలముకున్న కవిత.

గద్దర్‌ కవిత్వ పరిచయమిది. విశ్లేషణ కాదు. పాటలై పోటెత్తే ఊపిరిలోంచి అల్లుకున్న పదాలివి. అలముకున్న వాక్యాలివి. గుండె నెత్తురులు తర్పణచేస్తూ, వీరులు నడిచిన తొవ్వల్లో రాలిన కన్నీళ్లివి. ఏ ఊరంచు వెలివాడలోనో పుట్టి, ఏ దిక్కూలేని జనం కోసం సాగిపోయిన పాదముద్రలివి.

గద్దర్‌లో ప్రత్యామ్నాయ ఆలోచన ధార 1966లో ‘ఆర్ట్‌ లవర్స్‌’ పరిచయంతో మొదలైంది. అక్కడే మార్పుకోసం సాగే దారి పరిచయమైంది. 1972 జులైలో ‘జననాట్య మండలి’ ఏర్పడిరది. ఆ సంస్థ శిక్షణ తరగతులతో అతనికి శ్రామికవర్గ దృక్పథం అలవడిరది. దాన్ని విస్తృతం చేసింది. అది కొత్తచూపు. నక్సల్బరీ వెలుగు. శ్రీకాకుళం గిరిజనం పోరాట బావుటా. అది రక్తసిక్త దారుల్లో ఎగసిన అరుణపతాక. అట్లా ప్రజల పాటను రగల్‌జెండాలా ఎగరేశాడు. శ్రీకాకుళంలో వెనుకంజ వేసిన విప్లవోద్యమం ఫీనిక్స్‌లా ఎగసింది. అది రెక్కవిప్పిన రివల్యూషన్‌. ఉత్తర తెలంగాణను అంటుకున్న కొలిమి రవ్వల జడి. అది సిరిసిల్లా జగిత్యాలల్ని అంటుకున్నది. ‘జగిత్యాల జైత్రయాత్ర’ను కన్నది. ఇంద్రవెల్లి పోరాటాన్ని నిర్మించింది. అడవుల్నీ మైదానాల్నీ ఏకంచేసింది. విప్లవోద్యమ ప్రభంజనం గద్దర్‌ పాటను మరింత పదునెక్కించింది. లక్షలాది ప్రజానీకాన్ని పోరాటాల్లోకి నడిపించింది.

1980 ఏప్రిల్‌ 20 ఇంద్రవెల్లిలో పోలీసులు ఆదివాసీలపై కాల్పులు జరిపారు. వందమందికి పైగా చనియారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ కాల్పుల నేపథ్యంలో ‘జననాట్య మండలి’ ‘రగల్‌ జెండా బ్యాలే’ రూపొందించింది. దీంతో ఈ మారణకాండ గురించి దేశమంతా తెలిసింది. అదే ఏడాది విప్లవోద్యమం దండకారణ్యానికి విస్తరించింది. దీంతో ‘జననాట్య మండలి’ కళాకారులు ఆదివాసీల వద్దకు చేరారు. వాళ్ల భాష నేర్చుకున్నారు. ఆదివాసీ కళారూపాలను, బాణీలను అధ్యయనం చేశారు. అడవి బిడ్డల జీవితాన్ని పాటలల్లారు.

ఎన్టీఆర్‌ పాలనలో 1985లో విప్లవోద్యమంపై తీవ్ర నిర్బంధం అమలైంది. ‘ఆట-పాట-మాట బంద్‌’ అని ప్రకటించాడు. అది 1989 దాకా కొనసాగింది. జననాట్య మండలి ప్రధాన నాయకుడు గద్దర్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. జననాట్య మండలి కూడా అజ్ఞాతమైంది. కానీ, పాట ఆగలేదు. ఆట ఆగలేదు. మాట ఆగలేదు. అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. దేశవ్యాప్తంగా విప్లవ ప్రజానీకాన్ని పోరాటాల్లోకి నడిపించింది.

తనను తీర్చిదిద్దిన విప్లవోద్యమం గురించి గద్దర్‌… ‘‘నేను విప్లవ సాంస్కృతిక సంస్థ (జ.నా.మం.)లో సభ్యునిగా చేరిన తర్వాత నా జీవితాన్ని నేనే అల్లుకోవడం మొదలుపెట్టాను. ఉత్తుత్తిగా చిత్రీకరించడం కాదు, వాస్తవంగా చిత్రీకరించడం. జీవితాన్ని చిత్రీకరించి ఊరుకోవడమే కాదు, దాని మార్పు కోరడం. ఉట్టి మార్పు కోరడమే కాదు, ఆ మార్పుకు మార్గాన్ని ఎన్నుకోవడం. ఉట్టి మార్గాన్ని ఎన్నుకోవడమే కాదు, ఆ మార్గంలో మెల్లమెల్లగా తాబేలులా పయనించడం మొదలుపెట్టాను. ఇది నాలో విప్లవ సంస్థ తెచ్చిన మార్పు’’ అని రాసుకున్నాడు. (తరగని గని; గద్దర్‌, 1992, పు.276)

గద్దర్‌ విప్లవోద్యమంలో చేరాకనే తనలో మార్పు మొదలైంది. దేన్ని ఎట్లా చూడాలో తెలిసింది. ఏ వెలుగులో పరిశీలించాలో అర్థమైంది. ఆ నిశితమైన పరిశీలన, దృక్పథం కలిసి ఆటైంది. మాటైంది. పాటైంది. కవిత్వమైంది. పాటల వెనుక కతలు రాసింది. ఎతలు రాసింది. గద్దర్‌ను ప్రపంచవ్యాప్తంగా గొప్ప కవిగా నిలబెట్టింది. తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పింది. పాటే అసలైన కవిత్వమని చాటింది.

అతడు జీవితాన్ని చూశాడు. తనచుట్టూ ఉన్న జనం జీవితాన్ని. నిశితమైన చూపది. దారిచూపిన చూపది. ‘‘జీవితాన్ని చూడటం వేరు, జీవితాన్ని అనుభవించడం వేరు. ఈ అనుభవాన్ని పాటగా అల్లడం వేరు. ఆ అల్లిన పాట తిరిగి ఆచరణలోకి తీసుకుపోవడం వేరు. ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పాటలు విన్నాను. చరిత్రలో మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ ఆ పనిచేసింది. ‘దున్నేవారికే భూమి’ అనే నినాదం కింద దళితులను ఏకంచేసింది. కానీ, ఆ పార్టీ రివిజనిస్టు పార్టీగా మారడంతో దళితులకు తీరని నష్టం జరిగింది. మళ్లీ నక్సల్బరీ పుట్టింది. ఈ ఉద్యమం పల్లెల్లోని దళితుల గుడిసెలలోకి పాకింది. విడిపోయిన దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు ఈ పార్టీ నాయకత్వం కింద ఒకటవ్వడం మొదలుపెట్టారు. ఈ పోరాటాల వల్ల మళ్లీ దళితులు మనుషులుగా గుర్తింపబడసాగారు. ఈ సత్యం నేను గుర్తించసాగాను. ఇక విప్లవకారులతో కలిసి జీవించడం మొదలుపెట్టాను. శ్రమజీవుల విముక్తికై బాస చేసినాను. నేను విప్లవ సాంస్కృతిక సంస్థలో సభ్యునిగా చేరాను’’ అని స్పష్టంచేశాడు. (అదే)

ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నక్సలైట్లపై నిషేధం ఎత్తివేశాడు. 1990 ఫిబ్రవరి 18న గద్దర్‌ అజ్ఞాతం నుంచి బయటికి వచ్చాడు. జననాట్య మండలి ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో 20న భారీ బహిరంగ సభ జరిగింది. మూడు లక్షల మందికి పైగా పాల్గొన్నారు. రాత్రంతా తన పాట, మాట, ఆటలతో గద్దర్‌ ప్రజల్లో ఉత్తేజం నింపాడు. ఆనాటి జనసంద్రం గురించి ఎన్‌. వేణుగోపాల్‌… ‘‘ఆయన గొంతు విప్పితే లక్షల హృదయాలు ఆ గళలయలో స్పందన పొందాయి. ఆయన వేదిక మీదికి వచ్చి ఒక్కసారి గాలిలో చెయ్యెత్తి అటు కొస నుంచి ఇటు కొసకు నడుస్తుంటే మైదానమంతా తొలకరి ఉప్పొంగిన నేలలా లేచి నిలిచి పిలిచింది. ఆయన పాట, ఆయన ఆలాపన, ఆయన నృత్యం, ఆయన మాట- అయిదు సంవత్సరాల నిర్బంధం తర్వాత బహిరంగ ప్రజావేదిక మీది నుంచి మూడు లక్షల జనాన్ని ఉర్రూతలూగించాయి’’ అంటూ ‘జనగానం జయజయ ధ్వానం’ గురించి రాశాడు. (కడలి తరగ; 2000, పు.93)

అదే ఏడాది మే 5, 6 తేదీల్లో వరంగల్లో రైతుకూలీ సంఘం మూడో రాష్ట్ర మహాసభ జరిగింది. పన్నెండు లక్షలమంది పాల్గొన్న సభ అది. అదొక చరిత్ర. ఉజ్వల చరిత్ర. ప్రజలు నిర్మించిన పోరాటాల చరిత్ర.

గద్దర్‌ అజ్ఞాతంలో ఉన్నపుడు పాటలతో పాటు కవిత్వమూ రాశాడు. అజ్ఞాతం నుంచి బయటికి వచ్చాక 1992 మార్చ్‌ లో ‘గద్దర్‌ కవితలు’ పేరుతో ఓ కవితా సంకలనం ప్రచురించాడు. అది ‘జననాట్య మండలి’ ప్రచురణ. ఇందులో 25 కవితలున్నాయి. వాటిలో నాలుగు స్మృతి కవితలు. పది ‘గెరిల్లా లేఖలు’ ఉన్నాయి.
‘‘అజ్ఞాత జీవితంలో
దూరంగ బతికే రోజుల్లో
గుండె గాయపడినప్పుడు
ఆ గాయాల గుర్తులను పాటలుగ మలచలేక
కవితలుగా అల్లిన మాటలివి
అటు పాటలు కాక
ఇటు కవితలు కాని
వీటిని ఏర్చి, పేర్చి
చదువుకోగలరనిజి
ప్రార్థన…’’ అని రాసుకున్నాడు.
1986 డిసెంబర్‌లో గద్దర్‌ ఇంటిపై పోలీసులు దాడిచేశారు. జననాట్య మండలి ప్రదర్శనల్లో వాడే గజ్జెలు, డప్పులు, పుస్తకాలు, కట్టె తుపాకులు ఎత్తుకుపోయారు. దాచుకున్న నోట్సు. డైరీలు. సగం రాసి ఆపేసిన పాటలు. కొన్ని ఆలోచనలు. ఆగ్రహాలు. పోటెత్తే పాటలు. మౌనంగా వేలాడే డప్పులు. పేలడానికి సిద్ధంగా ఉన్న తూటాల్లాంటి పాటల ప్రతులు. ఒక్కటేమిటి. సమస్త పాటల సరంజామానూ ఎత్తుకెళ్లారు. ఇంట్లో ముగ్గురు పసికూనలతో విమల ఒక్కతే ఉన్నది. పిల్లల్ని తన ఒడిలో దాచుకొని. తుఫాన్‌ లో చిక్కిన పక్షిలా అయింది. పత్రికల్లో ఈ వార్త చదివి గద్దర్‌ ‘అంతా నిశ్శబ్దం’ అనే కవిత రాశాడు. వెంకటాపురంలోని తన ఇంటి పరిస్థితిని దృశ్యమానం చేశాడు.
‘‘నవ్వులు లేవు
వంటపాత్రల కింద
పెనుమంటలు లేవు
పోరు గీతాలతో
ఊరినంతా ఊపేసే రేకుల ఇల్లు
రెక్కలు ముడుచుకున్న
పక్షిలా ఉంది…’’ (గద్దర్‌ కవితలు; 1992, పు.2)
పోలీసుల దాడితో అక్కడంతా స్మశాన నిశ్శబ్దం నెలకొన్నది. ఆ రేకుల ఇల్లు విలపించే ఒంటరి తల్లిలా మారింది. అక్కడి జనం గుండెల్లో దిగులు. ఈ పరిస్థితి ఎల్లకాలమూ ఉండదని తనకు తెలుసు. విమలకు తన అక్షరాలతో ధైర్యం చెప్పాడు. విప్లవ ఆశావహ దృక్పథాన్ని చిత్రించిన కవిత ఇది.
‘‘ఈ భయంకర నిశ్శబ్దం
ఉండదు కలకాలం
మబ్బుల వెనక సూర్యుడు
నివురుగప్పిన నిప్పు
నిద్రపోతున్న సముద్రం
కాలం కలిసివస్తే
కోటి తరంగాలై లేస్తాయి…’’ (అదే)
అంటూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విప్లవాన్ని చెప్పాడు. తనెక్కడో అజ్ఞాతంలో. అడవుల్లో. కొండల్లో. కోనల్లో. పాటను సాయుధం చేస్తూ అతడు. ముగ్గురు పసికూనలతో దిక్కుతోచని స్థితిలో విమల. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు అతని అక్షరాలు ఆలంబన అయ్యాయి. ధైర్యాన్నిచ్చాయి. కాలాన్ని ఎదురీదే సాహసాన్ని నేర్పాయి.

గద్దర్‌ అడవుల్లో ఉన్నపుడు చింతపల్లిలో గిరిజన యోధురాలు జ్యోతిని పోలీసులు కాల్చిచంపారు. ఆమె వస్తువుల్ని జప్తుచేసుకున్నారు. జ్యోతి జ్ఞాపకాల్లో రాసుకున్న కవిత ఇది. పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో చెప్పిన కవిత ఇది.
‘‘నీతిలేని శత్రువు
నీ మర్మాంగాన్ని పరీక్షించాడు
పొత్తి కడుపును ఒత్తిచూశాడు
ఎందుకో తెలుసా?
నీ పొత్తిళ్లలో
విప్లవ శిశువు మొలుస్తాడేమోనని’’ (అదే; పు.3)
యుద్ధనీతి లేని రాజ్యమిది. శత్రువు నిరాయుధంగా దొరికినపుడు ఏ హానీ చేయొద్దనే ఇంగిత జ్ఞానం కూడా లేని పోలీసులు. జ్యోతి బట్టల్నీ విప్పేశారు. ఆ సంఘటనను చెప్తూ…
‘‘నీ నెత్తురులో తడిసిన
రవికనూ చీరనూ
శత్రువు జప్తు చేసుకున్నాడు
ఎందుకో తెలుసా?
నీ అన్నలు ఆ గుడ్డలను
ఎర్రజెండాలుగా ఎగరేస్తారని’’

అన్నల నెత్తురుతో అలికిన 
యుద్ధభూమికి ఎర్రముగ్గువు’’  (అదే)

అంటూ గెరిల్లా జ్యోతి వీరత్వాన్ని చిత్రించాడు గద్దర్‌. అడవుల్నీ మైదానాల్నీ మండిన జ్యోతి వీరత్వ జ్ఞాపకమిది. తర్వాత కాలంలో గద్దర్‌ అనేక వీరగాథలు రాశాడు. అమరవీరుల గురించి రాసుకున్న కవిత ‘మీరు అమర జీవులు’. గద్దరే చెప్పినట్టు… వాళ్లు ఉట్టి పాటలే కాదు. తుపాకీ తూటాలు. గెరిల్లా గన్నులు. ఆలోచనల ఆచరణల నెత్తుటి గుర్తులు.
‘‘అమరులూ అమరవీరులూ
నేను మీలా బతకలేకపోయినా
మీ జ్ఞాపకాల గుర్తునై
మీ స్వప్నాల పాటనై
మీ బాటను చూపే బోర్డునై
మీ కాళ్ల దుమ్మునై
బతకగలిగితే
నా పాటకు అర్థం ఉంది
నా బతుకుకు ధన్యత ఉంది…’’ (అదే; పు.7)
అట్లా గద్దర్‌ ఉద్యమాన్నీ, జీవితాన్నీ ఒక్కటిగా చేసుకున్నాడు. ప్రజల్ని తన పాటలతో సాయుధం చేశాడు. విప్లవోద్యమ వెల్లువలో రక్తచలన సంగీతాన్ని సృష్టించాడు. గద్దర్‌ అజ్ఞాత జీవితంలో ఉన్నపుడు అమ్మ గుర్తుకు వచ్చింది. సిరిమల్లె సెట్టుకింద సినబోయి కూసున్న లచ్చుమమ్మ మదిలో మెదిలింది. ఆమె మాటలు గుర్తుకువచ్చాయి. ఆమె తలపుల్లో రేపటి ఉషోదయాన్నిచూశాడు.
‘‘ఓడిపోతె ఏడ్వద్దు
దస్కు తినొద్దు
అది రండబతుకు
గుండెకాయ రాయి చేసుకోవాలె
రణరంగంల దూకాలె
నేను సెప్పినంత సెప్పిన
ఇగ నీ ఇష్టం నీ రాజీ
నీ మన్‌ మానె చెయ్యి
నీ బుద్ధి నీ గ్యానం
మాది ఎనుకటి బతుకు
ఎడ్డి బతుకు
మా కాలం అయిపోయింది
రేపటి కాలం మీదే…’’ (అదే; పు.9)
అంటూ చిన్ననాడు అమ్మ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నాడు. అందుకే యుద్ధరంగంలో నిలబడ్డాడు. సాంస్కృతిక సైనికుడై. తన తల్లుల్లాంటి కోట్లాది తల్లుల కష్టాలను దూరం చేసేందుకు, పాటను సాయుధం చేసి సాగిపోయాడు. అడవుల్లోకి. గిరిజనంలోకి. పల్లెల్లోకి. వాడల్లోకి. వెలివాడల్లోకి.

లోకమంతా చీకటే. ఎక్కడ చూసినా దోపిడీ. పీడన. వివక్ష, అణచివేత. ఎదురుతిరిగితే కేసులు. జైళ్లు. ప్రశ్నై తిరగబడితే బూటకపు ఎన్కౌంటర్లు. అట్లని విప్లకారులు మౌనంగా ఉంటరా? లేదు. అందుకే కాళ్లకూ చేతులకూ సంకెళ్లేసినా పాటను ఆపనన్నాడు. పల్లెల్లో తిరిగేటపుడు తన బిడ్డల్లాంటి పసివాళ్లను చూశాడు. వాళ్ల కష్టం చూశాక తన బిడ్డలు గుర్తొచ్చారు. ‘‘పేరున్న కవి బిడ్డలని మిమ్మల్ని ఎవరైనా మంచిగ చూసుకుంటరు. ఇక్కడ వీళ్ల పరిస్థితి చూడండి’’ అని తన బిడ్డలు సూర్యుడూ, చంద్రుడూ, వెన్నెలకు చెప్తున్నాడు.
‘‘పల్లెల్లో మీ తమ్ములు
పసుల వెనుక పరుగులు తీస్తున్నరు
కచ్చికాయలు పచ్చికాయలు తిని
కడుపు నింపుకుంటున్నరు
కాళ్లకు చెప్పులు లేవు
కడుపుల మెతుకులు లేవు
ఒంటినిండ గుడ్డలేదు
గుడిసెమీద గడ్డిలేదు’’ (అదే; పు.13)
అంటూ పల్లెల్లో పేదల బతుకుల్ని చిత్రించాడు. రాజ్యహింసల్లో ధ్వంసమైపోతున్న తెలంగాణ పల్లెల్ని దృశ్యమానం చేశాడు. కూలిన గోడలు. పోలీసులు కూల్చేసిన ఇళ్లు. కాలబెట్టిన గుడిసెలు. ధ్వంసం చేసిన పంటలు. చెరబడ్డ చెల్లెళ్లు. చెరచబడ్డ అక్కలు. గాయపడిన తల్లులు. పోలీసుల జులుంచూసి చెల్లాచెదురవుతున్న పక్షులు. జంతువులు. మూగజీవాలు. చిత్రహింసల కొలిమిలో నెత్తురోడుతున్న పల్లెలు. ఈ పల్లెల్ని కళ్లముందుంచాడు. ఇదంతా వెచ్చటి నెత్తురు పారుతున్న దృశ్యం. కూటికిలేని కూలిజనం బతుకు చిత్రం. ఇద్దరు పసులగాసే పోరగాళ్ల మధ్య సంభాషణను కవిత్వంగా మలిచాడు. వాళ్లిద్దరి మాటల్లో పాట రూపుదిద్దుకుంది. అది జనం పాట. రణం పాట. గుండెల్ని రగల్‌ జెండాలా ఎగరేసే పాట. రాడికల్‌ రణన్నినాదాల పాట. పల్లె పల్లెనూ కదిలించే పాట. గుండె గుండెనూ రగిలించే పాట. నెత్తుటి నరాల్లో ఉవ్వెత్తున ఎగసే సంద్రాలయ్యే పాట. అది దోపిడీని కూల్చేపాట. విముక్తి పాట. అది రక్తచలన సంగీతమై పోటెత్తే పాట. అట్లాంటి పాట పాడ్తానన్నాడు గద్దర్‌. అదే పాట పాడాడు. అదే బాట నడిచాడు. ఏటికి ఎదురీదాడు. దండకారణ్య కొండల్లో ప్రతిధ్వనించే రేరేలా పాటయ్యాడు. తుడుం మోతల్లో యుద్ధగానమయ్యాడు. జనం గుండె చప్పుళ్లతో జననాట్య మండలి గర్జనల్ని వినిపించాడు. పసులగాసే ఇద్దరు పిల్లల మధ్య సంభాషణే ఈ కవిత.
‘‘తెల్లారి
పసుల వెనుక
పరుగుతీస్తున్న పోరగాణ్ని
‘అరే మీ గుడిసెందుకు కాలబెట్టిండ్రు?’
అనడిగిండు సోపతిగాడు
‘‘మా అయ్య సంఘంలో చేరినందుకు’’
‘‘సంఘంలో ఏం చేస్తుండె?’’
పాట పాడ్తుండె
ఏం పాట?
భూమి మనది భుక్తి మనది
దున్నెటోనిదే భూమి
నడుమ దొర ఏందిరో
‘‘పెత్తనమేందిరో’’
‘‘మరి నువ్వేం చేస్తవ్‌ రా?’’
‘‘నేనదే పాట పాడ్త
మా తమ్మునికదే నేర్పిస్తా
మా సెల్లె కూడా…’’ (అదే; పు. 15)
అంటూ యుద్ధగీతం రాశాడు. ప్రజాయుద్ధంలో అలుపెరగక సాగుతున్న అశేష పీడిత ప్రజానీకాన్ని చిత్రించాడు గద్దర్‌.

భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ వల్ల వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది వ్యాధులపాలయ్యారు. పేగుబంధం తెగి తల్లడిల్లే తల్లులు. తల్లుల్ని కోల్పోయిన బిడ్డలు. తల్లి ప్రేమను వెతుక్కొనే పిల్లలు. శ్మశానంలా మారిన భూమి. విలపించే భూమి. ఆ విషాధాన్ని కవితగా అల్లాడు. ఈ మారణకాండ సందర్భంగా గద్దర్‌ రాసిన కవిత ‘భోపాల్‌’. ఆనాటి అమెరికా అధ్యక్షుడు రీగన్‌, భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ మధ్య చీకటి ఒప్పందం గురించి రాశాడు.
‘‘రాజీవ్‌ రీగన్‌ ల
నెత్తుటి ఒప్పందాన్ని
చిత్తుచెయ్యమని
బస్తరు అడవుల నుంచి
అమరజీవి గణపతన్న
చిలకమ్మతో చీటీ పంపిండు…’’ (గద్దర్‌ కవితలు; 1992, పు.51)
అని రాశాడు. ఎవరీ గణపతి? బస్తర్‌ అడవుల్లో బూటకపు ఎదురు కాల్పుల్లో అమరుడైన మొదటి గెరిల్లా యోధుడు. వరంగల్‌ బిడ్డ. 1985 మార్చ్‌ 5న కామ్రేడ్‌ గణపతిని మధ్యప్రదేశ్‌ పోలీసులు కాల్చి చంపారు. ఈ బూటకపు ఎన్‌ కౌంటర్‌ హత్య గురించి సృజన పత్రిక ‘‘గడ్చిరోలి జిల్లా నారాయణపూర్‌ తహసీల్‌లో తాల్‌బేడీ గ్రామానికి సమీపంలోనే ఉన్న మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ హత్య జరిగింది. కామ్రేడ్‌ గణపతి వరంగల్‌ పరిసరాల్లోని సోమిడి గ్రామస్తుడు. రాడికల్‌ యువజన సంఘంలో చేరి క్రమంగా అడవి ఉద్యమంలోకి వెళ్లి దళ నాయకుడై కామ్రేడ్‌ బాలన్నగా ఆదివాసుల ప్రేమను చూరగొన్నాడు’’ అని రిపోర్ట్‌ రాసింది. (సృజన; ఏప్రిల్‌ 1985, పు.96)
‘‘ఓ అనాథలైన
చిన్నారి తమ్ముల్లార
చెల్లెల్లార
బస్తర్‌ అడవిలోకి రండి
దండకారణ్యం దండులో చేరండి

మీ అన్నలం ఉన్నాం
అడవి తల్లి ఉంది
బద్‌ లా తీసుకునేందుకు
బందూకు ఉంది 
అంటూ గణపతన్న రక్తాక్షరాలు...’’        (గద్దర్‌ కవితలు; 1992, పు.51)

అంటూ పిలుపునిచ్చాడు. పాలకవర్గ దోపిడీని అంతం చేయాలంటే సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని చెప్పిన కవిత ఇది. ఈ పుస్తకంలో 15 గెరిల్లా లేఖలున్నాయి. వాటి నేపథ్యాన్ని చెప్తూ… ‘‘నేను దళంలో ఉన్న రోజుల్లో విన్న, పరిశీలించిన, అధ్యయనం చేసిన గెరిల్లా మనస్తత్వాలను ఈ లేఖల రూపంలో రికార్డ్‌ చేయాలనుకున్నాను. ఇది పాటో, కవితో రాసే ప్రయత్నం కాదు’’ అని రాశాడు. (గద్దర్‌ కవితలు; గద్దర్‌, 1992, పు.40)

1.
‘‘నాకు
ప్రేమలేఖలు లేవు
ఉన్నా
అవి ఎవరికీ అర్థం కావు
శత్రువుకు అంతకన్న అంతుచిక్కవు
‘‘కామ్రేడ్‌...  
అదే చోట
అదే సమయం
అక్కడే కలుసుకుందాం
మనసారా మాట్లాడుకుందాం
మిస్‌ కావద్దు...’’
    - మీ గెరిల్లా.

2.
నాకు 
నిద్రలేదు 
ప్రపంచం నిద్రలో ఉంటే
నేను మేల్కొని ఉంటా
ప్రపంచం పడుకొని ఉంటే
నేను పయనిస్తూ ఉంటా
నాకు నిద్రనేదే ఉంటే
అది సెంట్రీ మేల్కొని ఉన్నప్పుడో
లేదా 
యుద్ధంలో ఒరిగిపోయినప్పుడో...’’
           - మీ గెరిల్లా.

అడవుల్లోంచి మైదానాల్లోకి ప్రవహించిన అక్షరాలివి. యుద్ధభూమి నుంచి పంపిన సందేశమిది. సాయుధ సందేశమిది. మైదాన ప్రాంత గుండెలతో చేసిన అక్షరచాలనమిది. గద్దర్‌ చెమట చిత్తడి జీవితాల మనుషుల్ని ప్రేమించాడు. వాళ్ల రెక్కల్లో బొక్కల్లో మెసిలాడు. శ్రమజీవుల భాషను దోసిళ్లకెత్తుకున్నాడు. వాటిని సాయుధం చేశాడు. మాటలుగా. పాటలుగా. కవిత్వంగా. రక్తచలన సంగీతాన్ని సృష్టించాడు. హోరుహోరుగా. హొయలు హొయలుగా. అడవుల్నీ మైదానాల్నీ సంఘటితం చేశాడు గద్దర్‌. తిరగబడ్డ పాటై. మర్లబడ్డ మాటై. జననాట్య మండలై. జనం గుండెల చప్పుడై.
‘‘ప్రజల్ని కదిలించు
వాళ్లు కవిత్వం చెపుతారు
మాటల్ని కూర్చి
పాటగా వేయిస్తారు
అడుగుల్ని పేర్చి
ఆటగా మారుస్తారు
అరుపులు అరిచి
మెరుపుల్ని కురిపిస్తారు…’’ (గద్దర్‌ కవితలు; గద్దర్‌, 1992, పు.52)
అట్లా గద్దర్‌ జనంలోకి వెళ్లాడు. వాళ్ల చెమటా నెత్తురింకిన నేలల్లోకి నడిచాడు. ప్రజలతో మాట్లాడి, నేర్చుకున్నాడు. వాళ్ల కథలు విన్నాడు. ఎతలు విన్నాడు. ఆ కథల వెనక కన్నీళ్లు చూశాడు. వాళ్ల బాణీలు తీసుకొని, వాటిని విప్లవీకరించాడు. బాంచెనంటూ బతికినోళ్లకు తిరుగుబాటు నేర్పాడు. ప్రజలే చరిత్ర నిర్మాతలనే సత్యాన్ని ఆవిష్కరించాడు.
‘‘రాళ్లను రతనాలుగా మారుస్తారు
మట్టిలో బంగారం పుట్టిస్తారు
సముద్రాన్ని మథించి
ముత్యాలు పండిస్తారు
కాలంతో మారుతారు
ఓడిపోతూ గెలుస్తారు
గెలుస్తూ ఓడిపోతారు
అప్పుడు అర్థమవుతుంది
ప్రజలే గురువులంటే
ప్రజలే చరిత్రకారులంటే…’’ (అదే)
ఇట్లా గద్దర్‌ ప్రజల వాస్తవ జీవితాన్ని చిత్రించాడు. అందులో ఏ కాల్పనికతా లేదు. ఉన్నదల్లా వాస్తవికతే. పోరాటాల్లోకి ప్రవహించే ప్రజల గుండెతడే. ఇవే కాకుండా, ఈ పుస్తకంలో అంతా నిశ్శబ్దం, ఆ కవి, మీరు అమరజీవులు, రేపటి కాలం మీదే, బతుకు అర్థం, నేనదే పాట పాడ్త, పొలిటికల్‌ క్లాస్‌, ఏరివేత, నిప్పు, తోడు, అగ్గిపుల్ల, ఆటపాటల్లోన, బతుకంటె యుద్ధం, లోతుకెళ్లి చూడు, ఏది ముందు?, నరకం స్వర్గం, చిగురించే విప్లవం, బువ్వకోసం, మనస్పర్థలు, తుపాకులు, గెరిల్లా లేఖలు, కొంగజపం, భోపాల్‌, సృష్టికర్తలు లాంటి అద్భుతమైన కవితలున్నాయి. ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ కవిత్వమిది.
ప్రజల పాటను రగల్‌జెండాలా ఎగరేసిన గద్దర్‌కు లాల్‌ సలామ్‌.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

2 thoughts on “ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ గద్దర్‌

Leave a Reply