గంగా జమునా తెహజీబ్


సంఘ పరివారం వారు ఈ మధ్య ఇంటింటికి భగవద్గీత పంపిణీ కార్యక్రమం చేపట్టినారు. ఈ పంపిణీలో భాగంగా నిర్మల్ లో నాకు తెలిసిన ఒక మిత్రుడి ఇంటికి వచ్చి భగవద్గీత ఇచ్చి వెళ్లారు. ఆయన పేరున్న పెద్ద మనిషి కనుక ఒక ఫోటో కూడా దిగి పోయారు. ఆ ఫోటో కింద “ఇంటింటికి భగవద్గీత పంపిణీ కార్యక్రమం చేపట్టిన జాతీయవాదులు” అన్న క్యాప్షన్ తో ఫేస్ బుక్ లో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చక్కర్లు కొట్టి కొట్టి ఒక రోజు నాకు కూడా చేరింది. భవద్గీతను ఇంటింటికీ పంచడం పట్ల ఎవరికి అభ్యంతరం ఉండనవసరం లేదు. పంచిన వారు తమను తాము జాతీయవాదులుగా ప్రకటించుకోవడం పట్ల మాత్రమే అభ్యంతరం. 

అయితే వారు తమని తాము జాతీయవాదులుగా ప్రకటించుకున్నారు కనుక భగవద్గీతతో పాటు భారత రాజ్యాంగాన్ని కూడా పంపిణీ చేస్తే బాగుండు అనిపించింది. ఇవ్వాళ్ళ ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో రాజ్యాంగానికి ఉన్న ప్రాసంగికత మరి దేనికీ లేదు. “ఇంటింటా రాజ్యాంగం” అన్న ప్రోగ్రాం ఈ దేశానికి అత్యవసరం. అసలు సిసలు జాతీయవాదులు ఎవరైనా చేయవలసిన పని ఇదే. ఎవరు చెప్పినా చెప్పకున్నా ఎవరి మత గ్రంథాలను వారే తప్పక చదువుకుంటారు. వేల సంవత్సరాలుగా తరం నుంచి తరానికి అవి అందుతూనే ఉన్నాయి. వారు ప్రచారం చేస్తున్న 1000 ఏండ్ల ముస్లింల పాలనలో, 200 ఏండ్ల బ్రిటిష్ పాలనలో కూడా హిందూ మతం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. అయితే ఇవ్వాళ్ళ ప్రజాస్వామ్య యుగంలో భారతీయులు అందరూ ఏ మతానికి చెందిన వారైనా తప్పక చదవాల్సిన గ్రంథం రాజ్యాంగం ఒక్కటే.

భగవద్గీతను మాత్రమే పంచే వాళ్ళు హిందుత్వవాదులు అవుతారు తప్ప జాతీయ వాదులు కాలేరు. హిందు మతతత్వం జాతీయవాదం కాదు. హిందుత్వం వేరు. హిందు మతతత్వం వేరు. ఈ దేశంలో కోట్లాది మంది ఆచరించేది హిందుత్వం. ఆర్ఎస్ఎస్ పరివారం వారిది హిందూ మతతత్వం. అట్లనే ఇస్లాం, ఇస్లాం మతతత్వం ఒకటి కాదు. ప్రపంచంలో కోట్లాది మంది ముస్లింలు ఇస్లాంను ఆచరిస్తున్నారు. తాలిబాన్లు, ముజాహిదీన్లు, ఐసిస్ లు ఇస్లాం మత తత్వాన్ని ఆచరిస్తున్నారు. మతతత్వం ఏదైనా మానవాళికి ముప్పు, శాంతికి, సహజీవనానికి విఘాతం కలిగించేదే. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయాన్మార్ .. ఏ దేశంలో అయినా మెజారిటీ మతతత్వం ఫాసిజానికి దారి తీస్తుంది. మతతత్వ ఫాసిజం ప్రభలకుండా చూడవలసిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని, సమాజ హితాన్ని కోరుకునే ప్రజలదే. ఇవ్వాళ్ళ మనం అన్ని రకాల మతతత్వాలకు వ్యతిరేకంగా నిలబడవలసిన అవసరం ఏర్పడింది. 

స్వచ్ఛంగా, విశ్వాసంతో వ్యక్తిగత మతాచరణ చేసే వాళ్ళు ఎవరైనా మత తత్వవాదులు కాలేరు. వారి దృష్టి దేవుడి మీదనే ఉంటుంది తప్ప ప్రచారం మీద కాదు. ప్రచార యావ ఉందంటే వాడు మతతత్వవాదిగా మారుతున్నాడని అర్థం. వ్యక్తిగతంగా నిరీశ్వరవాదులు అయినవారికి కూడా మతాచరణ పట్ల, మతాన్ని విశ్వాసంతో ఆచరించే వారి పట్ల వ్యతిరేకత ఉండవలసిన అవసరం లేదు. హిందువుల్లో, ముస్లింలలో, క్రిస్టియన్లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. నాతో పాటు మహబూబ్ హుసేన్ అనే ఇంజనీర్ పని చేస్తున్నాడు. అతను ఇంజనీరింగ్ కాలేజీలో నా క్లాస్ మేట్ కూడా. అతను ప్రాజెక్టుల డి పి ఆర్ ల తయారీలో, హైడ్రాలజీ సబ్జెక్ట్ లో నిపుణుడు. రిటైర్ అయినాక అతన్ని హైడ్రాలజీ / డి పి ఆర్  కన్సల్టెంట్ గా నియమించుకున్నాము. కేంద్ర జల సంఘంలో గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల డి పి ఆర్ లు సమర్పించిన తర్వాత అనుమతుల కోసం మాతో పాటు ఢిల్లీకి తిరుగుతూ ఉంటాడు. ఇస్లాంలో అతనికి ఎంత అచంచల విశ్వాసమో పని మీద కూడా అంతే అత్యంత శ్రద్ధ. కరోనా బారిన పడి చికిత్స కోసం నేను, నా భార్య నిమ్స్ దవాఖానాలో ఉన్నప్పుడు అతను నమాజ్ లో మా కోసం దువా చేసేవాడు. హజ్ యాత్రకు మక్కా పోయినప్పుడు కూడా నా కోసం దువా చేశాడు. అక్కడి నుంచి మా కోసం పవిత్ర జలం కూడా తెచ్చాడు. అదే కరోనా సమయంలో ఇక్కడ మా ఊరు బోథ్ లో నా బాల్య మిత్రుడు, ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ అనంతరం పౌరోహిత్యం స్వీకరించి జీవనం గడుపుతున్న అరవింద్ మా కోసం నమక చమక రుద్రాభిషేకం చేశాడు. మహా మృత్యుంజయ మంత్రం పారాయణ చేశాడు. ఇద్దరు వేరు వేరు మతాచారాలు కలిగిన వాళ్ళే కానీ మతతత్వవాదులు మాత్రం కారు. వారు ప్రాథమికంగా మనుషులు. భారత్ లో నివసిస్తున్నకోట్లాది మందికి వీరిద్దరూ ప్రతీకలు. సమాజంలో వీరే ఎక్కువ మంది ఉన్నా ఇవ్వాళ్ళ మతతత్వం పెరిగి పోవడం ఒక విషాదం. అరవింద్ మా బిడ్డ పెండ్లి చేశాడు. పూజలు చేస్తున్నప్పుడు వాడి పక్కన సెల్ ఫోన్లో సన్నగా మంగళ వాద్యం వినిపిస్తూ ఉంటుంది. అది భారత రత్నబిస్మిల్లాఖాన్ షహనాయి వాద్యం. ఇదే కదా మతతత్వానికి తావులేని వ్యక్తిగత స్థాయిలో జరిగే మతాచరణ. 

ప్రాచీన భారత ఉప ఖండంలో శైవం వైష్ణవం మధ్య, వైదిక, బౌద్ధ మతాలకు మధ్య, మధ్యయుగ (Medieval) కాలంలో హిందు, ఇస్లాం మతాల మధ్య ఘర్షణలు, ఉన్నప్పటికీ సమ్మిళిత సహజీవనం ఈ ఉప ఖండంలో శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇస్లాం భారత దేశంలోకి అడుగుపెట్టి, సూఫీ రుషుల ద్వారా తెలంగాణలోకి వ్యాపించింది. తెలంగాణలో ఇది కుతుబ్ షాహిల కాలం కంటే ముందు నుంచి ఉనికిలో ఉన్నది. 1944-48 మధ్యన రజాకార్ ల కాలం తప్ప తెలంగాణ ప్రజల్లో చేదు జ్ఞాపకాలు దాదాపు లేవు. మిశ్రమ సహజీవన సంస్కృతి హైదరాబాద్ రాజ్యంలో వెల్లి విరిసింది. అందుకు ఉదాహరణ తెలంగాణలో ఘనంగా జరిగే మొహర్రం ఉత్సవాలు. అదే విధంగా జహాంగీర్ పీర్ దర్గా, జాన్ పాడ్ దర్గా లాంటివి అనేకంగా తెలంగాణ వ్యాప్తంగా వెలసిన సూఫీ దర్గాలకు హిందువులు, ముస్లింలు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడం చూస్తూనే ఉన్నాము. నిర్మల్ దగ్గర సూఫీ నగర్ పేరుతో దర్గా వద్ద ఒక ఊరు వెలిసింది. ఈ సహజీవన సంస్కృతే “గంగా జమునా తేహజీబ్” గా దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. చరిత్రలో దేశంలో వివిధ రాజ్యాల పాలకులు.. హిందువులైనా, ముసల్మాన్ లైనా.. మతతత్వాన్ని అమలు చేసి ఉండవచ్చు. వైదిక మతాన్ని ఆశ్రయించిన హిందూ రాజులు బౌద్ద, జైన ఆలయాలను శైవ, వైష్ణవ ఆలయాలుగా మార్చినట్టు చరిత్రకారులు గుర్తించారు. అట్లాగే ముస్లిం పాలకులు కూడా ఆలయాలను కూల్చి మసీదులు కట్టి ఉంటారు. విగ్రహాలను ద్వంసం చేసి ఉంటారు. కానీ ప్రజలు మాత్రం కలిసి మెలసి జీవించారు. 

ఈ సందర్భంగా 1960 వ దశకంలో మా ఊరిలో జరిగిన అద్భుతమైన సన్నివేశం గుర్తుకు వస్తున్నది. బోథ్ గణపతి మండపంలో బడే గులాం అలీ ఖాన్ కచేరి జరిగింది. ఇదొక మహత్తర సన్నివేశం. బడే గులాం అలీ ఖాన్ ఎక్కడ? ఆయన బోథ్ లాంటి చిన్న పల్లెటూరులో కచేరీ చేయడం ఏమిటి? నమ్మశక్యం కాని ముచ్చటే కానీ వంద శాతం నిజం. ఈ సంఘటను కీ శే సామల సదాశివ గారు తన సంగీతం ముచ్చట్లలో నమోదు చేశారు. దేశం గర్వంగా ప్రస్తావించుకునే హిందుస్తానీ సంగీత శిఖరం, పాటియాలా ఘరానా సంగీత సంప్రదాయాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. ఉస్తాద్ ముసల్మాన్ అయినా మత భేదాలు ఆనాటి గాయనీ గాయకుల్లో లేనట్టే ఉస్తాద్ లో ఉండేవి కావు. తన జీవితపు చరమాంకంలో.. 1967 లో ఆయన పక్షవాతానికి గురి అయినాడు. ముంబాయిలో నివసించే ఉస్తాద్ పక్షవాతానికి మూలికా వైద్యం చేసే హకీం ఉన్నాడని తెలిసి చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామానికి వచ్చాడు. బోథ్ ఆనాటికి తాలూకా కేంద్రమైనా ఒక గ్రామమే. బోథ్ డాక్ బంగ్లాలో ఉస్తాద్ మూడు నెలలు ఉన్నాడు. మూలికా వైద్యం చేయించుకున్నాడు. బడే ఖాన్ సాహెబ్ కు మూలికా వైద్యం చేసిన హకీం బోథ్ లో ఉద్యోగం చేసే ఆర్టీసీ కంట్రోలర్. బడే ఖాన్ సాహెబ్ బోథ్ లో చికిత్స తీసుకుంటున్న రోజుల్లోనే గణపతి నవరాత్రులు వచ్చాయి. బోథ్ లో ఉండే సంగీత ప్రియులు గణపతి మండపంలో ఆయన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలచి ఉస్తాద్ ను పాడమని ఆహ్వానించారు. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. బజారు వీధిలో చిన్నమల్లయ్య గారి గణపతి మండపం వద్ద ఉస్తాద్ సంగీత కచేరికి ఏర్పాట్లు జరిగినాయి. ఆయనది భారీ శరీరం. ఒక పలంగ్ మీద ఆయనను పడుకోబెట్టి మండపానికి మోసుకొని తీసుకొచ్చారు. హార్మోని, తబలా స్థానిక కళాకారులే వాయించినారు. తమ్మలోళ్ల రాజేశ్వర్ రావు గారు ఆ కచేరీలో తబలా వాయించినారని తెలిసింది. నిపుణులైన సాజిందాలు(వాద్య సహాయకులు) లేకపోయినా, పక్షవాత బాదితుడు అయినా మూడు గంటల పాటూ అప్రతిహాతంగా సంగీత రాగాలు, భజన్ లు, టుమ్రీలు వినిపించాడు ఉస్తాద్. దేశంలో ఉస్తాద్ సంగీత కచేరీల కోసం నెలల తరబడి వేచి చూసే పరిస్థితి ఆనాడు ఉండేది. నిర్వాహకులు ఆయనకు భారీ పారితోషికాలు ఇచ్చేవారు. సంగీత ప్రియులు భారీ మొత్తాలతో టికెట్లు కొని కచేరీ వినేవారు. బోథ్ సంగీత ప్రియులు మాత్రం అనాయాసంగా, ఉచితంగా గణపతి నవరాత్రుల సందర్భంగా ఆయన సంగీత కచేరీని వినే అదృష్టాన్నిపొందారు. ఒక ముసల్మాన్ ను గణపతి మండపానికి ఆహ్వానిస్తున్నామన్న భావన కార్యక్రమ నిర్వాహకులకు లేదు. తాను గణపతి మండపంలో పాడబోతున్నానన్న స్పృహ ఉస్తాద్ కు లేదు. ఇదే కదా భారతదేశం విశిష్టత. భిన్నత్వంలో ఏకత్వం అంటే. 

సందర్భం కనుక మనకు స్పూర్తినిచ్చే మరి కొన్నిసన్నివేశాలు చెప్పాలని అనిపిస్తున్నది. భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షహనాయి వాదనంలో మేరు నగం. నివసించేది గంగా నది ఒడ్డున ఉన్న బనారస్ లో. ఆయన మేనమామ అలీబక్ష్ కాశీ విశ్వనాథుడి దేవాలయంలో ఆస్థాన షహనాయి వాదకుడు. బిస్మిల్లా ఖాన్ తన మేన మామ వద్దనే షహనాయి వాయించడం నేర్చుకున్నాడు. ఆయన సుధీర్ఘ సంగీత ప్రస్థానంలో దేశ విదేశాల్లో ఎన్నో సంగీత కచేరీలు చేసినాడు. షహనాయి వాద్యానికి ఒక గొప్ప శాస్త్రీయ సంగీత ప్రశస్తిని కలుగజేసినాడు. ఆయనకు బాబా విశ్వనాథుని దర్శనం కూడా అయ్యిందట. ప్రతీరోజు గంగా నదిలో ఉదయం మునక వేసి, తన షహనాయికి గంగా నదీ జలాలతో సంప్రోక్షణ చేసిన తర్వాతనే ఆయన తన రోజు వారీ కార్యక్రమాలు మొదలు బెట్టేవాడు. అతనిది సాదాసీదా జీవితం. హజ్ యాత్ర చేసిన సచ్చా ముసల్మాన్ అతడు. ఒకసారి అమెరికాలో కచేరీ నిర్వహించిన తర్వాత కచేరీలో పాల్గొన్న కొందరు సంపన్నులు “ఉస్తాద్ మీరు ఇక్కడనే ఉండిపోండి. మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం” అన్నారట. దానికి ఉస్తాద్ “మీరు సంపన్నులు. నా కోసం స్వర్గాన్నే సృష్టించగలరు. అయితే బనారస్ లో ఉన్న గంగా మాయిని తేగలరా? రోజూ గంగామాయిలో మునగకుండా ఉండలేను కదా!” అన్నారట. గంగామాయితో హిందువులకే కాదు బిస్మిల్లాఖాన్ లాంటి సచ్చా ముసల్మాన్ లకు విడదీయలేని అనుబందం ఉందని, ఉంటుందని మన అనుభవంలోకి రాదు. 

నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానానికి ఆరవ నిజాం రాజు. హైదరాబాద్ నగర ప్రజలు అతన్ని ప్రేమతో మహబూబ్ పాషా అని పిలుచుకునే వారు. ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాణానికి మూల కారకుడు. ఆధునిక హైదరాబాద్ నిర్మాణానికి ప్రణాళికలను, సంస్కరణలను అమలు పరచడానికి తన దీవాన్ సాలార్ జంగ్ కు పూర్తి స్వేచ్ఛను కల్పించాడు. ఆ ఇద్దరి సహచర్యంలో ఆధునిక హైదరాబాద్ నగరం నిర్మాణం ప్రారంభం అయ్యింది. 1908 లో మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకే రోజు కురిసిన 32 ఇంచుల వర్షపాతంతో మూసీకి గతంలో కనీ వినీ ఎరుగని వరదలు సంభవించి హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి అందరూ ఎరిగినదే. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన మూసీ వరద భీభత్సం నుంచి  నగర ప్రజలను రక్షించడానికి తన రాజ భవనాలను ప్రజల కోసం తెరచిపెట్టాడు మహబూబ్ పాషా. పండితుల సలహా మేరకు మూసీని శాంతింపజేయడానికి మూసీ నదీమ తల్లికి చీర సారెలు హిందూ మత సాంప్రదాయబద్దంగా సమర్పించాడు. తాను ఒక ముసల్మాన్ అనే స్పృహ ఆయనకు లేదు. తన ప్రజల సంక్షేమమే ప్రమావధిగా ఆయన ఆ పని చేయడానికి సంకోచించలేదు.

నౌషాద్ అలీ పేరు వినని వారు ఉండరు. తొలి తరం హిందీ సినిమా సంగీత దర్శకులలో ఆయన ఒక దిగ్గజం. ఆయన ఒక ముసల్మాన్ అన్న సంగతి అందరికీ ఎరుకే. ఆయన స్వర కల్పన చేసిన వేలాది పాటలు ఇప్పటికీ మనలను అలరిస్తున్నాయి. సంగీత ప్రధాన చిత్రం “బైజు  బావ్రా” కు నౌషాద్ సంగీత దర్శకుడు. బైజు అద్భుత గాయకుడు. కానీ గుర్తింపు లేక పేదరికంలో మగ్గిపోతుంటాడు. ఎవరో అక్బర్ పాదుషాను దర్శించు కొమ్మని సలహా ఇస్తారు. అప్పటికే అక్బర్ పాదుషా వారి దర్బారులో గోపాల్ దాస్, హరిదాస్, తాన్ సేన్ లాంటి సంగీత దిగ్గజాలు కొలువుతీరి ఉన్నారు. బైజు అక్బర్ పాదుషా దర్శనం కోసం ఆగ్రా వెళతాడు. కానీ అతనికి అక్బర్ దర్శనం దొరకదు. నిరాశతో కృష్ణుడి దేవాలయంలో తన గోసను వెళ్ళబుచ్చుతూ “హరి ఓం.. మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్” అనే పాట పాడుతాడు బైజు. నౌషాద్ ఆ పాటను మాల్ కౌన్స్ రాగంలో స్వర పరచాడు. పాట రాసింది మహమ్మద్ షకీల్ బధాయుని, పాట పాడింది మహమ్మద్ రఫీ. ఆ కృష్ణ భక్తి రస ప్రధానమైన పాటకు ప్రాణం పోసిన ముగ్గురూ ముసల్మాన్ లు కావడం విశేషం. రికార్డు చేసేది కృష్ణ భక్తి రస ప్రధానమైన పాట కాబట్టి రికార్డ్ చేసే రోజున అందరూ స్నానం చేసి శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకొని పవిత్రంగా రావాలని తన ఆర్కెస్ట్రా కళాకారులను ఆదేశించానని నౌషాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ పాట అంతా గొప్పగా రావడానికి మాల్ కౌన్స్ రాగం గొప్పదనమే కానీ తన గొప్ప ఏమీ లేదని వినమ్రంగా చెప్పుకున్నాడు నౌషాద్. బైజు పాట విన్న ఒక పెద్ద మనిషి బైజును అక్బర్ దర్బారుకు తీసుకు వెళ్ళడం, ఆ  తర్వాత బైజు అక్బర్ దర్బారులో పాడి, తాన్ సేన్ ను ఓడించి, అక్బర్ పాదుషాను మెప్పించి దర్బారులో స్థానం సంపాదించడం వేరే కథ. 

ఇదే భారత దేశ సమ్మిళిత సహజీవన సంస్కృతి. మతతత్వం మన సంస్కృతి కాదు. శతాబ్దాలుగా దేశం సంతరించుకున్న ఈ విలువలు ఇవ్వాళ విచ్ఛిన్నం అవుతున్నాయి. వీటిని కాపాడు కోవడం, సమున్నతంగా నిలబెట్టుకోవడం కాలం మన ముందు నిలిపిన సవాల్. దేశంలో “గంగా జమునా తెహజీబ్” నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలదే.

3 thoughts on “గంగా జమునా తెహజీబ్

  1. చక్కని విశ్లేషణాత్మక వ్యాసం శ్రీధర్. చాలా బాగుంది. మత ఛాందసం పెరుగుతున్న ఈ రోజుల్లో ఇటువంటి వ్యాసం చక్కని కనువిప్పును కలుగజేస్తుంది. మతం ఒక నమ్మకం మాత్రమే. నిజానికి భగవంతుడు నిరాకారుడు. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’. ‘బ్రహ్మన్’ నిరాకారుడు. నిజానికి భగవద్గీత మత గ్రంథం కాదు. అది ప్రస్థాన త్రయంలో ఒక భాగం. అది జ్ఞాన సంబంధమైన పుస్తకం. మనిషి జీవన విధానాన్ని నిర్దేశించే ఒక మార్గసూచి లేదా మార్గ దర్శిని. భగవద్గీత నియమాలు సమస్త మానవాళికి వర్తిస్తాయి. దానికి మతంతో గాని జాతీయ వాదంతో గాని సంబంధం లేదు. దాన్ని మత గ్రంథం గా పరిగణించడం అజ్ఞానం. చాలా మంచి వ్యాసం. నాకు చాలా నచ్చింది.
    నమిలికొండ విశ్వేశ్వర రావు

  2. చాలా బాగా వ్రాసారు. వివరించారు.

  3. చాలా బాగా వ్రాసారు. ఈనాటి పరిస్థికి ఎంతో విలువైన సమాచరాన్ని అందించిన మీకు అభినందనలు

Leave a Reply