‘ఖబర్ కె సాత్’ – వొక సామూహిక ఆర్తి గీతం

‘ఆ ఘనీభవించిన విషాదపు అగాధం నుండి
జరిగిన దుర్మార్గాల వార్తలు మోసుకొస్తూ
ద్రోహపూరిత కపటత్వపు ఊళలూ,
హృదయాలు మొద్దుబారే రోదనలూ
ఉదయాన్ని పలకరించినయి’
(కునన్ పోష్పోరా: మరవరాని కశ్మీరీ స్త్రీల ప్రతిఘటన గాథ పుస్తకం నుంచి –
కవిత అనువాదం: నారాయణ స్వామి వెంకటయోగి)

కథా రచయిత శ్రీనివాసమూర్తి పేరు చెప్పగానే 90ల్లో రాయలసీమ కఠోర జీవన వాస్తవికతను రంగరించి అతను రాసిన అడివోడు, మెడ మీద వేలాడే కత్తి, దేవుని మాన్యం వంటి కథలు వెంటనే స్ఫురణకు వస్తాయి. ఆ కథలు చెప్పడంలో అతని నేర్పు గుర్తుకు వస్తుంది. దాన్ని సానబట్టిన కర్నూలు కథా సమయాన్ని ఆ జ్ఞాపకాల నుంచి విడదీయలేం. ప్రగతిశీల ప్రజా వుద్యమాల్లో (రాడికల్ స్టూడెంట్ యూనియన్, వి ర సం, పౌర హక్కుల సంఘం) క్రియాశీలక కార్యకర్తగా పొందిన ప్రాపంచిక దృక్పథాన్ని ఆనాటి తన కథల ద్వారా బలంగా వ్యక్తం చేసిన మూర్తి చేయి తిరిగిన నిబద్ధ రచయితగా గుర్తింపు పొందినప్పటికీ ఆ తర్వాత యే కారణంగానో దాదాపు రెండు దశాబ్దాల పాటు కథన రంగానికి దూరంగా వుండి పోయారు. దీర్ఘకాల విరామం తర్వాత ఆయన రెండో ఇన్నింగ్స్ లో రాసిన కథల్లో ప్రత్యేకమైన కథ ‘ఖబర్ కె సాత్’ (మార్చి 2021, అరుణతారలో ప్రచురితం, అదే పేరుతో కథల సంపుటి : డిసెంబర్ 2021). ఆర్టికల్ 370 రద్దయిన రాజకీయ సందర్భాన్ని నేపథ్యంగా చేసుకుని రెండు మూడు తరాల కశ్మీర్ అస్తిత్వ సంఘర్షణకి అక్షర రూపం యిస్తూ, మానవ హక్కుల విఘాతం దగ్గర్నుంచి జాతి హననం వరకూ కలవరపెట్టే యథార్థ జీవితాలెన్నిటినో కథీకరించడానికి పూనుకోవడం వల్ల యీ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇంత దుఃఖ భరితమైన కథను యిటీవల నేను చదవలేదు. ఇదొక సామూహిక ఆర్తి గీతం. ఈ వేదనకి కారణం దుర్మార్గమైన రాజ్యం. రాజ్యం దాని యంత్రాంగం చేసే హింస. ఒక జాతి పై మరొక జాతి అమలుచేసే అణచివేత. ఒక ప్రాంతం పై మరొక ప్రాంతం చేసే ఆక్రమణ. చొరబాటు. ఆధిపత్య సామ్రాజ్యపు సైనిక దాడి. తోటని తగలబెట్టి పక్షి గూళ్ళు కాపాడతామనే పాలకుల ద్వంద్వ నీతికి సజీవ (నిర్జీవ?) సాక్ష్యంగా నిలిచిన కశ్మీర్ దుర్భర పరిస్థితిని మానవీయ కోణం నుంచి ఆవిష్కరించిన కథ ‘ఖబర్ కె సాత్’. అయితే ఆద్యంతం దుఃఖ మూలాల్ని అన్వేషించి పాఠకులకి కొత్త యెరుకని అందించడం వల్ల అది విషాద గాథగా మిగిలిపోకుండా సమకాలీన రాజకీయ కథగా పరిణమించింది. ఇవాళ కశ్మీర్ పై రాజకీయ కథ రాయడం సాహసమే. ఆ సాహసానికి శ్రీనివాస మూర్తి ఐచ్ఛికంగానే వొడిగట్టాడు.

**

కశ్మీర్ – ఆజాదీ ఈ రెండు మాటలు వింటే మధ్యతరగతి సాధారణ పౌరుల దగ్గరనుంచి బుద్ధి జీవుల వరకు వులిక్కి పడతారు. పార్లమెంటరీ రాజకీయాల్లో తమను తాము కోల్పోయిన కమ్యూనిస్టులు సైతం దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగినట్లు భావిస్తారు. ప్రజాస్వామ్యం గురించి వుపన్యాసాలు దంచే మేధావులు కూడా మౌనాన్ని ఆశ్రయించి ముఖం చాటేస్తారు. మత విద్వేషంతో హిందూత్వ రాజకీయాలు నడిపే సంఘీయులయితే దేశద్రోహం జరిగిపోయినట్టు గగ్గోలు పెడతారు. మార్క్సిస్టు లెనినిస్టులు మాత్రమే కశ్మీర్ ని జాతుల సమస్యలో భాగంగా చూస్తారు. కశ్మీర్ ప్రజల పోరాటాన్ని విముక్తి వుద్యమంగా అంగీకరిస్తారు.

“‘ఒకప్పుడు కశ్మీర్ అమెరికా రూస్ ల మధ్య ఫుట్బాల్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్ ల మధ్య. అంతే తేడా!” ఇది ఒక అంతర్జాతీయ క్షుద్రక్రీడ. అమాయకులైన కశ్మీర దేశ ప్రజలు వికృతమైన ఆ ఆటలో పావులు.

“ఈ నేలతో సంబంధం లేని రెండు జాతీయవాదాల మధ్య అసలైన మా కశ్మీరు జాతీయవాదం ఎక్కడో తప్పి పోయింది. ఒకరు మా ప్రమేయం లేకుండా మమ్ములను విముక్తి చేస్తామంటే ఒకరు మా ప్రమేయం లేకుండా మమ్ముల రక్షిస్తామంటారు.”

మూడు తరాల ఇండో – పాక్ పాలకులు కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడిపిన సీమాంతర రాజకీయాల వల్ల అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయిన జీవితాలకు ప్రత్యక్ష సాక్షి అయిన హమీద్ అనే వృద్ధుడి ద్వారా రచయిత పలికించిన మాటలివి. విడిపోవడానికి గానీ కలిసుండటానికి గానీ స్వయం ప్రతిపత్తిని కోరుకునే వొక జాతికి వుండే న్యాయ సమ్మతమైన హక్కుని రచయిత యీ మాటల్లో స్పష్టం చేశాడు.

ఇలా కథలో సందర్భానుసారంగా శ్రీనివాస మూర్తి రచయితగా, హక్కుల కార్యకర్తగా కశ్మీర్ పై తన స్పష్టమైన దృక్పథాన్ని తెలియజేశాడు. కశ్మీర్ అంటేనే ఉగ్రవాద కార్యకలాపాలకు నెలవు అనే మిత్ ని బద్దలు చేసాడు. సామాన్య ప్రజల్లో కశ్మీర్ చుట్టూ అల్లి ప్రచారం చేసిన అభిప్రాయాల్ని సున్నితంగా పరాస్తం చేశాడు. దశాబ్దాలుగా కశ్మీర్ లో నెలకొని వున్న అంశాంతి మూలాల్ని వొక చరిత్రకారుడిగా నిష్పాక్షికంగా తెలియజేశాడు. వక్రీకరణకు గురైన సమీప చరిత్ర ఆర్థిక సామాజిక మూలాల్ని తడిమాడు. ‘ఖబర్ కె సాత్’ ని నికార్సయిన రాజకీయ కథగా మలవడంలో, నిర్దుష్టమైన ప్రామాణికమైన సమాచారాన్ని సృజనాత్మకంగా అందజేయడంలో శిల్పవిషయికంగా రచయిత యెక్కడా రాజీపడలేదు. కశ్మీర్ భౌగోళిక వాతావరణాన్ని కాకుండా 1987 ఎన్నికల ప్రహసనం తర్వాత మొదలైన భారత సైనిక దమనకాండ కారణంగా మొదలైన రాజకీయ సంక్షోభాన్ని కథలోకి తీసుకురావడం యీ కథలోని విశిష్టత. భారత ప్రజాస్వామ్యం యెంత బూటకమో కశ్మీర్ ముఖచిత్రంపై పాలకులు చిందించిన రక్తం సాక్షిగా రచయిత నిరూపించాడు. నాకు తెలిసిన మేరకు యిటువంటి కథ యిటీవల తెలుగులో రాలేదు. ఇది కశ్మీరీ భాష నుంచీ చేసిన అనువాదమేమో అనిపిస్తుంది. అంతగా కశ్మీర్ సామాజిక అస్తిత్వం కథ అంతటా పరుచుకుని వుంటుంది.

కశ్మీర్ కి రెండు సమస్యలు ఉన్నాయి : ఒకటి ఇండియన్ యూనియన్. రెండు పాకిస్తాన్. కశ్మీర్ చిరకాల వాంఛ ఆజాదీ. అటు పాకిస్తాన్ యిటు ఇండియా యెవరి పాలనలో వుండటానికైనా కశ్మీర్ పౌర సమాజం యిష్టపడడం లేదు. వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. స్వయం పాలన కోరుకుంటున్నారు. బలవంతంగా మిలటరీ ప్రయోగించి తమలో భాగం చేసుకోవాలని అటు పాకిస్తాన్ యిటు భారత్ ఎడతెగని హింసను ప్రయోగిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. జీవించే హక్కుని నేలరాస్తున్నారు.

కథలో ఒకచోట రచయిత ఆర్టికల్ 370 రద్దు చేశాక అక్కడ సైక్రియాటిస్ట్ ల అవసరం పెరిగింది – అని గుర్తు చేస్తాడు. ఎన్నెన్నో మానసిక కారణాలతో మనుషులు రోగగ్రస్తులయ్యారు. ఇంటర్నెట్ ఉండదు. టీవీ ఛానల్లు మూత పడిపోతాయి. నెలలు నెలలు కర్ఫ్యూ అమలవుతూ ఉంటుంది. ఇరుగు పొరుగుతో వొక ముచ్చట లేదు. తోటి మనిషిని పలకరించడానికి లేదు. మనుషులు బయటికి వస్తే ఇంటికి పోగలరో లేదో తెలియదు. బుల్లెట్లు తాకుతాయో పెల్లెట్లు కురుస్తాయో చెప్పలేం. పిచ్చి పట్టడానికి ఇవేనా కారణాలు? భర్తలను, తండ్రులను, పిల్లలను కోల్పోయిన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? దుర్భర వేదన తీరే దారేది?

‘హాఫ్ విడో’ అన్నమాట వొక్క కశ్మీర్ లోనే వినిపిస్తుంది. దాని నైఘంటుకార్థం యెవరు చెప్తారు? కునన్ పోష్పోరా దగ్గర్నుంచి మిలటరీ అత్యాచార బాధితుల లెక్క యెవరి దగ్గరైనా వుందా? బూటకపు ఎన్కౌంటర్ లలో జరిగే వ్యవస్థీకృత హత్యల గురించి కశ్మీర్ ఫైల్స్ మాట్లాడతాయా? మిస్సింగ్ కేసులు గురించి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యెందుకు మౌనంగా వుంటాయి – why the nation doesn’t want to know?

మా చిన్నప్పుడు మా బంధువుల్లో మాకు మేనత్త వరసయ్యే వొకామె ఉండేది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కోస్తా ప్రాంతంలో కమ్యూనిస్టుల్ని యేరి వేయడానికి పళనియప్పన్ అని వొక పోలీస్ అధికారి వచ్చాడు. మహా క్రూరుడు అని కథలు చెప్పేవారు. అతని పోలీసు మూక వూళ్ల మీద దాడులు చేసి మనుషుల్ని యెత్తుకుపోయేవారు. 20 యేళ్లు కూడా నిండని వయసులో మా మేనత్త భర్తని మాయం చేశారు. అతని ఆచూకీ తెలియదు. భర్త బతికి వున్నాడో చనిపోయాడో తెలియకుండా ఆమె జీవితాంతం వొంటరిగానే వుండిపోయింది. ఆ రోజుల్లో అది మాకు పెద్ద కథ. ఆమె వితంతువు కాదు. భర్త వున్న భార్య కాదు. అటువంటి పరిస్థితే మూడు దశాబ్దాలుగా కశ్మీరీ స్త్రీలు అనుభవిస్తున్నారు.

‘భర్తలను పోగొట్టుకున్న భార్యలు అక్కడ సాధారణం. బిడ్డలు పోగొట్టుకొనని తల్లిదండ్రులు అక్కడ అసాధారణం.’

అక్కడి తల్లుల గర్భశోకం ఆరనిది. ఫీజు కట్టడానికి యూనివర్సిటీకి పోయిన విద్యార్థి తిరిగి రాడు. మెకానిక్ షాప్ నుంచి బైక్ తెచ్చుకోవటానికి వెళ్లి మరొక యువకుడు ఇంటికి రాడు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు; యెవరికీ యింటా బయటా యెక్కడా భద్రత లేదు. అది పుల్వామా జిల్లా కావచ్చు, షోపియాన్ ప్రాంతం కావచ్చు; గ్రామాలు ప్రకటిత అప్రకటిత యుద్ధ స్థావరాలు. నగరాలు కల్లోల కదన క్షేత్రాలు. ఇలా మాయమైపోయిన పిల్లలు ప్రధాన స్రవంతి పత్రికల్లో జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో యే ఎలక్షన్స్ ముందో, జాతీయ సమస్యల నుండి ప్రజలు దృష్టి మళ్ళించడానికో ఎన్ కౌంటర్ అయినట్టు లెక్కింపబడతారు. అది మిగతా దేశానికి అతి సాధారణ వార్త.

స్థానిక పోలీసులో మిలటరీనో పారా మిలటరీనో యెత్తుకు పోయి మాయం చేసిన కొడుకు కోసం హానియా అనే నడి వయస్సు స్త్రీ కేంద్రంగా కథ నడుస్తుంది. ఆమె మామ దేశాన్ని కాపాడటం కోసం భారత సైన్యంలో చేరాడు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో రెండు మెడల్స్ కూడా అందుకున్నాడు. అలాంటి వాడి కొడుకు హానియా భర్త. అతడు తన దేశభక్తిని నిరూపించుకోవాల్సి వచ్చింది. ‘సత్యం తప్ప మరొకటి పలకడం అతనికి చేతకాదు. అదే అతని కొంపముంచింది. ఒక ఎన్కౌంటర్ గురించి చూసింది చూసినట్టు విలేకరులు అడిగితే నిజాయితీగా చెప్పాడు. వారం రోజులకు మాయమైపోయాడు.’ వున్నాడో లేదో తెలియదు. ఏదో జీవనాధారం యేర్పరచుకుని ముసలి అత్తని పోషించుకుంటంటే పరీక్ష రాయడానికి వెళ్ళిన ముక్కు పచ్చలారని కొడుకుని తీసుకుపోయారు. కడుపు కోతతో ఆమె పిచ్చిదైపోయింది.

ఆమె గర్భశోకం వింటుంటే నాకు కరుణ తాయమ్మ రోదన గుర్తొచ్చింది. అయితే తాయమ్మ వేదన వైయక్తికం. హానియాది సామూహిక దుఃఖం. ఏ కారణం చూపకుండానే అన్నం దగ్గర కూర్చున్నవాళ్ళనీ, నిద్రపోతున్నవాళ్ళనీ అలా యెందర్ని అమాంతంగా యెత్తుకు పోతున్నారో లెక్క లేదు.

” ఇది అల్లాహ్ పాలిస్తున్న లోకమా?
సైతాను శాసిస్తున్న రాజ్యమా?”
హానియా ప్రశ్నకు జవాబు యెవరిస్తారు?

ప్రమోషన్ కోసం రివార్డులు కోసం ఎదిగిన గుడ్లను చిదిమేస్తున్నారు. టూరిజం కోసం, రెస్టారెంట్ల కోసం భూముల్ని దురాక్రమణ చేస్తున్నారు. కశ్మీర్ 70 ఏళ్లుగా ఏడుస్తూనే ఉంది. జీలం నదిలో నిత్యం పారుతున్నవి కశ్మీర్ ప్రజల కన్నీళ్లే అని కొడుకు పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని కోడల్ని వోదార్చబోతుంది అత్త. పసిగుడ్డుతో పారిపొమ్మనీ, మారు మనువు చేసుకొని పదిమందిని కనమననీ, ముగ్గురు చచ్చినా కాచుకోడానికి మరో నలుగురుంటారనీ కోడలికి నెత్తీనోరూ కొట్టుకుని చెప్పింది.

“చంపుకోవడం కోసమే బిడ్డలను కంటున్న జాతి
చేవ చచ్చిన నేతలను నమ్మి మోసపోయిన జాతి” అది.

అత్త ఆక్రోశం హానియా దుఃఖాన్ని తీర్చలేదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జాతి హననానికి పాల్పడే నేతల మనసుల్ని మార్చలేదు. ఎద్దు పుండు కాకికి రుచి.

ఇండియన్ ఐడల్ ఎపిసోడ్లో నేహా కక్కర్ పెట్టుకొనే కన్నీళ్లు చూసి సరదా పడే మిలటరీ ఆఫీసర్ వొక వైపు. నెత్తి మీది హిజాబ్ చేతిలోకి తీసుకొని అతని బూట్లు తుడుస్తూ మాయం చేసిన తన కొడుకు ఆచూకీ చెప్పమని దీనంగా వేడుకునే హానియా వంటి స్త్రీ మరోవైపు. ఇటువంటి హృదయ విదారక దృశ్యాల్ని నిస్సహాయంగా చూస్తూ స్పందించడానికి సైతం భయపడుతూ బిక్కు బిక్కు మంటూ తిరిగే సామాన్య జనం మధ్య ఆ స్త్రీల దుఃఖం వినడానికి యీ దేశీయులు సిద్ధంగా వున్నారా?

భూతల స్వర్గం పైన భూతాల కన్ను పడింది. ‘ఒకప్పుడు యవ్వనం రోడ్డుపై ఉరుకులు పెట్టేది. కాందూర్ షాపులు ఉదయపు బాతాఖానీ సెంటర్లుగా ఉండేవి. మనుషుల ముచ్చట్లతో పరాచకాలతో ఎత్తిపొడుపులతో ఆట పట్టించుకోవటంతో కళకళలాడేవి. అవన్నీ ఏదో సైతాను శాపం పెట్టినట్లు మాయమైపోయాయి. బయటి పనులు ఏమైనా ఉంటే పిల్లల్ని పంపడం లేదు.’

ఇలా వొక నిశ్శబ్ద శ్మశాన వాతావరణంలోకి ప్రారంభంలోనే కథ అన్ ఫోల్డ్ అవుతుంది. భయం మంచులా కప్పేసిన నేల మీద స్వేచ్ఛకి గానీ శాంతికి గానీ చోటెక్కడిది?

‘ఆజాదీ కశ్మీర్’ అన్న గాఢమైన చిరకాల వాంఛని నినాదం చేసుకుని వొకప్పుడు వీధుల్లో తిరగబడ్డ యువత ఇప్పుడు కానరావటం లేదు. కానీ ‘ఎంతకాలం చేతులు ముడుసుకుని కూర్చుంటారు?’ అని అడుగుతుంది యెదిగొచ్చిన కొడుకుని కోల్పోయిన ముదుసలి హమీద్ భార్య మెహనూర్. ఢిల్లీ యూనివర్సిటీ లో పెద్ద చదువు చదువుకున్న ఆ దంపతుల కొడుకు కూడా కశ్మీరీల హక్కులకోసం పోరాడి మాయమై పోయాడు. ‘బొంద పెట్టుకొని కనీసం ఏడాదికి ఒక సారి చూసుకుందాం అన్న ప్రాప్తం లేదు’ ఆ ముసలివాళ్ళకి.

ఇరవై సంవత్సరాలుగా ఆ దుఃఖాన్ని వుగ్గబట్టుకుని తమలా బిడ్డల్ని కోల్పోయిన వారికి వూరటనిస్తూ నలుగురి కష్టాలు పంచుకుంటూ జీవితం గడుపుతూ వుంటారు. ఆతిథ్యానికి కశ్మీరీలు పెట్టింది పేరు. ఆశ్రయం కోరిన వారిని ఆదరించడం వారి జీవన విధానం. లోయలో సమస్త జీవనం స్తంభించినప్పుడు శుబోధ్ అలాగే దగ్గరయ్యాడు. గుండె లోతుల్లో పేరుకు పోయిన అనేక విషయాల్ని అతని ముందు తవ్వి పోసే క్రమంలో అసంకల్పితంగా వుద్విగ్న భరితమైన నిజాలెన్నో వెలికి వస్తాయి. కథ, కథ నడిచిన సమాజం, అందులోని మనుషుల అంతరంగాలు యెన్నో పొరలతో చదువరులకు ఆవిష్కారమౌతాయి.

మనుషుల్ని నిరపేక్షంగా ప్రేమించే వాళ్ల గురించి ఎంత వక్రీకరణ. ఎన్ని అసత్యాలు. ఎన్ని అర్థసత్యాలు. గుడినీ మసీదునీ ధిక్కరించిన చరిత్ర వాళ్ళది. కశ్మీరియత్ నిర్మించుకొని దేశానికి సమత్వ సందేశాన్ని వినిపించిన జాతి అది. దేశంలోనే తొలి భూసంస్కరణలు ప్రవేశపెట్టిన నాయకుడు షేక్ అబ్దుల్లా. భూ సంస్కరణల్ని వ్యతిరేకించిన జమిందారులు దీన్ని ముస్లింలకు పండిట్లకు మధ్య వైషమ్యంగా ప్రచారం చేశారు. తర్వాతి కాలంలో షేక్ అబ్దుల్లా తరం నాయకత్వం ఇందిరాగాంధీకీ ఫారూఖ్ అబ్దుల్లా తరం నాయకత్వం రాజీవ్ గాంధీకీ లొంగిపోయింది. వారికి వ్యతిరేకంగా నిర్మితమైన ముఫ్తీ సయీద్ తరం యిప్పటి హిందూత్వ వాదులతో చేయి కలిపింది. నెహ్రూ కాలం నుంచీ జాతీయ నాయకత్వమే కాదు; స్థానిక నాయకత్వం సైతం వాళ్లని యెప్పుడూ మోసం చేస్తూనే ఉంది. నేతలు తమ ఆస్తులు సంపద అధికారం కాపాడుకోవడానికి వారిని నిరంతరం బలి చేశారు. కశ్మీర్ లోనే కాదు దేశమంతటా ఇటువంటి మోసం జరిగింది.

“మా వేదన మా దుఃఖమ్ మీ దేశం లోని నెహ్రూ జాతి లౌకిక వాదులకు, అద్వానీ జాతి దేశభక్తులకు ఎప్పటికీ అర్థం కాదు. మేము వేరు, మా బతుకులు వేరు. మా మానాన మమ్ముల బతకనిమ్మంటే మీకెందుకు అర్థం కాదు?” అని ప్రశ్నిస్తాడు హమీద్. కశ్మీరీల ఏడు దశాబ్దాల ఆకాంక్షనీ చరిత్రనీ హమీద్ అడిగిన యీ వొక్క ప్రశ్నలోకి కుదించాడు రచయిత. ఫాసిస్టు పాలకులు వింటారా?

కశ్మీర్ లో బాధితులు అంటే నిర్వాసితులైన పండిట్లే అన్న ప్రచారం జరిగింది. రాష్ట్రం మొత్తం జనాభాలో హిందువులు ఎందరు – అందులో పండిట్ల సంఖ్య యెంత – వారిలో నిర్వాసితులెందరు? ఎక్కడా సరైన లెక్క ఉండదు. 2011 నాటి జనాభా పరిగణన ప్రకారం కశ్మీర్ లో 20 శాతం హిందువులైతే 78 శాతం ముస్లింలు. 2021 నాటికి అది 28 : 70 కి మారింది. ఇది ఎలా జరిగింది?

రాజ్యాంగంలోని లౌకిక పదం తొలగించి దేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించే దిశగా దేశమంతటా 80 – 20 పోలరైజేషన్ అమలుచేసే విద్వేష రాజకీయం జడలు విచ్చుకుంది. అధికారంలోకి రావడానికో అధికారం నిలుపుకోవడానికో అదొక నినాదమైంది. అందుకు భిన్నంగా వున్న నిష్పత్తుల్ని బేలెన్స్ చేయడానికే మతవాద రాజకీయ కౌటిల్యం జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టింది. కేంద్ర పాలనలోకి తెచ్చుకుని ఆర్టికల్ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. 35 A ఆర్టికల్ ద్వారా పొందే హక్కును తొలగించి బడా కార్పొరేట్ లకి, రియల్ ఎస్టేట్ మాఫియాకి, పర్యావరణ విధ్వంసానికి తెర లేపింది. కొత్తగా సాంస్కృతిక దాడికి పూనుకుంది. దేశభక్తి చాటున జరుగుతున్న విధ్వంసం యిది. ఇదంతా పెద్ద కుట్ర అని అక్కడి పౌరసమాజం గుర్తించింది.

“మీకు మట్టే దేశభక్తి. లాక్కోండి మా నేలను. దోచుకోండి మా పంటలను. చిదిమివేయండి మా జీవితాల్ని.” ఈ మాటల ద్వారా మతరాజకీయాల చాటున దాగి వున్న దళారీ పెట్టుబడిదారీ పన్నాగాల్ని అర్థం చేసుకోవచ్చు.

కానీ ఎక్కడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. రాయకూడదు. మాట్లాడితే, రాస్తే దేశ ద్రోహులుగా ముద్ర. అంతర్జాతీయ హక్కుల సంఘాలు యెన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం వుండదు. రాజ్యం చేస్తున్న దమనకాండ యెక్కడా రిపోర్ట్ కాదు. కాకూడదు. మన నేల మీద వొకప్పుడు బాలగోపాల్ (కల్లోల లోయ, కశ్మీర్ పై బాలగోపాల్), ఇప్పుడు మాతృక రమాసుందరి ఇఫ్టూ ప్రసాద్ వంటి మేధావులు యే వొకరిద్దరో తప్ప మాట్లాడిన దాఖలాలు లేవు. మలుపు (శ్మశాన శాంతి, కశ్మీర్ – ఆగ్రహ కారణాలు, కాశ్మీర్ : నిషిద్ధ రాత్రి), ప ర్స్ పె క్టి వ్స్ (కునన్ పోష్పోరా) వంటి సంస్థలు ప్రచురించిన వొకటీ అరా పుస్తకాల ద్వారా, సోషల్ మీడియా లో వైర్ వంటి పత్రికల వార్తా కథనాల అనువాదాల నుంచి తప్ప కశ్మీర్ లో యేం జరుగుతుందో తెలుగు సమాజానికి తెలీదు. సద్దాం హుస్సేన్ వురితీత సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాద దౌష్ట్యాన్ని తెగనాడిన కవుల కలాలు సైతం యెందుకో కశ్మీర్ విషయంలో చాలా అరుదుగా స్పందిస్తాయి.

కశ్మీర్ లో యేం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా దుర్భేద్యమైన కంచెలు నిర్మించారు. అక్కడ జరిగేదంతా ఉగ్రవాద చర్యలేననీ వాటిని అణచివేసి దేశ అఖండ సార్వభౌమత్వాన్ని కాపాడి శాంతిని స్థాపిస్తున్నామని నమ్మబలికారు. కశ్మీర్ తో దేశానికి భౌతిక దూరం కాదు. మానసిక దూరం. స్పందనా రాహిత్యం తో కూడిన నిశ్శబ్దమే అంతటా. ఘనీభవించిన ఆ శ్మశాన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది ‘ఖబర్ కె సాత్’.

“మేము ద్వేషించింది భారత పాలకుల్ని కానీ భారతీయుల్ని కాదు. కశ్మీర్ జాతీయవాదం భారతీయులనీ ద్వేషించలేదు. పండిట్లనీ ద్వేషించలేదు. పండిట్లపై దాడులు చేసింది కశ్మీర్ జాతీయ వాద ఉద్యమం కాదు. పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉద్యమం. పండిట్లు మాకు విద్య నేర్పిన గురువులు, వాళ్లు రాష్ట్రం విడిచి పోవడంతో మా రాష్ట్రం ఇప్పటికే ఇరవై ఏళ్లు చదువులో వెనకబడిపోయింది. ఒకే లోగిలిలో కలిసి ఆడుకున్న బాల్యం మాది. వాళ్లను మేము ద్వేషిస్తామా?”

సున్నితమైన సమస్యని విద్వేషం రంగరించి రాజకీయ వ్యాపారం చేసుకునే ‘కశ్మీర్ ఫైల్స్’ కి హమీద్ యిచ్చిన నికార్సయిన సమాధానం యిది. శుభోద్ కి చెప్పినట్లే యిదే మాటని అతను పాకిస్థానీయులతో కూడా చెప్పగలడు అనడానికి సందేహం లేదు. అయితే హమీద్ లాంటి వారి అస్తిత్వ వేదన దేశద్రోహంగానో భారతదేశం పట్ల ద్వేషంగానో ప్రచారమైంది.

వేలాది మంది సంవత్సరాల తరబడి యెందరో యెలాంటి నేర విచారణా లేక జైళ్లలో మగ్గుతున్నారు. ఇటీవల ఆ ఖర్చు కూడా దండగ అనుకుంటున్నారేమో మనుషులు అనాథ శవాలౌతున్నారు. ఒకప్పుడు ఎన్కౌంటర్ జరిగితే కుటుంబ సభ్యులకి శవాలన్నా యిచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. ‘శవాలతో ఊరేగింపులు తీసి ధర్నాలూ ఆందోళనలూ చేస్తున్నారని శవాల్ని కొండల్లో పడేస్తున్నారు. లేదా రహస్యంగా తగలెడుతున్నారు’. గల్లంతయిన మనుషులు చచ్చారో జైల్లో వున్నారో తెలీదు.

కథలో వడ్రంగం పనిచేసే యూసుఫ్ సమస్త జీవ శక్తులూ వుడిగిపోయిన మరో కలవరపరిచే పాత్ర. అతని కథ కూడా హానియా కథలా దయనీయమైనదే. కాకుంటే హానియా కొడుకు తిరిగి వస్తాడని యెదురు చూస్తే, అతను కొడుకు చనిపోయాడని నిర్ధారించుకుని గొయ్యి తవ్వి కొడుకు శవం కోసం యెదురు చూస్తూంటాడు. పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ ఆ గోతి పక్కనే పడుంటాడు. రాత్రికి ఇంటికి పోతాడు. మళ్ళీ పొద్దున్నే తయారు. రెండేళ్లుగా కొడుకు శవం కోసం పడిగాపులు. అతను ఏడుపు సైతం మర్చిపోయాడు ‘శిథిలమై పాక్షికంగా కూలిపోయిన ఆ గొయ్యి అడుగున పడిపోయాయి కొడుకు జ్ఞాపకాలు. ఏడుపు రావాలంటే ఆ గొయ్యి మళ్ళీ తవ్విపోయాలి’. అల్లం రాజయ్య ‘మనిషి లోపలి విధ్వంసం’ లోని తండ్రికీ యూసఫ్ కీ సారూప్యత కనిపించింది. ఒక సామూహిక విధ్వంసం మూలాల్లోకి యెంతో వుద్వేగంతో రచయితలిద్దరూ తీసుకెళ్తారు. ఎప్పుడు మొదలైంది యీ విధ్వంసం అని అడగకనే మౌనంగా జవాబులు చెప్తారు.

హమీద్ మెహనూర్ హానియా ఆమె అత్త యూసుఫ్ వీళ్ళు బిడ్డల్ని కోల్పోయిన లక్షలాది తల్లిదండ్రులకు ప్రతినిధులు. దశాబ్దాల తరబడి అణచిపెట్టుకున్న హమీద్ మెహనూర్ ల వేదన, దీనురాలైన హానియా ఓపలేని గుండె పగిలే రోదన, ఆక్రోశం పట్టలేని ఆమె అత్త శాపెన, యూసుఫ్ మూగ ఆక్రందన … వీటన్నిటి వెనక వున్న కారణం వొక్కటే. దాన్ని యెరుక పరచడమే రచయిత ఆశయం.

**

వర్తమానం – చరిత్ర కలగలిసిపోయిన కథనం యిది. శుబోధ్ కుల్వై పాత్ర ఆ కథనానికి శ్రోత. అతను మొత్తం భారతీయ సమాజానికి ప్రతీకగా/ప్రతినిధిగా వుండాలని రచయిత కోరుకుంటాడు. రచయిత ఈ కథనాన్ని పాఠకులతో స్వయంగా పంచుకోడు. కారణం యిది అతని జీవితానుభవం కాదు. మూడు తరాల పాలకులు స్వార్థంతో చేసిన రాజకీయ మోసాలకు సాక్షిగా నిలిచిన ముసలి హమీద్ ముఖత: కశ్మీర్ జాతి మొత్తం భారత దేశ పాలకులతో చేస్తున్న క్రోధోద్రిక్త సంభాషణ యీ కథ. ఆ సంభాషణలో ఫస్ట్ పర్సన్ ‘మేము’ – బాధిత కశ్మీరీ సమాజం. సెకండ్ పర్సన్ ‘మీరు’ – వారి హక్కుల్ని హరించే భారత పాలకవర్గం.

కథలో శుబోధ్ థర్డ్ పర్సన్. అతను తటస్థుడు. చెట్టూ చేమ గురించి పరిశోధన చేసుకోడానికి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చాడు. కానీ మనుషులకు దగ్గరయ్యాడు. ఫలాపేక్ష లేని స్థానిక ప్రజల ప్రేమ, ఆదరణ చవిచూసి వారిలో కలిసిపోయాడు. నెమ్మదిగా కశ్మీర్ ప్రజల అస్తిత్వ వేదన గురించి, పోరాట చైతన్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తీ ఆలోచనా పెంచుకున్నాడు. వాళ్ళ ఆక్రోశాల్ని విన్నాడు. బాధల్ని పంచుకున్నాడు. పాఠకులు కూడా శుబోధ్ లా సహానుభూతితో వున్నప్పుడే కథలోని పాత్రల దుఃఖం అర్థమౌతుంది. చరిత్ర గతి తెలుస్తుంది. రచయిత తనను తాను మరుగు పరచుకొని ఫోర్త్ పర్సన్ గా చెప్పిన శిల్పం వల్ల కథనం విశ్వసనీయతని సంతరించుకుంది. తనది కాని జీవితానుభవాన్ని కథీకరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ రచయిత తీసుకున్నాడు. కథలో వర్ణించిన జీవితాలు రచయిత ప్రత్యక్షంగా చూసినవి కూడా కావు. స్థానిక జాతీయ అంతర్జాతీయ జర్నలిస్టుల కథనాల ద్వారా, హక్కుల సంఘాల నిజ నిర్ధారణ పత్రాల అధ్యయనం ద్వారా తెలుసుకున్నవి. కశ్మీర్ విధ్వంసం వెనక వున్న రాజకీయాల్నీ వాటి సంక్లిష్టతనీ పట్టుకోగల నిజాయితీతో కూడిన పరిశీలన, మానవ హక్కుల హననం పట్ల వున్న నిష్పాక్షిక దృక్పథమే కథ ప్రధాన బలం. తన దృక్పథాన్ని పాఠకులకు చేరవేయడానికి అనుగుణమైన శిల్పాన్ని యెన్నుకున్నాడు. కథని స్థానిక వాతావరణంలోకి అందునా సంక్షుభిత సామాజిక వాతావరణంలోకి తీసుకుపోడానికి అవసరమైన నేపథ్యాన్నీ వుద్వేగాన్నీ రచయిత గొప్ప నేర్పుతో యేర్పరిచాడు.
‘లోకల్ లాల్ చౌక్’ గా పిలుచుకునే మార్కెట్ లో రొట్టెలు తయారు చేసి అమ్మే వృద్ధ దంపతుల కాందూర్ షాపు, దాని పరిసరాల్లో డిఎస్పీ స్థాయి అధికారి కాళ్లపైబడి తన వొక్కగానొక్క కొడుకుని విడిచిపెట్టమని రోదించే స్త్రీ జీవితాన్ని ఆధారం చేసుకొని ఎందరో స్త్రీల ఘనీభవించిన హృదయ వేదనకి అక్షర రూపం యివ్వడానికి రచయిత ప్రయత్నించాడు (ప్రయత్నం అని అనడానికి కారణం అది యే అక్షరాలకూ అందనిది). రాజ్యం సృష్టించిన వొక సామాజిక రాజకీయ దుర్మార్గం పట్ల తటస్థుల్ని సెన్సిటైజ్ చేయడానికి యెన్నుకున్న టెక్నిక్ యిది. చరిత్రని, సమాచారాన్ని కళాత్మక సాహిత్య రూపంగా మలచిన తీరు కశ్మీర్ సమస్యని విస్తృత పాఠక లోకానికి దగ్గరకు చేర్చడానికి దోహదం చేస్తుంది. అర్థవంతమైన ప్రజాస్వామిక చర్చకు దారులు వేస్తుంది.

హమీద్ శుబోధ్ ల సంభాషణలో ఇండియన్ యూనియన్ నుంచి కశ్మీర్ ఎప్పుడు మానసికంగా, సాంస్కృతికంగా విడిపోయిందో ప్రస్తావనకు వస్తుంది. ఇండియన్ రాజ్యాంగం పట్ల కశ్మీర్ పౌర సమాజం నమ్మకం కోల్పోయిన వైనం వ్యక్తమవుతోంది. రాజ్యాంగంలో ప్రస్తావించిన ప్రాథమిక హక్కుల్నీ ప్రజాస్వామిక సూత్రాల్నీ పాలకులు తుంగలో తొక్కినప్పుడే అక్కడ ప్రజలకు యీ దేశంతో మమైక భావన తొలగిపోయి వుంటుంది. ఇది యివాళ మొదలైంది కాదు. దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా యీ వ్యవస్థీకృత దుర్మార్గం కొనసాగుతుంది. ఇప్పుడు అది తారాస్థాయికి చేరింది. అంతిమంగా కశ్మీర్ మరో పాలస్తీనా గా తయారైంది.

ఇప్పుడు అక్కడి ప్రజలది వొకే వొక్క కోరిక. మా మానాన మమ్మల్ని బతకనివ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ‘శవాల కోసం పడిగాపులు కాసే నరకం వద్దం’టున్నారు.

తిరిగి రాని కొడుకు కోసం హానియా, బిడ్డ శవం కోసం యూసుఫ్ – వారి దుఃఖానికి అంతం పలకాలని నిశ్చయించుకుంటాడు హమీద్. ఎన్కౌంటర్ లో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి శిథిల శవం శ్మశానానికి వస్తున్న విషయం తెలుసుకుని హానియా యూసుఫ్ లిద్దరికీ అది వాళ్ళ కొడుకు శవమే అని శుబోధ్ మెహనూర్ ల ద్వారా చెబుతాడు. మెంటల్ షాక్ నుంచి వాళ్ళని బయటకు తేవడానికి అతనికి తోచిన మార్గమది. కానీ కథ యిక్కడ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. శ్మశానానికి శవం వచ్చిందని తెలుసుకుని వందల సంఖ్యలో స్త్రీలు అక్కడికి చేరుకుంటారు. ఏ ఉద్వేగాలు తోసుకొస్తాయో, యే జ్ఞాపకాలు తొలుచుకొస్తాయో, యే భయాలు తన్నుకొస్తాయో, యే అనుమానాలు చుట్టుముడతాయో, యే శకునాలు గోచరిస్తాయయో ప్రతి స్త్రీ అదే శవం దగ్గర శోకాలు. అయినవాళ్ళు వేటలో పులి బారినపడినప్పటి ఆదిమ స్త్రీల అనాది రోదన అది. శవాన్ని ఖననం చేసేటప్పుడు ఆడవాళ్లు చేసిన హాహాకారాలు మిన్నంటాయి.

‘కొందరు భర్త కోసం,
కొందరు కొడుకు కోసం,
కొందరు తండ్రి కోసం …’

ఈ ముగింపు కథని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇంతవరకూ ఫోర్త్ పర్సన్ గా వున్న కథకుడు ఫస్ట్ పర్సన్ గా మారిపోతాడు. పాఠకులతో డైరెక్ట్ గా మాట్లాడతాడు. దాంతో రచయితకీ పాఠకులకీ మధ్య దూరం చెరిగిపోతుంది. ఇప్పడు మీరూ నేనూ మనందరం శ్రోతలమే. కథలో పాత్రలమే. ఎంత మాత్రం వొడ్డున వుండి తాటస్థ్యం వహించలేం. ఆ స్త్రీల సామూహిక ఆర్తనాదంలో అందరం భాగమౌతాం. ‘ఖబర్ కె సాత్’ కథా, దాని రచయితా ఆశించిన ప్రయోజనం అదే. వస్తు శిల్ప దృక్పథాల మేలైన మేళవింపు ద్వారా సాధించిన విజయమూ అదే.

‘మమ్మల్ని మా నేలపైనే ఖననం చేశావు, సరే
మరి మా నేలనెక్కడ ఖననం చేస్తావు?’
తనను తాను వీథి కవిగా ప్రకటించుకుని కవిత్వాన్ని గోడమీద నినాదంగా మార్చి శ్రీలంక తమిళ ఈలం విముక్తిని కోరుకున్న కాశీ అనంతన్ కవిత్వ పంక్తులు యీ కథ పూర్తయ్యే సరికి వద్దన్నా గుర్తుకు వస్తాయి.

(ఇటీవల డెబ్బై యేళ్ళ యీ కవి బిజెపి కి దగ్గరయ్యాడు. పైన చెప్పిన మాటల్ని పాలకుల చెవి చెంత చేరి వినిపించగలడా?)

పి. యస్. : ‘ఖబర్ కె సాత్’ కథని పరామర్శిస్తూ కశ్మీర్ అస్తిత్వ వేదన గురించి యీ నాలుగు మాటలు రాస్తూండగా జె కె యల్ యఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ కి ఎన్నై ఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిందన్న వార్త తెలిసింది. కశ్మీర్ విముక్తి పోరాటాన్ని అణచివేయడానికి ఫాసిస్టు పాలకులు అమలుచేస్తున్న మరో పెద్ద దుర్నయం యిది. వారి ఆశయం శాంతి కాదు; బలప్రయోగం ద్వారా సాధించే ఆధిపత్యం. ఒకవైపు శాంతి కోసం యాసిన్ తో చర్చలు అంటూనే ఆయన్ని తన నేలకు, ప్రజలకు శాశ్వతంగా దూరం చేసే కుట్ర పకడ్బందీగా జరుపుతారు. “నా శరీరాన్ని చూడండి – హింస చేసిన గాయం లేని చోటు అందులో లేదు” అన్న యాసిన్ మాలిక్ మాటలు దగా పడ్డ కశ్మీర్ నేలకంతటికీ వర్తిస్తాయి. కథలో శ్రీనివాస మూర్తి చెప్పిన అసంఖ్యాకమైన యథార్థ వ్యధార్త గాథలు యింకా యిలా కొనసాగుతూనే వుండాలా? రచయితే అడిగినట్టు నీతీ ధర్మం అడుగంటి పోయాయా? అసహాయత లోంచి పుట్టిన ఆవేదన తొలుస్తూనే ఉంటుంది. ఆవేదనని జయించాలంటే యుద్ధం చేయాలి.

నిజమే; ‘యుద్ధం చేయాలంటే మనుషులు బతికుండాలి కదా!’ ఇప్పుడు కశ్మీర్ లో బతకడమే వొక పెద్ద పోరాటం.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

3 thoughts on “‘ఖబర్ కె సాత్’ – వొక సామూహిక ఆర్తి గీతం

  1. బతకడమే పెద్ద పోరాటం …ఇప్పుడు ఎక్కడైనా ..ప్రభాకర్ గారి సమీక్షలు సర్వ సమగ్రంగా ఆలోచింప చేసేవిగా ఉంటాయి …
    అనేక అభినందనలు వారికి రచయితకి ..

    ముకుంద రామారావు
    హైదరాబాద్

  2. ఎంత దుఃఖమొస్తుంది,సంజయ్ కాక్ (కాశ్మీరీ పండిట్) తీసిన డాక్యుమేంటరీలో ఒక ముసలి తండ్రి మంచుతో కప్పబడి వేలాదిగా ఉన్న సమాధుల్లో తన కొడుకు శవాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకో శవాల్నిపూడ్చి పెట్టే పనితో పొట్ట పోసుకునే పదిహేనేళ్ళ పిల్లవాడు మొదట్లో తల, మొండేలూ వీడిపోయిన శవాల్ని చూసి ఝడుసుకునే వాణ్ణని చెప్పాడు.కశ్మీరీల గుండెలవిసే జీవితాల్ని ఎత్తిపట్టిన “జష్న్” అనే ఈ చిత్రాన్ని విడుదల కానీయకుండా ప్రభుత్వ మూకలు దాడులు చేశాయి కానీ రవ్వంత నిజానికి పర్వతమంత అబద్ధాన్ని జోడించిన కశ్మీర్ ఫైల్స్ కి మాత్రం ప్రభుత్వం సైతం నీరాజనాలు పలుకుతుంది. ఎంత తేడా?

  3. భారత, పాకిస్తాన్ ప్రభుత్వాల రాజకీయ క్రీడలో కాశ్మీర్ ఒక పావుగా మారింది. కాశ్మీరు విముక్తి పోరాటాన్ని ఇస్లామిక్ శక్తులు హైజాక్ చేశాయి. ఇప్పుడు కాశ్మీరులో కనిపించే దృశ్యాలు ఆజాద్ కాశ్మీరు గా, పాకిస్తాన్ అభివర్ణించే పాక్ ఆక్రమిత కాశ్మీరులో కూడా కనపడతాయి. కానీ అవి ప్రపంచం దృష్టికి చాలా తక్కువగా వస్తాయి. కాశ్మీరు విముక్తి అంటే భారత ఆధీనంలోని కాశ్మీరే కాదు. పాకిస్థాన్ ఆధీనంలోని కాశ్మీరు కూడా.

Leave a Reply