కవిత్వం- సమాజం (క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ) : 2

7.

వర్గసమాజంలో యజమానులు చెప్పినట్లు కార్మికులు గుడ్డిగా పనిచేస్తారు.తాజ్ మహల్ నిర్మాణానికి అందరూ తలా ఒకరాయి ఎత్తినవాళ్ళే. రాయిమోయడమే వాళ్ళకుతెలుసు. తాజ్ మ హల్ నిర్మాణం జరిగినట్లు పాలకులకు మాత్రమే తెలుస్తుంది. పాలితులు ఊరికే లొంగి పనిచేస్తారు. వాళ్ళకేమీ తెలియదు. వారస్వతంత్రులు.(7) పాలకులు స్వతంత్రులు. అందువల్ల వాళ్ళ కళా వ్యాపారం పోనుపోను పూర్తిగా వాళ్ళ అభిష్టాన్ని, అభిలాషల్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ విశేష ప్రతిపత్తికి నిదర్శనంగా కన్పిస్తుంది. ఒకవర్గం మతంకోసం గాను ప్రత్యేకించడం వల్ల అది వెన్నెముక బలం మీద నిలదొక్కుకుని కళనుండి వేరు పడుతుంది. ఈవిధంగా కళ మతంనుండి దూరమవుతుంది. ఇంతకుముందే పాలకవర్గం వాళ్ళ విశ్వాసాన్ని అది కోల్పోయింది. పాలకవర్గం కంటే ఎక్కువ నిరాఘాటంగా అది ప్రజాపీడనం చేస్తున్నది. వర్గసమాజంలో మతం అవిశ్వాసం పాలవుతున్నకొద్దీ స్వతంత్రులైన పాలకవర్గం వాళ్ళ కళారుచులు విశేషాభివృద్ధి చెందుతాయి.

ఇప్పుడు పాలకవర్గంవాళ్ళ భావోద్వృత్తుల్ని అభివ్యక్తీకరించడమే కళాతత్వం అవు తుంది. ఈకాలంలో కొన్నాళ్ళపాటు ఇలా – దోచుకునే పాలకవర్గాలవాళ్ళ భ్రష్టకళాఖండాలు అటు దోపిడీ పాలయ్యే పాలితుల జానపద గాధావళులు రెండున్నూ పక్కపక్కగానే బ్రతుకుతవి. కానీ ఈ స్థితి ఎంతో కాలం నిలవదు. కవిత్వానికి ఏ మాత్రం అవకాశం లేనంతగా పాలకవర్గం అస్వతంత్ర మయి గుడ్డిదైపోతుంది. ఇక ఇప్పుడు కవిత్వం వెనుకటి నమూనాల మీద కుంటి గా నడవక, గుడ్డినడక నడుస్తుంటుంది. కళాతత్వం నశించిపోతుంది. అది కవిత్వానికి కాలం కాదు. ఇట్లా పాలకవర్గం చెడిపోతున్నకొద్దీ పాలితుల బ్రతుకులు మరింత ఘోరమవుతాయి. వాళ్ళింకా పీడింపబడ్డారు.వాళ్ళ జీవితమింకా అస్వతంత్రమయి, బానిసబ్రతుకయి యాంత్రికంగా తయా రవుతుంది. సంఘం యొక్క ఆర్ధికస్థోమత సేవ్య సేవకతత్వం మీద ఆధారపడుతుంది. జానపద కళలు కానీ, వట్టి మూఢ విశ్వాస విషయాలు కానీ కవిత్వ రూపంలో వెల్వడడానికి కూడా యాదృ చ్ఛికత కావాలి. బానిసవర్గానికి అది లేదు. బానిస సమాజానికి కళలు లేవు. కవిత్వాలు లేవు.

8.

కవిత్వాన్నుండి సంఘాన్ని వేరుపర్చలేము. అది మానవ ప్రవృత్తికి సంబంధించింది. సంఘం ప్రవృత్తిమయమైంది. కవిత్వ రహస్యమంతా ఆ ప్రవృత్తిలోనే వుంది. మానవ ప్రవృత్తి సహజాతాలైన వాసనల్ని బట్టి వుంటుంది. కాని ఇంతకంటే కూడా మానవతకు ఇంకా, చాలా దగ్గరై,మార్పు లక్షణాల్ని కలిగివుంటూ,సహజాతాలకే మాత్రమూ సంబంధంలేని ప్రవృత్తు లున్నవి. అవి తరతరానికి వరస తప్పకుండా వారసత్వంగా సంక్రమిస్తవి. ఇంకా అవి ప్రతి తరాన్ని, దానిపూర్వతరం కంటే భిన్నంగా తీర్చిదిద్దుతాయి. ఇదంతా నాగరకత. మొదటిదంతా సహజత్వం. సహజత్వంతో మానవతకూ, నాగరికతతో మానవతకూ ఏర్పడ్డ వైరుధ్యమే కవిత్వాని కవకాశం కల్పించింది. సహజత్వంతోడి మానవత్వం అంటే స్వతంత్రవ్యక్తి. వాడి మీద ఏ విలక్షణ ప్రభావమూ లేదు. నాగరిక మానవుడంటే నాగరికత వల్ల కలిగే అనేక విలక్షణ ప్రభావాలకు లోనైనవాడని అర్ధం. ఇట్లా విలక్షణత్వం లేకుండటానికి ఉండటానికి గల రాపిడి వల్లే కవిత్వానికొక అర్థం ఏర్పడింది. ఆ మేరకు కవిత్వం సత్యమని అందువల్లే అనిపిస్తోంది. కవిత్వం ఫలోత్పాదక శక్తి కలిగింది. ఇంకా అది ఆర్ధికమైన కృషి కూడా. ఈ పునాది నుండి కవిత్వాన్ని కదిలించి చూస్తే దాని తత్వం అసలర్థమే కాదు.

ఇక ప్రాచీనులు ఈ కవిత్వతత్వాన్నెట్లా భావించారో మనం గమనించాలి. ప్లేటో, అరిస్టాటిల్ తమ సమకాలంనాటి సాంస్కృతిక విషయాలనన్నింటినీ కావ్య కళతో సహా పరిశీలించారు. వారిద్దరున్నూ వర్గపోరాటం ఫలోన్ముఖం కాని కాలానికన్నా ముందటివాళ్ళే. ప్లేటో అప్పటి పాలకవర్గ ప్రతినిధి. అరిస్టాటిల్ నిత్య జీవితపు బ్రతుకు తెరువులో మొండికిబడి సాగే ప్రజావర్గానికి ప్రతినిధి.అరిస్టాటిల్ తన సమాజంలో భాషను ప్రయోజనానుకూలంగా ఎట్లా భిన్నభిన్నంగా ప్రయోగిస్తున్నదీ గమనించాడు. జనబాహుళ్యాన్ని ప్రబోధించే వేదికల మీద ప్రయోగించే భాషలో ఎంత వాక్చాతుర్యం వుంటున్నది. దాని శక్తి వల్ల వక్త సామాజికుల్ని ఎట్లా తనతో తీసుకొని పోతున్నది అరిస్టాటిల్ స్పష్టంగా చూశాడు. అది ఆనాడంతగా, సమాజంలో ప్రధానంగా వున్నది కాబట్టే వాక్చాతుర్యాన్ని గురించి అంతగా రాశాడు. మరి కవిత్వం విషయంలో సమసామాజికమైన అనుభూతే అప్పుడుండింది. ఆదిమ సమాజ లక్షణమే అప్పటికింకా వుండింది. న్యాయస్థానంలో న్యాయవాదులకూ, రాజకీయరంగంలో ప్రజానాయకులకూ శ్రోతల్ని ముగ్ధుల్ని చేసి తమ పక్షం ఆమోదించేట్లుగా వాళ్ళని ప్రబోధించాల్సి వుండటం చేత వాక్చాతుర్యం తప్పనిసరిగా నేర్వాల్సిన కళ అరిస్టాటిల్ భావించిన వాగ్వైలక్షణం కవితా ప్రచార సాధనం కాదు. మరి నిత్యజీవితంలో పరస్పర నియోజనావసరాల్లో గాని, ఉపదేశావసరాల్లో గాని భాషలో ఉపయోగించే చాతుర్యం, ముందు పేర్కొన్న ప్రయోజన సాధనం వంటిది కాదు. ముందు పేర్కొన్న రెండు స్థలాల్లో మాత్రమే వాక్చాతుర్యప్రసక్తి. తక్కిన చోట్ల కాదు. ఈ విషయాన్ని అరిస్టాటిల్ స్పష్టంగా చెప్పాడు. అలంకారికమైన భాషా శైలి వున్న ఉపన్యాస చాతుర్యం కంటే వేరుగా గేయాల్ని, రూపకాల్ని, ఇతిహాసాల్ని, ప్రేమగీతాల్ని గురించి సాహిత్య శాస్త్ర మీమాంస చేశాడు.అది, కావ్య ప్రక్రియలట్లా విడిపడ్తున్న కాలం. అందువల్లనే ఆయన కావ్య ప్రక్రియ లన్నిం టిలోనూ కనిపించే సాధారణ లక్షణమేదీ అని విచారించాడు. అదికవిత్వమవుతుందా? కాదా? అని తేల్చి చెప్పగల్గె ఏకైక లక్షణం కోసం అతడన్వేషించి కవిత్వం కథను చెబుతోందని కనుగొన్నాడు. ఇంకా అది దేవతల పద్ధతుల్ని కానీ, మానవుల పద్ధతుల్ని గురించి కానీ చెప్తున్నదనీ, కాకపోతే కవి యొక్క భావోద్వృత్తుల్ని వ్యక్తం చేస్తున్నదనీ, ఇదంతా నిజం కాకపోయినా నిజమన్నట్లు కన్పిస్తున్నదనీ భావించాడు. ఇతిహాసం అబద్దపు చరిత్ర, నాటకం – కపట నాటకం. ప్రేమ కవిత్వంకూడా ఆత్మవంచన, పరవంచనలో కూడుకున్నది. అందువల్ల గ్రీకులకు కవిత్వం వట్టి మాయగా – అందులోనూ తెలిసిన మాయగా కనిపించేది .

ఈ రకం కావ్యకళ ప్లేటోకు ఎంతో శోచనీయంగా కన్పించింది. అందువల్లనే ఆయన తన ఆదర్శ రాజ్యంలో కవులను అనుమతించలేదు. ఒకవేళ వాళ్ళను రానీయాల్సి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళ కృతులను గుణ దోషులు బాగా విమర్శించాలని నియమం చేశాడాయన. ప్లేటో ప్రతీప తాత్విక బుద్ధి. అలాంటి వాళ్ళెప్పుడూ ముఖ్యంగా సమకాలీన సంస్కృతిని నిరసిస్తూనే వుంటారు. ప్లేటో సమకాలీన సంస్కృతి ముఖ్యంగా కావ్య సంబంధమైంది. తాత్వికుడుగా ఆయన కవిత్వాన్ని నిరసించాడు. మనిషిగా దానివల్ల ఆనందాన్ని అనుభవించాడు.

కవిత్వం మాయాకల్పనమే ప్రధానంగా కల్గి వుండేదనే నిర్ణయానికి గ్రీకులు వచ్చారు. అందువల్ల కవి, బాహాటంగా మాయను సృష్టించగలదాన్నే నిర్మించడానికి పూనుకున్నాడు. నిత్యజీవితం కంటే సత్యమైన చరిత్రను నిర్మించాడు. కవి అంటే అచ్చంగా ఇట్లాంటి నిర్మాణ దక్షత వున్న వాడేనని గ్రీకులు భావించడం మొదలు పెట్టారు. ఆ భాషలో కవి శబ్దానికి వ్యుత్పత్త్యర్ధం చేసేవాడనే. చేయడం అంటే సృష్టించడం అని కూడా అర్థం. ఇలా సృష్టించడం కవులకీ, దేవతలకీ మాత్రమే తెలిసిన విద్య.(8) కాని వాస్తవ విషయ సంకేతాలైన శబ్దాల వల్ల ఒట్టి శూన్యం నుండి కవి ఏమీ సృష్టించలేడు. మొదటగా కవి వాస్తవికత్వానికి కృత్రిమమైన అనుకరణాన్ని తయారు చేస్తాడని వాళ్ళభిప్రాయపడ్డారు. ప్లేటో దృష్టిలో కవి అన్నవాడు వాస్తవ జీవితానికి అనుకరణాన్ని సృష్టించి శ్రోతల్ని తాను సృష్టించిన ఛాయా ప్రపంచంలో మోసపుచ్చే వాడు. ఈ అనుకరణ సిద్ధాంతమే సభాసంభాషణా చాతుర్యం నుండి కవిత్వాన్ని వేరుపరచడానికి అరిస్టాటిల్ కు అవకాశాన్నిచ్చింది. ఇప్పటి మన ఆధునిక మనస్తత్వానికి అప్పటి నుండి ఇప్పటి దాకా వచ్చిన సాహిత్యంలోని మార్పుల వల్ల ఆయన చేసిన వేర్పాటు సర్వసమగ్రంగా కన్పించదు. అయినప్పటికీ అది ఆనాడు అరిస్టాటిల్ కాలానికి యుక్తమైందే.

మనం కవిత్వాన్నినవల, నాటకాల కంటే భిన్నంగా చూస్తాం కదా! అరిస్టాటిల్ అట్లా చూడడు. సాహిత్య ప్రక్రియలు శాశ్వతాలు కావు. జీవ శాస్త్ర శాస్త్రీయ విభాగాలే శాశ్వతాలు కావు. సాహిత్యం, జీవశాస్త్రం రెండూ మారుతుండాల్సిందే.ప్రాణికోటి పరిణామం కంటే శీఘ్రంగా సంస్కృతీ పరిణామం జరుగుతుంది. అందువల్ల -సంస్కృతీ సంప్రదాయ విమర్శనాన్ని తగినట్లుగా మార్పుల్ని, చేర్పుల్ని తనలోకి రానిస్తుండాలి. కళా ప్రయోజన పద్ధతుల్ని మనం సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి అరిస్టాటిల్ అనుకరణ సిద్ధాంతం అత్యంత ఉపయోగ మైంది. అరిస్టాటిల్ దృష్టి కావ్యంమీద అంటే నాటకం మీద లగ్నమైంది. దానివల్ల ప్రభావితులైన వాళ్ళతోటి ఆయనకు పనిలేదు. దాన్ని సృష్టించిన వాడితోటీ ఆయనకు అంతగా పనిలేదు. ఆయన కావ్యానుశీలన పద్ధతి చక్కని రసదృష్టితో వుంటుంది. దీనికి ప్లేటో వ్యతిరేకం. రచన అంత ముఖ్యం కాదు. కవి ముఖ్యం. శ్రోత కూడా ముఖ్యమే. లేఖనం కనుగొన్నతర్వాత సమష్టి నుండి వ్యష్టికి కవిత్వం మార్పుచెందుతున్న కాలంలో ఆదిమ సమాజంలో కవి ప్రయోజనాదుల్ని గురించి అధికారికంగా కొంతవరకైనా చెప్పేటట్లు చేసేది సంస్కృతి కాదు. గ్రామ్యతే. ఎంతో ప్రతీపబుద్ధి కలిగి వున్న ప్లేటో విషయంలో కావ్య నిర్మాణం చేయగలిగే మానసిక విజ్ఞానం చాలా ప్రాథమిక విషయమే.

‘ప్లేటో పూర్వకాలపు మనిషి. తన కళ్ళముందు వచ్చిన మార్పుని కూడా ఆయన గమనించలేదు. అంతకుమునుపు లాగా అతని కాలంలో కవిత్వమంటే ట్రాజెడీయేకాదు. ప్రేక్షకులూ, నటులూ అందరున్నూ కలిసి మిక్కిలి ఉత్సాహంతో జరుపుకొనే ఒక సామూహికోత్సవం. అందరూ కలిసి విహరించే ఒక కళాప్రపంచం అప్పటి ట్రాజెడీ. ప్లేటో కాలంలో స్థితివేరు. సామూహికమైన సంఘజీవితం నుంచి విడిపోయిన వ్యక్తులు లేక వ్యక్తుల గుంపులు అనుభవించడం కోసంగాను కావ్యాలు సంఘం నుంచి తొలగిపోయి చాలా దూరం నిలబడ్డవి. లేఖనం కనుగొనడం ఈ విషయంలో చాలా మార్పులకు దోహదం చేసింది. లేఖనం వచ్చినందువల్ల బహువిషయాల్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. జ్ఞాపకం ఉంచుకొన్నవాడు చెప్పడం మిగిలినవాళ్ళు వినడం పోయింది.

రాసి పెట్టిన విషయాలను ఎవరికివారు చదివి తెలుసుకోగల్గుతున్నారు. కవిత్వం రాత రూపంలో వ్యక్తమవుతోంది.అది సామూహికమైన సంఘశక్తిచేత ఉత్పన్నం కాదు. అట్లాగే అనుభవం సందర్భంలో కూడా సంఘసమూహంతో దానికి నిమిత్తంలేదు. ఒంటరిగా ఎవడికి వాడు దాన్ని చదువుకొని అనుభవించవచ్చును. కాని ప్లేటో ఈ మార్పుల విషయం పట్టించు కోలేదు. వర్గభేదమేర్పడని సమాజంలో సామూహికోత్సాహాల కాలానికి ఆయన విమర్శనలు సరిపోతాయి. అవి సత్యాలే. కాని పనికిమాలినవి. ఎందుకంటే తాను నిరసిస్తున్నవి తనకాలంలో వచ్చిన వర్గసమాజంయొక్క ఆర్థికవిధానం లక్షణాలని ఆయన గుర్తింపలేకపోయాడు. అందువల్లే ఆయన ముందుకుసాగి వర్తమాన సమస్యలకు ఒక పరిష్కారమార్గ స్థితిని పొందలేకపోయాడు. ఈ సమస్యలు పుట్టని కాలానికి – అంటే వెనుకకు సాగి చేరుకొన్నాడు. చరిత్ర అనే గడియారపు ముల్లును ఎవ్వడూ వెనక్కు తిప్పలేదు.

ఫాసిస్టు తాత్వికుల్లో ప్లేటో చాలా నాగరికుడు. ఎంతో మానవతా దృక్పథం ఉన్నవాడు. ఈనాటి ప్రతీపతాత్వికులలో ఎవ్వడు కూడా ప్లేటో అంత నాగరికుడు కాడు. ఆయనలాగా చిత్తాకర్షణ చేయగలిగే వాడున్నూకాడు. ప్లేటో కవిని గురించి ఇలా భావించాడు. “నిన్ను కదిలించేది ఒక దైవీశక్తి ప్రభావం. అది ఆయస్కాంత శిలలోని ఆకర్షణ శక్తిలాంటిది. ఈ శక్తి చాలా విచిత్రమయింది. అది ఒక్క ఇనుప వస్తువుని ఆకర్షించడం మాత్రమేకాదు తాను ఆకర్షించిన దానికి మరింకొక దానిని ఆకర్షించే శక్తిని అది ప్రసాదిస్తుంది. అయస్కాంత శక్తి ఆవిధంగా తనప్రభావం లోకి వచ్చిన ఇనుప కొక్కేలన్నింటిగుండా తాను సంచారంచేసి వాటన్నింటినీ ఒక్క గొలుసుగా కలుపుతోంది. వాగ్దేవత అయస్కాంత శక్తిలాంటిది. అది ముందు కవికొక ఆవేశాన్ని కల్గించి అతనిద్వారా అలాంటి సమానధర్ములనందర్నీ ఆవేశపరుస్తుంది. ఆవిధంగా కవిని, సహృదయసమాజాన్ని వాగ్దేవత తన శక్తిచేత నిబంధించుతుంది”. మనమిప్పుడు బ్రహ్మాండంగా మెచ్చుకొనే మనపూర్వకవుల కావ్యాలు- కావ్యకళానియమానుసారంగా రచించటంవల్ల గొప్ప దనాన్ని పొందలేదు. అవన్నీ వాగ్దేవతా ప్రసాదంవల్ల సిద్ధించిన మహావేశంచేత నిండిన కవి హృదయం తంత్రీలయాన్వితమైన భాషలో ఆవిష్కరించిన భావానుభూతులు.

ఆవిధంగా కవులు దైవీప్రేరణ పొందిన స్థితిలో మహాకావ్యగీతాలు ఆవిర్భవిస్తాయి. ఈ ఆవేశంలో వున్నప్పుడే శ్రోతల్ని ఉర్రూతలూగించే మధుర నాదావిష్కారం జరుగుతుంది. పూనకం వచ్చిన జానపదులు ఆవేశించిన దేవతాప్రభావంతో ఆద్భుతాల్ని ప్రదర్శిస్తారు. తేనెల్ని, పాలనీ నదుల్లోంచి దోసిళ్ళతో తాగిస్తారు. ఆవేశంపోయి మామూలు స్థితికి వచ్చినప్పుడు పాలులేవు గీలులేవు. వట్టినీళ్ళే మిగిలేది. కవుల హృదయాల్లో ఈ పవిత్రాద్భుతశక్తి ఉంది. ఉందని కవులే చెప్తారు. కవిహృదయాలు భ్రమరాల లాంటివి. భావ కుసుమాలు రాలిరాలి అవి ఉద్యానవనాల్లో తేలితేలి, పచ్చిక బయళ్ళలో సాగిసాగి, స్వాదుకవితా మధుమాధుక ప్రవాహాల్లో మునిగిమునిగి మదించిన, బరువైన, నెమ్మదియైన, సుందరమైన నడకల్లో శ్రోతల్ని చేరి సంతోషపెడతవి. అట్లా భావతీవ్రాకృతి అయిన కవి హృదయం సత్యాన్నే పలుకుతుంది. లోకాతిశాయి అయిన చిత్తవృత్తుల్ని కవి కలిగి ఉంటాడు. రెక్కలు కట్టుకొని మహోన్నతమైన సీమలకు ఎగర గల్గుతాడు. పుణ్యశీలుడు. అలాంటి భావావేశంతో నిండేటంతవరకు కవి కవిత్వం రాయలేడు. హేతు విచారణ బుద్ధిలక్షణం ఉన్నంత వరకెవ్వడూ కవిత్వం చెప్పలేడు. భవిష్యత్తును దర్శింపలేడు. దైవీశక్తి ప్రేరితుడు కావడాన్నిబట్టి, కావ్య సరస్వతి వారికి ప్రసన్నురాలు కావడాన్ని బట్టి కవులల్లో అంతస్తులుంటాయి. ఆప్రేరణ, ఆ ప్రసన్నత లేకుంటే వాళ్ళు చేయగల్గిం దేమీలేదు. వాళ్ళెందుకూ పనికిరారు. ఇట్లా అనడం ఎందుకంటే వాళ్ళు తాము చదివి సంపాదించుకొన్న కావ్యకళాలక్షణ వ్యుత్పత్తి మీద ఆధారపడికాదుకవిత్వం చెప్పేది. అంతర్వాణి ప్రభావంయొక్క అవేశ తీవ్రబుద్ధితో చెప్తారు. శాస్త్ర నియమానుసరణంతో ఏ విషయాన్నైనా పట్టుకొని మంచి కవిత్వం రాయగల్గడం వాళ్ళకు తెలియదు. కవులకీ, మతప్రవక్తలకీ, ఎరుకతలకీ, భగవంశుడు హేతువిదారణ బుద్ధిని పూర్తిగా పూజ్యం చేశాడు. ఎందుకంటే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, తన మహిమల్ని వ్యాఖ్యానించి ప్రదర్శించడానికి అలాంటి వాళ్ళే కావాలి కనుక పరమాద్భుతంగా రచనలు చేసే వాళ్ళు భగవత్ప్రేరణ వల్లనే మనకోసం కవిత్వం చెప్తారు.

శ్రోతల చిత్తాన్ని వశపర్చుకోగల్గిన చమత్కారమైన వాగ్వివ్యాసం నుంచి ఇక్కడ ప్లేటో కవిత్వాన్ని వేరేగా చూపించాడు. ఆ చమత్కారమైన వాగ్విన్యాసానికి కొన్ని రచనా నియమా లున్నాయి. దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్లేటో దృష్టిలో కవిత్వం తెలిసిచేసే పనికాదు. తెలిసి చేస్తే దానికో నియమం. ఒక ఆలోచన ఉంటాయి. కవిత్వానికి అవి లేవు, భగవదావేశంవల్ల కవి త్వం వస్తుంది. ప్లేటో కవినీ, మత ప్రవక్తను , ఎరుకతనీ సమానంగా చూశాడు. ఆదిమ సమాజం నాగరకతని సమీపిస్తున్న దశ. ప్లేటో ఈ ఆవేశం కవికేకాక పాఠకుడికి కూడా వుండాలని చెప్పాడు. కవిని గురించి ప్రసంగించేవాడూ, కవియొక్క కవితా ప్రభావం సోకిన భావుకుడున్నూ భగవదా వేశపూరితులు కావాలి. కవిత్వ రచనేకాక దాని అనుభావం కూడా వ్యక్తి చైతన్యమూలకం కాదనేదే దీనికంతటికీ తాత్పర్యం. మాయ చేయడంకూడా ప్లేటోకు ఒక రకం మంత్ర విద్యావేతృత్వమనే అభిప్రాయం. కవులు మాంత్రికులు. వాళ్ళు మతానికి సంబం ధించిన శక్తుల్ని మాత్రమే ప్రదర్శి స్తుంటారు. ప్లేటో చెప్పిన అయస్కాంత శక్తి విషయాన్ని బట్టి కూడా ఆయన ఆదిమ మానవ సమా జంలోని సమూహ లక్షణాలచేత కూడిన కవిత్వాన్ని గురించే మాట్లాడ్తున్నట్లు స్పష్టమౌ తుంది.ఆయన దృష్టిలో వున్నదదే. ఆయన ఆదర్శవాది. కావ్య ప్రయోజనం కంటే కూడా కావ్యానందం ఆయనకు ముఖ్యం. అరిస్టాటిల్ ఈ విషయంలో ప్లేటోకు వ్యతిరేకి.

అరిస్టాటిల్ కి కవి హృదయంతో నిమిత్తం లేదు. కావ్య నిర్మాణాన్ని, కావ్యానుభావాన్నీ వ్యక్త చైతన్యం చేస్తుందా? అవ్యక్త చైతన్యం చేస్తుందా? అనే విచారణ ఆయనకు అక్కరలేదు. నిర్మిత కావ్యమే ఆయనకు ముఖ్యం. దాన్నిబట్టే విమర్శా, విచారాలు ఉండాలని ఆయన చెప్తాడు. వాటినావిధంగానే ఆయన క్రమబద్ధం చేసి, విషయానుగుణంగా చేసి కావ్యమంతా కొన్ని నియమాలకు లొంగివచ్చేటట్లుగా చేస్తాడు. అందువల్ల అనుకరణ సిద్ధాంతం నిరాఘాటంగా అంగీకరింపదగిన హేతువుల్ని అన్వేషించి సూత్రీకరించినట్లుగా ఆయన రచించాడు.ప్లేటో కంటే అరిస్టాటిల్ ఒక అడుగు ముందుకు వేసి ట్రాజెడీ యొక్క సాంఘిక ప్రయోజనం ఏమిటని ఆలోచించాడు. అది కెథర్సిస్ అని చెప్పాడు. కానీ ఆ మాటకు స్పష్టార్థ ప్రతిపత్తి లేదు. కొందరు ఫ్రాయిడ్ అనుయాయులు అరిస్టాటిల్ చెప్పిందిఫ్రాయిడ్ ప్రవచించినటువంటి ‘థెరపీబై ఆబ్రియాక్షన్’ కంటే భిన్నం కాదన్నారు. కానీ అది వేరు. ఇది వేరు, అట్లా చెప్పడం రెండింటికి సంబంధించిన మిడి మిడి జ్ఞాన లక్షణం తప్ప మరేమీ కాదు.

కావ్య ప్రయోజనాన్ని గురించి మనకొక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడి, అరిస్టాటిల్ అభిప్రాయాల్ని మన వాటితో పోల్చిచూచుకోగలేటంతవరకూ అరిస్టాటిల్ కెథర్సిస్ ను గురించి మనమంతగా దూరం పోయి విచారించకుండుటయే మంచిది. ట్రాజెడీ విషయంలో ఆయన చూచిందిది. ప్రేక్షకునిలో సుఖకరాలు కాని భయము, ఆతురత మొదలైన అనుచిత వృత్తుల్ని ట్రాజెడీ కల్పిస్తున్నది. ఇంకా అది ప్రేక్షకుల్ని ఆ అనుభవానికి తిరిగి ఆకర్షిస్తున్నది. ఆ అనుభవం సుఖకరం కాకపోయినప్పటికీ ప్రేక్షకులు మళ్ళీ వస్తున్నారు. కనుక వారికది కొంత మంచి చేసిందనే చెప్పాలి. మింగడానికి చేదైన మందులు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నవి కదా! అందువల్ల అరిస్టాటిల్ ట్రాజెడీలు ప్రేక్షకుల హృదయ మాలిన్యాల్ని ప్రక్షాళనం చేసి మనస్సుని నిర్మలం చేస్తవని భావించి వుండొచ్చు. ఒక విరేచనం మాత్ర కడుపులో కుళ్లును బయటకు నెట్టివేసి కడుపును శుభ్రపరుస్తోంది కదా! ఇంత వాస్తవిక దృక్పథంతో అరిస్టాటిల్ ట్రాజెడీ ప్రయో జనాన్ని భావించడం ఆరోగ్యకరమైన మంచి విమర్శనాపద్ధతి. అది అచ్చమైన గ్రీకు పద్ధతి. ట్రాజెడీ కనుక ప్రేక్షకుల్ని నిర్మలచిత్తులుగా, అంతకుముందుకంటే సుఖంగా వుండడాన్ని భావింపజేయజాలకపోతే అది ట్రాజెడీ అయినా కూడా చెడ్డదనే అర్ధం.

వర్గభేదంఅప్పుడే మొదలవుతున్న కాలంలో బుద్ధిమంతులైన గ్రీకులసాహిత్య దృక్పధం ఇది. సభా వేదికలమీద నుండి శ్రోతల్ని ఉర్రూతలూగించే గంగాప్రవాహం లాంటి వాక్య విన్యాసం యొక్క విలక్షణమైన విజ్ఞానంతో భాషాప్రయోగ నైపుణ్యం మంత్రముగ్ధుల్ని చేసే సంభాషణా చాతుర్యం ఇదంతా ఒక కళ. తెలిసి, నేర్చి, అభ్యసించాల్సింది. ఇంకోటి కావ్యకళ. అది అనుకరణ కళ. వాస్తవానుకరణ శీలమైన కావ్యకళ. అది విన్నవాళ్ళల్లోనూ, కన్నవాళ్ళల్లోనూ భావ అనుభావ తీవ్రతను బట్టీ దాని విలువలు నిర్ణయమౌతాయి. ఈ విషయంలో ప్లేటో, అరిస్టాటిల్ ఇద్దరూ ఏకీభవిస్తారు. కానీ ప్లేటో మాత్రం ఆ తీవ్రత కావ్య నిర్మాణ దశలోనూ, అనుభావ దశలోనూ కూడా నియమాలననుసరించడం వల్ల సాధించలేమనే భావిస్తాడు. వ్యక్త చైతన్యం పరిధికి అవతలే కావ్య నిర్మాణమూ అనుభవ ప్రశస్తి రెండున్నూ జరుగుతాయని ఆయన విశ్వాసం. మరి ప్లేటో, కావ్యానికి సాంఘిక ప్రయోజనం వుంటుందని అనుకోనే అనుకోడు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకునే అరిస్టాటిల్ కావ్య శ్రవణం వల్ల కానీ, దర్శనం వల్లగానీ కలిగే తీవ్రమైన భావ అనుభావాలు సాంఘిక ప్రయోజనాన్ని సాధిస్తాయని చెప్పాడు. కెథార్సిస్ ది ఆ ప్రయోజనమే.ఆ మాత్రపు ప్రయోజనదృష్టితో చేసిన కావ్య నిర్వచనం ఈ కాలానికి పనికిరాదు. గ్రీకులు తప్పు చెప్పారనికాదు పనికిరాదనడం. సంఘం మారిపోయింది. ఈనాడు అరిస్టాటిలే కనుక వుండి నేటి సాహిత్యాన్ని క్రమబద్ధం చేసి వింగడిస్తున్నట్లయితే ఆయన తన అనుకరణ సిద్ధాంతం ఈనాటి సాహిత్య ప్రక్రియలన్నింటినీ ఒక గాటికి లాగి కట్టించడానికి అవకాశం లేకుండటాన్ని తప్పక చూసికొని వుండేవాడు. అది ఆయన సిద్ధాంతంలోని లోపం కాదు. సాంఘిక పరిణామ మహస్సు సాగిన యింతకాలం మీద కొత్త కొత్త ప్రక్రియలెన్నో పుట్టుకొచ్చాయి. అందువల్ల అన్నింటికీ అనుకరణ సిద్ధాంతం పట్టదు. ఆధునిక కాలంలో వచ్చిన నవల-నాటిక – ఈ రెండు ప్రక్రియల్లోనూ వాస్తవిక సత్యానుకరణం వుంది. మనం కవిత్వమని దేన్ననడానికి అందరమూ అంగీకరిస్తున్నామో అది నవలా నాటకాలకంటే భిన్నమైంది. దాని ప్రత్యేకత్వాన్ని మనం కనుగొనాలి. ఇక మీదట మనమా ప్రయత్నం చేద్దాం.

కానీ అరిస్టాటిల్ చెప్పిన నిర్వచనాన్ని బట్టి మనం కవిత్వ మూలతత్వాన్ని విచారిస్తే ఇతర సాహిత్యమంతా కవిత్వమే కాబట్టి, విస్మరించలేము. భౌతిక దృక్పథంతో సంస్కృతీ సంప్రదాయ అధ్యయనం చేస్తే మనం ఆ విస్మరించడమనే పొరపాటు చేయనే చేయము. మతము-సాహిత్యము మొత్తం ఒక కవిత్వ రూపంలోనే వున్నకాలం ఒకనాడుందని మనకు తెలుసును. అయినా ఆధునికులుగా పెట్టుబడిదారీ యుగంలో నివసించే జనంగా మనం ముఖ్యంగా బూర్జువా కవిత్వతత్వాన్ని అధ్యయనం చేయాలి. ఆధునిక కవిత్వాభివృద్ధికి సంబంధించిన స్థూల చారిత్రక దృక్పథంతో అధ్యయనం దీని తర్వాత చేద్దాము.

9.

ఆధునిక కవిత్వం అంటే అది బూర్జువా కవిత్వం అనే అర్థం. ఇంతకూ మనం దేన్ని ఆధునికత అంటున్నాం. పదిహేనవ శతాబ్దం నుండి నేటి వరకూ యూరపుఖండంలో అభివృద్ధి అయిన నాగరికత యొక్క మొత్తం ప్రత్యేకత్వాన్ని ఆధునికత అంటున్నాము. ఈ ప్రత్యేకత ఒకానొక ఆర్ధికమైన పునాదిబలం మీద ఆధారపడివుంది. ఈ ప్రత్యేకత ఇంకా మార్పు లక్షణాన్ని కలిగివుంటుంది. ఆర్ధికమైన పునాదులు పాలెగాండ్ర (ఫ్యూడల్) నుండి పారిశ్రామికులవైపుకు మారినవి. ఈ నాగరికత యొక్క ప్రత్యేకత ఉత్పత్తిలో బూర్జువాలు తెచ్చిన విప్లవ స్వరూపానికి సంబంధించింది. ఈ విప్లవ స్వభావాన్ని మార్క్స్ సంపూర్ణంగా విశ్లేషించి దాస్ కాపిటల్లో వివరించాడు. ఆ లెక్కలో ఆధునిక కవిత్వం అని మనం అనేది పెట్టుబడిదారీ కవిత్వమే. ఈ ఆధునిక కవిత్వం మనకు చక్కగా అర్ధం కావాలంటే దీన్ని మనం గతితార్కిక చారిత్రక దృక్ప థంతో అధ్యయనం చేయాలి. అలాకాకుండా కవిత్వాన్ని చైతన్య రహితమూ, జడమూ అయిన కళగా భావించి అధ్యయనం చేస్తే అది ఆ విధంగా మాత్రమే మనకు అర్ధం అవుతుంది. అది బొత్తిగా వ్యర్ధమైనపని. విపరీత చైతన్యం వున్న సంఘ శక్తి చేత ఉత్పన్నం అయిన కవిత్వం ఉన్నప్పుడు దాన్ని అసలట్లా అధ్యయనం చేయనేకూడదు. అందువల్ల అట్లా చేయడం వ్యర్థం. కానీ బూర్జువా నాగరికత కాలంలోని కవిత్వాన్ని అధ్యయనం చేయడం అంత సులభసాధ్యమైన పనికాదు. ప్రపంచంలోని చాలా జాతులు, చాలా భాషలు బూర్జువా నాగరికత యొక్క మహోద్యమంలో భాగస్వామ్యాన్ని పొందాయి.ఏదేమైనా కవిత్వాన్ని అర్ధం చేసుకొని ఆనందించాలంటే అది ఏ భాషలో రాసివుందో ఆ భాషలో అత్యంతమైన అభినివేశంతో గాఢమైన పరిచయం వుండితీరాలి. సాహిత్యప్రక్రియలన్నింటిలోనూ ఒక్క కవిత్వానికే ఈ ప్రత్యేకత వుంది(9).

ఇంగ్లాండ్ లోని బూర్జువాలే మొట్టమొదట ఆర్థిక విప్లవాన్ని తెచ్చారు.వాళ్ళను చూసే తక్కిన దేశాల వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరించారు. క్రీ.శ. 1789- 1871 సంవత్సరాల మధ్యకాలంలో ఫ్రాన్స్ దేశంలో ఈ బూర్జువా విప్లవం ఇంగ్లాండ్ లో కంటే ఒక ప్రత్యేక మార్గంలో సాగింది. దాని గమనంలో ఒక విపరీతమైన వేగం వుంది. దాని స్వరూప స్వభావాల్లో ఒక స్పష్టమైన ప్రతిపత్తి వుంది. దాని ప్రవృత్తిలో ఒక గట్టితనం వుంది. దాని ఆదర్శ స్వరూపం ఎక్కువ గందరగోళం పట్టిన దాని విపరీత వేగం వల్లనే. బూర్జువా సాహిత్యాన్ని మొత్తంగా అధ్యయనం చేయడానికి ఆ కాలంలోని ఫ్రాన్స్ విప్లవం ఎంతో ముఖ్యమైనది. కేవలం కవిత్వా ధ్యయనానికి అయితే ఇంగ్లాండ్ విప్లవం ముఖ్యం. ఆధునిక కవిత్వంలో వైవిధ్యానికి, విస్తృతికి ఇంగ్లాండే బాగా దోహదం చేసింది. అది ఇంకా మూడు శతాబ్దాల పాటు ప్రపంచ రాజ్యాల్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు అభిముఖం చేసి నడిపించింది. ఆ కాలంలో ఆయా దేశాల్లోనే ఈ ఆధునిక కవిత్వం అభివృద్ధి అయ్యేటట్లుగా కూడా అది చూసింది. ఆ ఆర్ధిక వ్యవస్థా, ఈ కవిత్వాభివృద్ధి రెండున్నూ పరస్పర సంబంధం లేనివికావు. చారిత్రకగతిలో ఆ సంబంధంతో వృద్ధి కావడం ఒక భాగం. చారిత్రకంగా బూర్జువాలు ఎంతో విప్లవాత్మకమైన పాత్ర నిర్వహించారు.

సంఘ జీవితంలో అధికారికంగా తమది పైచెయ్యి అయినప్పుడు బూర్జువాలు పాలెగాళ్ళనూ, పురోహిత వర్గాన్ని అణగదొక్కారు. ఆ విషయంలో కొంత నిర్దాక్షిణ్యంగా కూడా ప్రవర్తించారనవచ్చును. ఇంకా బూర్జువాలు ఉత్పత్తి సాధనాల విషయాలకూ, దాని ద్వారా ఉత్పత్తి సంబంధాల విషయంలోనూ, వాటితో బాటు సాంఘిక వ్యవస్థ విషయంలోనూ తరచుగా విప్లవాన్ని కొనితెస్తుంటారు. దాన్ని తేకుండా వాళ్ళు బ్రతకలేరు. ఉత్పత్తి విషయమైన నిరంతర విప్లవం, అనివార్యమైన సాంఘిక వైపరీత్యాలు, ఎడతెగని అనిశ్చిత పరిస్థితులతో ఆందోళన ఇవి బూర్జువా యుగాన్ని ముందు వెనుకల నుండి వేరు చేసి ప్రత్యేకంగా చూపేవి.పెట్టుబడిదారీ కవిత్వం ఈ విషయాల్ని ప్రతిబింబిస్తుంది. ఈ పరిస్థితుల నుంచే ఆ కవిత్వం పుట్టుకొని వచ్చింది. భేదభావం లేని ఆదిమ సమాజం యొక్క మనోమయ కోశం నుండి కవిత్వం ఆవిర్భవించింది. కవిత్వానికి అందువల్లే పౌరాణికత్వం ఏర్పడింది. వర్గ సమాజం ఏర్పడిన తర్వాత కవిత్వం పాలకుల చేతి కళ అయి మత విషయమైన సంబంధాల నుండి వేరు పడింది.

బూర్జువా ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తి సాధనాల్లో ఎట్లా తరచుగా నిరంతర విప్లవం వస్తుందో అట్లాగే కళాభిరుచుల విషయాల్లోనూ తన విశ్వాసాన్ని, సంకేతాన్ని అది తరచు మార్చు కొంటుంది.ఇంతకుముందు చెప్పిన అన్ని విషయాలకు సంబంధించిన హేతువులలోని ఔచిత్యం – అనిశ్చితత్వం వల్ల కలిగే ఆందోళన – ఇవి బూర్జువా కళాత్మకతను అంతకు పూర్వం నుండి వేరు చేసి చూపుతాయి. బూర్జువా కళాకారుడెవరైనా తన కాలం భావ తీవ్రతల్ని ఎంత పట్టుకొని తరానికి తరం కృషి చేసినప్పటికీ అది పాండిత్య రూపాన్ని పొంది, ప్రాణరహిత మవుతుంది. ఆధునికాంగ్ల కవిత్వమంతా అట్లా తయారయిందే.

కవిత్వం పుట్టుక మనకు తెలుసును. అది ఊరి పండగల్లో సామూహికమైన భావోద్వృత్తుల నుండి పుట్టింది. అది ఆర్థికమైన సర్దుబాట్ల అవసరాల చేత నియతమవుతున్న సంఘ సామూహిక చైతన్య ప్రతిబింబం, అదొక వర్గ సమాజ నాగరికత, దాని వ్యక్తిత్వమే దానిని సంపాదించింది. అయితే బూర్జువా తత్వం కవిత్వానికి అనుకూలమైంది కాదు. వ్యతిరేకమైంది కూడా. ఏమంటే కవిత్వం సామూహిక లక్షణం నుండి రావాలి. బూర్జువాతత్వం వైయక్తిక లక్షణం నుంచి బయలుదేరింది. అందువల్లే ఆ రెంటికీ పొత్తుపొసగేటట్లుగా కనిపించడం లేదు(10).

బూర్జువా తనని ఒక మహా పురుషుడుగా భావిస్తాడు. తానే సర్వతంత్ర స్వతంత్రం కోసం పోరాడుతున్నట్లుగా అనుకొంటాడు. సాధారణ మానవుణ్ని, స్వేచ్ఛగా పుట్టి బతుకంతా బంధనాలతో బతికే వాడ్నీ, బంధించి పెట్టే అన్ని సాంఘిక సంబంధాలతోనూ తానొక్కడే వైయక్తికంగా ఎదురు తిరిగి పోరాటం సాగిస్తున్నట్లు తనను తాను విశ్వసిస్తాడు. నిజానికి అతని వైయక్తికత సశాస్త్రీయమైన ఎడతెగని అభ్యుదయాన్ని సాధించదు. అందువల్ల అతడు సాధించే స్వాతంత్య్రం అంతంతమాత్రంగానే వుంటుంది. పాలెగాండ్ర సాంఘిక వ్యవస్థపైన బూర్జువాలు చేసిన తిరుగుబాటువల్ల సంఘంలోని ఉత్పాదక శక్తులకు కొంత స్వేచ్ఛ లభిస్తోంది. వాటి వైయక్తిక ముద్ర బూర్జువా ఆర్ధిక మౌలిక విధానంలోని నిరంతర విప్లవ దృష్టిని ఇంకా అధికంగా పెంచుతుంది.

బూర్జువాకవి కూడా తన వ్యక్తిత్వం వైపే తాను చూసుకొంటాడు. తన హృదయాన్ని ప్రకటించుకోవడం ద్వారా స్వాత్మ దర్శనాన్ని అతడు అభిలషిస్తాడు. ఇది బూర్జువా పగటి కల. తానొక్కడే ఈ దృశ్య ప్రపంచ నిర్మాతను అనేటటువంటి కల అది. బూర్జువాలకు తమ వ్యక్తిత్వం మీద ఇంత ప్రత్యయం ఏర్పడ్డానికి హేతువు పాలెగాళ్ళ సాంఘిక మర్యాదల్ని తుడిచి పెట్టాలనే కోరికే. ఆ కోరికే ఉత్పత్తి సాధనాల విషయంలో బ్రహ్మాండమైన శాస్త్రీయ అభివృద్ధినీ, ప్రగతిని సాధించింది. ఆ విధంగానే కవిత్వంలో, రచనా శిల్ప విషయంలో గణనీయమైన ప్రగతిని బూర్జువా వ్యక్తిత్వదృష్టి సాధించింది. కాని ఇందులో అభ్యుదయ పథంలో పయనించే లక్షణం లేదు. త్వరలోనే పెట్టుబడిదారు తన అహంకార దృష్టి తన సర్వతంత్ర స్వతంత్రత పట్టి యుద్ధోన్మాదాన్ని,అరాజకొన్ని, ఆర్థికమాంద్యాన్ని, విప్లవాన్ని మొదలైన వాటిని మాత్రమే సృష్టిస్తున్నట్లు తెలిసికొంటాడు. అతడు ప్రవేశపెట్టిన యంత్రం, తన వస్తూత్పాదక శక్తి తీవ్రత చేత చివరకు అతన్నే భయపెడ్తుంది. మార్కెట్ కూడా ఒక భయంకరమైన ప్రకృతిశక్తిగా తయా రవు తుంది. అప్పుడది చేలో పడ్డ గుడ్డెద్దులాంటిది.

ఆ మార్కెట్ ద్వారా పెట్టుబడిదారు తన తోటి పెట్టుబడిదారుని శంకరగిరి మాన్యాలు పట్టిద్దామని చూస్తాడు. నిరంతరం వదలకుండా అతడీ ప్రయత్నాన్ని చేస్తూనే వుంటాడు. దాని ఫలితంగా నిన్నటి స్వతంత్ర వృత్తివాడు రేపు ఫ్యాక్టరీ పనివాడవుతాడు. ఈ సంవత్సరం సొంతంగా కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసేవాడు, మరుసటి సంవత్సరం దాన్ని మానుకొని ఎక్కడో ఒకచోట స్టోరు మేనేజరవుతాడు. ఈ వారం బడ్డీకొట్టు పెట్టుకొన్నవాడు దాన్ని వదిలిపెట్టి వచ్చే వారానికి ఒక పెద్ద కంపెనీలో ఏదో యింత జీతం మీద కొలువు చేసేవాడపవుతాడు. ఈ విధంగా పెట్టుబడిదారీ విధానం విప్లవ ఫలితాన్ని సాధిస్తుంది. ఇదంతా అంటే ఈ వ్యక్తిత్వం, ఈ స్వతం త్రత, ఒక విచిత్రమైన అస్వతంత్రతను, పెట్టుబడికయ్యే మూలధనం మీద ఆధారపడేదాన్ని సృష్టిస్తుంది. ఇట్లా ఈ మార్కెట్టు విధానం తానాశించిన తనకనుకూలమైన ఫలితాన్ని కాక తానా శించని, తనకు అననుకూలమైన ఫలితాల్ని తెచ్చి పెట్టడంచేత బూర్జువా ఆ వ్యవస్థ మీద తిరగబడి ఇంకా అంతకంటే మంచి మార్కెట్టును మంచి తీవ్రమయిన పోటిని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. ఇట్లా ఈ ప్రయత్నం కొనసాగినకొద్దీ తానాశించిన ఫలితాలు రాక, తాను ద్వేషించి వదిలించుకోవాలని చూసిన బానిసత్వమే ఇంకా చెట్టుకట్టుకొని వస్తుంది. ఈ విధంగా నిజమైన స్వతంత్ర ఎప్పుడూ బూర్జువాకు అందీ అందకపోతుండడంవల్లనే అతనెప్పుడూ స్వేచ్ఛావృత్తిని గురించి మాట్లాడతాడు.

బూర్జువా కవి కూడా సరిగ్గా పైన చెప్పిన గాడిలోనే పడి తిరుగుతాడు. తనకున్న స్వాతం త్య్రం వట్టి బలవంతపు బ్రాహ్మణార్థంగానూ, పది కాలాలపాటు పనికివచ్చేది కానిదిగానూ చూసు కుంటాడు. అందువల్ల ఒక ఏకాంతాన్ని అతడు అనుభవిస్తాడు. ఈ విశ్వాసానికి చెందిన, విశ్వాం తరానికి చెందిన విషయానుభూతి క్రమంగా తన అభిరుచికి దూరమైందిగానూ, తన స్వాతం త్ర్యాన్ని అరికట్టేదిగానూ బూర్జువా కవికి అవగతమవుతుంది. సాంఘిక మర్యాద లన్నింటినీ అతడు తన హృదయం నుంచి దూరం చేస్తాడు. దానితో అతడు అల్పుడుగా , దివాలా తీసిన వాడుగా, స్థిమితం తప్పినవాడుగా అయ్యి అణగదొక్కబడుతున్నట్లు అనుభూతిని పొందుతాడు.

ఈ విధంగా బూర్జువా వ్యక్తిత్వ దృష్టి వ్యక్తిత్వాన్ని నశింపచేసింది అవుతుంది.. సాంఘికమైన బంధనాల్ని నిర్మూలించడం కోసం అయిన ఆ బూర్జువా ఆర్థిక విధానం చివరకు అంతకుమునుపు కనీవిని ఎరుగని బలవంతాలైన కట్టుబాట్లతో ఒక గందరగోళమైన సంఘాన్ని సృష్టిస్తుంది. స్వాతంత్య్రం కోసం బూర్జువాపడిన తహ తహ అతడికి అస్వతంత్రతను ప్రసాది స్తుంది. అతడు చేసిన ప్రతిపనీ ఆతడాశించిన దానికి పూర్తిగా వ్యతిరేక ఫలితాల్ని కల్గిస్తుంది(11). పెట్టుబడి దారీ వస్తూత్పత్తి విధాన మూలసూత్రాలలోనే ఈ స్వభావ వ్యాఘాత లక్షణంఉంది. దీనివల్లే ఉత్పత్తి తేవాల్సినంత లాభాన్ని తేలేదు. ఎక్కడ చూసినా నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది. ప్రపంచానికొక విషమ పరిస్థితి ఏర్పడుతుంది. పెట్టుబడిదారీ విధానం క్రమంగా క్షీణిస్తుంది. అదొక మహాయుద్ధానికి గానీ, విప్లవానికి గానీ దారి తీయవచ్చును. ఈ చివరి దశలో కాని బూర్జువాకు తన స్వేచ్ఛావిధానమే తనకు బంధనమయి, అవసరాలు బలవంతాలై తనను బానిసగా చేసికొంటున్నవని తెలిసిరాదు. అంతకంటే అతడు చేయగలిగిందీ లేదు.

బూర్జువా వస్తూత్పత్తి విధానం ఆ వర్గం మీద నిర్వహణ భారాన్ని పెంచుతుంది. బూర్జువా ఆర్థిక వ్యవస్థ తన జనాన్ని పట్టణాలకు చేరవేస్తుంది. ఫ్యాక్టరీల దగ్గర గుమికూడుస్తుంది. అట్లా చేసి వాళ్ళు పరస్పర సహకారాలతో పనిచేసేటట్లు చేస్తుంది. పోటీ మనస్తత్వంతో కూడిన జీవన విధానాన్ని బూర్జువా వర్గం తాత్కాలికంగా అరికట్టేందుకు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పైకి తీసుకొనివచ్చి ప్రచారం చేస్తుంది. ఈ ప్రచార ఫలితంగా పాలెగాళ్ళ జులుంను తోసిరాజంటుంది. దీనివల్ల కలిగే ఇంకో ప్రయోజనం ఏమిటంటే కూలినాలి జనానికొక రాజకీయ విద్యా చైతన్యం కలగడం, చివరికి ఆ చైతన్యం వాళ్ళనందర్నీ కలిపి ఒక రాజకీయ పక్షంగా నిలబెట్టడం. కొత్తగా వచ్చిన ఈ కార్మిక రాజకీయ పక్షం క్రమంగా తాను పరిపాలనాధి కారాల్ని చేజిక్కించుకొని తానే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అదే ఈ వర్గానికి సర్వతంత్ర స్వతంత్ర దశ. అప్పుడు బూర్జువా సమాజం సొంత ఆస్తిపాస్తులు లేనిదై తాను కూడా అసలైన సర్వతంత్ర స్వతంత్ర స్థితికి వచ్చి చేరుతుంది. ఇంతకు పూర్వం ఈ బూర్జువా వ్యవస్థలో సొంత ఆస్తుల్నిపెంచుకోవడానికున్న అవకాశాలే దాని స్వాతంత్య్ర లక్షణంగా చెల్లుబడి అయ్యేవి. ఆ వ్యవస్థ దాన్నే స్వతంత్రతగా భావించింది. కార్మిక రాజకీయ పక్షం నడిపించే ప్రభుత్వాన్ని అందుకొన్నాక కాని బూర్జువాలకు తామనుకొన్నది నిజమైన స్వాతంత్య్రం కాదని తెలిసిరాదు. ఇది తెలిసి వచ్చిన తరువాత బూర్జువా వ్యవస్థలేదు. నీళ్ళల్లో ఉప్పులాగా కరిగిపోతుంది. బూర్జువా తోటే ఆ బూర్జువా ఉత్పత్తి విధానం కూడా మాయమైపోతుంది. అప్పుడు- అసలైన స్వాతంత్య్రంతో మిగతా జాతి తల ఎత్తుకొని లేస్తుంది.

పెట్టుబడిదారి వర్గ సమాజంలో వచ్చినటువంటి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాజస్వభావం మనకు తెలియాలి. బూర్జువా వ్యవస్థలో ఉన్న – స్వభావ వ్యాఘాత లక్షణాన్ని మనం గుర్తించి ఉన్నాము. బూర్జువా కవిత్వాన్ని అంత శీఘ్రగతితో అంత విపరీతంగా అభివృద్ధి చేసేది ఆ స్వవ్యాఘాత లక్షణమే. దైనందిన వాస్తవజీవిత విధానం ఏది వుందో అది బూర్జువా ఆదర్శ జీవనానుభూతిని చక్కదిద్దుతుంది. మొత్తం ఏకరూపమయిన వాస్తవిక సాంఘిక ప్రపంచమే మొత్తం ఏకరూపమైన కళా ప్రపంచాన్ని పోషిస్తుంది. వాస్తవసాంఘిక ప్రపంచం సాంఘిక ప్రయోజనాన్ని ఉద్దేశించి ప్రవర్తించేది. బూర్జువా వ్యవస్థలోని వైయక్తిక దృష్టి,స్వభావ వ్యాఘాత లక్షణం స్వాతంత్య్రం అని భ్రమించి సంకెళ్ళను చేతులకు తగిలించుకోవడం – మొదలైన ఇలాంటి గుణ విశేషాలన్నీ పెట్టుబడిదారీ కవిత్వంలో చోటు చేసుకొంటాయి.

బూర్జువా ఎప్పుడున్నూ సచేతనమైన కార్యకారణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని స్వాతంత్య్రంగా భావించడు.ఆ విషయంలో ఎంత అజ్ఞానం వుంటే *అంత స్వాతంత్య్రం ఉన్న ట్టుగా అనుకొంటాడు. స్వతంత్రతను సంపాదించి పెట్టే సహజ పాండిత్యంలో అతడికి కొంత విశ్వాసం ఉంది. తానే వుద్దేశంతో క్రియాశీలుడౌతున్నాడో దాన్ని తెలిసి ప్రవర్తించడం స్వతంత్రమని అతడు అనుకొంటాడు. ఉద్దేశం విషయంలో జాగృతుడు కానివాడు కార్యకారణ పరిజ్ఞానం ఉన్నవాడు కాలేడు. కార్యకారణం అంటే కేవలం అవసరం (Necessity) అని అర్ధం. కానీ బూర్జువా దీన్ని అంగీకరించడు. అవసరాన్ని అస్వతంత్రతగా అతడు భావిస్తాడు. కాని ఎవడైనా తానే ప్రయోజనాన్ని ఉద్దేశించి అంటే ఏ అత్యవసరం ముంచుకొని రావడం చేత తానాయాపనుల్లో ప్రవర్తిస్తున్నాడో- తెలిసి ప్రవర్తిస్తున్నాడో- వాడే నిజానికి స్వతంత్ర బుద్ధి. అట్లా కాకుండా ప్రయోజనదృష్టి లేక స్వభావ ప్రేరణంతో గుడ్డిగా ప్రవర్తించడం పశువులాగా ప్రవర్తించడం. ఎవళ్ళో వెనక నుంచి నెడితే ముందుకుపడ్డ దానికీ దీనికీ భేదం లేదు. పైన చెప్పినవి తెలిసి ప్రవర్తించడం అన్నది అంతర్దృష్టివల్ల రాదు. వాస్తవ పరిస్థితులతో తలపడి పోరాటం సాగించడంవల్ల వస్తుంది. ఈ పోరాటం పరిస్థితులని తెలుసుకొని ఉపయోగ పెట్టుకోవడాన్ని నేర్పుతుంది. కాని బూర్జువా ఈ విషయాల్ని అంగీకరించడు. అంగీకరించకుండా ఇంకా చిత్రంగా అతడు – తాను బాహిరమైన సాంఘిక బాధ్యతలనుంచి తప్పుకొంటే చాలు, తనకు తాను స్వతంత్రుణ్ని అని భావిస్తాడు. కాని వెంటనే పెట్టుబడిదారీ ఉత్పత్తికి సంబంధించిన పరిస్థితులు అతణ్ణి తాను నివసించే సమాజంలోని ప్రజానీకంతో ఇంకా ఇంకా సంశ్లిష్టమైన సంబంధాలు పెట్టుకోక తప్పనివాణ్ణి చేస్తాయి. అందువల్ల అతడు అనుకొన్నట్లుగా సర్వస్వతంత్రుడు కాడు. చివరికతడు యుద్ధం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల అనుచితమైన పోటీవల్ల అణగారిపోతాడు. అతడు చేసినపన్లవల్లే అవన్నీ అయినవి. అవి అవాలని అతడు అనుకోకపోవడం అది వేరే విషయం. స్వతంత్రత ఎప్పుడున్నూ కార్యకారణ రూపమైన నిత్యావసర హోదా జ్ఞానంలోనే వుంటుంది. సాంఘిక సంబంధ బాంధవ్యాల నియమ లక్షణం యొక్క అవగాహన లేకుండా మానవుడు ఎప్పటికిన్నీ నిజంగా సర్వస్వతంత్రుడు కాలేడు.

స్వాతంత్య్రానికి సంబంధించిన, మానవ సహజాతాలతో కూడుకొన్నటువంటి సాంఘిక ప్రయోజనాలకు సంబంధించిన భ్రమ ప్రమాదం బూర్జువాకు బూర్జువా వ్యవస్థలోని అస్తవ్యస్తం నుంచే పుట్టింది. సాంఘికాలు కావాల్సిన ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగతమైన సొంత ఆస్తిపాస్తులుగా ఉండడమే అస్తవ్యస్త లక్షణం. తన సాంఘిక సంబంధ నియతియొక్క వివేకం కలిగిన మరుక్షణం ఇక బూర్జువా బూర్జువా కాడు. మనస్సును ఊరికే ఏకాగ్రం చేయడం మాత్రమే వివేకమూ, జ్ఞానమూ కాదు. అది తీవ్రమైన కర్మాచరణలోంచి పుట్టుతుంది. ఇంకా అది వాడి యొక్క సాంఘిక సంబంధాలను నియమించుకోవడానికి సంబంధించిన ప్రయోగాల నుంచి పుట్టుతుంది. ప్రకృతిని నియమించుకోవడానికి సంబంధించిన ప్రయోగాలనుంచే కదా ప్రకృతి యొక్క స్వభావ పరిజ్ఞానం కలిగింది? ఇదిన్నీ అట్లాగే. కాని మానవజాతి తనయొక్క సాంఘిక సంబంధబాంధవ్యాలను ఒక కట్టుబాటుకు తెచ్చే ప్రయత్నం చేయడానికి ముందు దానికా శక్తి వుండాలి. అంటే సాంఘిక సంబంధాల కాధారభూతమైన “వస్తూత్పత్తి సాధనాల్ని ఆదుపులో పెట్టుకోగలిగిన శక్తి అన్నమాట”

పాలెగాళ్ళ పాలన సాగిన కాలంలో బూరువాలకు స్వతంత్రత అంటే వాళ్ళపాలన అంతంకావడం. బూర్జువాలు పాలన సాగించే కాలంలో కార్మికులకు స్వతంత్రత అంటే ఆ ఉన్న పరిపాలనా వ్యవస్థ నిర్మూలనమవడం మాత్రమే. పూర్ణ స్వాతంత్య్రం ఉన్నటువంటి -అంటే వర్గరహితమైన సమాజం ఏర్పడడానికి పూర్వం – తత్పూర్వం ఉన్న వ్యవస్థ అట్లాగే కావాలి. అలాంటి సమాజంలో మాత్రమే, సామాజికులందరున్నూ, సంఘానికి అభ్యుదయాన్ని కల్గించే విధుల్ని, అభీష్టానుగుణంగా నియమించుకోవడం ద్వారా, సాంఘిక నియతి యొక్క లక్షణ వివేకం, పరిజ్ఞానం ఎంతో పెంచుకొంటారు. స్వాతంత్య్రం అంటే అట్లా చేసికోగల్గడమే. సర్వజనుల యొక్క స్వాతంత్య్ర విషయం ఇది. బూర్జువాకిది అక్కరలేదు. అతడు బూర్జువాగా ఉన్నంతవరకూ స్వాతంత్య్రం యొక్క ఈ నిర్వచనాన్ని అంగీకరించడు. కాని అతడు ఎల్లకాలం అట్లాగే ఉండలేడు.

బూర్జువాలు భావించిన స్వాతంత్య్రం విషయంలో ఉన్న వైరుధ్యం క్రమంగా ఆ సమాజం క్షీణిస్తున్న కొద్దీ, విస్పష్టం కావడం మొదలు పెడుతుంది. ఆ బూర్జువా వర్గం యొక్క స్వాతంత్య్ర భావం మొత్తం సమాజం యొక్క స్వాతంత్య్రంతో విరోధాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకొంటుంది. మొత్తం సమాజం యొక్క స్వాతంత్య్రం దాని ఆర్థికోత్పత్తి శక్తి యొక్క స్వరూపంలో వుంటుంది. ఇది మానవుడు ప్రకృతితో ఎదురు తిరిగి పోరాడి సాధించుకొన్నది. క్రమంగా ఆర్ధికోత్పత్తి సాధనాలు విరివిగా అవుతున్న కొద్దీ బూర్జువా తాను సర్వస్వతంత్రుణ్ణని భావిస్తాడు. తక్కిన సమాజం మన ఉత్పత్తి ఫలితాల్ని తానుకూడా అనుభవిస్తూ ఆ పరిస్థితులకి ఎదురు తిరిగి విప్లవం తేవాలని అనుకోదు. పైపెచ్చు నెమ్మదిగా ఆ పరిస్థితుల్ని అంగీకరిస్తుంది కూడా. ఈ దశలో బూర్జువా భావించిన స్వాతంత్య్ర నిర్వచన విధానం స్థిరపడడం కనిపిస్తుంది. ఇలా కనిపించినంతవరకు బూర్జువా స్వాతంత్య్ర నిర్వచనం సత్యంగానే అనిపిస్తుంది.కానీ అదొక మిధ్యాకల్పనం.అదొక ఐంద్రజాలికమైన మాయామోహం. అనుభవంలో విషయం అర్ధమౌతుంది. సాంఘిక సంబంధాల్ని తోసి పారేయడం చేత మానవుడు తనను స్వతంత్రుడనుకోవడం పాలెగాళ్ళ నాగరికత. బూర్జువా విధానం అభివృద్ధి కావడం చేత ఆ నాగరికత చెలామణి లేనిదయింది. ఇక్కడ నాగరికత అంటే అది వారి ఆర్ధిక విధానమని అర్ధం.

అభ్యుదయ పథంలో నడిచేటటువంటి సంఘం దాన్ని పూర్తిగా వ్యతిరేకించడంచేత బూర్జువాలు కల్పించిన స్వాతంత్య్ర నిర్వచనం యొక్క బండారం బయటపడి, అదేమీ కాకుండా పోయి, కొత్త నిర్వచనానికి చోటిస్తుంది. ప్రతివిషయాన్ని స్వతంత్రంగా ఆలోచించి నిశ్చయించుకొనే జ్ఞానం ఎంత ఉంటే వాడంత స్వతంత్రుడు. స్వతంత్రత అంటే అలాంటి జ్ఞానం, సాంఘిక సంబంధాల్ని అంటే ఉత్పత్తి శక్తుల్ని వాటి ప్రవృత్తుల్నీ అదుపులో పెట్టుకోగల్లే జ్ఞానమే మానవుని స్వాతంత్య్ర లక్షణం. కాని ఈ లక్షణం విప్లవం చేత ప్రాణం పోసుకొంటుంది. ఈ విప్లవం సామ్యవాదానికి, కార్మిక ప్రభుత్వ శక్తికి అభిముఖమయింది. దీనికి బూర్జువా అంగీకరించడు. అతడనుకొన్న స్వాతంత్య్రానికి ఇది పూర్తి వ్యతిరేకం కదా. అందుకని ఈ పరిస్థితిలో బూర్జువా మొత్తం సంఘం కోసమే తన బదుకన్నట్టుగా మాట్లాడి తనవి తాను నిలబెట్టుకోజూస్తాడు. కాని సంపూర్ణ సామ్యవాద సాంఘిక వ్యవస్థ కోసం విప్లవిస్తున్న మహాజన సంఘం ఆ విధంగా బూర్జువాను నిల్వతీయ్యడు. మాట్లాడనియ్యదు.

వ్యక్తి స్వాతంత్య్రం అంటే సమాజంతో కలిసిపోయినప్పటికీ తననితాను దర్శించుకోవడం. అట్లా కలిసిపోవడానికి వున్న అనువైన పరిస్థితులే స్వాతంత్య్ర లక్షణాలు. ఇలాంటి లక్షణాలున్న సంఘం స్వాతంత్య్ర దర్శనానికి సాధనం. వాస్తవమిలావుంటే బూర్జువాకి వున్న స్వాతంత్య్ర విషయంలోని భ్రమ ప్రమాదం ఈ విషయాన్ని పరిగణించనే పరిగణించదు. అతడెప్పుడూ వివేకంతో పనిలేని స్వాతంత్ర్యాన్ని, సంఘంతో పనిలేని వ్యక్తిత్వాన్ని మహావిషయాలుగా భావిస్తుంటాడు. పై భ్రమ ప్రమాదంనుంచే ఈ భావించడం మొదలైంది. బూర్జువా పరిపాలన సాగడానికి ఆధారమైన ఏ విశేషమైన ఆధిక్యంవుందో దాని ప్రతిబింబమే ఆ భ్రమ ప్రమాదం. ఇంకా అది ఒకానొక ప్రత్యేకమైన వర్గసమాజంనుంచే ఉత్పన్నం అయింది. అది తానున్నంతవరకూ సంఘాన్నింకా చీల్చేయజూస్తుంది.

అన్నివర్గ సమాజాలకు వాటి మిధ్యాభ్రమలు వాటికున్నాయి. బానిస సమాజంలో స్వాతంత్య్రం అంటే నిర్బంధ పద్ధతి. బానిసవిధానం లేకపోవడం కాదు. అదొక విలక్షణమైన బలాత్కారంలో స్వాతంత్ర్యాన్ని చూస్తుంది. ఈ విలక్షణత్వం ఆజ్ఞారూపంలో వుంటుంది. యజమాని ఆజ్ఞాపిస్తాడు. దానిమేరకు దాన్ని బానిస నెరవేరుస్తాడు. అలాంటి సమాజంలో ఆజ్ఞ ఇవ్వగల్గడమే స్వాతంత్య్రం. వర్గాలు అభివృద్ధి అవుతున్నకొద్దీ మొత్తంమీద ఆజ్ఞలిచ్చే మనస్తత్వాన్ని వాస్తవం నుంచి తొలగించడానికి నియమించే జ్ఞానం సడలిపోతుంది. గుడ్డిగా యజమానుల ఆజ్ఞల్ని శిరసావహించి పనిచేసేటటువంటి బానిస వాస్తవ పరిస్థితుల్లో తెగించి పోరాడాల్సి వస్తుంది. దీని ఫలితంగా వచ్చే ఆర్ధికమైన బడుగుతనం- నిరంతరం పెరిగిపోతున్న మానవుని నిత్యావసర విషయ పరిజ్ఞాన శూన్యతవల్ల కలిగే అస్వతంత్రతకు ప్రతిబింబం. ఈ బడుగు తనంలో జ్ఞానానికి, స్వతంత్రతకూ వాహకం కావాల్సిన వర్గ సమాజం నిశ్చైతన్యం అవుతుంది. అది క్రియాశూన్యతతో నిండిపోతుంది. వివేకం (Consciousness) ప్రకృతితో మానవుడు చేసే తీవ్రపోరాటం నుంచి పుట్టుకొని వస్తుంది. ఆపెనుగులాట ఆగిపోతే వట్టిచూపు సరిపోని మూర్ఖాచారాల అనుసరణ కాలంలో, వివేకం రూపుమాసిపోతుంది. సంఘంలో ఆ వివేకం యొక్క పురోభివృద్ధిని కుంటుపడచేసే చూపుచాలనటువంటి మూర్ఖత్వంవల్ల జరిగే నిలువుదోపిడీ విధానాన్ని తోసిరాజు అనడానికి నిరంతరమైన సంకుల సమరం కొనసాగుతుండాల్సిందే. ఇ లాంటి తీవ్ర సంచలనం ఉన్నప్పుడే వివేకం – స్వతంత్రత సంఘగర్భం చీల్చుకుని కాగడాలు వేసికొని బయలుదేరాయి. అప్పుడు కాని అసలైన స్వాతంత్య్రం యొక్క అంతస్సత్యం అవగతం కాదు. అలా కావాలంటే ముందుగా సమాజంలో వర్గాలు లేకుండా పోవాలి. నిజంగా స్వతంత్రులవడానికి మానవులకి అన్ని మార్గాలూ తెరచుకోవాలి. అవి అట్లాగే తెరుచుకుంటాయి. అట్లా కావడానికి పెట్టుబడిదారీ వర్గమే కావాల్సిన అన్ని ఏర్పాట్లని చేసివుంచుతుంది. దాని గోతిని అదే తవ్వుకుంటుంది(12).

పాదసూచికలు:

 1. Art is the product of society, as the pearl is the product of the oyster, and to stand outside art is to stand inside society – Illusion and Reality (Seven Seas Books 1977), P : 18.మిగిలినవి కూడా యీ గ్రంథంలోనివే)
 2. This poetry is not “Pure” poetry in any modern sense. We may describe it as a heightened form of ordinary speech, without committing ourselves to this is an adequate definition of poetry – P: 19.
 3. In this sense poetry is the child of Nature, just as the developed novel is the child of the sophistication of modern culture – P-28.
 4. Poetry is characteristically song, and song is characteristically something which, because of its rhythm, is sung in unison, is capable of being the expression of a collective emotion – P: 33.
 5. Poetry is the nascent self-consciousness of man, not as an individual but as sharer with others of a whole world of common emotion. P: 39.
 6. A pianola rou is pierced with holes. Those holes are real concrete entities. But they are not the music. The music is what happens when it is played. The poem is what happens when it is read. P:40.
 7. In a class society the workers do their tasks blindly as they are told by supervisors. They build pyramids but each contributes as stone; only the rulers know a pyramid is being built…. The ruled obey blindly and are unfree. P:51
 8. “To build from matter is sublimely great, But only gods and poets can create” P: 58.
 9. It is the characteristic of poetry that it demands for its appreciation a more intimate knowledge of the language in which it was written than any other form of literature. P: 65.
 10. Now bourgeois culture is the culture of class to whom freedom- man’s realisation of all his instinctive powers is secured by “individualism”. It might, therefore seem that bourgeois civilisation should be antipoetic, because poetry is collective and the bourgeois is an individualist”. P: 70.
 11. His demand for freedom is a negation of freedom. He is “mirror revolutionary” and continually revolutionises society by asking for that which will procure the opposite of what he desires. P: 72

12. P:79.

కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 1931 డిసెంబర్ 26 న అప్పటి గుంటూరు జిల్లా రంగశాయపుర అగ్రహారంలో పుట్టారు. కన్నతల్లి తెలికేపల్లి వెంకమ్మ ,దత్తు తీసుకొని విద్యాబుద్ధులు చెప్పించిన తల్లి కేతవరపు సావిత్రమ్మ. హైస్కూల్ చదువు వినుకొండలో ఇంటర్మీడియేట్ గుంటూరు లో హిందూ కాలేజీలో చదివి కొంతకాలం సత్తెనపల్లిలో టీచర్ గా పనిచేసి అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ ఆనర్స్ పూర్తి చేసి 1954 లో గుడివాడ ANR కాలేజీలో లెక్చరర్ గా చేరారు . 1957 లో ఉద్యోగం మానేసి ఉస్మానియావిశ్వవిద్యాలయం లో బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పంపై డాక్టరేట్ పట్టా పొందారు. 1960 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు. 1968 లో వరంగల్లు పిజి సెంటర్ కు బదిలీ అయివచ్చి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగువిభాగం అభివృద్ధికి నిలబడ్డారు. ఉద్యోగజీవితం మరో అయిదారు నెలల లో ముగుస్తుందనగా రోడ్డు ప్రమాదంలో 1991 అక్టోబర్ 28 న ఆయన జీవితమే ముగిసింది.

ఇంటర్మీడియట్ చదువ్వుతున్న కాలంలోనే ఆయనలో సాహిత్య సృజనవిమర్శన శక్తుల వికాసం మొదలైంది. జంధ్యాల పాపయ్యశాస్త్రి ప్రభావంతో పద్యాలు వ్రాయటం మొదలు పెట్టారు. విశ్వనాథ సాహిత్య అభిమాని అయినారు. మహాభారతం వంటి సంప్రదాయ సాహిత్యాన్ని ఎంత గాఢంగా అధ్యయనం చేశారో విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ఎంత పారాయణ చేశారో ఆధునిక సాహిత్యాన్ని కూడా అంతశ్రద్ధగా చదివారు. 1968 లో వరంగల్లుకు తిరిగిరావటం ఆయన జీవితంలో పెద్ద మలుపు. అక్కడనుండి మార్క్సిస్టు తత్వశాస్త్ర అధ్యయనం , అవగాహన ఆయన సాహిత్య కృషిని విప్లవాత్మకంగా మార్చాయి. సమాజ సాహిత్య సంబంధాలగురించి రాజకీయార్థిక దృక్పథంతో చేస్తున్న చింతనను సంభాషణగా మార్చటానికి 1986-87 విద్యాసంవత్సరం లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి జాతీయఉపన్యాస కార్యక్రమం ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ విశ్వవిద్యా లయాలలో ప్రసంగించటానికి ఎంపిక అయిన సందర్భాన్నిచక్కగా ఉపయోగించుకున్నారు. అధ్యయనం, బోధన, విమర్శన, రచన ఆయన ఆచరణ. పరిశోధనలో నూతన సత్యాలకై అన్వేషించే జిజ్ఞాస ఆయనది. వందకు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. మెదడులో సుళ్ళు తిరిగే ఆలోచనలను కాగితం మీద పెట్టి చూసుకొనటం సమానభావాలు, స్పందనా లక్షణం ఉన్న సాహిత్య జిజ్ఞాసువులైన స్నేహితులతో సంభాషణలో నిగ్గు తేల్చుకొనటం ఆయన ప్రవృత్తి.

ఆనందచేతన(1958), అంగహేల, శత్రుంజయము (1963) గీతాంజలి అనువాదం(1962) శాస్త్రి గారు బ్రతికిన కాలపు కవిత్వ రచనలు. ఆయన జీవితకాలంలో వచ్చిన విమర్శ గ్రంధాలు నైమిశము(1961), సమీక్షణ (1963) తిక్కన కావ్య శిల్పం ( 1973),భారతము- తత్వ దర్శనము (1976) తిక్కన హరిహరనాథ తత్వము (1976) పోతన్నగారి వైచిత్రి (1987).

మరణానంతర ప్రచురణలు- ఒకే ఇద్దరం (1996) చిచ్చేతన (2006) శ్రీకృష్ణ దూత్యము మరికొన్ని ముక్తకాలు- ఖండికలు( 2009) కవిత్వం. మళ్ళీ కన్యాశుల్కం గురించి (1992), నాటక విశ్లేషణ (1993), విశ్వనాథ వైఖరి( 1994),మహిళా సమాజవాడ సాహిత్యం (1995) అభ్యుదయవాద సాహిత్య విమర్శనా దృక్పథం (1996)కవిత్వం- సమాజం క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ (1998) భారతీయ సాహిత్య శాస్త్రం - భిన్న దృక్పథాలు (1999)నాచన సోముడు (2000) తెలుగు కవిత ఉద్యమాలు (2001) భాషా సాహిత్యాలు - సామాజిక భావనలు (2002) పురాణేతిహాసాలు - విశేష విశ్లేషణలు (2003) సంఘర్షణ - సంవాదం (2004) దృష్టి - దృశ్యం (2005) కావ్య జిజ్ఞాస (2007)సాహిత్య సామాజికతా వాదం - కొన్ని ప్రతిపాదనలు (2008) ఒక రత్నము - ఒక మంత్రము , శృంగార నైషధ కావ్య జిజ్ఞాస( 2010) సాహిత్య సంభావన( 2011)శాస్త్రీయ సమీక్షలు - ముందుమాటలు( 2013) కవిత్వం : అనుభవం - అవగాహన( 2014) నవలాలోకనం (2015) విమర్శ గ్రంధాలు.

One thought on “కవిత్వం- సమాజం (క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ) : 2

 1. ఇలాంటి సిరీస్ వేసినపుడు చివర్లో అంతకుముందలి వ్యాసం లింక్ ఇస్తే ఉపయోగం.

Leave a Reply