ప్రజా యుద్దం, కలం కలిసి సాగిన ‘‘చనుబాలధార’’ – కౌముది కవిత్వం

దేశంలో సైన్యం మూడు రకాలు. ప్రభుత్వ సైన్యం. ప్రైవేటు సైన్యం. ప్రజాసైన్యం. మొదటి రెండు సైన్యాలు పాలక వర్గాల అధికారాన్ని కాపాడేవి. మూడోది పాలక వర్గాలను విప్లవం ద్వారా కూలదోసి ప్రజారాజ్యాన్ని తెచ్చేది. ఈ మూడింటి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. చివరికి ప్రజాసైన్యానిదే విజయం. పాలక వర్గాలకు కాపలాకాసే మొదటి రెండు రకాల సైన్యాలకు తిండి, నిద్ర, ప్రజలను హింసించడం తప్ప మరో ఆలోచన ఉండదు. కాని ప్రజాసైన్యం మాత్రం ప్రజల జీవితాలలో మమేకం కావడం వారి సంస్కృతిలో భాగంగా ఉంటుంది. సంస్కృతి అంటే ఆట, పాట, మాట, శ్రమ మొదలైన అన్ని సందర్భాలలో ప్రజాసైన్యం ప్రజలతో కలుస్తుంది. ప్రజల కష్ట సుఖాలను భాగం పంచుకుంటుంది. ప్రజా సైన్యం అంటేనే తనను తాను నిరంతరం సృజనాత్మకంగా మలుచుకుంటుంది. అలాంటి సృజనాత్మకత నుంచే ప్రజా సాహిత్యం వస్తుంది.

కవిత్వం, పాట కథ, నవల మొదలగునవి ఏదైనా కావచ్చు. ఆ విధంగా ప్రజల జీవితంతో పాటు ప్రకృతిలో లీనమైపోయిన గన్ను కొసకు పెన్నులు మొలిచాయి. సాహిత్యం వికసించింది. అలా వికసింప చేసిన కవులలో కౌముది ఒకరు.

కౌముది వరంగల్‍ జిల్లా ఖాజీపేటకు ఐదు కి.మీ. సమీపంలో ఉన్న తరాలపల్లె గ్రామం ప్రజా ఉద్యమాలకు పట్టుకొమ్మ. పేద కుటుంబంలో కౌముది (సదానందం) జన్మించాడు. కౌముదికి తల్లి, తరాలపల్లె అంటే ఎనలేని ప్రేమ. అసమ సమాజాన్ని సవరించాలని పట్టుదలతో చదువుకునే రోజుల్లోనే విప్లవ విద్యార్థి ఉద్యమాల పనులు పంచుకొని అరెస్టయ్యాడు. రాజ్య నిర్బంధంతో ఒత్తిడులు తట్టుకోలేక విప్లవోద్యమం పూర్తికాలం పనికి అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

తల్లిని, ప్రజల్ని, తరాలపల్లె తండ్లాటను మర్చిపోలేకపోయాడు. 1992-93లో నిత్య నిర్బంధం తెలంగాణ ప్రజలు జీవిస్తున్న కాలమిది. ప్రజల్ని బెదిరించి హింసించడం, ఇళ్ళపై దాడులు, అన్నలకు అన్నం పెట్టే సానుభూతి పరులను కొట్టటం, కేసులు పెట్టటం, పిల్లా తల్లి ముసలి తేడా లేకుండా ప్రజల దైనందిన జీవితంలో పరిపాటిగా మారాయి. ఇలాంటి గడ్డు కాలంలో ప్రజలు బ్రతకడం కష్టమవుతున్న స్థితి గమనించి, విప్లవోద్యమ నిర్మాణంలో మెతుకు సీమకు చేరాడు. తరాలపల్లె బిడ్డడు గిరాయిపల్లె అమరుల జాడలో తిరిగాడు. వాగు ఇసుకలో చూపుడు వేలుతో రాతలు రాశాడు. చెలిమె తోడినా కొద్దీ నీరు ఊరినట్టు ఉసిళ్ళల్లా ఊహలు ఎన్నో అతనికి. ఆయుధం మీద మమకారంతో పాటు అక్షరాల మీద మమకారం పెంచుకున్నాడు. విప్లవం కోసం ఎంత ఆరాటపడ్డాడో కవిత్వం కోసం ఆరాటపడ్తూ కవి మిత్రుల్ని కలిశాడు.

కౌముది 1991 నుండి 2000 సం।।లో రాసిన కవితలు చనుబాల ధార సంపుటిగా వచ్చింది. మే 2000 సం।।లో ఇరువైదు కవితలతో మొదట విరసం ప్రచురించింది. కౌముది 2003 నవంబర్‍ 23న ఎన్‍కౌంటర్‍ అనంతరం తను రాసిన 38 కవితల్ని, ‘‘తెలంగాణ పల్లె” నవల, పాటల్ని, అలాగే కౌముది మీద ఇతరులు రాసిన కవితల్ని అన్నింటిని కలిపి రెండవ ముద్రణగా తరాలపల్లె కౌముది పేరుతో పుస్తకం 11 జూన్‍, 2006 లో విరసం ప్రచురించింది. కేవలం ఇందులో కౌముది రాసిన కొన్ని కవితలు మాత్రమే పరిచయం చేయదల్చుకున్నాను.

కౌముది కవిత్వం ఒక విప్లవ కార్యాచరణను అందిస్తుంది. మనందరి కోసం రాసిన పద్యంలో
‘‘చావుదేముంది
బతకడం శాశ్వతమైతేకదా!
క్షణకాలం బతికినా సరే
పరిమళభరితంగా బతకడం!
చుట్టూ ప్రపంచాన్ని పరిమళభరితం చేయడం’’.

‘జాతస్య మరణం దృవమ్‍’ పుట్టినవాడు మరణిస్తాడు. బతికినంత కాలం పూవులాగా తనకోసం కాకుండా ప్రపంచం కోసం సువాసనలు వెదజల్లుతూ ఎలా రాలిపోతున్నాయో, మనిషైన వాడు చుట్టూ ఉన్న ప్రపంచం కోసం, ప్రపంచాన్ని సుఖమయం చేయడం కోసం కృషి చేయాలే తప్ప స్వార్థపరుడిగా తనకోసం తాను బ్రతుక గూడదనుకొని తన పద్యాన్ని సాయుధంగా మల్చుకున్నాడు కౌముది.

సువాసన కల్గిన పుష్పాలు జీవించే కాలం తక్కువ. కాని ఎంతో పరిమళాన్ని అందించి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మన బ్రతుకు పదిమందికి ఉపయోగపడాలి. కవి సాయుధడవ్వటమే కాకుండా పద్యాన్ని సాయుధ పర్చాడు. ఎందుకంటే ఈ పద్యాన్ని చదివిన వాళ్ళు నాల్గురోజులు బ్రతికినా మంచిదే గాని మంచి పనులు చేయాలి. మంచి కోసం బ్రతకాలని అనుకోక తప్పదు.

వెన్నెల్లో స్నానం అనే కవితలో…
‘‘మనుషుల్ని, మనసుల్ని ధ్వంసం చేస్తున్న
ఈ విధ్వంసక విలువల ముఖమ్మీద
నేనిప్పుడు కాండ్రించి ఉమ్మేస్తున్నాను’’.

సినిమాలు, టి.వి. సీరియళ్ళు మనుషులను యంత్రాలుగా మార్చి, ప్రేమానురాగాలు లేని జుగుప్సకరమైన అంశాలు చూపిస్తున్నారు. వీటివల్ల మనుషుల మధ్య ఉండే మానవీయ విలువలు అంతరిస్తున్నాయి. సంత్సంబంధాలు ఉండటం లేదని నిరసన వ్యక్తం చేశాడు.
‘‘ఎన్ని తరాలు యుద్ధమైనా సరే
కొత్త మనిషొకడు పొలికేక పెట్టాలి
కొత్త విలువొకటి ‘కేర్‍’ మనాలి’’

ఎన్నో సంవత్సరాలుగా తాతముత్తాతల నుండి అసమ సమాజంలో ఏదో రకంగా తిరుగుబాటు జరుగుతుంది. చేసే యుద్ధకాలం ఎంతైనా సరే, వచ్చే నూతన శిశువు మాత్రం మంచి విలువలతో రావాలని ఆశించాడు, అదే కవితలో…

చాలామంది మనుషులు, వారి మనస్సు విధ్వంసంలోకి నెట్టబడ్డది. బంగారు పంజరంగా భ్రమించే తుప్పులో మనస్సు బంధించుకున్న మనిషిని చూశాడు. స్వేచ్ఛను కలిగించాలని ప్రయత్నం చేశాడు. విలువలను కూల్చేసే విధ్వంసం మీద కాండ్రించి ఉమ్మేశాడు.

ఎన్ని తరాల యుద్ధమైనా సరే, చేస్తానని చెప్పి కొత్తమనిషొక పొలికేక కోరుకొని కొత్త విలువ కేర్‍ మనాలని వెన్నెల్లో స్నానం చేశాడు.

మరో కవిత ‘నా చరిత్ర మొదటి అక్షరం’.

‘‘నాగలి ఆత్మహత్య చేసుకుందంటే
మనిషి చరిత్ర యావత్తూ
ఆత్మహత్య చేసుకున్నట్టే లెఖ్ఖ
జీవనది గొంతులో
పురుగుమందు కుమ్మరించినవాడే
విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి కాలువల్ని తవ్వగలడు
పసిడి కాంతుల పైరు తల్లిని ఛీత్కరించినవాడే
ఆత్మహత్యకు ఎక్స్గ్రేషియా వదనంతో దు:ఖాన్ని ఒలకబోయగలడు’’

ఇక్కడ నాగలి ఆత్మహత్య అంటే రైతు ఆత్మహత్య అని అర్థం. అందరికి తిండిపెట్టే రైతులు లేకుండా పోతుంటే జనం ఎలా బ్రతుకుతారు? రైతును గుర్తించకుండా పురుగుమందు తాగే దుస్థితి కల్గటానికి కారణం విదేశీపెట్టుబడులను ఆహ్వానించటం. బంగారం లాంటి పంటను పండించే రైతు కష్టాన్ని, నష్టాన్ని గుర్తించక పోగా, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించటం. దాంతో ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదు అన్నది ఆయన ఆకాంక్ష.

నాగళ్ళను కవాతు చేయించి, నేలరాలిన రక్తపు చుక్కల్ని పాటగా మార్చాడు. సమస్త శరీరాన్ని ఒకే ఒక్క నినాదాన్ని చేసి నెర్రెలు బారిన నేలపై లిఖిస్తూ చనుబాల కుతి తీర్చుకున్నాడు. ‘‘చనుబాల కుతి’’ కవితలో…
‘‘మనిషి శ్వాసించడం మరిచినప్పుడల్లా
నాగలి శ్వాసించడం నేర్పుతుంది’’

అంటూ నాగలి తన శ్వాసగా అతని చరిత్ర మొదటి అక్షరంగా ప్రకటించాడు. శ్వాసలో నాగలివాసన కోల్పోయినవాడు మనిషిగా మరణించినట్టే లెఖ్ఖ అని అనగల్గాడు.

విదేశీ పెట్టుబడుల పేరుతో కల్తీ విత్తనాలు, మందుల చొరబాటుతో రైతులు మోసపోతున్నారు, చంపబడ్తున్నారు. నేను దున్నను అని నాగలి అంటే పంటలను పండించటం రైతులు ఆపేస్తే సకల ప్రాణికోటి ఎలా మనుగడ సాగిస్తుంది. నాగలిని, నాగలి పట్టిన వాడి ప్రాశస్త్యాన్ని మానవ చరిత్రలోనే ఇమిడి ఉందని గొప్పగా ఉటంకించాడు. ఒక గొప్ప హెచ్చరికతో కూడిన ప్రమాదాన్ని తెలియజేస్తూ మనల్ని ఎలా సమాయత్తపర్చాడో చూడండి.
‘‘నా శ్వాసా!
నా చరిత్ర దాతా!
వైట్‍ హౌస్‍ కడిగిన నీరును
క్రిమిసంహారక జలాలుగా
పంట పొలాల్లోకి పారించక ముందే
శ్వాసలో నాగలివాసన కోల్పోయిన వాడి గుండెపై
ఒక్కసారి గాల్లో ఎగిరి నీ కర్రుమొన దించు! అని నా చరిత్ర మొదటి అక్షరం కవితలో చెప్పాడు. ‘‘సృతిగీతాలు’’ కవితలో…

ప్రజల కోసం తమ జీవితాలను తృణప్రాయంగా వదిలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు విప్లవ వీరులు. వారిని ఉద్దేశించి
‘‘శాస్త్రాలు చదివి సమాజాన్ని అర్థం చేసుకోలేదు మీరు
జీవితాలను చదివి సమాజాన్ని అర్థం చేసుకున్నారు
జీవించడానికి పోరాటం తప్పనిసరి అయినప్పుడు
పోరాటాన్నే జీవితంగా మల్చుకున్నారు మీరు’’ సృతిగీతాలులో యుద్ధభేరై మోగిన వాళ్ళను మరువనంటూ తమ యుద్ధభేరి మోగిస్తూ దశదిశలా వ్యాపింపచేశాడు.

తనకు స్ఫూర్తినందించిన విప్లవ కారులు ధ్వనులైతే కౌముది ప్రతిధ్వనయ్యాడు. వారు రాగాలైతే తను పల్లవిగా మారాడు.

మేఘాలు వర్షించడం మానవు. గాలి వీచడం మానదు. జనం కోసం బ్రతికే వారి ఆశయం ఆకాశమంత విశాలమైంది. వారి త్యాగం ముందు నదీనదాలు కూడా తలవంచుకున్నాయి. అలాంటి వీరులను గన్న తల్లులున్న పల్లె మీద రాజ్యం యుద్ధం చేస్తుంది.
ఒక గుర్తు తెలియని ఎన్‍కౌంటర్‍ మృతదేహాన్ని’’ అనే కవితలో
‘‘పల్లెమీద యుద్ధం ఎందుకు?
నన్ను వెంటాడి వేటాడి కాల్చి చంపడం ఎందుకు?
నేనూ నా పల్లె చేసిన నేరమేమిటి?
కష్టించి పండించాను నా కడుపుకు తిండేదని అడిగాను
నేను పండించిన పంటను గిట్టుబాటు ధర ఏదని అడిగాను’’

రెక్కలు ముక్కలు చేసికొని, రక్తాన్ని చెమటగా మార్చినా నిలువనీడ ఉండదు. ఒంటికి బట్ట ఉండదు. ఇవి లేకపోవడానికి కారణం ఎవ్వడని ప్రశ్నించినందుకు, ఏ కష్టం చెయ్యని వాడికి కార్లూ, బంగ్లాలూ, సుఖాలు అధికారాలూ ఎక్కడివని ప్రశ్నించినందుకు, కన్నీళ్ళకు కారణం ఎవ్వడని అడిగినందుకు ఆ ప్రశ్న నేరమయింది. ఆ ప్రశ్న ద్రోహమయింది. ఆ ప్రశ్న కుట్రయింది. నక్సలైటని ముద్ర కూడా పడింది. జీవితం పట్ల ఆశను, జీవించాలనే కోరికను అదృశ్యం చేయబడి ఎన్‍కౌంటర్‍ చేయబడ్తుంది.

జాతీయ మానవహక్కుల కమీషన్‍ తెలంగాణను సందర్శించటానికి వచ్చిన సందర్భంగా ‘‘నా పల్లెకు రండి’’ కవిత వ్రాశారు.
‘‘నా పల్లెకు రండి!
నా పల్లెను చూడండి!
మీరూ మీ కార్లూ రావడానికి నా పల్లెకు రోడ్లు కూడా ఉన్నాయి
మీరు వస్తే స్వాగత తోరణాలు ఉండకపోవచ్చుకాని
పోగొట్టుకున్న బిడ్డల జ్ఞాపకం కోసం కట్టుకున్న స్థూపాలు
దారుల కిరువైపులా కూల్చబడి మీకు స్వాగతం చెబుతాయి’’

మానవ హక్కులంటే ఏమిటో పల్లెకొచ్చి ముచ్చటించాలన్నాడు. పల్లె ఏం నేరం చేసింది? కష్టించి పండించినా కడుపుకు తిండేదని అడగటం.

పంటకు గిట్టుబాటు ధర ఏదని అడగటం, రెక్కలు ముక్కలు చేసి రక్తాన్ని చెమట చేస్తే సుఖం, సంపద లేకపోవడానికి కారణం ఎవ్వరని ప్రశ్నించటం. ఆ ప్రశ్నే నేరం, ద్రోహం, కుట్ర అయింది. చివరకు అదే తిరుగుబాటు అయింది.

“‘డాలర్‍’ వాన తగిలి మనిషి నిలువెత్తు విద్రోహమైనప్పుడల్లా పల్లె పొలిమేరలన్నీ దింపుడు కల్లాలవుతున్నాయి’’. త్యాగం – విజయం రెండు భుజాల మీద, యుద్ధాన్ని తన తలమీద మోసుకొని భూమంతా పర్చుకున్నాడు.

గాయమ్మీద గాయమై తను నడుస్తున్న గాయమయ్యాడు. తప్పును తప్పన్నందున సంఘ వ్యతిరేకిగా ప్రకటించబడ్డాడు. తల్లిని నీవు క్షేమమా అని ఎలా అడుగుతాడు.

మనిషి మనిషిగా బతకాలన్నాడు. సమస్త శ్రమల సకల సంపదలు సృష్టించేవాడు మనిషిగా బ్రతకాలని కోరుకున్నాడు.

వర్గ రాజకీయాలు తెలియకున్నా, వర్గయుద్ధాలు తెలియకున్నా సమస్త శ్రమలు సకల సంపదలు సృష్టించటం తెల్సిన వాళ్ళుగా మన బతుకులు మనం బతుకాలన్నా, మన బువ్వ మనం తినాలన్నా మనం మనిషిగా బతుకాలన్నా మనం నిరాయుధులుగా పెంచబడొద్దని కవి చెప్పిన మాటలు అక్షర సత్యాలు.

‘‘తేల్చుకోక తప్పదు’’ కవితలో

‘‘రంగస్థలమే రెండు శిభిరాలుగా చీలి భీకరంగా పోట్లాడుకుంటున్నప్పుడు
ఇవాళ కాకపోతే రేపు
ఎవరి పాత్ర ఏమిటో తేలక తప్పదు
నీ పాత్ర ఏమిటో తేల్చుకోక తప్పదు’’ అంటాడు.

‘‘మౌనం మాటను మింగేస్తున్న కాలం యిది
మౌనాన్ని ప్రాసిక్యూట్‍ చేసి
మాటను బతికించుకుందాం” అంటాడు. ‘‘మాటను బతికించుకుందాం’’ కవితలో.

శాస్త్రీయ అవగాహనతో సమాజాన్ని అసమ సమాజంగా నిర్థారించుకొని సమాజంలోగల వైరుధ్యాలను గుర్తించాడు. అంతేగాక ఆ వైరుధ్యాలకు కారణాలను వెతకటంతోపాటు వాటిని నిర్మూలించే పరిష్కార మార్గాలను సూచించాడు. పరిష్కారాలను సూచించే క్రమంలో ఒకవైపు తుపాకి చేతపట్టి యుద్ధం చేస్తూనే, మరోవైపు కలం పట్టి ప్రజల జీవితంలోని వివిధ సమస్యలను మరింత అధ్యయనం చేసి నూతన సమాజ సాహిత్య సృజన చేశాడు.

నూతన సమాజ నిర్మాణాన్ని విజయవంతం చేయకుండా ప్రజల జీవితాలలో మార్పురాదు అని, విప్లవం అంటే వ్యవస్థీకృతమైన సమాజంలోనే అన్ని విభాగాల్లోనూ మౌళికమైన మార్పు తీసుకురావడం అని నిరూపించిన కవి కౌముది.

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply