కొలిమి

చినుకు కురిసిందంటే చాలు
ఊరు వూరంతా కొలువుదీరే
పేరోలగము.

పొలం పదునైందంటే చాలు
కొరముట్లు కాకదీరే
రంగస్థలము.

పంటకు
ఆది మధ్యంతర లయలందు
ఆయుధాల్నిచ్చే కర్మాగారము.

చేతివృత్తుల వూపిరులూదే
పల్లెతనము.

శ్రమశక్తులు చేతులుకలిపే
సమ్మెటతనము.

కొలిమి
మంటలో దగ్ధమై పునరుత్థానమయ్యే
నైపుణ్య పాటవము.

కొలిమి
అనాదిగా రగిలే
మేధోతనము.

కొలిమి
సనాతనంగా మండే
అగ్నిక్షేత్రము.

కొలిమి
పనిముట్లు పాడే
జానపదము.

కొలిమి
కాలిన కడుపులు మొలిపించే
చెమటవిత్తనము.

కొలిమి
సకల కర్మలు పుష్పించే
శూద్ర దేహము.

కొలిమి
ఆదిమానవ నాగరికతలు
వెలిగించిన బహుజన దీపము.

జననం: కర్నూలు జిల్లా. కవి, రచయిత, కథకుడు, విమర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖ లో డిప్యూటీ రిజిస్ట్రార్.  ఇప్పటి వరకు నాలుగు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, మూడు కథా సంపుటాలు, సాహితీ విమర్శ వ్యాసాలు ప్రచురించారు. కథలోనైనా, కవిత్వం అయినా రాయలసీమ గ్రామీణ ప్రాంత జీవితాన్ని బలంగా చిత్రించడానికే ప్రాధాన్యత యిస్తారు. అభ్యుదయ, బహుజన వాద మేలుకలయికగా సాహిత్య సృజన చేస్తున్నారు.

కవితా సంపుటాలు: 1. లోగొంతుక (2000), 2. దున్నేకొద్దీ దుఖ్ఖం (2005), 3. కొన్ని రంగులూ ఒక పద్యం (2010), 4. చినుకు దీవి (2016). దీర్ఘ కవితలు: 1. నదీ వరదా మనిషి (2009), 2. హంద్రీ గానం (2015). కథాసంపుటాలు:  1. గరుడ స్థంభం (2005), 2. చిలకలు వాలిన చెట్టు (2010), 3. దేవరగట్టు (2017).

Leave a Reply