ద‌గ్ధ‌మ‌వుతున్న కొలిమి బ‌తుకులు

వాళ్ల‌ను ఊరు త‌రిమింది. ఉన్న ఊరిలో ప‌నుల్లేవు. నిలువ నీడా లేదు. గుంటెడు భూమి లేదు. రెక్క‌ల క‌ష్ట‌మే బ‌తుకుదెరువు. ఇంటిల్లిపాదీ పొద్దంత ప‌నిచేస్తెనే రేప‌టికింత బువ్వ‌. కాయ‌క‌ష్టంతోనే క‌డుపు నింపుకుంట‌రు. ప‌నిలేక‌పోతె ప‌స్తులే. వాళ్ల గుండెల్నిండా దిగులు. దుఃఖం. ఆక‌లితో అల‌మ‌టించిన్రు. బుక్కెడు బువ్వ కోసం క‌ష్టాలెన్నోప‌డ్డ‌రు. ఉన్న ఊరినీ, క‌న్నవాళ్ల‌నూ వ‌దిలి వంద‌ల కిలోమీట‌ర్ల దూరానికి వ‌ల‌స వ‌చ్చిన్రు. బ‌తుకు పోరుచేస్తున్న‌రు. న‌గ‌ర కూడ‌ళ్ల దాపున బొగ్గు బుక్కి అగ్గి రాజేస్తున్న‌రు. ర‌గిలే కొలిమి ప‌క్క‌న చెమ‌ట‌, నెత్తురు ఆవిర‌వుతున్న బ‌డుగు జీవులు. వాళ్లే బీటి క‌మ్మ‌రోళ్లు. ఫుట్‌పాత్‌ల‌పై వేసుకున్న డేరాలే వీళ్ల‌కు నిలువ నీడ‌నిచ్చే క‌న్న‌త‌ల్లి. అక్క‌డే నిద్ర‌. అక్క‌డే తిండి. ఎండ‌ల్లో ఎండుతూ, వాన‌ల్లో నానుతూ. జీవ‌న్మ‌ర‌ణ పోరాటం వాళ్ల‌ది. ఎక్క‌డో మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్‌, ప‌ర్భ‌ణీ ప్రాంతాల‌నుంచి హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చిన్రు. కొలిమిలో ఇనుమును క‌రిగించి వివిధ ప‌నిముట్లు త‌యారు చేస్త‌రు. రోజంతా ప‌నిచేసినా ఐదారు వంద‌ల రూపాయ‌ల‌కు మించ‌వు. ఒక్కో ఇంట్లో ప‌దిమందికి పైనే ఉంట‌రు. ఇప్పుడే పుట్టిన న‌వ‌జాత శిశువు నుంచీ తొంభై ఏండ్లు దాటిన వృద్ధులున్న‌రు. వాళ్ల తాత‌ల త‌రం నుంచీ ఇదే బ‌తుకు. కొలిమి రాజేస్తెనే బ‌తుకుల్లో వెలుగు. లేకుంటే చీక‌టే.

ఈగ‌లు, దోమ‌ల‌తో సావాసం. కాలుష్య కోర‌ల్లో వ‌సివాడుతున్న బాల్యం, తిండిలేక బ‌క్క‌చిక్కిన గ‌ర్భిణీలు. పాలింకిపోయిన ప‌చ్చిబాలింత‌లు. పాలంద‌క గుక్క‌ప‌ట్టి ఏడుస్తున్న ప‌సికందులు. బ‌డి బాట తొక్క‌ని చిన్నారులు… ఈ దృశ్యం మ‌న‌ల్నికంట త‌డి పెట్టిస్త‌ది. వీపుపై చంటి పిల్ల‌ను జోలెక‌ట్టుకొని కొలిమి రాజేసే మ‌హిళ‌లు. గాలిలో లేసే స‌మ్మెట‌లు. దాగ‌ర‌పై ధ‌న్ ధ‌న్ ధ‌న్‌…మంటున్న స‌మ్మెట దెబ్బ‌లు. మ‌హిళ‌ల చేతుల్లో ఒడుపుగా తిరుగుతున్న స‌మ్మెట‌ల స‌య్యాట‌లు. ఇక్క‌డ బ‌తుకే ఓ యుద్ధ‌రంగం. న‌గ‌ర ఎడారిలో ఒయాసిస్సుల‌ను వెతుక్కుంటున్న దేశ‌దిమ్మ‌రులు వాళ్లు.

ఒక‌ప్పుడు వీళ్లు గ్రామాల్లో వ్య‌వ‌సాయ ప‌నిముట్లు చేసేవాళ్లు. ఉత్ప‌త్తిలో భాగ‌మ‌య్యేటోళ్లు. స‌బ్బండ కులాల ప్ర‌జ‌ల‌తో స్నేహాల వార‌ధి వీళ్ల‌ది. ప్ర‌పంచీక‌ర‌ణ దెబ్బ‌కు కుల‌వృత్తులు కూలిపోయిన‌య్‌. నాగ‌ళ్ల న‌డుములిరిగిన‌య్‌. నాగ‌లి, క‌ర్రు, గొర్రు, దంతెలాంటి వ్య‌వ‌సాయ ప‌నిముట్లు మూల‌కుబ‌డ్డ‌య్‌. భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ రాబందులు వాలిన‌య్‌. దున్నే భూమి లేదు. పంట‌లు పండించే నేల లేదు. కాలుపెట్ట సందులేకుండా అంతా క‌బ్జాల‌మ‌యం. నాగ‌లికి కొన‌సాగింపుగ ట్రాక్ట‌ర్లే దుక్కులు దున్నుతున్న‌య్‌. నాగ‌ళ్లు, వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు చేసే క‌మ్మ‌రోళ్లు, వ‌డ్లోళ్ల‌కు ప‌నిలేకుండ‌య్యింది. పొట్ట‌చేత‌బ‌ట్టుకొని ప‌ట్నాల‌కు వ‌ల‌స‌బోయిన్రు. బ‌హుళ అంత‌స్తుల మేడ‌ల నీడ‌ల కింద రాళ్లెత్తే కూలీల‌యిన్రు. స‌ద్ది బువ్వ క‌ట్టుకొని అడ్డాల ద‌గ్గ‌ర ప‌నికోసం తండ్లాడుతున్న‌రు. కొంద‌రు కుల‌వృత్తినే న‌మ్ముకున్నోళ్లు అదే ప‌నిని కొన‌సాగిస్తున్న‌రు. కొడ‌వ‌ళ్లు, గొడ్డ‌ళ్లు, క‌త్తులు, త‌వ్వ‌లు, మానిక‌లు, సోలెలు, గిద్దెలు, ప‌ట్టుకార్లు, పార‌లు, తాపీలు, లిఫ్ట్‌లో వాడే క‌మ్మీలు, టెంట్ హౌస్‌లో వాడే ఇనుప చువ్వ‌లు, జ‌ల్లెళ్లు, డేకీస‌లు… ఇట్లా మ‌నం నిత్య జీవితంలో వాడే ఎన్నెన్నో వ‌స్తువులు త‌యారుచేస్తున్న‌రు. ముడి ఇనుమును క‌రిగించి వ‌న్నె చిన్నెల రూపాలుగ మ‌లుస్తున్న‌రు. ఎన్ని రూపాల వ‌స్తువులు చేసినా వీళ్ల బ‌తుకు మాత్రం రోజు రోజుకూ మ‌సిబారుతున్న‌ది.

ఎల్బీ న‌గ‌ర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్ నుంచి చాంద్రాయ‌ణ‌గుట్ట దాకా వివిధ ప్రాంతాల్లో వంద‌లాది కొలుములు క‌న్పిస్త‌య్‌. ఆ కొలిమిల ప‌క్క‌నే దుమ్ములో ఆట‌లాడుకుంటున్న‌ చిన్నారులు. ర‌గిలే కొలిమి ర‌వ్వ‌ల్ని చూస్తున్న పండు ముస‌ళ్లు. వాహ‌నాల హార‌న్ మోత‌ల‌తో నిద్ర‌ప‌ట్ట‌ని రాత్రులు వాళ్ల‌వి. తాగే నీళ్లు లేవు. చెట్ల నీడ లేదు. ఎండ‌. ఎండ‌. బ‌తుకంతా ఎండే. మండే కొలిమి ప‌క్క‌న ఆవిర‌వుతున్న చెమ‌ట చిత్త‌డి జీవితం వాళ్ల‌ది. వానొస్తే రోడ్ల‌న్నీ మురుగుతో పొంగి ఫుట్‌పాత్‌పై వీళ్ల డేరాల‌ను ముంచెత్తుత‌య్‌. వాన కాల‌మొస్తే ర‌గ‌ల‌ని కొలుముల‌తో బ‌తుకెండిన జ‌నం వీళ్లు. పాత చీర‌ల తెర‌లే స్నానాల గ‌దులు. రాళ్లెత్తు పెట్టిన ఇనుప రాడ్ల మంచాలు. వాళ్లు ఇక్క‌డే బ‌తుకుతున్న కాందిశీకుల్లెక్క క‌న్పిస్త‌రు.

ఏడేండ్ల ప‌సివాడు కూడా కొలిమిలో మండే ర‌వ్వ‌వుతున్న‌డు. మోయ‌లేని బ‌రువున్న స‌మ్మెట‌తో గాలిలో విన్యాసాలు చేస్తున్న‌డు. స‌మ్మెట‌లో ఒడుపుగ దెబ్బ‌లు వేస్తుంటే వాడి నైపుణ్యానికి ఆశ్చ‌ర్య‌పోతం. మొస‌పోసుకుంట‌నే త‌న దేహాన్నే యంత్రంగ మార్చుకున్న‌ట్టు క‌న్పిస్త‌డు. నుదుటి నుంచి చెంప‌ల‌పై జారే చెమ‌ట తుడుచుకుంటూ, సుత్తెతో సుతారంగ మోదుతున్న నైపుణ్యం. ”చిన్నా… బ‌డికి పోతున్న‌వా?” అని అడిగితే… ఏమీ అర్థం కాన‌ట్టు చూసిండు. చినిగిన అంగీలోంచి క‌నిపిస్తున్న ఎండిన డొక్క ఎంత ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌డో చెప్పింది. కొలిమిలోంచి ర‌గిలి ఎగిరిన నిప్పు ర‌వ్వ‌లు కాళ్లు, చేతుల నిండా గాయాలు చేసిన‌య్‌. బొబ్బ‌ల్లేసిన అర‌చేతులు. కాలిన కాళ్లు. ఆ ప‌సివాడి ఆక‌లి పోరాటం చూస్తుంటే క‌న్నీళ్లు రాక మాన‌వు. వెనుదిరిగి వ‌స్తుంటే వాడు చూసిన జాలి చూపులు ఈ జీవితాంతం వెంటాడుత‌య్‌.

వాడి రూపమింకా క‌ళ్ల‌ల్లోంచి మాయం కాక‌ముందే నాలుగ‌డుగుల దూరంలో ఇంకో దుఃఖిత దృశ్యం. సుమారు ఎన‌భై ఏండ్లు దాటిన ముస‌లి త‌ల్లి బులోజ‌ర్ తిప్పుతూ క‌న్పించింది. కొలిమి మంట‌ల‌కు క‌మిలి, ఎముక‌లు తేలిన దేహం. ఆమె ఆ మంట‌ల్ని చూస్తూ న‌వ్వుతున్న‌ది. రోడ్డుపై న‌డిచే జ‌నాన్ని తీక్ష‌ణంగా చూస్తున్న‌ది. ఆ చూపుల్లో ఎంతో వేద‌న‌. ఏదో అల‌జ‌డి. క‌దిలిస్తే ఏడ్చేట‌ట్టు ఉన్న‌ది. ద‌గ్గ‌రికి పోంగ‌నె ”కూసో బిడ్డా…” అని సైగ చేసింది. ఆమెతో మాట‌లు క‌లిపినం. మ‌హారాష్ట్ర నుంచి వ‌ల‌సొచ్చిన‌ట్టు చెప్పింది. ఆమె మాట‌ల్లో… జ్ఞాప‌కాల్లోంచి ఒక్కో దృశ్య‌మూ వెతుకుతూ చెప్పిన‌ట్ట‌న్పించింది. ”నాకు ప‌ద్నాలుగేండ్ల‌కే పెండ్ల‌యింది. ఇర్వై నాలుగేండ్ల‌కు న‌లుగురు పిల్ల‌ల త‌ల్లిని. పెండ్ల‌యిన రెండేండ్ల‌కే ఐద్రావాదొచ్చినం. అప్ప‌న్నించీ ఇక్క‌న్నే. కొలింబెట్టే బ‌త్కినం. ఈ కొలింతోటే పిల్ల‌లంద‌రి పెండ్లీలు చేసినం. మా సొంతూరికి ఎప్పుడో ఒక సారి పోతం. ఏడాదికోసారి. అక్క‌డ బ‌త్కుడే మా క‌ష్ట‌మాయె. ఈడికొచ్చినంక‌నే అంతో ఇంతో బ‌త్కుతున్నం. ఒక్కోపాలి నీల్లు దొర‌క‌వు. ఈ బ‌జారోల్లు న‌ల్లాల ద‌గ్గ‌ర కూడా నీల్లు ప‌ట్టుకోనియ్య‌రు. రేష‌న్ కార‌ట్లు లెవ్వు. ఎవ్వ‌ల్నడిగినా ప‌ట్టించుకోట్లే. ఓట్ల కార‌టు మాత్రం ఉన్న‌ది. ఇక్కడి క‌న్సిల‌రే ఇప్పిచ్చిండు. ఓట‌డుగ‌నీకి ఒస్త‌రు గ‌ని, మా బ‌త్కెవ్వ‌లు సూడ‌రు. పించిన్ సుత లేదు. ఎన్నిసార్ల‌డిగినా ఫాయిద లేక‌పాయె”… ఆమెను వింటుంటే ‘నీ బ‌తుకే క‌ష్టాల కొలిమాయెనా త‌ల్లీ…’ అనిపించింది. ఎన్ని క‌న్నీటి న‌దుల్నో ఈది వ‌చ్చిన బ‌తుకు ఆమెది. ఒక్క ఆమేనా? ఈ న‌గ‌ర‌పు తారు ఎడారిలో బ‌తుకీడుస్తున్న ఎంద‌రో ఆమెలు.

వాళ్ల బ‌తుకు చిత్రాన్ని ఫొటోలు తీస్తుంటే తీయొద్ద‌న్న‌ది. ”బిడ్డా… ఏమ‌నుకోకుర్రి. ఒద్దు బిడ్డా. పుటోలు తియ్య‌కురి. మీరీ పుటోలు పేప‌ర్లేత్తె మా బ‌త్కు తెర్ల‌యిత‌ది. మున్సిపాల్టోల్లొచ్చి ఈన్నించి ఎల్ల‌గొడ్త‌రు. ఉన్నొక్క జాగ‌బోతె మేమేడ బ‌త్కాలె బిడ్డా…” అన్న‌ది. ఆ మాట‌లు మామూలుగానే ఉండొచ్చు. కానీ, వాటి వెనుక ఎంత దుఃఖ‌మున్న‌దో అనుభ‌విస్తేగాని తెల్వ‌దు. ‘ఊరు త‌రిమితేనే ఇక్క‌డికొచ్చినం. ఈణ్నించి త‌రిమితే ఎక్క‌డికి పోవాలె’ అని త‌ల్ల‌డిల్లే త‌ల్లి హృద‌య‌మున్న‌ది.

వాళ్ల‌తో మాట్లాడి తిరిగి వ‌స్తుంటే ఆ డేరాల ద‌గ్గ‌రే క‌న్పించిందో ప‌దేండ్ల పాప‌. ఆరో త‌ర‌గ‌తి చ‌దివే భార‌తి. అక్క‌డున్న ప‌ది కుటుంబాల్లో చ‌దువుతున్న ఒకే ఒక పాప. ఆ చిన్నారితో క‌ర‌చాల‌నం చేసి వెనుదిరిగి వ‌స్తుంటే కొలిమిలో కాలిన అక్ష‌రాలేవో చేతికి చ‌ల్ల‌గా అంటిన అనుభూతి. కొలిమిలో ద‌గ్ధ‌మ‌వుతున్న బ‌తుకుల్లో మెరిసిన కాంతి రేఖ ఆమె.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ); సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు). ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

2 thoughts on “ద‌గ్ధ‌మ‌వుతున్న కొలిమి బ‌తుకులు

  1. It’s true sir,వాళ్ళ లైఫ్ చూస్తే బాధగా ఉంటుంది

  2. కొలిమి ముచ్చట నా కళ్ళల్లో నీళ్ళు నింపినయి…వారి జీవితాలకీ అద్దం పట్టినట్లుంది సుధా…జీవితమే ఓ పోరటం …

Leave a Reply