‘కొలిమంటుకున్నది’ నవల: నేపథ్యం, ప్రాసంగికత, ఉపకరణాలు

‘కొలిమి’ ఇంటర్నెట్ పత్రిక వారు వాళ్ళ కోసం ఏదైనా కాలమ్ రాయమన్నారు. రకరకాల పనుల వలన, నా మానసిక స్థితుల వలన – కాలమ్ వంటిది రాయడం నాకు ఎప్పుడూ కుదరలేదు. నన్ను అడుగుతున్న ‘కొలిమి’ వారు నాకన్నా ముందు తరం వారు. వారికున్న అధ్యయనం, సంయమనం, జీవితానుభవం, మాతరం కన్నా వైవిధ్య పూరితమైనది, విస్తృతమైనది… కనుక నేటి కాలపు వైరుధ్యాలను- నశించిపోయే పాతదాన్ని, రూపొందుతున్న కొత్తదాన్ని గుర్తించడంలో చురుకైనవాళ్లు. కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తున్న యువత – ముఖ్యంగా విద్యార్థి రంగంలో, ఆదివాసీ, దళిత, బహుజన, మహిళా, మత మైనార్టీ- అనేక ప్రజాస్వామిక, సామాజిక, రచయితల సంఘాలల్లో, వేదికలల్లో, వేలాదిమంది తాము జీవిస్తున్న స్థలకాలాల నేపథ్యంలో సమాజాన్ని శాస్త్రీయంగా, గతితార్కికంగా అర్థం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి అలాంటి కొత్త ఆలోచనలను, ఆచరణను తీసుకుపోతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే దోపిడి పీడనల మీద ఆధారపడిన సమస్త భావజాలం ప్రశ్నించబడుతోంది. గతితార్కిక భౌతికవాద, చారిత్రిక భౌతికవాద దృష్టికోణం బలపడుతోంది. యువకులు తాము నివసిస్తున్న స్థలకాలాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు… వ్యాఖ్యానిస్తున్నారు… మార్చడానికి ఉద్యమాలు చేస్తున్నారు.

కనుకనే భారతదేశంలోని అర్థభూస్వామ్య, ఆర్తవలస ప్రభుత్వాలు, వ్యవస్థలు ప్రతిగా మునుపెన్నడూ లేనంతగా- అనేక పత్రికలు, మీడియా ఛానెల్లూ పెట్టి అబద్ధాలు, అశాస్త్రీయ పుక్కిటి పురాణాలు ప్రచారం చేస్తున్నారు. అయితే- రాశిలో ఉప్పెనలా వస్తున్న ఈ హోరు తప్పక కుప్పకూలిపోవాల్సింది. కూలిపోతుంది. మరెంతమాత్రమూ ఈ కట్టుకథలు నమ్మని – ఎదిరించే తరం – పోరాడే తరం – గత యాభైయేండ్లుగా జరుగుతున్న విప్లవోద్యమ నేపథ్యంలో రూపొందడం ఒక గొప్ప పరిణామం. ముఖ్యంగా దళితుల నుండి, ఆదివాసీల నుండి, మహిళల నుండి, మత మైనారిటీల నుండి కొత్త తరపు యువమేధావులు తమ పరిధిలో, పద్ధతిలో పోరాటంలో ఉన్నారు. అయితే అలాంటివారికి పత్రికలు గాని, ఉమ్మడి వేదికలు గాని, ఏర్పడి పని చేయకుండా ఎక్కడి కక్కడ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు – రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు… భౌతికదాడులు చేస్తూ, మేధావులను, పత్రికా విలేకర్లను, రచయితలను చంపుతున్నారు… దళితుల మీద, మత మైనారిటీల మీద, మహిళల మీద అమానవీయ దాడులు చేస్తున్నారు. ఇంకో పక్క అన్ని రకాల ప్రజాస్వామిక సంస్థలల్లో చొరబడి లోలోపల నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక సంస్థలను లోపాయికారిగా జాతీయ, అంతర్జాతీయ బహుమతులు, పదవులు, ఆర్థిక సహాయంతో నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

కానీ దీన్ని మార్చాలి. అలాంటి గొప్ప యుద్ధం, గత యాభయేండ్లుగా, మూడు తరాలుగా కొనసాగుతోంది. దేన్ని మార్చాలి? ఎట్లా మార్చాలి? ఎవరు మార్చాలి? చోదక శక్తులెవరు? మార్చడానికి సంబంధించిన నిర్మాణాలేమిటి? వైరుధ్యాలను అర్థం చేసుకొని ప్రజలను సమీకరించి ముందుకు నడిపే పార్టీ – వైరుధ్యాలను పరిష్కరించడానికి అడ్డంకిగా ఉన్న శక్తులతో తలపడి ప్రజలకు రాజ్యాధికారం సాధించే ప్రజాసైన్యం – ఈ క్రమంలో భిన్న శక్తులను కలిపే ఐక్యసంఘటనగా ముందుకు వచ్చి కొనసాగుతోంది.

ఫ్రెంచ్ విప్లవం 70 రోజులు మాత్రమే నిలబడింది. రష్యా విప్లవం 1906 నుండి బోల్షవిక్ పార్టీ ఏర్పడి 1917 వరకు 11 సంవత్సరాల పోరాటంతో రాజ్యాధికారంలోకి వచ్చింది. చైనాలో 1931 నుండి 1949 సుమారు 18 సంవత్సరాలల్లో రాజ్యాధికారంలోకి వచ్చారు. కానీ భారతదేశంలో గత యాభై సంవత్సరాల కాలంలో విప్లవోద్యమాలు సుదీర్ఘ అనుభవం గడించాయి.

ఈ నేపథ్యంలో పెరిగిన యువకులు సుమారు 30 కోట్ల మంది భారతదేశ వ్యాపితంగా తీవ్రమైన అశాంతితో తమ విముక్తి కోసం దారులు వెతుకుతున్న కాలం…

నిత్యనిర్బంధంలో ఇలాంటి యుద్ధాన్ని ఆరంభించి సుదీర్ఘ అనుభవం గడించిన విప్లవోద్యమం ఇలాంటి ముప్పై కోట్ల మంది యువకుల ఆలోచనలతో, శక్తితో మమేకమయితే ఏం జరుగుతుందో భారతదేశ భూస్వాములకు తెలుసు. దళారీ బూర్జువాలకు తెలుసు. ముఖ్యంగా పెద్దన్న అమెరికాను తెలుసు… కనుక వారు అన్ని రకాలుగా ఈ యుద్ధరంగంలో మోహరించి ఉన్నారు. భారతదేశంలోని అన్ని రంగాల మీద పట్టు సాధించి ఉన్నారు.

1967 నుండి ఇలాంటి యుద్ధరంగంలో మావంతు కర్తవ్యంగా నిలబడి – మా శక్తి మేరకు ఇలాంటి పరిణామాలను చిత్రించిన కొద్దిపాటి సాహిత్యం ఇలాంటి దారులు వెతుకుతున్న యువతరానికి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడినా… ఇలాంటి యువతతో మమేకమవ్వడానికి ఇదొక చిన్న ప్రయత్నం.

ఈ నేపథ్యంలో మొదటగా ‘కొలిమంటుకున్నది’ నవల గురించి ‘కొలిమి’ పత్రికవారు రాయమన్నారు.

1969 లో ఆరంభమై 1972 లో నాయకత్వ విద్రోహం వలన ఆగిపోయిన ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న మా తరం తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యింది. సరిగ్గా అదే కాలంలో నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమం అణచివేయబడినా కూడా దేశవ్యాపితంగా స్ఫూర్తినిచ్చాయి. కోపోద్రిక్త యువతరం సంఘటితపడి విప్లవోద్యమాలు చేయాలని దారులు వెతుకుతున్న కాలం. అప్పటీకే విరసం, జననాట్యమండలి ఏర్పడ్డాయి. పల్లెలో పుట్టిపెరిగిన నాలాంటి వాడికి – పల్లెలోని దోపిడి, హింస, కుల వివక్షత కారణాలేమిటి, వాటిని ఎదుర్కొని రూపుమాపలేమా అని ఆలోచిస్తున్న కాలంలో, శ్రీ శ్రీ కవిత్వం, పాణిగ్రాహి పాటలతో పాటు కార్ల్ మార్క్స్, లెనిన్, చారుమజుందార్, కొండపల్లి సీతారామయ్య లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. త‌మ మీద జ‌రిగే అన్ని ర‌కాల దోపిడీ, దౌర్జ‌న్యాల‌కు ఎదురుతిరుగుతున్న‌ పీడితుల‌ను ఏకం చేసి సంఘ నిర్మాణం చేయ‌డానికి సంబంధించిన ఆలోచ‌న‌లు, ప్ర‌య‌త్నాలు సాగుతున్న కాలం.

ఒక్క మాట‌లో చెప్పాలంటే మాకు క‌నిపిస్తున్న జీవితం వెన‌క ఉండే ఉత్ప‌త్తి వ‌న‌రులు, ఉత్ప‌త్తి శ‌క్తులు, ఉత్ప‌త్తి సంబంధాలు – వాటి ప‌రిణామ క్ర‌మం, చ‌రిత్ర అర్థ‌మ‌వుతున్న కాలం.

ప్ర‌జ‌ల కోసం విప్ల‌వ పార్టీలు ప‌నిచేస్తున్నాయి. జ‌న జీవితంలో మార్పు క్ర‌మం ఆరంభ‌మై వేగాన్ని అందుకుంటున్న‌ది. బాంచెగాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. పోరాటాలు వివిధ రూపాల్లో ఆరంభ‌మై భూపోరాట రూపం తీసుకుంటున్నాయి. నా ఆలోచ‌న‌ల్లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఇలాంటి పోరాటాలు, ఆలోచ‌న‌లు చేస్తుండ‌గానే 1974లో మా వూరికి ప‌దిహేను కిలోమీట‌ర్ల దూరంలో గ‌ల ఒక దొర దౌర్జ‌న్యాన్నివివ‌రంగా తెలిపే ఒక క‌ర‌ప‌త్రం దొరికింది. ఆ క‌ర‌ప‌త్రం న‌న్ను అత‌లాకుత‌లం చేసింది. మా వూళ్లోని మా మామ‌లు, చిన్నాయినెలు, పేద రైతుల దీన‌గాథ‌లే ఆ క‌ర‌ప‌త్రం. ఆ వూళ్లోని – ఆ చుట్టుప‌క్క‌ల గ్రామాల‌ల్లోని ప‌రిస్థితులు తెలుసుకోడానికి దాదాపు మూడు నెల‌లు తిరిగాను. ఆ వూరికి కంక‌ర రోడ్డు ప‌ని నేనే చేయించేవాన్ని. డొక్కు సైకిలేసుకొని తిరిగేవాన్ని. విష‌యాలు- వివ‌రాలు తెలిసినాకొద్ది నాలో అల‌జ‌డి ప్రారంభ‌మ‌య్యింది. ఒక పేద‌రైతు త‌న పెర‌డుకు క‌రెంటు మోటారు బిగించుకునే క్ర‌మంలో ఆ వూరి దొర క‌రెంటు స్తంభాలు- తీగె ఎత్తుక‌పోయి త‌న తోట్లో నాటించుకుంటాడు. ఇదేమిట‌ని అడిగిన పాపానికి ఆ దొర రైతు కుటుంబం మీద దాడిచేసి ఆఖ‌రుకు ఆ భూమి అమ్మేదాకా విడిచిపెట్ట‌లేదు. ఈ విష‌యాల‌న్ని నేనెరిగిన‌వే. కానీ, ఈ మొత్తం క్ర‌మంలో పేద‌రైతుల వ్య‌క్తిగ‌త పెనుగులాట‌- సంస్థాగ‌తంగాని పోరాటాలు- బ‌హుశా ఒక నిర్మాణ రూపం ఎట్లా రూపొంద‌గ‌ల‌దా? అని ఆలోచిస్తున్నాను. నేను రాయాల‌నుకొని ఈ విష‌యాల‌న్ని తెలుసుకోలేదు. ఏమ‌న్న చేయ‌గ‌ల‌మా? అనే ఉద్దేశంతో తెలుసుకున్నాను. నా లోప‌ల రూపొందుతున్న – నేను చూసిన విష‌యాలు నాకు క‌న్పించిన వారిక‌ల్లా చెప్పుతుండేవాన్ని.

ఏ పుట్ట‌ల ఏ పామున్న‌దో? ఇలాంటి విష‌యాల ప‌ట్ల అంద‌రు ఏమ‌నుకుంటున్నారో? ఒక కానిస్టేబుల్ విని పెద్ద‌గా అరుస్తూ వాన్ని చంపేయాల‌న్నాడు. ఎట్లా అన్నాను నేను. కానిస్టేబుల్ నా ముఖంలోకి చాలాసేపు చూసి మౌనంగా వెళ్లిపోయాడు. అట్లా ఆరు నెల‌లు గ‌డిచిన త‌ర్వాత 1974లో 40 పేజీల క‌థ‌నుకొని రిపోర్టు రాశాను. ఒక సంవ‌త్స‌రం నా గొడ‌వ‌ల్లో ప‌డి ఒదిలేశాను. ఆ విష‌యాలు చెప్పంగ చెప్పంగ పెరిగిపోయాయి. వినేవాళ్ల ప్ర‌శ్న‌ల‌ను బ‌ట్టి పాత్ర‌ల రూపు రేఖ‌లు వ‌చ్చాయి. ఇలాగే రాయ‌మ‌న్నారు. 1975 లో రాశాను. 80 పేజీల‌య్యింది. మిత్రులు న‌వ‌ల‌లో రాసిన భాష గురించి మాట్లాడారు. మ‌ళ్లీ తిరుగ‌రాసే ప్ర‌య‌త్నంలో 120 పేజీల‌య్యింది. ఒక వార‌ప‌త్రిక న‌వ‌లల‌ పోటీకి పంపాను. న‌వ‌ల తిరిగి వ‌చ్చింది. మ‌ళ్లీ రాశాను. పాత్ర‌లు మా మామ‌లు, మా వూరివాళ్ల‌య్యారు. న‌ర్సింహం చుట్టూ రైతులంద‌రు చేరుతున్నారు. మొత్తానికిది న‌వ‌ల‌ని ఎవ‌రు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయారు. లోలోప‌ల ఎగిసిప‌డే మంట‌. క్రూర‌మైన భూస్వామ్యం గురించిన మంట‌.

బ‌య‌ట అనేకం జ‌రుగుతున్నాయి. ఉద్యోగ రీత్యా ఆదిలాబాదు జిల్లాలోని మంచిర్యాల‌కు వ‌చ్చాను. ఎమ‌ర్జెన్సీ వ‌చ్చేసింది. మా త‌మ్ములిద్ద‌రు అల్లం నారాయ‌ణ‌, వీర‌య్య‌ల‌ను అరెస్టు అయ్యి చాలామంది మిత్రుల‌తో పాటు లాక‌ప్పులో మ‌గ్గుతున్నారు. అనేక చిత్ర‌హింస‌లు పెడుతున్నారు. చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మా త‌రం అంద‌రిలాగే నేను అలాంటి రైతాంగ ఉద్య‌మాల‌తో ఉన్నాను. ఎమ‌ర్జెన్సీ ఎత్తేసిన త‌ర్వాత ఉద్య‌మాలు పెద్ద ఎత్తున చెల‌రేగాయి. జ‌న‌నాట్య మండ‌లి, రాడిక‌ల్ విద్యార్థులు గ్రామాల‌కు త‌ర‌లారు. గ‌ద్ద‌ర్‌, గూడ అంజ‌న్న‌, సాహు, అల్లం వీర‌య్య పాట‌లు ప‌ల్లెల్ల సుళ్లు తిరుగుతున్నాయి.

(ఇంకా ఉంది…)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

4 thoughts on “‘కొలిమంటుకున్నది’ నవల: నేపథ్యం, ప్రాసంగికత, ఉపకరణాలు

  1. అన్న! ఈ తరం సాహితి కారులకు మీ సాహిత్యం మీ అనుభవాలు చాల అవసరం. ఇప్పటి తరం “కడుపులో చల్ల” కదలకుండా అలవోకువగా రచనలు చేస్తున్నారు. నాటి తరం అనుభవించిన హింస అంతాఇంతాకాదు. కలాల మీద, గళాల మీద ఎప్పుడు పోలీసుల నిఘా ఉండేది. పోలీసులు ఎంతమంది కవులను ,రచయితలను కళాకారులు పొట్టనపెట్టుకొన్నారో వీళ్లకు తెలియదు. తెలంగాణాలో వందలమంది వ్రాసేవాళ్లను పోలీసులు భయపెట్టి బాధపెట్టి సాహిత్య వ్యవసాయానికి దూరం చేశారు.

  2. బహుజనులు ,దళితులు,పీడీతులు అందరూ కలిసి చేసే పోరాటాల కు రూపు దిద్ది నడి పించే పార్టీ కావాలి ఇప్పుడు.

Leave a Reply