కొలకలూరి ఇనాక్ కథలు – దళిత జీవిత చిత్రణ

ఇనాక్ కథలు ప్రధానంగా దళిత జీవితంలోని ఆత్మగౌరవ ధిక్కార స్వభావానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటరానితనాన్ని నిషేధించిన భారత రాజ్యాంగం (17 వ అధికరణం) అమలులోకి వచ్చిన నాలుగేళ్లకు కథారచన ప్రారంభించిన ఇనాక్ ఆ మరుసటి సంవత్సరమే అంటే 1955 లో అంటరానితనం నేరం అని చట్టం వచ్చినా దళితులను ఆ పేరు మీద న్యూన పరచటం, అవమానించటం, హింసించటం, చంపటం ఏ మాత్రం ఆగని సమకాలీన సమాజాన్ని చూస్తూనే ఉన్నారు. కంచికచెర్లలో కోటేశును ఇత్తడి చెంబు దొంగతనం చేసాడని ఆరోపించి చెట్టుకు కట్టి కిరసనాయిలు పోసి సజీవ దహనం చేసిన (1969) ఘటన నాటి నుండి ఆయన దళితులపై అణచివేతను, హింసను గమనిస్తూనే ఉన్నారు. ఆలోచిస్తూ స్పందిస్తున్నారనటానికి అంటరానితనం, విద్య, ఉద్యోగాలు, పదవులు, రాజకీయాలు, స్నేహాలు, ప్రేమలు, సంస్కృతి విలువలు, మతం, ధిక్కారం, తిరుగుబాటు మొదలైన దళిత జీవిత పార్శ్వాలను వస్తువుగా చేసివ్రాసిన అనేక కథలు నిదర్శనం. ఆ వరుసలో ముందు చెప్పుకోవలసినది ‘ఊరబావి’(1969 జులై 2 , ఆంధ్రప్రభ)

ఊరబావి కథ నీటి సమస్యతో మొదలవుతుంది. దళితుల నీటిసమస్య కానీ, ఆ సమస్య పై కథలు కానీ కొత్తకాదు. ఊరి నుండి మాల మాదిగ పల్లెలను వేరుచేసిన సవర్ణ దురహంకారం ప్రజా వినియోగ వ్యవస్థలను ముఖ్యంగా బావి, బడి, గుడి- ఈ మూడింటినీ దళితులకు నిషేధించింది. దీనిని సవాల్ చేస్తూ వాటిని దళితుల అనుభవానికి తీసుకురావటానికి 1927లో మహద్ చెరువులో దళితుల ప్రవేశానికి అంబేద్కర్ ఒక ప్రజా ఉద్యమాన్నినిర్మించి దారి చూపాడు. అలాగే ఇనాక్ కంటే ముందుగానే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఊరచెరువు నీళ్లలో వాటాకోసం బతిమిలాడి భంగపడిన దళితులు ముస్లిం మతంలోకి మారి చెరువులోదిగే అర్హతను సంపాదించిన వైనాన్ని ‘అలాంటి తవ్వాయి వస్తే’ అనే కథగా వ్రాసాడు. ఆ వరుసలో దాదాపు పాతికేళ్ల తరువాత స్వతంత్ర భారతదేశంలో కొత్త చైతన్యంతో ,యుద్ధవ్యూహాలతో ఆ సమస్యను పరిష్కరించుకొనటం వస్తువుగా వచ్చిన కథ ఊరబావి. ఎండాకాలం వంద గడప ఉన్న పల్లె బావి ఎండిపోయి ఊరబావి మీద ఆధార పడవలసిన స్థితిలో నాటకీయ పరిణామాలతో వాస్తవ భూమికమీద విస్తరించిన కథ ఇది.

ఊరబావిలోకి దించబడిన చర్మం వలిచిన ఎద్దు కళేబరం చూడటానికి ఊరంతా వస్తున్న ఒకానొక ఉదయం పూట ప్రారంభమైన కథలో అందుకు కారకుడుగా చిదంబరం అనుమానించబడంతో కదలిక మొదలవుతుంది. చిదంబరం ఎందుకు అనుమానించబడ్డాడు? అది అతని తండ్రి రామయ్య క్రితం రోజు రైతు నాంచారయ్య దగ్గరనుండి తన వంతుగా తెచ్చుకొన్న చచ్చిన ఎద్దు కళేబరం కనుక. ఎద్దు దట్టేం పడిన బావినీళ్లు ఊరివాళ్ళు ముట్టరు కనుక పల్లెవారి నీటి సమస్య పరిష్కారానికి చిదంబరం ఆ పని చేసి ఉంటాడనుకొనటం వల్ల. అతనిలో ఆ తిరుగుబాటు లక్షణం అందరికీ తెలిసిందే కనుక. ఏమిటి అతను చేసిన తిరుగుబాట్లు? ఒకటి తాను కోరుకొన్న పిల్లతో పెళ్ళయితే గుళ్లో పాతిక కొబ్బరికాయలు కొడతానని మొక్కుకొని పెళ్లయ్యాక ఆ మొక్కు తీర్చుకొనటానికి ధర్మకర్తల నుండి, పెత్తందార్ల నుండి వచ్చిన అవరోధాలను చట్టం సహాయంతో, పోలీసు అండతో తీర్చుకొనటం. రెండవది. రైల్వే స్టేషన్లో భార్యతో పాటు సిమెంటు బెంచీ మీద కూర్చుని పెద్దలు వచ్చినా లేవక అందరితో పాటు ఖాళీగా ఉన్న బెంచీ మీద తనకూ కూర్చునే హక్కు ఉందని స్టేషన్ మాష్టారు ముఖతః చెప్పించటం. ఈ రెండు పబ్లిక్ ప్రదేశాలలో సమానహక్కుల కోసమైన దళిత యువత ఆరాటం కనిపిస్తుంది. వీటిని బట్టి ఇది చిదంబరం పనే అయివుంటుందని మునసబు తీర్మానానికి వచ్చాడు.

పేరు లేని చిదంబరం భార్య ఆత్మగౌరవ చైతన్యపు ఉనికి మాత్రం కథ అంతా పరుచుకొని ఉంటుంది. రైల్వేస్టేషన్ లో చిదంబరం పై ఎత్తిన ఆసామి చెయ్యిని పట్టి ఆపటంలో అదే కనబడుతుంది. చిదంబరం ఆత్మాభిమాన ప్రకటనకు ప్రేరణ ఆమె పక్కన ఉండటమే అని రచయిత చెప్పాడు కూడా. ఊరబావి దగ్గర నీళ్ల కోసం పడిగాపులు పడి నీళ్లు తోడిపోసిన యువకుడు కడవ నెత్తికెత్తుతానని మీద చెయ్యేసిన తీరును అక్కడే అతనిని ఒక చెంపదెబ్బ కొట్టటంతో నిరసించి ఇంటికొచ్చి అందరికీ చెప్పుకొనటం లోనూ అన్యాయాన్ని సహించని వ్యక్తిత్వమే కనబడుతుంది. ఊరి మీదికి పోయి ఇదేమిటని నిలదీయాలి అని ఉద్రేక పడుతున్న తోటివాళ్లను మామ రామయ్య తొందర మంచిది కాదు, కోరి గొడవలు తెచ్చుకోవద్దు అని ఆపేసాడు. కొడుక్కి కూడా శాంతమే నూరిపోశాడు. ఊరబావికి నీళ్లకు పోవటం వల్ల కదా సమస్య అని తానే ఇంటికి అవసరమైన నీళ్లు మోశాడు భర్త చిదంబరం. ఈ రెండూ ఆమెకు సంతృప్తినిచ్చిన చర్యలు కావు అని రచయిత ఎక్కడా చెప్పలేదు. కానీ ఊరబావి దగ్గర వ్యక్తిగా తనకు జరిగిన అవమానానికి అందుకు మూల కారణంగా తనను అక్కడికి వెళ్లి నీళ్లకోసం సవర్ణులను దేబరించవలసిన అనివార్యతను కల్పించిన పల్లె అందరికీ సంబంధించిన నీటి సమస్యకు ఎక్కడో సంబంధం ఉన్నదన్న గ్రహింపు ఆమెకున్నట్లు పాఠకులు అర్ధంచేసుకొనటానికి వీలుగా కథను నడిపించడంలో ఉంది రచయిత చాతుర్యమంతా. వ్యక్తిగతమూ అదే సమయంలో సామాజికమూ అయిన సమస్యకు పరిష్కారంగా మామ చర్మం వలచి వదిలిన ఎద్దుకు మోకులు కట్టి బావిలోకి దించే పని ఆమే చేసి ఉంటుందని ఎక్కడా వాచ్యం కాలేదు. బావిని పల్లెకు వదిలేసినట్లు నిర్ధారణ అయ్యాక అందులోని ఎద్దు కళేబరాన్ని బయటకు తియ్యటం లో ఆమె చూపిన ఆవేశం, చొరవ, మెలకువ చూస్తే అది ఆమె పని అయివుంటుందని అనిపించక మానదు. చైతన్యవంతమవుతున్న మాలమాదిగ పల్లెల మానవ ముఖచిత్రంగా ఈ కథ కనిపిస్తుంది.

‘అస్పృశ్య గంగ’ కథ ఊరబావి కథకు మరొకరకమైన కొనసాగింపు. 1999 లో అస్పృశ్యగంగ కథల సంపుటి ప్రచురిస్తూ ఇనాక్ అవలోకనం అనే పేరుతో వ్రాసిన చిన్న ముందుమాటను బట్టి అందులోని కథలు 1996 -1999 మధ్యకాలపువి. ఊరబావి కథకు పాతిక సంవత్సరాల తరువాతది. చిదంబరం తరువాతి తరం. చదువుకొని ఉద్యోగాలకు వచ్చిన తరం మునసబుల పెత్తనాల నుండి బయటపడవచ్చుగానీ అస్పృశ్యత నీడలా వెంట వస్తూ బహురూపాలలో అనుభవానికి వస్తుంటే లోలోపల ఘర్షణ పడుతూ, ఎదుర్కొనటానికి అవసరమైన వ్యూహాలను, తర్కాన్ని, తాత్వికతను కూడా అభివృద్ధి చేసుకొనే దిశగా చేయవలసిన ప్రయాణం ఈ అస్పృశ్య గంగ కథకు వస్తువు.

1996- 1999 మధ్యకాలపు కథ ఇది. అంటే అప్పటికి తెలుగునాట దళిత ఉద్యమ చరిత్ర రెండవ దశకంలోకి ప్రవేశించింది. కారంచేడు నుండి చుండూరు మీదుగా దళితులపై జరుగుతున్న అగ్రకుల దురహంకార దాడులకు, హత్యాకాండకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ ధిక్కార పోరాటంగా ప్రవహిస్తున్న చరిత్ర ఇందులో ప్రత్యక్ష వస్తువు కాదు కానీ ఆ ఒరిపిడిలో దళితులు ఎలా, ఎంతంగా సహన శక్తులను కూడ దీసుకొంటున్నారో, సమత్వ విలువలను అభివృద్ధి చేసుకొంటున్నారో ఈ కథ చూపిస్తుంది. కాలేజీ అధ్యాపకుడైన వినాయక్ బడిపంతులు అయిన భాగీరథి దంపతులు నూటముప్ఫయ్ ఇళ్ల కాలనీలో ఒక ఇంటి స్వంతదారులు. సవర్ణుల మధ్య దళితులు స్థలం కొనుక్కోరాదని, ఇల్లు కట్టుకోరాదని ఏ నిషేధాలూ ఉండవు. కానీ వాళ్ళ మధ్య జీవించటంలో అప్రకటిత అస్పృశ్యత అనుభవానికి రావటమే అసలు విషాదం. అది ఆడుకొనే పిల్లలను ఇంట్లోకి రానియ్యకుండా ఆపుతుంది. పిల్ల తాగిన నీళ్ల గ్లాసు తాము అంటుకోకుండా పనిమనిషిచేత కడిగించటంగా ఉంటుంది. తమ ఇంటి బావుల నుండి నీళ్లు తోడుకోనియ్యక పోవటంగా ఉంటుంది. మొరటుగా, వాచ్యంగా కాక వాళ్లే గ్రహించి ముడుచుకుపోయెట్లు చేయటంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఇంటి అవసరాల కోసం మొదలుపెట్టిన బావి తవ్వకం పని చుట్టూ ఈ కథ నడుస్తుంది.

బావి తవ్వకపు పనిక్రమంలోని అందం, గోవిందు, అతని భార్య ల శ్రమైక జీవన సౌందర్యం ఒకవైపు గొప్ప భావోద్వేగాన్ని కలిగిస్తున్నా, తమకోసం నాలుగుబిందెల నీళ్ళు తెచ్చిపెట్టె వాళ్ళ మంచితనం అర్ధం అవుతున్నావాళ్ళు తమకు నీళ్లు ఇస్తున్నారు కానీ తమ ఇంటినీళ్లు, తమ చేతి నీళ్లు వాళ్ళు తాగటం లేదని తెలుస్తూ మనసుకు నొప్పిని కలిగించటం వినాయక్ గుర్తించకపోలేదు. ఆర్ధికంగా చాలా తక్కువస్థాయిలో ఉన్నవాళ్లు కూడా కులం వల్ల కొందరికంటే ఎక్కువవాళ్ళు కావటం పట్ల పదునెక్కుతున్న సమకాలపు అవగాహన ఈ కథలో ఇలా ప్రతిఫలించింది. అలాగే కులం వల్ల కలిగిన ఆధిక్యత కారణంగా దళితుల ఇంట పనిమానుకొనేట్లు పనిమనుషులపై ఒత్తిడి తెచ్చే వర్ణసమాజపు దుష్ట సంస్కృతిని కూడా ఇనాక్ ఈ కథలో ప్రస్తావనకు తెచ్చారు. అదే వస్తువుగా తరువాతి కాలంలో ‘కూటికి పేదనైనా’ (జూపాక సుభద్ర) వంటి కథలు రావటం గమనించవచ్చు.

బావి తవ్వించే క్రమంలో బండపడటం, నీళ్లు పడతాయో పడవో అన్న ఆందోళన, నీటిలేమి గురించిన చిరకాల అనుభవాల చింత- వీటిమధ్య బావి నీరు ఎవరి సొంతమూ కాదు అన్న తాత్విక స్థాయికి చేరతాడు వినాయక్. భూమిస్తన్యం. ఏ బిడ్డ అయినా తాగవచ్చు. దానికి ఏ పంకమూ అంటదు. నీటికి స్పృశ్య అస్పృశ్యములు అనే తేడాలు లేని ప్రకృతి వనరుగా నీటిని భావించగలిగిన దశకు చేరాడు. కనుకనే బావిలో బండను బద్దలు కొట్టటానికి సిద్ధం చేసిన డైనమేట్ పేలి గోవిందు గాయపడితే అతని కోసం తహతహ లాడాడు. మొహం కడిగాడు. బావి లో నీరుపడ్డందుకు ఆనందపడుతూ నీరు రుచి చూడమని గోవిందు అన్నప్పుడు అంతకుముందు గోవిందు తాగిన కడవలో మిగిలిన నీరు ఏ సంకోచం లేకుండా తాగగలిగాడు. అవి తన ఎంగిలి నీళ్ళని గోవిందు అభ్యంతర పెడుతుంటే ‘నీటికి ఎంగిలి లేదు. నీ ఎంగిలి అని నేను మానదలిస్తే బావినే వాడుకోరాదు’ అని చెప్పగలిగాడు. చెమటతో, నెత్తురుతో నీటి నుండి సమస్త సంపదలను భూమినుండి బయటకుతీసే శ్రామికుల గురించి ఆలోచించగల ఒక ఉదాత్త మానవుడి అవతరణ దళితుల నుండే సాధ్యం అని అనన్యంగా నిరూపించిన కథ ఇది. కుల వివక్ష దగ్గర ప్రారంభించి శ్రమ విలువను గుర్తించి గౌరవించగలిగిన సంస్కారంతో దానికి కుదిర్చిన లంకె వల్ల ఈ కథ మంచి కథ అయింది.
దళితులు అవమానానికి ప్రతీకారాన్ని ఎంత తీవ్రంగా కోరుకొంటున్నారో అది ఆత్మగౌరవ చైతన్య ప్రకాశమే కానీ అదే అదనుగా తమ ఆధిక్యతను స్థాపించుకొనే విధానం కాదు. కుల ఆధిక్యతతో అమానవీయమై పోతున్న అగ్రవర్ణుల చిత్తసంస్కారాలలో మార్పు వాళ్ళ ఆగ్రహానికి ఆశయం అని సూచిస్తుంది పరిష్కారం (1996- 99) కథ. బ్రాహ్మణుల ఆధిక్య ఆస్తితకు భౌతిక సంకేతం అయిన జంధ్యం కేంద్రంగా వ్రాసిన తాకట్టు( 1996-99) కథ కూడా ఇలాంటిదే. తనకు చిన్ననాటి నుండి స్నేహితుడు, ఒకే కాలేజీలో అధ్యాపకుడుగా తనతో కలిసి పనిచేస్తున్నవాడు, తన ఇంటికి పిలిచి అన్నం పెట్టేవాడు, తాను పిలిస్తే వచ్చి తన ఇంట తినేవాడు అయిన శాస్త్రి పదివేలు అప్పు కావాలని అడిగినప్పుడు ఓబులేసు జంధ్యం తాకట్టు పెట్టమని కోరటం ఇందులో విషయం. వట్టి దారపు పోగుగా దానికి విలువలేకపోవచ్చు కానీ దానికి ఆపాదించబడిన పవిత్రత మిత్రుడిని అనుక్షణం బ్రాహ్మడుగా గుర్తుచేస్తూ తననుండి భిన్నంగా నిలుపుతున్నది కనుక సమత్వ, సహోదరత్వ భావాలకు అవరోధంగా ఉంది కనుక అతను అలా కోరాడు. ఆర్ధికంగా కానీ, జీవిత విలువలరీత్యా గానీ దిగువస్థాయిలో ఉన్నవాడికి కులం వల్ల లభిస్తున్న ఆధిక్యతలోని అన్యాయాన్ని ప్రశ్నించటానికి ఓబులేశు ఎంచుకొన్న ఒక పద్ధతి ఇది. అప్పు తీర్చేవరకు తిరిగి ధరించక పోవటం షరతుగా జంధ్యం తాకట్టు పెట్టించటం అనే సన్నివేశ కల్పన ద్వారా జంధ్యం వల్ల తరతరాలుగా లభిస్తున్న ఆధిక్యతా భావం నుండి అగ్రవర్ణులు సాధించవలసిన స్వీయ విముక్తిని కూడా సూచించే అదనపు ప్రయోజనాన్నిసాధించింది ఈ కథ. జబ్బు కథ అంటరాని తనాన్ని పాటించటమే ఒక జబ్బు అని తేల్చి చెప్పింది. బంధువులు ఏమైనా అనుకుంటారు అని ఆప్తమిత్రుడు దళితుడు కనుక అతని ఇంట తినటానికి నిరాకరించిన సత్యం కాలక్రమంలో స్నేహాన్ని కులానికి లోకువ చేసిన మాయ జబ్బు నుండి విముక్తుడు కావటం ఇందులోని వస్తువు. కుల ఆధిక్య భావన నుండి అగ్రవర్ణులు, కుల న్యూనతా భావం నుండి దళితులు విముక్తమయ్యే క్రమంలోనే విలువలు గల మనుషులుగా ఎదుగుతారని ఇనాక్ భావిస్తారు.

బొట్టు హిందూత్వ ప్రతీకగా సామాజిక జీవితంలో హిందువులకు దళిత క్రెస్తవులకు మధ్య సంఘర్షణ కారణం కావటం దళిత చింతన లో భాగంగా ఇటీవల కాలంలో తరచు చర్చకు వస్తున్న అంశం. మాదాసు వినోదిని , ఎండ్లూరి మానస ఆ వరుసలో కథలు కూడా వ్రాసారు. దానిని ఇనాక్ ఇద్దరు స్నేహితులు వారు వీరయ్యే క్రమంలో పరిష్కరించుకోగల అంశంగా చూస్తారు. బొట్టును హిందూత్వ చిహ్నంగా కాక ఒక అందం గా చూడగలిగిన దళిత క్రిస్టియన్ స్నేహితురాలి బొట్టు తాను పెట్టుకొనాలని ఉబలాట పడుతుంది. బొట్టు హిందూత్వ చిహ్నం అనుకోలేదు కనుకనే స్నేహితురాలి బొట్టులేని ముఖ నైర్మల్యానికి ముగ్ధురాలై ఒక హిందూ యువతి బొట్టు లేకుండా తిరగాలని ఉబలాట పడుతుంది. వ్యక్తులు సంస్కారవంతులవుతూ సమస్యలను పరిష్కరించుకొనే దిశగా కథ నడపటం ఇనాక్ కు ఇష్టం . బొట్టు కథ ఆ రకంగా వచ్చిందే. పరిష్కారం కథ కూడా అంతే. సవర్ణులు, దళితులు అన్నలతమ్ములవలె కలిసి మెలిసి ఉండవలసిన వాళ్ళని ఇనాక్ నమ్మకం. తొలి నుండి దళిత కవులందరిదీ అదే మాట. సవర్ణులు తమ్ములను అంటరానివాళ్ళని తరిమికొట్టటం తగదని భారతమాతకది దుఃఖ హేతువని చెప్పారు. అయినా పెడచెవిన పెట్టినప్పుడు తిరుగుబాటు అనివార్యం అవుతుంది. దాని అంతిమలక్ష్యం సవర్ణులలో మానసిక పరివర్తన. ఆ కోణం నుండి చూడవలసిన కథ పరిష్కారం.

చదువు ఆత్మభిమానాన్ని ప్రోదిచేస్తుంటే మాల మాదిగ పిల్లలలో బలపడుతున్న ధిక్కార స్వరాన్ని వినిపించే కథలు పంతం (1996-99), గెలుపు. కులం, సంపద , అధికారం అన్నీ తమవైన గ్రామీణ పెత్తందారీ వ్యవస్థ చదువులను పొందే ప్రతిభ కూడా తమదేనని విర్రవీగుతూ తమను మించి మరెవరూ ఎక్కువ చదువులు చదవకుండా జాగ్రత్త పడుతుంటుంది. పంతం కథలో వీరనారాయణ ఆ వర్గానికి ప్రతినిధి. తను గానీ , తన కొడుకుగానీ దాటలేని హైస్కూల్ గడప తన యింటి మాల జీతగాడి కొడుకు దాటెట్లు పసిగట్టి వాడి చదువు ఆపించే ప్రయత్నాలు చేసాడు. అది సాధ్యం కాకపోయేసరికి వాడు పాస్ కాడని నమ్మకం పెంచుకున్నాడు. ఒకవేళ పాసైతే తన ఆధిక్యతకు, గుర్తుగా ఉన్న మీసాలు తీయించుకొంటానని పందెం కాసాడు. అతని నమ్మకం వమ్మయింది. ఎస్సెల్సీ పాసయిన చంద్రి పందెం ప్రకారం వీరనారాయణ మీసం తడిపి గొరిగించుకొనటానికి తన మూత్రం తో కూడిన మల్ల కొత్త చాటలో పెట్టి తీసుకురావటం దగ్గరే అసలు కథ ప్రారంభం అవుతుంది. పసుపురాసి బొట్లు పెట్టిన చాటలో బియ్యం పోసి, దానిపైన యజమానుల కోసం కుట్టిన చెప్పులు పెట్టి తీసుకువెళ్లే సంప్రదాయం తండ్రి ఇన్నాళ్లూ ఆచరించాడు. అదే చాటలో అదేరకంగా భంగపడిన వీరనారాయణకు మీసాలు తీసెయ్యటానికి కావలసిన పరికరాలు తీసుకువెళ్లిన చంద్రి చివరలో కాలితో తన్ని ఎగరగొట్టిన ఆ చాట దళిత ధిక్కార పతాక అయింది.

గెలుపు కథలో సన్నోబులు కూడా బడికిపోయే పిల్లవాడే. కథలో ప్రస్తుతాంశం ఎన్నికలలో గెలిచిన జడ్పీటీసీ ఊరేగింపు ముందు తప్పెట దరువు విద్యను ప్రదర్శించటం అయితే ఊరేగింపు పొడవునా బడిలో అస్పృశ్యత ప్రస్తావనగా వస్తుంటుంది. తప్పెట దరువు వేసినందుకు ప్రతిఫలం ఇచ్చేవేళ అది ఎంత అవమానకరంగా అమలవుతుంటుందో చూపటం అసలు కథ. యజమానుల నుండి ప్రతిఫలం పుచ్చుకొనేవేళ అస్పృశ్యత వల్ల కలిగిన అవమానానికి నిరసన గా నేలన పడిన వందనోటు వంగి అందుకోకుండా తిరస్కరించి ఆత్మాభిమానాన్ని ప్రదర్శించి వంటి మీది గోచీగుడ్డను నిరసన జండాగా ఎగరేసి జీవితంలో నిజమైన గెలుపుకు తొలి అడుగులు వేసినవాడు సన్నోబులు.

చంద్రి, సన్నోబులు వంటి పిల్లలు పెరిగి, పెద్ద చదువులు చదివి ఉన్నతోద్యోగాలలోకి వెళితే అడుగడునా ఆత్మగౌరవ చేతనతో తమపరిసరాలను ఎంత సంస్కారవంతంగా మార్చుకొనే పనిలో ఉంటారో చెప్పే కథ కులవృత్తి. మనుషులలో ఎక్కువ తక్కువలు అన్నది అసమసమాజ లక్షణం. ఒకమనిషిని న్యూన పరచటం ఆ మనిషి చేసే పనిని కూడా హీనం చేసి చూడటంగా ఉంటుంది. ఆ క్రమం లోనే కులం రీత్యా సమాజానికి బహిష్కృతులు అయిన దళితుల జీవన వృత్తులు కూడా హీనం చేసి చెప్పబడుతున్న సాంస్కృతిక సందర్భాలలో వాళ్ళు మృత పశువుల చర్మం ఒలవటం అయినా , చెప్పులు కుట్టటమైనా హేయమైన పనులే అవుతాయి. చెప్పులు ఇంటిలోపలికి , గుడిలోపలికి వేసుకువెళ్ల వీలులేని అపవిత్రతను పొందుతాయి. దీనిని తిరస్కరించే తర్కంతో కూడిన చర్చ ఈ కథకు ఇతివృత్తం. వృత్తి గౌరవ సూచికలుగా చెప్పులను ఉన్నతీకరించిన దళిత సంస్కృతి వేసే ప్రశ్న బూటు కాళ్లతో దేవాలయంలోకి ఎందుకు వెళ్లకూడదని. ఆ ప్రశ్నకు జవాబియ్యలేని, ఆ తర్కానికి తట్టుకోలేని పురోహిత వర్గ నిస్సహాయత ఈ కథలో కనబడుతుంది. ఆరకంగా దళిత నైతికత గమనం విజయం దిశగా ఉండటాన్ని సూచించారు ఈ కథలో ఇనాక్.

2

అయితే ఇనాక్ కథలు ఈ విధమైన సున్నిత మానవీయ సంఘర్షణలను, సంస్కరణలను చిత్రించటంతో పాటు అదే సమయంలో బాధిత దళిత కసిని వ్యక్తీకరించటం గమనించవచ్చు. నల్లులు, పొట్టపేగులిబ్బందిగాడు, గొడ్డుదొంగ , కొలుపులు కథలు ఈ కోవలోవి. నల్లులు కథలో సుబ్బడు దళితుడు కాదుగానీ దళితవాడలో ఆశ్రయం పొందిన అనాథ. మరీ దిక్కులేని జీవితం. పాడుబడ్డ పాకలో నివాసం. ఎవరన్నా పెట్టింది తినటం. వూళ్ళో ఏవో దొంగతనాలు జరగటం, అతనే దొంగ అని పోలీసులకు పట్టియ్యటం ఒకటి రెండు నెలలు జైలు లో ఉండి రావటం ఇదీ వాడి బ్రతుకు. దొంగతనం చెయ్యని తాను దొంగ అనిపించుకొనటం అతని అభిమానాన్ని గాయపరిచినా ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు. రాత్రంతా నిద్రబోనియ్యని నులక మంచంలో నల్లులను వదల్చటం కోసం సుబ్బడు మంచాన్ని ఎత్తి కుదెయ్యటం, ఎండలో పడెయ్యటం, నేలరాలిన నల్లులను కాలితో నలిపి చంపటం, కూసాలలో నీళ్లు సలసల కాచి పొయ్యటం, నల్లులను పూర్తిగా వదలగొట్టిన మంచంలో నిశ్చింతగా నిద్రబోవటం అనే అప్రస్తుతాంశాన్ని కథనం చేస్తూ తనను హత్యానేరం లో ఇరికించటానికి ప్రణాళిక వేసిన మునసబు ఇంటికి నిప్పుపెట్టటం అనే ప్రస్తుతాంశాన్ని సూచించటం నల్లులు కథా శిల్పం. అలిగరీ కథనపద్ధతి ఇది. ఇందులో మనుషుల రక్తం పీల్చే నల్లులు సుబ్బడి వంటి అసహాయులను, అనాథలను స్వప్రయోజనాలకు పావులుగా చేసి బలుస్తున్న పెత్తందారీ వ్యవస్థకు ప్రతీకలు. నల్లులు చస్తేనే మనిషికి ప్రశాంత నిద్ర. మునసబులు చస్తేనే సుబ్బడి లాంటివాళ్లకు విముక్తి.

గొడ్ల దొంగతనం నేరం మొయ్యాల్సివచ్చిన నాగడు అసలు దొంగ అయిన ఊరి పెత్తందారు మీద తీర్చుకొన్నది అలాంటి ప్రతీకారమే. తాత ముత్తాతల నుండి దున్నుకొంటున్న పొలాన్నిఎవరికో రాసిచ్చిన కరణం పైన పొట్టపేగులిబ్బందిగాడు తీర్చుకొన్నదీ అదే రకం ప్రతీకారం. ఈ రెండు కథలలో బాధితులు మాదిగలు. చచ్చిన పశువును చర్మం వలచి బాగుచేసి, మాంసం బాగుంటే తీసుకొనేవాడు నాగడు. తెల్ల వాళ్ళను వెళ్ళగొట్టాలని తెనాలి రైల్వేస్టేషన్ను తగలబెట్టినప్పుడు కిరసనాయిలు డబ్బా మోసిన చరిత్ర ఉంది. అందువల్లేనేమో తనపెరట్లో దూడ దొంగతనానికి వచ్చి దొరికిపోయిన దొర కులంపేరుతో తిడితే సహించలేకపోయాడు. పొట్ట పేగులిబ్బంది గాడు చేసుకొనే పొలం పోయి పశువును కోసి కుప్పలేసి అమ్ముకొంటున్నవాడు. పశువు కడుపు చీల్చిపేగులు తీసి బాగుచేసే అతనిలాంటివాళ్లే పీడకుల పట్ల పేగులుతీసి న్యాయం చెయ్యగల నరసింహావతారాలు కాగలరని సూచిస్తుంది ఈకథ.

కొలుపులు కథ వీటి కంటే కాస్తభిన్నమైనది. మాదిగ స్త్రీలపై పెత్తందార్ల లైంగిక ఆధిపత్యం పై తిరుగుబాటు ఈకథ. పూజారి లింగడు చచ్చిపోతే అతని భార్యమీద కన్నువేసిన మోతుబరి రైతు నాంచారయ్య తన కోరికను నిరాకరించిందని ఆమెపై పగబట్టి పాతబాకీ తీర్చాలని ఒత్తిడి చేసి, నట్టనడిబజారులో, పోతరాజు విగ్రహం ముందర అవమానించాలని పన్నిన పన్నాగం భగ్నమై అతనే పోతరాజుకు బలిపశువు కావటం ఇందులో విషయం. మాదిగల సాంస్కృతిక ఉత్సవాలను ఆత్మగౌరవ పోరాట వేదికలుగా మలచటం ఇనాక్ కథలలో, నవలలో తరచు కనిపిస్తుంది. అటువంటి కథలలో ఎన్నదగినది పొలి. కారంచేడు దుర్ఘటనను పునః సృష్టించిన కథ ఇది. మెయిన్ రోడ్డు మీదుగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే రోడ్డుకు ఒక వైపు ఊరు, మరొకవైపు పల్లె ఆ రెంటి మధ్యా ఉన్న దాటరాని అంటరానితనం, ఇంకానా ఇకపై సాగదు అంటూ దళిత యువత తాగిన టీ గ్లాసులు కడుక్కోనాలన్న పాత అలవాటుకు స్వస్తిచెప్పటం, ఊరి యువతతో మీకన్నా మేమేమి తక్కువ అని స్వాభిమానం ప్రకటించటం అది ఘర్షణల కు దారితీసి చివరికి ఊరు పల్లె పై దాడిచేసి ఊచకోత కోయటం, పల్లె చెల్లాచెదరు కావటం అంతా కారంచేడు చేదు చరిత్రే. దీనిని మాదిగల పూజారి పోతురాజు కోణం నుండి నడపటం ప్రత్యేకత. పల్లె హితవరిగా తన సోదరులను ప్రారంభం నుండి హెచ్చరిస్తూనే ఉన్నాడు. టీగ్లాసులు కడగటం దగ్గర పంతాలకు పోవద్దురా అని. చదువుకోండి, పెద్ద ఉద్యోగాలు చెయ్యండి, మన్నన వద్దన్నా వస్తుందని చెవినిల్లు కట్టుకొని చెప్పాడు. కానీ జరగవలసిన నష్టం జరగనే జరిగింది. తన తరువాత పూజారి కావలసిన వాడితో సహా పల్లె ఊరి మారణహోమానికి బలి అయింది. ఆ దుఃఖంలో, ఆవేశంలో, ఆక్రోశంలో దేవర ఉత్సవాలలో పోతురాజుకు, పోలేరమ్మకు జంతుబలి ఇయ్యటానికి వాడే కొంగ కాలు కత్తి అటక మీది నుండి దించి భుజంవేసుకొని బయలుదేరిన సందర్భంలో మొదలైన కథలో ఈ చరిత్ర అంతా పోతరాజు కేంద్రంగా శకలాలు శకలాలుగా కళ్ళముందు ఆవిష్కృతమవుతుంది. బలి ఇయ్యటానికి కత్తి దించాడంటే అది తన వారిని చంపిన ఊరివాళ్లపై వేటు కోసమే కావాలి. కానీ ఆ పని చేయలేక పోయాడు పోతురాజు. రక్తం అంటకుండా దించిన కత్తిని అటక ఎక్కించరాదు అన్న నియమాన్నినాటకీయంగా పూర్తి చేసింది ఊరి ఆంబోతు. దాని కాలి రక్తం తో తడిసిన పోతరాజు విగ్రహం దగ్గరి ఎప్పటివో బియ్యపు గింజలను పోగు చేసి చచ్చిన తనవాళ్ల రక్తంతో కలిపి మెయిన్ రోడ్డును నిలువుగా చీలుస్తూ పోలి పోస్తూ ‘కోబలి’ అని అరవటంతో కథ ముగుస్తుంది. అది ఊరివైపు నుండి పల్లెలోకి వచ్చి దుర్మార్గం చేసే వాళ్లకు హెచ్చరిక. అహంకారం ,అధికారం హద్దులు మీరితే సహనం అసహనంగా మారటం అనివార్యం అని చెప్పినకథ ఇది.

3

ఇనాక్ కథలలో మాదిగ జీవితచిత్రణతో పాటు మాదిగ ఉపకులాల కథలు కూడా కొన్ని ఉన్నాయి. మాదిగలను ఆశ్రయించి వాళ్లకు ఏదో ఒక రకమైన సేవలు అందిస్తూ హక్కుగా వాళ్ళ దగ్గర యాచించి జీవించటం వృత్తిగా కలవాళ్లు ఆశ్రిత కులాలు. ఏమి ఉన్నది అన్నదానితో నిమిత్తం లేకుండా ఆశ్రితకులాలవారిని పోషించటం మాదిగల బాధ్యత. ఈ సంప్రదాయంలో బండోళ్ళు అనే ఆశ్రితకులం కేంద్రంగా కాకి అనేకథ, మొండోళ్ళు అనే ఆశ్రిత కులం కేంద్రంగా ‘కట్టడి’ కథ, మాదిగదాసు అనే కులం కేంద్రంగా ‘బుభుక్షితః కిం న కరోతి పుణ్యం’కథ వ్రాసారు ఇనాక్. ఇద్దరూ రాత్రిపూటే ఏఒక ఇంటి దగ్గరో ఆగి బువ్వపెట్టమని అడుగుతారు. మరో ఇంటికి వెళ్లరు. ఆ ఇంటి వాళ్ళు వినకపోయినా, లేక పెట్టలేకపోయినా ఇంటిమీదికి కాకుల దాడి చేయించటం మొదటికథకు, బావి కట్టడిచేయటం రెండవ కథలో విషయాలు. బండోళ్ళవి అయినా మొండోళ్ళవి అయినా దిమ్మరి బతుకులు. ఏకాకి బతుకులు. వాళ్ళవి ఆకలిసమస్యలు. ఆకలితీరని ఆక్రోశం వాళ్ళను ఆయాపనులకు పురికొల్పుతుంది. కాకి దాడి ఫలితం అంతా ఒక ఇంటికి సంబంధించిన సమస్య అయితే బావికట్టడి మాదిగ పల్లెకంతా సంబంధించిన సమస్య. వాళ్ళ ఆకలిసమస్య ఎంత తీవ్రమో. ఆ ఆకలి తీర్చటానికి వీళ్ళు పడవలసిన యాతనకూడా అంత తీవ్రమే. ఇరుపక్షాలను బాధితులుగా చేసే ఆకలి కర్కశత్వాన్ని చిత్రిస్తాయి ఈ కథలు. ఇనాక్ వ్రాయకపోతే మానవ సమాజంలో మిగిలి ఉన్న ఈ నికృష్ట పార్శ్వాలు మనకు తెలిసేవి కావు.

మాదిగల వంశవృక్షాన్ని వివరించే మాదిగదాసులకు పిల్లల కడుపాకలి వాయిదా వేసి ఉప్పుతో ముప్ఫయి మూడు ఇరుగిళ్ల నుండి అడిగి తెచ్చి అయినా సమకూర్చవలసిన బాధ్యత మాదిగకుటుంబాలు ఎలా నిర్వహిస్తాయో బుభుక్షితః కిం న కరోతి పుణ్యం కథలో చూపించారు ఇనాక్. అయితే ఈ కథ ప్రయోజనం ఆ సంస్కృతిని చెప్పటం మాత్రమే కాదు, మాదిగ దాసుకు ఆహారం సమకూర్చవలసి రావటం వల్ల ఏ ఇంట పిల్లవాడు ఆ పూట ఆకలితో ఉండాల్సి వచ్చిందో, ఆ పిల్లవాడు సాయంత్రం తండ్రి కూలి తెస్తే తల్లి వండి పెట్టేవరకూ ఆకలిని భరించటం, పుస్తకం తీసుకొని చదువుకొంటూ కూర్చోటం ద్వారా ఆకలిని మర్చిపోయే ప్రయత్నం చేయటం అసలు కథ. ఆకలిగొన్న దళితులు చేయవలసిన పని చదువుకొనటం. చదువే ఆకలి తీర్చే మార్గం అన్న చైతన్యం వ్యాపింప చేయటం ఈ కథ అసలు ప్రయోజనం.
దళిత వర్గీకరణ సమస్య కీడు, లాకీ వంటి కథలకు వస్తువు అయింది. దళిత వర్గీకరణ లేకపోతే మాదిగలు పెద్ద చదువులకు దూరమయ్యే అవకాశం ఉందన్నసూచనతో అది వాళ్ళజీవితం మీద వేసే విపరీత ప్రభావాల చిత్రణతో వ్రాసిన కథ కీడు. కాగా లాకీ దళిత వర్గీకరణ ఉద్యమాన్ని మాలల కోణం నుండి ఆవిష్కరించింది. దళిత సమైక్యతను దెబ్బతీస్తుందని వాళ్ళ అభ్యంతరం. దానిని సున్నితంగా చర్చకు పెట్టిన కథ లాకీ. సవర్ణులతో హక్కులు పొందటానికి దళిత ఉద్యమం ఎంత న్యాయమో, మాలలతో సమాన హక్కులు, అవకాశాలు పొందటానికి దండోరా ఉద్యమం కోరుతున్న వర్గీకరణ లో అంత న్యాయం ఉందని ఈ కథ సూచిస్తుంది. మాల మాదిగలు విడిపోతే సమైక్యత దెబ్బతింటుందనటం తప్పు… ఎందుకంటే అసమానుల మధ్య సమైక్యత ఎప్పటికీ సాధ్యంకాదు కాబట్టి. వర్గీకరణ ద్వారా మాదిగలను మాలలతో సమానంగా అభివృద్ధిచెందటానికి అవకాశాలు కల్పిస్తే సహజంగా సమానులైన వాళ్లు సమైక్యం కావటానికి కావలసిన చైతన్యం అదే అభివృద్ధి చెందుతుందని సూచిస్తుంది ఈ కథ. దళిత సమైక్యత పట్టుకు వేళ్లాడవలసిన అంశమే కాదన్న ప్రజాస్వామిక చేతన మాలలలో కలగాలన్న రచయిత ఆకాంక్ష ఇందులో వ్యక్తమైంది.

దళిత జీవిత చిత్రణ ప్రధానం అయిన ఇనాక్ కథలు దళితుల వృత్తి జీవితాన్ని పశువులను చంపి, చర్మాలువలిచి, రక్తం, మాంసం, ఎముకలు వేటికవి వేరుచేసి పెట్టటం, ఎవరికేవి అవసరమో వాటిని పంపటం వంటి వివరాలతో ఉంటాయి. అదేసమయంలో ఆయన ఇతర వృత్తిపర వర్గాల వారి జీవితాన్ని అనేక వివరాలతో చిత్రించటం విశేషం. ఇతరేతర సామాజిక సమస్యలు చిత్రిస్తూ వ్రాసిన కథలు కూడా ఉన్నాయి.

(ఇంకా వుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply