కొత్త సైకిలు

“ఏమిరా పవనూ… బడి తెరిసి ఐదు రోజులైంది. అయినా గానీ బడికి రాల్యా? ఈ పొద్దు వస్తాన్నావ్..?” అడిగినాడు రమేషు.

“కొంచెం పనుండ్యలే… అందుకే రాల్యా…” అని చెప్పి నోట్సు తీసి ఏందో బొమ్మ గీస్కుంటాన్నాడు పవను.

“ఏం పనిరా… మామూలుగా అయితే ఒక్కరోజు గుడక ఆబ్సెంటు పడనియ్యవు గదా? మన్న వినాకమయ్య నిమజ్జనం రోజు గూడ బడికొచ్చినావ్ ఆబ్సెంటు పడ్తాదని…”

“పనుండ్యరబ్బా… నీకు మళ్ళ చెప్తాలే. నా తలకాయి తినాకు” అని జెప్పి ఆ బొమ్మ గీస్కుంటానే ఉన్నాడు.

“సరే లెవోయ్… చెప్పకోకుంటే చెప్పొద్దులే” అనుకుంటా వాని బ్యాగ్ తీస్కోని పక్కనకి పోయి కుచ్చున్యాడు రమేషు.

బొమ్మ గీస్కోని దాన్ని చూస్కోని మురిసిపోతాన్నాడు పవను. పక్కన ఎవరన్నా వచ్చినప్పుడు నోట్స్ మూసేసేది. పోయినాక మళ్ళ నోట్స్ తీసి ఆ బొమ్మ చూస్కోని మురిసిపోయేది. ఇట్ల చేస్తాన్నాడు.
కొంచేపటి తర్వాత వాణి వచ్చి పవను పక్కన కుచ్చుంది. నోట్స్ మూసేసి వాణి తుక్కు చూసినాడు పవను. వాణి అదేం గమనించలా.

“పవనూ… ఏం బడికి రాల్యా అయిదు రోజులు. ఇచ్చిండే సెలవులు సరిపోలేదా?” అనడిగింది.

“అదేం ల్యా వాణీ… మా అవ్వోళ్ళ ఊరికి పోయింటి. వాళ్ళు రానీయలా. నువ్వేం చేసినావ్ సెలవుల్లో…” అని అబధ్ధం చెప్పినాడు.

“మా మామోళ్ళు బెంగ్లూరులో ఉండారు. ఆడికి పోయింటి.”

“అవునా… సరే, రేపు బడికొచ్చేటప్పుడు మా ఇంటి కాడ నిలబడు కొంచేపు. ఇద్దరం కలిసి వద్దాం” అన్యాడు నవ్వుకుంటా.

“నా సైకిల్ మీద పద్మ వస్తాది కదా? నువ్వెట్ల వస్తావ్?” అనడిగింది వాణి.

“అందుకే మళ్ళ చెప్తాండేది. నువ్ రేపు రా! తెలుస్తాది.”

“సరెలే… ఈ అయిదు రోజులవి నోట్సు రాసిండవు. నా నోట్సు తీస్కోని రాస్కో. ల్యాకపోతే మళ్ళ సారు కొడ్తాడు. ముందే నీ దగ్గర గైడ్లు గూడ లేవు.” అని జెప్పి నోట్సు పవనుకిచ్చింది.

రేపెందుకు రమ్మంటాన్నాడబ్బా… అని ఆలోచించుకుంటా కుచ్చోయింది.

***

పదిహేను రోజుల ముందు…

“ఇట్లయితే నేను బడి మానేస్తామా. పోను” అని ఏడ్సుకుంట కుచ్చున్యాడు పవను.

“ఏరా నీకు చెప్తే అర్థం కాదా? డబ్బుల్లేవని చెప్తాన్నాడు గదా నాయన…” నచ్చజెప్పేకి చూస్తాంది ప్రభావతి.

ప్రభావతి పవను వాళ్ళమ్మ. ఓపిక, నిబ్బరం ఎక్కువ. మొగుడు తెచ్చినే దుడ్లన్నీ తాగేకే అయిపోజేసినా తను కూలికి పోయి తెచ్చినే డబ్బుల్తోనే ఇల్లు నడుపుతాది.

“నాకవన్నీ తెల్దు. కొత్త సైకిలు కొనిస్తే గానీ నేను బడికి పోను.” అనుకుంటా బండల మీద ఉత్త కాళ్ళతో గట్టి గట్టిగా తొక్కుతూ ఏడుస్తాన్నాడు పవను.

“ఈ మూణ్ణెళ్ళు ఎట్లోగట్ల పోప్పా… తొమ్మిదో తరగతికి పోతానే కొత్త సైకిలు కొనిస్తాం అంటాన్నాం గదా..?”

“నేను బడి తెర్సినప్పుడు అడిగినా జూన్ లో. దసరాకి కొనిస్తామన్యారు. మళ్ళ దసరా అప్పుడు అడిగితేనేమో సంక్రాంతికి అన్యారు. మళ్ళ ఇప్పుడేమో తొమ్మిదో తరగతి అంటాన్నారు.” అని జెప్పి ఏడుస్తానే ఉన్నాడు.

“ఏడ్సాకు నాయనా, లోపలికి రా బండలు కాల్తాన్నాయి.” అంటాంది ప్రభావతి.

“నేనేం రాను. కాళ్ళు కాలితే మీకేం? ఏమన్నా పట్టించుకుంటారా నన్ను. అయినా నేనేం గేర్ల సైకిలు అడిగినానా? మామూలు రేంజర్ సైకిలే గదా అడిగినేది” పవను ఏడ్సేది మాత్రం ఆగలా.

“కడుపెట్లా కాల్తానే ఉంటాది. కాళ్ళు గూడ కాలల్లేమో మా బతుకులకి” అనుకుంటా విచారిస్తాంది ప్రభావతి.

పవను ఏడ్సేది ఆగలా. ప్రభావతి బాధపడేది ఆగలా.

***

వాణి, పవను ఒకే క్లాసు. వాణి అంటే పవనుకి బలే ఇష్టము. చిన్నప్పుట్యాల్ నుండి ఒకటే క్లాసు, ఒకటే సెక్షను. ఎనిమిదో తరగతిలో వేరే సెక్షనులో ఏస్తే సారోళ్ళతో బతిమలాడి వాణి ఉన్నే సెక్షనులోనే పేరొచ్చేటట్లు చేస్కున్యాడు. ఇదంతా వాణికి తెల్దు. ఎవురూ చెప్పరు.

ఎనిమిదో క్లాసు స్టార్ట్ అయితానే వాణి కొత్త సైకిలు మీద స్కూలు కొచ్చింది. పింకు కలరు లేడీ బర్డు సైకిలు. ముందర చిన్న బుట్టీ గూడ ఉంది. ఆ పొద్దే వానిగ్గూడా కొత్త సైకిలు కావల్లనిపిచ్చింది.

అప్పటికి చానా రోజుల ముందే పెద్ద సైకిల్తో నేర్సుకున్యాడు తొక్కేది. కాళ్ళు అందలేదని అడ్డ పెటల్ నేర్సుకున్యాడు. ఇప్పుడైతే కాళ్ళు గూడ అందుతాయి. కానీ ఇన్ని రోజులు సైకిలు కావాల అనిపించలా. వాణి సైకిలు మీద వస్తాంది కాబట్టి సైకిలు కావాల అనిపించింది పవనుకి.

ఇంట్లో అడిగితే “ఎంతైతాది?” అనడిగినాడు పవను వాళ్ళ నాయన.

“మూడు వేలు” అన్యాడు పవను.

ఒక మనిషి నెలరోజులు కూలికి పోతే వస్తాయి అన్ని డబ్బులు.

“అన్ని డబ్బుల్లేవు నాయినా మన దగ్గిర. సెకండ్యాండుది యాడన్నా ఉంటే సూద్దాం లే” అన్యాడు.

“సెకండ్యాండుది వద్దు నాయనా నాకు…”

“అయితే దసరా వరకు ఉండు. డబ్బులు జమ చేసి తీస్కొద్దాం” అని జెప్పినాడు పవను వాళ్ళ నాయన.

ఇంట్లో పరిస్థితిని అర్థం జేస్కోని పవను గుడక సరేనన్యాడు.

దసరా దాటిపోయి, సంక్రాంతి సెలవులొచ్చినాయి. ఇంగా సైకిలు కొనీయలా. అందుకే పవను అంతగా ఏడుస్తాన్నాడు.

ఏడుస్తా ఉన్న పవనుతో ప్రభావతి “డబ్బులు సరిగా రాలేదురా. ల్యాకుంటే తీసిద్దుము” అంటాంది.

అయినా పట్టిచ్చుకోవడంల్యా పవను.

“సెకండ్యాండుది తెచ్చుకుందామా? తక్కువ పడ్తాదేమో…”

“సెకండ్యాందుది ఆ పొద్దే వద్దన్యా గదా. ముట్టుకోను గూడ ముట్టుకోను తెస్తే…”

“అదైతే తక్కువలో వస్తాదని చెప్పినాలేరా…”

“అయినా పదహైదు వందలు అది గూడ…”

“పదహైదు వందలైతే ఉండాయిరా, వడ్డీ కట్టేకి పెట్టుకున్యా. నేనెవర్తో అన్న బదులుకి ఇప్పిచ్చుకోని కడ్తాలే వడ్డీకి. ఇవి నువ్వు తీస్కోలే” అనింది ప్రభావతి.

అప్పుడు ఏడ్సేది ఆపేసి లోపలికొచ్చినాడు పవను.

ప్రభావతి డబ్బులిస్తాంటే “వద్దు లేమా నీ దగ్గిరే పెట్టుకో. అంతా కలిపి ఒకేసారి తీస్కుంటాలే” అన్యాడు పవను.

ప్రభావతికి అర్థం కాలా.

“మీరు పత్తి పీకేకి పోతాన్నారు గదా, నేను గుడక వస్తా మీతో. రోజుకి నూరు రుపాయలు ఇస్తారు గదా. పదహైదు రోజులు వస్తే డబ్బులు సరిపోతాయి. కొత్త సైకిలొస్తాది” అనుకుంట కళ్ళు పైకెగరేసి నవ్వినాడు పవను.

అంతసేపు ఏడ్సి ఏడ్సి ఇప్పుడు నవ్వేతలికి ప్రభావతి మనసు రోంత నిమ్మలమయింది.

“పది రోజులే గదరా సెలవులు. ఐదు రోజులు పోకపోతే ఏం కాదా?”

“ఏం కాదు లేమా. నాది ఇప్పటిదంకా ఒగ ఆబ్సెంట్ గూడ పడలా.”

“మళ్ళ క్లాసులు జరిగితే అవి అర్థం కావు కదా..?”

“వాణితో చెప్పిచ్చుకుంటాలే. అయినా నోట్సు గూడ ఇస్తాది ఆ పాపే.”

“సరే..” అని తనతో పాటు పత్తి పీకేకి పిల్చుకోని పోయింది ప్రభావతి.

పత్తి పీకేది అంత సులభమేం గాదు. అట్ల కుచ్చోని పీకలేం. ఇట్ల నిలబడి పీకలేం. ఒంగోని చేయల్ల పనంతా. అంత కష్టమైనా కొత్త సైకిలు కోసమేమో, సానా కష్టపడినాడు పవను.

పదిహేను రోజులు అయిపోయినాయి.

“నువ్వు బడికి పోయిరా. సాయంకాలానికి నాయిన సైకిలు తెచ్చింటాడు” అని జెప్పి పవనుని బడికి పంపి “పిల్లోనికి కొత్త సైకిలు తీస్కోనిరా. ఎట్లాటిది కావల్లో వాడు చెప్పినాడంట గదా…” అని జెప్పి డబ్బులు మొగుని చేతిలో పెట్టి టౌనుకి పంపి పనికి పోయింది ప్రభావతి.

***

సాయంత్రం బడి ఇడుస్తానే పరిగెత్తుకుంట ఇంటికొచ్చినాడు పవను. కొత్త సైకిలు తీస్కోని ఊరంతా రౌండ్లు కొట్టల్లని భలే ఆశతో వచ్చినాడు.

ఒక ‘సెకండ్యాండ్యు సైకిలు ‘ ఇంటి బయటుంది. పవను వాళ్ళ నాయిన, ఫ్రెండ్సుతో కలిసి తాగేకి బయటికి పోయినాడు.

ప్రభావతి పనికి పొయ్యొచ్చి ఇంటి బయటే కుచ్చోనుంది.

ఆ సెకండ్యాండ్యు సైకిలుని చూసి ప్రభావతి వైపు చూసినాడు పవను.

ప్రభావతి పవను వైపు చూడలేకపోయింది.

అప్పటినుండి పవను ఇంకెప్పుడూ సైకిలు గురించి ఏడవలేదు. ఆ సెకండ్యాండు సైకిలుని ముట్టుకోలేదు.

రచయిత. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1997లో పుట్టారు. తొలి కథ 'చిల్డ్రెన్స్ డే వెలుగు పత్రికలో ప్రచురితమైంది. తన చుట్టూ ఉన్న జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించడమే తన పని అంటారు. బీటెక్ చదివారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.

2 thoughts on “కొత్త సైకిలు

Leave a Reply