కొత్త తలుపు

“ఆంటీ! బావున్నారా?” అన్న మాటతో వెనక్కి తిరిగి చూశాను. అమ్మాయిని గుర్తు పట్టి. “మాధవీ!?” అన్నాను.

“ఆంటీ!” అంటూ చొరవగా వచ్చి, “మీరు అంకుల్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?” అంటూ ప్రశ్నించింది.

“నేను బాగున్నానమ్మా. . . నువ్వూ?”

“చాన్నాళ్లైంది కదాంటీ!”

“నేను గత ఆగష్టు కు రిటైర్ అయాను. ఉదయాన్నే నాలుగు మెతుకులు పట్టుకొని ఎక్కే ఆటో, దిగే ఆటో గా తిరిగిన బిజీ అంతా, ఇప్పుడు ఒక్కసారిగా మాయమైంది. ఇప్పుడిప్పుడే కాస్త తీరికగా ఉంటున్నా. “

“అంకుల్?”

“మూడేళ్లైంది రిటైరై”

“ఇంటిదాకా దిగపెట్టమంటారా, ఎలా వచ్చారు?”

“నడిచే వచ్చానమ్మా. మా ఇల్లు దగ్గరే? నేను వెళ్ళిపోగలను. “

“అంటీ, నేను ఈ చుట్టుపక్కల అద్దెకు పోర్షను కోసం తిరుగుతున్నాను. “

“ఈ ఊర్లోనే ఉంటున్నావా?జాబా? చదూకుంటున్నావా?”

“జాబే! స్పీచ్ థెరపిస్ట్ గా. “

“అంటే?”

“అంటే, పుట్టుకతో మూగ, చెవుడు పిల్లల కోసం కొన్ని మిషన్లు, కొంత ట్రైనింగ్ ఇచ్చే రిహేబిలిటేషన్ కోర్స్.”

“వావ్! రేర్ కోర్స్”

“ఇక్కడ ఫిజియోథెరపీ అయాక, చెన్నై వెళ్లి కోర్స్ చేసాను” అంటూ నన్ను బండి ఎక్కించుకుంది.

విశ్వేశ్వరం గారు, నా భర్త. “ఎవరీ అమ్మాయి?” అని అడిగారు. “నా పాత కొలీగ్ లలిత కూతురు మాధవి అండీ, డాక్టరయింది. ఇప్పుడే రైతు బజార్ లో కలిసింది.”

“ఓ! బాగున్నావా అమ్మా?” అంటూ పలకరించారు.

“హాయ్ అంకుల్! నమస్తే”

“రామ్మా, డాడీ పలాస లోనేనా?”

“ఔనంకుల్”

“రా మాధవి. హాల్లో కూర్చోబెట్టి కూరలు వంటింట్లో పెట్టి వచ్చాను. “ఇంకా ఏంటి విశేషాలు?అమ్మ, నాన్న, కిరణ్?”

“అమ్మా, నాన్న, తమ్ముడు పలాస లోనే ఉంటున్నారు. వాడు బీ. టెక్. విజయనగరం లో. నేను ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర ఈ సెంటర్ పెట్టారని విని, వైజాగ్ వచ్చేసాను.”

“ఎలా ఉంటుంది వర్క్?”

“బాగానే ఉంటోంది. ఈ మధ్య తల్లిదండ్రులంతా పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వేరే ఊరు వెళ్ళైనా సరే, వాళ్లకున్న లోపాలను సరిదిద్దాలని ఉబలాటపడుతున్నారు.”

“ఔనౌను. అసలు ఇదెలా తోచింది నీకు? అంటే, అరుదైనది కదా!”

“బై పి సి అయాక, మెడికల్ సీట్ రాలేదు. ఫిజియో థెరపీలో చేరాను. స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం ఈ కోర్స్ నేర్చుకున్నానాంటీ”

“బాగుందమ్మా!”

“చాలా రోజులైందాంటీ, మీ ఇల్లు చూసి. అమ్మ ప్రమోషన్ ఇంటర్వ్యూ కోసం వచ్చాం, ఐదేళ్లైందమో.”

“ఆ! గతేడాది ప్రవీణ ఆంటీ కొడుకు పెళ్ళి కి మేము కలిసాం. రా ఇల్లు చూద్దువు”, అని తీసుకెళ్ళాను.

మేడ మీద గది, డాబా పైన మొక్కలు అన్నీ చూసి చాలా ముచ్చట పడింది మాధవి. “నాకీ గది అద్దెకు ఇవ్వచ్చు కదా! పెంట్ హౌస్ గా!?”

“దానికేం భాగ్యం?అంకుల్ తో చెప్పేద్దాం. మేమిద్దరం ఎలాగూ ఈ పై దాకా రానే రాం. పిల్లలు వస్తే , మనవలు ఈ గదిలో కాలక్షేపం చేస్తారు.”

వారం రోజుల్లో మాధవి దిగింది. వద్దంటున్నా రెండునెలల అడ్వాన్స్ 6000 ఇచ్చింది. ఒక గది భాగ్యానికి ఇంత డబ్బా అన్నా ,”ఆంటీ బయట అద్దెలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు నాకు ఇస్తున్నది పెంట్ హౌస్! ఆ మొక్కలకి ఎంత ఇవ్వగలం?ఏదో ఉడతా భక్తి”, అంటూ నవ్వేసింది.

ఆదివారం పొద్దున్న పైకి వెళ్లాను. మొబైల్ లో పాటలు పెట్టుకుని గది తుడుచుకుంటూంది మాధవి. “గది ఎలా సర్దుకున్నావో చూద్దామని వచ్చా.” అన్నాను. “రండి, రండి,” అంది.

లోపలికి వెళ్లి చూస్తే, చిత్రం! పళ్ల బుట్ట, ఇస్త్రీ పెట్టె, వేడి నీళ్ళజగ్గు, ఒక ఇగ్నిషన్ స్టవ్, కూరల బుట్ట, ఒక కత్తి, చిన్న కుక్కర్, బియ్యం- పప్పు- ఉప్పు- చింతపండు లతో నాలుగు డబ్బాలు,పోపుల పెట్టె,రెండు పింగాణీ ప్లేట్లు, ఒకే సూట్ కేస్… ఇవే వస్తువులు.

“ఇదేనా నీ సంసారం మాధవీ?మా డబుల్ కాట్ కూడా పక్కన పెట్టేసావు?

“ఔనాంటీ! నేల పైనే అలవాటు! కూరలు ఎప్పటికప్పుడు కొంటాను. వంట లిమిటెడ్, పెరుగు,పాలూ పేకట్. కితం సారి ఇద్దరం ఫ్రెండ్స్ కలిసున్నాం. తను ఊరు మారింది. సో ఇప్పుడు సోలో”

“అయినా, చిత్రంగా ఉంది మాధవీ!”

“అవునండి, నాకూ… ఇల్లు, గదులు, సామాన్లు సర్దుకోవడం, కొనడం, పారేయడం ఇవన్నీ చాలా చిత్రంగా ఉంటాయి.”

“ఇంతకూ… పిల్లలు దసరా పండుగకు వస్తామంటున్నారు. ఓ నాలుగు రోజులుంటారు…” నసిగాను.

“అయితే, ఆ నాలుగు రోజులూ, నేను మా ఫ్రెండ్ గదికి వెళ్లిపోతాను. నా సామానంతా పక్కకు సర్ది పెడతాను”.

“అదేంటి మాధవి? నేనింకా ఏమీ అడగలేదే?” మాధవి నవ్వింది. “మీరు అడగక్కర్లేదు, అనక్కర్లేదు. ఎవరైనా ఏం మాట్లాడతారో కన్నా, ఏది మాట్లాడడానికి సందేహిస్తారో నాకు బాగా తెలుస్తుంది. బహుశా నా ఉద్యోగ ప్రభావం కావచ్చు,” మెరిసే కళ్ళతో అన్నది మాధవి.

నేను మరోసారి ఆశ్చర్యపోయాను.” ఒకసారి మిమ్మల్ని నా వర్క్ ప్లేస్ కి తీసుకెళతాను, వస్తారా?”

“ఓ! ష్యూర్” అన్నాను.

సెలవలు, పండగ, పిల్లలు, మనవలు హడావుడి అంతా సజావుగా జరిగి పోయింది. వాళ్లు వెళ్ళిన రెండో రోజు సాయంకాలం, మాధవి వచ్చేసింది; ఒక హలో చెప్పి, పక్కనున్న మెట్ల మీద నుంచి పైకి వెళ్ళిపోయింది.
చేటలో వేయించిన వేరుశెనగ గింజల పై తొక్క తీసుకుంటూ ఆలోచిస్తున్నాను నేను.

ఇంట్లో చేసిన సున్నుండలు, పులిహార హైదరాబాద్ నుంచి వచ్చిన స్వీట్లు అన్ని పట్టుకుని పైకి వెళ్లాను.

“మిన్నూ”…

“ఏంటాంటీ! కొత్త పేరు పెట్టారా?”

“అవును,మాధవీ! నీ మినిమలిజం నాకు బాగా నచ్చింది. అందుకే పెట్ నేమ్”అన్నాను.

“భలే పేరు పెట్టారు! సున్నుండలు, పులిహోర, ఇంక అన్నం వండక్కర్లేదు. ఆ స్వీట్లు వద్దులేండి.”

నిర్మొహమాటంగా వెనక్కిచ్చేసింది.

“ఏదో ఆలోచిస్తున్నారు, చెప్పండి.”

“అంకుల్ రిటైరయ్యాక ఒక ఆశ్రమంలో చేరారు. ఉదయం 6 గంటల నుంచి అక్కడే ఉంటారు, 12 అలా వచ్చి భోంచేసి పడుకుంటారు. మళ్లీ సాయంకాలం 6 కి వెళ్లిపోతారు. ఏ తొమ్మిదికో వస్తారు. నేను కూడా ఉత్సాహంగా, మొదట్లో ఆ కార్యక్రమాలకి వెళ్లాను. నాకు నచ్చలేదు. అక్కడ కూడా చాలా గ్రూపులుంటాయి. గురువులకి అణిగిమణిగి ఉండాలి. ఎవరు డబ్బు ఎక్కువగా దానం చేస్తే, వాళ్ళకే ప్రాముఖ్యత.”

“ఓకే ఆంటీ! మీరు చెప్పదలుచుకున్నదింకా చెప్పనేలేదు? ఐ మీన్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన విషయం”
“నాకేం తోచటం లేదు… ఖాళీగా ఉంది లోన, బయట”

“ఆంటీ! లోకం, కాలం, రెండు ప్రవాహాలు. ఎలా ఈదాలో మనకు మనమే ఎంచుకోవాలి. మ్యూజిక్, హేండిక్రేఫ్ట్. మంచి హాబీ ఎదైనా ట్రై చేయచ్చు కదా?” మాధవి బట్టలు ఇస్త్రీ చేసుకుంటోంది. ఇంతలో ఏదో ఫోన్ వచ్చింది. “నేను రెడీ”, అన్నది.

“హా! ఆంటీ! ఛీర్ అప్. ఇవాళ సాయంకాలం ఫ్రెండ్స్ కొందరు బీచ్ కెళ్తున్నాం. మీరూ వస్తారా?” అడిగింది.

నేను అప్రయత్నంగానే, “సరే వస్తాను”, అన్నాను.

“మరి వంట?”

“వచ్చి చేస్తాను”

“అంకుల్?”

“మధ్యాహ్నం చెప్తాను. కుదిరితే రమ్మంటాను. లేకపోతే నేను వెళ్లి వస్తాను, అని చెప్తాను”.

“పని మనిషి?”

“తనకు ఫోన్ ఉంది, రావద్దని. చెప్తాను”

“ఎక్సలెంట్! చూశారా! మీరేదైనా అనుకుంటే, అందుకు తగ్గట్టుగా మీ రొటీన్ జరిపి, మీరే సర్దుకుంటున్నారు. ఇదే,మరి నేను చెప్పింది!” నవ్వింది మాధవి.

నా మనసులో ఓ కొత్త తలుపు తెరుచుకుంది.

***

చెప్పులు విప్పేసి, ఉత్త కాళ్ళతో ఇసుక లో నడుస్తూ, మబ్బులు, వాలిపోతున్న సూర్యుడిని మౌనం గా చూసాం, అందరూ రొటీన్ గా చేసే ఫోటోలు దిగడం, పిడత కింద పప్పు తినడం లాంటివి కాకుండా, ప్రకృతి ఒడిలో, అందరం కలిసే ఉన్నా కూడా, ఎవరికి వాళ్ళంగా హాయిగా గడిపాం. సూర్యకాంతి ఎరుపు లోంచి నలుపు లోకి, సాయంత్రం చీకటిలో కి మారింది, నీళ్లలో ఉప్పు గళ్ళ లా కాలం కరిగిపోతోంది. చేతులు పట్టుకొని, మానవహారంలా నీళ్లలోకి వెళ్ళాం. ఆ కెరటాల నురగలో తెల్లని కాంతి, నా మొహం మీద వెలుగుతోంది.

“మనతో మనం మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు ఇలా వెళ్లాలాంటీ! ఒక్కోసారి నా ఫ్రెండ్స్ వస్తారు. వాళ్లు రాకపోయినా, నేనే వెళ్తుంటాను. ఇదే నా టానిక్” అంది మాధవి స్కూటీ లోపల పెడుతూ.

మరుసటి బుధవారం, వాళ్ళ హాస్పిటల్ కి వెళ్లాను. పుట్టుకతో ,మూగ చెవుడు పిల్లల కోసం ఒక ప్రత్యేక ప్రపంచం సృష్టించారు. తల్లి దండ్రులు ఎంతో ఆశతో తీసుకొస్తుంటే, మరింత ఓపికతో, ఆ పిల్లలకు సైగలతో ట్రైనింగ్ ఇవ్వడం నేర్పుతున్నారు. ఇద్దరు ముగ్గురు సెరిబ్రల్ పాల్సీ పిల్లలకైతే నడక, మాటలు, ప్రత్యేకమైన మిషన్లతో అలవాటు చేస్తున్నారు. చెంచాతో అన్నం తినడం , ఏబిసిడిలు దిద్దడం, నీళ్ళు పోసుకోవడం ఇలా ఎన్నెన్నో నేర్పుతున్నారు.

“మా రోజుల్లో సరిగ్గా చదువు రాని పిల్లలకు, వాళ్ల లెవెల్ కు దిగి ఎలా పాఠం చెప్పాలో అన్నదే నేర్చుకున్నాం. కానీ మీరు చేస్తున్నది నిజమైన సేవమ్మా!” అన్నాను మాధవి తో.

“ఇది సేవ కాదు ఆంటీ. స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన పాఠాలు చెప్పడం ఒక ఛాలెంజ్. ఏదో బైపిసి తీసేసుకుని అయ్యామంటే డాక్టర్ అయ్యామని కాక, ఇదో కొత్త దారి ఉందని తెలుసుకున్నాక నా మీద నాకు కాన్సెప్ట్ వచ్చింది.”

అప్పటి నుంచి, “శ్రేయ” ఫౌండేషన్ లో వారానికి ఐదు రోజులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 దాక నేను వలంటీర్ గా చేరాను. పిల్లల చేత బొమ్మలు వేయించడం, ఇండోర్ గేమ్స్ ఆడించడం చేశాను.

అలా రెండు సంవత్సరాలు గడిచాక మాధవి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది.

***

మూడు నెలల క్రితం విశ్వేశ్వరం నీరసపడ్డారు. ‘పార్కిన్ సన్స్ డిసీజ్’. తన పని తాను చేసుకోలేని స్థితి. నేనే అన్నీ చేస్తున్నాను. భుజాల బలమంతా ఉపయోగించి లేపి పక్కమీద పడుకోబెట్టడం, కుర్చీలో కూర్చోబెట్టడం, కొంచెం కష్టమే.

మా పిల్లలు హైదరాబాద్ లో ఉండమని అభ్యర్ధించినా, సొంత వూరు, ఇల్లు పైన ఆపేక్ష, ఇక్కడి స్వేచ్ఛ కోసం మేము వెనక్కి తిరిగి వచ్చేసాం.

నాకు మనిషి అవసరం అనిపించింది. కనీసం రాత్రి పూట ఆయన ఆలనా పాలనా చూసేందుకు. ఇంతలో రాజారావు దొరికాడు. వాచ్ మేన్,సేల్స్ మేన్ — ఇలాంటి ఎన్నో చిన్నచిన్న పనులు చేసి, చేసి, విసిగిపోయి ‘డొమెస్టిక్ హెల్పర్’ గా మారేడట.

నిజానికి ఇల్లంతా జబ్బు పడినట్టుగా ఉండేది. డెటాల్, డయాపర్లు, వాంతి చేసుకునే గిన్నె, ఉమ్ము గిన్నె, మూత్రం పట్టే డబ్బా, తెలియని మురుగు వాసన ,ఘాటు పౌడర్, ఇవన్నీ. మనిషి శరీరం ఎంత త్వరగా కుళ్ళిపోతుంది!

అలాంటిది, రాజారావు వచ్చాక, చాలా మార్పు వచ్చింది. కర్పూరం బిళ్ళలు, బియ్యం కలిపి పొడి లా చేసి అక్కడక్కడా జల్లుతాడు. ఉప్పు పొడి చేసి, చిన్న గిన్నెలో పెట్టి, గది మూలల్లో పెడుతూ ఉంటాడు. హుషారుగా ఏదో ఒక పాట పాడుతూ వస్తాడు. ఖాళీగా కూర్చోకుండా, వేప పళ్లతో చూర్ణం తనే తయారుచేస్తాడు. రూమ్ ఫ్రెషనర్స్ వద్దంటూ, కాస్త సాంబ్రాణి ధూపం వేస్తాడు.

ఒక చక్రాల కుర్చీ కొనిపించాడు. “సార్ కి షికారు అవసరం”, అంటాడు. ఒళ్ళు తుడిచి, పౌడర్ పూసి, తల దువ్వి, కుర్చీలో కూర్చోపెట్టి, వీధి చివరి దాకా నాలుగు రౌండ్లు తిప్పుతాడు. నేను డాబా మీదకి వెళ్తే, అప్పుడప్పుడు వచ్చి కబుర్లు చెబుతాడు. మొక్కల కి ఏమేం చేయాలో చెప్తాడు. విశ్వేశ్వరం గారికి జావలో చారు, మజ్జిగ కలిపి మెల్లగా గంటకు పైగా తాగిస్తాడు. మాత్రలన్నీ శ్రద్ధగా గుండ కొట్టి, మంచి నీళ్ళలో కలిపి, జాగ్రత్తగా పట్టిస్తాడు. గుటక పడకపోతే, తల మీద చనువుగా కొడతాడు.

టీవీ పెడతాం. పదింటికల్లా నేను పడుకుంటాను. వాడికి నిద్ర రాదు! టీవి పెట్టుకుంటాడు.

ఏ కారణాన్నైనా, విశ్వేశ్వరం మూలుగుతూ ఉంటే, నేను కూడా అక్కడే కూర్చుంటాను. కాల ప్రవాహాన్ని, అనారోగ్యం ఎన్ని ముక్కలు చేస్తుందో కదా!

“వెళ్లి పడుకోండమ్మా! ఉదయం మీరొక్కరే చూసుకోవాలి కదా?” అన్నాడు. “ఉదయం పూట నువ్వేం చేస్తావ్?” అడిగాను.

“మా ఆవిడ హాస్పటల్ లో నర్సు. నేను పిల్లల్ని స్కూల్ కి దిగబెట్టి వచ్చి, వంట చేసి క్యారేజి తీసుకెళ్ళి మా యావిడకిస్తాను.” అన్నాడు.

“అదేంటి? నువ్వు వంట చేస్తావా?”

“ఏంటమ్మా, పని లో, ఆడ పని – మొగ పని ఉండవు మాకు. నాకు కాస్త ఎలక్ట్రికల్ పని కూడా వచ్చు. అది పనిచేసే హాస్పటల్ లో ఏదన్నా వాంటింగ్ ఉంటే ఆదివారం పనికి వెళ్ళి వస్తాను ఎక్స్ట్రాగా రెండు వేలిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు పుట్టుకతోనే మాటలు రావు.” ఉలిక్కి పడ్డాను నేను.

“పాప వైద్యానికి డబ్బు కోసం, నేను గల్ఫ్ వెళ్ళాను. నరకం అనుకోండి. ఆర్నెల్లకే తిరిగొచ్చేసాను.

పెళ్ళాం, బిడ్డల్ని దగ్గరుండి చూసుకుంటూ, రెండుద్యోగాలు చేసుకోవచ్చని చెప్పి, ఇలా మీ ఇంట్లో కుదిర్చి, నా కూతురికి స్పెషల్ చదువు చెప్పిస్తున్నారు మా మాధవి మేడం.”

ఆ! మన మాధవేనా ఏంటి ? ఇంటికి రానేలేదు పిల్ల! అనుకున్నాను.

***

మాధవి! తనే! వచ్చి నా కళ్ల ముందు నిలబడింది. “ఆంటీ! సర్ప్రైస్! బాగున్నారా?” ఆప్యాయంగా చేతులు పట్టుకుంది.

“మేడమ్ గారు” అంటూ, రాజారావు హడావిడి పడుతున్నాడు. “నెలకొకసారి మా సంస్థ నుంచి వచ్చిన వాళ్ళెలా పనిచేస్తున్నారో, మేమే స్వయంగా వచ్చి తెలుసుకొంటాం. ఎలాగూ మనిల్లు కదాని , నేనే వచ్చాను. హైదరాబాద్ నుంచి మీ అబ్బాయి నాకు కాల్ చేసి ఎవరైనా మనిషి దొరికితే మీకు సాయం గా పెట్టమని చెప్పారు. ఇంతలో రాజారావుకు ఉద్యోగం కావాల్సి వచ్చింది. మీకు సరిపోయాడా?” అంది. నేను “ఆ! బాబు చెప్పాడా? ఆ! రాజారావు మేమూ అడ్జస్ట్ అయాం” అన్నాను.

“అంకుల్, అంకుల్…” అంటూ, దగ్గరగా వచ్చి, విశ్వేశ్వరం గారిని పరీక్షించింది.

ఇంట్లో ఉన్నప్పుడు,వీల్ చైర్ పైన కూర్చున్నప్పుడు ఏమేం వ్యాయామాలు చేయించాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో రాజారావు కు చక్కగా చెప్పింది. చూస్తూ ఆశ్చర్యంతో తల మునకలయ్యాను.

నాతోపాటు మేడ మీదకు వచ్చింది. మొక్కల్ని పరిశీలించింది. “ఈ ఇనీడియం బాగుందాంటీ”. అని మెచ్చుకుంది.

“ఏంటి మాధవీ, నువ్వు వైజాగ్ లో?”

“నా సొంత ఫర్మ్ మొదలు పెట్టానాంటీ. హైదరాబాద్ లో ఒక డాక్టర్ దగ్గర ట్రైన్ ఔతూ, ఆరు వారాల అబ్జర్వర్ షిప్ కోసం, లండన్ వెళ్లాను. అక్కడ స్పెషల్ చిల్డ్రన్ తో పాటు, జీరియాట్రిక్స్ అంటే వృద్ధులను
కేర్ టేక్ చేయడం ఎలాగో చూశాను. చాలా నచ్చింది. ఒక సర్టిఫికెట్ కోర్సు చేసాను.”

“మన పక్కనే అవసరం ఉన్నా, ఖాళీలు మిగిలి పోతున్నాయి. వాటిని పూరించాలనిపించింది.”

నేను మౌనంగా నిలబడ్డాను.

“మీరే చూడండి! అంకుల్ అనారోగ్యం పూర్తి గా మానేది కాదు. కానీ ఆయన కాస్త కంఫర్టబుల్ గా వుండాలి. రాజారావు తన స్పెషల్ బిడ్డ ను చక్కగా పెంచాలి. గల్ఫ్ ఎండమావి నుంచి అతడికి విముక్తి కావాలి. ఈ అన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్. నా డొమెస్టిక్ హెల్ప్ సంస్థ.

ఒక స్టార్టప్ లో నా ప్రయత్నంఫలించింది. మదుపు దొరికింది. దీని పేరు ‘యువర్ నీడ్స్.” మాధవి వివరంగా చెప్పింది.

కిందికి వచ్చాం. “ఆంటీ, ఇంకా చాలా అంకుల్స్, చాలా రాజారావులు, చాలా ధన్య లు. ధన్య రాజారావు కూతురు. ఉన్నారు. నా వంతు నేను” మాధవి నవ్వింది నిండుగా.

“సో, మరి నేను వెళ్ళొస్తాను. “

“హా. . ! మాధవీ, గుడ్ జాబ్”, అంటూ సాగనంపాను.

***

మాధవి ఇప్పుడొక పూల మొక్క. తన చుట్టూ ఎన్నో బ్రతుకులలో కొత్త పరిమళం వెదజల్లుతూ ఉండే కొత్త తరం అమ్మాయి.

కాకినాడలో నివాసం. వృత్తి రీత్యా వైద్యురాలు. రంగరాయ మెడికల్ కాలేజీ లో ఫాకల్టీగా పనిచేస్తున్నారు. 'నవ నవలా నాయికలు' పుస్తకం లో రాసిన వ్యాసంతో మొదటి సారి అచ్చు లోకి అడుగు పెట్టారు. 'చినుకు' మాసపత్రిక, 'కౌముది', 'సారంగ', 'సంచిక' వెబ్ మాగజైన్స్, 'విపుల'లో కథలు  ప్రచురితమయ్యాయి. అమెజాన్ లో "Interludes" అనే నవలిక (ఇంగ్లీషు) ఉన్నది. మానవ జీవితంలోని వైరుధ్యాల మధ్య దూరం తగ్గించే మార్గంలో కథ పాత్రలను అన్వేషించే ప్రయత్నంలో ఉన్నారు.

8 thoughts on “కొత్త తలుపు

 1. సూర్యకాంతి ఎరుపు లోంచి నలుపు లోకి, సాయంత్రం చీకటిలో కి మారింది, నీళ్లలో ఉప్పు గళ్ళ లా కాలం కరిగిపోతోంది.
  చేతులు పట్టుకొని, మానవహారంలా నీళ్లలోకి వెళ్ళాం. ఆ కెరటాల నురగలో తెల్లని కాంతి, నా మొహం మీద వెలుగుతోంది.

  పై తెలిపిన వాక్యాలు ఎంత సహజం గా ఉన్నాయి..
  ఎంతో చక్కని, అహ్లాదభరిత శైలితో కథ అద్యంతం సాగింది…

  చక్కని కథ, కథనం..
  Thank You Doctor cum writer garu.

  కానాల బాలు

 2. Good morning Madam , u’re story is thought provoking about minimalism , gender inequality in household works , uncared home maker ideology , individuality and about being a self contended personnel !

 3. ప్రతి జీవితం లో ఇలా కొత్త తలుపులు తెరచుకోవాలి. చాలా బాగుంది మేడమ్. అభినందనలు.

 4. కధ బావుంది,విసుపు,విరామం లేని మాధవి లాంటి పాత్రలు కొంతమందిలో జీవం పోస్తాయి,విరామ సమయంలో చిన్న చిన్న అమరికలు,ఆనందాన్ని ఎలా కలిగిస్తాయో ఈ కధ చెప్తుంది!అభినందనలు మేడం, కధ నాకు బాగా నచ్చింది

Leave a Reply