కొత్తపొద్దు కోసం…

పావురమా
ఎక్కడెక్కడో తిరిగి తిరిగి
వేసారి
నగరం నడిబొడ్డున
ఆవాసం చేసుకుంటివే
మొహంజాహీ మార్కెట్ ని

తరాల నీ సంతతి
నిజాం రాతి గోడల్లో
మీనార్లో హాయిగా స్వేచ్ఛగా
ఏ వైరస్ దరి చేరక

జ్ఞానం సొంతమని
విర్రవీగే మనిషి
నీ వల్ల వైరస్ అంటుకుంటదని
నీపై వలపన్ని
నల్లమల అడవులలో వదిలేస్తున్నారే

బాహ్య ప్రపంచం
ఎరుగని
అడవి బిడ్డల్ని
మైదానంలోకి తరుముతున్నారు
బతుకే మృగ్యమైన చోటది వారికి

నాగరికుడు
నిన్ను అచ్చటికి
అచ్చోటి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి
లోయల్లోని బిడ్డలని చల్ చల్ అంటూ

నీ బతుకుని
వారి బతుకుని
ఛిద్రం చేస్తున్నాడే
వాడు మాత్రం కార్పొరేట్ కాళ్ళ కింద
నలగడా ఏంటి?!
చెప్పవూ! పావురమా!
నీవంటే నాకు పావురం
నిస్తేజం ఆవహించి నేను
కొత్త పొద్దు కోసం నిరీక్షిస్తున్నా…

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply