కెమెరా కన్ను

కెమెరా కు మనసుంటే చాలు
కెమెరా కు కన్నులుంటే చాలు
పరిసరాలు,పరికరాలు అనవసరం
గుప్పెడు గుండె ల్లో కొలువైపోతాది
మనో ఫలకం పై చెరగని సంతకం మౌతుంది…..

ఏపెద్దింట్లోనో ఒక కన్న పేగు బంధం
ఊడిగం చేస్తుందేమో
పిడికెడు మెతుకుల కోసం
బాల్యమక్కడ పడిగాపులు కాస్తోంది.,….
ఆడిపాడాల్సిన గీతం
పూతోటల్లో గెంతులేయాల్సిన ఆనందం
పచ్చని మైదానంలో ఉరకలేయాల్సిన ఉత్సాహం
సరదాలు తో కొలువు తీరాల్సిన సంరంభం
మొలకెత్తాల్సిన విత్తనం
ఏ ఇంటి గుమ్మంలో నో
బాద్యతల బరువై
అలసిన మనసై
ఆవిరవుతోంది

అక్క అమ్మ అవుతోంది
ఆమె ఒడి ఊయలవుతోంది
విశ్రాంతి నిచ్చే పాటవుతోంది
పెద్దరికం ఇచ్చిన ఆత్మీ య స్పర్శ అవుతోంది….
ఆ గుమ్మం శాశ్వత కారాదు
అదే చర్విత చరణం కారాదు
ఆ చిన్నారి భవిత కారాదు
ఆమె చేరాల్సిన గమ్యం కోసం
నడవాల్సిన బాటకోసం
చేయాల్సిన పనులు
పలకాల్సిన మాటలు
పాడాల్సిన గీతాలు మనకోసం
ఇంకా ఎదురు చూస్తూనే
ఉన్నాయి. ..
రండి ఆమె కలల కౌగిట్లో
పసిపాపల మై మిగిలి పోదాం…

కడప జిల్లా. కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ., ఎం.ఏ., ఎంఇడి., ఎల్.ఎల్.బి., పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివారు.
రచనలు : చెదిరిన పిచ్చుక గూడు (కథాసంపుటి), మా తుఝే సలాం (కథా సంపుటి), అనువాదాలు : అమలు కాని హామీల చరిత్ర, తలకిందులలోకం, హలో బస్తర్. కవితలు, పుస్తక పరిచయాలు, అనువాదాలు. కొన్ని వ్యాసాలు.

Leave a Reply