పరువు హత్యలు కాదు… కులహత్యలు!

2022, మే 4 తెలంగాణా రాష్ట్ర రాజధాని చరిత్రలో ఒక భయకరంమైన రోజు…

ప్రేమ వివాహం చేసుకున్న కారణంతో, నగరం నడిబొడ్డున, దాదాపు 50 మంది ప్రత్యక్ష సాక్ష్యుల కళ్లముందే, నాగరాజు దారుణ హత్యకు గురయిన రోజు.

తన భర్త కోసం నడిరోడ్డు మీద అన్నని అడ్డుకునేందుకు ప్రయత్నించి ఆశ్రిన్ ఓడిపోయిన రోజు…

ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న అమ్మానాన్నలకి కడుపుకోత మిగిలిన రోజు…

ఆ ఇంట్లో శోకం ఆగలేదు… ఆగదు కూడా… ఆ కుటుంబంలో ఉండే జీవితకాల దు:ఖమది…

తెలంగాణా , వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి గ్రామవాసి నాగరాజు. చాలా పేద కుటుంబం. శిథిలావస్థలో ఉన్న ఒక్క గది ఇల్లు. తండ్రి బాధ్యతగా ఏ పనీ చేయడు. కుటుంబ భారం ఇంత కాలం అతని తల్లే మోసింది. చదువుకుని, ఉద్యోగం సంపాదించుకున్నాక తల్లికి చేదోడయ్యాడు నాగరాజు. ఆమె కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నాడు. భర్త వేధింపుల కారణంగా, పెళ్లి చేసి పంపిన చెల్లి ఇల్లు చేరింది. అయినా ఆ చెల్లిని ప్రేమగా అక్కున చేర్చుకుని భరోసా ఇచ్చాడు.

దాదాపు రెండు మూడునెలల క్రితం బాల్య స్నేహితురాలు, ముస్లిం మతస్థురాలు ఆశ్రిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగరాజు. ఇద్దరూ కాలేజీలో స్నేహితులు, పక్కపక్క గ్రామాలు. కానీ, ఆశ్రిన్ సోదరుడికి అది నచ్చలేదు. కారణం, ఆశ్రిన్ ని భార్య చనిపోయిన ఒక ముస్లిం వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఆశ్రిన్ అందుకు సమ్మతించలేదు. నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తిని, తనతో సమానంగా ఛూసే వ్యక్తిన పెళ్లిచేసుకుంటానని ప్రకటించింది. తన బాల్య స్నేహితుడు నాగరాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ముందునుండీ ఆశ్రిన్ సోదరుడిది నేరస్వభావమే అనేది, ఈ ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవం. అందుకే ఆశ్రిన్, తన విషయంలో భయపడుతూ ఉండేది. తను భయపడినట్టే జరిగింది. కోపంతో నాగరాజును హైదరాబాద్ నడి రోడ్డు మీదే, తన బావమరిది తో కలిసి, నాగరాజును హత్య చేసారు. చేతులకు పెట్టుకున్న అందమైన గోరింటాకు చెరిగిపోకముందే, ఆమె కలల జీవితం కూలిపోవడం అత్యంత విషాదం. నాగరాజు మరణం తర్వాత ఆమె చాలా ఒంటరైపోయింది. ప్రాణంగా ప్రేమించిన నాగరాజును తలుచుకుని, గుండెనిండా దు:ఖంతో మౌనమై పోయింది.

మరోవైపు ఈ కులాంతర, ఈ మతాంతర వివాహం గురించి, నాగరాజు హత్య గురించి తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేకమంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బండి సంజయ్ లాంటి BJP నాయకులు ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని, గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్లు కూడా చేసారు. వీరి అదనుతో కొద్ది మంది, నాగరాజును హత్య చేసారు కాబట్టి, ఆశ్రిన్ ను కూడా హత్య చేయాలనే విపరీత కామెంట్లు కూడా చేసారు. కానీ, నాగరాజు ఉండే మర్పల్లి గ్రామంలో ఎప్పుడూ కూడా కుల ఘర్షణలు లేవు, మత విద్వేషాలు అంతకన్నా లేవు. ఆ గ్రామంలో ముస్లిం గడపలు, దాదాపు సగం వరకూ ఉన్నాయి. అయినా చాలా ప్రశాంతంగా ఉండే గ్రామమది. ఏ ఒక్క రోజు మత ఘర్షణ జరిగింది లేదు. మతం ఘర్షణల పేరుతో, అలాంటి గ్రామాన్ని రెండుగా చీల్చే ప్రయత్నాలు జరిగాయి, జరుగుతూనే ఉంటాయి కూడా. ఈ క్రమంలో అనేకమంది నాగరాజు కుటుంబసభ్యులను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు.

ఇదే సమయంలో తెలంగాణా ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఆశ్రిన్ తో పాటు, నాగరాజు తల్లిదండ్రుల్ని, అతని చెల్లిని పలకరించారు. వారి బాధను పంచుకునేందుకు ప్రయత్నించారు. మీకు మేము తోడుగా ఉంటామనే భరోసాని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశ్రిన్ నాగరాజు పేరుతో, కుటుంబసభ్యులకు, బంధువులకు భోజనం పెట్టించమని అభ్యర్థించింది. ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ కమిటీ ప్రేమగా అందుకు అంగీకరించింది. వెంటనే పనిలో పడింది. సమైక్యంగా అందరూ ఈ బాధ్యతను తమ భుజాల మీద వేసుకున్నారు. అందరూ తలా కొంత డబ్బును సమీకరించి, మే 19 న నాగరాజు ఇంటిదగ్గర భోజనాలు ఏర్పాటు చేసారు. నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులందరినీ ఆహ్వానించారు. తెలంగాణా ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, నాగరాజు కుటుంబ సభ్యులందరికీ కొత్త బట్టలు కూడా పెట్టారు. ఆ కుటుంబానికి తోడుగా మేముంటామనే భరోసా ఇచ్చింది. ఆ కుటుంబం కూడా జాక్ సభ్యుల పట్ల అంతే ప్రేమను చూపించింది.

అంతే కాదు, ఒక అడుగు ముందుకేసి, ఆ గ్రామంలోని పిల్లలతో స్నేహం చేసారు. ఆ రోజు పిల్లల చేత బొమ్మలు వేయించారు. వారి మనసులోని ఆలోచనలకు రెక్కలు తొడిగారు. కాసేపు వారితో సందడి చేసారు. వారికి బహుమతులు అందచేసారు. ఆ పిల్లలు వేసిన బొమ్మల్ని భూమిక పత్రికలో ప్రచురిస్తామని, ఆ పత్రిక బాధ్యులు అక్కడే ప్రకటించారు.

తెలంగాణా ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, కేవలం ఈ కార్యక్రమంతోనే తన బాధ్యత తీరపోయిందనుకోలేదు. ఆశ్రిన్ కి , నాగరాజుకి కుటుంబానికి కూడా అండగా ఉంటూ, వారికి ప్రభుత్వం నుండి అందాల్సిన సాయం కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆశ్రిన్ గురించి మహిళా,శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ దివ్యా దేవరాజన్ తో మాట్లాడటం, ఆ డిపార్ట్ మెంట్ సైకాలజిస్ట్ తో ఆశ్రిన్ కి కౌన్సిలింగ్ చేయించడం జరిగింది. ఆశ్రిన్ కి, నాగరాజు అమ్మకి, చెల్లికి కూడా ఉద్యోగాలు ఇచ్చే విషయం గురించి చర్చలు సాగుతున్నాయి. వీటితో పాటు, నాగరాజు కుటుంబానికి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం , ఆశ్రిన్ పై చదువులు చదువుకోవడానికి సహకారం అందించాలని కూడా అభ్యర్థించడం జరిగింది. ఇంతవరకూ ప్రభుత్వం నుండి మూడెకరాల భూమి విషయంలో ఎలాంటి హామీ రాలేదు.

ఇంకా కేసు ఎంత కాలం నడుస్తుందో, తెలీదు. కోర్టు తీర్పు ఎలా వెలువరిస్తుందో తెలీదు. ఈ లోపు ఆశ్రిన్ ఏం ఆలోచిస్తుంది? ఎక్కడ ఉండాలనుకుంటుంది? ఏ ఉద్యోగం చేయాలనుకుంటుందనే విషయం, ఆమె అభిష్టానికే వదిలేయడం మంచిది. కాకపోతే ఆ అమ్మాయికి, కావలసిన మానసిక స్థైర్యం, వ్యవస్థాపరంగా అందాల్సిన సహకారం ఆమెకు అందిస్తే, తిరిగి తన కాళ్ల మీద తాను నిలబడటానికి అవకాశముంటుంది.

ఈ మొత్తం వ్యవహారంలో అండ్ ట్రాన్స్ జెండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పోషించిన పాత్రని అభినందించాలి.

నాగరాజు హత్య గురించి మరిచిపోకముందే, హైదరాబాద్ పాతబస్తీ మరో పరువు హత్య జరగడం విషాదం. జాక్ సభ్యులు ఆ కుటుంబాన్ని కూడా కలిసిరావడం జరిగింది.

రాష్ట్రంలో ప్రణయ్ హత్య తరువాత ఇలాంటి సంఘటనల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రెండూ వైపులా గట్టి వాదనలు వినిపించాయి. అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తరువాత ఆ దుమారం మరోసారి చెలరేగింది. అమృతని చాలా దారుణంగా ట్రోల్ చేసారు. అయినా ఆ అమ్మాయి ప్రణయ్ కుటుంబం ఇచ్చిన అండతో ధైర్యంగానే నిలబడింది. జీవితంలో నష్టపోయిన అమ్మాయిలు నిరంతరం ఏడుస్తూ కూర్చోవాలని, తప్పయిపోయిందని ఒప్పుకోవాలని ఆశించే పురుషాధిపత్య సమాజం అమృత లాగా ధైర్యం గా నిలబడిన అమ్మాయిల్ని చూసి తట్టుకోలేరు. ఆశ్రిన్ లాగా స్వయంనిర్ణయాధికార చేసుకోగలిగిన అమ్మాయిలను అభ్రదతకి గురిచేస్తారు.

ఈ పరిస్థితి మారడానికి అన్ని వైపుల నుండి కృషి జరగాలి. ఇలాంటి సమయంలో లౌకిక, ప్రజాస్వామిక దేశంలో ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ లాంటి స్నేహ సమూహాలే పెరగాలి. ఈ ఆలోచనా ధోరణితో పనిచేసే వ్యక్తులు మరింత సంఘటితంగా మారాలి. కుల, మతాలకు అతీతంగా సమాజంలోని భిన్న సమూహాలు స్వేచ్చగా, సమానత్వంతో జీవించే వాతావరణం కోసం అన్ని వైపుల నుండి ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం.

ప్రేమ వివాహాలు వర్థిల్లాల్లి… ప్రేమికులు సంతోషంగా జీవించాలి…

సామాజిక కార్యకర్త. గాయని. బుర్రకథ కళాకారిణి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఎం.ఏ (ఆర్థిక శాస్త్రం), ఎల్.ఎల్. బీ. చదివారు. ఆకాశవాణిలో పదేళ్ల పాటు casual announcer గా పని చేశారు. TV 9, Vanitha TV, 10TV ల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. యూనిసెఫ్, లాడ్లీ మీడియా అవార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఉత్తమ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ అవార్డు అందుకున్నారు. Center for Sustainable Agriculture లో Krishi TV (వ్యవసాయ) యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ప్రసుతం Voice of the People పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా పిల్లల కోసం ' కథల ప్రపంచం ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.

Leave a Reply