కురవడానికి

ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నాయి
ఇన్ని అక్షరాలు
ఎలా ఊరుతున్నాయి
ఇన్నేసి పదాలు
చేతన ఉన్న మనసు
నలిగే కొద్దీ రాలిపడుతుంటాయి
వేవేల వాక్యాలు
కనురెప్పలు కదిలిస్తూ పరికించగానే
చుట్టూ ఉన్న సమూహాలు
ఎన్నో కన్నీటికథలు చెబుతాయి
కొన్ని సుదూర తీరాల పక్షులు
రెక్కలపై లెక్కలేనన్ని వార్తలు
మోసుకొస్తాయి
చెవిన పడిన
నదీ ప్రవాహాల గలగలలు
సంగీతాన్ని వినిపిస్తాయి
సునామీలూ భూకంపాలూ
కల్లోలగాధలను వివరిస్తాయి
గుప్పెడుగుండె చేసే చప్పుడు తట్టుకోలేనితనం
కవితాసుమమై వికసిస్తుంది
రోడ్డున పడ్డ కష్టం కరిగి నీరై
చూపులకు అడ్డం పడుతూ
నువ్వేం చేసావని నిలదీస్తుంది
వీటితో జతగూడిన
పాదంలో దిగబడ్డ ముల్లు
రక్తాన్ని చివ్వున చిమ్మి
కలాన్ని చేతికి అందిస్తుంది
ఉదయపు పోరాటాలకి నాంది పలికే
ముఖం ఎర్రబడ్డ సూర్యుడు
రాత్రి అలసటల రోజుకు
చరమగీతం పాడే
చీకటిని చీల్చే చంద్రుడు
బోలెడు పాఠాలు చెబుతారు
అయినా నాలుగు వాక్యమేఘాలు
కాగితంపై వానై కురవడానికి
అన్ని అగాధాలకు
మరెన్నో ఆలోచనలకు
కేంద్రబిందువుగా నిలబడ్డ
మనిషి లోతులు చాలవూ
మనిషే ఒక అంతులేని సముద్రం
మనిషే ఒక విస్తరించిన నీలాకాశం

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

2 thoughts on “కురవడానికి

Leave a Reply