కుటుంబరావు సాహిత్యం – మధ్యతరగతి వర్గ దర్పణం

విలువలు, నైతికత అన్నవి మానవ సమాజంలో ఉన్నతమైన ఆలోచనల నేపథ్యంలో తరుచుగా మనం ప్రయోగించుకునే పదాలు. కాని ఇవి నిజంగా సమాజంలో మనం అనుకున్న స్థాయిలో ఉన్నాయా? ఉండగలవా? అన్నది ఒక పెద్ద ప్రశ్న. మనిషి ఏ వర్గం వాడైనా జీవితంలో సుఖపడడం గురించే ఆలోచిస్తాడు. సుఖానికే పెద్ద పీట వేస్తాడు. అసలు సుఖం అంటే సమస్యలు లేని జీవితం అన్నదే సామాన్యమానవుని నిర్వచనం. అయితే తాను సుఖ పడడానికి కావల్సిన వనరులు సమాజంలో లేకపోవడం, ఉన్నా అవి అందుకొనే ప్రయత్నంలో సమాజం తనను అడ్డుకోవడం జరిగినప్పుడు మనిషి ప్రవర్తనలో ఒక నటన ప్రవేశిస్తుంది. సమాజానికి అనుకూలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ తనకు కావలసిన దాన్ని పొందడానికి మరో కోణంలో ప్రయత్నించడం జరుగుతుంది. అప్పుడు మనిషి జీవితం రెండు ముఖాలుగా మారుతుంది. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఇలా బతకడమే లౌక్యమని ఇలా బతకడమే ఆదర్శమనే మరో వాదన కూడా సమాజంలో వినిపిస్తుంది. అయితే ఈ వాదనల నడుమ ఈ ద్విముఖ జీవితాన్ని ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉంది. ఇది ఎంత వరకు సబబు అన్న ఘర్షణ మొదలవుతుంది. మధ్యతరగతి సమాజం విలువల పట్ల చూపే విధేయత లో ఈ నాటకీయత కనిపిస్తుంది. కుటుంబరావు గారి సమగ్ర సాహిత్యం పరిశీలిస్తే ఈ మధ్యతరగతి ద్విముఖ జీవితాన్ని, విలువల వెనుక ఉన్న కపటత్వాన్ని విపులంగా చర్చించడం కనిపిస్తుంది. ఇంత లోతుగా, మధ్యతరగతి మానసిక విశ్లేషణ ను మానవ సంబంధాల నేపథ్యంలో తెలుగులో జరిపిన మరో రచయిత మనకు కనిపించరు.

వీరి సాహిత్యంలో ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసింది మానవ సంబంధాలు, వాటి పేరుతో జరుగుతున్న వంచన. అవి కుటుంబీకుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, స్త్రీ పురుష సంబంధాలే కావచ్చు, కాని విలువల పేరుతో జరిగే భావోద్వేగ రాజకీయాలను వీరి పాత్రల ద్వారా చూపించిన విధానం మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి విశ్లేషించుకోవడానికి, కలలు అనే పొరలతో కమ్ముకుపోయిన నైతికవాదుల కళ్ళు తెరిపించడానికి ఉపయోగపడుతుంది. వీరి సమగ్ర సాహిత్యపు సారాన్ని ఒక చిన్ని వ్యాసంలో పొందుపరచడం కష్టం కావున వీరి ఐదు నవలలను ఆధారం చేసుకుని వీరి సాహిత్యపు ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాసం కోసం నేను ఎంచుకున్న నవలలు – సరితాదేవి డైరీ-సరోజ డైరీ, కొత్త అల్లుడు, కొత్త కోడలు, మారిన జీవితం, తిమింగిలం వేట. ఈ నవలల్లో పాత్రలన్నీ మధ్యతరగతి జీవితాలే. జీవితాన్ని అందినంత మేరా సుఖవంతం చేసుకోవడానికి తాపాత్రయపడే పాత్రలే. అయితే ఈ తాపత్రయం వెనుక సమాజ ఆమోదం కావాలనే కోరిక బలంగా ఉంటుంది, తమకు ఏం కావాలి అనే స్పష్టత కన్నా తమకు ఏం ఉంటే బావుంటుంది, తాము ఏ మార్గంలో నడుస్తే ఇతరులకు ఆమోద యోగ్యంగా ఉంటుంది అనే ఆలోచన, తమ కోరికలను, జీవితంలో తీసుకోబోయే నిర్ణయాలను, తమ సుఖాలను “సమాజ ఆమోదం” అన్న ప్రాతిపదిక మీద జీవించే పాత్రలే కనిపిస్తాయి. అయితే వీరికి భిన్నంగా తమకు ఏం కావాలో ఎందుకు కావాలో స్పష్టంగా చెప్తూ వాటి కోసం ఎవరి ఆమోదం అక్కరలేదని తమ జీవితానిపై నిర్ణయాధికారం తమదే అనే భావనతో ప్రశ్నించే పాత్రలు మరి కొన్ని కూడా ఉంటాయి. వీరు సాంప్రదాయవాదాన్ని ఖండించే ఆధునికులు. అయితే చాలా సార్లు వీరు కూడా సమాజానికి తల వంచుతూ కనిపిస్తారు. సుఖపడడమే ముఖ్య ఉద్దేశం అనే ఆలోచన ఇరువురిలో ఉంటుంది. ఒక వర్గం తమ సుఖం కోసం సమయానుకూలంగా ప్రవర్తిస్తూ తాము చేసే ప్రతి పనికి సమాజ ఆమోదం తప్పనిసరిగ పోందే ప్రయత్నం చేస్తూ ఉంటే మరో వర్గం సమాజాన్ని పట్టించుకోకుండా తమకు నచ్చిన మార్గాన్ని అనుసరించి కొన్ని సార్లు నష్టపోయి అయినా కాని తమ సుఖం కోసం తమదైన మార్గంలో బతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు వర్గాల ఉద్దేశం సుఖమైన జీవితం, తక్కువ సమస్యలతో జీవించడం. అయితే ఈ రెండు వర్గాల మధ్య ఆలోచనలలోని తేడాను స్పష్టంగా చూపే ప్రయత్నం రచయిత చేస్తారు.

“మారిన జీవితం” లో లీల పాత్రను తీసుకుందాం. ఆమె తండ్రి ప్రకాశం సమాజంలో స్త్రీ పరిస్థితి చూసి ఆలోచించి తన కూతురు అలా అతి సాధారణ స్త్రీగా మిగిలిపోకూడదని, అందరిని ఎదిరించి ఒంటరి పోరాటం చేసి ఆమె ఎదగడానికి కావలసిన ఆదర్శ వాతావరణం కల్పించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఆమె చదువు కోసం ఉన్నతి కోసం తన పరిధి మించి పోరాడుతాడు. కాని చివరకు లీల అతి సాధాదణ స్త్రీ గా ఉండిపోవడంలోనే ఆనందం వెతుక్కుంటుంది. తండ్రి అభ్యుదయ వాదం లోని నిరంతర పోరాటం వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కొని తానేదైనా ఎందుకు సాధించాలో తనకి అర్ధం కాదు. ప్రపంచం నడిచే దారిలో కాక మరో దారిలో నడిచి లేని పోని సమస్యలు తెచ్చుకుని పది మందిలో ఒంటరిగా మిగిలిపోవడానికి ఇష్టపడదు. తండ్రి దేన్ని అయితే విజ్ఞత అని నమ్ముతాడో అది ఆమెకు మూర్ఖత్వంలా అనిపిస్తుంది. తండ్రి తనకు చిన్నతనం నుండి కల్పించిన అవకాశాలను తన సాధారణ ప్రశాంత జీవనాన్ని భగ్నపరిచే మూర్ఖపు ప్రయత్నాలుగానే పరిగణిస్తుంది. తన సుఖం సాధారణ స్త్రీ లా మిగిలిపోవడంలోనే ఉందని నిర్ణయించుకుంటుంది. పూర్తిగా భర్త అధికారానికి లోబడి మనసును ఎదగనీయని పాతివ్రత్యంతో రోజులు గడిపే స్థితిలోకి ఆమె జీవితం ప్రయాణిస్తుంది. తన కుటుంబంలోని వ్యక్తుల పై అజమాయిషి చేస్తూ అనందించే ఒక గృహిణిగా లీల సంతృప్తికరంగా జీవించడం నేర్చుకుంటుంది. ఎవరి విలువలు వారివి. నిజాయితీ గా ఆలోచిస్తే మనుష్యులందరూ తాము తమకు అనుకూలంగా ఉన్నాయన్న విలువలనే ఎంచుకుని జీవిస్తున్నారు కాని మరోలా కాదు. మరి సంస్కరణ పేరుతో జరుగుతున్న చర్చలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నదానికి సమాధానం దొరకదు. అసలు సంస్కరణ ఎక్కడనుండి ఎక్కడకు మొదలవ్వాలన్న దాని మీదే స్పష్టత ఉండదు.

“తిమింగలం వేట” లో ఇందిర డబ్బులోనే సుఖం ఉందని నమ్ముతుంది. తన తల్లి తండ్రులను, అలాంటి మరికొందరు భార్యా భర్తలను చిన్నతనం నుండే పరిశీలిస్తుంది. పైకి ఎన్నో నీతి వాక్యాలు చెప్పే జనం డబ్బున్న వారికిచ్చే గౌరవం, మర్యాద, మన్నన చూసి సుఖపడడానికి ఎలా అయినా సరే డబ్బే ముఖ్యం అని డబ్బు మాత్రమే జీవితంలో గొప్ప విలువ అని నిర్ణయించుకుంటుంది. మరి ఒక స్త్రీ అయినందువలన అందులో మధ్యతరగతి స్త్రీ అయినందువలన ఈ డబ్బును, హంగును అందుకోవడానికి తనకున్న ఒకే ఒక సాధనం పెళ్ళి. అందుకే చిన్నతనం నుండే తన సుఖమైన జీవితం కోసం తన భర్తను తానే ఎంచుకోవాలని అనుకుంటుంది. “సరైనవాడికి ఇల్లాలు కావటంలోనే ఉంది చాకచక్యమంతా” అనే అవగాహనకు వస్తుంది. సమాజంకోసం బకతడం లేదా ప్రేమ కోసం బతకడం లాంటి వాటిపై ఆమెకు నమ్మకం లేదు. తన జీవితంలో కొందరు పురుషులను ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది, వారిని అంచనా వేస్తుంది, వారి ఆదర్శాలు, గుణాలతో తన జీవితంలో పెద్ద మార్పు రాదని అర్థం చేసుకుంటుంది. కట్నం వద్దని తనను కోరి వచ్చిన వ్యక్తిని నీ ఆదర్శాల వల్ల పాకీ వారి జీవితం తప్ప నాకు దొరికేదేం లేదు అని డబ్బు కోసం భార్య చనిపోయిన ధనికుడు, తండ్రి వయసు వాడైన ముసలి రఘురామయ్యను తనను పెళ్ళి చేసుకొమ్మని ఉత్తరం రాస్తుంది. రఘురామయ్య ఇది ఇందిర తండ్రి పన్నాగమని దులపరించేస్తే ఇక తనకు మరో దారి లేని పరిస్థితిలో ఉన్న అవకాశాలలో ఒక వ్యక్తిని ఎంచుకుని జీవితంలో మధ్యతరగతి పతివ్రతలా స్థిరపడిపోతుంది. పెళ్ళి అనే సంస్థకు ప్రేమ, పాతివ్రత్యం, పవిత్రత లాంటి మాటలు కట్టిపెట్టిన వ్యవస్థలోనే వివాహాన్ని ఒక పెద్ద వ్యాపారం లా పరిగణించి అదే పద్ధతిలో స్తీ పురుషులను కలిపే సాంప్రదాయం కూడా మరో పక్క కనిపిస్తూ వుంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక స్త్రీ తాను ప్రపంచంలో చూసిన సుఖాలను అనుభవించడానికి వివాహాన్ని ఒక మార్గంలా ఎన్నుకుని అదే దారిలో జీవిత భాగస్వామిని తానే నిర్ణయించుకోవాలనుకుని ఒక స్పష్టతతో కొన్ని ప్రయత్నాలు చేయడం మనకు ఇందిర పాత్ర ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు 2000 ల తర్వాత మనం చూస్తున్న స్త్రీ లోని ఆర్ధిక స్పష్టత 1965 లోని తన నవల లో రచయిత చూపించారు. స్త్రీ ఉన్నతికి, సుఖానికి వివాహం ఒక ముఖ్యమైన ఆర్ధిక మెట్టు అన్న స్థితిలోనే స్త్రీ జీవితం నాడు నేడూ ఉండిపోయిన విధానం గురించి ఆలోచించవలసిన అవసరం ఇందిర పాత్ర కల్పిస్తుంది. అప్పటికీ ఇప్పటికీ వివాహం పేరుతో ఏదో ఒక పక్షం చేస్తున్నది తిమింగిలం వేటే కదా.

ఇక “కొత్త కోడలు” అనే నవలలో హనుమాయమ్మ పాత్రనే తీసుకుంటే తన రెండో కొడుకుకి పెళ్ళి చేసే ప్రయత్నంలో సరోజిని అనే అమ్మాయిని చూడడం జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి చొరవ, లౌక్యం, తెలివి ఆమె పట్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే ఇష్టం హనుమాయమ్మను ఒక అభద్రతకు గురిచేస్తాయి. అందమైన కుటుంబాలన్నీ, బంధాలన్నీ అభద్రత నీడలో సేదతీరుతున్న నిజాలే. ఒక మనిషి మరో మనిషిని ప్రేమించినా ,ద్వేషించినా అందులో భద్రత పాలు కన్నా అభద్రతే ఎక్కువ. ఇది కప్పి పుచ్చుకోవడానికే మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అయితే ఇంట్లో వ్యక్తులందరూ ఒక్కటై ఈ వివాహం జరపడం, దాని తర్వాత కూడా అది అవమానంగా భావిస్తూనే ఈ పెళ్ళి ద్వారా తన కూతురుకు మంచి సంబంధం కుదురుతుందనే సంగతి తెలిసి హనుమాయమ్మ వారితో కలిసిపోవడం వెనుక కుటుంబ సంబంధాలు, తల్లి ప్రేమ, మానవ భావోద్వేగాల పై కూడా అధిపత్యం చూపే సామాజిక కపటత్వం కనిపిస్తుంది. తన బిడ్డ కోసం తాను తన ఆత్మగౌరవాన్ని ఎంతగా తాకట్టు పెట్టుకుంటుందో ఆ తల్లికి అర్థం కాదు. దేన్ని ద్వేషించిందో దాన్నే కలుపుకుని పోవడానికి సిద్ధపడడం, అభద్రత లో భద్రత, భద్రత లో అభద్రత ఇదే చట్రంలో పరిస్థితులకు అనుకూలంగా మానవ సంబంధాలు మారిపోతూ వుండడం ఈ నవలలో కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఇంకా స్పష్టంగా “సరితాదేవి డైరి – సరోజ డైరీ” అనే రెండు నవలల్లో వివరిస్తారు కొ.కు. తన బిడ్డకు తాను కోరుకున్న వరుడు రావాలని ఆ తల్లి చేసే నటన, ఆమె హేయమైన ప్రవర్తన , ఆశ్చర్యంగా వీటిని తన కర్తవ్యంగా ఆమె అనుకోవడం. దీనినీ తల్లి ప్రేమ అని తమ పవిత్ర అనుబంధానికి తాను చెల్లిస్తున్న మూల్యం అని తల్లి అనుకుంటూ అతి హేయంగా, నీచంగా అచ్చం ఒక బ్రోకర్ లా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇటువంటి తల్లి ప్రవర్తన కారణంగా ఆ కూతురు ఆ తల్లిని అసహ్యించుకోవడం చూస్తే అసలు దేని కోసం ఈ నటనను, మనిషి తన జీవిన విధానంగా మలచుకున్నాడో అర్ధం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం.

“కొత్త అల్లుడు” అనే నవలలో కొ.కు అద్భుతమైన చర్చ చేస్తారు. అసలు మనిషికి ఏం కావాలి అన్నదాని పట్ల స్పష్టత ఏ వయసులోనూ ఉండదు. సమాజంలో అలభ్యమైనది గా కనిపించే ఎటువంటి దాన్నైనా అది తనకు కావలసిందా లేదా తనను సంతోషపెట్టేదా అన్నది కూడా ఆలోచించకుండా మనిషి పొందాలనుకుంటాడు. తనకు సహజంగా లభించిన ఆణిముత్యమైనా గాని విలువలేని దాని గానే చూస్తాడు. మన వద్దకు స్నేహం కోరి వచ్చే వారిని తృణీకరిస్తాం, మనం అంటే ఎటువంటి గౌరవం లేని వ్యక్తులవైపు ఆకర్షింపబడతాం. ఏ మాత్రం అర్హత లేకపోయినా కోరి వచ్చిన కుశాలరావు ని తన కూతురికి చేసుకోవడానికి వెనుకాడే అనుమయ్య, అతని కుటుంబం కుశాలరావుని ఎన్నో విధాలుగా అనుమానిస్తారు, అవమానిస్తారు. చివరకి కూతురు బలవంతం మీద పెళ్ళి జరుగుతుంది. మానవ సంబంధాలలో ఆకర్షణ అనే ముసుగు లేకుండా సామాన్యంగా అతి మామూలుగా ఉండే మనుషుల పట్ల మనకు పెద్ద సద్భావన ఉండదు కాని ప్రతి ఒక్కరు విలువల గురించే మాట్లాడతారు. అవే విలువలు జీవితంలో ఎదురుపడినప్పుడు అతి పేలమైనవిగా కనిపిస్తాయి. దేని కోసం జీవితమంతా శ్రమిస్తామో ఏది కావాలని ముఖ్యమని డాంబికాలు పలుకుతామో వాటి పట్ల మనకే ఒక విముఖత. సమాజం తయారు చేసిన మనుషులు ఈ మధ్య తరగతి జీవాలు. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలు ఆ కుటుంబం అనే చట్రంలో ఇరుక్కుని ఆధిపత్య పోరుతో ఆ చిన్ని చట్రంలో సమయం గడిపేస్తూ ఉంటారు. ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సంబంధాల పునాది అంతా కపట ఆలోచనలతో, అవకాశవాదంతో నిర్మించబడుతుంది. చాలా వరకు కుటుంబంలో వ్యక్తులకు ఒకరి బలహీనతలు మరొకరికి సుపరిచతమే అయితే వీటినే ఆయిధాలుగా మలచుకుని ఒకరి పై ఒకరు యుద్ధం ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రేమ, విశ్వాసం, సామరస్యత కలిసి ఉండవలసిన మానవ సంబంధాలలో ఈ గుణాలు మాత్రం కనిపించవు.

“మధ్యతరగతి సమాజం” విలువలని బతికిస్తున్న వర్గమని, నైతికతను పునాదిగా చేసుకుని బలపడుతున్న వ్యవస్థ అనే నానుడి ప్రచారంలో ఉంది. ఎంతో గొప్పవని భ్రమించే ఈ మధ్యతరగతి జీవితాల గుట్టును బైటపెట్టే ప్రయత్నం కో.కు చేస్తారు. మన జీవితాలను మెరుగు పరుచుకోవడానికి, జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి, మానసికంగా మానవ సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి వ్యవస్థలోని లోపాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. మానవ జీవన నిర్మాణంలో మన ప్రయాణం ఎటు ఉన్నది, ఎటు వుండాలి అన్న విశ్లేషణ సమాజాన్ని ఉన్నత దిశగా నడిపించే ప్రయత్నంలో తప్పనిసరిగా అవసరం. సాంప్రదాయవాదంలోని గుణ గణాలేంటీ? వేటిని అనుసరించాలి వేటిని వదిలివేయాలి? అన్న విశ్లేషణ ప్రతి తరం లో ముఖ్యంగా జరిగి తీరాలి. సాంప్రదాయాన్ని ఖండించడమే ఆధునికత్వం కాదు. అలాగే మనం ఆధునికం అనుకుంటున్నవి నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తాయా లేదా తెలీని అయోమయంలో పడవేసి జీవితాలని అగమ్య గోచరంగా చేస్తాయా అనే విశ్లేషణ కూడా అవసరం. కో.కూ రచనలు మానవ సంబంధాలలోని నిజా నిజాలను బైటపెట్టి మన విశ్లేషణకు ఉపయోగపడతాయి. మానవ సంబంధాలను ప్రభావితం చేసే లక్షణాలను, కారకాలను ప్రస్తావిస్తాయి. ఆ అవగాహన మెరుగైన మానవ సంబంధాలను నిర్మించుకోవడాని ఆధారం అవుతుంది. మెరుగైన మానవ సంబంధాలు అంటే మెరుగైన జీవితాలు, అంటే మెరుగైన సమాజం. మనిషి ప్రయాణం మెరుగైన జీవితం కోసం అన్నది నిజం అయితే ఆ మెరుగైన జీవితాన్ని అందుకోవడానికి కావలసిన అవగాహన కల్పించే కో.కు. సాహిత్యం నేటీ తరానికి చాలా చాలా అవసరం.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

2 thoughts on “కుటుంబరావు సాహిత్యం – మధ్యతరగతి వర్గ దర్పణం

  1. 1000 కాదు వ్యాస రచయిత 1900 పుస్తకాలు వరకు పరిచయం చేసారు ఇంతవరకు…..

Leave a Reply