కొ.కు – ‘కీర్తి కండూతి’

కథ విన్నారుగా – హనుమంతుడు ఉన్నట్టుండి ఒక మంచి రోజున సాహిత్య దూషణ ప్రారంభించాడట. “రాజకీయవాదులంతా ఒకరికొకరు తారు పూస్తుంటే ఈ సందడిలో హనుమంతుడు నదరుగా కనపడిన రచయితలకు తారు పుయ్యసాగాడు.”

వాడెందుకిలా చేస్తున్నాడు? అన్న ప్రశ్నకి ఒక పాత్ర ఇలా జవాబు చెప్తుంది. అణిచిపెట్టిన రోగాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఇది అణిచి పెట్టిన కీర్తిదాహమూ కీర్తికండూతీనూ! చాలా రోజులు అణిచిపెట్టి ఉండడం వల్ల హనుమంతుడి రోగం ముదిరిపోయింది. దానికి ముందు ఆ రోగం రకరకాల stageల్లో ఏ రకమైన లక్షణాలని చూపుతోందో కూడా కొకు వర్ణిస్తారు. ఉదాహరణకి – దేశంలో రచనల ద్వారా పేరు తెచ్చుకుంటున్న ప్రతి ఒక్కడి మీదా హనుమంతుడికి పట్టరాని అసూయ ఉంది. వాళ్లంతా పొడిచేస్తున్నదేమీ లేదని హనుమంతుడి ధృఢ విశ్వాసం.

మరొక లక్షణం అతడి మీద సమకాలిక రచయితల ప్రభావం ఆవగింజంత కూడా లేదు. ఎందుకంటే వాడెవరి రచనలనీ ఆసక్తితో చదవలేదు. చాలా మంది రచనలు అసలు చూడనైనా లేదు.

ఈ లక్షణాలు అతని రచనా జీవితంలోని ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్కలా బయటపడుతూ వచ్చాయి. కానీ అసలు ఈ రుగ్మత ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది? అని చూస్తే – అతని చిన్నతనంలోకి వెళ్లవలసి ఉంటుంది.

జాంబవంతుడ్ని కలిసేదాకా అతను రచనలు చేస్తున్నాడన్న విషయం బ్రహ్మ రుద్రాదులకు కూడా తెలియనీయకుండా గోప్యంగా ఉంచాడు. దానికి కారణం అతనికి తన రాతల మీద నమ్మకం లేకపోవడం కాదు, ప్రపంచం మీద ఉన్న అపనమ్మకం. అందరూ మూఢులనీ, వాళ్లతో మాట్లాడడమే తప్పు అని వాడెప్పుడో నిశ్చయానికి వచ్చేశాడు. కానీ నోరు విప్పితే బెడిసికొడుతుందనే భయంతో రచనల గురించి కూడా చిన్నప్పటి సహనమూ, మౌనమూ అవలంబించాడు.

హనుమంతుడు చిన్నతనంలోనే గుర్తించాడు – తాను ఉడుక్కుంటే అవతల వాళ్లు మరింత ఏడిపిస్తారు. అందుకని సహనం నేర్చుకున్నాడు. తాను నోరెత్తినప్పుడల్లా ఇతరులకు చులకనౌతున్నాడు. అందుకని మితభాషిత్వం నేర్చుకున్నాడు. అప్పుడు అతనిని ప్రపంచం గౌరవించడం మొదలెట్టింది, అతని గుంభన అతన్ని చాలా కాలం కాపాడింది, అయితే జాంబవంతుడ్ని కలిసాక హనుమంతుడి జీవితం ఒక మలుపు తిరిగింది. నలుగురిలో పేరు తెచ్చుకోడానికి, వారు తన చుట్టూ తిరుగుతూ ఉండేలా చేసుకోడానికీ – జాంబవంతుడు రెండు టెక్నిక్లు వాడేవాడు. ఒకటి తన దగ్గర కొచ్చిన వారిని ఊపిరి సలపనంతగా పొగడడం – “ఊళ్లో జాంబవంతుణ్ని కీర్తించి భజనచేసే కుర్రాళ్లంతా జాంబవంతుడి చేత పంపు కొట్టించుకున్నవాళ్లే.” రెండో టెక్నిక్: దేశంలోని గొప్ప వాళ్లందరినీ ఏదో వంకన వెక్కిరించడం. “ఎవరైతే ఎందుకో అందుకు గొప్పవాళ్లుగా పరిగణించబడుతున్నారో వారందర్నీ జాంబవంతుడు వెటకారం చేసాడు. ఒకరికి నత్తి, ఒకరికి బట్టతల – మనిషికి ఏదో ఒకటి ఉండకుండా ఉంటుందా? అది పట్టుకుని అపహాస్యం చెయ్యటం జాంబవంతుడు నేర్చిన విద్య.”

మనిషి గొప్పవాడనిపించుకోడానికి రెండు మార్గాలు – ఒకటి తన ప్రజ్ఞ పెంచుకోడం, లేదా ఇతరుల లోపాలు ఎంచడం. రెండో మార్గంలో ఉన్న వాళ్లకి భజన బృందం అత్యవసరం. దాని కోసమే బృందాన్ని పొగడ్తలతో పోషిస్తారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో హనుమంతుడు తన గొప్పలు తాను చెప్పుకోడం మొదలు పెట్టాడు. అందుకే జాంబవంతుడి సభలో హనుమంతుడు ఎక్కువ కాలం నిలవలేదు – “తన శిష్యులు అవతల తన భజన చెయ్యాలి గాని సొంత డబ్బా కొట్టుకోడం జాంబవంతుడికి రుచించదు ” మరి.

కానీ పాపం జాంబవంతుడు కొట్టిన పంపుకి హనుమంతుడికి ఉన్న ఒక్క రక్షా పడిపోడం, దానితో వాడి నోరు వదులవ్వడం, మళ్లీ వాడు వాడి అభిప్రాయాల్ని ప్రకటించడం మొదలు పెట్టడం జరగ్గానే వాడు మళ్లీ హేళనకి గురి అయ్యాడు.

ఇక్కడ ఒక్కసారి ఆగి, ఈ హేళన అనే దాని గురించి ఆలోచిద్దాం. ఈ కథ ఎప్పుడో 1950ల్లో రాసింది కదా – ఈ హేళన కార్యక్రమం మన కాలంలో కూడా కనిపిస్తోందా? ఈ ప్రశ్న గురించి సుదీర్ఘంగా చర్చించుకోవలసిన అవసరం ఉంది – ఎందుకంటే బుల్లీ చేయడం, ట్రోల్ చెయ్యడం అనే నాగరిక రూపాలలో సమస్య నాకు కనిపిస్తోంది. ఎదుట పడే అవసరం లేకుండా ఈ బుల్లీయింగ్ చేయడానికీ, ట్రోలింగ్ చేయడానికీ అవకాశాలని పుష్కలంగా అందిస్తోంది సోషల్ మీడియా. ‘తమ అభిప్రాయానికి భిన్నంగా మరో అభిప్రాయాన్ని కలిగి ఉండడమే తమకు చేసే తీరని ద్రోహం’ అని నమ్మే వ్యక్తులు రోజురోజుకీ పెరుగుతున్నారు. ఆ భిన్నాభిప్రాయాన్ని అనుమానించి, అవమానించి, ఇంకా చాలదనిపిస్తే గుంపుతో కలిసి ట్రోల్ చేసే స్థితికి ఈ హేళన చేరుకుంది. దానిని ఎదుర్కోడం వ్యక్తుల స్థాయిలో అంత సులభం కాదు.

ఎదిరించడం చేతకాకపోతే – సహనమూ, మితభాషిత్వమూ అలవాటు చేసుకోడం మంచిదే కదా, మరి అదే పని చేసిన హనుమంతుడి జీవితం ఆఖరికి దూషణ మార్గాన్ని ఎందుకు పట్టి ఉంటుంది అని ప్రశ్న లేస్తుంది ఎవరికైనా. బుల్లీ చేయబడ్డవాడు స్వయంగా ఒక బుల్లీగా మారడం అనే అనివార్యతను చెప్తోందా కథ? కాదని నా ఉద్దేశం. అది తేల్చుకోడానికి కథ పరిధిలోకి వెళ్లి– బుల్లీయింగ్కి విక్టిం అయిన హనుమంతుడిలో దూషణ రుగ్మత ఎప్పుడు ఎలా ప్రవేశించి ఉంటుంది అని ఆలోచించాలి.

దానికి జవాబు మనకు మొదటి పేరాలోనే దొరుకుతుంది – హనుమంతుడికి తనను వెక్కిరించిన “వాళ్లంటే ఆగ్రహం కన్నా అసూయ ఎక్కువగా ఉండేది.”… తనలో లేని ఏవో శక్తులు వాళ్లలో ఉన్నాయనీ, అది తనకు దొరికే వరకూ తాను ఊరుకోక తప్పదు,“తన మేధావిత్వాన్ని చూసి హర్షించే ఉప మేధావులు దొరికే దాకా తాను నోరు విప్పరాదు” – అని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే హేళన చెయ్యడం తప్పని కాకుండా, అదేదో గొప్ప శక్తిగా అతను భావించేడు. అందుకే జాంబవంతుడు అందరినీ వెక్కిరించడం కూడా అతనికి తప్పుగా తోచలేదు. అక్కడే తప్పు బీజం పడిందని నాకు అనిపిస్తుంది. ఏ విషయాన్నైతే ఎదుర్కోవలసి ఉందో, దాన్ని ఆరాధించడం అక్కడ జరిగిన తప్పిదం.

ఎదిరించవలసిన విషయాన్ని ఆరాధించడం, అవలంబించడం! ఈ విషయం గురించి రెండు మాటలు చెప్పడం అప్రస్తుతం కాదనుకుంటాను. నాదొక చిన్న పరిశీలన – ఏ బ్రాహ్మణ కులాధిక్యతను ఎదుర్కోవలసి ఉందో – ఆ బ్రాహ్మణ కులం కంటే అధికమైన కులంగా తమ కులాన్ని ఎవరైనా భావించడం – కులాధిక్యతను ఆమోదించడం, ఆరాధించడంగా నాకు తోస్తుంది. కనకనే ఏ తిరస్కారాన్ని తరతరాలుగా అనుభవించారో, వారే అదే తిరస్కారాన్ని తోటి వారి మీద చూపడం, ట్రోలింగ్ చెయ్యడం సంభవిస్తున్నాయి.

కథలోకి మళ్లీ వస్తే, ఆ హేళనను తప్పించికోడానికి తాత్కాలికంగా అవలంబించిన విధానాలు హనుమంతుడికి మేలు చెయ్యకపోగా, హాని చేసాయి. తన మాట బయటకి చెప్పకపోవడంతో పాటు, నలుగురి మాట మీదా నమ్మకాన్నే కోల్పోయాడు. తను కాకుండా తక్కినవారంతా తస్మదీయులై పోయారు. ఇక అతను గమనించేదీ, నేర్చుకునేదీ, పంచుకునేదీ ఏదీ మిగలని స్థితి వచ్చింది.ఇక అతనికి ప్రపంచంతో సంభాషణ అన్నదే ఆగిపోయింది.

నాగరికత వర్ధిల్లడానికీ, పెరగడానికీ – నిరంతర సంభాషణ అత్యావశ్యకం. సంభాషణ, ఒక్కొక్కసారి వాగ్వాదం లోకి దారి తీస్తుంది – దానిని ఒక రకంగా ఫైట్ అనుకుంటే అది కూడా ట్రోలింగ్, బుల్లీయింగ్ కన్నా చాలా ఆరోగ్యకరం. వాటి మధ్య ఉన్న భేదం గురించి అమెరికన్ రచయిత ఆండ్రూ వాక్స్ ఇలా రాస్తాడు. Fighting means you could lose. Bullying means you can’t. A bully wants to beat some body, he doesn’t want to fight somebody. – Andrew Vachss. ఫైట్ చేసేటప్పుడు గెలుపోటములుంటాయి. అంటే ఒక వాగ్వాదమో, చర్చో జరిగినప్పుడు మన మాట అవతలివారి చేత ఒప్పించడమో, లేక వారి మాటకు మనం ఒప్పుకోడమో, అదీ కాకపోతే – ‘ఒకరి మాట మరొకరికి అర్ధమైంది, కానీ అంగీకారం కుదరలేదు’ అన్న నిర్ణయానికి రావడమో జరుగుతుంది. బుల్లీయింగ్/ట్రోలింగ్లో అదేమీ ఉండదు. అవతలివారిని దెబ్బ తీయడమే ఉంటుంది – శారీరకంగా/మానసికంగా.

అలా దెబ్బతినకుండా తప్పించుకుని, ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో “ఎక్కడా గాలి పొర సోకకుండా తనలో దిగ్బంధం చేసుకున్న భావాలను, పదిమంది బుర్రలూ సానబట్టే భావాలతో పోల్చి చూసుకుని, తనవే గొప్పగా ఉన్నాయనుకున్నాడు. ఆభావాలకు పట్టిన కిలమూ, తుప్పూ వగైరాలు హనుమంతుడికి అమూల్యంగా కనపడ్డాయి.” ఈ వాక్యం చదివాక ఈనాటి టీవీ/యూట్యూబ్ ప్రవచనకారులు గుర్తొచ్చారు. ఒకాయన భర్త విడిచిన బట్టలు భార్య ఆరేస్తే పుణ్యం అంటే మరొకరు విద్యార్ధి దశలో ఆడా మగా మధ్య సంపర్కం ఉండకూడదంటాడు. ఆ ఉవాచలు సామాజిక విషయాల దగ్గర ఆగిపోడం లేదు. తెలంగాణా ఉద్యమం, కాశ్మీరులో మీడియా దిగ్బంధం వంటి రాజకీయాంశాల గురించి కూడా ఏక పక్ష అభిప్రాయాల్ని, ఏ చర్చకూ అవకాశం ఇవ్వ కుండా – ప్రవచనాల్లో భాగంగా ప్రజలలోకి వదులుతున్నారు. వారి భావాల్లో ఉన్న కిలుమూ, తుప్పూ – వారికి అంత రుచిగా తోచడంలో వింత లేదు గాని మరో రకమైన భావజాలానికి exposure దొరకని కారణంగా, మెజారిటీ ప్రజలకి కూడా అవి రుచికరంగా తోచడం మన దౌర్భాగ్యం.

ఇక్కడ ప్రత్యేకించి జాంబవంతుడి తరహా సమూహాల గురించి చెప్పుకోవాలి. అతను ప్రజలను చేసే వెటకారాలని చాలా హాస్యస్ఫోరకంగా కొకు చిత్రిస్తారు. దానిని చూసి ఇదో రకమైన కుసంస్కారమని వెగటుతో దూరంగా జరిగిపోతే మాత్రం పొరపాటు చేసిన వాళ్లమవుతాం. ఎందుకంటే సృజనకారులకు, తద్వారా మొత్తం విశ్వానికీ జరిగే అపకారమేమిటో కొకు చాలా స్పష్టంగా హెచ్చరిస్తారు: దానిని ఒక ఉప్పు పాతరతో పోల్చి – మనుషుల్లో ఉండే హరితాన్నెలా నాశనం చేస్తుందో వివరిస్తారు. “ఇక్కడేదో జీవితమూ, సంస్కారమూ, విజ్ఞానమూ, చైతన్యమూ ఉందనుకుని ఇందులోకి వచ్చి కొంతకాలం ఇదే ప్రపంచంగా గడిపిన యువకులు చవిటివాసన కొడుతూ పైకి వచ్చి, తమలో ఇతరుల బాధలను చూసి సానుభూతి పొందే శక్తీ, ఇతరుల కృషిని అభినందించే శక్తీ, తాము స్వయంగా కృషి చేసే శక్తీ అడుగంటి పోయినట్టు తెలుసుకుంటారు.

ఈ అంశం కథలో కెల్లా కీలకమైన అంశమని నాకు తోచింది. ప్రతిభాశాలి అయిన సృజనకారుడికి ఉండవలసిన కనీస లక్షణాలేమిటని అడిగితే – ఈనాటికీ – సానుభూతి పొందే శక్తీ, అభినందించే శక్తీ, కృషి చేసే శక్తీ అని ఈ మూడిటినీ చెప్పాల్సిందే. జాంబవంతుడిలాటి స్వప్రయోజన పరాయణుల సాంగత్యంలో చేరి, అబద్ధపు ప్రశంసలకీ, అకారణ నిరసనలకీ అలవాటు పడ్డాక సహజ స్పందనలు అడుగంటిపోతాయి. అదే ఆ నవ యువకులకి జరిగింది.

జాంబవంతుడి నుండి దూరమయ్యాక హనుమంతుడి రచనా జీవితంలో జరిగిన మరో ఘట్టం – అభ్యుదయోద్యమం. ఆ ఉద్యమ ప్రతినిధి ఒకరు హనుమంతుడి రచన చదివి, అతని దగ్గరకి వచ్చి ఎంతో ప్రోత్సహిస్తాడు. సాహిత్య పరమార్ధం గురించీ, సంఘ పురోభివృద్ధిని గురించీ, ప్రజా జీవిత పరిణామం గురించీ, ఆ పరిణామం సాధించడంలో కళలు నిర్వహించవలసిన పాత్ర గురించీ – వర్ధమాన రచయితలని ఎడ్యుకేట్ చేయడం వారి విధిగా ఆనాటి కార్యకర్తలు భావించి ఉంటారు.

అంత మాత్రాన ఆ రకం రచనలు చేసిన రచయితలందరికి ఆ భావాల పట్ల అంగీకారం ఉందని, అభ్యుదయోద్యమం గురించి గౌరవం ఉందని నమ్మకంగా చెప్పలేం. ఆ ఉద్యమ భావజాల వాయువుల ప్రభంజనానికి పొల్లువీ, పుచ్చువీ కూడా మంచి గింజలతో పాటూ ఎగిరి కుప్పలో కూచోవచ్చు. దానికి పెద్ద ఉదాహరణ మన హనుమంతుడే. “అన్ని ఉద్యమాలూ వ్యక్తిని మింగేసి ఉద్యమాన్ని నడిపే వాళ్లని పైకి తోస్తాయి. జాతీయోద్యమంలో కూడా అనేక లక్షల మంది త్యాగం చేసి అనామకులైపోగా నాయకులు కీర్తి సంపాదించుకున్నారు.” ఉద్యమాలను గురించి మన హనుమంతుడి ఉద్దేశం అదీ.

తన గురించి తప్ప లోకాన్ని గురించి పట్టించుకునే అలవాటు లేనివారిని ఏ ఉద్యమాలూ బాగు చేయలేవు. హనుమంతుడు అలాటి వాడే. రచనలతో పైకి వచ్చిన వాళ్లెవరూ, ఉద్యమం తీయగానే దిగిపోలేదు. హనుమంతుడి సాహిత్యజీవితం మాత్రం తుదముట్టింది. ఆ కక్షతోనో లేక ముదిరిన కీర్తి కండూతి వల్లనో అతను విమర్శకుడి రూపం ఎత్తి తిట్ల పురాణకర్త అయ్యాడు.

రామాయణంలో – హనుమంతుడికి తన శక్తి తెలీదని, జాంబవంతుడు చెప్పిన తర్వాతే, అతనికి తన శక్తి మీద నమ్మకం కలిగి సముద్ర లంఘనం చేసాడనీ – ఉంటుంది.

దానిని వ్యంగ్యంగా ఈ కథలో ప్రవేశపెట్టి, మన హనుమంతుడిలో ‘లేని శక్తులు ఉన్నట్టు’ ఈ జాంబవంతుడు నమ్మించడం ఒక అర్ధవంతమైన ప్రయోగంలా అమిరింది.

కథలో ఒక అపురూపమైన సౌష్టవం కనిపిస్తుంది. కథ మొదట్లో అందరి చేతా అవమానింపబడిన హనుమంతుడు, వాళ్లు వీళ్లన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ నిందించడంతో కథ అంతమవడం.

పాత చింతకాయపచ్చడి లాటి భావాలని పట్టుకు వేళ్లాడే హనుమంతుడు అభ్యుదయ రచయిత అన్న పేరు తెచ్చుకోడం. సమ్మోహన శక్తితో యువకులని ఆకర్షించిన జాంబవంతుడు గాని, సాహిత్య ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన అభ్యుదయోద్యమం గాని – హనుమంతుడి తుప్పును కొంచెం కూడా వదిలించలేకపోడం, పూర్తి స్వార్ధం తప్ప మరో విలువ లేని జాంబవంతుడికీ, ప్రజా శ్రేయస్సు పరమ ధర్మమన్న విలువను ప్రకటించే ఉద్యమం వరకు ఉన్న దూరం, అవి సాహిత్యం మీద చూపించే ప్రభావం – ఇలా కథ మొత్తం విరుద్ధ ప్రాతిపదికల సమాహారంగా నిలుస్తుంది.

వీటన్నిటిలోనూ రచయిత ఎత్తి చూపించదలచిన intellectual narcissism – సాహిత్యానికెలా చీడ పురుగులా మారగలదో – స్పష్టంగా బయటపడుతుంది. తమ ప్రాముఖ్యత గురించి అంతూ పొంతు లేని భ్రమల్లో ఉన్న కారణంగా ప్రజల నుండి అనునిత్యం గౌరవాన్ని, సన్మానాన్ని కోరుకుంటూ ఉంటారు, లభించినది సంతృప్తినివ్వక, ఇక పొందలేమని నమ్మకంగా తెలిసిన నాటి నుండి – తమ కలాన్ని స్వప్రయోజనాలకు వాడడంలో మరింత దూకుడు ప్రదర్శిస్తారు. ఒకడ్ని తిట్టినా, మరొకడ్ని సమర్ధించినా – రెండూ కూడా నిజాయితీతో కాదు, దాని వల్ల తనకేదో లాభం ఒనగూడుతోందని మాత్రమే – ఇదీ హనుమంతుల/జాంబవంతుల వైఖరి. అదే కొకు విప్పి చూపించాలనుకున్నది ఈ కథలో. భావ ప్రకటన అనేది – తన భావాల మీద తనకున్న నమ్మకం కారణంగా కాక – ఆ ప్రకటనతో సాధించగల ప్రయోజనాల కోసం – అయితే సంభాషణ అనేది అర్ధహీనం అవుతుంది. అలాటి వారు ఏకంగా సాహిత్య విమర్శకి పూనుకుంటే ఇక జరిగేది ఏమిటో వేరే చెప్పాలా?

కొకు ఒక మాట వాడతారు – పదిమంది బుర్రలూ సానబట్టే భావాలు అని. అంటే చర్చల ద్వారా ఆలోచనల నిగ్గు తీసి వాటిలో శ్రేష్టమైన వాటిని గ్రహించాలని ఆయన ఉద్దేశం. దాని కోసం పది మంది పాల్గొనడం, బుర్రలు వాడడం, సాన బట్టడం – మూడు పనులూ జరగాలి.

అది జరగాలంటే ప్రతి వాడూ వాడి భావాలని నిస్సంకోచంగా బహిర్గతం చేయగల వేదికలుండాలి. భిన్న అభిప్రాయాలున్నపుడే ‘సానబట్టే’ కార్యక్రమం మరింత చురుకుగా సాగుతుందని మనం మనస్ఫూర్తిగఅంగీకరించాలి. గుంపులుగా ఏర్పడి ఒకడి గొంతును నొక్కే ప్రయత్నం జరిగినప్పుడల్లా – మనమందరం అడ్డుపడాలి.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

3 thoughts on “కొ.కు – ‘కీర్తి కండూతి’

  1. కుటుంబ రావు రచనలు, ఆలోచన లూ ఈవేళ ఎంత అవసరమో మీ రచనని బట్టీ తెలుస్తోంది.

  2. కొకు కథలకు ఎంత సమకాలీనత ఉందో అర్థం చేయించారు. ఎంత సున్నితమైన విషయాన్నీ కూడా కథ రూపంలో చెప్పవచ్చో అర్థం అయ్యింది

Leave a Reply