పౌరసత్వ వివాదం కరోనా విపత్తు నేపథ్యంలో కొంచెం సద్దుమణిగింది. కానీ పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్) పార్లమెంటు ఆమోదం పొంది(లోక్ సభ డిసెంబరు 9, 2019, రాజ్యసభ డిసెంబరు 11, 2019) తయారైన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీయార్), అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ) నమోదు కార్యక్రమాలు భారతీయ సమాజంలోకి రంగప్రవేశం చేసిన సందర్భంలో దేశంలో తీవ్రమైన అలజడి చెలరేగింది. దేశవ్యాప్తంగా వీటికి నిరసన సెగలు తగులుతున్నాయి. జేఎన్టీయూ, జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై దాడి, షాహీన్ బాగ్ ఉదంతాలు, డిల్లీ అల్లర్ల లాంటి పరిణామాలు అంతర్యుద్ధాన్ని తలపించాయి. కరోనా కలకలం తగ్గిన తర్వాత ఈ నిరసనోద్యమం మళ్ళీ కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సందర్భంలో ఉద్యమకారులకు బాసటగా కవులూ పెద్ద ఎత్తున గళమెత్తారు. కవులకు దన్నుగా పత్రికలు నిలబడ్డాయి. ఈ సందర్భంగా వచ్చిన తెలుగు కవిత్వం, దానికి పత్రికలు ఇచ్చిన మద్దతూ పరిశీలించదగ్గవి.
పౌరసత్వ వివాదానికి పూర్వం పాలకపక్షం దేశ పౌరుల మధ్య ఉన్న సామరస్యానికి చిచ్చు పెడుతున్నదని, చరిత్రను కాషాయీకణ చేసే ప్రయత్నాలు చేస్తున్నదని, జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు(ఆగస్ట్ 5, 2019) అన్యాయమని, అయోధ్య తీర్పు(నవంబరు 9, 2019) ఒక మతానికి అనుకూలంగా ఉందని నిరసిస్తూ కవులు రచనలు చేస్తుండేవాళ్ళు. అప్పటి పాలకపక్ష చర్యలు వాళ్ళు ముందు ముందు తీసుకోబోతున్న పౌరసత్వ సవరణాది సాహసోపేత నిర్ణయాలకు, కవుల స్పందనలు వాటిని ఎదిరిస్తూ రాబోతున్న ప్రతిఘటనాత్మక కవిత్వానికీ వర్ష సూచనలుగా భావించవచ్చు. పౌరసత్వ వివాదంపై కవుల స్పందన ఎలా ఉందో విశ్లేషించడమే ఈ వ్యాసోద్దేశం.
ఇందులో కవితలు వెలువడటాన్ని బట్టి సాధ్యమైనంత కాలక్రమత పాటించబడింది. అసోంలో పౌరసత్వం నిరూపించుకోలేని వాళ్ళని ప్రభుత్వం డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టింది. పౌరులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోడానికి తగిన సాక్ష్యాధారాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. పౌరసత్వ నిరూపణకు ప్రజలు పత్రాల సేకరణ, కోర్టుబాటలు పట్టి ధనమానాలతో బాటు ప్రాణాల్ని కూడా పోగొట్టుకున్న కథనాలు మాధ్యమాల్లో వచ్చాయి. ఈ సందర్భంలో ముస్లిం స్త్రీవాద కవయిత్రి షాజహానా గారు “డిటెన్షన్ క్యాంపులో కలుద్దామా!” అనే కవిత రాశారు. అది ప్రజాశక్తి అక్షరం (డిసెంబర్ 16, 2019)లో వచ్చింది. ఒక ముస్లిం మిత్రుడు ఆ సంక్షోభంలో తటస్థంగా ఉన్న తన హిందూ మిత్రునికి రాసిన లేఖలా ఉంటుంది ఈ కవిత.
ఇందులో సదరు ముస్లిం మిత్రుడు “నువ్వు అలానే ఉండు/నటిస్తూనే ఉండు/ఏమీ జరగనట్టు/” … “రంగస్థలంపైన నువ్విప్పుడు/స్పష్టంగా గోచరిస్తున్నావు”, “నీకు మతమే గాని మనసు లేదు కదా!” అని దెప్పిపొడుస్తాడు. తమ మైత్రిని నెమరువేసుకుంటూ “నెలవంకని చూసినప్పుడో/ఖీర్ తిన్నప్పుడో/ షాయరీ వినపడినప్పుడో / ఇరానీకేఫ్లో నువ్వొక్కడివే ఉన్నప్పుడో / సాయంత్రాలు / నీ గుండెను ప్రశ్నించినప్పుడో గుర్తొస్తే రా…/డిటెన్షన్ క్యాంప్‌లో…./బతికి ఉంటే కలుద్దాం!” అని స్నేహం సిగ్గుపడేలా చురకలేస్తాడు. ముస్లింలు తమ దేశభక్తిని చాటుకోడానికి ఎంత విశ్వాసంగా మసలుకుంటున్నా ప్రతి అలికిడిలో వాళ్ళవైపు అనుమానపు చూపులు చూడ్డం కద్దు. “ఎన్నాళ్ళు నన్ను కౌగిలించుకున్నా ఎప్పటికీ నేను నీకు/గులాబీనే చేతికివ్వాలనే అనుకుంటాను/
పువ్వు కింద ముళ్లు నా కుట్ర అంటావు” (మా…,కొలిమి) అని బాధపడతారు నబి కరీం ఖాన్.
దేశంలో పుట్టిపెరిగిన పౌరుల్ని కొత్తగా పౌరసత్వం నిరూపించుకోమనడం విడ్డూరంగా ఉందని “మా తాతల చితాభస్మాలకు/ఇప్పుడు ఊపిరిలూదాలంట/బూడిద కాగా మిగిలిన బొమికల్ని ఏరి/పాత తరాల్ని మొలిపించాలంట” (ధృవీకరణ, అక్షరం) అని కంఠ బంగార్రాజు గారు ఎద్దేవా చేస్తారు. “ఇక్కడి నీళ్లలోనే ఈదుతున్ననని/ మొప్పల మీద రాసుకోవాలిప్పుడు/ఇక్కడి ఆకాశంలోనే ఎగురుతున్ననని/ఈకల మీద లిఖించుకోవాలిప్పుడు”(ఆన, వివిధ, ఆంధ్రజ్యోతి) అని వెటకారం చేస్తారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు. హిందూత్వ వాదుల దమననీతిని ద్రవిడ సంస్కృతిపై ఆర్య సంస్కృతి చేస్తున్న దాడిగా పేర్కొని తిరస్కరిస్తారు. ఇప్పుడు జాత్యహంకారమే దేశభక్తిగా కొత్త నిర్వచనాలు సృష్టిస్తున్నారు. సామరస్యాన్ని పెంపొందించే నిజమైన దేశభక్తి పనికిరాకుండా పోయింది. అందుకే “పౌరసత్వ కొలమానంలో/ దేశభక్తి రెండవతరగతిదిగా నిలబడుతున్నది” (అలౌకిక, సాహిత్య ప్రస్థానం) అని అంటారు శిఖా ఆకాష్. ప్రస్థానంలోనే మామిండ్ల రమేష్ రాజా గారు “నాది అనుకున్న నాది కాని రాజ్యమా/నన్ను పరదేశివి అంటున్న ఆ పౌరసత్వం నాకొద్దు” అని తిరస్కరిస్తున్నారు.
ముస్లిం సోదరుల్ని కొంతమంది మూలవాసులు గాని పరదేశీలుగా చూస్తున్నారు. ఆ మూలవాసీ ప్రశ్నే తలెత్తితే సింధూనాగరికత కాలం నాటికి పోయి “నీవి కానీ నీవాళ్ళవి కానీ/అడుగులూ, వాటి జాడలేవన్నా వుంటే పట్టుకురా/ముందు నీ పౌరసత్వాన్ని నిర్ధారిద్దాం”(నిర్ధారణ, అక్షరం) అని ఎదురు ప్రశ్నిస్తారు కంఠ బంగార్రాజు. “లేదూ కాదూ అంటే/దేశానికి ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చెయ్యించండి/మూలవాసులెవరో కచ్చితంగా తేలిపోతుంది/దీనికిన్ని తర్జన భర్జనలెందుకు?” అని మూలవాసులం మేమే అని విర్రవీగుతున్న వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తారు.
దేశంలో అసహనం, అన్యమత వ్యతిరేకత పెరిగిపోతుండడాన్ని కవులు ఇష్టపడ్డం లేదు. ముస్లిం అంటే నాకు ఆత్మీయ మిత్రులు గుర్తొస్తారు. “నీకెందుకురా ముస్లిం అంటే పాకిస్తాన్ గుర్తొస్తది?”(ప్రజలే ముగిస్తారు…, అక్షరం) అని నిలదీస్తారు జి. భార్గవ. “మానవతపై మరణశాసనం/మతోన్మాదం../వారు దాన్ని రెచ్చగొట్టారు/జాతి సమైక్యతకు చిచ్చు/కులోన్మాదం…/వారు దానికి అగ్గిరాజేసారు/దేశానికి అశాంతి బీజం/ జాతీయతోన్మాదం…/వారు దాన్ని అందరి మెదళ్ళలో నాటారు”(నడుస్తున్న చరిత్ర, అక్షరం) అనీ దాని అంతిమ ఫలితంగా సమసమాజ స్థాపనం జరుగుతుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తారు నూనెల శ్రీనివాసరావు. ఆయనే మరొక కవితలో దేశస్తులంతా చర్చించుకుని భావాలను కలబోసుకుని ఐక్యతను చాటుకుందాం అని పిలుపునిస్తున్నారు.
సరికొత్త చట్టాల ద్వారా పౌరుల స్వేచ్ఛను హరించాడాన్ని చూసి “ఏ దేశం/ పావురాయి రెక్కలకు సంకెళ్లు వేస్తుందో…/ఆ దేశం/ఆ ఒక చెరశాలని చాటిచెప్పండి !!”(నిర్జన ఎడారి, అక్షరం) అని సిరికి స్వామినాయుడు అన్యాపదేశంగా చీదరిస్తారు. కశ్మీరులో నిర్బంధాల్ని తలచుకుంటూ “కన్నీటి తడి జోలపాట నుడి/పురిటి నొప్పుల ‘సడి’ నిషేధమే”, “ఇప్పుడక్కడ/ శాంతి సౌరభాల్లేవు స్వేచ్ఛా సమీరాల్లేవు/జీవన అస్థిత్వాల్లేవు అంతటా శ్మశాన నిశ్శబ్దం”(మౌనమూ ఒక సంభాషణే, అక్షరం) అని మదనపడతారు కోడిగూటి తిరుపతి. ఎవడో వచ్చి నాలుగు మాటలు చెప్పి మనల్ని బుట్టలో వేసుకుని అధికారం చేజిక్కించుకుంటాడని, వాడి పబ్బం గడుపుకోడానికి మనమధ్యే చిచ్చు పెడతాడని “వాడి అధికార దాహానికీ/వాడి మత మదానికీ/మనం బలికావద్దు”(మృతనైవేద్యం, అక్షరం) అని మేల్కొలుపుతున్నారు జంధ్యాల రఘుబాబు గారు.
గణతంత్రదినోత్సవం సందర్భంగా చిత్తలూరి సత్యనారాయణ గారు ప్రస్తుత దేశ సమస్యల్ని అన్నిట్నీ ఏకరువు పెట్టారు. ”వేర్పాటువాదమింకా/ జడలు విప్పుకుని నర్తిస్తూనే ఉంది/కులమతాల రావణకాష్టమింకా/ కణకణ మండుతూనే ఉంది/ మంచులోయ భగ్గుమంటోంది / ఈశాన్యం రగిలిపోతోంది / ఒకే రంగుకోసం / రాజ్యం రంకెలేస్తోంది”(నా దేశమొక పచ్చి బాలింత, అక్షరం) అని గుర్తు చేస్తారు. సిఏఏ, ఎన్నార్సీల వల్ల ఎవ్వరికీ పౌరసత్వం పోదని, వీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా వాటి వెనుక ఉన్న కుట్రల్ని పసిగట్టి దేశవ్యాప్తంగా నిరసనోద్యమాలు ప్రారంభమయ్యాయి. “వేల యేళ్లుగా/ఈ నేలలోకి పాతుకుపోయిన నన్ను/ కూకటి వేళ్లతో పెకలించే/కపట చర్యలేవో రచిస్తున్నట్టున్నావ్”…“నన్నివాళ/కొత్తగా పరిచయం చేసుకోమనే కుట్రేంది”(ఒకానొక పరిచయం, అక్షరం)’ అని అనుమానం వ్యక్తం చేస్తారు చిత్తలూరి. ఇప్పుడు కొత్తగా పత్రాలు చూపించి తన పౌరత్వాన్ని నిరూపించుకోవాల్సిన అగత్యం తనకు లేదంటారాయన. “ఏదో జరుగుతోంది”…“దేశం లోపలి/మూలనివాసీ సజీవసంపదను/సరిహద్దులు దాటించే/కుట్రేదో కమ్ముకొస్తోంది” (ములుకు, అక్షరం) అని కాషాయీకరణ గుట్టుగా దేశంలోకి ఇంజెక్ట్ చెయ్యబడుతోందని, ఇప్పుడు ఏం జరగాలో స్పష్టత లేదని వాపోతారు.
హిందూ ముస్లిం మిత్రుల మైత్రిని, సిఏఏ వల్ల వాళ్ళ మైత్రిలో వచ్చిన అవాంతరాన్ని, అంతలోనే కళ్ళు తెరుచుకుని మళ్ళీ వెల్లివిరిసిన ఐకమత్యాన్ని నూనెల శ్రీనివాసరావు గారు కాలజ్ఞానం లాంటి తమ ‘ఇంద్రధనస్సు వాలింది!’ కవితలో అద్భుతంగా పండించారు. “ఒకే మాటగ పాటగ/సాగే మా బతుకులపై/విద్వేషపు గొడ్డలి/వున్నపళంగా/ సర్కారు శాసనంగా/ ఊడిపడింది”, “చంపండి నరకండంటూ../ఒకరికొకరం నరుక్కునే ముందర/ ఒకరి ముఖాలొకరు చూసుకుంటే/మా కాలికి మెలికపడ్డ/అనురాగ బంధమేదో లీలగా/మా చెవులకు వినిపించింది” (డిసెంబరు 22, అక్షరం) అనీ అక్కడి నుండీ సామరస్యం వెల్లివిరిసిందని అంటారాయన. తర్వాత కాలంలో ఈ కవితలోని కథ నిజమైంది. 2020 ఫిబ్రవరి చివర, మార్చి ప్రారంభంలో ఈశాన్య డిల్లీలో సిఏఏకి వ్యతిరేకంగా నిరసనోద్యమాలు చేస్తున్న లౌకికవాదులపై సిఏఏ అనుకూల ఫాసిస్ట్ వర్గాలు పాశవికమైన అణచివేత దాడులకు దిగాయి. మతకలహాలను రెచ్చగొట్టాయి. ఇరువర్గాల ఘర్షణల్లో యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందలమంది ఆసుపత్రుల పాలైనారు. వందలకోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. వాళ్ళు మత విద్వేషాన్ని ఎంతగా రెచ్చగొట్టారో అంతకన్నా బలంగా డిల్లీ ప్రజల్లో సహనం సహకారం స్నేహభావాలు వెల్లివిరిసాయి. మసీదుల ముందు హిందూ సోదరులు కాపలా నిలబడి ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోడానికి సహకరించారు. ముస్లింవాడల్లో ఇరుక్కుపోయిన హిందువుల ఇళ్ళ వద్ద వివాహాది కార్యాలను చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులు బాసటగా నిలబడి నడిపించారు.
దేశంలో పౌరులకు వాక్స్వాతంత్ర్యం కూడా లేకుండా పోతున్నదని, ప్రశ్నించడం దేశద్రోహనేరమై పోతున్నదని, అందువల్ల నా ప్రాథమిక హక్కుల్ని కూడా ఇచ్చేస్తా తీసుకోండి అని నిరసన తెలుపుతారు మహెజబీన్. “పౌరసత్వం అపహాస్యం చేయబడుతున్న వేళ’ ప్రాథమిక హక్కుల్ని ఏం చేసుకోను?”(ప్రశ్న దేశద్రోహమైంది నేనేం చేయను, వివిధ) అని ప్రశ్నిస్తారు. ప్రస్తుత తరుణాన్ని నియంతల కాలంగా పేర్కొంటూ “ఇది యుద్ధకాలం/ పోరాడితేనే/ సొంతనేల మీద స్వేచ్ఛకు రెక్కలు!”(పోరుకాలంలో ఉన్నాం!, అక్షరం) అని మెట్టా నాగేశ్వరరావు గారు పోరాటానికి పిలుపు నిచ్చారు. దేశం అలజళ్ళతో అల్లాడిపోతున్నా పాలకులకు ఏం పట్టదని “దేశం రణరంగమవుతుంటే వాళ్లకేం/వాళ్ళ ఎజెండా వాళ్ళు అమలు చేస్తారు” … “ప్రజాస్వామ్యమనే చెట్టునిప్పుడు/ తుదముట్టించే పనిలో పడ్డారు” (మంత్రదండం, అక్షరం) అని లండ సాంబమూర్తి గారు ఎత్తిపొడుస్తారు.
సిఏఏకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారినీ, ప్రాంతాల్నీ కవులు కీర్తించడం కనబడుతుంది. “షాహీన్‌బాగ్/దేశ రాజధాని నడిబొడ్డున/నాటిన నిరసన జెండా…!/స్వేచ్ఛా నిట్టాడికి ఎగరేయబడ్డ త్రివర్ణ పతాక/భవిష్యత్తరాలకు ఒకానొక/ వీరోచిత చరిత్ర నేర్పే పోరాటస్థలి…/పసిగుడ్లను పొత్తిల్లలో కట్టుకుని/ఉగ్గుపాలతో ఉద్యమాలు నేర్పే రణస్థలి..”(షాహీన్‌బాగ్, అక్షరం) అని ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఈశాన్య డిల్లీలోని షాహీన్‌బాగ్‌ని నబి కరీం ఖాన్ కీర్తిస్తారు. ఆయనే ‘నాకిప్పడు నేల కావాలి’ అనే కవితలో “స్వేచ్ఛగా కొన్ని శ్వాసలు పీల్చుకునే నేల” కావాలని కోరుకుంటారు. “కల్లోల సముద్రమై మతం/దేశమంతా ఎగిసిపడ్డపుడు/నీ నేల కదా/ప్రశాంతతకు నెలవై నిలిచింది/కశ్మీరీయత్ సంస్కృతి అలలాడే/నీ నేల కదా/కన్నీళ్ళను దాచుకొని ప్రేమించడం నేర్పింది” (Dear కశ్మీర్, కొలిమి) అంటూ మహజబీన్ కశ్మీర్‌ని స్తుతిస్తారు.
పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పటి నుండి దాన్ని వ్యతిరేకిస్తూ డిల్లీలోని షాహీన్ బాగ్ లో మహిళలు తమ పిల్లలతో బాటు రేయింబవళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో షాజహానా “నేను అమ్మ లోపల ఉన్నప్పుడే/ఉనికి కోసం యుద్ధం చేయడం నేర్చుకున్నదాన్ని! అమ్మల గర్భాశయాలే/ …బిడ్డల మొదటి యుద్ధ మైదానాలు!/కాళ్ళ కింద నేల కదులుతుంటే/నిన్ను కన్న దాన్ని….. యుద్ధాన్నీ కనలేనా?”(ఔకాద్, కొలిమి) అంటూ ఉద్యమాల్లో పురుషాధిక్యాన్ని ధిక్కరిస్తూ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. తిరునగరి శరత్ చంద్ర గారు దేశాన్ని, జాతినీ, సంస్కృతీ సంప్రదాయాల్నీ కీర్తిస్తూ పౌరుల్లో ఏకతా భావాన్ని ప్రోది చెయ్యడానికి ‘జాతిగీతికనై…’ అనే కవిత రాశారు.
ఇవి కవుల కలాలపై మేధావుల గళాలపై కుహనా జాతీయవాదులు కత్తికట్టిన రోజులు. మేధస్సుపై పిడివాదం మొరటుగా దాడికి దిగుతున్న రోజులు. సమీప గతంలో ఎంతో మంది మేధావులైన కవుల్నీ కళాకారుల్నీ విద్యావేత్తల్నీ జర్నలిస్టుల్నీ వాళ్ళు పొట్టనబెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు కవులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రశంసనీయమైనవి. పిడివాదులకు మనుషుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, గోడలు కట్టడం; ప్రకృతి వనరుల్ని అమ్మేసుకోవడం; విద్యా విజ్ఞానాలను శాస్త్రీయ భావాలను ధ్వంసం చెయ్యడం; అన్యాయాన్ని నిలదీస్తే దాడులు దౌర్జన్యాలు చెయ్యడం మాత్రమే తెలుసునని “మనువాదుల నీతి/ఇంకెన్నాళ్లు … ఇంకెన్నాళ్లు/వర్గ సమాజాన్ని కూలదోసేందుకు కదిలాం …/సమ సమాజాన్ని నిర్మించి తీరుతాం…”(వాళ్ళు, అక్షరం) అని ఎస్కె బాజీ సైదా నిర్భయంగా ప్రకటిస్తారు. “అక్కడ మౌనం/శ్మశానంలా పరుచుకుంది”… “మచ్చుకు మచ్చు గుజరాత్ నమూనా/న్యాయం ఎప్పటికీ అందని జమానా/ఇది బహిరంగ రహస్యం/ గుట్టువిప్పేవాడిది దేశద్రోహం!” (సుడితెరిగే మౌనం!, అక్షరం)అని నూనెల శ్రీనివాసరావు డిల్లీ అల్లర్ల గుట్టు విప్పుతారు.
కవులు అరాచకశక్తుల పైనే కాకుండా వాళ్లకి దన్నుగా నిలుస్తున్నారని, ప్రజా ఉద్యమాల్ని దమననీతితో అణచివేస్తున్నారని పాలకులపై కూడా కలాలు దూస్తున్నారు. పల్లిపట్టు నాగరాజు గారు “మాకోసం ఏదన్నా కట్టిస్తావనుకున్నాం గానీ/ఇలా గోడలు కడతావనుకోలా!”…“హృదయాల మధ్య/వీధుల మధ్య అడ్డుతెరలు కడుతున్నవాడా/నీకు మేమేమీ కడతామో ఆలోచించు”…“నా ప్రియమైన ఏలికా/కేవలం గోడలు మాత్రమే కట్టేవోడా/నీకు మేము ఏం కడ్తున్నామో ఊహించు?!” (బ్రూట్ వాల్ ఆఫ్…, అక్షరం)అని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. తంగిరాల సోనీ గారు మరింత ముందుకు చొచ్చుకెళ్ళి “కలాలు విరిచెయ్యెచ్చు/ నెత్తురుతో కొత్త చరిత్రలు రాస్తారు/రచయితల్ని మంటల్లో కాల్చి బూడిద చెయ్యెచ్చు/జనం గుండెల్లో రగులుతూనే/నిప్పు కణికలై కదం తొక్కుతారు/ ఎండుటాకుల గలగల శబ్దాలకే/బెదురుతున్న ‘మోడీ’ రాజ్యమా/నువ్వు తగలబడే రోజు దగ్గర్లోనే ఉంది!”(పొద్దులో మొలుచుకొస్తారు, అక్షరం) అని ఏకంగా పదవిలో ఉన్న వ్యక్తి పేరు పెట్టి సవాలు విసిరారు. ఇంకా తీవ్రమైన నిందారోపణలు, వ్యక్తిగత దూషణలు కూడా కవితల్లో కనబడుతున్నాయి. వాటిని ప్రస్తావించడం లేదు.
తెలుగు కవులు పౌరసత్వానికి సంభవించిన ప్రమాదాన్ని చాలా తీవ్రమైనదిగా భావించారు. అంతే తీవ్రంగా ప్రతిఘంటించారు. పౌరసత్వ సవరణ చట్టం వెనుక ఉన్న కుట్రలను, దాని యొక్క పర్యవసానాలను పసిగట్టి అమోఘమైన అభివ్యక్తితో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. అన్యాయం కోరలు చాచి ఆగడాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని చాటుకున్నారు. కరోనా విపత్తు మనిషి ప్రకృతికి చేసిన హాని వల్ల కలిగింది. ఇందులో మనిషి ప్రమేయం ప్రత్యక్షం కాదు. అందువల్ల కవులు కరోనా సమస్యపై రాసిన కవితల్లో సున్నితంగా స్పందించారు. దానికి కారణమైన ప్రభుత్వాల్ని కార్పోరేట్లని నిందించాల్సి వచ్చినప్పుడు మాటకారితనం, శిల్పం లాంటి పరదాల్ని చక్కగా అలంకరించుకున్నారు. హాస్యాన్ని కూడా మస్తుగానే పండించారు. వారిలో ఉన్న గొప్ప సృజనాత్మకత బయటపడింది. కాని పౌరసత్వానికి కలిగిన ప్రమాదం మనిషి వల్ల అతని స్వార్థం విద్వేషం విధ్వంసస్వభావాల వల్ల సంభవించిందని కవులు భావించారు. అందుకే కవులు ఈ విషయంలో సున్నితత్వాన్ని వదిలేశారు. వాళ్ళు ఇక ఏమాత్రం శిల్పం మాటున దాక్కోదలచుకోలేదు. సృజన పేరుతో తమ ఆవేశాన్ని అర్థరహితం చేయదలచకోలేదు. సరళంగా సూటిగా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. పదవులపై పదవుల్లో ఉన్న పాలకులపై పాలకులుగా ఉన్న వ్యక్తులపై ప్రత్యక్షంగా అక్షరాల్ని ఎక్కుపెట్టారు. ఈ ఉద్వేగ కారణాల వల్ల కవుల రచనల్లో ఉదృతి ఎక్కువై సృజనాత్మకత శిల్పాల పాళ్ళు కొంచెం కొరవడ్డాయన్నవి కాదనలేని వాస్తవాలు. లక్ష్యం తీవ్రతరమైనది అయినప్పుడు అది దోషమూ కాబోదు. అంతేగాకుండా సిఏఏని వ్యతిరేకించే క్రమంలో కవులు మత, ప్రాంతీయ అస్తిత్వవాదాల్ని శక్తివంతంగా వ్యక్తం చెయ్యడం కనబడింది. అద్భుతమైన వాళ్ళ అభివ్యక్తికి, అన్యాయం అనుకున్నదానికి ఎదురు నిలిచి నిలబడే వాళ్ళ ధైర్యసాహసాలకీ ముచ్చటేస్తుంది.