కాశ్మీరుపై రిపోర్టు

(నిత్యా రామకృష్ణన్ (అడ్వకేట్)
నందిని సుందర్ (సామాజిక వేత్త))

మేము అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 9 ,2019 మధ్య కాలం లో కాశ్మీరు లోయను సందర్శించాము. మూడు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వివిధ ప్రజాశ్రేణులకు ప్రాతినిధ్యం వహించే అనేక మంది వ్యక్తులతో మాట్లాడాము.

శ్రీనగర్

మేము శ్రీనగర్ లో జర్నలిస్ట్ సెంటర్, కోర్టులు,మార్కెట్లు మరియు ఇతర కొన్ని పరిసర ప్రాంతాలను సందర్శించి సుమారు 38 మందిని కలిసాము. వారిలో టాక్సీడ్రైవర్లు -2, ఆటోడ్రైవర్లు -3, హౌస్ బోట్ యజమానులు -2, లాయర్లు -2, స్కూల్ & కాలేజీ టీచర్లు -2, దుకాణ గుమాస్తాలు -5, వీధి వ్యాపారులు -2, హోటల్ యజమాని -1, వెయిటర్ లు -2, జర్నలిస్టులు -6, ప్రభుత్వ అధికారి -1, (పోలీస్ సంరక్షణలో ఉన్న) మైనర్లు-10 మంది ఉన్నారు.

షోపియన్/పుల్వామా

మేము 4 గ్రామాలను, షోపియన్ పండ్ల మండీని సందర్శించాము. పుల్వామాలోని పరిగాం గ్రామంలో హింసా బాధితులతో సహా – 4, 11 వ తరగతి విద్యార్ధి-1. కరీమాబాద్ గ్రామం ముగ్గురు ఖైదీ ల కుటుంబ సభ్యులైన స్త్రీ లతో సహా – 4. ఎస్ ఎస్ & ఎస్ బి గ్రామాలలో అరెస్ట్ అయిన బాలల కుటుంబాలు, పండిట్ కుటుంబంలో వృద్ధ దంపతులు -2 , సి ఆర్ పి ఎఫ్ జవాను -1 , ఆపిల్ పళ్ళ పెంపకం దార్లు -2. మొత్తం సుమారు 25 మందిని కలిసాము.

సోపోరె/కుప్వారా

మేము సోపోరె పండ్ల మండీతో పాటు దగ్గర్లోని 2 గ్రామాలకు వెళ్ళాము. సోపోరె పండ్ల మండీ అధికారులు -5 , ప్రింగ్రూ గ్రామస్థులు -5 ,6 , భాండీ గ్రామంలో సర్పంచ్, పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద అరెస్ట్ అయిన జిల్లా ప్రెసిడెంట్ కొడుకు, పోలీస్ కస్టడీ లో మరణించిన ఒక యువకుని తల్లి, అంకుల్ లు -6. మొత్తం సుమారు 15 మందితో మాట్లాడాము.

స్థూలాభిప్రాయాలు: మేము 5 రోజుల్లో దాదాపు 75 మందితో మాట్లాడాము. వారిలో ఏ ఒక్కరూ ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీరు ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడాన్ని హర్షించడం లేదు. ప్రతి ఒక్కరూ ఆజాదీ కోరుకుంటున్నారు. (వాళ్ల దృష్టిలో ఆజాదీ అంటే ఇండియా తో గాని, పాకిస్తాన్ తో గాని కలవకుండా స్వతంత్రంగా ఉండే ఆజాదీ నుండి పాకిస్తాన్ తో కలిసిపోయే ఆజాదీ వరకు ఏదైనా కావచ్చు). ముఖ్యంగా సమాచార నిషేధం, భారీ మిలిటరీ మోహరింపు, తీవ్ర నిర్బంధం, ప్రాథమిక హక్కుల తిరస్కరణల మధ్య ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీరు ను భారతదేశంతో పూర్తిగా విలీనం చేశామనే దాన్ని ఎవరూ ఆమోదించడం లేదు.

మేమొక పండిట్ ని కలిసాము. ఆయనకు ఆజాదీ పట్ల స్పష్టమైన అబిప్రాయమేమీ లేదు. కానీ ఆయనంటాడు “మా పిల్లలు ఢిల్లీ లో ఉంటారు. కనుక వాళ్లకు దూరంగా నేనుండలేను”. అలాగని ఇక్కడి ప్రజలు ఇండియా లో అంతర్భాగంగా ఉండడానికి ఎప్పుడూ ఆమోదించరని అన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ కు భారతదేశాన్ని అడ్డుకునే శక్తి లేదు కాబట్టి భారత ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చుననంటూనే ఆర్టికల్ 370 రద్దు పట్ల తన అసంతృప్తి ని వ్యక్తం చేసాడు. ‘ఎవరికి ఆజాదీ వద్దని ఉంటుందనంటూ’ హంద్ వారా లోని నేషనల్ కాన్ఫరెన్స్ కు సంబందించిన ఒక గ్రూప్ మద్దతు దారులు ఒకవేళ ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తే మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చునని భావించారు.

కాశ్మీర్ లో మైనార్టీలు గా ఉన్న గుజ్జార్లకు సంబంధించిన ఒక సర్పంచ్ “జంతువులు కూడా ఆజాదీ కావాలనుకుంటాయి” అన్నాడు. శ్రీనగర్ లోని దుకాణ గుమస్తా ఒకాయన “ఇన్నేళ్ళుగా భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ని నిర్వీర్య పరుస్తూ రావడం వాళ్ళ ప్రస్తుతం ఈ రద్దు ప్రభావం ఆచరణలో తీవ్రంగా ఏముండనప్పటికీ, అది మా అస్తిత్వానికి చిహ్నం కదా” అనన్నాడు.

ఇలా వ్యక్తుల నిర్దిష్టాభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ అస్తిత్వాన్ని కోల్పోయామని, వాళ్ళతో ఎటువంటి సంప్రదింపులు లేకుండానే, వాళ్ళ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం వేసే భారత ప్రభుత్వపు ఈ హఠాత్ నిర్ణయం వల్ల చాలా అవమానపడ్డామని ప్రతి ఒక్కరూ భావించారు.

ఆర్ధిక పరంగా, విద్యా పరంగా తీవ్ర నష్టాలెదుర్కుంటున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాశ్మీర్ ప్రజలంతా సంపూర్ణ హర్తాళ్ (బంద్) పాటిస్తున్నారు. ప్రధాన పార్టీలనుంచి మొదలుకొని వేర్పాటువాద పార్టీల నాయకులందరినీ జైళ్లల్లో బంధించి ఉంచడం వల్ల ప్రజలు తమకు తామే అహింసాయుత శాసనోల్లంఘనోద్యమం ద్వారా స్వచ్ఛంద ప్రతిఘటనకు పూనుకుంటున్నారు. అయితే ఇవన్నీ భారత ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఏ మిలిటెంట్ల ఆదేశాలతో మాత్రం జరగడం లేదు. మొత్తంగానే ప్రజలే స్వచ్ఛంద మౌన సత్యాగ్రహాన్ని పాటిస్తున్నారు.

ముఖ్యంగా బుర్ హాన్ వని మరణం తర్వాత కాశ్మీర్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను 2016 నాటి పరిస్థితులతో పోల్చుకుంటున్నారు. వారి దృష్టిలో ప్రస్తుతం ప్రధానమైన తేడాలేమిటంటే (1) ఎటువంటి నాయకత్వం లేకుండా ప్రజలు తమంతట తామే ముందుకు వచ్చి ప్రతిఘటనకు పూనుకుంటున్నారు. (2) మొదట్లో ఉన్నట్టుగా దక్షిణ కాశ్మీర్ లోనే కాకుండా ఇప్పుడు లోయ అంతటా ప్రతిఘటనా కార్యకలాపాలు జరుగుచున్నాయి. (3) మొదట్లో భారత ప్రభుత్వంతో ఉన్నవాళ్ళందరూ ఇప్పుడు వేరు పడిపోయారు.

కాశ్మీర్ లో చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు హతమవుతున్నప్పటికీ, అక్కడ ఎటువంటి ప్రతిఘటన గాని, ప్రాణ నష్టంగాని లేదని భారత ప్రభుత్వం పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. అలాగే ప్రజలు కొత్త కొత్త వ్యూహాలను రూపొందించుకునేంతవరకు భారత ప్రభుత్వం పేర్కొంటున్న ఈ పరిస్థితి తాత్కాలికమే గాని, ప్రజలపై ప్రభావం వేయగల మొత్తం నాయకత్వాన్ని జైల్లో బంధించడం, సమాచార ప్రసార వ్యవస్థలను సంపూర్ణంగా నిరోధించడం లేదా నిషేధించడం లాంటివి మాత్రం అపూర్వమే, గతంలో ఎన్నడూ జరగనట్టివే !

కాశ్మీర్ ప్రజలు భారత ప్రభుత్వాన్ని ఎంతైతే ద్వేషిస్తున్నారో, అంతే స్థాయిలో భారత ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా, దయామయంగా ఉన్నారు. జాతీయ టెలివిజన్ మీడియా నైతే ప్రభుత్వంతో మిలాఖతై అంతా సజావుగానే ఉందన్న అబద్ధాన్ని నిత్యం ప్రసారం చేస్తున్నది. అంతే గాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ఆర్టికల్ 370 రద్దు వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రతిరోజూ ఏకరువు పెడుతూ ఉండడం వారికి చాలా అవమానకరంగా ఉందని చెప్పారు. గత రెండున్నర నెలల కాలంలో ఆర్టికల్ 370 రద్దుపై ఏ కాశ్మీర్ పత్రికలోనూ ఒక్క సంపాదకీయ వ్యాసమైనా రాలేదు. అక్కడ ఫోన్లు, ఇంటర్నెట్లు లేక ప్రజలందరూ తాము ఏ రాతియుగంలోకో నెట్టి వేయబడ్డట్టుగా ఫీలవుతున్నారు.

అక్కడ హైకోర్టు అయితే నడవడమే లేదు. ప్రైవేట్ లాయర్లు లేనే లేరు. అక్కడి కొందరి లాయర్ల ద్వారా మాకు తెలిసిందేమిటంటే దాదాపు 300 హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలైతే కోర్టులు మాత్రం ప్రభుత్వానికి ఎక్కువ సమయాన్నిచ్చి పిటిషన్లే నిష్ఫలం అయ్యేటట్లు చేశాయి.

కాశ్మీర్ లో ఏ గ్రామానికి వెళ్లినా పక్కా ఇళ్ళు, టాయిలెట్లు, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అక్కడి అభివృద్ధి దేశంలోని చాలా ప్రాంతాల అభివృద్ధి కన్నా మెరుగ్గానే కనిపించింది. కనుక స్వచ్ఛ భారత్ అభియాన్, ఉజ్వల యోజన, గృహ పథకాల్లాంటి వాటి ఆవశ్యకత అక్కడ లేదనిపించింది.

భారత ప్రభుత్వంతో ఏకీభవించే ఫరూక్ అబ్దుల్లా తో సహా ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులనందరిని జైల్లో వేశారు. హిందువుల పవిత్రమైన అమర్నాథ్ యాత్రను సైతం రద్దు చేసి ప్రభుత్వం యాత్రికులను మధ్య దారిలోనే అడ్డగించి వెనుకకు పంపించి వేసింది. సరైన అంతర్జాతీయ ఒత్తిడి లేకపోతే రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వపు ఈ హఠాత్ చర్య పాలస్తీనా ఆక్రమణ లాంటి స్థితికి దారి తీసి కాశ్మీరీలకు మాత్రమే కాకుండా మొత్తంగా భారత రాజకీయార్థిక వ్యవస్థకే భారీ నష్టాలను కలిగిస్తుంది.

ఆర్ధిక నష్టాలు: భారీ స్థాయి మిలిటరీ మోహరింపువల్ల ప్రజలు అభద్రతతో జీవిస్తున్నారు. కర్ఫ్యూ విధించిన సంపూర్ణ హర్తాళ్ వల్ల ప్రజలు చాలా ఆర్ధిక నష్టాలనెదుర్కుంటున్నారు. కొన్ని చోట్ల అధికారికంగా ఎటువంటి ఆంక్షలు లేవని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం మళ్ళీ విధించిన ఆంక్షలు ఎక్కడ కొనసాగుతున్నాయనే దాని పట్ల అనిశ్చితి ఉంది. ఉదాహరణకు 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభుత్వం ఆంక్షలు తొలగించినట్లు చెబుతున్నా ఏయే నిర్దిష్ట స్టేషన్లో తెలియకపోవడం వల్ల ప్రజల్లో సందిగ్ధత ఉన్నది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ తన నెలవారీ ఆదాయం రూ.8000/- లనుండి రూ.5000/- ల వరకు అంటే రూ.3000/- లకు పడిపోయిందని అన్నాడు. 16 రూమ్ ల హోటల్ నడిపిస్తున్న ఒకాయనైతే ప్రస్తుతం టూరిస్టులు లేనందువల్ల ఆటో నడుపుకుంటున్నానన్నాడు. మరో ఆటో డ్రైవర్ అడపా దడపా రాళ్ళ దాడుల భయం కారణంగా రాత్రి పూట తన ఆటోను అత్తామామల ఇంట్లో పెట్టి డౌన్ టౌనుకు నడుచుకుంటూ ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు. సౌరా ప్రాంతంలో ఒక కూరగాయల వ్యాపారి తన దుకాణాన్ని రోజంతా తెరిచి ఉంచినందుకు రాత్రి దాన్ని కాలబెట్టారు. ఒక పాల వ్యాపారిని తన దుకాణాన్ని పొద్దటి పూట తెరిచి ఉంచినందుకు బెదిరించారని, మరో ఆపిల్ యజమాని ఆపిల్ పండ్లనమ్మినందుకు రాత్రికిరాత్రే అతని 6 ఆపిల్ చెట్లను నరికేశారని చెప్పారు. కానీ ముందే అడ్వాన్స్ ఒప్పందం చేసుకున్న చోట్ల మాత్రం సాయంత్రం వేళల్లో ప్రభుత్వ రక్షణలో ఆపిల్ పళ్ళు రవాణా అవుతున్నాయి.

అలాగే అక్టోబర్ 9వ తేదీన రెండు రెస్టారెంట్లు రోజంతా తెరిచి ఉండడం చూశాము. మరో ఆపిల్ యజమాని ఆజాదీ కోసం అవసరమైతే ఆపిల్ పళ్ళను అమ్మకుండా సంవత్సరానికి వచ్చే 9-10 లక్షల రూపాయల ఆదాయాన్ని సైతం కోల్పోవడానికి సిద్ధమని అన్నాడు.

కేవలం టూరిస్ట్ వ్యాపారం మీదనే ఆధార పడిన హౌజ్ బోట్ యజమానులు, కూలీలు మొదలైనవారంతా హర్తాళ్ వల్ల చాలా నష్టపోయామన్నారు. ఒక పడవ యజమాని తనకు 7 లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నాడు. వార్తా ప్రసార మాధ్యమాల నిషేధం వల్ల గుజరాత్ నుంచి తెప్పించి చేసే సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఆగిపోయిందని మరో వ్యాపారి చెప్పాడు.

అక్కడక్కడా పెళ్లిళ్ల లాంటి శుభకార్యాలు జరుగుతున్నప్పటికీ ఆహ్వానితుల సంఖ్య అతి తక్కువగా ఉండడం వల్ల ఆహార పదార్థాలను వండి సరఫరా చేసే క్యాటరింగ్ వ్యాపారం తగ్గుముఖం పట్టిందని ఆ వ్యాపారులు చెప్పారు. ప్రతి సంవత్సరం అనాథల సామూహిక వివాహాలు జరిపించే ఒక ప్రభుత్వేతర సంస్థ ‘ఆష్’ కు సంబందించిన యజమాని గతంలో వలె బిర్యాని కాకుండా ఈ సంవత్సరం కహ్వా (కాశ్మీరీ చాయ్) ను మాత్రమే వడ్డించామని చెప్పాడు.

శ్రీనగర్లో, తదితర పరిసర గ్రామాలలో చాలా మంది తమ మధ్య సమిష్టి సహకార తత్వం ఉండడం వల్ల ఈ హర్తాళ్ ను, దిగ్బంధనాన్ని తట్టుకుంటున్నామన్నారు. పైగా ఇటువంటి ఘర్షణాత్మక పరిస్థితుల్లో తమ మధ్య సహకార సమిష్టి తత్వం బలపడుతోందని చెప్పారు. ఆంచార్ (Aanchar) లాంటి ప్రాంతాలలో తమ చుట్టూ బారికేడ్లు పెట్టి దిగ్బంధించడం వలన బైటికి వెళ్లలేక, ఇదివరకే దాచి ఉంచుకున్న బియ్యాన్ని వాడుకుంటూ బతుకుతున్నామని చాలామంది వ్యవసాయదారులు చెప్పారు.

ఆపిల్ వ్యాపారం: షోపియన్, సోపోరే ప్రాంతాలలో మేము ఆపిల్ పండ్ల మండీలను దర్శించాము. ఎటువంటి ట్రక్కుల ఆనవాళ్లు లేకుండా అవి పూర్తిగా మూసివేయబడి ఉన్నాయి. షోపియన్ లో ఒక ఆపిల్ యజమానైతే హర్తాళ్ వల్ల ఆజాదీ కనుక సాధించబడుతుందంటే లక్షల రూపాయల నష్టాన్నైనా భరిస్తానన్నాడు.

సోపోరే ఆపిల్ మండీలో ఉద్యానవనశాఖ కార్యాలయం తెరిచిఉంది. సాధారణంగా రోజుకు 300 ట్రక్కుల ఆపిల్ పండ్లు బైటికి పంపిస్తుండగా, గత సెప్టెంబర్ 15న మార్కెట్ మధ్యవర్తిత్వపథకం ప్రకటించిన తర్వాత 3 ట్రక్కులు మాత్రమే బైటికి పంపించామని జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య (NAFED) అధికారులు చెప్పారు.

గత సంవత్సరం మండీ టర్నోవర్ ఒక వేయి కోట్ల రూపాయలుండింది. బారా ముల్లా జిల్లాలో 9400 మంది రైతులలో 586 మాత్రమే జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్యతో నమోదు చేసుకొని తమ ఆపిల్ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ 586 మందిలో 46 మంది రైతులు ఈ మండీలో తామే స్వయంగా ఆపిల్ పండ్లనమ్ముకుంటున్నారు.

అయితే సెప్టెంబర్ 15కు ముందు ఆజాద్ పూర్ మండీ వ్యాపారులతో ఇదివరకే ముందస్తు ఒప్పందాలు చేసుకున్నవాళ్ళు సమాఖ్యతో సంబంధం లేకుండా నేరుగా ఆపిల్ పండ్లను బైటికి పంపి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా సోపోరే మండీ లోపల సంపూర్ణ హర్తాళ్ అమలు జరుగుచుండగా, మండీ బైట అక్కడక్కడా అనధికారికంగా ఆపిల్ పండ్ల వ్యాపారం జరుగుతోంది.

ఒక వైపు ఆపిల్ సాగుదారులకు మార్కెట్ మధ్య వర్తిత్వ పథకం లాభసాటిదని చెబుతూనే, మరోవైపు గ్రేడ్ల వారీగా పండ్లను ఏరి వేసి వేర్వేరు రేట్లు నిర్ణయించడం వలన ప్రస్తుతం ఆపిల్ సాగుదార్లు చాలా నష్ట పోతున్నారు.

హంద్ వారాలో ఇదివరకే ఒప్పందాలు చేసుకున్న ఆపిల్ సాగుదారులైతే మెరుగ్గానే వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ముందస్తు ఒప్పందాలు చేసుకొనని వారు కమ్యూనికేషన్ల నిరోధం వలన ఏ రేట్ల చొప్పున అమ్మాలో తెలియక చాల నష్టాలపాలౌతున్నారు.

మత పర ఆంక్షలు: పోలీసులు వివిధ గ్రామాలు తిరుగుతూ ఈద్గాలవద్ద ప్రజలు గుమిగూడవద్దని, లౌడ్ స్పీకర్లనుపయోగించి ఈద్గాలలో నమాజ్ చేయవద్దని ఆదేశించి నందువల్ల ఈ సంవత్సరం ఈద్గాలలో నమాజ్ జరగనే లేదు.

విద్యా పరమైన నష్టాలు: సాంకేతికంగా స్కూళ్ల బంద్ ప్రకటించినప్పటికీ, పిల్లలెవరూ స్కూళ్లకు వెళ్లడంలేదు. ఉపాధ్యాయులు ఒకరోజులో 2 గంటలకొకసారి హాజరు మార్క్ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు వారానికి 2,3 సార్లే హాజరు వేస్తున్నారు. శ్రీనగర్ లోని సౌరాలో ఒక 6 ఏళ్ల బాలిక పోలీసులు కాల్పులు జరుపుతారేమోనని భయంగా ఉందని చెప్పింది. ఆగష్టు 5 నుండి భారీ స్థాయిలో మిలిటరీ వాళ్ళు స్కూల్ ను ఆక్రమించి మోహరించడం వలన తల్లిదండ్రులు తమ పిల్లలెవర్నీ స్కూల్ కు పంపడం లేదని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాయుధ బలగాలు మోహరించి ఉండడం వల్ల ప్రజలు భయపడి తమ పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు. పుల్వామాలో పరిగాం గ్రామానికి చెందిన 11వ తరగతి చదువుచున్న ఒక బాలిక శ్రీనగర్ లోని ఒక కళాశాలలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకోసం కోచింగ్ తీసుకుంటోంది. ఇప్పుడు జరుగుచున్న హర్తాళ్ వల్ల ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చే నవంబర్ లో చివరి వారంలో జరగబోయే ఎంట్రన్స్ పరీక్ష ఎలా రాస్తానోనని ఆందోళన వెలిబుచ్చింది.

శ్రీనగర్లోని ఒక మిడిల్ స్కూల్ టీచర్ తమ వద్ద చిరునామాలున్న విద్యార్థులకు అసైన్మెంట్లు పంపించామని, మిగితా వాళ్లకు ఎలా పంపించాలో తెలియడం లేదని వాపోయాడు. ఒక కళాశాల అధ్యాపకురాలు ‘మేమంతా క్రమం తప్పకుండా కళాశాలకు వెళ్లుచున్నాము కానీ విద్యార్థులెవరూ హాజరు కావడం లేదు’ అని చెప్పింది. అక్టోబర్ 9న కళాశాలలు అధికారికంగా తెరిచినప్పటికీ, ప్రజారవాణా సదుపాయాలు లేనందువల్ల విద్యార్థులెవరూ రావడం లేదని తెలిపింది.

మైనర్ పిల్లల అరెస్ట్: ఆగష్టు 5కు ముందు ఒక సంవత్సర కాలం పాటు పుల్వామా, శ్రీనగర్లలో సైన్యం గ్రామాల్లో జనగణన చేసింది. ఆగష్టు 5 తర్వాత 5,6 సం.ల వయసున్న మైనర్ పిల్లలను పట్టుకొని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి వారి తల్లిదండ్రుల నుంచి, దగ్గరి బంధువుల నుంచి పూచీకత్తు తీసుకొని వదిలివేస్తున్నారు. కొందరు పిల్లలనైతే ఉదయం, సాయంత్రం రెండు సార్లు పోలీస్ స్టేషన్ కొచ్చి రిపోర్ట్ చేయమని తాఖీదులిస్తున్నారు. ఎందుకంటే మసీదుల్లో లౌడ్ స్పీకర్లనుపయోగించి ప్రతిఘటనా గానాలను నిర్వహిస్తున్నారని, లేదా రాళ్లు రువ్వుతున్నారనే ఆరోపణలపై పిల్లలను నిర్బంధిస్తున్నారు. అందుకనే పిల్లలు తమ ఇళ్ళల్లో రాత్రివేళ నిద్రించడానికి భయపడుతూ ఎక్కడో తమ దూరపు బంధువుల ఇళ్లల్లో నిద్రిస్తున్నారు.

ఎస్ ఎస్ గ్రామం, షోపియన్ జిల్లా: సుమారు 20 ఏళ్ల వయసున్న పిల్లలను పట్టుకొని 15-20 రోజుల పాటు పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఆగష్టు 10 న 7వ తరగతి చదుచున్న ఒక 12 సం.ల బాలున్ని పట్టుకొని నిర్బంధించి సెప్టెంబర్ 25 న వదిలివేసి బాల న్యాయాసదనంలో ఉంచారు. ఆ బాలునిపై రాళ్లు రువ్వడం, ఇళ్ళు, వాహనాలను ధ్వంసం చేయడం లాంటి 6 కేసులను మోపారు. అయితే అతని తల్లిదండ్రులను కలిసి మరిన్ని ఎక్కువ వివరాలు మేము తెలుసుకోలేకపోయాము.

అదే గ్రామం నుండి ఆగష్టు 10-20 తేదీల మధ్య కాలంలో సుమారు ఉదయం 2 గం.లకు 4 గురు ఇతర పిల్లలను పట్టుకొచ్చి నిర్బంధించి సెప్టెంబర్ 20-25 తేదీల మధ్య ఒక్కొక్కరినీ విడుదల చేశారు. ఒక్కరి మీద తప్ప మిగిలిన ఎవరి మీదా నేరమారోపించలేదు.

పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న కాలంలో కూడా పిల్లల ఆహార ఖర్చుల నిమిత్తం రోజుకొక్కంటికి రూ.100/- ల చొప్పున వారి కుటుంబాల నుంచి జరిమానా వసూలు చేశారు. నిర్బంధ కాలంలో వారి తల్లిదండ్రులను, కుటుంబీకులను రోజుకు కేవలం 10-15 ని. ల పాటు పిల్లలను కలవనిచ్చేవారు. జైళ్లన్నీ పిల్లలతో కిక్కిరిసిపోయి నేలమీద కూడా పడుకోవడానికి చోటు లేని పరిస్థితి నెలకొన్నది.

మేము వెళ్ళినప్పుడు కూడా మమ్మలను పిల్లలతో కలవనియ్యలేదు. పిల్లలు ఆపిల్ పండ్లు ఏరడానికి వెళ్లారని పోలీసులు చెప్పారు. అప్పుడు మేము వారి కుటుంబీకులను, గ్రామ పెద్దలను కలిసి పిల్లల వివరాలు సేకరించాము.

ఎస్ బి గ్రామం, షోపియన్ జిల్లా: ఈ గ్రామంలో 9 సం.లున్న 4వ తరగతి విద్యార్థిని, 12 సం.లున్న 3వ, 5వ తరగతుల విద్యార్థులను, 14 సం.లున్న 7వ తరగతి విద్యార్థినిని మే 2019 లో పట్టుకొని నిర్బంధించి ఆ తర్వాత వదిలివేశారు.

సుమారు సాయంత్రం 3 గం.లకు ఇద్దరు పోలీసులు మామూలు పౌరదుస్తుల్లో స్కూటర్ పై వచ్చి ఒకరిని తీసుకెళ్లారు. అలాగే మిగిలిన వాళ్ళిండ్లకు వెళ్లి స్టేషన్ కు రమ్మని ఆదేశించారు. వారిని రాత్రి వరకు అక్కడే ఉంచుకొని వదిలివేసి, మళ్ళీ మర్నాటి ఉదయమే స్టేషన్ కు రమ్మన్నారు. ఒకరిద్దరిని స్టేషన్లో ఉన్నంతసేపు కాళ్లకిందనుంచి చేతులు పోనిచ్చి చెవులు పట్టుకొని వంగబెట్టే / కూర్చుండబెట్టే శిక్షను అమలు చేసారు. ఒక బాలున్ని 5 రోజులు స్టేషన్ లోనే ఉంచుకుని బాగా కొట్టారు. వదిలి వేసిన తర్వాత గ్రామం లోనే ఉండవద్దని, బంధువులింట్లో ఉండాలని ఆదేశించారు. ఒకరిద్దరి పిల్లల ఐపాడ్ లు, మసీద్ లౌడ్ స్పీకర్లను జప్తు చేసుకొని ‘తరానా’ (ప్రతి ఘటనా గానం) చేశారనే ఆరోపణపై వారిని అరెస్ట్ చేసారు.

శ్రీనగర్: ఆగస్టు 17వ తేదీన మ.3 గం.లకు 7వ తరగతి చదువుచున్న 12 సం.ల బాలున్ని, మరో బాలున్ని పట్టుకొని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో బంధించారు. అర్ధరాత్రివేళ వారిని వదిలివేశారు. ఆ తరువాత వారి తండ్రిని, తాతలను స్టేషన్లో రిపోర్ట్ చేయమని చెప్పి చాలారోజుల పాటు వారిని ఉదయం నుండి సాయంత్రం దాకా స్టేషన్ లోనే ఉంచుకున్నారు.

వేధింపు కేసులు: పరిగాం గ్రామం, పుల్వామా: పరిగాం గ్రామం దగ్గర్లోనే ఆర్మీ క్యాంపు పెట్టారు. సుమారు 2 నెలల పాటు అక్కడి ఉన్నత పాఠశాలను మూసివేశారు. ఆగష్టు 5 కు ముందు సైన్యం గ్రామస్తులను ఏమనలేదు కానీ ఆగష్టు 5 తర్వాత అక్కడక్కడా యువకులను పట్టుకొని వెళ్లి చిత్రహింసలు పెట్టారు. యువతలో భయోత్పాతాన్ని సృష్టించారు. ఆగష్టు 6న రాత్రివేళ సైన్యం గ్రామంలో ప్రవేశించి 20-30 సం.ల వయసున్న 9-11 మంది యువకులను 8 ఇండ్లల్లోనుండి తీసుకువెళ్లి నిర్బంధించారు.

ఇదే పరిగాం గ్రామంలో మేము 23, 25 సం.లున్న షబీర్ అహ్మద్ సోఫీ, ముజఫర్ అహ్మద్ సోఫీ అనే ఇద్దరు సోదరులను, వారి తండ్రి సనావుల్లా సోఫీని కలిసాము. ఆ కుటుంబం ప్రధాన రహదారిపై ఒక బేకరీ దుకాణాన్ని నడుపుతోంది. ఆగష్టు 6న రాత్రి వేళ సైనికులు వెళ్లి అబ్దుల్ ఘనీ అనే చౌకీదార్ ఇంటి తలుపులను బాదారు. అతని సాయంతో దగ్గర్లో కిరాణా దుకాణాన్ని నడుపుతున్న ఖయూమ్ అహ్మద్ వనీ అనే వ్యక్తిని పట్టుకొని, మళ్ళీ అతని సాయంతో బేకరీ యజమాని సనావుల్లా సోఫీ ఇంటికి వెళ్లి అతనిద్దరి కుమారులను షబీర్ అహ్మద్ సోఫీ, ముజఫర్ అహ్మద్ సోఫీలను పట్టుకెళ్లారు.

ఇలా 9-11 మంది యువకులను మసీదు బైట ఒక స్థలానికి తీసుకువెళ్లి అర్థరాత్రి 12.30 నుంచి 3 గం.ల దాకా కర్రలతో, వైర్లతో బాగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోతే కరెంటు షాకిచ్చి లేపారు. తెల్లవారుజామున వారిని కాళ్లతో పాటు చేతులను కూడా నేలమీద ఆన్పించి జంతువుల్లాగా నడిపించి వాళ్ళ ఇండ్ల దగ్గర వదిలి వేశారు. పనికి వెళ్లడం కాదు గదా వాళ్ళు 2 నెలల దాకా కదలలేని స్థితిలో పడి ఉండి చిత్రవధకు గురయ్యారు. వారి కుటుంబీకులు జోక్యం చేసుకొని అడ్డుకోబోతే పిల్లలను ఇంకా బాగా కొడతామని బెదిరించి వారిని వెళ్లగొట్టారు. మర్నాటి ఉదయం ఆ యువకులను బార్ జుల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ఎముకల, కీళ్ల సర్జరీలు చేయించారు. యువకుల కుటుంబీకులు పుల్వామా పోలీస్ స్టేషన్ లో ప్రాథమిక సమాచార నివేదిక దాఖలు చేయబోతే చుట్టూ యినుపముళ్ళ తీగలతో కంచె వేసి పోలీస్ స్టేషన్ నే మూసివేశారు.

సనావుల్లా బేకరీ దుకాణాన్నైతే రెండు నెలల పాటు పోలీసులు మూసివేయించారు. ఈద్ కోసం తయారు చేసిన స్వీట్లు, ఇతర పదార్థాలను అమ్ముకోలేకపోవడం వలన అతడు 2 లక్షల రూపాయలు నష్టపోయాడు. అంతకు ముందు నెలలో అతని ఆదాయం 25,000 – 30,000 రూపాయల మధ్య ఉండేది. ఇప్పుడు అతని ఆదాయం దాదాపు ఏమీ లేని స్థితికి వచ్చింది.

అరెస్టులు / ముందస్తు నిర్బంధం: ఆగష్టు 5 తర్వాత అరెస్టులు, ముందస్తు నిర్బంధాలు ఎక్కువయ్యాయి. పాత FIR లు దాఖలై ఉన్న వాళ్ళను మళ్ళీ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. కొందర్ని విడుదల చేసి, మరికొందరి మీద పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద కేసులు పెట్టి ఆగ్రాలో గాని, శ్రీనగర్లో గాని కేంద్ర కారాగారంలో ఉంచారు. పత్రికలకు సమాచారం ఇవ్వడం గాని, ప్రతిఘటించడం గాని ఏమీ చేయవద్దని, ఒకవేళ చేస్తే ప్రజా భద్రతా చట్టం (PSA) కింద కేసులు బనాయిస్తామని బెదిరించారు.

పరిగాం గ్రామం, పుల్వామా: ఆగష్టు 5వ తేదీ తర్వాత (కచ్చితంగా ఏ తేదీనో తెలియదు) 5 గురు పురుషులను అరెస్ట్ చేసి పుల్వామా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. తమ బంధువుల్ని తీసుకువెళ్లి నిరసన తెలిపినందుకు సైనికులు మరో ఇద్దరు బాలికల్ని బాగా కొట్టారు. అందులో ఒకరు నర్సింగ్ విద్యార్థిని. (వాళ్ల కుటుంబీకులతో మేము మాట్లాడలేకపోయాము).

కరీమాబాద్, షోపియన్ జిల్లా: ఇక్కడ స్మశానంలో 11 మంది అమరవీరుల సమాధులుండి ఈ గ్రామం మిలిటెంట్ గ్రామంగా పేరుగాంచింది. సైన్యం ఇక్కడి స్మశానంలోని సమాధుల్ని 2 సార్లు కూల్చివేసి ధ్వంసం చేసారు. కానీ ప్రజలు మళ్ళీ వాటిని నిర్మించుకొని, వాటిపై కాగితపు పూలు పెట్టారు. ముందస్తు నిర్బంధ చర్యల్లో భాగంగా వ్యక్తిగతంగా ఎటువంటి మిలిటన్సీతో సంబంధమేమీ లేకున్నా ఈ గ్రామం లోని యువకులను పట్టుకొని ఆగ్రా సెంట్రల్ జైలుకు పంపించారు.

అరెస్ట్ అయిన వాళ్ళల్లో కొందరు:

1) మామూన్ అహ్మద్ పండిట్: ఇతడు 17 సం.ల డిగ్రీ రెండవ సంవత్సరం చదువుచున్న పుల్వామా విద్యార్ధి. ఇతన్ని ఆగష్టు 7వ తేదీన ప్రజా భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి ఆగ్రా కేంద్ర కారాగారంలో బంధించారు. ఇతని ఏకైక నేరమేమిటంటే ఇతడు 2016 లో హతమైన ప్రఖ్యాత మిలిటెంట్ నసీర్ అహ్మద్ పండిట్ కు కనిష్ట సోదరుడు కావడమే. మేము ఇతని తల్లిని కలిస్తే సైనికులు ఆగష్టు 7న తెల్లవారుజామున 2 గం.లకు ఇంటికొచ్చి మామూన్ ను తీసుకెళ్లారని, ఆగష్టు 15 వరకు ముందస్తు నిర్బంధంలో ఉంచుకుంటామని చెప్పారని తెలిపింది. ఆగష్టు 16న కూడా ఇతన్ని విడిచిపెట్టకపోయేసరికి పుల్వామా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అడిగితే ఇతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పినట్టు తెలిపింది.

2) మునిరుల్ ఇస్లాం: 20 సం.లున్న ఇతడు బషీర్ అహ్మద్ పండిట్ కుమారుడు. ఇతన్ని సుహేల్ అనే మరో పేరుతోకూడా పిలుస్తారు. మేము ఇతని సోదరిని కలిస్తే ఆమె ఇలా చెప్పింది. సైనికులు తెల్లవారుజామున గం.2:45 ని.లకు గేట్ దూకి ఇంట్లోకి దూసుకవచ్చి మెడ, వెంట్రుకలు పట్టుకొని మునిరుల్ ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తల్లిని , సోదరిని ఇంట్లోకి నెట్టివేశారు. సిమెంట్ నేలపై రెండు సార్లు కాల్పులు జరిపి బెదిరించి, మళ్ళీ ఆ గుండ్లను తీసుకెళ్లారు. నేలపై రంధ్రాలు మాకింకా కనబడుతూనే ఉన్నాయి. ఇతన్ని గత జులైలో కూడా తీసుకెళ్లి వెంట్రుకలు కత్తిరించి బాగా కొట్టారు. మళ్ళీ ఇతణ్ణిప్పుడు తీసుకువెళ్లి ఆగష్టు 15 తర్వాత విడిచి పెడతామని అన్నారు. కానీ ఆగష్టు 14ననే ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసి పుల్వామా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అడుగగా ఇతన్ని వెంటనే శ్రీనగర్లోని జైలుకు, ఆ తర్వాత ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించారు.

3) బిలాల్ అహ్మద్ దార్ (ఇద్దరు పిల్లల తండ్రి): ఇతని కుటుంబీకులెవరూ కలవనందువల్ల మాకు ఎటువంటి వివరాలు తెలియలేదు.

పై ముగ్గురిపై రాళ్లు విసరడం, కార్లు ధ్వంసం చేయడం, మిలిటెంట్లకు సాయం చేయడం అనే నేరాలను మోపారని తెలిపారు. వారి కుటుంబీకులెవరూ ఆగ్రాకు వెళ్లడం గాని, లాయర్లను పెట్టుకోవడం గాని జరగలేదు. నేరాలకు సంబంధించిన పత్రాలేమీ మేము చూడలేదు.

ప్రాంగ్రూ గ్రామం, హంద్ వారా: ఈ గ్రామంలో ముగ్గురు పురుషులు అరెస్టై ఇంకా జైల్లోనే ఉన్నారు.
1) మహమ్మద్ షఫీమీర్ s/o మహమ్మద్ మఖ్బూల్ మీర్ : వయస్సు 35 సం.లు
2) అస్గర్ మఖ్బూల్ భట్
3) నదీమ్ మహమ్మద్ షేక్

వీళ్ళ కుటుంబ సభ్యులను కలిస్తే వాళ్ళిలా చెప్పారు. సెప్టెంబర్ 3న పోలీసులు వీళ్ళిళ్లకు వెళ్లి 2018 లోనే FIR నమోదైందని, దానికి సంబంధించి వారిని ఖల్మాబాద్ పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. మహమ్మద్ షఫీమీర్ తన తండ్రితో కలిసి స్టేషన్ కెళ్తే రాళ్లు రువ్వడం, మనన్ వనీ అంతిమ యాత్రలో పాల్గొనడం లాంటి కేసులున్నందున షఫీమీర్ ను రిమాండ్ లో ఉంచుతున్నామన్నారు.

పై ముగ్గురే కాక జహూర్ అహ్మద్ అనే 25 సం.ల యువకుని కోసం వెతికి, అతడు ఇంట్లో లేనందున అతడి కనిష్ట సోదరుడు డేనిష్ (17 సం.లు) ను పట్టుకొని 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి, అన్న జహూర్ వచ్చిన తర్వాత విడిచిపెట్టారు. నినాదాలిచ్చాడనే నేరంపై జహూర్ అహ్మద్ ను 18 రోజుల పాటు స్టేషన్ లో ఉంచుకొని విడిచిపెట్టారు.

శ్రీనగర్: 18 సం.లున్న 12వ తరగతి చదువుచున్నఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్టోబర్ 2న అరెస్ట్ చేసి అక్టోబర్ 8న వదిలివేశారు. మేము అతని కుటుంబ సభ్యులను కలిస్తే వాళ్ళిలా చెప్పారు: 17 కార్లలో పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చి గేట్లు దూకి తలుపులు దబాలున తెరిచారు. పెప్పర్ గ్యాస్, భాష్పవాయువులను వదులుతూ అక్కడున్న స్త్రీలందరినీ రైఫిల్ కర్ర మొద్దులతో కొట్టారు. అతని తండ్రి ఛాతీని గట్టిగా పట్టి గోడకు తోసేసి, చేతిని విరిచేసారు. ID ని తేవడానికి మెట్లెక్కి పోతున్న 12వ తరగతి విద్యార్థిని లాక్కెళ్లి కార్లో తీసుకెళ్లారు.

కమ్యూనిటీ బాండ్ పద్ధతి: ఎక్కడైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడి కమ్యూనిటీ పెద్దమనుషులు పూచీకత్తు ఇవ్వాలి. ఈ అరెస్ట్ అయిన విద్యార్ధి విషయంలో అక్కడి 20 మంది పెద్దమనుషులను రోజూ స్టేషన్ కు పిలిపించి వాళ్ళ ID లను తీసుకుని, కొన్ని గంటల పాటు లేదా రోజంతా ఉంచుకొని, చివరికి పొమ్మని ఆ విద్యార్థిని విడిచిపెట్టారు.

సౌరా: సౌరా లోని దుకాణదారుడు ఇనాయత్ అహ్మద్ ను అల్ జజీరా ఛానల్ తో మాట్లాడినందుకు, నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆగష్టు 29న అరెస్ట్ చేసారు. 15, 16 రోజులు స్టేషన్ లో ఉంచుకొని ప్రజా భద్రతా చట్టం కింద కేసు పెట్టి శ్రీనగర్ కేంద్ర కారాగారంలో బంధించారు. ఛార్జ్ షీట్ ప్రకారం ఆగష్టు 7న రాళ్లు రువ్విన సంఘటనలో మొదటి FIR దాఖలు కాగా, ఊరేగింపులో పాల్గొని పాకిస్థాన్ అనుకూల నినాదాలిచ్చినందుకు ఆగష్టు 30న రెండవ FIR దాఖలు చేసారు.

కస్టడీ మరణం: సెప్టెంబర్ 3, 2019: రియాజ్ అహ్మద్ థిక్రి (సుమారు 20 సం.లు) మరణం, నంద పొర భాండీవార్డ్, భాండీ గ్రామం:

భాండీ గుజ్జార్లు నివసించే గ్రామం. చాలామంది గుజ్జార్లపై పలు అటవీ కేసులు నమోదై ఉన్నాయి. గ్రామస్థుల కథనం ప్రకారం అటవీ అధికారులు రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు లంచాలు తీసుకుంటారు. కోర్టుకు హాజరయ్యే ప్రతిసారి లాయర్లకు ఒక్కొక్కరికీ రూ.500/- లు ఇవ్వాలి. ఒకసారి కేసు కు హాజరైతే ప్రయాణ ఖర్చులతో సహా మొత్తం రూ.1000/- లు ఖర్చవుతాయి. ఒకరైతే తాను 2005 నుండి అటవీ కేసు ల విషయమై కోర్టు కు హాజరవుతూనే ఉన్నానని చెప్పాడు. 2010 నుండి అటవీ శాఖాధికారులు గుజ్జార్లుండే రూట్లను ఇనుప ముళ్ల తీగలతో మూసివేశారు.

లద్దాఖ్ లో కూలి పనికి వెళ్లి తిరిగివచ్చిన రియాజ్ అహ్మద్ పై మోపిన కలప అక్రమ రవాణా కేసు లో ఒక FIR ధాఖలైందని, సెప్టెంబర్ 2న పోలీస్ లు వచ్చి అతన్ని స్టేషన్ కు రమ్మన్నారు. మర్నాడే సెప్టెంబర్ 3న పోలీస్ లు అతని మామ జమాల్ దీన్ శాభంగీ ఇంటికి వచ్చి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళగానే అతని మేనల్లుడు రియాజ్ అహ్మద్ తన లోదుస్తువైన డ్రాయర్ తాడుతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

అయితే జమాల్ దీన్ తదితరులు రియాజ్ ముక్కు పగిలి ఉండడం, భుజం నుండి తుంటి వరకు కుడి పక్క శరీరమంతా బాగా చితక కొట్టబడి కమిలిపోయి ఉంది. హంద్ వారా ఆసుపత్రి లో పోస్ట్ మార్టం నిర్వహించారు. కానీ ఎటువంటి కాపీని వారికి ఇవ్వలేదు. రియాజ్ తల్లి గుడ్డిది. అతని మరో ఇద్దరు కనిష్ట సోదరులు కూలి పని చేసుకొని పొట్ట పోసుకునేవారే. రియాజే ఆ కుటుంబంలో ప్రధాన సంపాదనా పరుడు.
పోలీస్ కస్టడీలో రియాజ్ మరణించిన తర్వాత హెరాల్ నుండి ఖల్మాబాద్ లోని వార్ పురా వరకు ఊరేగింపు తీస్తే పోలీస్ లు బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. పైగా శవాన్ని స్వాధీనం చేసుకొని తన ఇంటికి సమీపంలోనే బలవంతంగా ఆ శవాన్ని పూడ్చి పెట్టేశారు. నిరసన తెలిపితే మేనమామ జమాల్ దీన్ ముఖాన్ని చితక్కొట్టేశారు.

ముగింపు:

ఒకవేళ ముందేగనుక సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని (ఇప్పటికైనా ఆ పని చేయవచ్చు) ఆర్టికల్ 370 ని పునరుద్ధరించి, జమ్మూ కాశ్మీర్ ను పూర్వపు రాష్ట్రంగా తిరిగి మార్చినట్లైతే, ప్రజాగ్రహం కొంతైనా తగ్గి ఉండేది. ఏదేమైనా కాశ్మీర్ లో, బైటా అందరికి ఉన్నట్టుగానే మాకు కూడా కాశ్మీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న విషయంలో చాలా సందిగ్ధం ఉన్నది.

(తెలుగు అనువాదం : మెట్టు రవీందర్)

స్వస్థలం వరంగల్. కవి, రచయిత. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(ఇంగ్లిష్), సీకేఎం ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు.

 

 

 

Leave a Reply