కాలం మలిచిన కవి!

చరిత్రను తెలుసుకోవాలనుకునప్పుడల్ల స్థల కాలాలే నిర్ణయిస్తాయి. ఏ కాలం ఏ చరిత్రకు పునాదో తెలుపుతుంది. ఆ చరిత్ర ఆనవాల్లే ఆయా ప్రాంతాల విషయాలను తెలుపుతుంది, లేదా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. చరిత్రకు స్థల , కాలాలే మూలమని చెప్పవచ్చు. అలా ఆ చరిత్ర నుండే కొత్త మనుషులకు జీవం పోస్తుంది. ఈ పరంపర నుండి మనం ప్రపంచ చరిత్రను కూడా చూడవచ్చు. అలా భారత దేశంలో కూడా అనేక సామాజిక, సాంఘిక, ఎన్నో రకాల ఉద్యమాల చరిత్ర ఉన్నది. ఈ ఉద్యమాల నుండి ఎందరో కవులు, రచయితలు పుట్టుకొచ్చారు. జాతీయోద్యమానికి అండగా నిలిచిన వారున్నారు. అలా ఈ నేల మీద నకల్భరి పోరాటం ఎందరినో ఆలోచింపజేసింది. ముఖ్యంగా నాటి యువతరం మీద ఎక్కువ ప్రభావం వేసింది. ఈ పోరాటాన్ని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రిపరేషన్ గ్యాప్ గా భావించవచ్చు.

సరిగ్గా నకల్బరి వెలుగులు దేశాన్ని తాకాయి. ఆ వెల్లువ నుండి ఎన్నో ధిక్కార స్వరాలు వినిపించాయి. ఎందరో కవులు రచయితలు కళాకారులు పుట్టుకొచ్చారు. విశ్వవిద్యాలయాలు ఉక్కు పిడికిల్లుగా మారాయి. మతతత్వం మీద పోరు సల్పుతున్న కాలమది.1972లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విప్లవ విద్యార్థి కామ్రేడ్ జార్జి అమరత్వం పొందిన కాలంలోనే నేత కార్మికుడి గుడిసెల్లో కండ్లు తెరిచిన వాడు కొడం కుమారస్వామి.

రచయిత కుమారస్వామి బాల్యం కల్లోలిత కాలంలోనిది. ఈ కాలం ప్రభావం తన బాల్యం మీద చెరగని ముద్ర వేసి ఉంటుంది. రచయిత కుమారస్వామి ఓరుగల్లు ప్రాంతం వాసి. ఓరుగల్లుకు ప్రత్యేకమైన పోరాటాల చరిత్ర కలదు. ప్రజా కవి కాళోజీ, చిట్యాల ఐలమ్మ, ఆదివాసులకు ముద్దు బిడ్డ ప్రో||బియ్యాల జనార్ధన్ రావు, పాటలు పాలకులకు అంకితం ఇవ్వనని చాటిన పాలకుర్తి కవులు పుట్టిన నేలన రచయిత పురుడుబోసుకున్నాడు. ధిక్కారాన్ని ప్రకటించే కవులున్న నేలలో తన బాల్యం గడవడం అది చెరగని సంతకం. మాతృస్వామిక ఆనవాలుకు మూలం అయిన సమ్మక్క సారలమ్మ అతి పెద్ద కాకతీయ రాజ్యాన్ని ఎదిరించిన పోరాటాల జాడది. రైతాంగంతో కలిసి పోయే విద్యార్థి పోరాటాలున్న ప్రాంతం. ఓరుగల్లును – మెతుకు సీమకు దారులు వేసిన సూరపనేని జనార్ధన్ పోరాటం ఉన్నది. ఈ కాలంలో గడిచిన కుమారస్వామి బాల్యం మీద కాలం గుర్తులు చెరగని సంతకంగా మారకుండా పోలేదు. అందుకే రచయిత కవిత్వంలో ఆ ఆనవాళ్లు కనిపిస్తాయి.

రచయిత కుమారస్వామి రెండు దశాబ్దాలకు పైగా రాసుకున్న కవితలను ” పూల పరిమళం” అనే ఒక సంకలనంగా మన ముందుకు తీసుకువచ్చాడు. కవి తన మనస్సులో గుది గుచ్చుకున్న ఆలోచనలను, అక్షర బద్ధం చేశాడు.కవిత్వ రూపంగా మన ముందుంచాడు. కవి స్పందనలన్ని సందర్భాను సారంగ తను రాసుకున్నవి. అలాగే సమాజపు చిత్తరువు మీద స్పందించిన కవితలున్నాయి. కవి తాను పత్రిక రంగంలో పని చేయ్యడం వలన కవితలన్నీ ఒకటి/రెండు పేజీల్లో ముగుస్తాయి.

అక్కడ శ్రీను స్వామి ఊరోదిలినట్టు
ఇక్కడ రమణ, ఎల్లయ్య, రాము ఎందుకెల్లి పోయిండ్రో మొన్ననే తెలిసింది
మా క్యాంపస్ లో కనిపించని మృగమొకటి
పట్ట పగలే స్వైర విహారం చేస్తోంది

ఆకారం ఎట్లుంటదో ఎవరికీ తెలియదు
అమ్మా! విద్యారణ్యం నుంచి మృగాన్ని వేటాడటానికి
నాకు తోడుగా మహేష్ నో , రంగవల్లినో పంపించు అంటాడు కారటు కవితలో కవి. నిజమే విశ్వవిద్యాలయాలో విద్యార్థులు మాయమై పోవడం పట్ల అవేదన చెంది. వారికి తోడు నీడగా మహేష్(ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి),రంగవల్లి లాంటి పోరు బిడ్డల అండ కావాలంటాడు.

అలాగే మట్టి కవితలో
స్పందించే తనువున్న మట్టి
జొన్నలేస్తే కంకులిచ్చే నేల
తూటాలు జల్లితే తుపాకులు మొలిచే నేల
దు: ఖమొస్తే ఒడిజాపే నేల
ఆరుద్ర పువ్వులు పూసే త్యాగాల నేల అంటాడు కవి. కవి తన తపనంతా ఈ నేల మాగనమంత త్యాగాలతో, పోరాటాలతో పెనవేసుకున్నదని చాటుతాడు. ఈ నేల మీద ఎందరో వీరులు తమ రక్తం చిందించారు. కష్ట జీవుల రాజ్యం రావాలని. ఈ మట్టి పరాయికరించబడుతున్న చోట కన్నీటిని ఒత్తుకుని కర్తవ్యాన్ని చేపట్టాలని ఆశగా తెలుపుతాడు.

అంతేకాదు తాను నేత కుటుంబంలో పుట్టి పెరిగాడు కనుక, ఆ వృత్తి ఇబ్బందులు వారి జీవన విధానం తెలిపే విధంగా కవితని రాశాడు.
అగ్గిపెట్టెల పట్టు అందాల చీర నేస్తే
పద్మశాలి కాదురా… ప్రతిభాశాలని
బ్యాండు కొట్టి నా ఫోటువకు దండేస్తివిరా
భరోసా కరువయి కొడికడుతున్న దీపశిఖను.

శరంలేని పాలకునికి శేవులినబడయ్
గుణం తప్పినోల్లకు కండ్లు కనిపించవు
మా పినిగల మీద పేలాలు ఏరుకునుడేంది.?
మా పోగెందో మాకియ్యాలే
లాకలు మీ ఈపుల మోగుతయ్ బిడ్డా..!

అంటు ప్రతిభాశాలి కవితలో అంటాడు. నేత బతుకుల్లో ఉన్న ప్రతిభను చాటుతూ, వారి జీవితంలో అల్లుకున్న ఇబ్బందులు గూర్చి ఏ పాలకుడు పట్టించుకోడు. సిరిసిల్ల (సిరిశాల) పద్మశాలిలకు పుట్టినిల్లు లాంటిది. అక్కడి నేత కార్మికుడు అగ్గిపెట్టె లో పట్టే పట్టు చీరను నేసి ఈ సమాజానికి అందించిన ప్రతిభ కలిగిన వాళ్ళున్నారు. అయిన వారి జీవితంలో చీకటి తొలగిన రోజు లేదు. బతుకు చాలి చాలని మగ్గాల మధ్య, పోగు పోగు వడికిన కానీ వ్యతలు మారలేని చోట, నూలు పోగే ఉరి తాడయి సిరిశాల – ఉరిశాలగా మారిన రోజులున్నాయి. ఇప్పటికైనా పాలకులు శవ రాజకీయాలు మాని ప్రజల కోసం పాటు పడాలని కవి అవేదన మనకు కనిపిస్తుంది.

ఇలా కవి తాను చలించి రాసిన కవిత్వాలు మన హృదయాన్ని తాకుతాయి. రచయిత కుమారస్వామి రాసిన ఈ “పూల పరిమళం ” మరింతగా పరిమలించాలని కోరుకుంటున్నాను.

పుట్టిన ఊరు సిద్ధిపేట, పూర్వపు మెదక్ జిల్లా.  కవి, రచయిత, విరసం సభ్యుడు. ఎమ్మెస్సీ(భౌతికశాస్త్రం) చదివారు.  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు, పాటలు ప్రచురితమయ్యాయి. రచనలు: వసంత మేఘం(కవిత్వం)

 

 

 

Leave a Reply