కారాగారమే కదనరంగం

నాజిమ్ హిక్మెత్. మొట్టమొదటి ఆధునిక టర్కిష్ కవి. 20వ శతాబ్దపు గొప్ప కవుల్లో ఒకరిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన కవిత్వం 20వ శతాబ్దపు సారమైన విప్లవం, ప్రతిఘటనా స్ఫూర్తితో వెలిగింది. జైలునే తన కవితా వర్క్‌షాప్‌గా మార్చుకున్న ధిక్కార కవి. అతని కవిత్వం యాభైకి పైగా భాషలల్లోకి అనువాదమైంది.

తన తండ్రి విదేశాంగ శాఖలో పని చేస్తున్న సలోనికాలో (Salonika) 1902లో జన్మించిన హిక్మెత్ ఇస్తాంబుల్‌లో పెరిగాడు. అతని తల్లి కళాకారిణి. అతని తాత కవి. వాళ్ల స్నేహితుల ద్వారా హిక్మెత్ కు చిన్న వయసులోనే కవిత్వం పరిచయమైంది. పదిహేడేళ్ల వయసులో అతని మొదటి కవితలు ప్రచురితమైనాయి. అతను టర్కిష్ నావికా అకాడమీకి హాజరయ్యాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇస్తాంబుల్‌లో మిత్ర రాజ్యాల ఆక్రమణ సమయంలో, ముస్తఫా కేమల్ (Mustafa Kemal) నాయకత్వంలో జరిగిన జాతీయ ప్రతిఘటనోద్యమంలో పాల్గొనడానికి, తన స్నేహితునితో అంకారాకు (Ankara) బయలుదేరాడు.

అప్పటికి రైలు మార్గాన్ని ఆక్రమిత శక్తులు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ప్రమాదకరమైన పర్వత మార్గాలపై కాలినడకన ప్రయాణం చేయవలసి వచ్చింది. మార్గంలో వాళ్లు స్వాతంత్రోద్యమంలో చేరడానికి బయలుదేరిన స్పార్టసిస్టుల బృందాన్ని కలిసి, వాళ్ళ నుండి మార్క్స్, లెనిన్ ఆలోచనలను తెలుసుకున్నారు. స్నేహితులిద్దరూ ప్రయాణ మార్గంలో, విపరీతమైన పేదరికంలోనూ తమకి ఆతిథ్యాన్ని ఇచ్చిన స్థానిక గ్రామస్తుల స్నేహాన్ని ఆస్వాదించారు.

అంకారాలో ముస్తఫా కెమాల్‌ నిర్దేశాలను అనుసరించి కొంత కాలం బోలు అనే చిన్న పట్టణంలో విద్యను బోధించారు. తమకు కేటాయించిన పాత్రలతో అసంతృప్తి చెంది, రష్యన్ విప్లవానికి ఆకర్షితులై 1922లో వాళ్లు సరిహద్దును దాటి మాస్కోకు వెళ్లారు. మాస్కో విశ్వవిద్యాలయంలో హిక్మెత్ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులను, కళాకారులను కలుసుకున్నాడు. టర్కీ స్వాతంత్ర్య యుద్ధం తరువాత 1924 లో హిక్మెత్ టర్కీకి తిరిగి వచ్చాడు, కాని వామపక్ష పత్రికలో పనిచేసినందుకు త్వరలోనే అరెస్టయ్యాడు. 1926లో అతను రష్యాకు తప్పించుకొని అక్కడ కవిత్వం, నాటకాలు రాశాడు. మాయకోవ్స్కీని కలుసుకున్నాడు. మేయర్‌హోల్డ్ తో కలిసి పనిచేశాడు. టర్కీ ఆమ్నెస్టీ ప్రకటించడంతో 1928లో టర్కీకి తిరిగి వచ్చాడు. అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించబడడంతో, రహస్య పోలీసులు అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. తరువాతి పదేళ్ళలో అయిదేళ్లు అతను అక్రమ కేసుల్లో అరెస్టై జైలులో గడిపాడు. 1933లో, అతన్ని అక్రమ పోస్టర్లు పెట్టాడని ఆరోపించి జైలులో నిర్బంధించారు. కానీ అతని కేసు విచారణకు వచ్చినప్పుడు, సాక్ష్యం లేనందున దానిని కోర్టు కొట్టివేసింది. హిక్మెత్ 1929 – 1936 మధ్య తొమ్మిది పుస్తకాలను ప్రచురించాడు. – అవి టర్కిష్ కవిత్వాన్ని విప్లవీకరించాయి. ఆటోమాన్ (Ottoman) సాహిత్య సాంప్రదాయాలను ధిక్కరిస్తూ, వచన కవిత్వాన్ని, వ్యావహారిక భాషను పరిచయం చేశాయి. ఈ కవితలు అతన్ని టర్కీలో ప్రముఖ ఆధునిక కవిగా నిలబెట్టాయి. అతను అనేక నాటకాలు, నవలలను కూడా ప్రచురించాడు. తన కుటుంబాన్ని పోషించడానికి బుక్‌ బైండర్, ప్రూఫ్ రీడర్, జర్నలిస్ట్, అనువాదకుడు, స్క్రీన్ రైటర్‌గా పనిచేశాడు.

టర్కీ సాయుధ దళాలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడనే ఆరోపణతో జనవరి 1938లో అతన్ని అరెస్టు చేశారు. సైనిక బలగాలు అతని కవితలను చదువుతున్నారనే కారణంతో 28ఏళ్లు జైలు శిక్ష విధించారు. జైలులో ఉండగా అతని కవిత్వం మరింత పదునెక్కింది. జైలులో గొప్ప సాహిత్య సృష్టి చేయడమే కాకుండా, 1941- 1945 మధ్యకాలంలో అతని అద్భుతమైన కళాకృతి, ‘హ్యూమన్ ల్యాండ్‌స్కేప్స్‌’ను రాశాడు.

తనను, తన కుటుంబాన్ని పోషించడానికి జైలులో నేత పని, చెక్క పని వంటి చేతిపనులు కూడా నేర్చుకున్నాడు. 1949లో హిక్మెత్ విడుదల కోసం కృషి చేయడానికి పాబ్లో పికాసో, పాల్ రోబెసన్, జీన్ పాల్ సార్త్రేలతో సహా పారిస్ లో ఒక అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. 1950లో ఆయనకు ప్రపంచ శాంతి బహుమతి లభించింది. అదే సంవత్సరం, కొద్ది రోజుల క్రితమే గుండెపోటు వచ్చినప్పటికీ, జైలులో 18 రోజుల నిరాహార దీక్షకు దిగాడు. టర్కీలో మొట్టమొదటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, అతను జెనరల్ ఆమ్నెస్టీలో విడుదలయ్యాడు.

విడుదలైన సంవత్సరంలోనే హిక్మెత్ మీద తీవ్రమైన నిర్బంధం మొదలయింది. జైలు నుండి విడుదలయిన ఏడాది తర్వాత అతని మీద రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. 50 ఏండ్ల వయసులో అతనితో రష్యా సరిహద్దు దగ్గర సైన్యంలో పని చేయించే ప్రయత్నం చేశారు. అతను మళ్లీ టర్కీ నుండి తప్పించుకొని మాస్కో చేరాడు. టర్కీ ప్రభుత్వం, అతని భార్య, బిడ్డ అతని దగ్గరకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. 1952లో రెండో సారి గుండెపోటు వచ్చినా, హిక్మెత్ రోమ్, పారిస్, హవానా, పెకింగ్ లతో సహా యూరోప్, ఆసియా, ఆఫ్రికాలలో అనేక ప్రదేశాలు తిరిగాడు. 1959లో టర్కీ పౌరసత్వం రద్దు చేయగా పోల్యాండ్ పౌరసత్వం తీసుకున్నాడు. అతను ప్రవాసంలో ఉండగా, అతని కవిత్వం ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. గ్రీస్, జెర్మనీ, ఇటలీ, సోవియెట్ యూనియన్ వంటి దేశాల్లో ప్రచురితమయింది. హిక్మెత్ జూన్ 1963లో మాస్కోలో గుండె పోటుతో మరణించాడు.

అతని మరణం తరువాత, హిక్మెత్ పుస్తకాలు టర్కీలోకి తిరిగి ప్రవేశించాయి. 1965, 1966లో, ఇరవైకి పైగా అతని పుస్తకాలు అక్కడ ప్రచురితమయ్యాయి. తరువాతి పదిహేనేళ్లలో అతని నాటకాలు, నవలలు, ఉత్తరాలు, పిల్లల కథలతో పాటు అతని ఎనిమిది కవితా సంపుటాలు క్రమంగా ప్రచురించబడింది. అదే సమయంలో, అతని కవితా సంపుటాల అనేక ముద్రణలతో పాటు ఎన్నో జీవిత చరిత్రలు, అతని కవితల విమర్శనాత్మక అధ్యయనాలు ప్రచురించబడ్డాయి. కానీ 1965 నుండి 1980 మధ్య సంక్షిప్త కాలాలు మినహా, గత అర్ధ శతాబ్ద కాలంగా అతని సాహిత్యం తన స్వదేశంలో అణచివేతకు గురైంది. ఆయన మరణించినప్పటి నుండి, అతని కవిత్వం అనువాదాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, పోలాండ్, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ లో ప్రచురితమవుతూనే ఉన్నాయి.

విట్మన్ మాదిరిగా, హిక్మెత్ తన గురించి, తన దేశం గురించి, ప్రపంచం గురించి ఒకే శ్వాసలో మాట్లాడుతాడు. వ్యక్తిగతమవుతూనే, సామాజికమవుతూ, అతని కవిత్వం అతని జీవితాన్ని స్వీయ-చైతన్యానికి మాత్రమే కుంచించకుండా నమోదు చేస్తుంది. అతను తన భావాల ప్రామాణికతను నొక్కి చెప్తూనే వాస్తవాల వాస్తవికతను ధృవీకరిస్తాడు. అతని మానవ ఉనికి, అతని ఉల్లాసభరితమైన, ఆశావాద వ్యక్తిత్వం అతని కవితలను సామాజిక, కళాత్మక మార్పులకు కట్టుబడి ఉండేలా చేస్తాయి. అతని జీవితం, కళ యొక్క సంపూర్ణ ఏకత్వంలో, హిక్మెత్ ఒక వీరోచిత వ్యక్తిగా ఉద్భవించాడు. అతని తొలి కవితలు ఈ ఐక్యతను విశ్వాసంగా ప్రకటిస్తాయి: కళ అనేది సామాజిక, సాహిత్య చరిత్రలో ఒక సంఘటన అని హిక్మెత్ అంటాడు. ఒక కవి కళలో దిశ అతని జీవితపు దిశ నుండి విడదీయరానిది అని నమ్మాడు. హిక్మెత్ జీవితాంతం ఈ విశ్వాసం మీద పనిచేయడానికి, దానిని మరింత లోతుగా నమ్మడానికి అతనికి జీవితం తగినంత అవకాశాన్ని ఇచ్చింది.

టెర్రెన్స్ డెస్ ప్రెస్ గమనించినట్లుగా, హిక్మెత్ ఆదర్శప్రాయమైన జీవితం, చారిత్రాత్మకమూ- కాలాతీతమూ, మార్క్సిస్ట్ దృక్పథంతో పాటు మార్మికమూ అయిన అతని ప్రత్యేక దృష్టి అతని కళకు ప్రత్యేకమైన పరిణామాలను ఇచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే, హిక్మెత్ ప్రాసిక్యూటర్లు ఒక కవితల పుస్తకం మిలటరీని తిరుగుబాటుకు ప్రేరేపించవచ్చని నమ్ముతూ అతన్ని గౌరవించారు. నిజానికి, అతన్ని రాజ్యం హింసించిందనే వాస్తవం అతని కళ యొక్క ప్రాముఖ్యతపై అతని నమ్మకాన్ని ధృవీకరిస్తుంది. అతని విశ్వాసాల వల్ల అతనికి ఎంత కష్టం కలిగినా అతను జీవితంలో కానీ కళలో కానీ ఎప్పుడూ రాజీపడలేదు. హిక్మెత్ మానవుడనే వాడిని సృష్టించవలసినదిగా భావించాడని సార్త్రే వ్యాఖ్యానించాడు. జీవితంలోనూ, కళలోనూ, హిక్మెత్ వీరోచితమైన, సృజనకారుడైన కొత్త రకమైన వ్యక్తిని సృష్టించాడు. కళాకారుడిని హీరోగా, హీరోని సృష్టికర్తగా భావించడం ఆధునిక ప్రపంచంలో కళను పనికిరాని చర్యగా మారకుండా రక్షిస్తుంది. హిక్మెత్ జీవితం, కవిత్వం ఒక జీవన్మరణ సమస్య అని నిరూపించింది.

దేశద్రోహి

ఔను, నేను దేశద్రోహినే
మీరు దేశభక్తులైతే
మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే
నేను నా మాతృభూమికి దేశద్రోహినే
నేను నా దేశానికి ద్రోహినే.

దేశభక్తి అంటే
మీ విశాల వ్యవసాయ క్షేత్రాలే అయితే
దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే
దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే
దేశభక్తి అంటే దారిపక్క దిక్కులేని ఆకలి చావులే అయితే
దేశభక్తి అంటే జనం కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే
ఎండాకాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే
మీ కార్ఖానాల్లో మా నులివెచ్చని రుధిరాన్ని పీల్చి తాగడమే
దేశభక్తి అయితే
గ్రామసీమల్లో మీ భూస్వాములు విప్పిన పంజాలే
దేశభక్తి అయితే
మతగ్రంథాలను వల్లించడమే
దేశభక్తి అయితే
పోలీసు చేతి లాఠీయే
దేశభక్తి అయితే
మీ కేటాయింపులూ మీ జీతభత్యాలూ మాత్రమే
దేశభక్తి అయితే
అమెరికా స్థావరాల స్థాపనే, అమెరికా బాంబులే, అమెరికా క్షిపణులే
దేశభక్తి అయితే
మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికిగుంటనుంచి
విముక్తి లేకపోవడమే
దేశభక్తి అయితే
నేను దేశద్రోహినే

మూడు కాలాల నిండా కారు నల్లని సిరాతో గగ్గోలు పెట్టే వార్తలు రాసుకోండి
”నాజిం హిక్మత్ దేశద్రోహిగానే ఉండదలిచాడు, ఇప్పటికీ”

(ఇంగ్లిష్ లోకి: చెమ్ ర్యాన్, హుడా చెరెబ్. తెలుగు: ఎన్ వేణుగోపాల్)


విషాద స్వేచ్ఛ

నువు నీ కళ్ల చూపునంతా వృథా చేసుకుంటావు
నువు నీ చేతుల సౌకుమార్యపు మెరుపునంతా
వృథా చేసుకుంటావు
డజన్ల కొద్ది రొట్టెల పిండి పిసుకుతూ
ఒక్క ముక్క కూడ చవిచూడలేవు
ఇతరులకు బానిసగా ఉండే స్వేచ్ఛ నీకుంది
ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేసే స్వేచ్ఛనీకుంది

నీ బతుకంతా నిను వెంటాడే
అబద్ధాల్ని సృష్టించే మరల్ని
నువు పుట్టిందే ఆలస్యం
వాళ్లు నీ చుట్టూ అమరుస్తారు
తల పట్టుకుని నువు
నీ మహత్తర స్వేచ్ఛలో ఆలోచిస్తూనే ఉంటావు
స్వేచ్ఛగా ఆలోచించే స్వేచ్ఛ నీకుంది –

నీ తలేమో మూపువరకూ నరికేయబడ్డంతగా
వంగిపోయి ఉన్నప్పుడు
నీ చేతులు మాత్రం
పొడుగ్గా వేలాడుతూ ఉంటాయి
నీ మహత్తర స్వేచ్ఛలో
నువు తారట్లాడుతూ ఉంటావు
నిరుద్యోగాన్ననుభవించే స్వేచ్ఛ నీకుంది

నువు నీ దేశాన్ని
ఆత్మీయంగా, అన్నిటికంటే విలువైందిగా ప్రేమిస్తావు
కాని
ఒకానొకరోజు
బహుశా వాళ్లు నీ దేశాన్ని అమెరికాకు పణంగా పెడతారు
నీ మహత్తర స్వేచ్ఛతో పాటు నిన్ను కూడా…

విదేశానికి విమాన స్థావరంగా మారే స్వేచ్ఛ నీకుంది
మనిషి
పనిముట్టుగానో, సంఖ్యగానో, గొలుసుగానో కాక
మనిషిగా బతకాలని
నువు ప్రకటిస్తావు
తక్షణమే వాళ్లు నీ చేతులకు సంకెళ్లు బిగిస్తారు
నీకు నిర్బంధించబడే స్వేచ్ఛ ఉంది
నీకు జైల్లో పెట్టబడే స్వేచ్ఛ ఉంది
నీకు ఉరి తీయబడడానికి కూడ స్వేచ్ఛ ఉంది

నీ బతుకు చుట్టూ ఉన్నది
ఇనుపతెర కాదు
చెక్కల కటకటాలుకాదు
మేలి ముసుగూ కాదు
నీకు స్వేచ్ఛ కోరుకోవాల్సిన అవసరమే లేదు
నీకు స్వేచ్ఛ ఉంది
కానీ
విశాల వినీలాకాశం కింది ఈ స్వేచ్ఛ
ఎంత విషాదకరమైనది!!

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)


బతకడం గురించి

1
బతకడమంటే నవ్వులాట కాదు:
నువ్వు ఒక గొప్ప గాంభీర్యంతో బతకాలి
ఎలా అంటే, ఒక ఉడతలా-
అంటే బతకడానికి అవతల, మించి ఇక ఏమీ వెతకకుండా,
అంటే బతకడమే నీ వృత్తి, ప్రవృత్తి కావాలి
బతకడమంటే నవ్వులాట కాదు:
దానిని గంభీరమైనదిగా తీసుకోవాలి,
ఎలా అంటే, ఎంత తీవ్రంగా అంటే
నీ చేతులు వెనక్కి విరిచి కట్టినా
నీ వీపు గోడకు విసిరివేయబడినా
లేదా ఒక ప్రయోగశాలలో
నీ తెల్ల కోటు, కళ్లద్దాలతో అయినా,
నువ్వు ప్రజలకోసం ప్రాణాలు ఇవ్వగలగాలి-
నువ్వెప్పుడూ మొహాలు చూడని ప్రజలకోసం సైతం,
బతకడం అన్నింటికన్నా నిజమైనది, అందమైనదని తెలిసి కూడా.
అంటే, నువ్వు ఎంత తీవ్రతతో బతకాలంటే
డెబ్బై ఏండ్ల వయసులో కూడా నువ్వు ఆలివ్ చెట్లు నాటాలి-
అదీ నీ పిల్లలకోసం కూడా కాదు,
నువ్వు చావుకు భయపడినా దాన్ని నమ్మనందుకు,
ఎందుకంటే చావు కన్నా బతుకు గాఢమైనది కనుక.

2

మనకి తీవ్రంగా జబ్బు చేసిందనుకో, ఆపరేషన్ అవసరమనుకో-
అంటే మనం ఆ తెల్ల టేబుల్ మీద నుండి మళ్లీ లేవకపోవచ్చు కూడా.
కొంత తొందరగానే వెళ్లిపోవలసి వస్తుందని విచారం కలగకుండా ఉండడం అసంభవమైనా,
మనకు చెప్పే జోకులకు మనం నవ్వుతుండాలి
బయట వర్షం పడుతుందేమో అని కిటికీ నుండి తొంగి చూడాలి
తాజా వార్తల కోసం ఆత్రుతతో ఎదురుచూడాలి…
మనం యుద్ధభూమిలో ఉన్నామనుకో-
ఏదో పోరాడవలసిన గొప్ప ఆశయం కోసమనుకో.
అక్కడ, ఆ మొదటి దాడిలోనే, ఆ రోజే
మనం చచ్చి మొహం మీద బోర్లా పడిపోవచ్చు.
ఒక ఆసక్తికరమైన కోపంతో అది మన మదిలో మెదులుతుంటుంది,
అయినా కొన్ని యేండ్ల పాటు జరిగే యుద్ధం ఎట్లా ముగుస్తుందోనని చచ్చేంత ఆందోళన పడాలి.
మనం దాదాపు యాభై ఏండ్ల వయసులో జైలులో ఉన్నామనుకో,
ఇంకో పద్దెనిమిదేండ్లకు గాని, ఆ ఇనుప ద్వారాలు తెరుచుకోవనుకో,
అయినా మనం బయట ప్రపంచంలో జీవించాలి
అక్కడి జనం, జంతువులు, పోరాటం, గాలితో-
అంటే ఆ గోడలకు అవతల బయట ప్రపంచంతో.
అంటే మనం ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా,
ఎప్పుడూ మనకు చావు లేదన్నట్టుగా బతకాలి.

3

ఈ భూమి చల్లబడిపోతుంది
నక్షత్రాల్లో ఒక నక్షత్రం
అతి చిన్నవాటిలో ఒకటి
నీలిరంగు మఖ్మల్ పై బంగారు పూత పూసిన ఒక ధూళి కణం-
అంటే ఇది, మన గొప్ప భూగోళం.
ఈ భూమి ఒకరోజు చల్లబడిపోతుంది
ఒక మంచుగడ్డలా కాదు
ఒక మరణించిన మేఘంలా కూడా కాదు
ఒక డొల్ల టెంకాయలా దొర్లుతూ ఉంటుంది
ఆ చిమ్మని చీకటి అంతరిక్షంలో…
దీని గురించి నువ్వు ఇప్పుడే దుఃఖించాలి-
ఈ బాధను నువ్వు ఇప్పుడే అనుభవించాలి-
నువ్వు ‘నేను జీవించాను’ అని చెప్పాలనుకుంటే
ఈ ప్రపంచాన్ని అంతగా ప్రేమించాలి…

(తెలుగు: చైతన్య చెక్కిళ్ల)


జైలు జీవితం గడిపేవాళ్ళకు కొన్ని సలహాలు

ప్రపంచం మీద, నీ దేశం మీద, నీ ప్రజల మీద
నువ్వు ఆశలు వదులుకోనందుకు
నిన్ను ఉరితీసే బదులు, జైలులో పడేసారనుకో
ఇంకా మిగిలి ఉన్న శిక్ష గాక
ఇప్పటికే పది పదిహేనేండ్లు జైల్లో ఉన్నావనుకో
“ఒక జెండాలా ఉరితాడుకు ఊగులాడినా బాగుండు,” అని నువ్వు అనకూడదు.
నువ్వు ఖచ్చితంగా బతికి తీరాలి.

నిజమే! అది సంతోషాన్నిచ్చే విషయమేమీ కాదు,
అయినా శత్రువు మీద కసితో
ఇంకొక రోజు బతకడం
నీ బరువైన బాధ్యత.

నీలో కొంత భాగం బావి అడుగునున్న గొంతులా
లోపల ఒంటరిగా బతుకుతుండవచ్చు
కానీ మిగిలిన నీవు
బయట నలభై రోజుల దూరంలో ఆకు కదిలితే
లోపల నీవు వణికిపోయేంతగా
బయట ప్రపంచపు హడావిడిలో మమేకమైపోయి ఉండాలి
లోపల ఉత్తరాల కోసం వేచి చూస్తూ,
విషాద గీతాలు పాడుతూ,
పైకప్పును తదేకంగా చూస్తూ రాత్రంతా మేలుకోనుండడం తీయగా ఉన్నా ప్రమాదకరమైనది.

గడ్డం గీసి మళ్లీ గీసే మధ్యలో నీ ముఖాన్ని చూసుకోవాలి,
నీ వయసును మర్చిపోవాలి,
పేలు, వసంత రాత్రుల కోసం కనిపెట్టుకొని ఉండాలి,
ప్రతి చివరి రొట్టె ముక్కను వదలకుండా తినడం గుర్తు పెట్టుకోవాలి-
మనసారా నవ్వడం కూడా మర్చిపోకూడదు.

ఎవరికేం తెలుసు,
నువ్వు ప్రేమించే స్త్రీ నిన్ను ప్రేమించడం ఆపేయవచ్చు,
అదేమంత పెద్ద విషయం కాదులే అని కొట్టిపారేయకూడదు:
లోపలున్న మనిషికి అది పచ్చటి కొమ్మను విరిచేయడం లాంటిది.

లోపల గులాబీలు, తోటల గురించి ఆలోచించడం మంచిది కాదు,
సముద్రాలూ, పర్వతాల గురించి ఆలోచించడం మంచిది.
విరామం లేకుండా చదవాలి, రాయాలి,
అల్లడం, అద్దాలు తయారు చేయడం కూడా మంచిదని నా సలహా.
అంటే, లోపల పది, పదిహేను సంవత్సరాలో, ఇంకా ఎక్కువనో గడపలేవని కాదు-
నీ ఛాతిలో ఎడమ వైపు ఉన్న మణి, దాని మెరుపు కోల్పోనంతవరకూ
ఖచ్చితంగా గడపగలవు!

(తెలుగు: చైతన్య చెక్కిళ్ల)

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

3 thoughts on “కారాగారమే కదనరంగం

  1. నాజిమ్ హికమత్ గురించి చాలా గొప్ప పరిచయం ..ఇచ్చావు చైతన్యా… ఆయన జీవితం అధ్యయనం చేస్తుంటే జైల్లో ఉన్న కామ్రేడ్ వివి.,prof. gn. saibaba జ్ఞాపకానికి వచ్చారు.బతకడమంటే కవిత ఎంత స్ఫూర్తి దాయకంగా ఉందంటే ఇప్పటికి 4 సార్లు చదివాను.దేశద్రోహి కవిత ఎంత కాంటెంపరరీ గా ఉంది కదా….అంత నిర్బంధంలో అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా కానీ ప్రజల గురించి ఆలోచించడం మానలేదు నాజిమ్.దానికి సాక్ష్యం అతను జైలులో ఉన్నప్పుడు వెలువరించిన సాహిత్యమే.అభినందనలు చైతన్య

  2. చాలా విలువైన వ్యాస పరంపర. హిక్మత్ గురించి వివరంగా తెలియచేసారు. అనువాదాలు బాగున్నాయి. క్రితం సంవసరం మాస్కో వెళ్ళినప్పుడు హిక్మత్ సమాధిని దర్శించటం గొప్ప అనుభూతి నాకు. ఇప్పుదు మీ వ్యాసం ఆ అనుభూతిని గుర్తుకు తెచ్చింది.

  3. Excellent introduction about Nazim Hikmet.Madam Geetanjali and Mr. Aryan a Krishna aptly expressed their opinions about essay. ………..lopalunna Manishi ki adhi pachchati kommanu viricheyadam laantidhi. ….it is good expression….Neeku naa abhinandanalu

Leave a Reply