కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్

నేను కూడా నా చివరి క్షణాల పై నిలిచి
వెనక్కి తిరిగి చూసినప్పుడు
ఈ నిదురపట్టని రాత్రి రెండుగా చీలి
ఆ చీకటి ఇరుకు మధ్య ఎటూ కాకుండా
బిత్తరపోయి నిలబడి ఉంటాను

నేను నడిచిన దారులలో మైలు రాళ్ళయిన
దీప స్థంభాలైన నా సహచరులు
దుఖఃపు రాత్రులలో చేతిలో చేయి వేసి
నాకై అశ్రువొకటి రాల్చిన వాళ్ళు
మెల్లి మెల్లిగా శిధలమవుతున్న దృశ్యం
భయం కొల్పుతూ నా వెనువెంట నడిచి వస్తుంది

భుజాల చుట్టూ
చేతులు వేసి నడిచిన వాళ్ళు
ఎవరెవరి అకారణ ద్వేషాలకో
ఆగ్రహాలకో గురైన వాళ్ళు
వెలివేతలకు, అవమానాలకు
బాధలకు బలి అయిన వాళ్ళు
అవధులు లేని ప్రేమను పంచిన వాళ్ళు
నాదన్నది ఏదీ మిగుల్చుకోని వాళ్ళు
స్వప్న నక్షత్రాల్ని ఎక్కడెక్కడో వెతికి
దుస్సాహసంతో కోసుకు వచ్చి
నేలపై నాటిన వాళ్ళు
వాళ్ల కోసమో, మరెవరి కోసమో
రెండు నిమిషాల మౌనం పాటించాక
ఆ తరువాత మరింకేమీ లేకుండానే
సభ ముగిసి పోయిన
ఆ తరువాత…
ఏమి చేయాలో తోచక అట్లా
ఆ ప్రాంగణంలోనే కదలక
నిలబడి పోయిన తరువాత
నాతో సహా వాళ్ళంతా
ముసలి వాళ్లయి పోయాక
ఆ తరువాత…

నా కన్నా కొంచెం చిన్నవాళ్ళు
మరి కొంచెం పెద్దవాళ్ళు
నా సమ వయస్కులు
దిగులు కమ్ముకున్న
అలసిన మొఖాలతో
నుదిటిపైన ఎడతెగని
అపజయాల చారికలతో
క్షతగాత్ర హృదయాలతో
ఒకటి రెండు ఊడిన పండ్ల మధ్య
చిక్కుకున్న విషాదకర చిరునవ్వుతో
పాత వై, కీళ్లు విరిగిపోయిన
సంభాషణలకు తాళ్ళు బిగించి కట్టి
వాటిని ఈడ్చుకుంటూ ఎదురుపడతారు
లాల్ సలాం కామ్రేడ్స్ ,లాల్ సలాం అని
వాళ్ళని ఎరిగిన వాళ్ళు
ప్రేమగా పలకరిస్తారు
ఎప్పుడన్నా

కాలం ముగిసాక కూడా ఏవో సడలని
విశ్వాసాలు గాలిలో రెపరెప లాడుతుండగా
ఇరుకు వీధుల గుండా సాగే ఊరేగింపు
ఒకటి నా ముందు నుండి నడిచి వెడుతుంది
నా మొఖాన్ని సంచీలో వేసుకొని
కాళ్ళు ఈడ్చుకుంటూ కాస్త ఎడంగా
దాని వెనక నేనూ కూడా నడుస్తాను

అనేక రోగాలతో కృశించిన
మిత్రుల దేహల్లో
ఎక్కడో చిక్కుకున్న జీవితేచ్ఛ
నినాదమై నీరసంగా మూలుగుతుంది

భయం వేస్తోంది
మరణం కన్నా , మరణ ప్రయాణం
భయపెడుతోంది ఇప్పుడు

ఏ మైలురాయి కూలుతుందో
ఎవరు ఇక కనపడకుండా పోతారో
దిక్కుతోచని, తెలియనితనమేదో
బండరాయై వేలాడుతుంది నా మీద

గట్లను ఒరుసుకుంటూ పారే మృత్యునది
మెల్లిగా నా పాదాల్ని కూడా తడిపేసే
ఊపిరాడనితనం నన్ను కమ్ముకుంటుంది

మహా విలయ రంగస్థలం పై
ఒక్కొక్క అంకం ముగిసి పోయిన తరువాత
ఒక్కో యవనిక తొలిగిపోయిన తరువాత
పొగమేఘాలు కమ్ముకున్న
శూన్యాకాశం ఒకటి మిగిలి
ఉంటుంది నా కట్టెదుట

వాకర్ పై చేతుల
కదల లేని పాదాల
మాటలు పలుకలేని
వణికే పెదవుల
కామ్రేడ్స్ , కామ్రేడ్స్
మిమ్మల్ని కలిసినప్పుడు
వృక్షాల నుండి
పండుటాకులు
కన్నీళ్లయి రాలుతున్న
చప్పుడు వినబడుతుంది

దుఃఖపు నదుల్ని
చిలుకుతున్నది మనసు
ఈ వేళ

ఎవరో వున్నారు అనుకునే లేకపోవడాన్ని
ఎవరూ లేకున్నా వున్నారు అనుకోడాన్ని

ఒక దుఃఖ రహిత అభావాన్ని
అరువు తెచ్చుకుంటాను
కన్నీటి తడి అంటని తామరాకునై
సదా తేలిపోయే ప్రయాసలో అలసిపోతూ
ఆఖరి ప్రయాణాల వార్తలని
వినేందుకు తిరస్కరిస్తాను

ఎంతో భయం భయంగా
మరెంతో దిగులు దిగులుగా
ఉందీ క్షణాన
చీలిన ఈ రాత్రి మళ్లీ కలిసిపోయి
కాస్త వెన్నెల వస్తే బావుండును

పుట్టింది హైదరాబాద్. కవయిత్రి. కథా రచయిత్రి. ఉద్యమ కార్యకర్త. కవితా సంకలనాలు: 'అడవి ఉప్పొంగిన రాత్రి', 'మృగన'. కథా సంకలనం: 'కొన్ని నక్షత్రాలు... కాసిన్ని కన్నీళ్లు'

One thought on “కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్

  1. కదిలించే కవిత. “ఎంతో భయం భయంగా
    మరెంతో దిగులు దిగులుగా
    ఉందీ క్షణాన
    చీలిన ఈ రాత్రి మళ్లీ కలిసిపోయి
    కాస్త వెన్నెల వస్తే బావుండును” వెన్నెల వస్తుందనే ఆశిద్దాం

Leave a Reply