కాంతి కిరణం నెరుడా

పాబ్లో నెరుడా (1904-73) మధ్య చిలీ లోని పార్రల్ అనే చోట జన్మించాడు. అతని తండ్రి రైల్వే ఉద్యోగి కాగా , తల్లి ఒక స్కూల్ టీచర్ గా పనిచేశారు. పాబ్లో నెరుడా అసలు పేరు నేఫ్తాలీ రికార్డో రేయిస్ బసో ఆల్టో. తాను శాంటియాగో లోని ఇన్స్టిట్యూటో పెడగాజికోలో , తర్వాత యూనివర్సిటీ ఆఫ్ చిలీలో చదువుకున్నాడు. ఆయన తొలి కవితా సంపుటి ”క్రెపస్కులారియో” (సంధ్యా కాల) పై సింబలిజం, మోడర్నిజం ప్రభావాలున్నాయి. ఆయన ముఖ్య రచనల్లో ‘ట్వంటీ లవ్ పోయెమ్స్ మరియు ఏ సాంగ్ ఆఫ్ డిస్పైర్’, ‘రెసిడెన్స్ ఆన్ ఎర్త్’, ‘కాంటో జనరల్’, ‘వోడ్స్’, ‘వన్ హండ్రెడ్ లవ్ సానెట్స్’, ‘ఫుల్లీ ఎంపవర్డ్’, ‘మెమోయిర్స్’, ‘ప్యాషన్స్ అండ్ ఇంప్రెషన్స్’ మొదలగునవి ఉన్నాయి.

నెరుడా దృష్టిలో కవి వెలుగును వ్యాఖ్యానించే ప్రీస్ట్. కవి సృజనాత్మకత ఏదో దైవికమైనది కాకుండా కొంత వరకు ఇతరుల రచనల పఠనం వల్ల, బాహ్య పరిస్థితుల వల్ల వచ్చినది కావచ్చు. తన సోదర కవులు పాల్ ఎల్లార్డ్, మొదలగు వారి నిబద్ధత, విశ్వ జనీనతలను, క్వాసిమోడో యొక్క సౌందర్య భావన, విశ్వ జనీనతలని పొగిడాడు. వల్లేజో కవిత్వ స్వచ్ఛతను, తోటి నోబెల్ విజేత, వచనానికి, కవిత్వానికి మధ్య హద్దులు చెరిపిన గాబ్రియేల మిస్త్రల్ గొప్ప హృదిని కొనియాడాడు.గతంలో తగాదా పడిన రూబేను దారియో కోసం స్మారక చిహ్నం కట్టాలన్నాడు.

కళాకారుడికి స్వేచ్ఛ, మానవ గమ్యంలో పూర్తి విశ్వాసం ప్రకటించాడు. రచయిత ఆర్కిటిక్ ఖండంలో చేపలు పట్టే వానిలా సహనంతో నవ భావాల మీనులను పట్టాలని అభిప్రాయం వెలిబుచ్చాడు. “నాకు అందంతో ప్రేమ ఒప్పందం ఉంది/ నాకు నా జనంతో రక్త ఒప్పందం ఉంది” అని ఒక కవితలో రాసాడు. పాబ్లో నెరుడాకు కవిత అంటే తిరుగుబాటు. కవితా వస్తువు ఉన్నతమైనా, సాదా అయినా కావచ్చని, ఆధ్యాత్మిక ఒంటరితనం కోరే కవి చివరి దశలో ఉన్న పెట్టుబడిదారి విధాన రక్షకుడు అని అన్నాడు. తన సౌకర్యవంత జీవితం గురించి వాగిన వారిపై క్రోధంతో తన తర్వాత ఈస్లా నెగ్రా లోని ఇల్లు కార్మికులకు ఉండటానికి, సమావేశ మందిరంగా ఇస్తానని అదే తన “తియ్యని ప్రతీకారం” అని పలికాడు.

పాబ్లో నెరుడా కవులకు, కవిత్వానికి యుధ్ధ, నిరంకుశ, నిరాశా మయ కాలాల్లో సైతం గౌరవ స్థానం కల్పించాడు. ప్రకృతి, ప్రేమ, ఏకాంతం, అందం, యుద్ధం, మరణం మొదలగు అంశాలు జలపాతంలా పారే ఆయన కవితల్లో ప్రవహిస్తాయి. భిన్న జాతులు, సంస్కృతులు, రాజకీయాలు మధ్య చరించాడు

1948లో సెనేట్ లో “నేను నిందిస్తున్నా” అనే ఉపన్యాసం ఇచ్చినందుకు అరెస్టు ఉత్తర్వు జారీ అయింది. ఫలితంగా అజ్ఞాతంలోకి , గుర్రంపై ఎండీస్ పర్వతాలు దాటి అర్జెంటీనాకి వెళ్ళాడు. అక్కడ దేశ దిమ్మరిగా , నిర్వాసిత జనం గొంతుగా మారాడు.ఇలాన్ స్టావన్స్ రాసినట్లు 20 వ శతాబ్దిలో చారిత్రక సంఘటనలన్నీ తన కవిత్వంలో ప్రతిస్పందన పొందాయి.తన రచనల్లో నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధతలు గోచరిస్తాయి. ఆయన కవితలు పలు ప్రపంచ భాషల్లో అనువాదమయ్యాయి.తెలుగులో సైతం శ్రీ శ్రీ నుంచి ఎందరో ప్రగతిశీల కవులకు అభిమాన పాత్రుడు పాబ్లో నెరుడా. పాబ్లో నెరుడాను మార్క్వెజ్ నిజమైన, అన్ని భాషల్లో అత్యుత్తమ కవిగా పొగిడారు. తన రచనా వ్యాసంగానికి 1954 లో స్టాలిన్ శాంతి, 1971లో నోబెల్ బహుమతి పొందాడు.

“స్మృతులు” రాసే రచయిత గుర్తు పెట్టుకునేది, కవిగా గుర్తు పెట్టుకునేవి వేర్వేరుగా ఉంటాయి. మరపు వల్ల మదిలో కొన్ని ఖాళీలు. ఇండియా, శ్రీలంక, సింగపూర్ , రష్యా చైనా దేశాల్లో, స్పెయిన్, అర్జెంటీనా, మెక్సికోలలో , ఐరోపా దేశాల్లో పర్యటించాడు. నెరుడా కవిత్వంలో అంతర్గతంగా ఏముందో తెలుసుకొనేందుకు “స్మృతులు” పుస్తకం పనికి వస్తుంది. తాను తూర్పు దేశాల్లో ఉండగా రాసిన “రెసిడెన్స్ ఆన్ ఎర్త్” కవితల్లో హింసాత్మక , పరాయి దేశాల్లో తాను అనుభవించిన ఒంటరితనం గురించి ఉంది. ఇది తర్వాత తనలో అంతర్జాతీయ భావన బలపడేందుకు దారి తీసింది. తన కవిత్వంలో ఉద్వేగం, పోరాటం, ప్రేమ, మార్మికత, గానం, జయాపజయాలు అన్నీ ఉన్నాయి. స్పానిష్ భాష అతనికి బహుమతిగా దొరికింది. ఒక సారి తాను పెనాంగ్ నుంచి సైగాన్ బస్సులో ప్రయాణిస్తుండగా మధ్యలో అడవిలో ఆగి చావు భీతి కలిగింది.కానీ ఆయన కోసం ఒక సంగీత బృందం వచ్చి మనోల్లాసం కలుగచేసింది. జీవితం ఆయనకు అదృశ్య గౌరవం, కొత్తవారితో సౌభ్రాతృత్వం, చీకటిలో వికసించే సౌందర్యం గురించి విస్మరించలేని పాఠం నేర్పింది.

స్పానిష్ అంతరుద్ధం గురించి “ తే, తీసుకు రా దీపాన్ని/ చూడు తడిసిన పుడమిని/ చూడు మంటలు ఆరగించిన నల్లబడిన చిరు బొమిక ను/ హత్యకు గురైన స్పెయిన్ వస్త్రాన్ని” అని నెరుడా రాశాడు. మరో కవిత ” ధనికుల తప్పు వల్ల స్పెయిన్ పేద”. నెరుడా “సంప్రదాయం” అనే కవితలో దాని నైజం బయట ఇలా బయట పెట్టాడు: “దాని బోసి నోరు కొరికింది ప్రతి రాత్రి / పుట్టని పువ్వును/ రహస్య ఖనిజాన్ని/ తన పచ్చ ముళ్ళ కిరీటంతో సాగింది/ స్పష్టంగా లేని మృతుల ఎముకలు, కత్తుల్ని నాటుతూ.” ‘జరమా నది యుద్ధం’ కవితలో నది కాంతి, వైభవం వర్ణించనలవి కాదని,మృతుల గురించి “నీ ప్రజల శాశ్వత కనులు/ నీ తరాన్ని కాచుతుంటాయి” అని నెరుడా వాక్కు. అల్మీరియా కవితలో ధన స్వాముల రక్త పిపాస ను విమర్శించాడు.

‘మాడ్రిడ్’ (1937) మీద రాసిన మరో కవితలో తను ప్రేమించిన నగరంలో రొట్టె, కాంతి లేవని, కాలిన ఇళ్లపై పిచ్చుకలకు మారుగా యుగాల నిశ్శబ్దం, జీవం లేని , ఖాళీ తలుపులు తెరుచుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. ” విషాద నగరం, దెబ్బ తిని, గాయపడి/ విరిగి, ఓడి, తూటా గుర్తులతో , కప్పబడి/ రక్తం, గాజు ముక్కలతో, రాత్రి లేని నగరం / రాత్రి, నిశ్శబ్దం, పేలుళ్లు, వీరులు/ ఇప్పుడు చలి కాలంలో మరింత నగ్నంగా, మరింత వొంటరిగా ” ఇంకా మాడ్రిడ్ ను నాశనం చేసేందుకు ఏడాది నుంచి మూర్ లు, ద్రోహులు వచ్చారు.అజేయంగా ఉన్న నగరం దృఢంగా ఉంది. చివరగా రాసిన ” తెంచిన గులాబీలా వణుకుతూ/ అంతులేని కీర్తిలో కప్ప బడుతూ” మనల్ని కదిలిస్తాయి.

‘స్టాలిన్ గ్రాడ్ కోసం పాట’ కవితలో కవి రైతులను నావికులను ఉద్దేశించి మాట్లాడుతూ రష్యా కూడా గతంలో స్పెయిన్ లాగా ఒంటరితనంలో , దుర్మార్గ దాడులకు గురి అవుతోందని, లాటిన్ అమెరికా రష్యాకు మద్దతు ఇస్తోందని , స్టాలిన్ గ్రాడ్ కు మరణం లేదని చెబుతుంది.

రాత్రి నిద్రించిన రైతు అత్యంత స్వచ్ఛమైన చేతులు నగర గౌరవాన్ని కాచుతున్నాయా అని, వీరుల రక్తం విశాల నిశలో తన పై పడటం భూమి వింటుందా , ఆకాశం పైనే ఉందా అని ఉదయారుణ కాంతిని అడుగుతాడు. నావికుడి గుండెల్లో అరుణ తార.అతని కన్నుల్లో తారలు.చేతులతో అరుణ తారను తాకాలని చూస్తున్నాడు. “ రాత్రి కంపించనీ నీ కనుల నల్లని కాంతిలో/ కత్తుల గోళం వెనకాల”

మాడ్రిడ్ అడుగుతోంది: ‘‘సోదరీ, కీర్తిమంత రాజధాని, ప్రతిఘటించు’’ అని. కాల్చబడబోయే స్పానియార్డ్ అడుగుతున్నాడు “స్టాలిన్ గ్రాడ్ బ్రతికే ఉందా’’ అని. స్పెయిన్ తన లాంటి వీరులకు జన్మ నిస్తున్నపుడు దాని కోసం తన హృదయం అంకితం చేసింది స్టాలిన్ గ్రాడ్ . స్పెయిన్ కి తెలుసు స్టాలిన్ గ్రాడ్ ఒంటరితనం. పారిస్, లండన్ తమ ఇంటి సొగసులు చూసుకుంటూ , న్యూయార్క్ నృత్యాలు చేస్తున్నపుడు , రెండవ ఫ్రంట్ తెరవనపుడు నేరాల , విషపు తేళ్లు స్టాలిన్ గ్రాడ్ గుండె చీల్చాలని పరిగెడుతున్నపుడు కవి గుండె మండింది. చివరకు చూస్తూ ఉన్న వారి పని అవుతుందని హెచ్చరించింది. దూరంగా ఉన్న లక్షలాది మెక్సికన్లు, పెటగోనియన్లు, గ్యారనీలు, ఉరుగ్వేనియన్లు, చిలియన్లు , నౌకా భగ్నమైన ఇండియన్లు వచ్చి ఆత్రంగా ఉన్న తనయుల ముద్దులా నగర గోడల్ని స్పర్శిస్తారని, ఎంతో ఉద్వేగంతో ” స్టాలిన్ గ్రాడ్, ఇంకా లేదు రెండో యుద్ధ రంగం/ కానీ నీవు కూలిపోవు/ ఆయుధాలు, నిప్పు / తూట్లు పొడిచినా నిన్ను రేయింబవళ్లు / నీవు చనిపోయినా, నీకు లేదు చావు” అంటూ ఇంకా ‘‘నీ చేతులు రాలితే, ఇతర ఎర్ర చేతులు/ జగమంతా నాటుతాయి నీ వీరుల ఎముకలు/ నీ విత్తనాలు భూమంతా నిండేందుకు’’ రాశాడు.

తన కవితా పఠనంతో శాంటియాగో లోని వేగా సెంట్రల్ లో శ్రామిక జనాన్ని ముగ్ధుల్ని చేశాడు. ఇటాలియన్ కామ్రేడ్ టీనా మోడోటీ కి వ్యతిరేకంగా శత్రువులు వ్యాప్తి చేసిన పుకార్లు మాయమయ్యాయి. తన కామ్రేడ్ సోదరి మృతికి విచారిస్తూ ” నేను తీసుకునిపోతా నా దేశానికి వారు నిను స్పర్శించకుండా ఉండేందుకు/ నా మంచు దేశానికి/ నీ నిర్మలత్వం హంతకుడు, నక్క, జూడాస్ లకు దూరంగా ఉండేందుకు/ అక్కడ వుంటావు నీవు శాంతిలో” రాశాడు.

“స్మృతులు” పుస్తకంలో అద్భుతమైన వర్ణన లున్నాయి.వల్పరైసో నగర కొండలపై పేదరికం జలపాతంలా పారుతుంది అని, ఒక్కో సారి నగరం గాయపడిన తిమింగలంలా కదులుతుందని, గాల్లో ఎగిరి, బాధపడి , మరణించి, తిరిగి జీవిస్తుందని చెప్పాడు.

క్యూబా విప్లవాన్ని సమర్థించి, అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం వైపు నిలబడ్డాడు. వియత్నాం లో అమెరికా పైశాచిక దాడిలో ఒక కుటుంబం మొత్తం ముద్దగా దహనం అయిన ఘటన గురించి ఇలా రాశాడు. “వారి చావులో నీ చావును చూడు/ ఏలన వాళ్ళు నీ వెంటా పడతారు/ వారు నీకు తెచ్చే విధి అలాంటి మట్టే.” అంతర్జాతీయ భావంతో చిలీ, పెరూల మధ్య తగాదా మరిచి పెరూ దేశం ఇచ్చిన గౌరవాన్ని స్వీకరించాడు.

‘జ్ఞాపకం’ అనే కవితలో నన్ను అడగొద్దు/ నా కల పేరు లేదా తేదీని/ నే కొలవలేను/ ఈ దేశం చేరని రహదారిని/ లేదా మారే సత్యాన్ని / లేదా పగలు ఆగి/ చీకటిలో మిణుగురులా / తిరుగాడే వెలుగుగా మారేందుకు.”
పాత వ్యవస్థ కమ్యూనిజాన్ని తప్ప ఏ చెడు నైనా సహిస్తుంది అని వ్యంగ్యంగా పలికాడు. లాటిన్ అమెరికా విముక్తి వీరులైన సైమన్ బోలివార్, శాన్ మార్టిన్ లను కొనియాడాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ ను “రష్యన్ విప్లవ మహా రక్షకుడు” అని పొగిడాడు.

నెరుడా చైతన్యవంతుడైన కవి. అవసరమైనపుడు ఎవరినైనా తగిన విమర్శ చేశాడు.తర్వాత కాలంలో స్టాలిన్ ఆరాధన వల్ల కలిగిన ఫలితాలను తెలిసిన మూలాన చైనాలో మావో ఆరాధనను వ్యతిరేకించాడు. వ్యక్తిగత ఇబ్బందులున్నా తనతో పర్యటించిన టింగ్ లింగ్, ఐ చింగ్గ్ అనే చైనా రచయితల నోరు మూయటాన్ని తన మెమోయిర్స్ లో విమర్శించాడు.

సాల్వడో అయిండే కోసం అధ్యక్ష పదవి పోటీ నుంచి విరమించాడు. రాగి గనుల జాతీయానికి అయిండే యత్నాన్ని చిలీ సార్వభౌమాధికారం కాపాడే గొప్ప విజయం అని కొనియాడాడు. ఎడ్వర్డో గాలియానో తన “ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా” పుస్తకంలో నాటి పరిస్థితి వివరించారు. 1888 బ్రిటీష్ వారు చిలీ అధ్యక్షుడు బాల్మసేడ ను నైట్రేట్ ప్రాంతాలను జాతీయం చేస్తానని ప్రకటించిన పిదప అంతర్యుద్ధంలో ముంచి పదవీచ్యుతుని చేశారు. 1929 నుంచి దాదాపు యాభై ఏళ్లలో రాగి గనుల నుంచి ప్రవేటు కంపెనీలు అనకొండ, కేన్నికాట్ 4 బిలియన్ డాలర్లను అమెరికాకు పంపాయి. అక్కడి లాభాల్లోనుంచే కేవలం 800 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాయి. 1945 నుంచి రాగి ఉత్పత్తి 30 శాతం పెరిగినా , గని కార్మికుల సంఖ్య ⅓ వంతు దాకా తగ్గింది. 1973లో రాగి గనుల జాతీయం అని ప్రకటించగానే సోవియెట్ దురాక్రమణ జరగనున్నట్లు విష ప్రచారం చేశారు.

అగస్టో పినోఛే సైనిక తిరుగుబాటులో అల్లెండీ సామ్యవాద ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సైనిక పాలనలో జనం చిత్ర హింసలు, కిడ్నాప్ లు, హత్యలు, ప్రవాసాలు పెరిగాయి. నియంతృత్వ పాలనలో జాతీయ పరిశ్రమల్లో సగం మళ్ళీ పాత యాజమానుల పరం కావడం, పౌర హక్కులు మృగ్యం కావడం జరిగింది. లాటిన్ అమెరికా దేశాలు బడుగు దేశాలుగా మిగిలిపోవడం అనేది అమెరికా లాంటి బాహ్య దేశాల అభివృద్ధి ఫలితమే. అమెరికా చేష్టలను ఖండిస్తూ “వాడు వియత్నాంలో ఓడాడు ప్రతి రోజూ/ క్యూబాలో వాడి కోపం జావకారింది/ ఇప్పుడు పూడ్చివేయబడిన సంజె లో/ ఈ చిట్టెలుక చిలీని కొరుకుదామని అనుకుంటున్నాడు/ సామాన్య చిలియన్ జనం/ వాడికి గౌరవం అంటే పాఠం నేర్పనున్నారని తెలియక.”

సాల్వడో అయిండే ప్రభుత్వం కూలిన పదకొండు రోజులకు 23 సెప్టెంబర్ 1973న పాబ్లో నెరుడా కేన్సర్ తో మృతి చెందిన తర్వాత ప్రజాస్వామ్య వ్యతిరేక దుండగులు వల్పరైసో, ఈస్లా నెగ్రాల లోని ఆయన ఇళ్లలో బడి విధ్వంసం చేశారు. తన “నాతో రా” కవితలో చిలీ కోసం, నీలి సర్వ సత్తాకత కోసం, బెస్తవారి సాగరం, రాగి కోసం, పిల్లల రొట్టె, దేశీయుల కోసం, ప్రతి భూమిలోని విద్యార్థుల, నావికుల, సైనికుల కోసం, మొక్కలు, వెలుగు రాస్తాల కోసం, ఉదయారుణ పతాకాల విముక్తి ఇచ్ఛ కోసం నిలిచిన పాబ్లో నెరుడా “ నా పక్కన నిలిచి పోరాడు/ నే నిస్తా నా కవితా ఆయుధాలన్నీ” అని రాశాడు.

Leave a Reply