1. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి..
మాది జడ్చర్ల పట్టణానికి వలస వచ్చిన కుటుంబం. మా పూర్వీకులు జడ్చర్లకు సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇప్పటూరు అనే గ్రామంలో ఉండేవారట. మేము ఇప్పటూరునుండి వచ్చాం కాబట్టి మమ్మల్ని అందరూ… ”ఇప్పటూరోళ్ళు” అని పిలిచేవాళ్ళు. నాకు మా తాత తెలవదు. నాకు తెలిసిందల్లా మానాయనమ్మే. అందరూ ఆమెను ”ఇప్పటూరునాగమ్మ” అని పిలిచేవాళ్ళు. మాది రెక్కల కష్టంమీద బతికిన కుటుంబం. మా పెదనాయన మార్కెట్లో హమాలీగా పనిచేసేవాడు. మా పెద్దమ్మ కోమటోళ్ల ఇండ్లలో పనిచేసేది.
మా నాయన ఇప్పటూరు లక్ష్మయ్య. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయనకాపుదనం జీతగాడు. ఆయనకు అప్పట్లో (1960) సంవత్సరానికి ₹200 (రెండు వందలు) ఇచ్చేవాళ్ళు. బోనస్ గా సంవత్సరానికి ఒక చెప్పులు జత, గొంగడి ఇచ్చేవాళ్ళు. తర్వాత మా నాయన కౌలుకు వ్యవసాయం చేయడం, ఇటుక బండి కొట్టడం లాంటివి చేశాడు. కొంతకాలం పుట్నాలబట్టీ మీద పనిజేశాడు. నాకు రెక్కలు వొచ్చినప్పటి నుండి మా నాయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడిని. మట్టి పని, కూలిపని, అడవి నుండి కట్టెలు తేవడం, బర్లను గాయడం…ఇలా అన్నీ చేసే వాడిని.
మా అమ్మ ఇప్పటూరు కిష్టమ్మ. కోమటోళ్ల ఇండ్లల్ల, బలిజ వాళ్ళ ఇండ్లల్ల పని చేసేది. ఆమెకు అంత కలిపి నెలకు 12 రూపాయలు దొరికేవి. అప్పుడప్పుడు ఆముదపు గానుగ మీద పనిచేసేది. ఒకరోజు పని చేస్తే ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు కోమటోళ్ల ఇండ్లలో మిగిలిన అన్నం కూరలు మా ఆకలి కడుపులకు అక్కరకు వచ్చేవి.
నేను పనిమనిషి కొడుకును కావడంతో ఒక విధమైన గిల్టీ కాంప్లెక్స్ నన్ను వెంటాడుతుండేది. అది చాలాకాలం దాకా నన్ను వదలలేదు. it was a chronic disease. మా క్లాస్మేట్స్ కూడా అలాగే ప్రవర్తించేవాళ్ళు.
నాది
బాల్యం లేని బాల్యం
ఎడారిలో శిథిల శిల్పం
పువ్వు తొలిచిన పుష్పం.
పోతే మా ఇంట్లో ఎక్కువగా మా నాయన కన్నా మా అమ్మ మాట ఎక్కువగా చెల్లుబాటు అయ్యేది. అందరికన్నా మా నాయనమ్మ మాట శాసనంగా నడిచేది. she was the don of our family.
2. మీరెందుకు రాస్తున్నారు?
ఎందుకు రాస్తున్నారు? అని అడుగుతుంటే… ఎందుకు శ్వాసి స్తున్నారు…? అని అడిగినట్టుగా ఉంది. రాయడం నా శ్వాస, నా ధ్యాస.
ప్రముఖ నటుడు నానాపటేకర్ ను “మీరు నటుడు కాకపోతే ఏమయ్యేవారు?” అని ఓ జర్నలిస్టు అడిగితే… ఆయన తడుముకోకుండా “మై పాగల్ బన్ థాథా… (నేను పిచ్చివాడిని అయ్యేటోడిని)”అని జవాబు ఇచ్చాడట. నా పరిస్థితి అంతే. I cannot live without writing.
బహుశా సున్నిత మనస్తత్వం, భరించలేని పేదరికం, విపరీతమైన వొత్తిళ్ళు, దహించే అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా కారణమయ్యాయేమో…
రాయటమైతే మొదలెట్టాను గాని, రాయడానికి ప్రోత్సహించినవాళ్లు ఎవరూ లేరు. మా ఇంటా వంటా సాహిత్యపు వాసన మచ్చుకైనా లేదు. మా ఇంట్లో వాళ్లకి మా చుట్టాలకు చదువు అన్నది లేదు. మా టీచర్లకు మా క్లాస్మేట్లకు నేనొక అమాయక చక్రవర్తిని (ఎర్రిపాసుని). వాళ్లకు నాలో రాయాలని ఒక instinct ఉన్న సంగతి తెలియదు. చాలా కాలం దాకా నాకే తెలియదు. కానీ బాగా చదివేవాడిని. వయసుకు మించి చదివే వాడిని.
3. మీకు సాహిత్యం ఎట్లా పరిచయమైంది?
ఏం చెప్పనూ… అందరూ వాళ్ళ తాత, అమ్మమ్మ, నాయనమ్మల గురించి, వాళ్లు చెప్పే కథలు, పాటల గురించి చెప్పి వాళ్ళ ప్రభావం తమ మీద ఉందంటారు. నాకు అలాంటివి ఏమి లేవు. నాకు ఊహ తెలిసిన సమయంలో, మా ఇంటి పక్కన గల గుడ్డి సత్యమ్మ చిన్ని(పుట్టుకతో గుడ్డిది) ఇసుర్రాయి కాడ పాడిన జానపద పాటలే నాకు తెలిసిన మొదటి సాహిత్యం.
“బసువని బసువో
చూడవోదము రారో..
ముంగట మునులట
ఎనుక చారులట
చూడవోదము రారో…” ఇట్లా ఆమె పాడుతుంటే నేను కూడా ఇసుర్రా యి విసురుతూ పాటలో గొంతు కలిపేవాడిని. ఆ తర్వాత హనుమాన్ దేవాలయంలో భక్తి పాటలు, చిరుతల పాటలు పాడుతుంటే నేను కోరస్ కలిపేవాడిని. అయినా పొద్దంతా కష్టం చేసి కడుపాకలికి ఇంత తిని పడుకునే వాళ్ళకి సాహిత్యం ఎక్కడిది? మా ఊళ్లో జవహర్ గ్రంథాలయం అని ఒక లైబ్రరీ ఉండేది. బడి అయినాక సమయం దొరికితే సాయంత్రం పూట పోయి అక్కడున్న పేపర్లు మ్యాగజైన్లు తిరిగేసేవాన్ని. నాతో పాటు నా మిత్రుడు నరసింహులు కూడా లైబ్రరీకి వచ్చేవాడు. నాకెవరు చెప్పలేదు గానీ, మొక్క సూర్య కాంతి వైపు వాకినట్లు నేను అట్లా అక్షరం వైపు నడిచాను.
అప్పట్లో జడ్చర్ల బస్సు స్టాండ్ లో ఒక డబ్బాలో పుస్తకాన్ని ఒక రోజుకు పది పైసల చొప్పున అద్దెకిచ్చేవారు. చెంఘిజ్ ఖాన్, ఆచార్య చాణిక్యతోబాటు ఇతర డిటెక్టివ్ నవలలు అక్కడ్నుంచి తెచ్చుకొని చదివినవే. మీరు నమ్ముతారో లేదో గాని నేను బర్ల కాడికి పోయేటప్పుడు “ఒక భుజం మీద గోనెసంచి, ఒక చేతిలో పుస్తకం”తో ఉండేవాడిని. మిగితా పసుల కాడి పిల్లలు ఆటలాడుకుంటుంటే, నేను కాలువబడ్డున కూర్చుని ఆ నవలలు చదివేవాడిని. నా చదువును డిస్టర్బ్ చేయకుండా నన్ను చదువుకోనిచ్చిన మా బర్రె తల్లులకు ఎప్పటికీ కృతజ్ఞుడిని.
ఆ తర్వాత జడ్చర్ల డిగ్రీ కాలేజీకి వచ్చాక విస్తృత సాహిత్యం పరిచయమైంది. చలం గారు పరిచయమైంది అప్పుడే. ఆ కాలేజీలో ప్రభాకర్ మూర్తి అనే ఒక లైబ్రేరియన్ ఉండేవాడు. ఆయన నాకు పుస్తకాలు ఇవ్వడానికి బాగా విసుక్కునేవాడు. బహుశా నా పేదరికం, కులం కూడా కారణంగా వచ్చు. ఆయన నాకు పుస్తకాలు ఇవ్వడం ఒక దాతృత్వం లాగా భావించేవాడు. కొన్నిసార్లు పుస్తకాల కోసం మస్కాగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన అవమానకరంగా మాట్లాడితే మౌనంగా భరించిన సందర్భాలున్నయి.
ఒక పుస్తకం తీసుకుపోయి వేగంగా చదివేసి మరో పుస్తకం అడిగేవాడిని. ఆయన బాగా విసుక్కు ని. “ఏమయ్యా… పుస్తకం చదువుతున్నావా? పేజీలు తిరిగేస్తున్నావా?” అనేవాడు.
ఇంగ్లీష్ సాహిత్యం, తెలుగు సాహిత్యం విస్తృతంగా పరిచయమైంది అక్కడే. మా ఇంటి దగ్గర ఉన్న దశరథం సారు నన్ను”పుస్తకాల పురుగు” అని పిలిచేవాడు.
4. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన రచయితలు, కవులు ఎవరు ? ఏయే అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి?
చలం, శ్రీ శ్రీ, మహా శ్వేతాదేవి, మంటో, అలిశెట్టి ప్రభాకర్, బుచ్చిబాబు, వరవరరావు, శివారెడ్డి, కారా మాస్టర్, రావి శాస్త్రి, ఇస్మత్ చుక్తాయి, థామస్ హార్డీ, సోమ ర్సెట్ మామ్, చెహోవ్ ఇంకా చాలా ఉన్నారు. లిస్టు పెద్దదవుతుంది.
మొదట చలం గురించి చెప్పాలి. నన్ను”లాలించి ఊహించి శాసించి చీల్చి చెండాడిన”మనిషి ఆయన. ఆ వేగం, ఆ కోపం, ఆసౌకుమార్యం, పొట్టి వా క్యాలు, ఛండ ప్రచండ భావావేషాలు….అలా మొదట తనతో నడిపించుకుని వెళ్ళాడు. తర్వాత నేనే ఇష్టంతో తన వెంట నడిచాను. ఇంగ్లీషు కలిపి పొట్టి పొట్టి వాక్యాలతో లోతైన భావాలు చెప్పడం ఆయనకు ఆయనే సాటి. నేను వచనం రాస్తుంటే అప్రయత్నంగా నా చేతిలో నుండి తాను తీసుకొని రాస్తున్నాడేమో అనేటంత ప్రభావం.
అప్పట్లో చాలామందిని చదివాను. జ్ఞానం వచ్చింది కానీ కదలిక తెచ్చింది మాత్రం చెలమే.
వరవరరావు జడ్చర్ల డిగ్రీ కాలేజీలో మాకు తెలుగు చెప్పినాడు. పాఠం చెబుతుంటే క్లాస్ అంతా భావోద్వేగంతో ఊగి పోయేది. ఆయన పుస్తకాలు నా చేతిలోకి వచ్చాక ఒంట్లో చలి మాయమైంది. ఆ ధైర్యం, ఆ అధికారం, ఆ సూటిదనం ఇది కదా కవిత్వం అనిపించేది. గుంటూరు నుండి ఓ ముస్లిం మిత్రుడు ఫోన్ చేసి “మీ మీద శివారెడ్డి కన్నా వరవరరావు ప్రభావమే ఎక్కువ ఉందని” చెప్పుకొచ్చాడు. మనకు తెలువకుండా అంతర్లీనంగా ప్రభావితం చేస్తారేమో.
అలిశెట్టి ప్రభాకర్ ఫైర్ నన్ను తాకింది. ఆశ్చర్యంతో నోరేళ్లబెట్టేలా, పదాలలో తుపాకీ మందు దట్టించి పేలుస్తాడు. నేనెవరైనా కొత్తగా రాస్తున్న వాళ్ళకి సలహా ఇవ్వాల్సి వస్తే అలిశెట్టిని తప్పక చదవమంటారు. one of the greatest poets of the world. అలిశెట్టిని చదవని కవి, ప్రభావితం కాని కవి నా దృష్టిలో ఒక జడ పదార్థం.
కారా మాస్టర్ కథ చెప్పే విధానం బాగా ఇష్టం. మామూలుగానే మొదలయ్యే కథ పోయినాకొద్ది పొరలు పొరలుగా విప్పదీస్తూ అసలు విషయాన్ని చెబుతాడు. రచయిత ఎక్కడ జోక్యం చేసుకోకుండా జీవిత పార్శ్వాలనుసెల్యులాయిడ్ మీద చూయించినట్టు చూస్తాడు. నేను కథల రాస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ముగింపులు కుదరకపోతే ఆయనకథల్ని చదువుతాను. కొన్నిసార్లు డైలాగులు ఎట్లా రాయాలో ఆయన కథలు చదివి నా కథనానికి పదును పెట్టుకున్నాను.
మహా శ్వేతాదేవి మహోన్నత శిఖరం. రచయితల్లో ఒకే ఒక్క పేరు చెప్పమంటే నేను ఆమె పేరును చెబుతాను. విషయంఎంత గొప్పదో దానికి తగ్గ శైలి కూడా అట్లే ఉంటుంది.”బషాయిటుడు” నవల చదివి అడవి గురించి పూసగుచ్చినట్టు చెబుతుంటే,ఈమె చాలాకాలం అడవిలో బతికిందేమో అనిపిస్తది. ఆదివాసుల గురించి ఇంత విస్తృతంగా ఇంత లోతుగా రాసిన రచయితగాని లేదా రచయిత్రి గాని లేరేమో. కాలేజీ చదివే రోజులలో థామస్ హార్డీ నవలలు ఇష్టంగా చదివేవాడిని. జీవితంలో గల విషాదాన్ని చెప్పడంలో ఆయనకు ఆయనేసాటి. చదవడానికి సులభ శైలి లో ఉండి కథకుడు తన వెంట పాఠకుడిని తీసుకెళ్తాడు.
5. ఏయే రచనలతో ప్రభావితమయ్యారు?
చలం ప్రేమలేఖలు నన్ను బలంగా తాకిన రచన. “ప్రతి ప్రేమికుడు పరమ లోభిలా తన ప్రేమను దాచుకొని సరైన వ్యక్తి దొరికినప్పుడు తన ప్రేమను అంతా ధారబోయాలి” అనే వాక్యం నన్నెప్పుడూ వెంటాడుతది. ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి అందులో.
శ్రీశ్రీకి ముందుమాట రాసి ఇచ్చిన… ”యోగ్యతాపత్రం”.. ఎంత విలువైనదో. దానిలో చాలా వాక్యాలు సాహిత్యంలో కొటేషన్లుగా పదేపదే ఉదాహరించబడ్డాయి . మ్యూజిక్స్ కొన్నిసార్లు సాగదీసినట్టు అనిపించినా బాగా ఇష్టంగా చదివాను.
కాలేజీ చదివే రోజుల్లో బుచ్చిబాబు నవల “చివరకు మిగిలేది” ఎన్ని సార్లు చదివానో. అందులో అమృతం పాత్ర భలే ఇష్టం. అది ఒక కల్పిత పాత్ర అయినా దాన్ని ఓ సజీవమైన మనిషిగా ఉంచుకొని అట్లాంటి మనిషి జీవితంలోకి రావాలని కలలు అనేవాడిని. మరో పాత్ర కోమలి ఉన్నా నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు. తర్వాత మూగమనసులు సినిమా చూసి సావిత్రి జమునలతో వాళ్లను పోల్చుకొనివాడిని.
ఎన్.కె. “లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం” (దీర్ఘ కవిత )బాగా ఇష్టం. ఆయన గద్వాల విరసం సభలో ఆ కవిత చదువుతుంటే సభ మొత్తం సమ్మోహ నమై విన్నది. ఆ వస్తువు, ఆయన చదివే విధానం రెండు పోటీపడి నడిచాయి. ఆయన కవిత ముగించగానే సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభికుల కోరిక మేరకు మళ్ళీ చదివాడాయన. అదే ఫైర్. నా జీవితంలో అట్లాంటి ఒక దీర్ఘ కవితను రాయాలనుకున్న. కానీ, కానికుదరలేదు.
రంగనాయకమ్మ ”స్వీట్ హోమ్” బాగా నచ్చింది. ఏ రచన అయినా అంతా ease తో రాయాలనుకునేవాడిని.
మహాశ్వే తాదేవి “బషాయిటుడు” ఒక అద్భుతం. చూడడానికి అది పౌరాణికాన్ని తలపించినా (కథానాయకుడు బషాయిటుడు చనిపోయినా కొద్ది మళ్లీ మళ్లీ పుట్టుకొస్తుంటాడు) పోరాటం ఆగదని ఒకచోట ఆగిపోతే మరొకచోట కొనసాగుతుందని సూచించడం బాగా నచ్చింది.
విసుగు రానీయకుండా పాత్రల ద్వారా జరుగుతున్న చరిత్ర చెప్పడం బాగుంటది. కొన్నిసార్లు నా కథల్లో పాత్రలచేత జరిగిన కథని చెప్పించే ప్రయత్నం దీనివల్లే జరిగిందేమో అనిపిస్తుంది. రచయిత తనకు తానే చెప్పకుండా పాత్రల ద్వారా చెప్పిస్తే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. రచయిత చెబితే కథ డాక్యుమెంటరీ అవుతుంది. పాత్ర ద్వారా నడిపిస్తే అది మంచి సినిమా అవుతుంది.
కారా మాస్టర్ ”చావు” కథ చాలాసార్లు చదువుకున్నాను. అందరూ ”యజ్ఞం” కథ గొప్పదంటరు గాని నాకు ఇదే గొప్పది. కథ ముగింపు ఎంత గొప్పగా చెప్తాడో. కట్టెలు మండుతుంటే వాళ్ళ భయాలని నీడల్లా తొలగిపోయి ముఖమంతా ప్రకాశమాన ఉందంటాడు. నా “ఊట” కథకు ఇట్లాంటి ముగింపునే ఇచ్చాను. వరవర రావు “డాఝావు”, “కసాయివాడు”; తుమ్మేటి రఘోత్తం రెడ్డి ”చావు విందు”, ”పనిపిల్ల”; అల్లం రాజయ్య “అతడు”; డికెన్స్” రెండు నగరాల కథ”, అలెక్సి హేలీ “ఏడు తరాలు”, మంటో కథలు, ఇస్మత్ చుగ్తాయికథలు… ఇవన్నీ నేను కథ రాస్తున్నప్పుడో లేదా కవిత రాస్తున్నప్పుడో ఎక్కడో ఓచోట అంతర్లీనంగా ప్రభావితం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి.
6. మీ తొలి రచన ఏది? దానికి ప్రేరణ నేపథ్యం ఏమిటి?
ఒక ముస్లిం మిత్రునికి ఓ కవిత రాసి పెళ్లి మండపంలో చూపించాను. అతనికి అర్థం కానట్టుంది. బాగుందని చెప్పి తిరిగి నాకే ఇచ్చేశాడు. నిరాశ పడ్డాను.
అప్పట్లో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో మాలతీ చందూర్ ‘ప్రశ్నలు – జవాబులు’ శీర్షిక వార వారం నడిచేది. దానికి నేను ‘ఆత్మ – పరమాత్మ’లకు సంబంధించిన ఓ ప్రశ్న ఏదో రాసి పంపాను. ఆ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రభ మేగజైన్లో అచ్చయింది. అది రచననో కాదో తెలియదు గాని నా అక్షరాలని మొట్టమొదటిసారిగా అచ్చులో చూసుకుని చిన్నపిల్లాడిలా మురిసిపోయాను.
పోతే నా తొలి రచన అని ఆత్మవిశ్వాసంతో చెప్పుకోగలిగేది ‘ఆమె పాట’ అనే కవిత. మా ఇంటి దగ్గర బచ్చమ్మ అని ఒక కోడలు ఉండేది. ఆమెను వాళ్ళ అత్త రాచిరంపాన పెడుతుండేది. గొడ్డు చాకిరి చేయించుకుని చాలీచాలని తిండిపెట్టి కడుపుమాడ్చేది. పెంక మీద రొట్టెలు చేస్తూ అత్త లేకుండా చూసి ఉడుకుడుకు రొట్టెను గబగబా తినేసేదట… మా అమ్మ చెప్తుండేది. ఆమెది అద్భుతమైన కంఠం. బహుశా తన కష్టాల్ని మర్చిపోవడానికి ఏమో పాటలు పాడుకుంటూ ఉండేది. బతుకమ్మ పాటల సందర్భంగా గుంఫు మధ్యలో నిలబడి ఆమె పాడుతుంటే చుట్టూ జనం లయబద్ధంగా తిరుగుతూ పాడేవాళ్లు. ఆమెను ప్రేరణగా తీసుకొని ‘ఆమె పాట’ అనే కవిత రాశాను. అది అప్పట్లో మా కాలేజీ మ్యాగజైన్ ‘ఆరోరా’లో అచ్చయింది. దాన్నిచూసి మా తెలుగు లెక్చరర్ విద్యాసాగర్ రావు( నోటి నిండా పాన్ వేసుకునేవాడు )నన్ను పిలిచి…,” ఏమోయ్ నీ కవిత బాగుంది. అది చూస్తే వర్డ్స్ వర్త్. ‘సాలిటరీ రిపేర్’ గుర్తుకొచ్చిందో య్” అన్నాడాయన మెచ్చుకోలుగా. అప్పట్లో నాకది ఆస్కార్డ్ అవార్డుతో సమానం. చిత్రమేమంటే నేను ఆమె మీద రాసిన కవిత ఆమెకు చనిపోయిందాకా చెప్పనేలేదు. ఆమె పిల్లలకు తెలవదు. ఆ కవిత నేను భద్రపరచుకోలేక పోయాను.
7. విరసంలో ఎప్పుడు చేరారు?
1984లో జనవరిలో చిత్తూరు విరసం సభలో నన్ను సభ్యునిగా చేర్పించారు. ఆ సభకు రాఘవాచారి, ఇక్బాల్, ఉదయ్ లు హాజరై నా పేరు ప్రపోజ్ చేశారు. తిరిగి వచ్చాక నాకు ఆ విషయం చెబితే, ఇదేదో బాగుందని సరే అన్నా.
8. విరసంలో ఎందుకు చేరాలనిపించింది?
రాసుకుంటూ పోవడమే నా పని. అప్పటికే నా కవితలు ఉపాధ్యాయ మ్యాగజైన్, అరుణ తారలో అచ్చవు తున్నాయి. ఒక రకమైన స్వింగ్ లో ఉన్నాను. అప్పట్లో విరసం అంటే పెద్దగా తెలవదు. “పెద్ద సంస్థ. విప్లవం గురించి చెబుతుంది. అన్నింటికన్నా మా గురువు వరవరరావు సారు ఉన్నాడు. బాగానే ఉంటది.”ఇట్లా అనుకున్నా. మంచి సాహిత్యాన్ని, విప్లవ కర సాహిత్యాన్ని వడగట్టి ప్రసరిస్తారని అట్లాంటి వాళ్ళ మధ్యన నా సాహిత్యాన్ని నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని లీలగా అనుకున్నట్టు గుర్తు. అందువల్ల చేరిక నాకు అభ్యంతరకరం అనిపించలేదు.
9. విరసంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు/రచయితలు ఎవరు? వాళ్లంటే ఎందుకు ఇష్టం?
వివి గారు బాగా ప్రభావితం చేశారు. అసలు వివి ఉన్నందుకే నేను విరసంలో చేరానేమో. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో చదివేటప్పుడు ఆయన రాసిన “ఫర్మాన” అనే కవితను విని షాక్ కు గురయ్యా. అది సూటిగా బాణం వేసినట్టుగా ఉండింది. కవితలు ఇంత సూటిగా ఉంటాయా అనిపించింది. ఆ రోజున డిగ్రీ కాలేజీలో జరిగిన కవి సమ్మేళనంలో వివి కవిత ఒక పెద్ద సంచలనం.
వివి గారు జడ్చర్లలో ఉండగా అప్పుడప్పుడు నేను ఇంటికి పోయి వస్తుండేవాడిని. అప్పట్లో ఆయనకు “రోజా కొచ్చిన రుజ” (గులాబీకి వచ్చిన రోగం)అనే కవితను రాసి చూయించాను. దాన్ని చూసి ఆయన గులాబీకి రోగం రావడం ఏమిటి? అని మందలించాడు.
సృజన పురుడు పోసుకున్నది జడ్చర్లలోనే. దాంట్లో రచనలు చూసి ఇట్లాంటి పత్రికలో రచనలు పడాలంటే పెట్టి పుట్టాలి అని ఇటు వచ్చే వాడిని (ఆ తర్వాత సృజనలో నా కవితలు రెండు మూడు అచ్చయ్యాయి. అది వేరే విషయం).
అప్పట్లో సౌదాను అభిమానించేవాడిని. ఆయనతో విభేదించినా కూడా ఆయన కవిత్వాన్ని మెచ్చుకునేవాడిని. శివసాగర్ విషయమూ అంతే. అతనితో రాజకీయంగా విభేదించినా సాహిత్యం బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే… నా కొడుక్కి ‘శివసాగర్’ అని పేరు పెట్టుకున్నా.
ఇప్పుడు రాస్తున్న వాళ్లలో వరంగల్ మిత్రుడు వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలుబాగా ఇష్టం. నేను అతని అభిమానిని అని అతనికే చాలాసార్లు చెప్పాను.
”నేను చాలా కట్టెల్ని మోసం గాని
నేను మోస్తున్నది నా భార్య కట్టే”(శవం)
ఓ ఆదివాసికి అంబులెన్స్ దొరకకపోవడంతో, భార్య శవాన్ని భుజం మీద మోసుకుంటూ పోయిన దృశ్యం అప్పట్లో వైరల్ అయింది. దాని మీదనే ఆయన కవిత రాశాడు. ఈ వాక్యాలు అందులోనివే. ఎప్పటికీ గుర్తుండి పోయే వాక్యాలు. శక్తివంతమైన వాక్యాన్ని అలవోకగా రాసేస్తాడు. వరంగల్ కు పోతే దొరుకుడు కష్టంగాని కవిత్వం మాత్రం ఇష్టమే.
అల్లం రాజయ్య, నల్లూరి రుక్మిణి గార్ల రచనలు బాగుంటాయి. అల్లం రాజయ్య ‘అతడు’ నవల మండుతున్న సింగరేణికి ప్రతిబింబం. మంటల్ని అక్షరంలోకి అనువదించాలి అంటే అల్లంరాజయ్యనే చదవాలి. ‘అతడు’ నవల చివరి ఘట్టం చాలా కదిలిస్తుంది. నవల లోని కథానాయకుడి చితి మండిపోతుంటే ఆ మంటను వర్ణిస్తూ “మండడానికే అతను పుట్టాడా అన్నట్టుగా మండుతున్నాడు” అనడం గొప్పగా ఉంటుంది.
తర్వాత నల్లూరి రుక్మిణి రాసిన ‘నిషిధ’ నవల నాలుగైదు సార్లు చదివి ఉంటాను. దాన్ని నాటకంగా మలచాలని రఫ్ వర్క్ చేసి పెట్టుకున్న. కుదరటం లేదు. కాన్వాసు పెద్దది. పాత్రలు బోలెడు. ఎప్పటికైనా దాన్ని నాటకంగా మలచాలన్నది నా కోరిక. వందల మందిని క్రమశిక్షణతో నడిపించే సైన్యాధ్యక్షురాలు లాగా ఆమె తన పాత్రలను పద్ధతి ప్రకారం నడిపిస్తది. ఆమెను ‘నల్లూరి రుక్మిణి’ అనే బదులుగా ‘నిషిధ రుక్మిణి’ అంటే సరిపోతుంది.
10. కవిత్వంలోంచి పాటలోకి ఎట్లా వచ్చారు?
అప్పటి అవసరం నా చేత పాట రాయించింది. అప్పటికే విరివిగా కవితలు రాస్తుండేవాడిని. అంతో ఇంతో గొంతు ఉంది. సినిమా పాటలు, భజన పాటలు ఇంట్లో గట్టిగా పాడుకునేవాడిని. పాట కూడా నాలో అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉండేదేమో. నేను ‘కరువు వ్యతిరేక పోరాట కమిటీ’లో పనిచేస్తున్నప్పుడు అనేక గ్రామాలు నిజనిర్ధారణ సందర్భంగా తిరిగేవాడిని. ఇప్పుడంటే కొంతనయం. అప్పట్లో గుక్కెడు నీళ్ల కోసం గొంతు ఆరిపోయే స్థితి. గ్లాసుడు నీళ్లు అడిగితే ..”లేవు”అని ముఖం మీదనే చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. పాలమూరును కరువు పట్టి పల్లార్చింది.
ఆకలి చావులు, వలస చావులు, అప్పులచావులు, తెగిపోతున్న మానవ సంబంధాలు, బీడు భూములు, అనారోగ్య అకాల మరణాలు… ఇలా ఒకటి ఏమిటి? మహా ఉత్పాతంతో T.S.Eliot “wasteland” లో ఉన్నట్టు ఉండేది. దేశంలోని 42 కరువు జిల్లాలలో మా పాలమూరు జిల్లా కూడా ఒకటి. కడుపులో పేగులు కరిగిపోయేవి. ఈ మహా దారుణాన్ని చెప్పడానికి కవిత్వం ఒక్కటే సరిపోదు అనిపించింది. పాటలు ఎత్తుకున్నాను. ‘ఎవరమ్మా మీరు’ అందులో ఒకటి.
శ్రీరంగాపూర్ గ్రామంలో బిడ్డలు వలసలు పోతే తల్లులు మసీద్ దగ్గర చావుకు ఎదురుచూస్తూ ఆడుక్కోవడం చూశాను. వీళ్ళందరూ ఒకరు తర్వాత ఒకరుగా వరుసబెట్టి చచ్చిపోతారని హరగోపాల్ సార్ తో అన్నాను. అదే జరిగింది.
“ఎవరమ్మా మీరు – చెరువెండిన చేపలా
ఎవరయ్యా మీరు – తెగిఎండిన కోమ్మలా…” ఈ పాట పాలమూరులో బాగానే పాడుకున్నారు. నేను ఏపీ పీఎఫ్ కోసం కూడా కొన్ని పాటలు రాశాను. అప్పట్లో పాట రాస్తే దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృష్ణ, జంగన్న సార్, ఉదయ్ సార్ తదితర మిత్రులు ముందుండేవాళ్ళు. ‘జిందాబాద్’ పాటకి ప్రాణం పోసింది వాళ్లే. మొత్తం 40 పాటలుగా ఒక పుస్తకం అచ్చు వేశాను. దాని పేరే ‘ఎవరమ్మా మీరు’. నేను రాశాను అనడం కంటే పరిస్థితులు నా చేత రాయించుకున్నవి అంటే సరిపోతుంది.
కవిత్వంలో నుంచి పాటలోకి రావడం అదేదో ప్రత్యేకంగా జరిగింది కాదు. అత్యంత సహజంగా అవసరంగా జరిగింది. చెరబండరాజు మాటల్లో చెప్పాలంటే… ”అన్నమంత అవసరమది”. అయితే నిష్ఠురమై నా చెప్పక తప్పదు. నాకున్న బిడియం వల్ల, పరిస్థితులు అనుకూలించకపోవడంవల్ల , మిత్రులు చెల్లాచెదరు కావడం వల్ల, కొంత నిరాదరణ వల్లనా పాటలకు అనుకున్న ప్రాచుర్యం దక్క లేదు. ఏవో కొన్ని పాటలు తప్ప తగ్గిన పాటలు కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళిపోయాయి. ఇది ఎప్పటికీ నన్ను బాధించే విషయం.
11. మీ నాయనమ్మ ఇప్పటూరి నాగమ్మ గురించి చెప్పండి.
A wife ,a mother ,a grandmother to o
This is the legacy we have from you
You taught us love , and how to fight
you gave us strength ,you give us might..
మా నాయనమ్మ ఇప్పటూరు నాగమ్మ గురించి ఓ కథ రాయాలి. అది రాయకుండా నేను ఆమెకు అన్యాయమే చేశాను. మొదటినుంచీ మా నాయనమ్మ ఒక రెబల్. ఎవరికి భయపడేది కాదు. ఆమె కాస్త లావుగా ఉండడంతో అందరూ ఆమెను “దొబ్బ నాగమ్మ” అనేవారు. బజ్జీలు చేస్తుండడంతో “బజ్జీలనాగమ్మ” అని కూడా పిలిచేవారు. మా నాయనమ్మ గురించి, ఆమె సాహసం గురించి, మా అమ్మ ఎప్పుడూ ఓ కథ చెబుతుండేది. మా అమ్మ కిష్టమ్మను మానాయన లక్ష్మయ్యకిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చితార్థం చేసుకున్నారట. అంతా బాగానే ఉంది. ఇక్కడే ఓ ట్విస్టు జరిగింది. మా అమ్మమ్మ మ్యాకల చిన్నమ్మ చాలా శాంత స్వభావురాలు. గొడవలంటే అసలు పడవు. మా నాయనమ్మగయ్యాళి అని తెలిసి భయపడి పోయింది. దాంతో మూడో కంటికి తెలవకుండా మా అమ్మకు మరొక సంబంధం ఫిక్స్ చేసిందట. ఇంకేముంది? అగ్గిరాజు కుంది. విషయం తెలిసిన మా నాయనమ్మకు విపరీతంగా కోపం వచ్చేసింది. “ధిక్కారమున్ సైతునా” అన్నట్లు బంధువులందరినీ కూడగట్టుకుని ఓ 12 బండ్లలో బయలుదేరి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మీద దండయాత్ర చేసినంత పని చేసిందట. ఆ రోజు మా అమ్మ పెండ్లి… మా అమ్మను పెళ్లి మండపం నుండి గుంజు కొచ్చి అవే బండ్లలో జడ్చర్లకు తీసుకొచ్చి జబర్దస్త్ గా మా నాయనకు పెళ్లి చేసిందట. ఆ రోజుల్లో అది రాక్షస వివాహమే.
బతుకు దెరువు కోసం మా నాయనమ్మ ఇంట్లో బజ్జీలు మిరపకాయ బజ్జీలు చేసేది. బాండీలో బజ్జీలు దేవుతుంటే మేము నిలబడి చూసేవాళ్లం. మాకు రెండు బజ్జీలు దొరికేవి. వాటిని ఓ గంపలో వేసుకొని కళ్ళు దుకాణం కాడ అమ్మేది. ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి కూరగాయలు తెచ్చేదన్నమాట.
మా ఇంట్లో దరిద్రం తాండవించేది. మా నాయన కాపుదనం జీతగాడు. సంవత్సరానికి ₹200 ఇస్తారు. మా అమ్మ కోమటోల్ల ఇండ్లలో పనిచేసేది. రెండు పూటలా భోజనం దొరకడం చాలా కష్టంగా ఉండేది. శ్రావణ మాసం వస్తే మా అమ్మకు వ్యవసాయపు పని దొరికేది కాదు. దాంతో పస్తులు ఉండక తప్పేది కాదు. ఒక్క పూటనే తిండి దొరికేది. శ్రావణమాసం వస్తే చాలు, మా పేగులు ఆకలితో భయంతో వణికిపోయేవన్నమాట. ఇప్పటికీ ఆ రోజుల శ్రావణమాసం గుర్తుకొస్తే చాలు, ఝల్లు మంటది. అట్లా ఆకలితో నకనకలాడే సమయంలో మా నాయనమ్మ కూరగాయలు తెచ్చి తిట్టుకుంటూ నేలమీద పారబోసేది. మేము మౌనంగా వాటిని ఏరుకొని రాత్రికి వంట చేసుకునే వాళ్లం. అట్లా మా ఆకలిని తీరాలకు చేరిన మనిషి ఆమె
And she was always there
especially in the times of need
చూడ్డానికి గయ్యాళే అనిపించినా నేనంటే మురిపెంగా ఉండే ది. నేను బడి నుండి ఇంటికి వస్తే చాలు, “మా నాయనొ చ్చేనె. మా అయ్యొచ్చెనే, మా నెహ్రొచ్చెనే ( జవహార్ లాల్ నెహ్రూ)” అని తెగ సంబరపడి పోయేది. మా ఇంట్లో మొదటి చదువరిని నేనే మరి. మా నాయనమ్మ గొంతు పెద్దదని చెప్పాను కదా. అది నాకు రక్షణ కవచం అన్నమాట. నేను ఏదైనా తప్పు చేస్తే మా నాయన నన్ను తిప్పట్లాడి కొట్టేవాడు. నేను విపరీతంగా భయపడి పోయి మా నాయనమ్మ వెనుక దాక్కునేవాడిని. ఆమె గద్దించే సరికి మా నాయన గప్ చుప్ గ వెళ్ళిపోయేవాడు.
నేను చదువుకుంటుంటే తాను ఉడకబెట్టిన బెబ్బర్లను ఒల్చి ఇవ్వడం నాకు గుర్తుండిపోయే అనుభూతి. సాధారణంగా ఇండ్లలో అత్తలకు కోడళ్లకు పడకపోయేది. చిత్రమేమంటే మా నాయనమ్మ మా అమ్మ ఇద్దరు గయ్యాళులే. కానీ ఇద్దరు ఎప్పుడూ కొట్లాడుకున్నట్లు గుర్తులేదు. ఏమన్నా రహస్య ఒప్పందాలు ఉండేవేమో.
మానాయనమ్మకు ఇద్దరు కొడుకులు. చిన్న లక్ష్మయ్య, పెద్ద లక్ష్మయ్య. సాధారణంగా తల్లిని పోషించడానికి కొడుకుల మధ్యన పోటీ ఉంటది. “నేనే ఎందుకు పెట్టాలి…? నన్ను ఒక్కడినే కన్నావా? వాడిని కనలేదా…?”అనే కొట్లాటలు ఇండ్లలో సహజం. అదేమిటో తెలువదు కానీ మా నాయనమ్మ ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేది. మా పెద్దనాన్న ఇంటికి పోయేది కాదు. చిన్న కొడుకంటే ఇష్టమేమో. అంత బీదరికంలోనూ కలోగంజో కలిసి తాగేవాళ్ళం.” నువ్వెందుకు ఆయన ఇంటికి పోవు” అని చర్చ జరిగినట్టు గుర్తులేదు. అయితే చివరి రోజులలో ఆమె జీవితం అత్యంత విషాదకరంగా ఉండింది.
మా నాయనమ్మ రోషపు మనిషి. మా అమ్మకు, మా నాయనమ్మకు మధ్యన ఏవో మాట పట్టింపులు రావడంతో ఆమె రోషం మీద తన బిడ్డ ఇంటికి వెళ్ళిపోయింది. పోనయితే పోయింది కానీ అక్కడ పరిస్థితి అంతంత మాత్రమే. వాళ్లది ఓ గుడిసె. రెక్కాడితే డొక్కాడని జీవితం. మా మేనత్తకు మా నాయనమ్మ బాగోగులు చూసే తీరిక ఉండేది కాదు. చివరి రోజుల్లో జబ్బు పడితే చీకట్లో పడేసి కూలి పనికి వెళ్ళేదామె. చివరి రోజులు మా నాయనమ్మకు చీకటి రోజు లు. ఓ చిన్న రూములో ఆమెను పడేసి వెళ్లేవాళ్లు. ఓ నల్ల గొంగడి మీద పడుకుని ఉండేది. అనారోగ్యం, ఒంటరితనం, దిక్కులేని జీవితం … మహారాణిలా బతికిన మనిషి రెక్కలు తెగిన పక్షుల నేల మీద పడి గిల గిల కొట్టుకున్నది.
నాకు ఒక్కడికే మనసు గుంజి అప్పుడప్పుడు పలకరించడానికి పోయేవాడిని. అప్పట్లో ఆ ఇంట్లో కరెంట్ ఉండేదిగాదు. కిరసనాయిల్ దీపమే గతి. నాకు బాగా గుర్తుంది. నేను పోయేసరికి వణుకుతున్న సన్నని వేళ్ళతో నా చేతిని తన చేతిలోకి తీసుకొని “వచ్చినావా బిడ్డా” అని గొణిగేది. ఆ చీకట్లో ఆమె ఏడుస్తున్నదో, మౌనం గా ఎవరినైనా తిడుతున్నదోతెలిసేదికాదు. ఆ చీకటి గదిలో నేనూ ఆమెతోబాటు ఏడ్చానన్న సంగతి ఆ ముసలి గుండెకు తెలిసి ఉండదు.
అప్పట్లో నాకు ఇంజక్షన్ ఇవ్వడం వచ్చు కాబట్టి ఏదో బలం కోసం ఒక బి కాంప్లెక్స్ ఇంజక్షన్ ఇచ్చి తృప్తిపడేవాడిని. అప్పటికి నేను డిగ్రీ చదువుతుండే వాడిని. చేతుల పైసలు ఉండేవికావు. ఆమెకు ఏ సహాయం చేయలేని దారుణ నిస్సహాయ స్థితి. ఇంటికి వచ్చినాక మా నాయనమ్మ పరిస్థితి ఏమి బాగాలేదని గొణిగానే గాని ఎవరు పట్టించుకోలేదు. నా కళ్ళముందే మెల్లమెల్లగా చావుకు దగ్గరవుతుంటే ఏమి చేయలేని నిస్సహాయ మానవుడిని నేను. ఎందుకో గాని మా నాయన కూడా మా నాయనమ్మను ఆ స్థితిలో పలకరించడానికి భయపడేవాడు. ఆమె చనిపోయాక మాత్రం మా వాళ్ళు మొక్కుబడిగా చూసివొచ్చారుగాని, ఒక్కరి కళ్ళలో నీళ్లు లేవు. మా ఇంటికి పెద్దది కైన మనిషి ఏ దిక్కూ లేక అనామకంగా రాలిపోయింది. she went away unwept and unsang..
ఆమె చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చినట్టు గుర్తు. అప్పటినుంచి ఇప్పటిదాకా నా నిస్సహాయ స్థితికి నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను. ఆమె గురించి ఎవరితోనైనా పంచుకుందామంటే ముఖం పక్కకు తిప్పుకుంటారు. ఎవరూ జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అది గుజరాత్ గాయం లాగ గతించిన విషయంలాగ మాట్లాడుతారు. మౌనం కింద కప్పి పెడతారు. ఏమీ జరగనట్టే నటిస్తారు. నేనొక్కడినే ఈ ప్రేమ రాహిత్యపు కోనల్లో చనిపోయిన మా నాయనమ్మను గుర్తు చేసుకుంటూ ఓ విధమైన నిర్లిప్తతలోకి వెళ్లిపోతుంటాను.
When other friends forsake you
To grandma you return.
మాకు అన్నం పెట్టిన మనిషి
మెతుకు కోసం కటకటలాడింది
మాకు వెలుతురు ఇచ్చిన మనిషి
చీకటి గుడిసెలో చితికి పోయింది
మాకు బతుకునిచ్చిన మనిషి
తన చావును తానే వెతుక్కున్నది
చెదరని జ్ఞాపకం
రాయని కావ్యం
మా నాయనమ్మ
ఇప్పటూరు నాగమ్మ
…….
ఇందులోనీ ఇంగ్లీషు వాక్యాలు నావిగావు..
(ఇంకా వున్నది…)
పేదరిక నేపథ్యం కాదిది పోరాటాన్ని అక్కరకు చేర్చిననేపథ్యం. మిమ్మల్ని నిలబెట్టింది కదా సార్. అభినందనలు.
చాలా బాగా రాసారు. ప్రజా సాహిత్యకారుడు మాత్రమే జీవితాన్ని ఇంత బాగా జీవితాన్ని వర్ణించగల్డు.
విస్తృతమైన జీవితానుభవాన్ని వివరంగా పంచుకున్నారు. ఆ జీవితానుభవాన్ని విస్తృతంగా రాస్తున్నారు.