కష్టాల బాల్యమే నా అక్షరాలకు దారులేసింది : ఉదయమిత్ర   (పార్ట్ – 2)

12. కథలు ఎప్పటినుంచి రాస్తున్నారు? 

తేదీలు అవీ జ్ఞాపకం లేవు గాని 1986లో “ఇన్ కమ్ సర్టిఫికెట్” అనే పేరుతో కథ రాసినట్టు గుర్తుంది. అదే నా మొదటి కథ అనుకుంటా. నా మొదటి కవిత బాధలోంచి పుడితే, నా మొదటి కథ కసిలోంచి పుట్టింది. ఇంత మాత్రం చెప్పగలను.

13. మొదటి కథ ఏది? దాని నేపథ్యం చెప్పండి.

పైన చెప్పినట్టు 1986లో “ఇన్ కమ్ సర్టిఫికెట్” అనే కథ రాసి “వార్త” పేపర్ కు పంపాను. అది వెంటనే అచ్చయింది. కసితో, ఏకబిగిన రాసిన కథ. ఒక ప్లాన్ తో రాసింది కాదు గాని ఒక ఫ్లోలో వచ్చింది. అది మా ఊరి పోలీస్ పటేల్ కిషన్ రావు మీద రాసింది. నేను హై స్కూల్ చదివే రోజుల్లో (1960- 64) ప్రతిసంవత్సరం “ఇన్ కమ్ సర్టిఫికెట్” తేవాల్సిన పరిస్థితి ఉండేది. మాకు ఆ సర్టిఫికెట్ ఇస్తేనే స్కూల్ ఫీజు మాఫీ చేసేవారు. లైబ్రరీలో పుస్తకాలు కూడా ఫ్రీగా ఇచ్చే వారు. ఎందుకో తెలియదు గానీ నెలకు పది పైసలు (రూపాయలో పదో వంతు )మాత్రం కట్టించుకునేవాళ్ళు. అంటే మా చదువు “పది పైసల చదువు” అన్నమాట.

సరే ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గరకు వద్దాం. ఆ సర్టిఫికెట్ పేరు చెప్తే చాలు మాకు వెన్నులో చలి పుట్టేది. ఎందుకంటే అది కావాలంటే ముందు పోలీస్ పటేల్, గిర్దావర్, పట్వారిల సంతకం కావాలి. అందరి సంతకాలు సులభంగానే అయ్యేవి గాని, పోలీస్ పటేల్ దగ్గరకు వచ్చేసరికి ముప్పుతిప్పలు పెట్టేవాడు. అతను కర్నమాయన. పెద్ద శాడిస్ట్. ఇన్ కం సర్టిఫికెట్ ఫారం చేతిలో పట్టుకొని సంతకం కోసంరోజుల తరబడి అతని ఇంటికి తిరగాల్సి వచ్చేది. “అయ్యగారు లోపల ఉన్నారు” అని జీతగాళ్లు చెప్పేవాళ్ళు. నేను మౌనంగా, దిగులుగా ఆ ఇంటి ముందు గల వేప చెట్టు కింద గంటలు తరబడి నిలబడాల్సి వచ్చేది. ఎప్పుడు బయటికి వస్తాడో తెలవదు. వచ్చిన నన్ను పట్టించుకుంటాడో, నా వైపు చూస్తాడో లేదో తెలువదు. చూసినా కుక్కను జూసినట్టు చూసేవాడు. తీరా తానాలు, పూజలు అయి బయటికి వచ్చేసరికి ఎవరైనా షావుకార్లు, ప్రముఖులు వస్తే వాళ్లకు కావాల్సిన సంతకాలు చేసి వాళ్ళ వెంబడే జీపులోనో, స్కూటర్ మీదనోవెళ్ళిపోయే వాడు. నన్ను జూసి కావలాయన మాత్రం జాలి పడేవాడు. నేను ఉసూరు మని ఇంటిముఖం పట్టే వాడిని.

చిత్రమేమంటే నేనంటే ఒక నిరుపేదను. నాకు సంతకం పెట్టడానికి వాడు మహా గింజుకునే వాడు. అదే డబ్బు గల వాళ్ళు వస్తే, కుర్చీ వేసి మర్యాదలు చేసి, సర్టిఫికెట్ ఫామ్ మీద సంతకం చేసి గేటు దాకా వచ్చి సగం సాగనంపేవాడు. పైగా “మీ నాయన కూలి పని చేసి బాగానే సంపాదిస్తాడు కదా… నీకు సర్టిఫికెట్ ఎందుకు?” అని కుళ్ళు జోకులు వేసేవాడు. లంచం అడిగే వాడుగాని నాదగ్గర పైసలేవీ…? ఓసారి ఐదురూపాయల లంచం అడిగితే, ఐదు పైసలిచ్చి తిట్లు తిన్నాను. నేను నా జీవితంలో అతి భయంకరంగా ద్వేషించింది ఈ పోలీసు పటేల్నే. కమ్యూనిస్టు రాజ్యం వస్తే మొట్టమొదట నేను ఈ పోలీస్ పటేల్ ని హత్య చేస్తానని మిత్రులతో బాహాటంగా చెప్పేవాడిని. cruel to the core. ఆ కసి లోంచి రాసిందే “ఇన్కమ్ సర్టిఫికెట్”. వెంటనే వార్త పేపర్లో అచ్చయింది. కాపీ మాత్రం నా దగ్గర లేదు. రెండో కథ మాత్రం ప్రేమ కథ. “నింగి నేల కలిసే చోట” ఇట్లాంటిదే ఏదో పేరు. అది కూడా వార్త పేపర్ లో వచ్చింది. ట్రాజెడీ ఏమంటే ఆ రెండు కథలు నా దగ్గర లేవు.

14. కవితలు రాస్తూనే ఉన్నారు కదా…! కథా ప్రక్రియను ఎందుకు ఎంచుకున్నారు?

అల్లం రాజయ్య ఒకచోట అంటాడు “ఈ నేల నన్ను తయారు చేసుకున్నది” అని. అంత గొప్పమాట నాకు వర్తించదుగాని, నాకు కూడా ఈ నేలకి సంబంధించి కథలు రాయాల్సిన అవసరం ఉందనిపించింది. ఈ నేలకు నేను రుణపడి ఉన్నాను.

ఆకలంత సత్యమది 

అన్న మంత అవసరమది

                  – చెరబండరాజు

కథ కూడా అంతే అవసరంగా ఉండేది మరి. అయితే మొదటి నుంచి నాకు ఒక తప్పుడు ఆలోచన బలంగా ఉండేది. అదేమిటంటే, కవులు కవిత్వం రాయాలి. రచయితలు కథలు రాయాలి. ఎవరి పని వాళ్లు చేయాలి. మెకానిక్ పని మెకానిక్ చేయాలి. రైతు పని రైతు చేయాలి. ఇట్లాంటి ఆలోచన. వేరే దాంట్లో వేలు పెట్టకూడదని అనిపించింది. నా ముందు తరం వాళ్లు అట్లే ఉన్నారు మరి. వివి, శివారెడ్డి, శివసాగర్ లు… గొప్ప కవిత్వం రాశారు గాని కథలు ముట్టుకోలేదు. రావిశాస్త్రి, కారా మాస్టరు, రంగనాయకమ్మ లాంటివాళ్ళు గొప్ప కథలు రాశారు. కానీ కవిత్వం ముట్టుకోలేదు. తిలక్ మంచి కవిత్వం రాశాడు కానీ కథలు నాకు అంతగా నచ్చలేదు. చలం గొప్ప రచయితనే గాని పెద్ద కవిత్వమేమీ రాయలేదు. కాబట్టి నాముందు తరం రచయితలు కవులు నా ముందు ఉంచిన పరిమితులివి. ఆ ఆలోచననా తప్పే కావచ్చు. ఇట్లా ఒక భావనను స్థిరీకరించుకున్నాక కథల గురించి ఆలోచించలేదు. ఎవరి జోన్ వాళ్ళది. ఇదన్నమాట సంగతి.

నేను కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కరువును అధ్యయనం చేయడానికి తిరుగుతున్న కాలంలో పల్లెలన్నీ”పాల కోసం ఏడ్చే లేగ దూడల్లా” ఉండేవి. భయంకరమైన కరువుతో పల్లెలు అల్లల్లాడిపోయేవి. మనుషులు పిట్టల్లా రాలిపోయేవాళ్ళు. ఒక దారుణ మానవ మహా విషాదాన్ని కళ్ళారా మౌనంగా చూశాను. ఈ జీవితాలను చెప్పాలంటే కవిత లేదా పాట సరిపోదు. పెద్ద కాన్వాస్ కావాలి. అదే కథ (నవల రాయొచ్చు. కాని అది తీరం చేరని పడవలా ఉంది). కానీ.. నేను కవిని కదా. కథలు రాయలేను గదా. అది నా పని కాదు కదా. మరి ఏం చేయాలి? నిజ నిర్ధారణ కోసం పాలమూరుకు వచ్చే ప్రముఖ కథా రచయితల్ని అడుక్కునేవాడిని. “ఈ కరువు మీద మీరేమన్నా కథలు రాయండి” అని. ఆ సందర్భంలో గీతాంజలి గారిని కూడా అడిగినట్టు గుర్తు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు వివి సార్ అక్కడే ఉన్నాడు. “వాళ్ళని వీళ్ళని అడిగే బదులు నువ్వే రాయచ్చు కదా” అన్నాడు. అందులో కోపం, మందలింపు ఉన్నాయి. ఆయనట్లా మాట్లాడి వెళ్లిపోయాడు గాని నేను ఆ మాటలు విని షాక్ తిన్నాను. నేను కథలు రాయడమేంది? నా వల్ల అయ్యే పనేనా? అని డైలమాలో పడిపోయాను. ఘర్షణ పడ్డాను. అవతల పరిస్థితులు, హాహాకారాలు నన్ను కలవరపెడుతున్నాయి. తొందర పెడుతున్నాయి. బతకనీయడం లేదు. చివరికి ఆ భావనను బద్దలు కొట్టుకొని బయటికి రావడానికి చాలా కాలం పట్టింది. కవితలు రాయడం మొదలెట్టాక సుమారు 10-15 సంవత్సరాలకు కథలు రాయడం మొదలు పెట్టానేమో. మొదటి కథ “ఇన్కమ్ సర్టిఫికెట్” 1986లో రాసాను. రెండో కథ ఏదో ప్రేమ కథ రాశాను గాని తర్వాత  కొంతకాలం కథల జోలికి పోలేదు. ఆ తర్వాత “భయం” అని కథ రాశాను. భయం భయంగానే అరుణతారకి పంపాను. వెంటనే అచ్చయింది. కథల మీద నా భయం తొలగిపోయింది. ఆ వెంటనే “ఊట” అనే కథ రాశాను. అది కూడా అరుణతారలో అచ్చయింది. మెల్లగా కథారచన పుంజుకున్నది.

15. కవిత్వం, పాట, కథతో బాటు నాటక రచనలోకి ఎందుకు రావాలనిపించింది?

అనుకోకుండా మంత్ర నగరి సరిహద్దులు ముట్టుకున్నాను. నడుస్తుంటే బాటలో దొరికిన అపురూపమైన వజ్రం ఇది. అయితే నేను jack of all master of none.. కాదల్చుకోలేదు.

నాటకం గురించి నాకు అసలు ఏమీ తెలవదు. నాకు తెలిసిన నాటకాలల్లా, మా వీధిలో వేసిన “బాలనాగమ్మ” నాటకం, హనుమాన్ దేవాలయం కాడ వేసిన “చిరుతల రామాయణం”, కాలేజీలో “భువన విజయం” మాత్రమే. నాటకాలలో ఆడ పాత్రలన్నీ మగవాళ్లే  వేసేవాళ్ళు. అప్పటికే మా ఊళ్లో సినిమా టాకీస్ లు రావడంతో నాటకాల ప్రభావం తగ్గింది.

నాటకాలకు సంబంధించి పెద్ద సాహిత్యం చదవలేదు. ఒకసారి సఫ్దర్ హష్మి రాసిన “హల్లా బోల్” పుస్తకాన్నితెచ్చుకొన్నాను. చదవడంలో బోర్ కొట్టి పక్కన పడేసాను. నాటకాలు వేస్తేనే గొప్పదనం బయటికి వస్తదేమో. చిన్నప్పుడు నుంచి నాకు బోలెడంత స్టేజ్ ఫియర్ ఉండేది. ఏడో తరగతి చదువుతున్నప్పుడు నాకు కృష్ణ రాయబారంలో “సాత్యకి” అనే పాత్ర ఇస్తే సభాకంపం వల్ల దాన్ని వదులుకున్నాను. అది ఒకప్పటి సంగతి.

ఇదిలా ఉంటే, మా ఏరియాలో కరువు తాండవించడంతో, రైతులు వరుస పెట్టి ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. గంగాపూర్ చుట్టుపక్కల తండాలలో ఆత్మహత్యలు మమ్మల్ని కలవరపెట్టాయి. అయితే రైతులు ఒకరి వెంట ఒకరు ఆత్మహత్య చేసుకోవడం చూసి, అప్పటి మా జిల్లా మంత్రి , ప్రజలకు “మాస్ హిస్టీరియా” వచ్చిందని నిర్ణయానికి వచ్చాడు. కొందరు సైకాలజిస్ట్ లను, ఆ ప్రాంతాలకు పంపడం అప్పట్లో వార్త అయ్యింది. ఒకవైపు ప్రజలు కరువుతో అల్లాడి చనిపోతుంటే వాళ్లకు పిచ్చి పట్టింది అనడం, పుండు మీద కారం జల్లి నట్టనిపించింది. ఎందుకో గాని ఆ ఘటన విన్నాక నాటకం రాయాలనిపించింది. అట్లా  రాసిందే “పిచ్చి డాక్టర్” నాటకం.

ఒకసారి రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ దగ్గర వివి సార్ తో మాట్లాడుతూ పిచ్చి డాక్టర్ కాన్సెప్ట్ చెప్పాను. ఆయన బిగ్గరగా నవ్వేసి “ఇదేదో బాగుందయ్యా.. రాయి” అన్నాడు. ఆ ఊపులో “పిచ్చి డాక్టర్” నాటకం రాశాను. ప్రజలకు పిచ్చి నయం చేయడానికి పల్లెలకు బోయిన డాక్టర్లకు అక్కడి కరువు పరిస్థితి చూసి పిచ్చివాళ్ళవుతారు. ప్రజలందరూ కలిసి ఆ డాక్టర్లను దవాఖానకు మోసుకుపోవడంతో నాటకం ముగుస్తుంది. ఆ నాటకాన్ని సుందరయ్య విజ్ఞాన్ భవన్లో వేశారు. చందుది పిచ్చి డాక్టర్ పాత్ర. బాగానే వచ్చింది. ఇది ఓ మోస్తరు విజయం సాధించింది. ఇది నాకు బోనస్ లాగా అనిపించింది. నాటకాలు ఎందుకు రాయకూడదు? అని కూడా అనిపించింది.

తర్వాత రాసిన “చిరస్మరణ”నాటకాన్ని కర్నూల్లో వేశారు. తర్వాత “బాసగూడ” నాటకాన్ని వరంగల్లో వేశారు. నాటకానికి గొప్ప ప్రభావం ఉంటుందని నేను నాటకాలు రాయడం మొదలుపెట్టాకనే తెలిసింది. “నీవు ముప్పయి ఏండ్లనుంచి కవిత్వంరాసినా రాని పేరు, ఈ ఒక్క నాటకంతో వొచ్చిందయ్యా”

అని వడ్డెబోయిన శ్రీనివాస్ అనడం ఎప్పటికీ మర్చిపోలేను. వివిసార్ గూడ, అన్ని సాహిత్య ప్రక్రియలోకెల్ల నాటకం గొప్పదనం అంటూ,” సర్వోత్క్రష్టం నాటకం” అన్నట్టు గుర్తు.

16. మీ రచనల ద్వారా పాలమూరు నుండి ప్రపంచంతో సంభాషించడం ఎట్లా అనిపిస్తున్నది?

ఈ వాక్యం నాకు సరిపోతుందో లేదో తెలువదు. సముద్రంలో నేనొక బిందువును మాత్ర మే. అయినా ఈ వాక్యం నాకు ఒక ప్రేరణ. నిరంతరం వెంటాడుతది. కొంచెం గర్వం, అంతకన్నా వందరెట్లు బాధ్యతను పెంచుతుంది. కోట్లాదిమంది పీడిత కోసం రాస్తున్నాం కదా… అని ఎరుక, నేను ఎదగాల్సిన బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది. మరింతగా వినమ్రుడినయిపోతా.

ఎక్కడి పాలస్తీనా? ఎక్కడి ఆఫ్గనిస్తాన్ ? ఎక్కడి శ్రీలంక ? ఎక్కడి లాటిన్ అమెరికా? ఎక్కడి దక్షిణాఫ్రికా? ఎక్కడ పాలమూరు? ఎక్కడ ఉదయమిత్ర? పాలమూరుకు ప్రపంచానికి అక్షరం వారధి అయ్యింది. యాసర్ అరాఫత్ చనిపోయినప్పుడు, టీవీలో అతని అంతిమ యాత్ర దృశ్యాన్ని చూసి, పిచ్చోడిలా ఏడ్చాను. అట్లా ఏడుస్తూనే ఉన్నాను. ఆ దుఃఖాన్ని చూసి నా సహచరి ఆశ్చర్యపోయింది. “ఎక్కడో ఇతర దేశంలో ఓ మనిషి చచ్చిపోతే ఇంతలా ఏడుస్తారా” అన్ని వ్యాఖ్యానించింది. కానీ అదే మనిషి … సద్దాం హుస్సేన్ ఉరి తీసినప్పుడు తానూ ఏడ్చింది.

మొలైసేను జైల్లో ఉరి తీసినప్పుడు, జైలు బయట ప్రజల మధ్యన నేనూ ఉన్నా. డాక్టర్ కోట్నీస్ చైనాలో యుద్ధ రంగంలో సైనికులకు సేవ చేస్తున్నప్పుడు ఆయన స్త్రగుల్ అంతా నాదనిపించింది. చైనాలో లాంగ్ మార్చ్ అంతా నాదే.

ఎక్కడ దుఃఖం, పోరాటం ఉంటే అక్కడ వాలిపోవడమే జీవితం, సాహిత్యం. నేను ఇంతవరకు విమానం ఎక్కలేదు కానీ అక్షర విమానంలో ప్రపంచమంతా తిరిగి రావడం నాకు కొత్త రెక్కలు వచ్చినట్టు ఉంటాయి. మనిషి extend కావడం అంటే ఇదేనేమో.

నాకు ఉన్న కొద్దిపాటి ఇంగ్లీష్ పరిజ్ఞానం నా రెక్కల్ని మరింత విస్తృతం చేసింది. నా  కవిత్వం రెక్కలతో (wings of poesy) నేను స్వప్నలోకం చేరుకుంటాను( shelly).

ఒక మంచి కవిత కనపడితే వెంటనే వీలును బట్టి అనువాదం చేస్తాను. మూల రచయితతో కలిసి ఆ ప్రాంతమంతా తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. వాళ్ల అనుభవాలు నావి అవుతాయి. నేను విస్తరిస్తాను. అనువాద ప్రక్రి య ఒక విధంగా ప్రపంచానికి కొత్త కిటికీని తెరిచింది. శివారెడ్డి సార్ అన్నట్టు అందరూ ప్రపంచ సాహిత్యాన్ని చదవాలి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా కవిత్వం.

17. వనపర్తిలో శ్రీశ్రీని కలవడం, మాట్లాడడం, ఆ సందర్భం ఎట్లా అనిపించింది?

వనపర్తిలో శ్రీశ్రీని కలవడం నిజమే. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. పత్రికల వాళ్ళు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దగ్గర్లోనే కూర్చున్నాను. కానీ ఏమీ మాట్లాడలేదు. అయినా చేరాల్సిన సందేశం చేరినట్లు అనిపించింది. అడవి మనతో మాట్లాడుతదా? అడవిలో నడిచి చూడండి. మనకు కావాల్సిన సందేశంలో వచ్చినట్టు అనిపిస్తుంది.

మీకు ఒక కథ చెప్పాలి. పేర్లు తెలువదు గానీ, ఓ  సుప్రసిద్ధ ఇంగ్లీషు కవికి ఓ వీరాభిమాని ఉంటాడు. ఆ అభిమానికి తాను ఆరాధించే కవిని చూడాలని జీవితాశ. ఆ కాలంలో ఇంత రవాణా సౌకర్యం ఉండేది కాదు. అయినా సరే పట్టుబట్టి ఈ వీరాభిమాని రెండు నెలలు పడవ ప్రయాణం చేసి ఆ కవి గారిని కలుసుకున్నాడు. కలువనైతే కలిశాడు కానీ, అతనితో మాట్లాడింది ఏమీ లేదు. రెండు గంటలు అతని పక్కనే మౌనంగా కూర్చున్నాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే వినడం తప్ప, ఒక్క మాట మాట్లాడింది లేదు. ఆ తర్వాత ఎవరో అడిగారంట, “అదేమిటి అంత దూరం పోయి ఒక్క మాట మాట్లాడలేదేంటి  ” అని అంటే, దానికాయన “అతనిpresence లో నాకు చేరాల్సిన సందేశం చేరింది” అన్నాడట. ఇది కొంచెం వాస్తవ దూరంగా, వింతగా అనిపించినా మౌనంలోనూ, నిశ్శబ్దంలోను సందేశాలు ఉంటాయి అనిపించింది. 

శబ్దాలు చదవాలంటే 

చెవులు ఉంటే చాలు

నిశ్శబ్దాన్ని చదవాలంటే 

హృదయం ఉండాలి.

                       ** **

శ్రీశ్రీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అతడిని ఆదుకోవడానికి వనపర్తిలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, చందాల రూపంలో డబ్బులు సేకరించి, ఆ డబ్బు ఇవ్వడానికి ఆయనను వనపర్తికి పిలిపించారు. శ్రీ శ్రీ వనపర్తికి వస్తున్నట్టుగా అందరికీ తెలిసిపోయింది. ఆయనను చదవడం తప్ప, చూడడం అయితే అదే మొదలు, అదే ఆఖరు కూడా. శ్రీశ్రీని కలవాలనుకోవడం ఒక ఉత్తేజపూర్వక అనుభవం. ఆయనకు వనపర్తి దగ్గరలో గల చిట్యాల అనే ఊర్లో వసతి ఏర్పాటు చేశారు. మేము ఆయనను కలుసుకోవడానికి ఆ పల్లెకు పోయాం. అక్కడ  మహబూబ్నగర్ నుండి మేధావులు, శ్రీశ్రీ అభిమానులు , విలేకరులు ఉన్నారు.

విలేకరులు ఆయనతో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నేను శ్రీశ్రీకి దగ్గర్లోనే ఉన్నాను. ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఇంతగా అభిమానించింది ఈ బక్కపల్చటి మనిషినేనా? అని ఆశ్చర్యపోయాను. సిగరెట్ పొగ గుప్పు గుప్పున వదులుతున్నాడు. కవిత్వంలో నిప్పులు చెరిగే  మనిషి, ఇంటర్వ్యూలో నెమ్మదిగా, డల్ గా మాట్లాడుతున్నాడు. కొంత నిరాశ పడ్డాను.

జ్వాలాముఖిలాగా నిప్పులు చెరుగుతాడు అనుకున్నాను. కానీ ఒక అంతర్ముఖుడిలా మాట్లాడాడు. అదే విషయాన్ని మిత్రుడు రామ్మోహన్ సార్ తో చెబితే ..” ఇప్పుడు అట్లే అనిపిస్తది. రేపు పేపర్లో బాగా పేలుతది చూడు” అన్నాడు. ఆయన అన్నట్టే మరుసటి రోజు ఆంధ్రప్రభలో శ్రీశ్రీ ఇంటర్వ్యూ బాగా వొచ్చింది. 

అక్కడే మిత్రులందరికీ కలిసి శ్రీశ్రీతో ఒక ఫోటో దిగాను. అదొక్కటే జ్ఞాపకంగా మిగిలింది. దాన్ని ఓ జర్నలిస్టు మిత్రుడు ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత వనపర్తి జూనియర్ కళాశాల (boys)లో సాయంత్రం బహిరంగ సభ జరిగింది. పోకేస్తే పోకరాలనంత మందితో మైదానం నిండిపోయింది. ఆయన రాసుకొచ్చిన కవిత.

“ఊగరా ఊగరా ..

ఉరికొయ్యనందుకొని.

ఊగరా… ఊగరా”

తెల్లవాడు నాడు నిన్ను

భగత్ సింగు అన్నాడు

నల్లవాడు నేడు నిన్ను

నక్సలైటు అన్నాడు

ఎల్లవారు రేపు నిన్ను

వేగుచుక్క అంటారు

ఊగరా… ఊగరా

ఉరికొయ్యనందుకొని

ఊగరా… ఊగరా…

అది చదువుతుంటే సభ మొత్తం ఉద్వేగంతో ఊగిపోయింది. ఆ సాయంకాలం ఆ పాటతో కొత్త కాంతుల సంతరించుకుంది. ఆయన తర్వాత మద్రాసు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయారు గాని, ఆయన సాహిత్యం ఉంది, పిరికి పడ్డపుడల్లా కాపాడడానికి. ఆయనతో గడిపింది కొద్ది కాలమే. కాని కీట్స్ అన్నట్ఠు,

A thing of beauty

Is a joy forever.

ఆ అనుభూతి చిరకాలం గుర్తుంటది.

18. “మాకు తండ్రి కావాలి” కవితకు నేపథ్యం ఏమిటి?

Nathanial Hawthorne రాసిన “the scarlet letter” అనే నవల ఈ సందర్భంలో గుర్తుకు తేవాలి. ఆ నవలను అమెరికా సాహిత్యంలో గొప్ప నవలగా గుర్తిస్తారు. ఆ నవలలో హెస్టర్ అనే మహిళ బలహీన పరిస్థితులలో డెమ్మస్ డేల్ అనే బిషప్ ని శారీరకంగా కలుస్తుంది. ఫలితంగా వాళ్లకు ఒక బిడ్డ (పెర్ల్) పుడుతుంది. ఆ పిల్లకు తండ్రి ఎవరో తెలుసుకునే పరిస్థితి లేదు. అతను ఆ ఊర్లో పవిత్రుడుగా పేరు గాంచిన బిషప్. హెస్టర్ కూడా ఆ పిల్ల తండ్రి పేరు చెప్పడానికి నిరాకరిస్తది. ఫలితంగా ఊరి మతపెద్దలు ఆమెను వేశ్యగా నిర్ధారించి ఆమె మెడలో “A” (adult) అనే scarlet letter (ఎర్ర అక్షరం) ను వేలాడ దీస్తారు. జీవిత కాలం ఆమె ఆ అక్షరాన్ని తను జేసిన పాపానికి మోయాలన్నమాట (తండ్రి కూడా చాలా ఘర్షణ పడ్తాడనుకోండి.అది వేరే విషయం). అక్కడ హెస్టర్ తనమెడలో scarlet letter మోస్తే, ఇక్కడ దళిత మహిళలు జోగిని అనే పేరును (తాము చేయని తప్పుకు) జీవిత కాలం మోస్తారు. స్థల కాలాలలో కొంత మార్పు. అంతే.

మేము కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలు  తిరిగాం. వ్యధా భరిత జీవితాల్ని చూసాం. అట్లాంటిదే మక్తల్ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఇది చాలా కాలం కిందట సంగతి (అప్పట్లో జోగినీ వ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అంతగా పుంజుకోలేదు). ఆ ఊర్లో ఆకలి చావు జరిగిందని తెలిసి మేము నిజ నిర్ధారణకు పోయినం. అక్కడే ఒక జోగిని చూడడం తటస్థించింది. ఆమె ఒక దళిత స్త్రీ. మెల్లగా మాట్లాడింది. తాను ఎట్లా జోగినిగా మారిందో చెప్పింది. తన ఇంటికి దగ్గరలోనే గుడి కాడికి తీసుకొని పోయి దేవుడిని చూపిస్తూ…, “ఇగో సారు… ఈ దేవునితోటి నా పెళ్లి చేశారు  ” అంది, ఊరి వైపు సాలోచనగా చూస్తూ. ఆశ్చర్యపోవడం నా వంతయింది. జోగిని పేరిట, ఆమె ఊరుమ్మడి ఆస్తి అయిపోయిందన్నమాట. ఎవరు వాడుకుంటారో, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలువదు. సాధారణంగా ఊర్లో మోతుబరి రైతులు, ముఖ్యంగా రెడ్డిలు మొదటగా వాడుకొని, తర్వాత ఇతరులకు విడిచిపెడతారని ఊరివాల్లు చెప్పగా విన్నాం.

ఆమె పక్కనే ఆమె కొడుకు కూడా ఉన్నాడు. మాట్లాడుతూ, మాట్లాడుతూ కొడుకును దగ్గరగా తీసుకొని, “సార్ ఈడు నా కొడుకు. చదువుకునే వయసొచ్చింది. బడిలో చేర్పిద్దాం అంటే తండ్రి పేరు అడుగుతున్నారు సార్లు. ఎవరి పేరు చెప్పాలో సమఝయి తలేదు. దేవుని పేరు చెప్తే కుదురుతదా సార్? ఒప్పుకుంటరా…?” అంది.

ఆ పిల్లోడు తల్లిదిక్కు దీనంగా చూస్తున్నాడు. వాడికి తండ్రెవరో తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తల్లి చెప్పినా, తండ్రి అనేవాడు ఒప్పుకుంటడో లేదో తెలువదు. ఊరు మొత్తం ఆ పిల్లవాడి వైపు “నీ తండ్రెవరు?” అని అడుగుతున్నట్టుగా ఉంది. అది  బయటికి చెప్పుకొవడానికి వీలుగాని దు:ఖం. వాళ్ళ భవిష్యత్తు ఎట్ల ఉంటదో ఊహకందదు. గుడి ముందు రావి చెట్టు కింద నిలబడి, నేను అనుభవించింది ఎవరికీ అర్థంగాదు. అనాథ అంటే వేరు. సానుభూతి ఉంటది. ఎవరికి పుట్టాడు… అంటే వేరు. అది కనపడని కత్తికోత. ఆ జోగిని స్త్రీయే నన్ను ఈ కవిత రాయించింది.

19. పురుషోత్తం, కనుక చారి మునెప్పల జ్ఞాపకాలు చెప్పండి.

”నీవు మరణించే తీరును బట్టి

ఈ జీవితాన్ని అంచనా వేయొచ్చు”

                   – శ్రీశ్రీ

ఈ ముగ్గురిని మూడు వ్యాసాలలో చెప్పాల్సిందే గాని ఒక్క వ్యాసంలో కుదరదు. మునెప్ప మీద ఏమైనా వ్యాసాలు వచ్చాయేమో తెలియదు. కానీ కనకాచారి మెమోరియల్ అనే పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెడ్తున్నరు. ఆ మీటింగు సందర్భంలో ఖచ్చితంగా కనకాచారిని ప్రస్తావించడం జరుగుతోంది. పురుషోత్తం మీద ఏకంగా ఒక పుస్తకమే వచ్చింది. అది చాలా ప్రేరణ ఇచ్చేదిగా ఉంది. ఆయన మీద పాటలు కూడా ఒక క్యాసెట్ వచ్చినట్టు గుర్తు ఉంది. మునెప్ప మీద ఏమైనా వచ్చాయా లేదో తెలియదు.

                                   *** 

మునెప్ప సార్ ని సభలలో కలువడమే గాని పెద్ద స్నేహం లేదు. మునెప్పని చూస్తే నాకు బాల్ జంగయ్య సారు యాదికి వస్తాడు. నిండైన విగ్రహం , మితభాషిత్వం, సూటిదనం, నెమ్మదితనం చూస్తేనే నమస్కరించాలని అనిపించేది. ఆయన సభలలో తిరుగాడితే సభలకు ఒక నిండిన వచ్చేది. ఎలక్షన్లో ఒక బలియమైన పార్టీకి వ్యతిరేకంగా, తమ వాడైన మరో వ్యక్తిని పోటీగా నిలబెట్టడమే ఆయన మరణానికి కారణమైంది

                                  ** *

కనకాచారి నాకు మంచి స్నేహితుడు. కలిసి ప్రయాణం చేశాం. ఆయన పరిచయం కొంత తమాషాగానే జరిగింది. నేను మాసాబ్ ట్యాంకులో, సాయంకాల కళాశాలలో బిఎడ్ చేస్తున్నప్పుడు, కనకాచారి గురించి తెలిసింది. మా బిల్డింగ్ పక్కనే తెలుగు పండిట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. అక్కడే ఆయన గురించి తెలిసింది. ఎవరో పోలీసాయన అట, తన ఉద్యోగం వదులుకొని టీచరు ఉద్యోగంలోకి వచ్చాడని తెలిసింది. “బాగా డబ్బులు ఇచ్చే పోలీసు నౌకరి వదులుకొని ఈ టీచరు ఉద్యోగానికి వచ్చాడా” అని ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తి అంటే గౌరవం కూడా కలిగింది. చూద్దామని పోయిన. ఆయన నింపాదిగా గడ్డి మీద పడుకొని, కాలు మీద కాలేసుకుని మిత్రులతో ముచ్చట పెడుతున్నాడు. కన్నార్పకుండా చూశాను. ఏమీ మాట్లాడలేదు. ఆయన టీచరుగా మహబూబ్ నగర్ లో అపాయింట్ అయినాక మా స్నేహం, వేగం పెరిగింది. అప్పట్లో 1983లో ఏపీటీఎఫ్ తెలంగాణలో అడుగుపెట్టింది 

. అడుగు పెట్టిందే తడవుగా అది ప్రభంజనంలా అమాంతం పుంజుకున్నది. అది ఉపాధ్యాయ ఉద్యమంలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవాలి. ధర్నాలు రాస్తారోకోలు ప్రాతినిధ్యాలు, కరపత్రాలు, ఆఫీసర్లతో నాయకులతో ఢీకొనడాలు, ఇలా ఒకటేమిటి నన్ను ఊపిరి సల్పకుండా చేశారు. అన్నింటికి అడ్డా కనుక చారి ఇల్లు. “మీ ఇల్లు ఒక చౌరస్తాలాగా ఉంది” అని జోకులు వేసేవాడిని. వయసు రీత్యా నేను పెద్దవాడిని అయినందుకు ఏమో నన్ను”యాదన్నా”అని పిలిచేవాడు. 

                             ***

భూత్పూర్ లో ఓ పక్కా లంచగొండి క్లర్కు ఉండేవాడు. వాణ్ణి అప్పట్లో మాంత్రికుడు అని పిలిచేవాల్లం. వాడి మీద ఏపిటిఎఫ్ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఒక పాట రాయాలి. నేను, కనకాచారి ఇద్దరం… మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కూర్చొని, పాట గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నాం. ముందుగానే ఆయనకు ట్యూన్ గురించి చెప్పాను. ఆయన అది విని సంతోషంగా చిన్న పిల్లాడు అయిపోయాడు. పాటకు సంబంధించిన ముఖ్యమైన మ్యాటర్ ఆయన ఇచ్చిందే. కాగితం మీద ఆయన చెప్పింది అంతా రాసుకున్నాను. పాట ఇలా వచ్చింది…

“అన్న.. వీడే వీడే.. దొంగ సూడే సూడే

వీణ్ణి మించిన దొంగ లేడు సూడే సూడే..

అరే.. మాయ మాటలను జెప్పి

పంతులయ్యలను ముంచి

పంది వోలె బలిసినాడు వీడే వీడే…

(రామం భజే… రఘు రామంభజే… అనే రాగంలో పాడుకోవాలి)

మరుసటి రోజు బూత్పూరు వీధుల్లో ఆ పాట మార్మోగిపోయింది. ఎండకు చెమటలు సైతం మరిచి పాటను పైకి ఎత్తడం ఒక గొప్ప అనుభూతి. కనకాచారి లేకుంటే ఆపాట అంతగా పేలేదిగాదు

                            ***

కొన్ని సందర్భాలలో నేను కనకాచారితో విభేదించినా, అవి మా స్నేహానికి అడ్డు రాలేదు. ఎప్పుడు నాతో పరుషంగా మాట్లాడి బాధ పెట్టింది లేదు.  “ఏందన్నా ఇది” అని మందలించుడే గాని ఘర్షణ పడ్డది లేదు. 

కనకాచారి కోపం గురించి  కథలుగా చెబుతారు. ఆయన ఉద్యమకారులతో ఎంత స్నేహంగా ఉంటాడో ఆఫీసర్లతో కొన్నిసార్లు దూకుడుగా ఉంటాడని విన్నాను. ఏకంగా జిల్లా పరిషత్ సీఈవోతో గొడవకు దిగాడంటే ఆయన కోపం ఏపాటితో ఊహించుకోవచ్చు. నేను ప్రత్యక్షంగా ఆయన కోపాన్ని చూసింది కూడా ఇక్కడ చెప్పాలి. ఒకసారి ఏపీ సిఎల్ సి( ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం) ఆధ్వర్యంలో మేము కరువు ప్రాంతంలో పర్యటిస్తున్నాం. అందులో కనకాచారి  కూడాఉన్నాడు. ఒక ఊర్లో, ఒక కుటుంబం వాళ్ళు, వాళ్ళ నాయన కర్మకాండ జరుపుకుంటున్నరు. అందరూ గుండ్లు కొట్టించుకున్నారు. వాళ్ళ నాయన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు మాత్రం మిగిలే ఉంది.

“మీ నాయన చనిపోయిండు కదా. అప్పు ఇంకా మిగిలి ఉంది. ఏం చేద్దా మనుకుంటున్నారు?” అని ప్రశ్నించాను నేను. “ఏం చేస్తాం సార్. అప్పులోనికి పుట్టలేదు కదా. మా నాయనకు పుట్టినం కదా. ఎట్లైనా అప్పు తీర్చాలె… అప్పు ఇచ్చిన వాడు ఊకుంటడా?” అన్నారు కొడుకులు. అక్కడే ఉన్న కనకచారికి పిచ్చి కోపం వచ్చింది. “గీ అప్పు తోటే కదా మీనాయన చచ్చిపోయింది. ఇంకా అప్పు తీరుస్తామంటారేంది? ఎగ్గొట్టండి. ఎవడైనా మల్ల అప్పు తీర్చమని మీ ఇంటికి వస్తే చంపి బొంద పెట్టండి. ఇంకేం మాట్లాడొద్దు. తక్కింది మేము చూసుకుంటాము” అనేసరికి మాకు నోట మాటరాలేదు. ఆ మాటలు అభ్యంతర కరమైనా, ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలి. అప్పులు పేరిట రక్తం పిండిన కొండయ్యను బెదిరించి, అతను అక్రమంగా వడ్డీ పేర వసూలు చేసిన డబ్బులు బాధితులకు పంచిన సందర్భాలు ఉన్నాయి. అందులో కనకాచారి పాత్ర కూడా ముఖ్యమైందే. కనకాచారి బడిలోనే కాదు, బయట కూడా ఉపాధ్యాయుడే. ఆ కాలపు చలనశీలతలో కనకాచారి ఉన్నాడు.

                                     **

పురుషోత్తం నాకు స్నేహితుడే గాక, మార్గదర్శి కూడ. మేమిద్దరం కలిసి నిజనిర్ధారణకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పౌర హక్కుల ఉద్యమంలో పురుషోత్తం ఒక మైలురాయి. నాకు రాయడం అలవాటుగా ఉన్నందుకో ఏమో, నా స్వార్థం కొద్ది ఆయనను చాలా సార్లు కలిసే వాడిని. ఆయన సహచర్యంతోటే నేను కొన్ని కథలు కవితలు రాశాను (బానిసల రాజ్యం, చింత చెట్టు వంటివి). సౌమ్యంగా, స్థిరంగా మాట్లాడుతాడు. నిరాడంబరంగా ఉంటాడుగాని సొంత విషయంలో బాగా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఆయన మీద పోలీసులు వెనుక నుండి దాడి చేసి రాడ్ తో కొట్టాక కుట్లు పడ్డాయి. ఆ తర్వాత కొంత కాలానికి రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే “ఏం మనిషి వయ్యా. ఓ దిక్కు పోలీసులు నీమీద కన్నేసి ఉన్నరు. దాడి కూడా చేసిన్రు. కనీస జాగ్రత్త లేకుండా ఈ రాత్రిపూట తిరగడం ఏంది” అని కసురుకుంటే, నవ్వి ఊరుకున్నాడు.

అదేం ధైర్యమో తెలవదు గాని ఎంత ప్రమాదకరమైన చోటికైనా వెళ్లడానికి జంకేవాడు కాదు. దొరలకు కంచుకోటలైన చోట, మేమిద్దరం కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. నేనేమో దాడి చేస్తారేమోనని, విపరీతంగా భయపడిపోతుంటే, ఆయన నింపాదిగా నడుస్తూ మాట్లాడుతుండేవాడు. ప్రాణం అంటే భయం లేని మనిషిగా బతికినవాడు.

ఒక్క బిడ్డకే వేసక్టమీ చేయించు కుంటే, “ఇంకో బిడ్డ కోసం ఆగొచ్చు గదా” అని గొణిగితే, “ఉద్యమంలో ఉన్నాం గద సార్. ఒక బిడ్డ చాలు” అన్నాడు. అది పిచ్చి అనిపించినా తర్వాతి కాలంలో ఆయనన్నదే నిజమనిపించింది. మానవ సంబంధాల విషయంలో ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రారు. మేము నిజనిర్ధారణకు అచ్చంపేట చెంచు పెంటలను సందర్శించినపుడు, చెంచు మహిళలు ఆయన చేయి బట్టుకొని తమ గుడిసెలల్లకు తీసుకు పోవడం నన్నాశ్చర్య పరిచింది. వీల్లంతా ఎట్లా పరిచయం అంటే, నవ్వి ఊరుకున్నాడు. అక్కడ బండలమీద నిలిచిన వర్షపు నీళ్ళమీద తువ్వాల పరిచి, దాహం తీర్చుకోవడం గురించి చెబుతుంటే, ఆశ్చర్య పడడం నా వంతయింది. నల్లమలలో ప్రతిచెట్టుకూ, ప్రతి పుట్టకూ ఆయన తెలుసేమొనని పించింది. ఎక్కడి నల్లమల? ఎక్కడి గద్వాల? ఎక్కడి పురుషోత్తం…? ఉద్యమమే లేకుంటే ఎవరికి ఎవరం?

మామిత్రుడు వెంకటేశ్వర శర్మ(అచ్చంపేట) అనేవాడు “మా పిల్లలకు మామీద కన్నా పురుషోత్తం సార్ మీదనే ప్రేమెక్కువ. వాళ్ళను తన కాళ్ళమీద పడుకోబెట్టుకొని, మాతో ముచ్చట్లు పెట్టేవాడు” అని. అత్యున్నత మానవ సంబంధాలనుంచే నా పాట పుట్టింది. 

“ఏమవుతడేమవుతడూ..

ఈ పురుషోత్తముడింత మందికేమవుతడేమవుతడూ..

బిడ్డా… నేనన్నజచ్చి… నీవన్నా బత్క పోతివంటూ

తను దీవిస్తే… ఏమవుతడేమవుతడూ..

ఈ మూలనున్న ముసలమ్మకు

ఏమవుతడేమవుతడూ…”

అంబేద్కర్ విగ్రహా విష్కరణకు సొంతూరు (ఐజ)కు వోయి, ఇంటికి పోకుండా దళితవాడలోనే పడుకుని, మరుసటి రోజు విగ్రహా విష్కరణలో పాల్గొని, అటునుంచి అటే గద్వాలకు పోయాడంటే అతని నిబద్ధత ఎంత గొప్పదో అర్థంజేసుకోవొచ్చు. 

ఆయన చనిపోయినపుడు, దాదాపు నలభై వేల మంది హాజరయ్యారంట. ఆయన ప్రజలలో సంపాయించుకున్న ప్రేమ, అభిమానం అట్లాంటిది. ఒకలాయరుగ, ఒక పౌర హక్కుల కార్యకర్తగనే గాదు. మనుషుల్నిమల్చుకోవడం, గెల్చుకోవడంలోను సిద్ధ హస్తుడు. He is my friend,guide and philosapher.

20. వాళ్ల హత్యల సందర్భంగా మీలో ఎలాంటి సంఘర్షణ జరిగింది?

The stars are not wanted now, put out everyone.

Packup the moon and dismantle  the sun.

Pour away the ocean ,and sweep of the wood.

For nothing now can ever come to any good.

                                                – W.H.Auden.

మునెప్ప సారు హత్య జరిగి నపుడు నేను వేరే జిల్లాలో పనిచేస్తున్న. నాకు ఆ వార్త చాలా ఆలస్యంగా తెలిసింది. “అయ్యో… ఇంత మంచి మనిషిని కూడా వదిలిపెట్టలేదా?” అని  చాలా బాధ పడ్డాను. అసలు ఆమనిషిని చంపుతారని నేనుకలలో గూడ ఊహించలేదు.

కనకాచారి హత్య వార్త తెలిసి దిగ్భ్రాంతికిలోనయ్యాను. మహబూబ్ నగర్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన బడికి పోతూ ఉంటే, ఆయన బండిని అడ్డగించి, గుర్తు తెలువని మనుషులు గొడ్డలితో నరికి చంపారని తెలిసింది. అప్పటికి ఆయన వయస్సు యాభై పైననే. అప్పటికే ఆయన చురుకైన రాజకీయాల నుండి తొలగి చాలాఏళ్లయింది. అయినా గొడ్డలికి కంఠం బాధ ఏం పట్టింది. 

మృతదేహం కోసం ఎదురుచూసిన క్షణాలు కత్తి కోత లాంటివి. అందరం మౌనంగా ఉన్నాం. అందరం లోపల్లోపల ఏడుస్తున్నాం. ఉద్వేగ వాతావరణం. ఆ చుట్టుపక్కల చెట్లు, గోడలు, పక్షులు మాతో బాటే ఏడుస్తున్నట్లనిపించింది. అన్నింటికన్నా ముఖ్యం… గొడ్డలి వేటుకు ఆ మనిషి ఎంత విలవిలలాడి ఉంటాడనేది. జ్ఞాపకం వస్తే నిద్ర పట్టదు. నారాయణపేటలో పోస్టుమార్టం చేసి మహబూబ్ నగర్లోని బాలాజీ నగర్ కు తెచ్చేసరికి, మధ్యాహ్న సమయం దాటింది. అప్పటికే హైదరాబాదు నుండి ఆత్మీయులు అందరూ కనకాచారి ఇంటికి చేరుకున్నారు. శోక తప్త హృదయాలతో బాలాజీ నగర్ సముద్రమయిపోయింది.

నాకు బాగా గుర్తుంది. ఆరోజు వరవరరావు సారు, హేమలతక్క అప్పటికే వచ్చి ఉన్నారు. మృతదేహాన్ని తెచ్చేసరికి గంభీరంగా ఉన్నవాళ్లు ఒక్క పెట్టున ఏడ్వసాగారు. మేమైతే చిన్నపిల్లల్లాగ ఏడుస్తూనే ఉన్నాం. హేమక్క ఏడుస్తూ పిచ్చిదానిలా అయిపోయింది. అక్కడే ఉన్న రాఘవాచారిని పట్టుకొని   “చారీ… మనకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?” అనడం గుర్తుంది.

వరవరరావు సారు బోరుమనినేడుస్తుంటే… ఎప్పుడూగంభీరంగా ఉండే ఈ మనిషిలో, ఇంత దుఃఖం ఉందా? అని ఆశ్చర్య పోయాను. అక్కడ చేరిన మందిని చూసి “ఈయనకు ఇంత పెద్ద ప్రపంచం ఉందా?” అని ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి స్మశాన వాటికకు మూడు కిలోమీటర్ల దూరం తీసుకోవాలి. అంత్యక్రియల యాత్రలో నినాదాలతో వీధులన్నీ మార్మోగి పోయాయి. అసలు ఊరేగింపు ఒక నినాదం అయిపోయింది. ఒక చరిత్ర అయిపోయింది.

పురుషోత్తం హత్య జరిగినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నాను. అప్పట్లో సెల్ సౌకర్యం కూడా లేదు. హత్య జరిగిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. పచ్చి కుట్లతో ఇంటికి వచ్చినాక మా మామ. “ఎవరో పురుషోత్తమంటనయా. ఆయన్ను చంపేసిండ్రట. పేపర్లో వచ్చింది” అన్నాడు. ఏ పురుషోత్తం…? ఏం పని చేస్తడు? ఈ వివరాలేవి అడగలేదు. నాకు సిక్స్త్ సెన్స్ చెప్పేసింది. లేవలేని పరిస్థితుల్లో, బోరుమని ఏడ్చేసాను. ఇట్లాంటిది ఏదో జరుగుతుందని తెలిసినా, అది ఇంత తొందరగా, ఇంత దారుణంగా జరుగుతుందని ఊహించలేదు. హైదరాబాద్ పోకుండా మహబూబ్ నగర్ లో ఉంటే కనీసం మనిషైనా దక్కుతుండే నేమో అనిపించింది. స్నేహితులతో అదే విషయం అన్నాను కూడా. వీధులు ఈనినట్లు, అశేష జనం ఆయన అంత్యక్రియల్ని వీక్షించడానికి వచ్చారని తెలిసి ఆశ్చర్యం అనిపించింది. ప్రజల మనిషి గదా… 

పురుషోత్తం చనిపోయాక, ఆయన మీద ఒక పాటల క్యాసెట్ తెచ్చారు. దానిలో నా పాట కూడా ఉంది.

“బిడ్డా… నేనన్న జచ్చి

నీవన్నా బత్క పోతివంటూ

తను దీవిస్తే … ఏమవుతడేమవుతడు

ఈ పురుషోత్తముడింతమందికే మవుతడే మవుతడు..” పాటను, రికార్డింగ్ థియేటర్లో గద్దర్ నాతోనే పాడించాడు (ఎవరి పాట వాళ్ళే పాడాలి). అయితే, ఆ క్యాసెట్ మీద వేసిన బొమ్మ మాత్రం చాలా షాక్ కు గురిచేసింది. ఓ పక్కన పురుషోత్తం తల తెగి పడి ఉన్నాడు. ఆ పక్కన ఆయన సహచరి జ్యోతి ఒక్కతి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. తర్వాత ఆదృశ్యా న్ని చాలా చోట్ల పెట్టి నట్టు గుర్తుంది. 

కొన్ని ఫోటోలు అచ్చు గుద్దినట్టు గుర్తుండిపోతాయి. వియత్నాంలో వెనుక బాంబులు పడుతుంటే నగ్నంగా బాలుడు పరిగెడుతున్న దృశ్యం, సముద్రపు ఒడ్డున పడి ఉన్న చిన్నారి బాలుడు ఎలాన్ మస్క్ మృతదేహం, హత్రాస్ లో అర్ధరాత్రి మండుతున్న దళిత శ్రీ చితి, సద్దాం హుస్సేన్ ఉరి దృశ్యం లాంటివి ఎప్పటికీ వెంటాడుతుంటాయి.. జ్యోతి ఫోటో కూడా అట్లాంటిదే. ఎంత మర్చిపోదాం అన్నా మరుపుకు రాదు.

నా మిత్రుడు, తత్వవేత్త, మార్గదర్శి చనిపోయినప్పుడు కనీసం కడసారి చూపుకు నోచుకోలేదు కదా అనే బాధ ఎప్పుడూ తొలుస్తుంటది. మానవ సంబంధాల విషయంలో మరే మనిషీ సాటిరాని ఆయన. ములుగట్టెతో నన్ను ఎప్పుడు పొడుస్తూనే ఉంటాడు.

ప్రజల కోసం పనిచేసిన వీళ్ళు స్థల కాలాలకు అతీతులు. కాలానికి కావలిసినవాళ్ళు. చరిత్ర మీద చెరగని సంతకం చేసినవాళ్ళు. ప్రేమికులువీళ్ళు

        Do not stand at my grave, and weep.

        I am not there, I do not sleep.

        I  am  thousands winds that  blow .

        I am the thousand glints on snow.

        I am the sunlight on ripened grain.

        I am the gentle autumn rain.

                  – Mary Elizebeth Frye

(ఇంకా వుంది)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply