కవిత్వ వ్యతిరేక మహాకవి – నికనార్ పారా

ఎవరైనా అందమైన పదాలతో, వర్ణనలతో మాట్లాడితే ‘కవిత్వం చెబుతున్నాడు’ అంటారు. ‘కవిత్వం అంటే అట్లా మృదువుగా, సుకుమారంగా, సొగసైన పదాలతో చెప్పేది’ అన్న భావన ఒకటి బలంగా పాతుకుని వున్న రోజులలో అట్లా చెప్పే కవిత్వం పట్ల నిరసనగా సరికొత్త కవిత్వ సాధనాలతో కవిత్వం చెప్పి, ప్రపంచ కవిత్వ ప్రేమికులను, ముఖ్యంగా సంప్రదాయ కవిత్వ ప్రేమికులను నివ్వెరపోయేలా చేసి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న వాడు, చిలీ దేశ కవి ‘నికనార్ పారా’.

‘విప్లవ కవి’ గా విశ్వ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కవి ‘పాబ్లో నెరూడా’ పుట్టి పెరిగిన చిలీ దేశం నుండే నికనార్ పారా వచ్చాడు. అప్పటిదాకా కవిత్వంలో పాతుకుపోయిన భాషకు, ఊహలకు, వ్యక్తీకరణలకు నిరసనగా తన కవిత్వం మొదలుపెట్టాడు కాబట్టి, తన కవిత్వాన్ని ‘యాంటీ పోయెట్రీ’ (విరుద్ధ కవిత్వం) అని పిలుచుకున్నాడు. ‘యాంటీ పోయెట్రీ’ అంటూ ఒక ఉద్యమమే చేసాడు నికనార్ పారా. నికనార్ పారా కవిత్వం, మొత్తం లాటిన్ అమెరికన్ కవిత్వాన్ని ఒక కుదుపుకు గురి చేసింది. అలెన్ గిన్స్ బెర్గ్, నెరూడా కవిత్వాలకు స్ఫూర్తిని యిచ్చింది నికనార్ కవిత్వం అని కూడా అంటారు.

1914 లో దక్షిణ చిలీ లోని కళాకారుల కుటుంబంలో జన్మించిన నికనార్, ఉపాధ్యాయుడైన తండ్రి అడుగుజాడలలో మొదట గణితం, భౌతిక శాస్త్రాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. 1943 లో అమెరికా వెళ్లి అక్కడి బ్రౌన్ యూనివర్సిటీ లో అడ్వాన్స్డ్ మెకానిక్స్ చదువుకున్నాడు. అక్కడి నుండి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో కాస్మాలజీ చదువుకుని, 1946 లో చిలీకి తిరిగివచ్చి, చిలీ విశ్వవిద్యాలయంలో చేరాడు. 1953 లో అక్కడే ప్రొఫెసర్ గా చేరి 1991 లో ఉద్యోగ విరమణ చేసాడు. 2018 లో మరణించేనాటికి నికనార్ వయసు 103 ఏళ్ళు.

ప్రొఫెసర్ గా పనిచేసినా నికనార్ తొలి యిష్టం కవిత్వం. 23 ఏళ్ళ వయసులో తన తొలి కవిత్వ సంపుటి వెలువరించాడు. మరణించడానికి సంవత్సరం ముందు, అంటే తన 102 సంవత్సరాల వయసులో, చివరి కవిత్వ సంపుటి ‘ది లాస్ట్ బ్లాక్అవుట్’ వెలువడింది. నికనార్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కానీ అనేక వివాహేతర సంబంధాల నడుమ జీవించాడు అంటారు.

కవిత్వ సృజన నియమ నిబంధనలను తీవ్రంగా నిరసించిన ఈ కవికి లాటిన్ అమెరికన్ అత్యున్నత కవిత్వ పురస్కారాలు అనేకం దక్కాయి. యువకవుల కోసం అంటూ నికనార్ రాసిన ఒక కవితలో ఆయన యువకవులకు చెప్పిన మాట ఏమిటంటే – ‘తెల్ల కాగితాన్ని ఉన్నతీకరించేలా మీరు ఏది రాయగలిగినా అది కవిత్వమే’!

//గ్లాసు లోని చివరి చుక్కలు//

నచ్చినా నచ్చకపోయినా మనకు
మూడు అవకాశాలు మాత్రమే వున్నాయి
నిన్న, నేడు, రేపు

నిజానికి మూడు కూడా కాదు
వాడెవడో వేదాంతి చెప్పినట్లు
నిన్నటి దినం గతించిన దినం
అది మన జ్ఞాపకాలలో నిక్షిప్తం
ఇదివరకే తెంపిన గులాబీ నుండి
కొత్త రేకుల్ని తీసుకోలేవు

ఇక నీవు ఆడడానికి మిగిలిన కార్డులు రెండే
వర్తమానం – భవిష్యత్తు

అసలైతే రెండు కూడా కాదు
అందరికీ తెలిసిన సంగతే
వర్తమానం అంటూ ఏదీ లేదు
అది యౌవనంలా
గతంలోకి జారిపోతూ
కరిగిపోతూ ఉంటుంది తప్ప

చివరాఖరున
మనకు మిగిలేది రేపు మాత్రమే
నా మందు గ్లాసును ఎత్తుతున్నా
ఎప్పటికీ మన దరి చేరని ఆ రోజు కోసం

ఏం చేద్దాం చెప్పు
మనకు మిగిలింది ఇంతే కదా

//వెనక్కు తీసుకుంటున్నా, చెప్పిన ప్రతి దానినీ//

నిష్క్రమించే ముందు
నా చివరి కోరిక వినాలి కదా

దయగల పాఠకుడా
ఈ పుస్తకాన్ని తగులబెట్టు
ఇది కాదు నేను చెప్పాలనుకున్నది
రక్తంతో రాసినప్పటికీ
అసలు ఇది కాదు చెప్పాలనుకున్నది
ఏదీ నాకన్నా విచారంగా ఉండదు
నేను నా సొంత నీడలోనే పరాజితుడినయ్యాను
నా మాటలు ప్రతీకారం తీర్చుకున్నాయి నా మీద

పాఠకుడా, ప్రియ పాఠకుడా
క్షమించు నన్ను
ఒక వెచ్చని కౌగిలిలో నిన్ను నేను
వొదిలి వేయలేకపోతే
తెచ్చిపెట్టుకున్న బలవంతపు
నవ్వుతో వొదిలి వేస్తాను
బహుశా, అంతేనేమో నేను

కానీ, నా చివరి మాట ఒకటి విను
నేను చెప్పినదంతా వెనక్కు తీసుకుంటున్నాను
లోకంలోని చేదునంతా మింగినట్టున్న మనసుతో
నేను చెప్పినదంతా వెనక్కు తీసుకుంటున్నాను

//రంగుల రాట్నం//

అర్థ శతాబ్దం పాటు కవిత్వం
గంభీరమైన మూర్ఖుల స్వర్గంగా
చెలామణీ అయింది
నేను వొచ్చేవరకూ
నేను రావడమే నా
రంగులరాట్నంతో స్థిరపడ్డాను

మీకు నచ్చితే పైకి రండి
నోట్లోంచి ముక్కుల్లోంచి
రక్తాలు కారుతూ వాళ్ళు దిగిపోతే
నాకే సంబంధమూ లేదు

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply