కవిత్వ భాషంతా ఒక ప్రయోగం

(ఉపాధ్యాయుడిగా, కవిగా, చదువరిగా, సామాజిక సమస్యల పట్ల ఆర్తితో స్పందించే మనిషిగా బాలసుధాకర మౌళి నలుగురికీ తెలిసిన వాడే. వర్తమాన కవిత్వం అనేక విధాల వివాదాస్పదం అవుతున్న దశలో నిలకడగా మౌనంగా రాసుకుంటూ వెళ్తున్నాడు. అతని ఆలోచనలని పంచుకునే ప్రయత్నంలో ‘గోస్తనీ’ గోడ పత్రిక టీమ్ (ఏయు తెలుగు శాఖ) చేసిన ఇంటర్వ్యూ…)

మీ నేపథ్యం?

మా వూరు పోరాం. మెంటాడ మండలం. విజయనగరం జిల్లా. నేను మా వూళ్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివాను. గజపతినగరంలో ఇంటర్ మీడియట్, విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ, ఆ తర్వాత బి.ఎడ్. చేసి – 2009 లో ఉపాధ్యాయుడిగా భైరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరాను. ఆ తర్వాత M.Sc Botany, M.A Telugu కూడా చేశాను. Biological science టీచర్ ని. Science అంటే కుతూహలం. తెలుగు అంటే ఇష్టం.

రచనలోకి మీ ప్రయాణానికి కుటుంబ ప్రేరణ ఉందా?

నేను పుట్టడానికి ఏభైఏళ్ల ముందు మా నాన్న నాన్న చనిపోయారట – ఆయన వెనక్కి సిగముడి వేసేవారట- రోజూ సాయంత్రం చీకటిపడిన తర్వాత ఇరవేసి ఆరుబయట నులకమంచం మీద చేరబడి – ‘నేనెళ్లకెళ్లకెల్తినమ్మ గోంగూరకి.. నే కొత్త కొత్త కోడలనమ్మ గోంగూరకి..’లాంటి – పల్లెపాటలు పాడేవాడట. ఆ ప్రవాహమేదో మా తాత నుంచి నాన్నలోకి, నాన్ననుంచి నాలోకి ప్రవహించిందేమో. మా నాన్న బొమ్మలు వేసేవారు. రంగస్థల నటుడు. ముఖ్యంగా హరిశ్చంద్ర పాత్రధారి. పద్యాలు రాయడం, సాంఘిక నాటకాలు రాయడం కూడా చేశారు.

కవిత్వం రాయకముందు సమాజం గురించి మీ ఆలోచనలు ఎలా ఉండేవి?

సహజంగా చిన్న పిల్లలు గొప్ప సృజనశీలురు. వాళ్లు వేసే బొమ్మలు గాని, రాతలు గాని, చేసే పనులు గాని, మాటలు గాని- సృజన వొలుకుతుంటాయి. ప్రపంచమంతా ప్రతిరోజు కొత్తగా కనిపిస్తుంటుంది. నేను ఆరో తరగతి చదివేటప్పుడు సున్నితమైన కొన్ని కవిత్వవాక్యాలు రాసుకున్నాను. తొమ్మిది, పది చదివేటప్పుడు నా మిత్రుడొకరు- రైతు, వ్యవసాయం, బడి లాంటి అంశాలను ఇచ్చి రాయమని చెప్పేవాడు. నేను పుట్టిందీ, పెరిగిందీ గ్రామీణ వాతావరణం కాబట్టి- గ్రామీణ వాతావరణం కళ్లముందు చాలా సహజంగా నిలిచివుంటుంది. గ్రామీణ భూస్వామ్య భావజాల ఆధిపత్య రూపం నా ఎరుకలో వుంది. వర్ణవ్యవస్థ ఇచ్చిన దన్ను గ్రామాల్లో ఎంత ఆధిపత్య పోకడలకు దారితీస్తుందో బాల్యంలోనే చూశాను. ప్రత్యక్ష సాక్షిని. సమాజమయితే పరిణామం చెందుతున్నది.

కవిత్వం రాయటానికి ప్రేరణ ఎక్కడ నుంచి వచ్చింది?

చుట్టూ వున్న సామాజిక రాజకీయ వాతావరణం నిత్యం సలుపుతుంటుంది. సహజంగా మానవుడు సకల భావావేశాల సమూహం- అది తొలి మానవుడి నుంచి ఈనాటి మానవుడి వరకూ నిరూపణ అవుతున్నదే. నాలో స్పందించే సున్నిత మనస్తత్వమే సృజన పెల్లుబుకడానికి కారణం.

కులం. మతం, దైవ భావనలని ఎలా అర్థం చేసుకుంటున్నారు?

మనిషి ఏర్పాటుచేసుకున్నవే ‘దేవుడు’, ‘మతం’- ఇవి తొలి మానవునిలో ఎలా రూపొందినయో- ఎలా విస్తరించినయో- అదంతా చదువుకున్నాం. నిజం ఏమిటో తెలుసు. ఒక సమాజ పురోభివృద్ధికి ‘దేవుడు’ అనే అబద్ధం ఆటంకం అయినప్పుడు ఘర్షణ పుడుతుంది. తొలి నుంచి ఘర్షణ- మానవ సమాజ లక్షణం. ఘర్షణ ద్వారానే చివరకు నిజం నిగ్గుతేలుతుంది. ‘కులం’ కూడా ఘర్షణ ద్వారా అదృశ్యం కావటం జరగడమే పరిణామం.

కవిత్వం కాకుండా కథలు, నవలలు ఏమైనా రాశారా ?

నేను బతుకుతున్న నేల మీద జనం కోసం రాసే గొప్ప కథకులు నాకు ప్రేరణ. భూషణం మాస్టారి కథానిర్మాణం నిరాడంబరంగా వుంటుంది- భూషణం మాస్టార్ కథలు నాకు చాలా ఇష్టం. ఆనాటి నుంచి ఈనాటి వరకూ కళింగ రచయితల, రచయిత్రుల చాలామంది కథలు చదువుకున్నాను. నేను నిల్చొన్న సమాజం మరింత లోతుగా అర్థమవటానికి కథకులు దోహదపడ్డారు. నా అనుభవంలోకొచ్చిన అంశాలను ఏడు కథలుగా రాశాను. ‘థింసా దారిలో’ మొదటిది. ‘మానిగంప’, ‘గొంతెండిపోతుంది’, ‘ఒక కొండపిల్ల’ మిగిలినవి. ఈ మధ్య- నా బడి పిల్లల కుటుంబ నేపథ్యంలోంచి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను చెబుతూ కథలు రాయాలనే ఆకాంక్షలోంచి మూడు కథలు రాశాను. ఇంకా రాయాలి. బడి- గొప్ప కథా క్షేత్రం.

ఇతర భాషా రచనల ప్రభావం మీ మీద ఉన్నదా?

చదువుతున్నాను. శ్రీలంకన్ తమిళ్ కవిత్వం చదివాను. మన నేల స్వభావానికి దగ్గరగా వుండే కవిత్వం అది. సిరియా, పాలస్తీనా కవులు రాసే కవిత్వం- మహ్మద్ దార్విస్, అదోనిస్, జఘ్తన్ రాసిన కవిత్వం చదువుతున్నాను. ఆఫ్రికన్ కవిత ఏది చదివినా గొప్పగా అనిపిస్తాది. ఘర్షణలేని భూభాగం లేదు. ఘర్షణ నుంచి మానవ కవిత్వం వచ్చింది.

ఇతర భాషా సాహిత్యాల వల్ల మీరు పొందిన మంచి ఏమిటి ?

ఒక కొత్త కవిత్వం- ముఖ్యంగా ఇతర దేశాల కవుల కవిత్వం ఒక కొత్త image ను పరిచయం చేస్తుంది. దాన్ని మన ప్రాంతానికి అన్వయించుకున్నా చాలాసార్లు సరిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మానవుని వేదనైనా ఒక్కటే. ఆఫ్రికన్ కవి దుఃఖంతో మనం మమేకమౌతాం. శ్రీలంకన్ తమిళ్ కవి చేరన్ రుద్రమూర్తి కవిత్వం మనల్ని కట్టిపడేస్తుంది. ఇతర దేశాల కవులు వ్యక్తీకరణకు సంబంధించిన technics నేర్పుతున్నారు.

ఒక కవిత పుట్టడంలో మీ మానసిక ఆవరణం, సమాజం – ఈ రెండింటిలో దేని ఘర్షణ బలీయంగా వుంటుంది?

మానసికావరణం, సమాజం రెండూ మిళితమైనాకే సృజన పుడుతుందని నా పరిశీలన. ఒక సృజనకారునిలో ఒక మానసిక ఆవరణం రూపుదిద్దుకోవటంలో చుట్టూ వున్న సమాజం, సమాజ స్వభావం పాత్ర లేకుండా జరగదని నా గమనింపు. ఇతర రచయితల పుస్తకాలు చదువుతున్న క్రమంలో, నేను రాస్తున్న క్రమంలో – నాకిది అర్థమైంది. ఒక దృశ్యం, ఒక కదలిక, ఒక సంఘటన ఏదైనా సరే.. అది స్పందింపజేసిన తర్వాత – ఏ సృజనశీలిలోనైనా ఒక స్థితి రూపొందుతుంది. ఆ సృజానావరణం దానంతటదే రూపుదిద్దుకున్నప్పుడే అది కవితైనా, ఇంకేదైనా నిసర్గంగా వెలువడుతుందని నా నమ్మకం. అయితే ఏ భూమిక మీంచి వాటిని నిర్వహిస్తున్నామన్నది ముఖ్యం. సమాజంలో, సమాజ నిత్య పరిణామక్రమంలో, అనేకానేక సామాజిక సందర్భాలలో నేనున్నాననే అవగాహన ఎప్పుడూ నాతోనే వుంటుంది. సృజనశీలి మంచి పరిశీలకుడు అవ్వాలి. కవి మానసికావరణం చాలా విశాలమైనది. ఈ మానసికావరణంలోకి సమాజం నుంచి వస్తువు వచ్చి చేరితే, అనుభూతి గాఢతలో పుట్టే ఉద్వేగం శైలిని నిర్దేశిస్తుంది. నా విషయంలో అదే జరుగుతుంది. వస్తువును కవిత్వం చేసే సాధనలో వున్నాను. ఒక్కోసారి వస్తువును శిల్పం డామినేట్ చేస్తుంది. అలా కూడదంటాం , నిజమే – కాని కవిత్వం మాయ మామూలుది కాదు. కవిత్వం రాయడం నిరంతర సాధన అనే ఎరుక వుంది. ప్రతి భావన, ప్రతి అనుభూతి, ప్రతి సందర్భం ఎప్పటికప్పుడు కొత్తగా వుంటాయి కాబట్టి నా ప్రతి కవితా మొదటి కవితలెక్కే భావిస్తాను.

మీ కవిత్వ ప్రయాణం పరిణామాత్మకమా ? నిలకడ అయినదా ? పరిణామాత్మకం అయితే వాటి హెచ్చుతగ్గులు గురించి వ్యాఖ్యానించండి ?

మనం బతుకుతున్న సమాజమే పరిణామశీలతను కల్గివుందని అవగాహన మనకుంది. మార్పు సహజం, స్పష్టం. ఆదిమ సమాజం నుంచి ఇంతవరకూ ప్రయాణం చేశాం. అదంతా చదువుకున్నాను. రేపటిపైన ఆశ వుంది. మార్పుకు గురికానిది ఏదీలేదనే – గతిశీలత సూత్రం ఎరుక వుంది. ప్రకృతిలో భాగమది. కవిత్వమే కాదు ప్రతిదీ మార్పుకు లోనవుతుంది. కవిలో కూడా ఆ మార్పు కనిపిస్తుంది – కొన్ని సార్లు నిలకడగా వుండాలనే ఆశ వొకటి వెంటాడుతుంటుంది- ఆ ఆశే పరిణామక్రమానికి మూలం. ఎప్పటికప్పుడు గొప్పగా అభివ్యక్తం కావాలనే కాంక్ష నాది. అది పరిణామక్రమంతో జతకూడటమే. చిన్న చిన్న జీవితానుభవాల దగ్గర నుంచి సామాజిక చలనాన్ని ప్రభావితం చేసే ఉద్యమాల వరకూ – అన్నింటికీ స్పందించే స్వభావం వొకటి నాలో వుంది. నా స్వభావంతో పాటూ నేను చదువుతున్న ఇతర కవులూ నన్ను ప్రభావితం చేస్తున్నారు. కశ్మీర్ ఆసిఫా ఘటనకు దేశం యావత్తు స్పందించటం, వెల్లువిరుస్తున్న విప్లవ దళిత చైతన్యం, రైతుల మొక్కవోని పాదయాత్రలు – అవి గెలుపు దిశగా వెళ్లటం, భావప్రకటనా స్వేచ్ఛకోసం గొంతెత్తడం – ఇవన్నీ పరిణామక్రమంలో భాగంగానే గ్రహిస్తున్నాను. ఈ స్పందనాక్రమంలో నేనున్నాను. ఘటనలను ఘటనలుగా కాకుండా- ఒక కవిత్వరూపం ఇవ్వగలిగే ప్రయత్నం చేశానని నమ్ముతున్నాను.

ప్రాధాన్యతల్లో భాగంగా చెప్పాల్సివస్తే కవిత్వం మీకు కావాలా, కవిత్వానికి మీరు కావాలా, దేనికి ప్రాధాన్యత? మొదటిది మీ సమాధానం అయితే కవిత్వ రచన వ్యక్తిగతమా, సామాజికమా ?

పాతదే అయినా- ‘నన్ను నేను వ్యక్తం చేసుకోవటానికి కవిత్వం ఒక మాధ్యమంగా అవతరించింది నాకు’ చిన్నప్పుడు బొమ్మలు విపరీతంగా వేసేవాణ్ణి. గీతల్లో దృశ్యాల్లో నన్ను నేను అభివ్యక్తం చేసుకునేవాణ్ణి. చిత్రకళకి దగ్గరిదే కవిత్వమూ. బొమ్మలు వేస్తూనే అక్షరాల్లోనూ నా ఆకాంక్షలనూ, నా ఆలోచనలనూ వ్యక్తం చేసేవాణ్ణి. మొదట సమాజంవైపు దారి చూపించింది శ్రీశ్రీ. ‘దారిపక్క చెట్టుకింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దకతె’ – కవితలో భిక్షగత్తెలను అనేకసార్లు చూశాను. నా ఒకటో సంకలనంలోని కవిత్వం అప్పుడే వూరిన తేటనీరులాంటిదైతే- తర్వాత వచ్చిన రెండు సంకలనాల్లో శిల్ప స్పృహ పెరిగింది. కవిత్వం నాకు తప్పని అవసరం. ‘ప్రతి వ్యక్తిగతమూ సామాజికం’ లాంటి సూత్రాలను వల్లించను గాని- వర్తమానంలో మనం బతుకుతున్న సందర్భాలని, సన్నివేశాలని వ్యక్తం చేసే క్రమంలో వ్యక్తిగతం సామాజికం మిళితమై నిల్చుంటాయి. ‘మనం’ అనే చైతన్యంలో ‘నేను’ అనే స్పృహ కూడా అంతర్భాగవుద్ది. ‘సమూహంలో నేను’ కి ‘ఏకాకితనంలో నేను’ కి తేడా వుందనే అనుకుంటాను. కవిత్వం దుఃఖంలో నిజాయితీగా పలుకుతుంది. అది- సామాజిక దుఃఖమైనా, నేనంటున్న వ్యక్తిగత దుఃఖమైనా. ఏదీ మరొక దానితో సంబంధం లేకుండా లేదని నా భావన. మార్క్సిజం భూమిక మీంచి కవిత్వాన్ని విశ్లేషించిన క్రిష్టోఫర్ కాడ్వెల్ అంటాడు: ‘ భాష సమిష్టి సామాజిక చైతన్య లక్షణం- కావున కవిత్వమూ ఆ లక్షణాన్ని పొదువుకుంటుంది ‘ అని- నావైన పరికరాలతో సామాజికతవైపు మరింత మరింత గాఢంగా అడుగులు వేయటమే తరువాయి. కొత్త వస్తువు, కొత్త శిల్పం- సమాజంలోంచే లభిస్తాయని స్పృహ వుంది.

సాహిత్య అకాడమీ యువపురస్కారం పొందటం మీ కవిత్వ ప్రక్రియపై, మీ వ్యక్తిత్వంపై కొత్త ప్రభావాన్ని చూపే ఆస్కారం వున్నదా ?

కచ్చితంగా సాహిత్య అకాడమీ యువపురస్కారం నా వ్యక్తిత్వంపైనా, నా కవిత్వంపైనా ప్రభావం చూపదు. నా వ్యక్తిత్వం ముందే నిర్దేశించుకున్నది. బలమైన వేళ్లతోనే వుంది- వీగిపోను. వ్యక్తిత్వాన్ని అనుసరించే కవిత్వమూ వుంటుంది. ‘ఆకు కదలని చోట’ సామాజిక సంఘటనల నేపథ్యంలో, శ్రామిక వర్గ చైతన్య స్పృహతో అధిక భాగం కవితలున్న సంకలనం. పురస్కారాలను నేను మరిచిపోతాను. నేను అసలు వాటిని గురించి ఆలోచించను. నా దృష్టంతా చదవటం, రాయటం, నన్ను నేను సామాజిక క్షేత్రంలో పరీక్షించుకోవటం- నా సమాజానికి చాలా బాధ్యతపడి వున్నాను- ఆ పనులుకన్నా పురస్కారాలు ఎక్కువ కాదు. పురస్కారం వచ్చినాక సాహితీసంస్థలు, కళాశాలలు, పాఠశాలలు పిలిస్తే వెళ్లాను. తరగతి గది నా ప్రధానమైన వేదిక- వెళ్లిన చోట్ల విద్యార్థులతో నేనేం మాట్లాడగలను? అనే ప్రశ్న వేసుకుని-విద్యార్థుల ఆలోచనల్లో కొత్త మార్పు ఏమైనా తేగలనా, అనే అంచనా వేసుకుని-విద్యార్థులతో మమేకం కావడానికి వినియోగించుకున్నాను. పనిచేస్తూ నేర్చుకుంటూ సానబడే మనిషిని నేను.

కవిత్వంలోకి మాండలిక పదప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్య. దీనిని ఏ కోణంలో నుంచి చూడాల్సిన అవసరం వుంది?

విస్తృతంగా చదవాలనే తపన వల్ల ఎంతగా ప్రపంచ కవిత్వానికి నన్ను నేను వ్యక్తం చేసుకుంటున్నా- నాకొక ప్రాంతం, నాకొక అస్తిత్వం వున్నదనే స్పృహ వుంది. నేను వూపిరి పీలుస్తున్న నేల మీద జరిగిన చరిత్ర, నడుస్తున్న చరిత్రపైన ఎరుక వుంది. సమీప గతంలో జరిగిన ఉద్యమం, ఉద్యమక్రమం, విస్తరణ చదువుకున్నాను. ఈనాటి వర్తమాన విధ్వంసం- దానికి కారణాలు- తర్వాత ఏమిటి? -ఇవన్నీ విశ్లేషించుకునే క్రమంలో- ప్రాంతీయ స్పృహకి, చైతన్యానికి సంబంధించిన పుస్తకాలు చదవటం; వ్యక్తుల ఆలోచనా స్రవంతులతో కుదిరిన సంపర్కం- కొత్త ద్వారాలు నాలో తెరవడం మొదలుపెట్టాయి. నిజానికి నేనూ పల్లెకారుణ్ణే కనుక సహజంగానే మాండలిక పదాలు కవిత్వంలోకి ప్రవేశిస్తున్నాయి. మన నుడికారంలో మనం కవిత్వం రాస్తున్నప్పుడు ఒక సొంతదనం అనుభవిస్తున్నాను. ప్రాంత నుడికారాన్ని కథ పలికించినంతగా కవిత పలికించకపోవటానికి కారణమేమిటి ? కవిత పూర్తిగా మాండలికంలో రాస్తే అనుకున్న భావప్రసారం జరుగుతుందా ?! మాండలిక కవిత్వం కొన్ని వస్తువుల వరకే పరిమితమవుతుందా ? – ఇవి నా ముందున్న ప్రశ్నలూ, సందేహాలూ- ఈ మధ్య నందిని సిధారెడ్డి గారితో మాట్లాడేటప్పుడు ఈ సందేహాలనే వ్యక్తం చేశాను. ‘మాండలికం మన అస్తిత్వం. అయితే కొన్నిసార్లు మనమనుకున్న భావానికి తగిన పదం మాండలికంలో దొరకదు- అప్పుడు అవస్థ పడాలి- అయినా- ఇప్పుడు మనం educators గా మాట్లాడుతున్న భాషని ప్రజాస్వామికీకరణం చేయటం కూడా అవసరమే కదా ‘ అన్నారు. ‘భాష సమ్మిళితంగా వుండాలి- చివరిగా తెలుగు భాష సంపద్వంతం కావాలి’ అని ఆయన అన్నారు. చాలా చర్చ జరగాల్సి వుంది. పరిశోధనలూ జరగాల్సి వుంది. మాండలికమైనా, ఏదైనా అది సమూహం వృద్ధి చేసుకున్న భాషే అనే అవగాహన మాత్రం నాకున్నది. మొదట నుంచి భాష మీద మోహం నాది. ఏదైనా మోహం లేకపోతే చేయలేను. ఇప్పుడు ఈ నేల నుడికారం మీద మోహం ఏర్పడుతుంది. నాది అణ్వేషణ. అణ్వేషణ పూర్తి సంతృప్తినివ్వదు- అలాగని ఆగదు. అణ్వేషణకుండే గుణమే లోలోపలికి ప్రయాణించటం, సాగటం. ‘కవిత్వ భాషంతా ఒక ప్రయోగం’ అని కూడా నిర్వచించాలనిపిస్తాది.

Leave a Reply