కవిత్వ ప్రపంచంలోకి

ప్రపంచ సాహిత్యంలోకి ప్రవేశించాలంటే ప్రధాన ద్వారం అనువాదమే. మానవుడు సాధించిన వేల సంవత్సరాల సాంస్కృతిక వికాసంలో అనువాదం కీలకపాత్ర పోషించింది. ఒక దేశంలో ఒక జాతి సంస్కృతిలో అంకురించిన భావపరంపర మరొక దేశంలోకి మరొక జాతిలోకి, సంస్కృతిలోకి విస్తరించటానికి దోహద పడింది అనువాదమే. మూలసృజననకు దక్కిన స్థానం, గౌరవం అనువాదానికి దక్కక పోయినా సృజనాత్మక వ్యక్తీకరణ రూపాలను అమితంగా ప్రభావితం చేసిన చరిత్ర అనువాదానికి ఉన్నది. ఏ భాషా సాహిత్య మైన అనువాద ప్రమేయం లేకపోతే ఇప్పటి ఉ న్నత స్థితికి చేరుకునేది కాదు.

రచయిత పరిపక్వత సాధించాలంటే అధ్యయనం తప్పని సరి. తను జీవిస్తున్న సమాజం, రాయదల్చుకున్న భాష సృష్టించబోయే కళారూపం మూడింటికి సంబంధించిన అవగాహన కలిగి ఉండవలసిందే. తన భాషలోని పూర్వపు సాహిత్యాన్ని అధ్యయనం చేయటం ఒక పద్ధతి కాగా వివిధ భాషల్లోని సాహిత్య ప్రత్యేకతలను అధ్యయనం చేయటం మరొక పద్దతి. ఏ అధ్యయనమైనా తన సృజనకు తన ప్రతిభకు అదనపు ప్రయోజనాలు సమకూర్చేదే. రచయితలయినా, సహృదయులైనా ఇతర భాషా సాహిత్యాలను అధ్యయనం చేయటానికి అనువాదమే ఆధారమవుతుంది. ప్రపంచంలోని వివిధ మూల భాషలను నేర్చుకొని చదువుకునే అవకాశం ఎవరికీ సాధ్యం కాదు. కనుక అనువాదమే అనువైన మార్గం. ఒకవేళ అసామాన్య పండితులెవరైనా ఐదో పదో భాషలు నేర్చుకున్నా మిగతా భాషల సారస్వతం కోసమైనా అనువాదాన్ని ఆశ్రయించవలసిందే. బహుభాషా పండితులు తాము అభ్యసించిన బాషల సాహిత్య విశేషాలు ఇతరులతో పంచుకోవాలని ఉత్సాహపడ్డా అనువాదం తప్ప మరో దారి లేదు. అందువల్ల అధ్యయనానికైనా, సృజనాభివృద్ధికైనా అనువాదం కీలక పాత్ర సంతరించుకున్నది.

వర్తమాన పరిస్థితుల్లో ప్రపచంంలోని నాగరికతల నడుమ, సాహిత్య సంస్కృతుల నడుమ ఇంగ్లీష్ అనుసంధాన భాషగా వ్యవహరిస్తున్నది. ఏ దేశ మహాకవిని చదువాలనుకున్నా, ఏ సమాజపు గొప్పకవిత్వాన్ని తెలుసుకోవాలనుకున్నా ఇంగ్లీష్ అనివార్యమైంది. ఇంగ్లీష్ పరిజ్ఞానం సంపాదించిన ప్రతిభావంతులు ప్రపంచ సాహిత్యాన్ని సులువుగా అధ్యయనం చేసే వీలున్నది. అట్లాంటి అవకాశం లేని నాలాంటి జిజ్ఞాసులకు ప్రపంచ సాహిత్యాన్ని చేరువ చేయగలిగేది తెలుగు అనువాదాలే తెలుగుతోనే ప్రపంచకవుల్ని దర్శించే అవకాశం ఎంత సంతసమో, ఎంత గొప్ప అనుభవమో ఒక్క తెలుగు ఒక్కటే వొచ్చినవాళ్లకే తెలుసు. అట్లాంటి గొప్ప ఉత్సాహం పొందే అరుదైన అవకాశం, ప్రపంచకవిత్వాన్ని తెలుగులో అందించే విశేష ప్రయత్నం నారాయణస్వామి అనువాద రచన. నామటుకు నాకు, నాలాంటి ఎందరికో ఇది గొప్ప సదుపాయం. సత్కవితా సంచారం.

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దాదాపు ముప్పయి రెండు మంది కవుల్ని, ప్రపంచ సంచలనం కలిగించిన పదిదాకా ప్రత్యేక సందర్భాల్లో వెల్లువెత్తిన కవిత్వాన్ని నారాయణ స్వామి ఈ సంపుటి ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్నాడు. కేవల కవిత్వాను వాదం కాదిది. ఆయా కవుల వివరాలు, వారి విశేషమైన శైలి, జీవితానుభవాలు, స్థలకాల సందర్భాలు, దేశ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభాలు, ఆర పరిచే దు:ఖాలు, ఆయా దేశాల జాతుల స్వేచ్ఛా పోరాటాలు, నేపథ్యాలు, తద్వారా కవిత్వంలో సంభవించిన పరిణామాలు, సాహిత్య పునర్నిర్వచనాలు, విలువలు, శైలీ శిల్పాల్లో వచ్చిన మార్పులు ప్రస్తావించాడు. వరుస పెట్టి చదువుతుంటే భిన్న భిన్న భావోద్వేగాలకు లోనవుతాం. గాయాలనుంచి, దు:ఖాల నుంచి, పోరాటాల నుంచి, విజయాలనుంచి పూల మీదుగా, ప్రేమ భావనల మీదుగా, మనసు సేదదీరే మానవ సంబంధాల మీదుగా నడుమ నడుమ విరులు వివక్షలు దాటి సున్నితత్వాలకు కరిగి, కఠినత్యాలు గట్టి పడి ఆగుతూ ఆలోచిస్తూ ఆవేశపడుతూ ప్రయాణిస్తాం. అద్భుత కవుల్ని చూడకపోవచ్చు చూసిన అనుభవం కలుగుతుంది. కవుల నిజభాష రాకపోవచ్చు. వాళ్ళతో ముచ్చటించిన ఉద్వేగం కలుగుతుంది. ఆ దేశాలు దర్శించకపోవచ్చు. అంతర్లోకాలు దర్శించిన, సంచరించిన పులకింత కలుగుతుంది. ఏయే ఖండంలో ఏం జరిగిందో ఏయే దేశాన ఏం జరుగుతున్నదో ఏ కవిలో ఏ అగ్ని గుండం ఎందుకున్నదో ఎందుకు మరుగుతున్నదో మనకు సైతం ఎక్కడెక్కడో తాకుతుంది. కొత్తదేదో బోధపడుతుంది. మన అనుభవం, మన భాష పదునెక్కుతుంది.

నారాయణస్వామి గొప్ప కవిత్వ ప్రేమికుడు. కవులతో, ఉద్యమాలతో సంచరించిన భావుకుడు. జాతుల పట్ల, పోరాటాల పట్ల అవగాహన ఉ న్న ఉద్వేగపరుడు, రచన మూలం, లోతు పర్యవసానం తెలిగిన చతురుడు. అందువల్లనే కవిపరిచయాల్లో ప్రస్తావనల్లో తన అభిప్రాయాలు ప్రవహిస్తుంటాయి. “సామాజిక చలనమూ, సామాజిక శక్తుల మధ్య సంఘర్షణ, అభివృద్ధి, పోరాటం ఉన్న సమాజాల్లో గొప్ప సాహిత్యం సృష్టించబడుతుంది.” అని సూత్రీకరిస్తాడు. అంతేకాదు విజయాలు, విజయాలకు సంబంధించిన ఉత్సవాలు, ప్రేమానురాగాలు ఉంటాయి. ఎడబాట్లు, ఓటములు, వివక్షకు సంబంధించిన దు:ఖము ఉంటాయి. వెలుగునీడల్లా అవి ఒకదాన్ని ఒకటి అంటిపెట్టుకొని ఉంటాయ”ని సమన్వయాన్ని ప్రదర్శిస్తాడు. మనిషికీ భూమికీ, మనిషికీ ప్రకృతికీ, మనిషికీ మనిషికీ ఉన్న నిరంతర బంధం, సంబంధం కవుల్లో అక్షరాల్లో వ్యక్తమైన తీరు ప్రస్తావించాడు. అన్ని ఉద్వేగాలకు మూలం మనిషే అన్ని ఉత్పాదనలకు మూలం జీవితమే.

ఎవరిని ప్రేమించాలని ఎవరైనా అడిగితే
మనిషిని అని సమాధానమిచ్చిన
మనిషి తయారు చేసిన అన్నిటికన్నా
మనిషి జీవితమే విలువైంది (రోజ్ విచ్)

అందరూ నడిచి వెళ్లిన మట్టి – ఒక పుస్తకం

కవుల పేర్లు వేరు. దేశాల పేర్లు వేరు. జాతుల పేర్లు వేరు. ప్రపంచుమంతటా మనుషుల స్పందనలు ఒక్కటే. గాయాల తీరు ఒక్కటే. తిరుగుబాట్లు ఒక్కటే. రోజ్ విచ్, సిల్ చినీకోకర్, సమీ అలా కాశిం, నాజిమ్ హిక్మత్, నాథలీ హాండల్, కిం చిహా ఇట్లా ఎందరెందరో- కవుల శైలులు వేరు. అంతరంగ సంచలనాలు దాపులే. పోలెండ్, పాలస్తీనా, ఇరాన్, చిలీ, ఫ్రెంచి, రష్యా, టర్కీ, అమెరికా, ఇరాన్, కొరియా, క్యూబా……ఇట్లా అనేకానేక దేశాల్లో, చరిత్రల్లో, సంస్కృతుల్లో, సంచరించే నానానుభవాలు నారాయణస్వామి నుంచి మనల్ని కూడుతాయి కుదుపుతాయి.

ప్రపంచ భాషలన్నిటిలో కవిత్వానికి ప్రత్యేకస్థానమున్నది. జీవితాన్ని సవివరంగా చిత్రించగలిగిన వచనం కంటే హృదయాన్ని అంచులుగా వ్యక్తీకరించే కవిత్వమే ప్రాధాన్యత సంతరించుకున్నది. కాలం, కష్టం, కన్నీరు, ఊహ, ఉద్వేగం, ఎల్లలు లేనితనం ఏదైనా కారణం కావచ్చు. స్వామి అదే నిర్ధారించాడు. ‘మనం రాయలేని పరిస్థితిలో, వచనం సరిపోని పరిస్థితిలో కవిత్వం పెల్లుబుకుతుంది. అన్ని విముక్తి పోరాటాల్లో కవిత్వం అత్యంత కీలమైన పాత్ర నిర్వహించింది.’ స్వామి కవి కదా – కవిత్వపక్షపాతి. కవిత్వమే లోకమైన సిపాసి. అందుకని కవిత్వానువాదానికి పూనుకున్నాడు. లోకంలోని వివిధ దేశాల కవిత్వాన్ని తెలుగు లోకానికి ప్రసాదిస్తున్నాడు. నారాయణస్వామి అనువాదానికి ఎంచుకున్న కవులూ కవిత్వ ప్రేమికులే. ఆయా కవులు కవిత్వానికిచ్చిన ప్రత్యేక స్థానాలను, ప్రాధాన్యతలను, లక్షణాలను ప్రస్తావించాడు.

“కవిత్వానికున్న చదివేలక్షణం, వర్తమానంలో పాల్గొనే లక్షణం, మార్చే లక్షణం చాలా శక్తివంతమైనవి. నరాల్లో లోతుగా ఇంకిపోయే” వని అంటాడు ఇరాక కవి సాది యూసఫ్. “కవిత్వం రాయండి. ఎందుకంటే అదొక్కటే మనం వ్యక్తీకరించే పద్ధతి. అదొక్కటే మనం జీవించగలిగే జీవితం” అని భావించారు నెగిట్యూడ్ కవులు. నిర్భంధ సమయాల్లో, గొంతులు నొక్కి వేయబడిన సమయాల్లో, ఏదీ వ్యక్తీకరించలేని వేళల్లో
కవిత్వంలో తమ బాధల్ని రాసుకోవడం ద్వారా రాసుకోవడం ద్వారా తమదైన జీవితం జీవించవచ్చునని విశ్వసించారు. కవిత్వానికి జీవం పోసే అంతర్భాగాలను అంచనా వేశారు. కొందరు “కవిత్వానికీ ఊహలకూ పదాలకూ ఉన్న అద్భుతమైన శక్తి అది. అధికార నిర్మాణాలను ప్రతిఘటిస్తుంది. శిధిలాలకు గొంతునిస్తుంది. ఆ శక్తితో నా కవిత్వంలో నేను నాధ్వంసమైన నగరాలను, కోల్పొయిన దేశాన్ని, కుటుంబాన్ని, చెరిగిపోయిన జ్ఞాపకాలను, నా హృదయాన్ని నా పునరాగమనాన్ని పునర్నిర్మించుకోగలిగాను” అని ప్రకటించుకున్నది కవయిత్రి నాథలీ హండల్. కవిత్వంలో పనిముట్లకు పున్నర్నిర్మించుకునే శక్తి ఉన్నట్లే వాటిని ఊపయోగించే విధానం తెలియక పోతే కలిగే నష్టం కూడా పరిగణించవలసిందే. “జీవం పోయలేని విశేషణం హత్యచేస్తుంది కవిత్వాన్ని” అంటాడు విసాంటె విదోబ్రో. ఆయన కవిని ఎంతగా ఉన్నతీకరించి చెప్పాడో ఆశ్చర్యం వేస్తుంది. “కవేకదా నిజమైన దేవుడు” అన్నాడు. “ఎన్నుకోబడని శాసన కర్తలు” అన్న దానికంటే పవిత్రమైనది.

నారాయణస్వామి ప్రధానంగా దేశం కోసమో ప్రజల కోసమో, కవిత్వం కోసమో పరితపించిన కవుల్నే అనువాదానికి ఎంచుకున్నాడు. ప్రభావితం చేసిన కవులతో పాటు ప్రపంచాన్ని కుదిపివేసిన సందర్భాల నుంచి ఉప్పొంగిన కవిత్వాన్ని కూడా అందించటం విశేషం. దాదాపు అట్లా – వియత్నాం కావచ్చు, పాలస్తీనా కావచ్చు, శ్వేత జాత్యహంకార వ్యతిరేక ప్రతిఘటన కావచ్చు. ట్రంప్ విధానాలకు నిరసన కావచ్చు, కశ్మీర్ కావచ్చు, ఇరాక్ కావచ్చు – మ్మిది సందర్భాల కవిత్వం మనకు పరిచయం చేశాడు.

ఆయా సంఘటనలు చదువుతుంటే హృదయపులోతుల్లో కలుక్కు మంటుంది. ‘ఒకదేశమూ సమాజమూ విధ్వంసమై, విచ్చిన్నమై, వేలాది మంది చంపబడి, లక్షలాది మంది కాంది శీకులై పోవడం తన కళ్లముందే చూసిన భయంకరమైన క్షోభ – మారణకాండ(ఇరాక్)’ అయి వుండవచ్చు. ‘అనేక దేశాల నుండి యూదులను ట్రైన్ లో తీసుకొచ్చి ఆషినిట్జ్ నిర్బంధ శిబిరాల్లో బంధించి, నానా చిత్రహింసలు పెట్టి, చివరకు విషవాయు గదుల్లో బంధించి దారుణంగా చంపేసిన హింసాకాండ’ అయి ఉండవచ్చు. ‘మాతృదేశంలో పరాయి వాళ్ళయిన ప్రజల దు:ఖం, సొంత దేశంలో బతకడం కోసం గుర్తింపు కార్డు చూపించాల్సిన అత్యంత దుర్భరస్థితి. దేశం కోల్పోయిన ప్రజల వేదన (పాలస్తీనా)’ అయినా, ‘వజ్రాల కోసం ఒక అడుగు నేల కూడా విడువకుండా రక్కిరక్కిపొక్కిలి చేయబడిన (సియర్రా లియోన్)’ దేశం అయినా కవి హృదయం కకావికలు కాక తప్పదు. కవిత్వం వెల్లు వెత్తిన కాలాలు మనల్ని తాకుతాయి.

కవులు నిరంతరం యుద్ధం చేస్తారు. కాలాలతోను, నిశ్శబ్దంతోను, అంధకారంతోను, ఆధిపత్యంతోను, అణిచివేతతోను, వివక్షతోను, దోపిడితోను, కార్పొరేట్ సంస్థలతోను, బహుళజాతి కంపెనీలతోను,
యుద్ధంతోనూ యుద్ధం చేస్తారు. అంతరంగంతోను యుద్ధం చేస్తారు. ప్రపంచకవుల ప్రత్యక్ష ప్రత్యక్షర యుద్ధం ఈ కూర్పులో ప్రతిఫలించింది. “సమాజంలోని అన్యాయాల పట్ల నిరసన తెలిసిన రచయితలను ప్రభుత్యాలు, అధికార వర్గాలు ప్రతిక్షణం అణిచి వేయటానికే ప్రయత్నిస్తాయి. గొంతు నొక్కటానికి ప్రయత్నిస్తాయి. తాము ప్రత్యేకంగా గొంతు నొక్కలేని పరిస్థితుల్లో కార్పోరేట్ శక్తులతో నోరు మూయిస్తాయి. రచయితల పుస్తకాల ఎటువంటి ఆదరణలేకుండా చెయ్యటానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తాయి. ప్రజలకు సాహిత్యాన్ని, సీరియస్ సాహిత్యాన్ని చదువటానికి సమయం లేని స్థితిని సృష్టిస్తాయి” అని విశ్లేషించాడు ఆఫ్రికన్ కవి సిల్ చినీకోకర్. అక్షరాల జరుగుతున్నదదే. ఇవాళ సాహిత్యాన్ని చదువటానికి సమయంలేని స్థితి అనేక రకాలుగా అనుభవంలోకి వచ్చింది.

నారాయణస్వామిని అనువాద రచనకు ప్రేరేపించింది కవిత్వం పట్ల ప్రేమ ఒక్కటే కాదు. ఆయాకాలాల్లో, ఆయాదేశాల్లో కవులు తాము ఎదుర్కొటున్న సంక్షోభాన్ని ఎట్లా అధిగమించారో ఆ నేపథ్యంగూడా స్వామిని ప్రభావితం చేసింది. ఆ కవులు స్వీకరించిన వస్తువులు, తీర్చిదిద్దిన శిల్పనైపుణ్యాలు, ఆవిష్కరించిన సరికొత్త వ్యక్తీకరణలు అన్నీ తెలుగు అనువాదానికి హేతువులయ్యాయి. స్థానిక భాష మాత్రమే తెలిసిన కవులకు, పాఠకులకు ది జ్మాత్రంగానైనా ప్రపంచ ధోరణులను తెలిపే మంచి సంకల్పం స్వామిని ముందుకు నడిపించింది. కవిత్వం కవిత్వం కోసమే కానట్లు అనువాదం అనువాదం కోసం కాదు. ప్రజా జీవన వికాసం కోసం కదా సాహిత్యం . స్వతంత్రమైనా, అనువాదమైనా అదిసాహిత్యమే. అనువాదాన్ని సాహిత్యకళగా అంగీకరించటం అన్ని విధాలా ఆరోగ్యకరం. కవిత్వాని మెరుగుపర్చుకోవటానికైనా, జీవితాన్ని మెరుగుపర్చుకోవటానికైనా, సమాజాన్ని చైతన్య పర్చటానికైనా అనువాద ప్రక్రియ తప్పక తోడ్పడుతుంది. తెలుగు కవిత్వం ఇతర భాషలకు వెళ్లాలి. ఇతర భాషల కవిత్వం తెలుగులోకి రావాలి.

వివిధ భాషల సాహిత్య సంస్కృతిక పరస్పర వినిమయం ద్వారానే సాంస్కృతికాభివృద్ధి సాధ్యమవుతుంది. వివిధ దృక్పధాల అవగాహన వల్ల, కళాధోరణుల అధ్యయనం వల్ల తెలుగు సాహిత్యానికి వికాసం చేకూరింది. ఒక భాషలో ప్రభావశాలి అయిన సాహిత్యం మరో భాషలోకి అనువదితమైనపుడు ఆ భాష సృజనకారుల్లో కొత్త ఊహలు రేకెత్తించవచ్చు. కొత్త ప్రకియల్ని కొత్త శిల్పాన్ని సృష్టించటానికి దోహదపడిన ఊదాహరణలు ఉన్నాయి. ఆధునికత వేగంగా విస్తరించటానికి అనువాదాలే కారణం.

అనువాద సాహిత్యంలో అనువాదకుని అభిరుచి తప్పక ప్రతిబింబిస్తుంది. నారాయణస్వామి అభిరుచి అనువాద కవిత్వమంతటా అల్లుకొని వున్నది. అక్కడక్కడ విశేషంగా మెరుస్తుంది కూడా. అనువాదకుడు కనబడకూడదని ఎంత అనుకున్నా, జాగ్రత్త పడ్డా తరచుగా తొంగిచూస్తూనే వుంటాడు. ఒకరకంగా అది మంచిది. అభిరుచి లేకపోతే యాంత్రికత చోటు చేసుకుంటుంది. మూలరచనలోని జీవం అనువాదంలో తప్పిపోతుంది. నారాయణస్వామి కవి కావటం వల్ల మూలకవి కవితాత్మ అనువాదంలోనూ అవిష్కరించబడింది. అనువాదంలో కవితాత్మ ప్రధానమంటారు. మాటలు, భాష తెలిసినంత మాత్రాన భావైక్యత లేకపోతే అనువాదం శోభించదు. నారాయణస్వామి అనువాదాలు కవిత్వ పరిమళాలు వెదజల్లుతున్నాయంటే తన అనువాదశక్తికి తన కవిత్వ శక్తి తోడయి వన్నెలు దిద్దిందనే నేననుకుంటాను.

అనువాదం చాలా సంక్లిష్టమైంది. మూలకవి ఏ భాషలో రాశాడో, ఏ అర్ధంలో రాశాడో ఏ భావోద్వేగంతో రాశాడో ఏ శైలితో రాశాడో అనువాదకుడు కని పెట్టగలగాలి. చాలా సార్లు మూల భాష తెలియకపోవడం వల్ల ఆంగ్లభాషనుంచే అనువాదం చేయటం తరచుగా జరిగేదే. అంటే అనువాదం నుంచి అనువాదమన్న మాట. ఎట్టి పరిస్థితిలోనూ అసలు భాషలోని ఆత్మ అనువాద భాషలో పలకదు. పలికించటానికి చిత్త శు ద్దితో అనువాదకుడు ప్రయాత్నిస్తునే ఉంటాడు. స్వామి అట్లా ప్రయత్నించి పరకాయ ప్రవేశం చేసి అసలు కవి ఆత్మను పట్ల కోవటానికి ప్రయత్నించినట్లు మనసుకు తోస్తుంది. నా వరకు నాకయితే అసలు మూల భాష తెలియదు. ఆంగ్లభాష తెలియదు. అయిన కవిగా తెలుగులో చదువుతున్నప్పుడు కవితాత్మ కొంత నాకూతాకుతుందంటే స్వామి అనువాద కృషి సఫలమైనట్లు తోస్తుంది.

  • తుంటరి చెట్టు మొండి గాలితో ప్రేమలో పడింది
  • గాలి సొంతిల్లు ఎక్కడుందో? గాలి సొంతూరు ఎక్కడుందో?
  • సగమై ఉండటంలోనే ఉంది ప్రేమలో అందమంతా – వోవా న్రుక్
  • పూలు తెంపుకోవాలని వొంగినవాళ్లను బుల్లెట్లు మింగేసినాయి – వదిసాదెహె
  • తన రెండు రొమ్ముల స్థానే రెండు సమాధి రాళ్లతో ఆమె – ఒక తల్లి – సిలిచినీకోకర్
  • నన్ను దహనం చేశాక నేను పూలతో నిండిన స్వర్గానికిళ్లిపోతాను – చేలాన్ వియన్

నారాయణస్వామి ఏ పని చేసినా ఒక బాధ్యతతో చేస్తాడు. ఒక ఇష్టంతో చేస్తాడు. ప్రపంచ కవుల పట్ల మమకారంతో చేసినా, తెలుగు కవిత్వం పట్ల అభిమానంతో చేసినా స్వామి అనువాదం కళగా
రూపుదిద్దుకున్నదనే భావిస్తాను. కవిత్వానికి అక్కడక్కడా వ్యాఖ్యానం జత చేసినా సహృదయుల సౌలభ్యం కోసమే.

జీవితానికి కవిత్వానికి ఉన్న సంబంధం తెలిసి ఉండటం వల్ల స్వామి అనువాదాల్లో రెండింటా సమన్వయం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు పాఠకునికి వివిధ ప్రపంచభాషల్లోని కవిత్వం చదువుతున్నా తెలుగు కవిత్వం చదువుతున్నంత హాయిగా అనిపించటానికి కారణం నారాయణస్వామి అనువాద నైపుణ్యమే. క్లిష్టతరమయ్యే దశల్లోనూ అనువాదం చదివించే లక్షణంతో సాగింది. ప్రపంచ కవిత్వం తెలుగులో చదువాలనుకున్న ప్రతి ఒక్కరికీ తప్పక హృదయానికి తాకుతుంది. తప్పక ప్రతిక వికి మెలకువలు నేర్పుతుంది. తనలోపలి పొరల్లోని అంచులను తట్టి జ్ఞాపకాలను, ఊహలను గాల్లోకి ఎగరేస్తుంది. మెరుగైన కవిత్వం రాయటానికి ప్రేరణ కలిగిస్తుంది. ఇది నారాయణస్వామి మన కందించిన ప్రపంచ కవిత్వ దర్పణం. ఈ కవిత్వ దర్పణంలో మనల్ని మనం చూసుకోవచ్చు, మనల్ని మనం చేరుకోవచ్చు మరింత అందంగా అలంకరించుకోవచ్చు. హృదయాన్నీ. కవిత్వాన్నీ.

మరింకేం? అరమరికలేల? కవిత్వ ప్రపంచాన్ని అనుభవిద్దామా…

2 thoughts on “కవిత్వ ప్రపంచంలోకి

  1. అత్భుతమైన వ్యాసం. కవిత్వ ప్రేమికులకు మరింత ప్రేరణ కలిగించే వ్యాసం. సిధారెడ్డి గారికి ధన్యవాదాలు.

    కవి, అనువాదకుడు నారాయణస్వామి గారి శ్రమకి తగిన ఫలితం చేకూరినట్లే. అభినందనలు.

  2. ఆలోచింప చేసే పుస్తకంలోకి గొప్పగా ఆహ్వానం పలికిన వ్యాసం.

Leave a Reply