కవిత్వం గతితార్కికత : నైరూప్య భావాల స్వగతాలు

( జె.సి (జగన్మోహనాచారి) కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ రంగాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించారు. గతాన్ని వర్తమానంతో అనుసంధానిస్తూ యువతరంలో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. విమర్శలో విశేష కృషి చేసిన జేసీ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. సృజన జులై 1991 లో ప్రచురితమైన జేసీ రాసిన ఈ వ్యాసం ‘కొలిమి’ పాఠకుల కోసం…)

నీలిమా గోపీచంద్ సంకలనం ఇక ఈ క్షణం (కవిత్వం ప్రచురణలు-6)లోని కవితల్లో కూడ ఆధునిక కవితా లక్షణం పుష్కలంగా ఉంది. అర్థ వలస, అర్థ భూస్వామ్య భావజాలంలో అంతర్లీనంగా ఉన్న పితృస్వామిక భావధోరణి ఈ కవి కవిత్వంలో కన్పించే ‘ప్రేమ’ అనే నైసర్గిక సామాజిక చైతన్య లక్షణం వల్ల అభావం చెందినట్లనిపిస్తుంది. కాని ప్రధానంగా అధిభౌతిక ధోరణినే ప్రదర్శిస్తున్నది. ఉదాహరణకు “శబ్దించు ప్రియా శబ్దించు” అన్న కవితలో జీవితమనే పోరాటంలో ఒత్తిళ్ళకు తట్టుకో లేక మౌనంలోకి క్రమించిన ప్రియుణ్ణి లేక ప్రేయసిని సంబోధిస్తూ ఈ కవి ఈ విధంగా అంటాడు:
ఏమిటలా మౌనంగా నీవు…
మౌన మహావృక్షం కింద సోలిన అనుభూతి క్షణంలా
శిశిర యుద్ధంలో కూలిన ఎండుటాకు దైన్యంలా
నిశబ్ద నేలమాళిగల్లో జీవితగతిని
పదిలపరచి చూపునెందుకు మేఘావృతం చేస్తావ్
ప్రియా ! మనం యుద్ధకాలంలో బతుకుతున్నాం
కత్తి మొనలపై పెదవులనానించక తప్పదు
ఊహలను అగ్ని పర్వతాల్లో ముంచక తప్పదు

ఏ రోడ్డు మరణం ఎప్పుడో తెలియదు
బాటసారుల మనస్తత్వాలు ఎప్పటికీ
కనీసం ఈ జీవితం వరకూ అర్థంకావు
ఇక్కడి జీవితాలు ఓ జన్మక్రితమే
ఖననం చేయబడ్డ శవప్రాయాలు
ఇక్కడి రక్తమాంసాలు నిర్వికారంగా
భూమిపై నిలబడ్డ ఒంటి స్తంభాలు
వంతెనలు విరిగిపడుతున్న శబ్దం వినిపిస్తోంది!
ఇకింతేనా అనిపిస్తుంది గానీ
ఏదీ భ్రాంతి కాదు

“ఇక్కడి జీవితాలు”- అంటే ఈ ప్రపంచంలో నివసించే జనం — “ఓ జన్మ క్రితమే ఖననం చేయబడ్డ శవప్రామాలు” అన్న పాదాల్లో కన్పించే రూపచిత్రాలు అర్థ వలస, అర్థ భూస్వామ్య విలువల్ని ప్రతిఫలించే ప్రతీకలే. ఇక్కడి అక్కడి జీవితాలు అన్న అధిభౌతిక వైరుధ్యం ఈ కవితలో వాస్తవికతావాద లక్షణాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ లక్షణం ప్రధానంగా బూర్జువా చైతన్యానికి సంబంధించింది. అలాగే ఒక “జన్మ క్రితమే” పాతివేయబడ్డ జీవితాలన్న భావం పూర్వజన్మ, పునర్జన్మలన్న భూస్వామ్య భావజాలాన్ని ప్రకటిస్తున్నది. ఈ రెండు ప్రతీకల్లో యిమిడి ఉన్న అధిభౌతిక తర్కం నుండే ఇంకో ముఖ్యమైన ప్రతీక కూడా జన్మించింది. అది ఈ బతుకు ఒక శ్మశానం, లేక సమాధి వంటిదని. ఈ ప్రపంచంలో బతికే వ్యక్తులందరు ఈ జీవితం అనే శ్మశానం లేక సమాధుల్లో “ఖననం” చేయబడ్డ శవాల వంటివారని అర్థం. జీవితం ఒక శ్మశానం వలె ఉన్నదన్న భావం మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పాశ్చాత్య నాగరికతను శ్మశానంతో పోల్చిన టి. ఎస్. ఇలియట్ వేస్ట్ లాండ్ లోని సామ్రాజ్యవాద చైతన్యానికి చాలా దగ్గరగా ఉంది. జీవితాన్ని ఈ విధంగా చూడడం ఒక ప్రస్ఫుటమైన వేదాంత ధోరణి. ఈ ధోరణి సరుకుల మాయ, వాటి చలనంలోని నైరూప్యత, యాదృచ్ఛికతలకు అనుగుణంగా వ్యక్తి జీవితాన్ని “రోడ్డు” ప్రతీకరిస్తుంది ఈ కవితలో. వ్యక్తుల మనస్తత్వాల్ని బాటసారుల మనస్తత్వాల్నిగా, అంటే వాళ్ళ చేరవలసిన చోటే ప్రయాణం కాని మధ్యలో తారసిల్లే తోటి మానవులతో స్నేహం ముఖ్యం కాదన్న అధిభౌతిక భావాన్ని ప్రకటిస్తుంది.

ఈ తర్కాన్ని అనుసరించే ఎప్పుడో తెలియని మరణమంటే భయపడకుండా ఈ జీవితంలో “బాటసారు”లైన మనకు మన అస్తిత్వాలే (“మనస్తత్వాలు”) అగమ్యగోచరంగా ఉంటాయి అన్న వేదాంత ధోరణితో మాట్లాడినప్పటికీ, మన చుట్టూ ఉన్న సమాజంలో నిస్సహాయంగా బతుకుతున్న వ్యక్తుల జీవితాలు ” జన్మక్రితమే/ ఖననం చేయబడ్డ శవప్రాయాలు… ఒంటి స్తంభాలు” అన్న సత్యాన్ని, తోటి మానవుల యెడల సామాజిక బాధ్యతను వాస్తవికతావాద ధోరణిలో కవి గ్రహిస్తాడు. పరస్పర విరుద్ధమైన అధిభౌతిక ప్రత్యయాల్ని సమానార్థకమైన ప్రత్యామ్నాయాలుగా గుర్తించే ఈ ధోరణి సామ్రాజ్యవాదం కొమ్ముకాసే ధోరణి. దీని వల్ల నే వేదాంతాన్ని, విప్లవ పరిభాషనూ జోడించి కుహనా వైచిత్రిని, ఊహనిబద్ధతను సాధించాడు కవి శైలిలో, లయలో కూడ.

జీవితం నుంచి మహాప్రస్థానం చేసి “మౌన మహావృక్షం కింద సోలిన అనుభూతి క్షణంలా/ శిశిర యుద్ధంలో కూలిన ఎండుటాకు దైన్యంలా/ నిశ్శబ్ద నేలమాళిగల్లో జీవితగతిని పదిల పరచి చూపు”ను మేఘావృతం చేసిన నియోశాక్యముని లేక సీతామహాలక్ష్మి ఈ కవితలో సంబోధింపబడ్డ ప్రియుడు లేక ప్రేయసి. అతడి లేక ఆమె చైతన్యం ఆత్మగతమైన “అనుభూతి క్షణం”తో, ప్రకృతిలో నైమిత్తికంగా రాలిపోయే “ఎండుటాకు దైన్యం”తో, వెలుతురు, వేగం, రవం, రాగం వంటి పదార్థ చైతన్య రూపాలన్నిటి నుండి దూరముయిన “నిశ్శబ్ద నేలమాళిగల్లో”ని జీవితం వంటి స్తబ్దతతో ప్రతీకరింపబడింది. ఈ వాస్తవికత భౌతికమైనా ఆత్మాశ్రయమైంది, యాంత్రికమైంది, అధిభౌతిక మైంది. అంతేకాక పాక్షికమైంది కూడ. ఈ పాక్షిక వాస్తవికతలో నైరూప్యం చేయబడిన ప్రియుడు ప్రేయసి చైతన్యానికి, సామాజిక బాధ్యతకు మధ్య సంబంధం కల్పించడం కవి ఊహావైచిత్రికి పరాకాష్ఠ అని చెప్ప వచ్చును:
ప్రియా ! మనం యుద్ధకాలంలో బతుకుతున్నాం
కత్తిమొనలపై పెదపుల నానించక తప్పదు
ఊహలను అగ్నిపర్వతాల్లో ముంచక తప్పదు

ఈ లైన్లలో కవి దర్శించే “యుద్ధకాలం” గతితార్కిక సత్యమైన విప్లవ పోరాటం కాదు. అది సహజ జీవితంతో సంబంధం లేని నైరూప్య వ్యక్తి చైతన్యంలో అంటే ఆత్మాశ్రయ ఊహల్లో కల్పించుకున్న భ్రాంతి మాత్రమే. ఈ భ్రాంతి ఆధారంగా నిర్మింపబడ్డ అధివాస్తవిక ప్రతీకలే “కత్తి మొనల పై పెదపుల నానించడం”, “ఊహలను అగ్నిపర్వతాల్లో ముంచడం” వంటి రూప చిత్రాలు. విభ్రమం గొలిపే ఈ ప్రతీకల అర్థం ఇది అని చెప్పబూనడం వృధాప్రయాస.

ఈ కవితలోని భ్రమపూరిత వాతావరణాన్ని నిజమని తనకు తాను నమ్మించుకో జూసే కవి ప్రయత్నం సెల్ఫ్ హిప్నాటిజం వంటిది. అతడు మాట్లాడే భాష (కవిత్వం) లో “ఏ భావనా అవ్యక్తం” కాకున్నా “ఏకాంత భాషే”. తనకు తాను శోధించుకోడానికి ఉపకరించే కవితను సృష్టించే క్షణంకూడ “చీకటి తెరల మధ్య శోకితలానే ఉంటుంది.” శాక్యముని, శోకితల కలగాపులగం అయిన తన కవితా హృదయాన్ని జ్ఞాపకాల్ని తప్పుకునే పురాతత్వ ప్రాధాన్యత కల స్థలంగానే తలుస్తాడు కవి. “ప్రవాహ సాన్నిహిత్యం వేరు… స్వప్న సాంగత్యం వేరు” అంటూనే చలనరహితమైన వైయక్తిక చేతనలో (“వ్యక్తి స్వప్న తటాకాల్లో”) ఒక పుప్వు విచ్చుకుని “యుద్ధకాల వాతావరణాన్ని స్పృహించాలి” అంటాడు కవి. జీవిత సమరంలోని విప్లవాభాససు కూడ స్వాప్నిక సత్యంగానే పరిగణిస్తాడు. ఈ పాక్షిక వైయక్తిక సత్యాన్ని “రక్తమాంసంగా చేసి సజీవంగా ప్రవహింపజేయ”డానికే నిశ్శబ్దాన్ని, మౌనాన్ని ఛేదిస్తూ “అరుపును సాయుధం చేయ్!” అని పిలుస్తాడు కవి.

ఇక్కడ మౌనం స్వయః కృతాపరాధం
ఒక ప్రపంచం మూగవోయేట్టు
ఒక ఏకాంతం బద్దలయేట్టు
అరుపును సాయుధం చేయ్!

జీవితమనే సమాధుల్లో ఖననం చేయబడ్డ మనుష్యుల్లో ఒకరైన తన ప్రేయసి లేక
ప్రియుడు నిశ్శబ్దంలో, మౌసంలో మునిగిపోకుండా స్వప్న తటాకంలో విచ్చుకున్న పుప్వువంటి వైయక్తిక చైతన్యంతో నిశ్శబ్దం, మౌనం, ఏకాంతం వంటి “ప్రపంచాల్ని” (శ్మశానాల్ని) బద్దలు చేస్తూ గట్టిగా అరువమని ప్రేరేపిస్తున్నాడు.

-స్వప్నాన్ని “రక్తమాంసంగా” చేయడం, అరుపును “సాయుధం” చేయడం వంటి భౌతిక వాస్తవికత, విప్లవ పోరాటాలనుండి గ్రహించిన మాటలు ఈ కవితకు కవిత్వ భ్రాంతిని కల్గించినా వాటి వెనుక ఉన్న వైయక్తిక చైతన్యం వాటిని ప్రాణం లేని పారిభాషిక పదాలుగానే మిగిలిపోయేట్టు చేసింది.

ఈ సంకలనంలోని అన్ని కవితల్లోనూ ఈ రకమైన ఆధిభౌతిక వాస్తవికతా లక్షణం ప్రకృతిని, పేవ్ మెంటు జీపుల్ని, అణచి వేతను, ఆకలిని, అదంటేమిటో క్షుణ్ణంగా తెలిసిన వెంకట్రావు బాల్యాన్ని, ఈ అంటే ప్రస్తుత క్షణాన్ని రాశి మాత్రంగా గతితార్కిక చారిత్రక భౌతిక సంబంధాన్నుండి విడదీసి తన కవిత్వానికి మదుపుగా వాడుకున్నాడు నీలిమా గోపిచంద్. ఈ విషయం “అతడు అనివార్యం” అన్న కవితను పరిశీలిస్తే ఇంకా ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. హీరో వర్షిప్ అనే అధి భౌతిక ధోరణి “అతడి” చైతన్యాన్ని అధి వాస్తవికంగా మార్మీకరించి నైరూప్యం చేసి కవి మనస్సులోని ఒక ఆత్మాశ్రమ ప్రత్యయంగానే ప్రదర్శిస్తుంది. ఇదే భావం చాలామంది ప్రేక్షకుల మనస్సుల్లో కల్గినా అది అతడితో ఒక నైరూప్య, అసమాన సామాజిక సంబంధాన్ని ఊహించుకుని, దాన్లో తమ స్వేచ్ఛను పోగొట్టుకునే మనస్తత్వాన్నే సూచిస్తుంది. ఈ రకమయిన ఆత్మాశ్రయ నైరూప్య పొగడ్త ఎలిజీ అనే శోకగతంలో మాత్రమే కొంతవరకు శోభిస్తుంది.

అయితే పోరాటం, జీవితం, ప్రశ్నించడంవంటి భౌతిక విలువల్ని అధి భౌతిక ధోరణిలోనైనా అనివార్యంగా గుర్తించడంవల్ల నీలిమా గోపిచంద్ రాసిన వచన కవితల్లో వస్తువులో, లయలో మంచి పట్టు ఉన్న భ్రాంతి కల్గుతుంది. ఈ వాస్తవాన్ని ధృవీకరించడానికి “ప్రశ్న విశ్రమించదు” అన్న శీర్షికగల కవితను ఉదాహరణగా తీసుకుందాం:

ప్రశ్న విశ్రమించదు
సహస్ర రూపాలకో నిరంతరం
సమూహాలమధ్యే కదులుతూ వుంటుంది
మౌనం మహా బడిలో ఒరిగిన పెదవుల
రహస్య స్వగతాల్లో రాజుకుంటూనే పుంటుంది

“సమూహాలు,” అంటే మానవ సమాజాల్లో, మౌనంలోకి నిష్క్రమించిన వ్యక్తుల రహస్య స్వగతాల్లో రాజకునే ప్రశ్న నిషేధింపబడిన గొంతుకల అంటే కపుల చీకటి ఏకాంతాల్లో వారి రచనల పై నిఘా వేసి ఉన్న పాలకవర్గాల అణచివేత భావాలతో పెనుగులాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు – “శిరస్సునెత్తిన చూపుడు వేలుకి శత్రుపు చిరునామా స్పష్టమే.” దేవుడి పేరుమీద, అధికారం పేరుమీద ‘పైనుండి మానవుల శిరస్సుల్ని ఆదిమి పెట్టిచూసే పాలకవర్గాల అడ్రసు ఆ ప్రశ్నకు తెలుసు. అది అధికార నియంతృత్వాన్ని ప్రశ్నించి నిలేస్తుంది. దానికి సమాధానంగా పాలకవర్గాలు “అగ్ని జలపాతాల్ని” (కాల్చివేతలు, బాంబులు వగైరాలు) కురిపిస్తాయి. ఒక మహోన్నత వ్యక్తమయిన పోరాట చైతన్యంగా ఆ ప్రశ్న తలెత్తితే దానికి పాలకవర్గ సమాధానాలు “రాజ ముద్రిత హంతకుల” రూపంలో అంటే పోలీసు, మిలిటరీ, కోర్టుల రూపంలో వస్తాయి. ఆ ప్రశ్నే “ఒక నిలువెత్తు సజీవం” అయిన విప్లవ వీరుని రూపాన్ని పొంది ప్రపంచాన్ని “రక్తసిక్త దృశ్యం” చేస్తుంది. ఆ రక్తసిక్తమైన సామాజిక వాస్తవికత పై అదే ప్రశ్నకు చైతన్యరూపాలయిన “నాల్గు సూటి ప్రశ్నల్ని” చాలెంజ్ గా విసిరేస్తే వాటి ధాటికి తట్టుకో లేక “నియంతలు కత్తులు కక్కుకు చస్తారు.” ఆంటే వ్యవస్థను నిలదేసే ప్రశ్నలై తిరుగుబాటు చేసిన మనుష్యులను అణచి వేయాలని జూసే వ్యర్థ ప్రయత్నంలో నియంతలు చచ్చే చావు చస్తారు. ఆ నాల్గు ప్రశ్న లేవంటే :
“ప్రశ్న ఒక చారిత్రక అవసరం
ప్రశ్న ఒక ఘర్షణా జ్వలనం
ప్రశ్న ఒక అధ్యయన సారాంశం
శతాబ్దాల సంఘర్షణకు అది అలిఖిత మేనిఫెస్టో”
అని ప్రశ్నించే కవి చైతన్యంగా ఈ కవిత జవాబిటిస్తుంది.

మార్క్సిజమంటే “ఏమిటి? ఎట్లా?”అన్న శాస్త్రీయమైన ప్రశ్నలే తప్ప వేరుకాదని మార్క్సిస్టు తత్త్వవేత్తల అభిప్రాయం. వాస్తవాన్ని గురించి ఏమిటిది అని ప్రశ్నించి తెలుసుకుని దాన్ని ఆచరణలో అత్యున్నత సామాజిక చైతన్యంగా మార్చుకునే మార్గమే, అంటే గతితార్కిక చారిత్రక భౌతికవాద చైతన్యం, ఆచరణలే మార్క్సిజంకు పునాది అని అర్థం. కాని ఈ కవిత విషయంలో “ఏమిటి? ఎట్లా!” అన్న ప్రశ్నలు వేసుకుంటే “ఏమిట”ని కొంతవరకు జవాబు దొరుకుతుంది కాని “ఎట్లా ?” అన్న దానికి కాదు. ఈ సమాజంలో తప్పేమిటి? అన్న ప్రశ్నకు ఈ కవితలో దొరికే జవాబు వ్యక్తి చైతన్యాన్ని దేవుడు, అధికారం పేరుమీద అణచి వేసే నియంతృత్వం అన్నది. కాని శ్రమదోపిడి రాజ్యహింస అన్న శాస్త్రీయ సమాధానం కాదు. అయితే దాన్నెట్లా తీసెయ్యాలన్న ప్రశ్నకు జవాబు వర్గ పోరాటం ద్వారా, విప్లవం ద్వారా అని కాని దాని ఊసే ఈ కవితలో కన్పించదు.

శ్రమజీవన సౌందర్యానికి ప్రాతిపదికగా ఏర్పడే సమసమాజ స్థాపనకు వర్గ పోరాటం, దానికి తోడైన శ్రామిక వర్గ చైతన్యం చాలా అవసరం అన్న అవగాహన ఈ కవితలో లోపించింది. ఈ అవగాహన లేనంతవరకు విప్లవం, విప్లవ సిద్ధాంతం అంటే ఏ కవికైనా బుద్ధిగతంగా అనుసరించాల్సిన అధి భౌతిక భావాలే అవుతాయి. కవిత్వంలో వాస్తవికతా వాద (Materialistic) సత్యాలే అయి ఇంకొంచెం ముందుకుపోయి ఆధి వాస్తవికత (Surrealism) లోకి దిగజారిపోయే నైరూప్య అనుభవాలే అవుతాయి. ఈ దృష్టితో చూస్తే గతితార్కికతకూ, అధి భౌతికతకూ మధ్య, కవిత్వానికీ, ఆధునీకతకూ మధ్య నిర్ణాయక పాత్ర నిర్వహించేది శ్రామిక వర్గ చైతన్యం ఉండటమో, లేకపోవడమో అని తెలుస్తున్నది. శ్రామిక వర్గ చైతన్యం రాశిలో, గుణంలో ఎంత మోతాదులో ఉంటే ఆ కవిత్వం అంత ఉన్నతంగా రూపు దిద్దుకుంటుంది.

కాని నీలిమా గోపిచంద్ కవిత “ప్రశ్న విశ్రమించదు” లో “ప్రశ్న” గతి తార్కిక చారిత్రక భౌతిక రూపంగా మార్క్సిస్టు సూత్రంగాకాక భావవాద ధోరణిలో అర్థంచేసుకున్న ఆధి భౌతిక ప్రత్యయంగానే కన్పిస్తుంది. ఇది ప్రధానంగా పెటీ బూర్జువా ధోరణి అని వేరే చెప్పనవసరం లేదు.

*

అలాగే ఆధునిక తెలుగు వచన కవులందరి కవిత్వంలో ఫోర్త్ పర్సన్ సింగ్యులర్ చరిత్ర కాదు, స్వగతమే.

ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్యగల వైరుధ్యం ‘పెట్టుబడిదారీ సమాజంలో సరుకుల మాయగా అత్యంత విపరీత స్థాయి కెదిగి కవిత్వంలో అధి వాస్తవిక ధోరణిగా ప్రస్ఫుటించింది అని తెలుసుకొన్నాం. అన్ని ప్రామాణికాల్నీ నాశనం చేయబూనే ఈ ధోరణి కవిత్వాభావంగా రూపొందినా శ్రామికవర్గ చైతన్యం కల కవిలో తిరిగి అభావం చేయబడుతుంది. కవిత్వానికి, అధి వాస్తవిక ధోరణికి మధ్యగల గుణరాశుల వైరుధ్యంలో స్థూలంగా రాశిగా మారిన కవి గుణాన్ని తిరిగి నిజమయిన కవిత్వంగా వెలిగింపజేసేది శ్రామిక వర్గ చైతన్యమే.

గుణాన్ని అభావం చేసే పరిమాణాత్మక క్రియ క్రమానుగతంగా రాశిని వృద్ధి చేసే క్రియ. ఈ క్రియలోని కార్యకారణ సంబంధం ప్రస్ఫుటించే క్రమంలో నెమ్మదిగా సాగే లయ ఉంటుంది. ఈ లయే వచన కవిత్వంలో మనకు కన్పిస్తుంది. ఈ లయ స్వభావరీత్యానే పరిమాణాత్మకమయి, నిస్తేజమయిన లయ.

అయితే రాశిని అభావం చేసే పరిణామాత్మక క్రమం శ్రమశ క్తిలోని సృజనాత్మకత, శ్రామిక వర్గ చైతన్యంలో ఉంటుంది. గతితార్కిక భౌతిక చైతన్యం వీటిలో అంతర్గతంగా ఉంటుంది. ఈ చైతన్యం ఆచరణలో భాగమైనపుడు, ముఖ్యంగా కవిత్వంలో భాగమయినపుడు జరిగే మార్పు చలనం, గెంతు (leap) మాదిరిగా జరుగుతుంది. ఈ రకమైన గెంతు వల్లనే శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవితలు అధి వాస్తవిక ధోరణిలో రాసినా గతితార్కిక చారిత్రక భౌతికవాద చైతన్యాన్ని సంతరించుకుని లయలో ఇతర సమకాలీన కవులెవ్వరి కవిత్వంలో సాధ్యంకాని వేగాన్ని పొందాయి.

అయితే భారత దేశంలో మన రాష్ట్రంలో జరిగిన ఆర్థిక, సామాజిక ప్రక్రియలన్నీ అర్థవలస, అర్ధ భూస్వామ్య సంబంధాల్నే పెంపొందించాయి. అందువల్ల సామ్రాజ్యవాద దేశాల్లో పెంపొందిన సరుకుల మాయ ప్రభావం, సాంప్రదాయికతా బలం కలగలసిన సామాజిక చైతన్య రూపంగానే మన ఆధునిక కవుల కవిత్వం రూపుదిద్దుకుంది. అలా కాబట్టే వీరి కవిత్వంలో కవి ఆత్మ (self) పాశ్చాత్య కవుల కవిత్వంలో మాదిరిగా సరుకుల మాయ సృష్టి చేసిన చైతన్యంతో పూర్తిగా తాదాత్మ్యం చెందటంకాని లేక దాన్నధిగమించి గతితార్కిక లక్ష్యంతో చరిత్రకు పర్యాయ పదం కావటంకాని జరుగదు. అర్థ వలస, అర్థ భూస్వామ్య భావజాలం ప్రతిబింబించే చైతన్య రూపమయిన స్వగతంగానే మిగిలిపోతుంది. అంటే సంపూర్ణమైన ఆత్మాశ్రయ ధోరణే నీలి కవిత్వంలో కన్పిస్తుంది.

ఈ దృష్టితోనే బాధలూ సందర్భాలూ (కవిత్వం ప్రచురణలు – 8, 1990) లోని త్రిపుర కవితల్ని పరిశీలించాల్సి ఉంటుంది. ‘బాధలన్నీ అమ్మవి సందర్భాలన్నీ నాన్నవి, అందుకని వాళ్ళకే అంకితం ఇవి’ అని తన అమ్మానాన్నలకు అంకితం చేసిన కవితలు ఏడు. అవి వాళ్ళతో కవికున్న సామాజిక సంబంధాన్ని సూచిస్తాయి అని అనుకోవాలి. అలాగే ఈ సంకలనంలో మిగిలిన తొమ్మిది కవితలు తన స్వగతంతో తనకున్న అధి భౌతిక సంబంధాన్ని సూచించే కవితలు,

సంకలనంలోని మొదటి కవిత “బాధా సందర్భం” కవి “గుండెల గుప్త గుహల చీకటిలో” అలలు అలలుగా కాక పుటలు పుటలుగా ప్రవహించే రక్తాన్ని, ఆ రక్తాన్ని తన అవచేతనలో అలా ప్రవహింప చేసే భయాన్ని, ఆ భయాన్ని సృష్టించే అధికారం (సీజర్)లో చారిత్రకంగా ఇమిడి ఉన్న నేర ప్రవృత్తినీ, దాని వల్ల కలిగే గిల్టీ కాన్షస్ నెస్ నూ అది వాస్తవికంగా చిత్రిస్తుంది.

హఠాత్తుగా ఈ భయం.

“సీజర్ చరిత్ర రక్తాన్ని పుటలు పుటలుగా నువ్వేనా
నువ్వూ నా అంటూ పారిస్తుంది నా గుండెల గుప్త గుహల చీకటిలో.

కవిత ఆతని స్వగతానికి పారాసైకాలజీ ధోరణిలో ఉన్న అధి భౌతిక సంబంధానికి
ప్రాతిపదిక నేరం చేశానన్న భావం. పక్షపాతంతో పడి ఉన్న తల్లి డెబ్బయి సంవత్సరాల మృత్యువును నెత్తిమీద పెట్టుకుని (“డెబ్బయి ఎండిన నిండిన ఆకులు తలమీద ముడుచుకున్న/ పేరలైజ్డ్ తల్లి …”) కళ్ళనీళ్ళు కారుస్తుంటే తుడుస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతని అవచేతనలో భాగమైన గిల్టీ కాన్షస్ నెస్ పల్ల ఆమెను జీసస్ క్రైస్ట్ గా తనకు తాను విద్రోహియైన జూడాస్ గా ఊహించుకుంటాడు కవి. అలా ఊహించుకోవడానికి కారణం సంప్రదాయం అతనిలో సృష్టించిన మాతృత్వపు పవిత్రత అనే అధి భౌతిక భావానికి, సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ నాగరికత సృష్టించిన సరుకుల మాయలో భాగమయిన ఈడిపస్ కాంప్లెక్సుకు మధ్య గల వైరుధ్యం పరిమాణాత్మకంగా అతని కవితా మూర్తిమత్వంలో ఒక్కటి గావడమే!

ఈ కవిత మొదటి భాగంలో కవి అధి భౌతిక వాతావరణాన్ని నిర్మించాడు. జీవితంలో సాధారణార్థంలో విజయం సాధించి, విశ్రాంతి విరామాన్ని జ్ఞాపకాల కలల ఊహల సంతృప్తికో నింపుకుంటూ “తలమీగీ ఊచా ఊలు కిరీటాన్ని/ పైకెత్తి వ్యాపిస్తున్న బట్టతలని, చెక్కరలాంటి విషాదపు వేళ్ళ చివర్లతో నిమురుకుంటూ, వుంటూన్న/ వేళ” గెలుపు అధికారాలతో పాటే నైరూప్య నేర భావనగా పరాయీకరణ చెందిన మానవాంశ అతనిలో విజృంభిస్తుంది. అది తీపిని కాక విషాదాన్ని, ప్రేమను గాక ద్రోహాన్ని నిజమైన మానవ ఉద్రేకంగా పరిగణిస్తుంది.

ఇక తన తండ్రితో కవికి గల సామాజిక సంబంధాన్ని “వ్యధ ఒక కథ” సూచిస్తుంది.

“ఒక్కొక్కప్పుడు సమస్తం నిన్ను గాయపరుస్తున్న సమయంలో
బ్రతుకుతూ వుంటావ్” అని తన తండ్రినే సంబోధిస్తున్నాడని అనుకొంటే, ఆ సమయం జీవితంలో డబ్బూ, కీర్తి అన్నీ సాధించి కూడా అన్ని విధాలా ఏకాకై పోయిన తండ్రి, మారకపు విలువల ప్రపంచంలో ఊరట చెందలేని తాపదగ్థ స్థితిని సూచిస్తుంది. సరుకుల మాయలో అభావం చెందిన మానవాంశ అన్నీ ఉండి కూడా దేనిలోనూ మనశ్శాంతిని పొందలేని వికృతాంశగా మారిపోయింది. అతనిలో అందుకే అతని చుట్టూ
కరుణతో క్రిస్మస్ పువ్వులాగా విడుతున్న ఉదయం నీ చుట్టూ తెగనుండి ధ్వంసమైన లాండ్ స్కేప్ వలె – వ్యాపిస్తుంది.

“కరుణతో క్రిస్మస్ పువ్వులాగా” వ్యాపించే ఉదయం సహజంగానే ఆనందాన్నిచ్చే ఉదయమైనా “క్రిస్మస్” ప్రసక్తి ఆ ఉదయం నుండి చల్లదనాన్ని, స్పూర్తిని పొందలేని తన తండ్రిలోని పరిస్థితిని సూచిస్తుంది. క్రిస్మస్ పువ్వు జీసస్ క్రైస్టు సందేశమైన ప్రేమను సూచిస్తే తన ఆచరణలో దాన్ని నిరాకరించిన కవి తండ్రికి ఆ పువ్వులాగా వికసించే ఉదయం మంటల వేడిని, విధ్వంసాన్నే కన్పించేట్టు చేస్తుంది. సహజంగానే సంతోషాన్నిచ్చేవన్నీ – “పెదురు పువ్వుల పచ్చటి మంచి గాలి” వంటి వన్నీ తను వాడుక విలువల ప్రయోజనాన్ని కోల్పోయి అతణ్ణి అంధుడ్ని చేస్తాయి. “నెమ్మదిగానే నడుస్తున్న వీధి కళ్ళు కాళ్ళ విసుర్లు వ్యాఖ్యానిస్తాయి.” వీధిలో జనంతో పరాయీకరణ చెందిన ఆయన సానుభూతి శతృత్వ భావంగా మారిపోతుంది. “గుడ్డిగా జాలిగా అన్ని మాటల్లోనే కొరల్లా మెరిసే కై జారులు/ నీ రక్తం కోసం ప్రసుత్తులై వొదిగి వుంటాయి!” అమాయకత్వంతో జాలిగా ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు కూడా తన ఆహాన్ని పొడిచేందుకు దాచిన ‘కై జారుల ఒరల్లాగా కన్పిస్తాయాయనకు. అలాగే ఆయన కూడబెట్టుకున్న సంపద వస్తువుల రూపంలో ఆయన ప్రాణాన్ని కాజేసి అతణ్ని నిర్వీర్యుణ్ని చేసి వేశాయి.
నీ ప్రాణం లేని పూపిర్ని ఘనంగా పీలుస్తున్న వస్తువులు
భూతాల రూపాలయి ఎనీమిక్ గా నీ వెన్ను వెనుక మూగుతాయి

సరుకుల మాయలో చైతన్య విహీనుడయిన ఆయన పూపిర్ని తమ స్వంతం చేసుకుని నైరూప్య జీవంతో అతని ఎనీమిక్ వెన్ను వెనుక దన్నుగానో, లేక అదను చూసి మింగేసే భూతాల్లాగానో పొంచి ఉన్నాయి, అమ్మకపు విలువలైన వస్తువులు.

అలాగే ఆతని అలంకరణ సామగ్రి జీవిత సముద్రంలో అతని జ్ఞాపకాల కార్గోల్ని మోస్తూ ఆతని ఉద్రేకాల టైపూన్లలో ఊగిసలాడుతుంది. మేడ మెట్లు పులుపుల్లో యాదృచ్ఛికమనిపించే నిపురు కప్పుకుపోయిన నిన్నటి ట్రాజెడీ అప్పటికీ కన్నీళ్ళతో తడుస్తూ కుప్పలు పడి మూల్గుతున్నవి. ఎటు తిరిగితే అటు సమాజంలో అతడి కెదురౌతూ గాయపరుస్తున్న కాలంగా అనిపిస్తున్నది అతని ఏకాకితనమే.

ఆ ఏకాకితనానికి అడ్డుగా కిటికీ తెర దించేసి మంచంమీద వాలి “ఇంకొక విస్తారమైన దృశ్యంలోకి విప్పారుదామని” పుస్తకం తెరిస్తే దానిలోని అక్షరాలు కూడా ఇదివరకటి భయోత్పాతాన్నే సృష్టిస్తున్నాయి. ప్రకృతి నుండి, సమాజం సుండి, చివరకు తననుండి తాను ఒక నైరూప్య వస్తు సంబంధంగా పరాయీకరింప బడిన అతని ఉనికి ప్రకృతిలోని అందాన్ని చూస్తే, తోటి మానవులు సానుభూతి ప్రదర్శిస్తే, పుస్తకాల్లో అక్షరాలు వ్యక్తీకరించే వాస్తవాన్ని గమనిస్తే విలవిలలాడి పోతుంది. ఈ రకమైన పరాయికరణను అభావం చేయడానికి చివరకు అతడి మిత్రుడు. ఆరోవిల్లి సుండి పంపించిన ఆత్మ సాక్షాత్కార సందేశమే పనికి వస్తుంది. ఒక సీతాకోక చిలుక అందం, ఉదయించే సూర్యుడి వెచ్చదనం, పెంపుడు పిల్లి ఆశ్వాసన అనబడు ఆత్మగత సంచలనాల్ని (subjective sensations)
ప్రేమిస్తే పరాయీకరణ నధిగమించి తిరిగి, తాను మానపుడుగా జీవించవచ్చునన్న నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తుంది ఈ కవితను పరికిస్తే. ప్రకృతితో, సమాజంతో మనిషికున్న గతితార్కిక భౌతిక సంబంధాన్ని పునరుద్ధరించకుండా సరుకుల మాయలో పడి కాంతిని కోల్పోయిన మనిషి అరవిందుని ఆధిభౌతిక ఆత్మ సాక్షాత్కారంలో దాన్ని పొందుతాడని అనుకోవడం అర్థ వలస, అర్ధ భూస్వామ్య భావజాలంలో పూర్తిగా మునిగిపోవడమే.

అందువల్లనే ఇంకొక వ్యక్తిని సంబోధించినట్టున్నప్పటికీ ఈ కవితలో ఫోర్ పర్సన్ సింగ్యులర్ స్వగతమే పాత్రధారి. అధి వాస్తవిక వచన ధోరణే దానికి తగిన వస్తురూపం.

త్రిపుర కవితా సంకలనంలోని మిగతా తొమ్మిది కవితల్లో కూడా ‘కాళీపట్నం రామారాపు మాస్టారికి అర్థంకాని,’ పెరాసైకాలజీ ప్రొఫెసరు పి. పి. కృష్ణారాపుకి అర్థమయ్యి ఏవిటో అడగని కాఫ్ కా థీమ్ గా నెరపు భావమే వాస్తవికతా ధోరణినుండి అధివాస్తవికతా ధోరణిలోకి ప్రచ్ఛన్నంగావటమే కన్పిస్తుంది.

గతితార్కిక జీవలయ :

కవిత్వం ప్రచురణ, ఐదవ సంకలనం (1991) రావిశాస్త్రి కవిత్వంగా రాయని కవిత్వం ఎన్నెలో ఎన్నెల. ఆయన రాసినవి నవలలు, కథలు. ఫెయిల్డ్ పోయెట్ నని చెప్పుకున్న రావిశాస్త్రి, “కవితా రంగాన్ని వదిలి పెట్టి వచనంలోకి వెళ్ళిపోయారు” అన్నారు సంపాదకులు. అయినా “అప్పట్లో వచనం పేరుతో రావి శాస్త్రి రాసింది ఈనాటి అత్యాధునిక కవిత్వంతో పోటీ పడగల్గుతోంది…” అని కూడా అంటున్నారు వారు. కాని నిజానికి పోటీ పడటం కాదు, వెయ్యి రెట్లు మించి పోయింది అని ఉండాల్సింది.

దాదాపు కవిత్వం ప్రచురణల కవులందరికి వచన కవిత్వమంటే పోజిటివిస్టిక్ తార్కిక దృష్టే ఉంది. వచనం, కవిత్వం వేర్వేరు భాషా రూపాలని. నిజానికి ఆ రెండూ కూడ సామాజిక చైతన్యంలో స్థాయీ భేదం ఉన్నా భాగాలే. దాని రూపాలే. వచనం శాస్త్ర విషయాల్ని, సామాజిక వాస్తవాల్ని చర్చించడం, వర్ణించడం కోసం, కవిత్వం సౌందర్య భావనను (రసాన్ని) వ్యక్తం చేయడం కోసం ఉపయోగించే సాధనాలన్నదే ఆధునిక దృష్టి. కాని ఈ దృష్టి ప్రధానంగా యాంత్రిక దృష్టి అన్న విషయం మనకు స్పష్టం.

భూస్వామ్య యుగంలోని ఛందస్సుల్ని, వ్యాకరణ నియమాల్ని, సంధుల్ని, సమాసాల్ని ధిక్కరించి ప్రజాస్వామ్య యుగంలో మొదట మాత్రా ఛందాల్ని, తరువాత వచన రూపాన్ని పొందిన కవిత్వం మామూలు వచనం కంటే ముందుకు పోయి వస్తువులో రూపంలో లయప్రధానమైంది. బూర్జువా కాపిటలిస్టు సమాజంలో ఈ లయను అంతిమంగా నిర్ణయించేది సరుకుల చలనం, వాటి మధ్య సంబంధం అంటే మారకపు విలువలో ఇమిడి ఉన్న వేగం. సామ్రాజ్యవాద యుగంలో ఈ లయ వాస్తవికతావాద ధోరణి నుండి అధివాస్తవికతా ధోరణిలోకి మారుతుంది. సమకాలీన ప్రపంచంలో సాధించిన శాస్త్ర వైజ్ఞానిక, తాత్త్విక విషయాలన్నిట్లో కవి వ్యక్తావ్యక్త ప్రపంచంలో సరుకుల మాయలో ఇమిడి ఉన్న యాదృచ్ఛిక, మార్మిక, యాంత్రిక, అది భౌతిక లక్షణాలన్నిట్లో గల నిర్నిబద్ధలయ ఈ ధోరణిలో కనిపిస్తుంది.

అయితే నిజానికి ఈ లయ – గతితార్కిక చైతన్యాంశం కావటంవల్ల భాషలో, ప్రతీకల్లో, పదబంధాల్లో, శబ్దాల ధ్వని ఒరవడిలో, శబ్దార్థాల సంఘర్షణలో, వాటిలోనే వ్యక్తమయ్యే భావాల్లో వీటన్నిటినీ శక్తివంతం చేసే శ్రామిక వర్గ పక్ష పాతం చైతన్యంలో ప్రాణం పోసుకుంటుంది. శాస్త్ర వైజ్ఞానిక తాత్త్విక విషయాలన్నీ ఈ చైతన్యంలోంచి ఉద్భవించినవే. ఈ గతితార్కిక జీవలయను తన చైతన్యంలో భాగం జేసుకున్న రచయిత, కవి వచనం రాసినా, అంటే నవలలు, కథలు రాసినా, అది అధి భౌతికమైన పోజిటివిస్టిక్ తర్కంతో రాసిన అధివాస్తవిక కవిత్వం కంటే వేల రెట్లు మెరుగ్గా ఉంటుంది. నిజానికి గతితార్కిక జీవ లయను ప్రోది చేసుకున్న కవిత్వమే నిజమయిన కవిత్వం. ఎన్నెలో ఎన్నెల నిండా నిజమయిన కవిత్వమే ఉంది.

వరంగల్. కవి, రచయిత, అధ్యాపకుడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. 'సృజన' ఆధునిక సాహిత్య వేదికను నిర్వహించే 'సాహితీ మిత్రుల'తో కలసి పనిచేశారు. 1969లోనే 'ఫ్రీ - ఫ్రాంక్ వర్స్ - ఆధునికత', 'ఆధునికత - తెలుగు వచన కవిత' లాంటి లోతైన విమర్శ వ్యాసాలు రాశారు. 'జేసీ' పేరుతో 1980లలో అద్బుతమైన కవిత్వ విమర్శ వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నీ 1991లో 'కవిత్వం - గతితార్కికత' పేరుతో ప్రచురించారు. సునిశిత విమర్శతో మూడు దశాబ్దాల పాటు యువతరాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ఫ్రొఫెసర్ గా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం రిటైరయ్యారు. అనంతరం అమెరికా వెళ్లారు. 30 మే, 2021న బ్రాంకైటిస్ తో అక్కడే చనిపోయారు.

Leave a Reply