అనగనగా నిజాలను చెప్పిన కవయిత్రి అనిశెట్టి రజిత

మనిషి సంఘజీవి అని తత్వవేత్తలు, సంఘ సంస్కర్తలు నిర్వచనాలు ఇచ్చారు. ఐనా మనిషి తన వ్యక్తి గత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సంఘం గురించి చాల తక్కువగా ఆలోచిస్తాడు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఎల్లవేళలా సమాజహితాన్ని కాంక్షిస్తూ, అదే సమాజానికి తమ జీవితాలను అంకితం చేసినవారు ఉంటారు. అటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. అందులో అనిశెట్టి రజిత ఒకరు. నిత్యం ప్రజా ఉద్యమాలలో భాగస్వామిగా ఉంటూనే తన వంతుగా సాహిత్య సృజన చేస్తూవస్తున్నది. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాల సాధకభాధకాలపైన కొట్లాడుతూనే ఉంది. ఇల్లుదాటి అడుగు బయటపెట్టిన, కలం పట్టి ఏ అక్షరం రాసినా అది ప్రజల పక్షం కొరకేనని ఆమె సాహిత్యం చూస్తే అర్థం అవుతుంది. అందులో భాగంగానే కవిత్వంలా జీవిస్తున్న మనుషులకు తన కవిత్వాన్ని అంకితం చేస్తూన్నానంటూ వెలువరించిన కవితా సంపుటిలో ఒకటి “అనగనగా కాలం”. నలభై కవితలతో కూడిన ఈ సంపుటి 2005(ఆగస్టు)లో వెలువడింది. వర్తమాన కాలాన్ని, గతకాలపు జ్ఞాపకాలను మిళితం చేసి”అనగనగా కాలం”అంటుంది కవయిత్రి. వర్తమాన సమాజానికి ఈ సంపుటి ఒక భవిష్యత్ దర్శనిగా చూడవచ్చు.

కవయిత్రి తనకు మాత్రమే సొంతమైన కవితా నిర్మాణ వైఖరితో కవిత్వం రాసింది. ఇతరులతో పోలికలకు, ఉపమానాలకు తావులేని శైలితో రాసే ఆమె కవిత్వం ప్రత్యేకం. ఉద్యమాల నేపథ్యంతో, ప్రజలతో మమేకమవుతూ, సామాజిక అనుభవంతో రాసే ప్రతీ పలుకు, ప్రతీ అక్షరం సామాన్యుణ్ణి నుండి గ్రహించినవే. అణిచివేత, ఆధిపత్య భావజాలాలకు దూరంగా ఉండే వ్యక్తిత్వం ఆమెది. అదే మనఃస్తత్వం ఈ కవితా సంపుటిలో కనిపిస్తుంది. రాజకీయ చైతన్యం, సామాజిక వైరుధ్యాలు, అస్తిత్వ నేపథ్యాలు, తెలంగాణ భాషా కలగలుపుతో తన కవిత్వం ముందుకు సాగుతూ ఉంది. అసంబద్ధ పొగడ్తలు, ఒక వర్గానికే పూర్తిగా వత్తాసు పలకడం వంటివి తన కవిత్వంలో ఏ మూలనా కనిపించవు. తన కవిత్వంలో వస్తు పునరుక్తి కనిపించినా ఆమె సామాజిక స్పృహకు, సహృదయ స్పందనకు పాఠకులుగా మనఃస్ఫూర్తిగా సంతోషించాల్సిందే. కవిత్వానికి శిల్పమే ప్రాణమని భావించే కొంతమందికి, ఒక వర్గానికి రజిత కవిత్వం రుచించక పోవచ్చు. పల్లెల నుండి ప్రపంచం దాకా అందరూ ఎదుర్కొనే ప్రజా సమస్యలే తన కవితా వస్తువులు. కవితా సంపుటి విషయానికి వస్తే సమస్యలనేవి ఎలా ఉత్పన్నమవుతున్నాయి, వాటి పరిష్కారాలు ఏంటని వాటి మూలాల వరకు వెళ్తూ తనను తాను ప్రశ్నించుకుంటూ పాఠకులను ఆలోచింపచేసేట్టు ఉన్న కవిత “ఎందుకిట్లా?”. ప్రస్తుతం పల్లెలు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించిన పంక్తులు.

సంపుటి వెలువడి నేటికి పదిహేను సంవత్సరాల కాలమైంది. ఐనా తను ఎంచుకున్న కవితా వస్తువులు నేటి పరిస్థితులకు నూటికి నూరుపాళ్లు సరిపోయేలా ఉన్నాయి. గ్రామాలలోని ప్రజలు, వారు ఎదుర్కొంటున్న అంతర్మథనం తన కవిత్వంలో కనిపిస్తుంది.

“నీల్ల మడుగుల్లేవ్ కుంటల్లేవ్
ఎడ్ల బండ్ల ఉరుకుల్లేవ్”
గతంతో పోల్చుకుంటే పల్లె ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఉన్న చెరువులు, కుంటలు నేడు లేవు లేవు. పండిన పంటలు రవాణా చేసేందుకు ఉపయోగించే ఎడ్ల బండ్లు కూడా లేవు. యాంత్రీకరణ ఎక్కువై వ్యవసాయం కనుమరుగవుతున్న రోజు నుండి ఎద్దుల వాడకం తక్కువైపోయింది. ప్రజలు అన్ని రకాల పాత విధానాలు మరిచిపోయారు. వీటన్నింటి గురించి వాపోతు అసలు ఈ పల్లెలకు ఏమైందంటూ తిరిగి ప్రశ్నించుకుంది. పాఠకులను ఆలోచింప జేసింది.

మారిన విధానాలతో పల్లెలకు పల్లెలే భవిష్యత్ పరిణామాల గురించి భయంగా ఉన్నాయి. తప్పిపోయిన కుక్కపిల్ల లెక్క అమాయంకంగా, దీనంగా మారిపోతున్నాయి. వర్షాలు లేక పంట భూములున్నీ పిచ్చి చెట్లతో నిండి పోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ వలసల దిశగా పయనమవుతున్నారు. జరుగుతున్న యదార్థ సంఘటనలు గ్రామాలకు భవిష్యత్ ఉంటుందో లేదో అనే అనుమానాన్ని కూడా కలుగజేస్తున్నాయి. వీటన్నింటి నుండి ఎదురయ్యే భయాలను దిగమింగుతూ దేవుళ్లను తలుచుకుంటూ అక్కడా ప్రశ్నలను వేసింది.

“మా దూపలు తీరాలంటే
పురుగుల మందే తాగాలన”.
రైతు, వ్యవసాయ దీనావస్థ అందరికి తెలిసిందే. కానీ 2005 అంతకు ముందు వరుస కరువులతో సతమతమవుతున్న కాలం. అప్పటికే వ్యవసాయానికీ, నిత్యావసరాలకు చేసిన అప్పులు బాధలు రెట్టింపు అయ్యాయి. పంటల దిగుబడులకు వేయాల్సిన పరుగు మందులను రైతులు తమ తనువులు చాలించడం కొఱకు ఉపయోగించుకున్నారు. ఇక ఈ జనులకు ఆహారాన్ని అందించేవారెవరు. అంతా అయోమయమైన సందర్భాలను గురించి ఎందుకిట్ల, ఇంకా ఎప్పటిదాక ఈ వ్యధ అనే ప్రశ్న నిత్య ప్రశ్నార్థకమైంది. ఇదే వైఖరిని పల్లెపై ఆమెకున్న ఇష్టాన్ని వ్యక్తం చేసిన మరో కవిత “పల్లె లేచిపోయింది”.

వలస మూలాలను, కారణాలను, పర్యావసానాలను ఇందులో చూడవచ్చు. అవసరానికో అబద్ధం, పూటకో మోసం చేసే మనఃస్తత్వంతో రోజుకొక రంగు మార్చే వ్యవస్థను గురించి రాసిన కవిత బహుముఖాలు. ఇది సర్వకాలీన, సార్వజనీన వస్తువు. మనుషులు తమ ఇష్టానుసారంగా, అవసరాలకు అనుగుణంగా బతికే క్రమంలో తారస పడే ఎదుటి వాడిని ఏదోరంకంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. చేస్తూనే ఉంటారు. ప్రతీ మనిషిలో, వారి మనసులో మనకు కనిపించని ఇంకో మనిషి, ఇంకో ఆలోచన ఉంటుంది. దానిని గుర్తించడం చాలా కష్టం.

“తెల్లవార్లూ జాగారమే
ఎవరి శవం చుట్టూ వాళ్లే”
స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన ప్రకృతిగలిగిన పల్లెల్లో ఉండి ఒక్కసారిగా నగరంలో అడుగుపెట్టినపుడు కలిగే అనుభూతి వేరు. ఎత్తైన భవన సముదాయం, రాత్రీ పగలు తేడా గుర్తించలేని విధమైన విద్యుదీకరణ, అంతా ఒక వింతైన అనుభవం. నిత్యం వాహన రొద, కాలుష్య వాతావరణం, మంచినీరు కూడా వ్యాపారమైన అటువంటి ప్రదేశంలో సాదాసీదాగా జీవించడం చాలా కష్టతరం. స్వతంత్రంగా బ్రతికి ఒక్కసారిగా చెరసాలలో బంధించిన తీరుగా ఉండడం వల్ల కంటినిండా నిద్రలేని పరిస్థితితులు. చుట్టు అందరూ ఉన్నా ఎవరులేని, ఏమీ కానీ ఏకాకితనం. మనిషిని మానసికంగా క్రుంగదీసే ప్రాంతమే పట్టణం(లు).

మనిషి తను ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గురించి, జరగబోయే భవిష్యత్ పరిణామాల ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురైన సందర్భానికి రెండు వైపులా పరిమితులను, పర్యావసానాలను నిర్ణయించుకుని, ఒక నిశ్చయానికి వస్తాడు. అటువంటి ఆలోచనా ధోరణికి చెందిన మరో కవిత “రెండే రెండు ప్రమాదాలు”.

“రోజూ రెండు ప్రమాదాలు
ఒకటి ఉదయం, రెండు చీకటి”
కాలం కష్టంగా నడుస్తున్నప్పుడు రోజులు, గంటలు, నిమిషాలు లెక్కబెట్టుకోవడం మనిషి సహజ నైజం. పగలూ, రాత్రే మనిషికి అసలైన ప్రమాదాలు. ఉదయం లేచినప్పటినుండి తనను తాను మరిచిపోయి పడుకునే వరకు అంతా గందరగోళమే. కొన్ని సార్లు పడుకున్నా కూడా వదలని పీడకలల వల్ల నిద్ర కూడా సుఖాన్నివ్వని సందర్భాలు అనేకం. పోటీ సమాజంలో ఎందుకు గాబరా పడుతున్నామో, దేనికొఱకు ఆరాటపడుతున్నామో అనే విషయం కూడా తెలియక మానసిక వేదనకు లోనవుతున్న వారు కూడా అనేకం. ఆ కారణాల వల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారనే విషయాన్ని కవయిత్రి చెప్పకుండానే గుర్తుచేసింది.

వర్తమాన, వర్ధమాన కవులు, రచయితల ప్రభావం రజితపై స్ఫష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రభావ పర్యవసానంలో భాగంగా పెద్దింటి అశోక్ కూమార్, గోరేటి వెంకన్నల నుండి వెలువడ్డ సాహిత్యానికి లోనైన ప్రభావంతో “ఊటబావి” శీర్షికతో కవిత్వం రాసింది కవయిత్రి. కాగుబొత్త, ఊటబాయి, ఇనుపముక్కు కాకులు, కీలు బొమ్మలై, వెలి, కాటు, కనిపించని కుట్రలు ఇలా అశోక్ కుమార్, వెంకన్నల సాహిత్యంలోని కొన్ని కథల పేర్లు రజిత తన కవితల పేర్లుగా ఈ సంపుటిలో కనిపిస్తాయి. మానవుడు కొంత కృత్రిమంగా ఆలోచించే సామర్ధ్యం వచ్చినప్పటి నుండి వ్యవసాయానికి, తాగునీటికి వనరుగా బావులును ఉయోగిస్తున్నాడు. జరుగుతున్న పరిణామాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఆ బావులు అన్నీ ఇంకిపోయి వాటిని మరిచిపోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. బతుకుని ఊట బావితో పోల్చింది. బతుకుని కూడా ఎప్పటికప్పుడు బాగుచేసుకోవాలి లేకుంటే బావిలెక్కనే పూడికపడుతుంది. వచ్చే నీటి ఊటలు ఆగిపోతాయి. అలాగే జీవితంలో కూడా ఎప్పటికప్పుడు ఉన్నత నిర్ణయాలు తీసుకుని గొప్ప శిఖరాలను అధిరోహించాలనే అంతరార్థం గమనించ వచ్చు. పదవులకోసం నాయకులు ప్రజలకు ఇచ్చే బూటకపు హామీలను విమర్శించిన మరో కవిత “కోతి వరాలిచ్చి”.

మోసపూరిత ఉద్దేశ్యం కనిపించకుండా మెజారిటీ ప్రజానీకాన్ని తమవైపు తిప్పుకుని నాయకులమని చెప్పుకుని కొందరు అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఆ తరువాత ఇచ్చిన ఆ హామీలను తుంగలో తొక్కి మళ్ళీ ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు, వారి సమస్యలు మళ్లీ భుజాన మోస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ వ్యవస్థను అధిక్షేపించిన కవిత ఇది. “మనిషి కోసం”, “తెల్లవార్లూ”, “నేనే”, “ఎప్పుడూ”, “అజ్ఞాత వనాల పాట”, “బహుముఖాలు” మొదలైన కవితలు అన్నీకూడా రాజకీయ, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద ధోరణి పర్యవసానాల వల్ల నష్టపోతున్న వ్యవస్థను గురించి తెలియజేసినవే. జార్జ్ డబ్ల్యు బుష్ 2005 కాలంలో అమెరికా అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సామ్రాజ్యావాద కార్యక్రమాలను “సముద్రాల ముట్టడిలో” అంటూ నిరసించింది కవయిత్రి. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా, ప్రపంచ పెత్తందారుగా, అందరికీ పెద్దన్నలా ఉండాలని అమెరికా దేశం తీవ్రంగా ఆశిస్తుంది. అందుకే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలైన లాటిన్ అమెరికా, ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలతో యుద్ధాలు చేయడానికి ముందస్తుగా అనేక వేసులుబాట్లు కల్పించుకుంటుంది.

ఒకవైపు సద్దాం హుస్సేన్, గడాఫీలను తుద ముట్టించడమే కాక వివిధ భూభాగలతో పాటు, సరిహద్దు సముద్ర భాగాలను కూడా ముట్టడి చేస్తుంది. ప్రపంచ పెత్తందారు కావాలన్న అమెరికా ఆకాంక్షకి, ఆ పీఠంపై తనకు హక్కు ఉందని భావిస్తూ ఆ దేశాధ్యక్షులు అందరూ శాసన కర్తలుగా, అణిచివేత చేస్తూ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఎంతటి పనినైనా చేస్తారు. గతంలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అమెరికాకు శత్రువులూ, మిత్రులూ ఉండాలని, అనేక దేశాలలో దానికి మిలటరీ స్థావరాలు పెంచుకోవాలని కుటిల పన్నగాలు పన్నుతూ ఉంటుంది. ప్రపంచమంతటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని వారిలాగానే ఇతర దేశాలను మార్చి, ఈ శతాబ్దాన్ని ‘పాన్ – అమెరికానా’గా మార్చాలనే ఆలోచనను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించింది కవయిత్రి.

మారిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక జీవన విధానం వల్ల ప్రజల ప్రవర్తన, పరస్పర బంధాలు అన్నింటిలో మార్పులు వచ్చాయి. పైగా కరువులు, భద్రత లేని జీవన గమనం. వాటిని గురించి తెలియసింది రోజులిప్పుడనే కవిత.

“పానాలు పోంగ పరువులెక్కడివి
ఆకలి పీకంగా ఇజ్జతేంది”
తమ కున్న అవసరాల మేరకు ఆలోచించే విధంగానే ప్రజల మనోభావాలు మారిపోయాయి. అటువంటిది ప్రాణాలు పోయే పరిస్థితే వస్తే పరువు, ఆత్మాభిమానం గురించి ఎవరు మాత్రం ఎందుకు ఆలోచిస్తారు. ఆకలే ప్రధాన శత్రువైనప్పుడ ఇజ్జతి, విలువలు అంటూ ఎవరు కట్టుబడి ఉంటారు. మారింది సమాజం కాదు రోజులే. మారుతున్న రోజులే అన్ని అనర్థాలకు కారణమని కవయిత్రి మనోగతం. అటువంటి సమస్యలన్నీ రూపుమాసిపోవలనీ, నూతన సమాజం నిర్మాణం జరగాలనే ఆశతో “పీడనల్లేని”అనే కవిత్వం రాసింది. స్వేచ్ఛను కోరుకున్న సైమన్ ది బొవేర్, జెన్నీ మార్క్స్, సోజర్న్ ట్రూత్, జమీల్యా, ఆగ్నెస్, స్మెడ్లీ, ప్లేవియా, విన్నీ, మండేలా, గోర్కీ మొదలైన పాశ్చాత్యుల పేర్లును కూడా ఇందులో చూడవచ్చు.

తన చిన్న నాటి నుండే(12సంవత్సరాల వయసు) చిందు భాగవతానికి అంకితమై 50ఏళ్లకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి, తెలంగాణ సాంస్కృతిక, జానపద కళకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన చిందు ఎల్లమ్మను గురించిన కవిత “చిందేయమ్మ”. కళలకు జీవం పోసి అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న ఎల్లమ్మను, ఆమె ఆటను ప్రకృతితో ప్రతీకాత్మకంగా మిళితం చేసింది. జరిగే అన్ని దుష్పరిణామాలను తన కధన నృత్యంతో రూపుమాపమని కోరుకుంది. ఇదే స్మృతిలో భాగంగా “శబునంక్ రాత్” కవితతో ‘కృష్ణమూర్తి’గారిని, “ఆరవ సూర్యుడు” పేరుతో ‘మద్దూరి నగేష్’ బాబు గారిని, “ఎప్పుడూ” కవిత ద్వారా ‘ఇస్మాయిల్’ గారిని గుర్తు తెచ్చుకుంది.

కవయిత్రి వైవిధ్యమైన ఆలోచననుచూపించిన మరో కవిత “2003 శీర్షికల కవిత”. 2003 సంవత్సరంలో వచ్చిన వివిధ కవితా శీర్షికలను అన్నింటినీ కలిపి ఒక కవితగా రాసింది. ఆ సంవత్సరంలో వెలువడిన నలబై ఉత్తమ కవితలను తీసుకుని ఆ కవితా శీర్షికలతో ఈ కవిత రాసింది.

“వొరుపు’లో చేరి ‘రేలరేలారే’
‘మనిషే సెలయేరని’పిస్తున్నాడు”
సేకరించిన శీర్షికలు అన్నింటినీ ఒక తాటిపై పేర్చి ప్రపంచీకరణ ప్రధాన వస్తువుగా కవితను రాసింది. మరోవైపు తనను ప్రభావితం చేసిన ‘సోజర్నర్ ట్రూత్’ యధార్థగాథాయిన “స్వేచ్ఛాగానం” నవలకు స్పందనగా “సత్య సంచారీ” శీర్షికతో ఒక కవిత, జి. వెంకటకృష్ణ రాసిన ‘లోగొంతుకకు’ కవితా సంపుటిముందు మాటగా కె. శివారెడ్డి రాసిన ‘గుండెగొంతుక’ అనే ముందు మాటను చదివి ప్రభావానికిలోనై “అజ్ఞాత వనాల పాట” పేరుతో ఒక కవిత, ఛాయరాజ్ ‘తొలెరుక’ కవిత ప్రేరణతో మరో కవిత రాసింది. చిన్న చూపు ఛీత్కారాలకు పెద్ద సావల్ “నేనే”అను కవిత.

అవని నుండి అంతరిక్షందాకా విస్తరించిన ప్రశ్న నేనని చాటుకుంది. వ్యవస్థలో పాతుకుపోయిన లోపాలను నిరసించి, విమర్శించి, అధిక్షేపిస్తూ రాసింది.
“నేనొక భౌతిక రూపాన్నే కాదు
నేనొక భావజాల ప్రకంపనాన్ని”
ప్రభావశీల వ్యక్తిత్వాన్ని వ్యక్తిగా, భావజాలాన్ని బానిసగా చూసే సమాజానికి హెచ్చరిక. ఇన్నేండ్లు చూసిన చిన్నచూపు ఇక చాలని, ప్రకృతిలో పుట్టిన ప్రతీ ప్రాణిలో తనే విస్తరించి ఉన్నదని ప్రకటించుకున్నది. ప్రకృతి నుండి గ్రహిచిన విశ్వాస శక్తిని తక్కువ అంచనా వేయడం మీ మూర్ఖత్వమవుతుందని కవయిత్రి కొందరు విమర్శకులను ఎద్దేవా చేయడం చూడవచ్చు. నేడు ఒక్కరోజు ప్రతిస్పందనలు చాలా ఎక్కువైపోయాయి. జరిగిన ప్రతీ మంచీ చెడుల మీద తమ స్పందన తెలియజేసిన మరుక్షణం దానిని గురించి మరిచిపోయే సంస్కృతి బాగా ప్రబలిపోయింది. అందులో భాగంగానే “మదర్స్ డేలు”, “ఫాథర్స్ డేలు”అంటూ తల్లిదండ్రులను, తమకు కావాల్సిన వారిని కేవలం ఒకే ఒక్కరోజు స్మరించుకోవడం, తరువాత మరిచిపోవడాన్ని తీవ్రంగా అధిక్షేపించిన కవిత “అమ్మ సంస్మరణ దినం”.

అవకాశవాద, వ్యాపార దృక్పథంతో ప్రజలను మూస ధోరణిలోకి నెట్టివేస్తున్నారు. ఏడాది పొడవునా చస్తూ బతుకుతూ పిల్లల కొఱకు శ్రమించే వారిని ఒక్కరోజు స్మరించుకోవడం బాధాకరం.

“బతికున్న తల్లులు
గుండెల మీద బండలు
గతించిన తల్లులు
అమృతమూర్తులు”
విదేశీ సాంస్కృతికి అలవడిన సమాజం అదే పోకడలతో ఆలోచిస్తుంది. దేశం మొత్తంగా చూసుకుంటే వృద్ధాశ్రమాల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంది. బ్రతికి ఉండగా తల్లిదండ్రుల బాగోగులను చూసుకొవడంలో నేటి తరం గోరంగా విఫలం అవుతున్నారు. నిజమైన అమ్మతనానికి గుర్తించకుండా ప్రత్యేకంగా ఎన్ని రోజులు రోజుల కేటాయయించినా వ్యర్థం. అసలు అమ్మకు దినం కేటాయించడం ఏంటో? తల్లిదండ్రులు, ఆప్తులు చనిపోయాక సంతాపదినం, మాతృ దినోత్సవం అంటూ ఒక్కరోజు స్మరణలతో హోరెత్తించడం చూస్తూనే ఉన్నాం. ఇది రానురాను ఏవైపుకు దారి తీస్తోందోఅని అధిక్షేపనతో నిరాశ, అసహనం చెందడం కవితలో చూడవచ్చు.

తల్లిని తలుచుకుంటూ స్మృతీ కవిత్వం రూపంలో రాసిన కవిత “అమ్మా నీ బాల్యం”. ఇందులో కూడా మాతృమూర్తుల ప్రేమను తలుచుకుంది.
“నీ వృద్ధాప్యంలో
నా బాల్యాన్ని చూస్తున్నాను”
జీవితం అంతా ఎడతెరిపిలేకుండా తన పిల్లలకోసం శ్రమించి శరీరం సహకరించని వృద్ధాప్యంలోకి చేరుకున్నపుడు వారికి చేదోడు వాదోడుగా ఉండడం ఆ పిల్లల బాధ్యత. అదే బాధ్యతను తప్పక పాటిస్తానని అమ్మకు ఇచ్చే వాగ్దానం ఇది. నీకు ముందు చూపు నేను అవుతా, నీకు ఊతానిచ్చే చేతి కర్రనవుతానంటూ వృద్ధాప్యానికి భరోసా ఇచ్చింది. తల్లిగా మారిన మహిళల గొప్పదనాన్ని చూపించే కవిత్వం రజితది. ఒక తల్లిగా మాత్రమే కాదు భార్యగా, కొడలుగా, కూతురుగా, సగటు ఆడపిల్లగా ఉన్న మహిళల విముక్తిని, స్వేచ్చా వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని ఆశించే కవిత్వం, దళిత, మైనారిటీ, స్త్రీవాద, మహిళా ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రాధాన్యత ఇస్తూ రాసిన కవిత్వానికి కూడా ఇందులో చోటు కలిపించింది. “అమ్మ నీ బాల్యం”, “అగ్నిజ్వాలలా తల్లులు”, “ఫర్యాద్”, “త్యాగ గీతం”, “ఆమె – అమ్మా”, “రోజు పెద్ద యుద్ధాలే చేస్తున్నాం”,”యుగ మానవి”, “అనగనగా స్త్రీ” “త్యాగగీతం”, “సంచారీ” మొదలైన కవితలు అన్నీ కూడా స్త్రీలు అనుభవించే సాధకబాధకాలను వ్యక్తం చేస్తాయి.

యుద్ధం దాని నేపథ్యం, పర్యావసానాలు, పూర్వాపరాలను చెప్పిన కవిత్వం “యుద్ధంలో మరణిస్తున్న వారి చివరి సందేశం”. యుద్ధంలో మరణించే వారిచ్చే చివరి సందేశాన్ని, జరిగే యుద్ధ పరిణామాలను, చేస్తున్న కర్కశ, పాశవిక పనులను చెప్తూనే బయటకు శాంతి మంత్రాలు పటిస్తూ యుద్ధం కొరకు కుతంత్రాలుపన్నే ప్రపంచ దేశాల తీరును, ఆధిపత్య కాంక్షను ఇందులో చూడవచ్చు.

“విధ్వంసంమే సిపాయితనం
మనుషుల్ని చంపడమే వీరత్వం”.
వీరుడు అంటేనే శత్రువర్గం వారిని హతమార్చే వాడు. ఎదుటి వ్యక్తిపైన ఏ విధమైన కక్షలు, కార్పణ్యాలు లేకున్నప్పటికీ లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపివేయడం ఎంతటి దుశ్చర్యో అర్థమవుతుంది. ఐనా “యుద్ధ విమానాల మీద పావురాల గుంపులు” అంటూ యుద్దాన్ని జయించేది ఒక శాంతి మార్గమే అనే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేసింది. అలాగే శత్రుదేశాల దుశ్చర్యలను, ఉగ్రవాద దాడులను వ్యతికిస్తూ, “గుండె గాయాల కోన”ను రాసింది. కాలం తీసుకువచ్చే ఎన్నో మార్పులను, వింతలను తెలుపుతూ రాసిన కవితే “అనగనగా కాలం”. మొత్తం కవితా సంపుటికి అసలు పేరుగా మారిన శీర్షిక. రకరకాల ఉద్వేగాలను, ప్రకృతి వైపరీత్యాలను, అత్యంత మంచిని, తీవ్ర నష్టాన్ని, గెలుపోటములను నిర్ధేశించేది కాలమే అంటూ సాగిన కవిత.
“జ్ఞాపకాలను అలికేస్తుంది
గాయాలను మాన్పుతుంది”.


కాలమే సమాధానం అనే మాటను తరుచూ వింటూనే ఉంటాం. కాల ప్రవాహంలో అన్నీ మారిపోతాయి. జరిగిన నష్టాలు, గుర్తుపెట్టుకున్న జ్ఞాపకాలు, ఎదురైన మంచీ చెడులు అన్నింటినీ తారుమారు చేసే శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉన్నది. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం అనే భావన. కొన్నికొన్ని సందర్భాలలో ఎదుటివారిలో నిజమైన వ్యక్తిని చూడాలి అనుకోవడం ఒక్కింత సాహసోపేత చర్య. కానీ అందరిలో సరైన, సంపూర్ణమైన మానవుడు దొరికే అవకాశాలు లేవు. పక్క వారిలో మనిషిని చూసే క్రమంలోనే మనలోని అసలైన భాజాలం బయటపడే అవకాశం ఉంది. అపుడే ఎదుటివారిలోని సంకుచిత భావాలు తెలుస్తాయి. అసలైన మనిషి వేటలో ఉన్న కవయిత్రి మనోగతానికి కవిత నిదర్శనం.

వ్యాపార సంస్కృతి మారుమూల గ్రామాన్ని, ప్రతీ ఇంటిని తాకింది. తమకు అవసరం లేకున్నప్పటికీ బ్రెండెడ్ పేరు తగిలించిన విలాసవంతమైన ఆధునిక, సాంకేతిక వస్తువులు కొనుగోలు చేసి డబ్బులు సమర్పించుకుంటున్నారు. అత్యాధునిక హంగులతో సిద్ధం చేసుకున్న మార్గాలతో సునాయాసంగా ప్రయాణాలు, విదేశీయానాలు, బంధుత్వం కలుపుకోడానికి కాదు వ్యాపారాలను విస్తృతం చేయడం కోసమే. వ్యాపార సంస్కృతి విస్తరించి వ్యవస్థ ప్రయివేట్ సంస్థలకు హస్తగతమైంది.

“అంతా ప్రయివేటే
నిత్యావసరాలన్నింటి పైనా వేటే”
ప్రభుత్వా చేతగాని తనంతో, కమీషన్ల కక్కుర్తి కొరకు ఆదాయ మార్గాలన్నీ ప్రయివేట్ సంస్థల చేతులకు కట్టబెడుతున్నారు. స్వలాభం తప్పా సంక్షేమం ఎరుగని ఆయా వ్యాపార సంస్థలు నిర్దాక్షిణ్యంగా ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ఆ దోపిడీకి గ్లోబలైజ్ అనే పేరు పెట్టి అందరిని మోసం చేస్తున్నారు. ఈ విధానాల వల్ల ఎగుమతులు, దిగుమతులు సులువైన చోట దేశీయ ఉత్పత్తులు నిరాదరణకుగురై రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. అందులో భాగంగానే “రైతులేని రాజ్యమా?”, “క్షామ భూమీ” రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారు కోల్పోతున్న వ్యక్తిగత జీవితాలను గురించి రాసింది.

భద్రత లేని జీవితాలకు భయమెక్కువ. ఎపుడు ఎం జరుగుతుందో తెలియని భయాలు ఎక్కువయ్యాయి. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నా కూడా ఎం జరుగుతుందో తెలియక భద్రతలేని భయాలు ఎక్కువయ్యాయి. తన నీడను తానే నమ్మే పరిస్థితులు లేవు. కారణం భయం. ప్రతీ మనిషిలో బయటకు తెలియని మరో వ్యక్తి ఉంటాడు. బహిర్గతమయ్యే వ్యక్తిత్వం వేరు అంతర్గత ఆలోచన వేరు. కారణం ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు ఎక్కువయ్యాయి. ఆ భయాలను “భయం భయం”పేరుతో బయట పెట్టింది.

బాల్యం ఒక తీపి జ్ఞాపకం. జీవితంలో ఒకసారైనా బాల్యాన్ని తలచుకోనివారు ఉండరు. ఆటలు, పాటలు, వేసవి వినోదాలు, చదువులు వంటి తీపి జ్ఞాపకాలతో బాల్యం పూర్తవుతుంది. కానీ నేడు అటువంటి జ్ఞాపకాలను పొందలేక బడికి దూరమై బాల్యం బందిఖానాగా మారుతుంది. నిమ్న, దిగువ తరగతి కుటుంబాలలో కూడాచాలామంది పిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు. విద్య లేక రోజు వారీ కూలీలుగా మారిపోతున్నారు అదలా ఉంటే మరోవైపు ఉన్నత, మధ్యతరగతి కుటుంబాలలోని బాలల బాల్యం అంతా మార్కులు, ర్యాంక్ వైపు పరుగెట్టించ బడుతుంది. ఈ విధమైన కష్టాలన్నింటిని “బాల్యం చెర బాల్యం వధ”లో తెలియజేసింది.

పుట్టింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, మునిగలవీడు. పరిశోధక విద్యార్థి. ఎం.ఏ(జర్నలిజం), ఎం.ఏ(తెలుగు) చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన (పీఎచ్ డీ) చేస్తున్నారు.

Leave a Reply