(గోర్కీ 1932లో ఒక అమెరికా విలేకరికి ఇచ్చిన సమాధానం)
“ఎక్కడో మహా సముద్రానికి అవతల సుదూరంగా ఉన్న ప్రజల నుంచి వచ్చిన ఈ జాబు బహుశా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది.” అని మీరు వ్రాశారు. కాని నాకు మీ ఉత్తరం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించ లేదు. ఇలాంటి ఉత్తరాలు తరుచుగా నాకెప్పుడూ వస్తూనే ఉంటాయి. మీ ఉత్తరంలో ఏదో ‘ప్రత్యేకత’ ఉందని మీరు పొరపడుతున్నారు. కాని గత రెండు మూడు సంవత్సరాల నుంచి బుద్ధిజీవి (మేధావి) వర్గం ఇలాంటి హెచ్చరికలు, విజ్ఞప్తులు చేయడం నిత్యకృత్యమై పోయింది. ఔను. ఇది సహజమే. బూర్జువా వర్గ నిజ స్వరూపం బట్టబయలు కాకుండా లోపాలను కప్పిపుచ్చి పైపై మెరుగులతో ఆకర్షణీయంగా దాన్ని అలంకరించడం బూర్జువా వర్గ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందుల పట్ల హృదయపూర్వక సంతాప సానుభూతులు ప్రకటించడం, వారిని ఓదార్చడం. అదే బుద్ధిజీవి వర్గం ఎల్లప్పుడూ ముఖ్యంగా చేస్తోన్న పని. అసలు బూర్జువా వర్గాన్ని పెంచి పోషించినది బుద్ధిజీవి వర్గమే. బూర్జువా వర్గం వేసుకొనే తత్వశాస్త్రం, మత శాస్త్రం ముసుగు పాత బడి, చినిగిపోయి, శ్రమజీవుల చిక్కని రక్తంతో తడిసి ముద్ద అయింది. ఆ చినిగిపోయిన ముసుగులోని చినుగులు కనబడకుండా తెల్లటి మాసికలు వేసి కుట్టడంలో మేధావి వర్గం ఊపిరి సల్పకుండా పనిచేసింది. మేధావి వర్గం పాపం! ఎన్ని అవస్థలు పడినా ఈ పనిని జయప్రదంగా సాగించలేక పోయింది. ముందు రానున్న పరిస్థితుల స్వరూపం ఎలా ఉంటుందో కండ్లకు కట్టినట్లు స్పష్టంగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, వారు ఇంకా తమ విఫల ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఈ క్రింది విషయాన్నే తీసుకోండి:
చైనాను సామ్రాజ్యవాదులు తమలో తాము పంచుకోబోయే ముందు స్పెంగ్లెర్ అనే ఒక జర్మన్ “రంగు జాతులకు” టెక్నికల్ విజ్ఞానాన్ని గరపి 18వ శతాబ్దంలో యూరోపియన్లు గొప్ప తప్పుచేశారు.” అని “మానవుడూ టెక్నిక్” అనే తన పుస్తకంలో వ్రాశాడు. స్పెంగ్లెర్ వ్రాతలను హెండ్రిక్ వాన్ లూన్ అనే మీ అమెరికా చరిత్రకారుడు బలపర్చాడు.
18వ శతాబ్దంలో చేసిన ఈ లోపాన్ని నేడు దిద్దుకోవాలని మీవాళ్లు ఆరాటపడుతున్నారు. యూరప్ లోని పెట్టుబడిదారులూ, అమెరికాలోని పెట్టుబడిదారులూ అటు జపానుకూ, ఇటు చైనాకూ డబ్బుతో పాటు ఆయుధ సామగ్రి కూడా అందజేస్తున్నారు. చైనా, జపాన్ దేశాలు రెండూ పరస్పరం పోరాడి ఒక దానిని మరొకటి నాశనం చేసుకోవడమే వాళ్ళకు కావలసింది. అంతగా అవసరమైతే జపాన్ సామ్రాజ్యవాదుల ముఖాన ఒక పిడి గుద్దువేసి లొంగదీసుకోడానికి కూడా తమ నౌకాబలాన్ని తూర్పుదిశకు తరలిస్తున్నారు. ఎలుగు గొడ్డు చావడంతోనే దాని గుహను తమలో తాము పంచుకుంటూ ‘ధైర్య శాలి’ అయిన కుందేలు (జపాను)కు కూడా దానివంతు దానికిస్తారు. అసలు ఎలుగు గొడ్డును చంపడమే జరగదని (చైనాను సామాజ్యవాదులు జయించడం అసంభవం అని) నా వ్యక్తిగతాభిప్రాయం. యూరోపియన్ సంస్కృతికీ, అమెరికన్ సంస్కృతికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చిపడిందని బాకాలూదే స్పెండ్లెర్, వాన్ లూన్ లాంటి బూర్జువా ఏజెంట్లు హిందువులు (భారతీయులని గోర్కీ భావం) జపానీయులూ, చైనీయులూ, నీగ్రోలూ వీరంతా ఒకే ఒక వర్గానికి చెందినవారు కాదనీ, వీరిలో వివిధ వర్గాలున్నాయనే అసలు విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. యితరుల కాయకష్టంచే పెట్టుబడి దారులు తమ బొర్రలు నింపుకొనే విషపూరిత స్వార్థ సిద్ధాంతానికి సరియైన విరుగుడు (మార్క్సిజం లెనినిజం) కనిపెట్టబడిందనీ, అది చక్కగా ఆమోఘంగా పనిజేస్తూ ఉందనీ వాళ్ళు మరచిపోయారు. నిజానికి వారు మర్చిపోకపోయినా మర్చిపోయినట్లే పైకి నటిస్తున్నారు. స్వార్థ సిద్ధి కోసమే వాళ్ళ దొంగ నటన సాగిస్తున్నారు. ‘యూరోపియన్ సంస్కృతికి ప్రమాదం వచ్చిపడింది’ అని గొంతు చించుకుంటూ వాళ్ళు చేసే నినాదాన్ని బట్టే విషం ఎంత నిస్సార మైనదో దాని విరుగుడు ఎంత తిరుగు లేనిదో వాళ్ళకు బాగా తెలుసు.
‘సంస్కృతి పాడైపోయిందో’ అని ఏడ్చేవాళ్ళ సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతూవుంది. రోజు రోజుకూ వాళ్ళు ఇంకా బిగ్గరగా కేకలూ రంకెలు వేస్తున్నారు. ఫ్రెంచి మాజీ మంత్రివర్గ సభ్యుడు కెయిలాక్స్ తమ సంస్కృతికి నిలకడ లేకుండా పోయిందని మూడు మాసాల క్రితం గొంతు చించుకుంటూ ఈ విధంగా గొడవ బెట్టాడు.
“ప్రపంచమంతా నేడు పరస్పర అవిశ్వాసంతో నిండిపోయి విషాదాత్మకంగా పరిణమించింది. ఒక వైపు తిండిలేక లక్షల కొలది ప్రజలు ఆలమటిస్తుంటే మరో వైపు పుట్లకు పుట్లు గోధుమలను వంట చెరుకుగా ఉపయోగించడం, బస్తాలకు బస్తాల కాఫీ గింజలను సముద్రం పాలు చేయడం నిజంగా విచారించదగిన విషయం కాదా? –
మనలో మనకు పరస్పర విశ్వాసం లేక పోవడం ఇప్పటికే చాలా చెరుపు కలిగించింది. యుద్ధాలను రెచ్చగొట్టింది. శాంతి ఒడంబడికలకు అంగీకరించేటట్టు చేసింది. మనలో మనం ఇప్పటికైనా పరస్పర విశ్వాసం నెలకొల్పుకోలేకపోతే మన నాగరికత యావత్తూ మంటగలిసిపోతుంది. ఈ విషమ పరిస్థితి కంతటికీ కారణం నేటి ఆర్థిక విధానమే అని వాదించేవాళ్ళకు అసలు ఈ ఆర్థిక విధాన పునాదులనే కూలదోయడానికి మంచి అవకాశం లభిస్తుంది.”
ఈనాడు ఒకళ్లకొకళ్లకు పోటీపడి ప్రజలను పీక్కుతినే రాబందుల్లో పరస్పర విశ్వాసం ఉండాలని చెప్పేవాళ్ళు వట్టి మోసగాండ్లు అయినా అయి ఉండాలి; లేక శుద్ద అజ్ఞానులైనా అయి ఉండాలి. ‘ప్రజలు’ అనే మాటకు ‘కష్ట జీవులే’ అని అర్థం అయితే ఈనాటి విషమ పరిస్థితులన్నిటికి కారణం పెట్టుబడిదారీ విధానమే అని, కష్టజీవులనడంలో తప్పెంతమాత్రం లేదని చిత్తశుద్ది గల ప్రతివాడూ అంగీకరించి తీరాలి. ప్రజలు తమ చెమటోడ్చి కష్టించినదానికి ఫలితంగా ఈ పెట్టుబడిదారీ విధానం వారికిచ్చే జహుమతి ఏమిటి ? బాధలు, ఆకలి మంటలు మాత్రమే. ‘కమ్యూనిస్టు మానిఫెస్టోలో మార్క్స్, ఎంగెల్స్ చెప్పిన విషయాలు ఎంత పరమ సత్యాలో శ్రామిక వర్గం నానాటికి స్పష్టంగా చూడగలుగుతోంది.
“తన దాస్యంలో ఉన్న బానిసకు కూడా జీవనాధారం చూపలేని బూర్జువా వర్గం పరిపాలన చేయడానికి ఎంతమాత్రం తగదు. బానిసే తనకు తిండిబెట్టి తనను పోషించడానికి బదులుగా తానే (బూర్జువా వర్గమే) బానిసకు తిండిబెట్టి పోషించవలసిన పరిస్థితి ఏర్పడింది. (అసలు జీవనాధారమే లేని కార్మికుడు యజమానికి ఇంకా అదనంగా సంపాదించి పెట్టడం సాధ్యంకాదు కాబట్టి.) అందువల్ల ఈ పెట్టుబడిదారీ వర్గం క్రింద సమాజం ఎంతోకాలం ఉండజాలదు. ఈ బూర్జువా వర్గ అస్తిత్వం సమాజంలో ఎంతోకాలం నిలవదు.”
బూర్జువా వర్గం అంటే పడిచచ్చే వాళ్ళల్లో కెయిలాక్సుకూడా ఒకడు. బూర్జువా అజ్ఞానాన్నే మానవ జాతి చిర సంచిత మహత్తర విజ్ఞానంగా వీళ్ళు చిత్రిస్తారు. కొత్త కొత్త సిద్ధాంతాలు లేవదీస్తారు. బూర్జువా సిద్ధాంతం కంటే గొప్ప సిద్ధాంతం ‘నభూతో నభవిష్యతి’ అని వాదిస్తారు. ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ బూర్జువా ఏజెంట్లు తమ పాండిత్య ప్రకర్షను వెలగబెట్టాలని ఇటీవల దాకా ప్రయత్నించారు. బూర్జువా సిద్ధాంతం ఆచంద్ర తారార్కం నిలిచే ఒక అజరామరమైన శాస్త్రీయ సిద్ధాంతమని నిరూపించేందుకు నానా అవస్థలు పడ్డారు.
కాని మళ్ళీ వాళ్లే ఎప్పుడూ సైన్సుకు- అసలు శాస్త్రీయసిద్ధాంతానికే – స్వస్తి చెప్పుతున్నారు. పైన జెప్పిన కెయిలాక్సే ఫిబ్రవరి 28వ తేదీన పాల్ మిల్యుకోచ్ లాంటి మాజీ మంత్రివర్గ సభ్యుల సమక్షాన మాట్లాడుతూ స్పెంగ్లెర్ సూచించిన పంథానే అనుసరించాడు: “టెక్నిక్ అభివృద్ధి అయిన ఫలితంగా నిరుద్యోగం సర్వత్ర వ్యాపించింది. ఉద్యోగం నుంచి తొలగించిన కార్మికుల వేతనాలు యజమానుల అధిక లాభాల కిందకు జమవచ్చాయి. ‘హృదయ రహితమైన ‘ సైన్సు మానవ జాతికే హానికరం. కాబట్టి సైన్సును మానవ జాతి తన అదుపులో ఉంచుకోవాలి. సైన్సుకు కళ్లెం బెట్టాలి. నేటి విషమ పరిస్థితి – ఆర్థిక మాంద్యం – మానవ జాతి విజ్ఞానానికి ఒక ఓటమి లాంటిది. ఒక్కొక్క సమయంలో ఒక మహావ్యక్తి కంటె సైన్సుకు గొప్ప దురదృష్టం మరేదీ లేదు. ఆ మహా వ్యక్తి చేసే సిద్ధాంత ప్రతిపాదన ఆ రోజుల్లో చాలా గొప్పగానే ఉంటుంది. ఉదాహరణకు కార్ల్ మార్క్స్ నే తీసుకోండి. ఆయన సిద్ధాంతాలు 1848 లో గానీ లేక 1870 లోగానీ సరియైనవే. కాని అవి 1932 లో ఎందుకూ పనికిరానివి. ఇప్పుడు మార్క్స్ బ్రతికి ఉంటే ఆయన మరో విధంగా వ్రాసి ఉండేవాడు.”
బూర్జువా వర్గం ఈ విధంగా చెప్పుతుందంటే ఆ వర్గం తన అజ్ఞానాన్ని బైట పెట్టుకుంటోందన్నమాట. సైన్సు అభివృద్ధి గాకుండా దానికి కళ్లెం పెట్టజూస్తోంది. శ్రామిక ప్రపంచంపై తన అధికారాన్ని జమాయించడానికి సైన్సు తనకెంతగా ఉపయోగపడిందో మరచిపోయింది. “సైన్సుకు కళ్లెం బెట్టడం” అంటే అర్ధ మేమిటి? సైన్సు అభివృద్ధి చెందకుండా దాన్ని నిరోధించడానికి కొత్త పద్ధతులను కనిపెట్టడమన్నమాట. సైన్సు యొక్క స్వాతంత్ర్యాన్ని అరికట్టే మత సంస్థల (చర్చి) ప్రయత్నాల నెదిరించి ఒకప్పుడీ బూర్జువా వర్గమే సాహసోపేతంగా, జయప్రదంగా పోరాటం సల్పింది. కాని ఈ రోజు బూర్జువా తత్వశాస్త్రం నానాటికీ దిగజారి మధ్యయుగం నాటి మెట్ట వేదాంతానికి బానిసగా తయారయింది. మార్క్స్ చెప్పినట్లు యూరోప్ ఖండం మళ్ళీ అనాగరిక దశకు పరిణమించే ప్రమాదం ఏర్పడింది అని కెయిలాక్స్ చెప్పాడు. కాని మార్క్సిస్టు సిద్ధాంతాలను గురించి ఈ పెద్దమనిషికి తెలిసిందేమీ లేదు. యూరప్ ఖండంలోని బూర్జువా వర్గమూ, ప్రస్తుతం ప్రపంచాధికారిగా ఉన్న అమెరికా బూర్జువా వర్గమూ రోజు రోజుకూ అజ్ఞానాంధకారంలో పడి అనాగరికంగా తయారవుతూ ఉంది అనడం నిర్వివాదాంశం. ఇందుకు కెయిలాక్సే చక్కని ఉదాహరణం.
‘మళ్లీ, అనాగరిక దశకు పోవడం అనే భావం ఆధునిక బూర్జువా వర్గంలో ఒక ఫేషన్’గా మారింది. స్పెంగెర్దూ కెయిలాక్సులూ – ఈ బాపతు ఆలోచనాపరులంతా ఇలాంటి అనాగరిక భావాలనే ప్రతిబింబిస్తున్నారు. తమ వర్గానికి ప్రమాదం వచ్చిపడిందని ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ కార్మిక ప్రజల్లో ఉవ్వెత్తుగా ఉప్పొంగుతున్న విప్లవ చైతన్యాన్ని చూసి వీరికి మతిపోతూ ఉంది. కార్మికవర్గంలో సాంస్కృతిక విప్లవాభివృద్ధి జరుగుతూ వుందనే విషయాన్ని వారు విశ్వసించరు. దాన్ని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ప్రపంచంలో ఏ మూల జూసినా ఇదే నేడు ప్రత్యక్షం అవుతూ వుంది.
మానవ జాతి గడించిన అనుభవం అంతా దీన్నే రుజువు చేస్తూ వుంది. ఈ పరిణామం అనివార్యంగా జరిగి తీరుతుంది. బూర్జువా చరిత్ర కారులు కూడా దీన్ని కొంతవరకు అంగీకరించక తప్పలేదు. ” అయితే ‘చరిత్ర’ కూడా ఒక సైన్సే కాబట్టి దానికి కూడా కళ్ళెం’ పెట్టవలసి వస్తుందేమో ! చరిత్ర యొక్క ఆస్తిత్వాన్నే మరచిపోవచ్చేమో గానీ నిర్లక్ష్యం చేయవలసి వుంటుందేమో ! “రివ్యూ ఆఫ్ మోడరన్ డ్రైన్సు”లో పాల్ నాలెరీ అనే ఫ్రెంచి పండితుడు చరిత్రను మరచిపొమ్మని బాహాటంగానే సలహా యిస్తున్నాడు. చరిత్రయే ఈనాటి దొర్భాగ్య పరిస్థితులన్నింటికీ కారణం అంటున్నాడు. గీతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోడంవల్ల మానవులు అందని కోర్కెలకు అర్రులు జాస్తారట! “మానవులు” అని ఆయన వాడిన మాటకు ‘బూర్జువా వర్గం’ అని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అతనికంటిలో పెట్టుబడిదారులు తప్ప మరెవ్వరూ ‘మానవులు కారు. బూర్జువా వర్గం ఇటీవల దాకా తమ అభిమాన విషయంగా పరిగణించేది. చరిత్ర వ్రాయడంలో బూర్జువా వర్గం ఎంతో నేర్పును చూపింది. కాని ఇప్పుడా చరిత్రను గురించే పాల్ వాలెరీ ఈ విధంగా వ్రాస్తున్నాడు:
మన మేధస్సు అనే రసాయన పరిశోధన శాలలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల కంటే చరిత్ర మహా ప్రమాదకరమైనది. చరిత్ర ఊహా గానాన్ని ఎక్కువ చేస్తుంది. అనేక ఆశలు కలిగిస్తుంది. జాతులపై మత్తు మందు చల్లుతుంది. భ్రమలు కల్పిస్తుంది. గత విషయాలను స్మృతికి తెచ్చి గోరంతలు కొండంతలుగా చిత్రిస్తుంది. పాత గాయాలను కెలికి మనస్సుకు శాంతి లేకుండా చేస్తుంది. గొంతెమ్మ కోరికలను సాధించడం కోసం ఆరాట పెడుతుంది.”
ఇదంతా విముక్తిని సాధించడం కోసమే అని ఆయన చెప్పుతున్నాడు. బూర్జువా వర్గం ప్రశాంతంగా కాలం గడుపుకోవాలని చూస్తూ ఉంది అనే విషయం అతనికి తెలుసు. బూర్జువా వర్గం నిరభ్యంతరంగా తన దోపిడీ కొనసాగించడానికి లక్షల కొలది మానవ జీవులను బలిపెట్టడం న్యాయ సంగతమే అని భావిస్తుంది. తన స్వార్థం కోసం, తన సుఖం కోసం కోట్ల కొలది గ్రంథాలను అగ్నికి ఆహుతి చేయడం కూడా ఒక పుణ్య కార్యమే అనుకుంటుంది.
ఈ ప్రశాంత జీవితం సాఫీగా సాగిపోకుండా మధ్య మధ్యన చరిత్ర జోక్యం కలిగించుకుంటుంది. కాబట్టి వారి దృష్టిలో చరిత్ర నాశనం కావాలి. పాఠ్యక్రమం నుంచి చరిత్ర గ్రంథాలను బహిష్క రించాలి. గత చరిత్ర నధ్యయనం చేయడం ప్రమాదకరమనీ, అపరాధమనీ, ప్రభుత్వం ప్రకటించాలని చరిత్ర నభ్యసించే వారిని ఉన్మాదులుగా భావించి వారిని మావవ నివాస యోగ్యం కాని దీవులకు దిగుమతి చేయాలి.
బూర్జువా ఏజెంట్ల బుర్రలు ఏవిధంగా పనిచేస్తున్నాయో దీనిని బట్టి స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాని కెయిలాక్స్ సిద్ధాంతం ప్రకారం జాతీయ పెట్టుబడిదారీ ముఠాల్లో సరస్పర విశ్వాసం నెలకొనడం అత్యవసరం. దూరంగా ఉన్న ఏదో ఒక దేశం – ఉదా హరణకు చైనా – ను యూరోప్ దుకాణదార్ల దోపిడికి స్వేచ్ఛగా వదిలి పెట్టాలి. అయితే జపాన్ దుకాణదార్లు చైనాలో తాము తప్ప ఇతరులెవరూ ప్రవేశించరాదని తలుపులు మూసివేస్తున్నారు. యూరోప్ కంటే చైనా తనకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి చైనా పై తమదే హక్కని జపాన్ వ్యాపారస్తులు వాదిస్తున్నారు. హిందువులను (భారతీ యులు అనే అర్థంలో ఇక్కడ హిందువులు అనేమాట ప్రయోగించబడింది) దోపిడీ చేయడం ఇంగ్లిషు పెద్దలకు అలవాటు ఐపోయింది. కాబట్టి హిందువులను దోపిడి చేయడంకంటే చైనాను దోపిడి చేయడం జపాను వ్యాపారస్తులకు ఎక్కువ తేలికైన పని. ఈ దోపిడీ చేయడం జపాను వ్యాపారస్తులకు ఎక్కువ. ఈ పోటీలు ప్రపంచాన్ని మరో మారణ హోమంలోకి ఈడుస్తాయి.
ఫ్రాంగోయిరీ అనే ప్యారిస్ పతికా విలేఖరి మాటలలో “తనకు సాధారణంగా ఉవయోగ పదే పెద్ద మార్కెట్టు అయిన రష్యా సామ్రాజ్యాన్ని యూరోపు కోల్పోయింది. ఇదే ఈనాటి చెడు పరిస్థితులన్నిటికి మూల కారణం.” దీనికి పరిష్కార మార్గంగా తదితర విలేఖరులు, రాజకీయ నాయకులూ, బిషప్పులూ, పెట్టుబడిదారులూ, యుద్దీన్మాద కుల్లాగే గ్రెంగోయి రీకూడా యూరోప్ ఖండం అంతా కలిసి సోవియట్ యూనియన్లో జోక్యం కలిగించుకోవాలని చెప్పుతున్నాడు. యూరప్ లో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతూ ఉంది. దీనితోపాటు శ్రామికుల్లో వర్గ చైతన్యం కూడా దినదిన ప్రవర్థమానమవుతూ ఉంది. శాంతి స్థాపనకు చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తు న్నాయి. అసలు శాంతికి స్థానం లేదా అనికూడా అప్పుడప్పుడనిపిస్తుంది. నేను అత్యాశా వాదిని కాదు. ప్రజా విరోధి అయిన బూర్జువా వర్గం తన దురాక్రమణ ప్లానుల నెప్పుడూ కొనసాగిస్తూనే ఉంటుందనే విషయం నేనెరుగుదును. జాతీయ దురహంకారి అయిన బర్గర్ (కిలోన్) ఫిబ్రవరి 19వ తేదీన ఇలా అన్నాడు.
“హిట్లరు అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మనీ భూ భాగాన్ని ఆక్రమించుకోవడానికి ఫ్రెంచి అధికారులు ప్రయత్నిస్తే మేము యూదులనందరినీ సర్వనాశనం చేసివేస్తాం.” ఈ విధంగా ప్రకటించినందుకు ఇకముందు బహిరంగ సభల్లో మాట్లాడరాదని క్రష్యన్ ప్రభుత్వం దిగ్గర్ పై నిషేధాజ్ఞ జారీచేసింది. ఈ నిషేధాజ్ఞ హిట్లరు ఆనుయాయుల క్రోధాన్ని మరింత రెచ్చగొట్టింది. ఒక ‘జాతీయ’ (రేసిస్టు) పతిక ఇలా వాసింది.
“శాస్త్ర విరుద్ధమైన చర్యకు ప్రోత్సహించే నేరమేమీ బర్గర్ చేయలేదు. ప్రభు త్వాధికారం మా చేతిలోకి వచ్చినత ర్వాత మేము చేసే నూతన చట్టం ప్రకారమే యూదులను హతమార్చివేస్తాం.”
ఈ ప్రకటనను ఒక ఎగతాళిగా, ఒక తమాషాగా మనం భావించగూడదు. యూరోపియన్ బూర్జువా వర్గం ప్రస్తుత మున్న దశలో అలాంటి చట్టాన్ని ప్యాసు చేయడంలోగానీ, యూదు జాతినంతటినీ నాశనం చేయడమే కాకుండా తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారినందరినీ మొదటి వరుసలో తమ ప్రయోజనాల కనుకూలంగా పనిచేయని వారినందరినీ- నాశనం చేయడంలోగాని ఎట్టి ఆశ్చర్యం లేదు.
బుద్ధిజీవి వర్గంలో ఈ ‘విష చక్రానికి ‘ చెందిన బూర్జువా సమర్థకులు బూర్జువా వర్గాన్ని సమర్థించడంలో క్రమక్రమంగా తమ నేర్పును కోల్పోతున్నారు. ఆ సమర్థ కులనే మరికొందరు సమర్థించవలసి వస్తూవుంది, వారు తమకాళ్ళమీద తాము నుంచోలేక పోతున్నారు. సిద్ధాంత రీత్యా తమను వ్యతిరేకించేవారి నుంచి కూడా (బూర్జువావర్గాధి కారం ఏర్పడుతుందనే భయంతో) వీరు సహాయం పొందడానికి ఆరాటపడుతున్నారు. వీరు చేయగలిగిన ఘనకార్యం దుష్ప్రచారం – అబద్దాల ప్రచారం – మాత్రమే. ఎన్ని అబద్దాలాడినా వాస్తవిక బూర్జువా వికృత స్వరూపాన్ని వీరు కప్పిపుచ్చలేక పోతున్నారు.
ప్రపంచాన్ని దోపిడి చేసి అలసిపోయిన వాళ్ళనూ నానాటికి తీవ్రత రమవుతున్న శ్రామిక వర్గ ప్రతిఘటనతో వ్యాకులపడేవాళ్ళనూ, అంతు లేని లాభాలు సంపాదించాలనే దురాశతో ఉన్మక భీషణ రూపందాల్చి సంఘ వినాశన కారులుగా తయారైనవాళ్ళనూ, బలపరచడం, లేక కాపాడడం కేవలం నిర్లక్ష్యమే కాకుండా ఆ బలపరచే వాళ్ళకు కూడా అది ముప్పుతెచ్చి పెడుతుంది.
ప్రజల కుత్తుకలు కత్తిరించే దోపిడి దొంగలైన ‘పెట్టుబడిదారులను ఓదార్చడమంటే బలపరచడమంటే ఎంత అపరాధమో వేరే చెప్పనవసరం లేదు. ఇది వాస్తవిక జీవితానికి దూరమైన నిరుపయోగమైన నైతిక విషయం. కాబట్టి దీనినుంచి జరిగే దేమీ లేదు. అయితే ఈ ఓదార్చే బుద్ధిజీవులు నేటి ప్రపంచంలో తిషను ఒక “మూడోశ క్తి’గా మూడో శక్తి అంటూ అసలు ఉండదని తర్కశాస్త్రం ఒక వైపు నిరూపిస్తున్నామని పరిగణించుకుంటున్నారు.
పుట్టుక రీత్యా వీరు బూర్జువా వర్గానికి చెంది వున్నా సంఘంలో వీరి స్థానం కార్మికులతో పాటే ఉంటుంది. పతనమైపోతూన్న – పతనమై తీరవలసిన – వర్గానికి తాము చేసే ‘సేవ అంతా బూడిదలో పోసిన పన్నీరులాగా ఎలా కొరగాకుండా పోతూఉందో వీరు గ్రహిస్తున్నారు. హత్యలనే దోపిడీనే వృత్తిగా బెట్టుకొన్నవారు నశించడం ఎంత అవసరమో బూర్జువా వర్గం నశించడం కూడా అంతే అవసరం. ఈ బుద్ధిజీవులు చేసే సహకారంతో బూర్జువా వర్గానికి ఇక అవసరం లేకపోవడముచేత బుద్ధిజీవులు కూడా అసలు విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. మేధావులు ఇప్పటికే ఎక్కువై పొయ్యారని తమ వర్గానికి చెందిన కొందరు ఏవిధముగా బూర్జువా వర్గాన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో వీరు తెలుసుకుంటున్నారు బూర్జువా వర్గం కూడా వేదాంతులనూ, తాత్వికులనూ వదలి ముందు జరగబోయే విషయాన్ని కూడా చెప్పుతాం అనే జ్యోతిష్కులను ఆశ్రయించడం వీరు గమనిస్తూనే ఉన్నారు. బూర్జువా వర్గం కంటే పరమ మూర్ఖులైన సాముద్రిక శాస్త్రజ్ఞులూ, దైవజ్ఞులూ జోస్య కారులూ, ఫకీర్లూ, సన్యాసులూ ఆధ్యాత్మిక వాదులు చేసే ప్రకటనలతో యూరోప్ వార్తా పత్రికలు నిండిపోతున్నాయి. కెమేరాలూ (ఫొటోగ్రఫీ) సినిమాలూ, కళలను హత్యచేస్తున్నాయి. ఉదర పోషణార్థం- తిండికీ, రొట్టెకూ, బంగాళాదుంపలకూ, ధనికులు కట్టి విడిచిన పాత బట్టలకూ- చిత్రకారులు తమ చిత్రాలను మారకం వేసుకుంటున్నారు. ఆ మ్ముకుంటున్నారు.
ఒక ప్యారిస్ ఏర్తా పత్రికలో ప్రకటించబడిన ఈ కింది తమాషా వార్తను తిలకించండి.
“బెర్లిన్’ చిత్రకారులు నానా దురవస్థలకు గురి అవుతున్నారు. ఆశలేశ మెక్కడా కనిపించడం లేదు. చిత్రకారులు పరస్పర సహాయక సంఘాలు నిర్మించుకోబోతున్నా రని వార్తలు వస్తున్నాయి. రాగిదమ్మిడీ కూడా గడించ లేని, గడించడానికి అవకాశం లేని- వీరు పరస్పరం ఏ విధంగా సహాయం చేసుకోగలరు. అన్నాట్ జాకోబీ అనే చిత్రకారిణి సూచించిన వస్తు వినిమయ పద్దతికి బెర్లిన్ కళావేత్తలూ చిత్రకారులూ ఎంతో సంతోషంగా స్వాగతం ఇస్తున్నారు. చిత్రకారులు వ్రాసిన చిత్రాలనూ శిలా విగ్రహాలనూ తీసుకొని బొగ్గు వ్యాపారులు చిత్రకారులకు కావలసిన వంట చెరుకును సప్లయి చేయవలసి ఉంటుంది. కాలము ఎప్పుడూ ఒకేవిధముగా ఉండదు. పద్ధతులు మారుతూ ఉంటాయి. ఈ విధంగా వస్తువులు మారకం వేసుకోవడంవల్ల బొగ్గు వ్యాపారులు నష్ట సడరు. ఒక దంత వైద్యుడు చిత్రకారులకు దంత వైద్యం చేస్తాడు. దంత వైద్యుడు తన వైద్యశాలను చిత్రాలతో అలంకరించడం అతనికి మించినప నేమిగాదు. పాలవాళ్ళూ కసాయివాళ్ళూ ఈ సదవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. చిత్రాలకు నగదు చెల్లించి కొనుక్కోకుండానే పాలవాళ్ళూ కసాయివాళ్ళూ కూడా కళాసౌందర్యాన్ని అనుభవిస్తారు. అన్నాట్ జాకోబీ సూచనను అమలు పరచడానికి బెర్లిన్ లో ఒక ప్రత్యేక బ్యూరోను ఏర్పంచడానికి చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.”
ఈ వస్తు వినిమయ పద్ధతిని గురించి ఉల్లేఖిస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘం ఒకటి ఇదివరకే ప్యారిస్ లో ఉందనే విషయాన్ని ఆ పత్రిక పేర్కొనకుండా జారవిడిచింది.
ఉత్తమ నాట్య కళను సినిమాలు క్రమక్రమంగా విధ్వంసం చేసి వేశాయి. బూర్జువా చలన చిత్రాలు చేసే విష ప్రచారాన్ని గురించి ఎక్కువగా చెప్పడం ఆనవసరం. యదార్థం కండ్లకు గట్టినట్లు కనిపిస్తూనే ఉంది. సనాతన భావాలకు సంబంధించిన కథా వస్తువులన్నీ (సెంటి మెంటల్ థీమ్సు) అయిపోవడంతో , బూర్జువా డైరెక్టర్లు ఇప్పుడు శారీరిక నగ్న దృశ్యాల పైకి ఎగబడుతున్నారు.
“మెట్రో గోల్డ్ విడ్ మేయర్ అనే హాలివుడ్ స్టూడియోలో ఏక్సు’ అనే ఫిలిం తయారుచేయడానికి ఒక ప్రత్యేక ట్రూపు ఏర్పడింది. ఇందులో పాత్రలు : కొంగ పోలికలు గలిగిన ఒక ఆడకోయిల. పి, రాబిన్ సన్, మానవుని అస్థి పంజరం. ఒంటి చేతితో బుట్టిన మార్ధా. ఈమె తన కాళ్ళతో లేసును అల్లడంలో సమర్ధురాలు. ఛిల్లీ, ఈమెకు ‘పి – హెడ్’ అని ఎగతాళిగా పెట్టిన పేరు. “పిన్ హేడ్ ‘ అంటే తతిమా శరీరం అంతా సాధారణంగా ఉండి తల మాత్రం గుండు సూదిలాగా అతి చిన్నదిగా ఉండడం. ఓల్గా, పురుషునిలాగా పెద్దగడ్డం ఉన్న స్త్రీ. జోసెఫ్ సగం స్త్రీ, సగం పురుషుడు. సయాం కవల పిల్లలు గిల్టన్ అప్పచెల్లెళ్లు, మరికొందరు మరుగుజ్జులు.”
బర్నాయా, పొజరీ, మానెట్ లాంటి వాళ్ళకు ఇప్పుడు సినిమారంగంలో స్థానం లేదు. ఫెయిర్ బాంక్సు, హెరాల్డ్ లాయిడ్ లాంటి ట్రిక్ మాష్టర్లు ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. వైవిధ్యం లేని నిరాశావాది అయిన సనాతన భావాలను ప్రకోపించు జేసే (సెంటి మెంటల్ ) చార్లీ చాప్లిన్ వీళ్ళందరికీ నాయకుడు ఇ దేవిధంగా క్లాసికల్ సంగీ తానికి స్వస్తిచెప్పి ఆస్థానాన్ని జజ్, ఆక్రమించుకుంది. సెంధల్ . బాల్టాక్ . డికెన్సు, ప్లాబర్టుల స్థానంలో ఎడ్గర్ వాలెస్ లాంటివాళ్లు ప్రవేశించారు. అసంఖ్యాక ప్రజల రక్తాన్ని పీల్చిపిప్పి చేసే ప్రజా హంతకుల, ప్రజా పీడకుల ఆస్తిని కాపాడటానికి చిన్న చిన్న దొంగలనూ, సామాన్య హంతకులనూ ‘బ్రహ్మాండంగా వేటాడి పట్టుకునే పోలీసు దొంగలనూ, సామాన్య హంతకులనూ ప్లానులనూ, పాత్రలనూ ప్రదర్శించడమే వీళ్ళకు చేతనైన పని పోస్టు బిళ్ళలనూ ట్రాం టికెట్లనూ ప్రోగుచేయడం. ఇంకా మహాచేస్తే పాత యజమానుల చిత్రాలకు తప్పుడు నకళ్ళు తయారు చేయడంతోనే కళారంగంలో తన కర్తవ్యాన్ని “ జయప్రదంగా నిర్వహించానని బూర్జువావర్గం సంతృప్తి పడుతూ ఉంది. ఇక సైన్సురంగంలో వీరు చేసిన కృషి ఏమిటయ్యా అంటే కష్టజీవుల శ్రమశక్తిని తమకు వీలుగా, చౌకగా ఉండే టటు దోచుకోడానికి కొత్త కొత్త పద్ధతులను కని పెట్టడం, ఆ వర్గానికి కావలసిన ప్రయో జనం కూడా అంతవరకే సంచులు నింపుకోడం ఎలాగా అనేదే వారి సమస్య.
అమితంగా, తిన్నతిండిని అరిగించుకోడం- స్త్రీ పురుష సంబంధాల్లో అరాచకంగా సంచరించడం. ఇవే వారి సైన్సుకు మూల సూత్రాలు. పెట్టుబడిదారీ కాడి క్రింద నలిగిపోయే బౌద్ధిక వికాసంతో గాని, ఆరోగ్యాభివృద్ధితో గానీ జడ పదార్థాన్ని ‘శక్తి’గా మార్చడంతో గానీ, మానవ శరీర నిర్మాణంతో గానీ. అభివృద్ధితోగానీ. టెక్నిక్ తో గానీ, – వారికెట్టి సంబంధం లేదు. ఇవన్నీ బూర్జువా బుద్ధికి అతీత మైన విషయాలు. సెంట్రల్ ఆఫ్రికాను అనాగరిక దశలో, బానిసత్వంలో ఆట్టి పెట్టడం ఎలాగో వాళ్ళకు కావాలి గాని ఇలాంటి వాటితో వాళ్ళకేం ప్రయోజనం?
తమ ‘స్వతంత్ర ఆలోచన’ తమ ‘స్వతంత్ర మేధాశక్తి ‘ ద్వారా ‘కొత్త సృష్టి’ చేయడం, తమ కర్తవ్యం అని భావించే బుద్ధిజీవుల్లో కొంద ఏ ఈ లోతుపాతు అన్నీ గ్రహించిన తర్వాత ‘క శాసృష్టి’ చేయడం తమ పనికాదనీ, ‘పెట్టుబడిదారీ ప్రపంచానికి సంస్కృతితో అవసరం లేదనీ ఇప్పుడిప్పుడే ప్లేటు మారుస్తున్నారు. చైనాలో జరిగిన సంఘటనలు – విశ్వవిద్యాలయాన్నీ, లో వెయిన్ లైబ్రరీని 1914 లో నాశనం చేయడంవాళ్ళు చూశారు. షాంగ్ హైలోని టుంగ్ సీ విశ్వ విద్యాలయాన్నీ, నావికా కళాశాలనూ, మత్స్య పరిశ్రమ పాఠశాలనూ, జాతీయ విశ్వవిద్యాలయాన్నీ, ఇంజనీరింగ్ కళాశాలనూ, వైద్య కళాశాలనూ, వ్యవసాయ కళాశాలనూ, కార్మిక విశ్వవిద్యాలయాన్నీ ధ్వంసం చేస్తోన్న – కూలద్రోస్తూ వున్న – జపాన్ ఫిరంగి గర్జనలు ఆలకించారు. కాని ఈ కిరాతక చర్యలేవీ వారలో క్రోధ జ్వాలను రగుల్కొల్ప లేక పోయాయి.
ఆయుధాలను విపరీతంగా ఉత్పత్తి చేయడంతోపాటు విద్యా సంస్థలు ఈవిధంగా నాశనమై పోవడం వారికేమీ పట్టనట్లే ఉంది !
యూరప్, అమెరికా మేధా వివర్గంలో బహు కొద్దిమంది మాత్రమే ‘మూడో దశ అంటూ వుండదు” అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా అవగాహన చేసుకుంటున్నారు. ఐతే ఏపక్షంలో చేరాలి అనే సమస్య వారినింకా ఎదుర్కొంటోంది. కార్మికవర్గానికి వ్యతిరేకంగా పాత అలవాటు ప్రకారం బూర్జువా పక్షం వైపుకు పోవ డమా ? లేక బూర్జువావర్గానికి వ్యతిరేకంగా తాను న్యాయమని సమ్మిన శ్రామిక పక్షం వైపు చేరడమా ? బుద్ధిజీవుల్లో ఎక్కువమంది పెట్టుబడిదారీ సేవ జేయడంతోనే సంతృప్తి చెందుతున్నారు. కాని తన బావిస (మేధా వివర్గం) యొక్క మెతక బుద్ధినీ, ఆ బానిస చేసే పనిదారుడు, తమకు నిష్పయోజనమనీ నిరుపయోగమని గ్రహించిన వారు ఆ బావిసతో ఇక తనకేమీ నిమిత్తం లేదని, అతన్ని చులకనగా చూస్తూ, . వుంది. బూర్జువా వర్గాన్ని ఓదార్చడంలో మంచి నేర్పు సంపాదించిన ఇలాంటి మహాశయుల వద్ద నుంచి కూడా తరుచుగా నాకు అనేక ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. ఉదాహరణగా అలాంటి ఉత్తరాన్ని ఒకటి యిక్కడి ఉద్దరిస్తాను.
“ప్రియమైన గోర్కీ….
అంతా అయోమయంగా ఉంది. ప్రపంచాన్ని అంతటినీ ఊపివేస్తున్న భయంకరమైన ఆర్థిక మాంద్యం ఫలితంగా నిరాశా నిస్పృహలు ఆవరించి దారీ తెన్నూ కానలే కుండా ఉన్నాం. ఈ ప్రపంచవ్యాపిత సంక్షోభం ‘టిడెన్సుటగన్ ‘ అనే సుప్రసిద్ధ నార్వే పత్రికకు అనేక వ్యాసాలు వ్రాసేటట్లుగా నన్ను పురికొల్పింది. ఈ భయంకర సంక్షోభానికి గురి అయిన లక్షలకొలది ప్రజానీకంలో మళ్ళీ నూతనోత్సాహాన్ని రేకెత్తించి వారిలో ఆశాలతను పల్లవింపచేయడమే ఆ వ్యాసాలు ఉద్దేశ్యం. ఈ ఆశయ సాధన కోసమే గత రెండు సంవత్సరాల్లో ప్రజ లేవిధంగా నానా బాధలను భవించారో వాటిని గురించి తమ అభిప్రాయాలు తెలియజేయ వలసిందని సాహిత్య, కళా, సైన్సు, రాజ కీయరంగ ప్రతినిధులను ఆర్ధించడం అత్యవసరమని భావించాను. ఆర్థిక మాంద్యం – నే దుర దృష్ట దేవత వాత బడి నశించిపోవడమా? లేక ఈ సమస్యను జయప్రదంగా పరిష్ఠ రించగలమనే ఆశతో పోరాటం కొనసాగించడమా? అనే సమస్య నేడు ప్రతి దేశంలోని ప్రతివ్యక్తిని ఎదుర్కొంటూ ఉంది. ఈనాటి నిరాశా పూరిత వాతావరణం నుంచి బైట పడడం ఎలాగా అని ప్రజలందరూ నిరీక్షిస్తున్నారు. తాము విశ్వసించే, గౌరవించే వ్యక్తి వెల్లడించిన ఆశాపూరిత అభిప్రాయం అంధకారావృత అసంఖ్యాక హృదయాల్లో ఆశా జ్యోతిని వెలిగిస్తుంది, కాబట్టే నేటి పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని తెపియజేయ వలసిందని మిమ్ములను అర్థిస్తున్నాను. ఈ అభిప్రాయం నాలుగు మూడు పంకుల్లోనే వ్యక్త మైనా సరే అనేక నిరాశామయ జీవితాల్లో నవ జీవం పోస్తుంది. ఆశాపూరిత దృక్కులతో భవిష్యత్తు వైపు తిలకించగల బలాన్ని ఇస్తుంది.
గౌరవనీయుడు
“స్వెన్ ఎల్వెర్ స్టడ్”
ఈ ఉత్తరం వ్రాసిన వ్యక్తిలాంటి వాళ్లూ, రెండు మూడు పంక్తుల’ ఔషర శక్తిలో తమ సహజవిశ్వాసాన్ని కొల్పోవట్టిన వాళ్ళూ – చాలామంది ఇంకా నివసిస్తూనే ఉన్నారు. కాని వారి విశ్వాసాన్ని హృదయపూర్వక విశ్వాసం అనజాలం. రెండు మూడు పంక్తులేకావు రెండు మూడువందల పంక్తులు కూడా వార్ధక్య భారంచే కంగి పోయే బూర్జువా వర్గ శరీరావయవాల్లో నూతన జీవాన్ని పోయలేవు. నానాజాతి సమితి సమావేశాల్లోనూ, పార్లమెంట్ల సమావేశాల్లోనూ, ప్రతిరోజూ వేలకొలది గంభీరోపన్యాసాలు వినబడుతున్నాయి. కాని అవి ఎవరినీ ఓదార్చలేక పోతున్నాయి. “ప్రజల పరిశ్రమింపజేయలేక పోతున్నాయి. మాజీ మంత్రులు, తదితర సోమరిపోతులూ ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి పర్యటనలపై పర్యటన చేస్తున్నారు. సైన్సుకు ‘కళ్లెం పెట్టబోతున్నాం అనీ. సైన్సును అదుపులో, ‘ క్రమశిక్షణ’లో ఉంచబోతున్నామనీ బూర్జువా వర్గానికి నచ్చజెప్ప ప్రయత్నిస్తున్నారు. వీళ్లు మాట్లాడే చెత్తనంతా పత్రికా విలేఖరులు చిలక పలుకుల్లాగా వల్లిస్తున్నారు. ఇలాంటి పత్రికా విలేఖరులలో ఒకడైన ఎమిల్ లడ్విగ్ ‘డెయిలీ ఎక్స్ ‘ప్రెస్’ అనే ఒక పత్రిక లో శాస్త్ర ప్రవీణులను తన్ని తరిమివేయాలంటూ ఒక వ్యాసం వ్రాశారు. చోటా బూర్జువా వర్గం ఈ ప్రముఖుడిచ్చిన సలహాకు తన చెవినొగ్గుతూ ఉంది. అతను వ్రాసిన చెత్తనంతా చదువుతూ ఉంది. ఆ చెత్తనుంచే తన మార్గాన్ని – కర్తవ్యాన్ని – నిర్ణయించుకుంటూంది. యూరోపియన్ బూర్జువావర్గం తమ విశ్వ విద్యాలయాలన్నింటిని మూసివేయాలలని నిర్ణయించుకున్నా అందులో ఆశ్చర్యపడవలసింది ఆవంత కూడా లేదు. జర్మనీ విశ్వవిద్యాలయాల్లో ప్రతి సంవత్సరం పట్టలేదు లయ్యే 40 వేల మందిలో ఉద్యోగాలు లభించేది ఆరు వేల మందికి మాత్రమే.
(ఇంకా వుంది…)