కల్లోల కల

ఆ రోజు ఉదయం నిద్ర లేచీ లేవడంతోనే గత కొన్ని రోజుల నుండి నా మనసుని వెంటాడుతున్న సంఘటనల ఆధారంగా ఒక ఆలోచన నా మెదడుపై దాడి చేసింది. ఆ ఒక్క ఆలోచన నా మనసును చిధ్రం చేసే కొన్ని వందల ఆలోచనలకు దారి తీసింది. నా బుర్ర నిండా ఆ కల్లోల ఆలోచనలే. అవి రేకెత్తించే ప్రశ్నలే. వాటికి సమాధానాలు దొరుకుతాయో లేదో అనే సందిగ్ధ స్థితి. ఒకవేళ వాటికి సమాధానాలు ఉంటే ఎలా వెతకాలి? ఎక్కడ వెతకాలనే మరో ప్రశ్న. పుస్తకంలో వెతికే దొరకవచ్చేనేమో అని మరో ఆలోచన.

పుస్తకాల దగ్గరికి వెల్లెలోపే పిచ్చిదాన ఆ క్రూరత్వాన్ని వర్ణించే పుస్తకాలు ఇంకా ఎవరు రాయలేదు అన్న నా మనో భాష్యం. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలో అర్థం కావడం లేదు. నేనేమీ చేయలేనా? అని మళ్లీ ప్రశ్నలు. వాటి సమాధానాల వెతుకులాటలో మళ్లీ మళ్లీ ప్రశ్నలు. ప్రశ్నలు తప్ప ఒక్క సమాధానం కూడా దొరకని ఓ దుర్భరమైన క్షణం. ఏమి చేయలేని ఆ స్థితిలో అలాగే ఆలోచిస్తూ కుర్చీలో కూర్చొని ఎప్పుడు నిద్రలోకి జారుకున్న.

అప్పుడే ఎవరో మా ఇంటి తలుపులు కొట్టిన శబ్దం. మేల్కొని వెళ్లి తలుపు తీసే సరికి నా స్నేహితురాలు రోష్ని, ఆమె చెల్లెలు భాను. సంతోషంతో వెళ్లి వాళ్ళని కౌగిలించుకుని ఇంట్లోకి తీసుకువచ్చాను. ఎన్నో రోజులైంది వాళ్ళని కలిసి.

నా స్నేహితురాలు రోష్ని, భానుని ఉద్దేశించి ”దీనికి ఇప్పుడు 8 నెలలు నడుస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఓ బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నది”. అన్నది. నా లోలోపల సంతోషం ఎగసింది.

”అంత సంతోష పడకు శ్వేతా… మేం ఈ లోపే డిటెన్షన్ హౌస్ కి వెళ్ళాలి అని నోటీస్ వచ్చింది. చివరిగా ఒకసారి నిన్ను చూద్దాం అని వచ్చాం” అన్నది. ఆ మాట విని అప్పటికి వరకు సంతోషం నిండిన నా కళ్ళలో ఒక్కసారిగా దుఃఖం తాండవించింది. నా గుండె శ్రుతి మించిన వేగంతో కొట్టుకుంటోంది. అలా కళ్లు మూసుకుని ఏడుస్తూనే ఉన్నాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు..

కొంచం సేపటి తరువాత ముఖంపై తడిగా అనిపించే సరికి కళ్ళు తెరిచి ఒకసారి అటు ఇటు చూసేసరికి నా స్నేహితులు ఇద్దరూ కనిపించ లేదు. కానీ నా కళ్ల నుంచి నీళ్ళు మాత్రం ఆగలేదు. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడు అర్థమైంది… ఇది కల అని.

అలా మేల్కొన్న నేను కలలో కన్పించిన నా స్నేహితుల గురించి ఆలోచిస్తూ మళ్లీ నిద్రలోకి జారుకున్నాను…

తెల్లవారింది. నిద్రలేచి బయటికి వచ్చే సరికి నిర్మానుష్యమైన మా వీధి కనపడింది. ఏమైంది? ఎప్పుడు మనుషులతో కళకళలాడే మా ఊరి వీధులు ఇలా నిర్మానుష్యంగా ఎందుకు మారాయి అనే ఆలోచన చుట్టు ముట్టింది. ఆ ఆలోచన కారణంగా నా అనుమతి లేకుండనే నా కాళ్ళు అడుగెలేయడం మొదలు పెట్టాయి. అలా ఒంటరిగా మా వీధి వెంబడి నడుస్తూ నడుస్తూ ఎటు పోతున్నానో ఎలా పోతున్నానో తెలియకుండానే ఓ గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాను.

అలా నడుస్తూ నడుస్తూ ఓ పాడుబడిన నిర్మానుష్యం అయి నిశ్శబ్దం ఆవరించి ఉన్న ఓ ప్రదేశాన్ని చేరుకున్నాను. నేను తప్ప మరో మనిషి కనిపించని ఆ ప్రదేశంలో అన్ని నిర్మాణాలు ఉన్న నాకు ఎదురుగా ఉన్న ఒక గది మాత్రం నన్ను భయపెట్టింది. ఏదో మృత్యు ద్వారం ముందు నిలుచున్నట్టు అనిపిస్తోంది. ఆ గది ఎంతగా నన్ను ఎంతగా భయపెట్టింది అంటే దాని దగ్గరికి పోవడానికి కూడా సాహసించలేక పోయాను. మొత్తం పాచి పట్టి పచ్చగా తయారయిన దాని గోడలు. బాగా గార పట్టిన ఆ తలుపుకున్న అద్దం. నీటి చుక్కలు రాలి పడుతున్న శబ్దం. అచ్చంగా దెయ్యాల సినిమా లో ఉన్న భయంకరమైన ప్రదేశంలా అనిపించింది. దాని లోపలికి పోవలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడే లోపలి నుండి దబ్బుమని తలుపు తోసుకొంటూ ఒకామె ”కాపాడండీ… కాపాడండీ…” అంటూ గాయాలపాలై నెత్తురోడుతున్న శరీరంతో పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకుంది. ఎవరబ్బా అని చూడబోతే అది కడుపుతో ఉన్న నా స్నేహితురాలు. దాన్ని అలా చూడగానే నాలో నేను లేను ఏదో తెలియని ఆందోళన. భయం ఆవరించాయి.

”ఏమైంది భానూ… ” అని దాన్ని అడిగే లోపే లోపలి నుండి ఒక వ్యక్తి వచ్చి దాన్ని నా దగ్గర నుండి లాక్కోపోతున్నడు. నేను అడ్డుకోబోతే వాడు నాతో ”ఈమె పిచ్చిది. నువ్వు పక్కకు తప్పుకో. అని కొడుతూ నేను ఆపుతున్నా ఆగకుండా ఒక మృత కళేబరాన్ని లాక్కుపోతున్నట్టు నా కళ్ళ ముందే దాన్ని లాక్కుపోయాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక నిర్ఘాంతపోయిన పరిస్థితి నాది. మొత్తానికి ధైర్యం చేసి లోపల ఏం జరుగుతోందో చూద్దామని ఆ తలుపుకున్న అద్దంలోకి చూసాను. కనిపించిన దృశ్యం మనిషి ఎంత క్రూరుడనేది తెలిసింది. ఆ ఒక్క దృశ్యం నాలో పొంగుతున్న దుఃఖాన్ని భయట పెట్టింది. నన్ను మరింత భయానికి గురి చేసింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే నా భాను ఆ గదిలో రక్తపు మడుగులో జీవమున్న శవంలా పడుంది. అయినా కూడా ఆ క్రూరుడు ఆ మానవ మృగం దాన్ని కొడుతున్నాడు. అక్కడే ఒకడు దాని బిడ్డని పాలుగారే పసిగుడ్డును పట్టుకొని కొడుతున్నాడు. యెత్తి పడేస్తున్నడు. భయంకరంగా చిత్రవధ చేస్తున్నాడు. ఆ హింసను తట్టుకోలేక భయంకరంగా విలపిస్తున్న ఆ పసిబిడ్డ రోదన నా మనసును చిత్రవధ చేస్తోంది. ఏడ్వడం తప్ప మరి ఏమి చేయలేక అలాగే ఏడ్చుకుంటూ అక్కడే తిరుగుతున్న నాకు ఒక గుహ లాంటిది ఒకటి కనిపించింది. అందులో నుండి నాకు తెలిసిన ఒక అమ్మాయి తన బిడ్డని ఎత్తుకొని ఏడ్చుకుంటూ బయటికి పరిగెత్తుతూ కనిపించింది. కనీసం తననైన కాపాడుకుందామని ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెల్లేలోపే మళ్లీ ఒకడు లోపలి నుండి వచ్చి ఆమెని, ఆమెతో పాటు వచ్చిన మరో అమ్మాయిని లాక్కు పోయాడు.

ఏడుస్తూ అక్కడే నిలబడి పొయా. మరో పక్కగా ఇంకో గది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని భయతో ఆందోళనతో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గదిలోకి చూస్తే కొన్ని వందల మంది పసికందులు కనిపించారు. వారిలో కొందరి మృతదేహాలు, మరికొంత మంది మరణానికి దగ్గరవుతూ చిక్కి శల్యమైన శరీరాలు. ఆ దృశ్యాలను చూసి ఏం చేయాలో తెలియక, వాళ్ళని ఎలా కాపాడాలో అర్థం కాక అక్కడే చతికిల పడి ఏడుస్తున్నాను. నా చుట్టూ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలు. నెత్తురొడుతున్న శరీరాలు. బిడ్డలకు దూరమైన తల్లులు. తల్లులకు, తల్లి పాలకు దూరమైన పసి బిడ్డలు. దుర్మార్గపు మనుషులతో దెబ్బలు తింటూ ఘోరంగా ఏడుస్తున్న నా వాళ్ళు… ఇలా నా చుట్టూ విలయతాండవం చేస్తున్న మృత్యువు…

ఏం చేయాలి? ఎలా చేయాలి అనే ప్రశ్నలు ఒకపక్క. నా వాళ్ళను నేను కపాడుకొలేనా? వాళ్ళ రక్తం ఇలా ఏరులై పారాల్సిందేనా? వాళ్ళ శరీరాలు ఇలా చిధ్రమై పోవాల్సిందేనా? అనే నా భయాలు, బాధలు, ఆలోచనలు, నా వాళ్ళ ఆర్తనాదాలు మరోపక్క. ఇవన్నీ కలిసి నా మెదడుని చిత్రవధ చేస్తున్నాయి…

ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో అర్థం కాక నా భయాలకు, ఆందోళనలకు అవి సృష్టించే ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఎప్పటిలాగే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నా తలను నేనే బాదుకుంటున్న. దెబ్బ గట్టిగ తగిలేసరికి అమ్మా అంటూ కళ్లు తెరిచాను. చుట్టూరా తేరిపార చూసాను. నా పక్కన ఎవరూ లేరు. నా రూమ్ లోని వాళ్లందరూ నిద్రపోతున్నారు. అప్పుడు సమయం తెల్లవారుఝామున మూడు గంటలు…

అప్పటికి భయంతో నా గుండె శ్రుతి మించిన వేగంతో కొట్టుకుంటోంది. ఏం చేయాలో తెలియక మళ్లీ నిద్రపోతే ఎక్కడ మళ్లీ ఇలాంటి వాస్తవాలు కనబడతాయో ఏమో అని నా కన్నీళ్లను తుడుచుకొని ఆలోచించుకుంటూ ఉదయం వరకు అలాగే కూర్చుండి పోయాను.

నా కనుపాపల్నిండా కలలే. నెత్తురోడుతున్న కలలు. మనుషుల ఆర్తనాదాలు. లోలోపలంతా దు:ఖమే. కల్లోల కలల దు:ఖం.

పుట్టింది కడప జిల్లా ప్రొద్దటూరు. రచయిత్రి. విరసం సభ్యురాలు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో M.A.Women's studies చదివారు. ప్రస్తుతం ఎంసీజే చదువుతున్నారు.

Leave a Reply