కలల రాజ్యం

“షాదీఖానాకి వెళ్ళాకే కుర్తా పైజామా వేస్కో… అక్కడి దాకా పొద్దునేస్కున్న జీన్సపాంట్, టీషర్ట్ మీదే వెళ్ళు. నిఖా అయ్యాక కుర్తా తీసేసి మళ్ళీ పాంట్ షర్ట్ వేస్కునే ఇంటికి రా… నా మాటిను అయాన్…” అమ్మీ గొంతులో ఆందోళన… భయం… పొద్దుట్నించీ ఇలా నాలుగోసారి చెప్పడం “అమ్మీ ఫికర్ చెయ్యకు ఏమీ కాదు” అంటూంటే “ఒద్దురా… కుర్తా పైజామాలో నువ్వ ముస్లిమ్ వని తెల్సిపోతుంది. వాళ్ళేమైనా చేస్తారు. మేరీబాత్ మాన్ పాంట్ షర్ట్ పెహెన్ కే జా షాదీ కో…” అమ్మ అట్నించి. “సరే… సరే… పరేషాన్ కాకు అమ్మీ” అంటూ ఫోన్ పెట్టేసాను.

‘వాళ్ళంటే’ అమ్మీకి భయం. అమ్మకేనా? అబ్బాజాను ఖాలా మామూలుకు, నా బెహెన్లకు… పక్కింటి నుస్రత్ ఆంటీకి, మా గల్లీలోని మన్జీద్ మౌల్వీకి, మదర్శా ముదర్సిలకు (టీచర్లకు) బీఫ్, మటన్ వ్యాపారాలు చేసేవాళ్ళకు, పాలు – పెరుగు అమ్ముకుంటూ ఆవుల్ని పెంచుకునే పాల వ్యాపారులకు, మాక్బూల్, అఫ్, ఆలీలకు, అందరికీ ‘వాళ్ళంటే’ భయం, తల్చుకుంటూనే గుండె దడ ఒణుకు… వాళ్ళంటే?… వాళ్ళు సంఘ్ వాదీలు!

అమ్మీ నన్నే కాదు అబ్బాజాన్ని కూడా కుర్తా పైజామా వేస్కొని బయటకు పోనివ్వదు. ఇంటికెవరైనా బంధువులు వస్తున్నారని తెలిస్తే వాళ్ళకు ఫోన్ చేసి మరీ చెప్తుంది. ఫాంట్ షర్ట్ లో రావాలి అని. ఆడాళ్ళనైతే బుర్భాలేస్కోవద్దని చెబుతుంది. ‘బుర్భా వేస్కోకుండా ఎట్లా రావాలి జైనబ్ ఆపా… ఉనోనై మాత్తే” అని తబస్సుం బాబీ అంటే ‘అరే సర్ పే హిజాబ్ పెన్ కే ఆఁవ్… రాస్తే మేఁ సంఘ్ వాదీలోగ్ కుచ్ కర్ దియే తో? (తల చుట్టూ హిజాబ్ వేస్కొనిరా… దారిలో సంఘవాదులు ఏమైనా చేస్తే) అంటుంది. అమ్మకెప్పుడూ ఆందోళనే… తమ్ముళ్ళు కనబడక పోయినా అబ్బాజాన్ ఫోన్ స్విచ్చాఫ్ అయినా, ఆలశ్యంగా ఇంటికి వచ్చినా వచ్చేలోపల భయంలో ఒణికిపోతుంది. బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేస్తుంటుంది. చమటలు పట్టి ఏడుస్తూ… గుండెల్లో నొప్పంటూ కూలబడుతుంది. నేనూ… అబ్బాజాన్ కళ్ళబడే వరకూ అమ్మీ అట్లా బేతాబీ హాలత్ లోనే ఉంటుంది. అమ్మకి షుగర్ బీమారీ, బీపీ ఉంది. ఇట్లా ఆందోళన పడితే గుండె ఎఫెక్ట్ అవుతుందని అమ్మీని సైకియాట్రిస్ట్ దగ్గర్కి తీస్కెళ్లాం. రోజూ రాత్రి ఆందోళన తగ్గి నిద్ర పట్టడానికి మాత్రలు రాసిచ్చాడు. అవి వేస్కున్నప్పట్నించీ రాత్రిళ్ళు నిద్రపోతున్నది. లేకపోతే రాత్రంతా జాగారమే. పట్టే ఆ కొద్ది నిద్రలోనూ పీడకలలే… ఇదంతా సంవత్సరం క్రితం మేక మాంసం వ్యాపారం చేసే వాళ్ల చిన్న తమ్ముడు రఫిక్ మామూని సంఘ్ వాదీలు బీఫ్ వ్యాపారం చేస్తున్నాడని, ఆవుల్ని చంపుతున్నాడనీ దారి కాచి పట్టుకొని కొట్టి కొట్టి చంపినప్పటినించీ మొదలైంది. తమ్ముడి కోసం ఏడ్చి ఏడీ…. బేహోష్ అయిపోయింది. బీపీ పెరిగిపోయింది. దవాఖానాలో షరీక్ చేయాల్సి వచ్చింది. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. అయినా ఇప్పటికే బయటికెళ్ళిన మనుషులం ఇంటికి చేరే దాకా నిద్రపోకుండా గుమ్మంలో కాచుకొని ఉంటుంది. టార్చ్ లైట్, సెల్ ఫోన్లు చెరొక చేత్తో పట్టుకొని మేం వచ్చాకే తను తిండి తినేది, నిద్రపోయేది. మిగిలిన తమ్ముళ్ళిద్దరికీ గడ్డాలు తీయించేసింది. నేనూ అబ్బాజాన్ కూడా గడ్డాలు పెంచుకోకూడదు. కళ్ళకి షుర్మా కూడా పెట్టుకోకూడదు. శుక్రవారాలు, పండగ దినాల్లో కూడా ఇంట్లోనే నమాజు చేస్కోవాలని మొండికేస్తుంది. “మస్జిద్ లో వందల మంది ముసల్మానుంటారు జైనబ్… అంతమందిని ఏమీ చేయరు” అని అబ్బాజాన్ అంటే ‘ఏమో వస్తుంటే, పోతుంటే దారిలో ఏమన్నా చేస్తే… గుజరాత్ లో వందల మందిని ఒక్కసారే చంపలేదా?” అని రెట్టిస్తుంది తన భయానికి ఖచ్చితమైన ఆధారాలున్నట్లుగా కళ్లతో నిగ్గ దీసి చూస్తూ.

అమ్మీ ఆలోచనల నుంచి బయటపడ్డాను. ఒంటిగంట కావడానికో పది నిమిషాలుంది. శుక్రవారపు జుహర్ నమాజ్ టైమైంది. టేబుల్ డ్రాయర్ తెరిచి జనామాజ్ (నేలమీద పరుచుకొని ప్రార్థన చేసే పవిత్ర వస్త్రం) తీసాను. పక్కనే పెళ్ళికేస్కోవాలనుకుని తెచ్చుకొన్న పట్టు కుర్తా పైజామా ఉంది. తల పైకి టకియా (టోపీ) తీస్కున్నా… మళ్ళా అమ్మ గుర్తొచ్చింది. తల పైకి టకియా కూడా వేస్కొవద్దంటుంది… అబ్బాజాన్ ‘అరె అప్నా పెహ్చాన్ కుచ్ బీ బనీ హైనా…. (మన అస్తిత్వం , గుర్తింపు ఏవీ ఒద్దా… ఉండాలి కదా?) అంటాడు కోపంగా… ‘నైఁ జాన్ సే రహ్నా జిందా రహ్నే కీ కోషిషోఁ మేఁ రహ్నా) హీ అప్నీ పెహ్చాన్ బనగయీ అబ్. ఏ అబ్ పురానా భారత్ నహీ రహా… భూల్ జావ్ కి హమ్ ముసల్మాన్ హై” అంటుంది ఆవేశంగా. పైగా అయోధ్య తీర్పు త్వరలో ఇంకో ఐదారు రోజుల్లో వస్తుంది. అమ్మీలో రోజు రోజుకీ ఆందోళన పెరిగి పోవడానికి ఇదీ ఒక కారణమే… (లేదు ప్రాణంతో ఉండడం, ప్రతీ క్షణం ప్రాణం రక్షించుకునే ప్రయత్నాల్లో ఉండడమే ఇప్పటి మన అస్తిత్వంగా మారిపోయింది. ఇది పాత భారతదేశం అనుకున్నావా? కాదు. అసలు మనం ముసల్మాన్లమన్న సంగతి మర్చిపోండి.)

అంతేకాదు… నమాజ్ టకియా, నావీ, అబ్బాజాన్ వీ కుర్తా పైజామాలు ఎక్కడో దాచి పెట్టేస్తుంది. కానీ శుక్రవారపు జుహర్ ప్రార్థనలకు మాత్రం నేనూ, అబ్బా, జనమాజ్, టకియాలు కొనుక్కొని ఆఫీసులో దాచుకున్నాం. చిన్నప్పట్నించీ దాదా నాకు జుహర్ నమాజు మర్చిపోకుండా చేయించేవాడు. అది అలా అలవాటైంది నాకూ… అబ్బాజాన్ కీ. ఆఫీసులో కొలీగ్స్ సోహైల్, అఖిబ్, ఇమ్రాన్, అలీ అంతా కల్సి జుహర్ ప్రార్థనలకు బయలుదేరాం. దార్లో స్టీల్ ఫాబ్రికేషన్స్ షాప్ లో పని చేసే అమీర్ ఖాన్ కలిసాడు. అంతా కలిసి సలామ్ వాలేకోమ్ లు చెప్పుకుంటూ ‘గలెమిలో భాయిజాన్’ అన్కుంటూ, ఆలింగనాలు చేస్కుంటూ ‘కలల రాజ్యం’ అనే థీమ్ పార్క్ కు చేరుకున్నాం. గత రెండేళ్ళుగా ఇక్కడే జుహర్ నమాజ్ చేస్తున్నాం. వంద దాకా ముస్లిములము చేరాం అక్కడికి. వాళ్ళంతా ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీసు టవర్స్ లో కంస్ట్రక్షన్స్ సైట్స్ తో పని చేసేవాళ్ళు, రోజూ కూలీలు, ఆటో డ్రైవర్లు, పండ్ల, కూరగాయల వ్యాపారులు, దుకాణాదారులు, సేల్స్ మేనేజర్లు.

అందరం కల్సి చుట్టుపక్కల చెట్ల కింద ఉన్న నీళ్ళతో ‘వుదూ’ చేస్కుని టెంట్ లోనికి చేరుకున్నారు. జనమాలు పరుచుకుని, కూర్చొని పవిత్రమైన శుక్రవారపు మధ్యాహ్నపు జుహర్ నమాజు మొదలు పెట్టాం. ఇంతలో అక్కడికి కాషాయ జెండాలు వేస్కుని అరుచుకుంటూ ఒక మూక వచ్చింది. ‘జై శ్రీరాం… జయహెూ శ్రీరాం’ అని అరుస్తూ… ‘వెళ్ళిపోండి ఇక్కడ్నించి’ అంటూ మా మధ్యలోకి మట్టికాళ్ళతో వచ్చేసారు… మా పవిత్రమైన జనామాలు కాలితో తన్నారు. మా నెత్తిమీద నుంచి టకియాలు తీసేసి దూరంగా విసిరేసారు. మమ్మల్ని కావాలని చేతులతో నెట్టేస్తూ కింద పడేలా చేసారు. నా నుదుటికి తగిలిన దెబ్బ నించి రక్తం కారుతుంటే… చేత్తో నొక్కిపట్టాను. భయంతో అంతా చెల్లా చెదురు అయిపోయాం. అవమానాన్ని దుఃఖాన్ని మోస్కుంటూ ఆఫీసుకు ఎవరి పనులకు వాళ్ళం బయలుదేరాం. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇన్ని వందల మందికి అవసరమున్న ఒక్క మస్జిద్ లేదు. ప్రభుత్వం కట్టించదు కూడా. ఉన్న ఈ ఒక్క కలల రాజ్యం పార్కు కూడా చేజారుతుందా? గాయం సలుపుతున్నది. మనసు వికలమైంది. సాయంత్రం నిఖా? నేను ప్యాంట్, షర్ట్ లోనే వెళ్ళాను. డ్రాయర్ లోని కుర్తా పైజామాను చూస్తే తళా తళా మెరుస్తున్న పాముల జతలా కన్పించి భయం వేసింది. విరక్తి కలిగింది ఆసక్తి లేకుండానే బయలుదేరాను. నిఖా, విందులో మటన్ కబాబ్లు, మటన్ బిర్యానీలు గొంతు దిగలేదు. ముద్ద ముద్దలో మటన్ అమ్మినందుకు ప్రాణాలు కోల్పోయిన నా రఫిక్ మామూ, చెహరా కన్పిస్తుంటే… అవి పడేసి ఇంత షేర్ కుర్మా తిని ఇంటికి బయలుదేరాను.

***

ఇంతలో అమ్మీ ఫోను ‘క్యాఁహువా ఆయాన్’ అంటూ ఆందోళనగా దుఃఖపు గీర గొంతులో… ‘కుచ్ భీ నై హువా అమ్మీ బే ఫికర్ రహెూ ఆప్. మైఁ అబ్బీ ఘర్ పహుఁచ్ రహాఁ హు….’ (ఏం కాలేదు అమ్మ నువు భయపడకు… కొద్ది సేపట్లోనే ఇంటికొస్తాగా) అన్నా… టీవీలో చూసేసినట్లుంది వార్త.

ఇంటికొచ్చిన నా మీద విరుచుకుపడింది అమ్మీ… నుదుటి గాయం చూసి అల్లల్లాడింది. ‘దఫ్తర్ లో ఉన్న చోటనే జుహర్ నమాజు చేస్కుంటే తప్పేం లేదు ఆయాన్’… అంటూ తలకొట్టుకుంటూ ఏడ్చింది. అమ్మ దుఃఖానికి నాకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బహుశా మధ్యాహ్నం నుంచీ దాచుకున్న దుఃఖపు మేఘం కరిగినట్లుంది. మరోపక్క టీవీలో అయోధ్య తీర్పు ఇంకా నాలుగు రోజుల్లో వస్తున్న సందర్భంగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్టులు చేస్తామని… కేంద్రం బెదిరిస్తున్నది.

***

అయోధ్య తీర్పు వచ్చింది. ఎక్కడికక్కడే పోలీసు మోహరింపుతో నగరం నిండి పోయింది. సంఘ్ వాదీ మూకలు కాషాయి జండాలతో బైకులమీద ఊరేగుతూ, గావుకేకలు పెడ్తున్నారు. మనసు దిగులుతో ఆందోళనతో నిండిపోయింది. మరుసటి శుక్రవారపు నమాజుకు పోలీస్ బందోబస్తు మధ్య మాకు ఒక రోడ్డు పక్క ఖాళీ స్థలం ఏర్పాటైంది. జంబుఖానా లేదు, టెంట్ లేదు. ఈ అశుభ్రమైన నేలమీద పవిత్రమైన నమాజ్ చేస్కోవాలా? ఎండ భగ్గుమంటుంది. చుట్టూ చెత్తా చెదారం… కుప్ప తొట్లలో వీళ్ళు పవిత్రంగా చూస్కునే ఆవులు మేస్తున్నాయి. పందులు మానవ మలం తింటున్నాయి. కుక్కలు విస్తరాకుల్లో మెతుకులు తింటున్నాయి. ఈగలు, మురికి నీరు దుర్గంధం.

‘ఇంత అశుభ్రమైన స్థలంలో నమాజు చేస్కోవాలా… చాలా అన్యాయం… ఆయాన్ భాయ్’ సోహైల్ ఆగ్రహాన్ని అణుచుకుంటూ అన్నాడు. పందుల వైపు చూస్తూ కళ్ళు చేతులలో మూస్కున్నాడు ‘యా అల్లాహ్’ అనుకుంటూ సోహైల్. ఈ లోపల అక్కడికీ సంఘ్ వాదీలు మళ్ళీ వచ్చారు. అవే కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాలలు, నుదుటపై కాషాయరంగు బూట్లు… చేతుల్లో కాషాయ జెండాలతో ఎప్పటిలాగే జై శ్రీరాం నినాదాలతో… కొంత మంది బైక్ ల మీద వచ్చారు. వాళ్ళు ఎగరేసి పట్టుకున్న జెండాలపై శ్రీరాముడు, హనుమంతుడి బొమ్మలు, హిందూసేనా అని రాసి ఉన్నాయి. అయోధ్య తీర్పు ఇచ్చిన గెలుపు… అహం, వాళ్ళ మొఖాలలో మునపటి కంటే ఎక్కువగా, ఏదో పైశాచికానందాన్ని నింపింది.

“20 నిమిషాలు చేస్తారు వీళ్ళు నమాజు… అంతసేపూ రోడ్లు బ్లాక్ అవ్వాలా… చేస్కోవద్దన్నామా కానీ త్వరగా ముగించాలి. చేస్కోమన్నామని రోడ్లు, పార్కులు, దేశమంతా నిండిపోతారా. వాళ్ళు రావచ్చు… ఉండచ్చు. కానీ ఇది మా భూమి. ఆక్రమించుకొంటే ఊర్కోం… నడవండి నడవండి” అంటూ మీద మీద కొస్తున్న వాళ్ళని పోలీసులు అడ్డుతున్నారు. ఆ పోలీస్ పహారా మధ్య వాళ్ళ జై శ్రీరాం అరుపుల మధ్య… మా జుహర్ నమాజ్ వికలమైన మనసులతో… ఆందోళన, భయాలతో ముగించాం… “మస్జిద్ లో సురక్షితంగా అల్లాహ్ మీద ధ్యాసలో చేస్కోవల్సిన నమాజు దిక్కులేక రోడ్ల పక్కన కుప్ప తొట్టి పక్కన చేస్కుంటుంటే… కూడా ఇంత దౌర్జన్యమా ఈ దేశం మనది కూడా కాదా?” ఆఖబ్ కోపంగా అంటున్నాడు. ‘ష్… ఈ రోజు వచ్చిన అయోధ్య తీర్పు మర్చిపోకు. రహస్యంగా అంటున్నాడు ఇమ్రాన్. అవును అమ్మ చెప్పిందే. నిలబడ్డానికి కాళ్ళకింద ఇంత జాగా లేదు తమకి. ఏ హెహచాన్ లేదు తమకి… ప్రాణాలతో ఉంటున్నందుకు సంతోషిస్తూ, అనుక్షణం ప్రాణాలు కాపాడుకోడానికి ప్రయత్నిస్తూ ఉండడమే తమ అస్తిత్వం…

***

ఆ రోజు రాత్రి అమ్మకి నేను ఆఫీసులో ఉంచుకునే జనమాజ్, టకియా ఇచ్చేసాను. అమ్మ సంతోషంగా ఆశ్చర్యంగా చూసింది. ‘ఆజ్ భీ… దఫ్తర్కో సంఘ్ వాదీ ఆయేఁ క్యాం?” అంది భయంగా (ఈ రోజు కూడా సంఘ్ వాళ్ళొచ్చారా) నేను మౌనంగా నా గదిలోకి వెళ్ళిపోయాను. కిటికీలోంచి ఆకాశంలో అర్ధచంద్రాకారంలో చందమామ… నక్షత్రాలూ కన్పించాయి. అవును… ఇంకా నాకు జనమాజ్, టకియా… అవసరం లేదు. నా దేశంలో ఇన్ని భయాల మధ్య…

మానవ మలం… దుర్గంధాలు… కుక్కలు… పందులూ… ఆకలితో బక్కచిక్కిన ఆవులూ, ఈగలు నిండి ఉండే కుప్పతొట్ల పక్కనే నేను నమాజు చేయలేను. అమ్మీ… నిజమే, నువ్వన్నదే నిజం. ఇది మునపటి భారత దేశం కాదు…

ఆ రాత్రి నిద్రే పట్టలేదు నాకు.

***

మరునాడు పొద్దున్న నిద్రలేచాను. హాల్లో అమ్మీ జనమాజ్ వేస్కొని ఫజర్ నమాజ్ చేస్తోంది ‘యా అల్లా స్వేచ్ఛగా నమాజు చేస్కోడానికి కాసింత జాగా లేదా మస్జిద్ ఇవ్వు చాలు’ అంటూ…

నమాజు అయినాక కళ్ళు తెరిచిన అమ్మీ కళ్ళల్లో ఏదో తెలీని భయం కనిపించింది…

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply