యుగ యుగాల మహిళల ఆత్మ ఘోష…”కర్మభూమిలో పూసిన ఓ పువ్వా”

ఊహలు సైతం నిషేధానికి గురవుతున్న సమయాన ఉరితాళ్ళకి స్వప్నాల్ని కనడం నేర్పించిన ఉద్వేగభరిత ఉద్యమగీతం కలేకూరి ప్రసాద్. ఉద్యమ సాహిత్యం అరిగిపోయిన పదాలతో భావోద్వేగాల్ని కోల్పోయినప్పుడు కవిత్వభాషకు కొత్త ఊపిరులను ఊది పాటకు జీవం పోసిన ప్రత్యామ్నాయ పోరాటస్వరం కలేకూరి. 1962 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించిన ఈ కవి దారులన్నీ ఉత్తేజభరితం. ఉపాధ్యాయ తల్లిదండ్రులైన లలితా శ్రీనివాసరావుల ఒడినుండి ఉద్యమాలకు బడిగా ఎదిగాడు. కళాశాల చదువుకన్నా దళిత ప్రజల సంక్షుభిత సామాజిక వేదనాశాస్త్రాలన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంతర్జాతీయస్థాయిలో డర్బన్ వేదికగా దళిత ఉద్యమ విస్తృతికి నిలువెత్తు అస్తిత్వపతాకమై రెపరెపలాడాడు. ప్రజాఉద్యమాలకు పాటను వడిశెలరాయిగా చేసి ప్రతిఘటించాడు. యువక, శబరి, సంఘమిత్ర, నవత, కవన అనే కలం పేర్లతో అగ్నిశ్వాసల్లాంటి రచనల్ని సృష్టించాడు. “కుమిలిపోయినా/ నలిగిపోయినా/ చుండూరు గుండెల గాయం దళితా” అన్నా “తెగిపడ్డ నింగిచుక్కలం/ చెత్తకుండికాడి కుక్కలం” అని బాలకార్మికుల బతుకుపై చలించిపోయినా “బతుకే ఒక అంటరాని ఆశల ఆకాశమై/ కలల కడలిలో కదిలిపోయిన ఓ మేఖల” అని విలపిస్తూనే తన పాటల ద్వారా కొండంత విశ్వాసాన్ని, చైతన్యాన్ని అందించాడు కలేకూరి ప్రసాద్. ఒక కవి పేరు చెప్పగానే అతను రాసిన అనేక వాక్యాలు మనల్ని ముసురుకోవాలి. ముట్టడించాలి. కలేకూరి ప్రసాద్ పాటలు అనగానే, అందులోనూ మహిళల గురించి అనగానే తెలుగు ప్రాంతాల నలుదిశలా ప్రతిధ్వనించిన “కర్మభూమిలో పూసిన ఓ పువ్వా” అనే పాట గుర్తుకువస్తుంది. ఆ పాటలోని దుఃఖాన్ని కొద్దిగా అద్దుకుందాం.

“కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కట్నపు జ్వాలలో సమిధై పోయావా!” !!కర్మభూమిలో!!

ఇదొక ఆరని చితిమంటలాంటి వేదనాభరిత నేపథ్యమున్న గీతం. తరతరాలుగా, యుగయుగాలుగా స్త్రీజాతి గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖానికి ప్రతీక ఈ పాట. ‘ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారనే’ అరిగిపోయిన అతిశయోక్తి అలంకారాలతో వంచించబడిన కర్మభూమిలోని మహిళలని ఉద్దేశిస్తూ సాగిన ఈ పాట మనసున్న వారినందరిని కన్నీరుపెట్టిస్తుంది. లోతైన ఆలోచనలకు గురిజేస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాంతానికి చెందిన ఇందిర అనే నవవధువు అత్తగారింట్లో వరకట్నపు వేధింపులతో హత్యకు గురైన దుర్ఘటన ఈ పాట పుట్టుకకు కారణం. నిశ్శబ్దంగా నాలుగుగోడల మధ్య స్త్రీలపై జరుగుతున్న పలురకాల వేధింపులు, గృహహింసలపై ఆగ్రహావేదనలతో పాడిన నిరసనగీతం ఇది. అప్పుడే పూసిన పూవులాంటి సుకుమారపు స్త్రీ, కన్నులనిండా కోటి ఆశలు నింపుకుని చిరునవ్వుతో వెలిగిపోతూ మధురమైన కలలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్ళికూతురు కట్నపుజ్వాలలో తగలబడిపోయిన మరణయాతనను వర్ణిస్తుంది ఈ పాట.

“పారాణింకా ఆరనె లేదు
తోరణాల కళ వాడనె లేదు
పెండ్లి పందిరీ తీయనె లేదు
బంధువులిండ్లకు చేరనె లేదు
మంగళనాదాలాగనె లేదు
అప్పగింతలు అవ్వనె లేదు
గలగల పారే ఓ సెలయేరా
పెళ్లికూతురుగ ముస్తాబయ్యి
శ్మశానానికే కాపురమెళ్ళావా…” !!కర్మభూమిలో!!

మన దేశంలో పెళ్ళిళ్ళు జరగడం భారీ వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. దానికితోడు సంప్రదాయ పద్ధతులు, ఆచారాలు, నిబంధనలు లెక్కలేనన్ని. ఇవన్నీ కలిసి ఒక జంటను అన్యోన్యంగా కలిసి జీవనం కొనసాగించడానికే. వాటిని పవిత్రంగా, నియమబద్దంగా నిర్వహిస్తాం. కవి ఆ వివాహక్రమంలోని విషయాలన్నింటిని వివరిస్తూ ఒక విషాదఫలితాన్ని, ప్రయాణాన్ని విభ్రాంతికలిగేటట్లుగా వివరిస్తాడు. పారాణి, తోరణాలు, పెండ్లిపందిరి, మంగళనాదాలు, అప్పగింతలు అనే మాటలు పెళ్ళివాతావరణాన్ని మరోసారి కళ్ళముందు ప్రత్యక్షం చేస్తూ గుండె బరువెక్కిస్తుంది. వర్ణనలతో సౌందర్యాన్నే కాదు మనుషుల పైశాచికత్వాన్ని కసిగా గుర్తుచేస్తాడు.

“మానవత్వమే మంటగలిసెనా
మమతలకర్థం లేకపోయెనా
వేదఘోష ఎగతాళి చేసెనా
ప్రమాణాలు పరిహాసమాడెనా
ప్రేమబంధముగ కట్టిన తాళి
ఉరితాడయ్యి కాటు వేసెనా
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
కారు మేఘములు కమ్మేశాయా
చీకటిచితిలో శవానివైనావా….!” !!కర్మభూమిలో!!

మహిళలపై జరుగుతున్న అణిచివేతలు, అత్యాచారాలకు ప్రధాన కారణం మగవాళ్ళ ఆధిపత్య అహంకారమే. మనువాద సిద్ధాంతాల ప్రభావం అణువణువునా జీర్ణించుకున్న సమాజం మహిళలపట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది. వేదపఠనాలకు, పవిత్రమని భావించే మంత్రాలకు వాళ్ళే విలువివ్వడం లేదు. సంప్రదాయం పేరుతో సంప్రదాయాలను పరిహాసం చేస్తున్నదీ వాళ్ళే. ముడివేసిన మూడుముళ్ళు మనసును ముడివేసే బంధంగాకాక ఉరితాడుగా మారడం ఎంత ఘోరం. అందుకే పున్నమివెన్నెల్ని వెదజల్లే నిండుజాబిల్లిలాంటి చెల్లి ఇందిర దుర్మరణం కవిని కలిచివేసింది. ఒక్కసారిగా అమ్మాయి జీవితంలో పట్టపగలే చీకట్లు అలముకున్నాయి. నల్లటి విషాదమేఘాలు మనసును కమ్ముకున్నాయి. చీకటిచితిలో కనిపెంచినవారి జ్ఞాపకాలు తగలబడిపోయాయి అని కవి కన్నీటివానై కురిసాడు.

“….
కళకళలాడిన ఓ నవవధువా
శిశిరం నిన్ను కబళించిందా
మలమల మాడిన బొగ్గయిపోయావా….!”

కలేకూరి ప్రసాద్ ఈ పాటలో స్త్రీలపై ప్రజ్వరిల్లుతున్న కుటుంబహిసనే గాకుండా “రాక్షసవిలువలు రాజ్యమేలుతున్న నరకప్రాయపు” సమాజాన్ని ఘాటుగా విమర్శించాడు. మనిషికి మనిషికి మధ్య నెలకొన్న బంధాలను ఉద్దేశిస్తూ “మార్కెట్‌లో సరుకులాయెనే” అని వ్యాపారమయమైన మానవవిలువలు ఒక వస్తువుగా మారాయని వాపోయాడు. పెళ్ళయి కొత్తగా తమ ఇంట్లో అడుగుపెట్టిన కోడలును కూతురిగా చూసుకోవాల్సిన అత్త, సోదరిగా ఆదరించవలసిన ఆడపడుచులు అమానుషంగా ప్రవర్తించడాన్ని కవి ఖండిస్తున్నాడు. అత్త కళ్ళలోని అగ్నిజ్వాలలకు పచ్చనిచెట్టులా ఎదగాల్సిన జీవితం ఆశల ఆకుల్ని రాల్చుకుని మోడయిపోయింది. ఆఖరికి తగలబడిపోయి బొగ్గయిపోయింది అనే భయంకర దృశ్యాన్ని కవి కన్నీళ్ళతో వాస్తవచిత్రాన్ని కళ్ళముందు నిలుపుతాడు.

“పిశాచగణాల ఆనందానికి
మారణ హోమం జరుగుతున్నది
లేళ్ళను చంపే పులుల సీమలో
కోకిల మేధం సాగుతున్నది
జీవనరాగం ఆర్తనాదమాయే”

ఎందరో సంస్కర్తలు ఈ నేలలో స్త్రీల అభ్యున్నతి కోసం అనేక విధాల కృషి చేశారు. అయినా మహిళల బ్రతుకుల్లో మార్పు రాకుండా ఉండటం సిగ్గుపడాల్సిన విషయం. ఎన్ని సాంస్కృతిక పునరుజ్జీవనాలు ఉద్యమస్థాయిలో జరిగినా స్త్రీల మాన, ప్రాణాలకు కనీస రక్షణలేని దుష్టలోకంగా మారిపోయింది. ఆడదిగా పుట్టడంకన్నా అడవిలో మానుగా పుట్టినా విలువుండేదన్న మాట మరింత నిజమని నిరూపిస్తున్న కాలాన్ని తలుస్తున్నాడు కవి. స్త్రీకి స్త్రీయే శత్రువనే మాట అత్త, ఆడపడుచుల ద్వారా స్థిరపడిపోయే దుస్థితిని ఎత్తిచూపుతాడు కవి. అమాయక ప్రజల ప్రాణాలతో ఆటలాడుకునే ఫ్యాక్షన్‌సీమలో నరమేధంలాగా స్త్రీలమీద హత్యాకాండ సాగుతున్నదంటాడు. కుటుంబమనే పచ్చని చెట్ల కొమ్మలమీద కూర్చుని తీయని జీవన అనుభూతిరాగాలు తీయవలసిన కోయిలలాంటి స్త్రీలు భయంతో ఆర్తనాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తాడు కవి.

“అక్కల్లార చెల్లెల్లారా
వ్యవస్థ మలచిన అబలల్లార
కాలే గుండెల కమురు వాసనకు
కన్నులు ఏరులు పారుతున్నవా
దారి పొడవునా శవాల గుట్టలు
గుండెను గాయం కెలుకుతున్నయా
రాక్షస పీడన నెదిరించాలె
స్త్రీలు పురుషులు మనుషులందరరూ
సమానమన్న సమాజ ముండాలి”

1987లో రాసిన ఈ పాటలోని సన్నటి దుఃఖం నేడు మహాసంద్రంగా మారిపోయింది. ఆనాడు డబ్బుల ఆశతో తమ పసిప్రాయపు కూతుళ్ళను వృద్ధులకిచ్చి పెళ్ళిచేసే కన్యాశుల్క సంప్రదాయం ఎందరో ‘పూర్ణమ్మ’లను బలితీసుకుంది. తమ గారాల కూతురు భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా సరే సమస్తం అమ్ముకుని వరకట్నం ఇచ్చే పరిస్థితికి మనస్థాపంతో ప్రాణత్యాగం చేసుకున్న రాయప్రోలు ‘స్నేహలతాదేవి’ వంటివాళ్ళు ఎందరో. నేడు పరిస్థితి మరింత క్రూరంగా మారింది. ప్రేమగా ఇచ్చిన కట్నంతో సరిపెట్టుకోకుండా మరింత దురాశతో, దోపిడీదొంగల్లా దోచుకుందామనే అత్తవారిళ్ళ అత్యాశకు అమ్మాయిల బతుకులు కాలి బూడిదవుతున్నాయి. కవి అలాంటి అభాగ్యుల తరపున అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా మారిపోయి అర్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్నాడు. పాటను విన్నవాళ్ళ కళ్ళల్లోంచి ఏరులు పారుతాయి. ఎక్కడో కాలిపోతున్న గుండెల కమురువాసనను ఈ పాట మోసుకొస్తుంది. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ పాట ఒక పతాకగీతమై మారుమ్రోగింది.

ఈ పాట పుట్టి మూడు దశాబ్దాలైనా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం దారుణం. మానవాళి సిగ్గుపడాల్సిన విషయం. మరింతగా మహిళల మీద అత్యంత పాశవికంగా యాసిడ్ దాడులు, అత్యాచారాలు, హత్యలు జరగడం మనసున్నవారిని నిశ్చేష్టులను, నిర్వీర్యులను చేస్తుంది. ‘నిర్భయ’, ‘దిశ’ ఘోర ఉదంతాలు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈరోజు కలేకూరి ప్రసాద్ జీవించివుంటే ఎంత తీవ్రంగా ప్రతిస్పందించేవాడో ఊహించలేం. ‘రాక్షసపీడన నెదిరించాలె’ అనే ధిక్కారస్వర దిశానిర్దేశాన్ని ఈ తరం అనుసరించాలి. ‘స్త్రీలు, పురుషులు మనుషులందరూ/సమానమన్న సమాజముండాలీ’ అని కోరుకున్న కలేకూరి ఆశయాన్ని బ్రతికించాలి. కర్మభూమిలో పూసిన ఈ పాటలోని దుఃఖం మనుషుల్లోని మృగత్వాన్ని నాశనం చేయగలిగితే మహిళల జీవనం ఆర్ద్రరాగమై పరవశిస్తుంది.

కర్మ భూమిలో పూసిన (పూర్తి పాట)
(కలేకూరి ప్రసాద్)

కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కట్నపు జ్వాలలో సమిధై పోయావా ! !! కర్మభూమిలో!!

పారాణింకా ఆరనె లేదు
తోరణాల కళ వాడనె లేదు
పెండ్లిపందిరీ తీయనె లేదు
బంధువులిండ్లకు చేరనె లేదు
మంగళనాదాలాగనె లేదు
అప్పగింతలు అవ్వనె లేదు
గల గల పారే ఓ సెలయేరా
పెళ్లికూతురుగ ముస్తాబయ్యి
శ్మశానానికే కాపురమెళ్ళావా… !! కర్మభూమిలో!!

మానవత్వమే మంటగలిసెనా
మమతలకర్థం లేకపోయెనా
వేదఘోష ఎగతాళి చేసెనా
ప్రమాణాలు పరిహాసమాడెనా
ప్రేమబంధముగ కట్టిన తాళి
ఉరితాడయ్యి కాటు వేసెనా
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
కారు మేఘములు కమ్మేశాయా
చీకటి చితిలో శవానివైనావా….! !! కర్మభూమిలో!!

రాక్షస విలువలు రాజ్యమేలెడి
నరకప్రాయపు సంఘంలోన
మనిషికి మనిషికి బంధాలన్నీ
మార్కెట్లోన సరుకులాయెనే
అడపడచులే శత్రువులైరా
అత్త కన్నులె నిప్పులు చెరిగెనా
కళకళాలాడిన ఓ నవ వధువా
శిశిరం నిన్ను కబళించిందా
మలమల మాడిన బొగ్గయిపోయావా….! !! కర్మభూమిలో!!

ఆడది కన్నా అడవి మానుకె
విలువిచ్చేటి దేశంలోన
ఆరడి పెట్టిన ఆడపడచుకూ
అత్తారింట తప్పని స్థితి యిది
బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు
గర్భశోకమూ తప్పకున్నది
పిశాచగణాల ఆనందానికి
మారణహోమం జరుగుతున్నది
లేళ్ళను చంపే పులుల సీమలో
కోకిల మేధం సాగుతున్నది
జీవనరాగం ఆర్తనాదమాయే !! కర్మభూమిలో!!

అక్కల్లార చెల్లెల్లారా
వ్యవస్థ మలచిన అబలల్లార
కాలే గుండెల కమురు వాసనకు
కన్నులు ఏరులు పారుతున్నవా
దారి పొడవునా శవాల గుట్టలు
గుండెను గాయం కెలుకుతున్నయా
రాక్షస పీడన నెదిరించాలె
స్త్రీలు పురుషులు మనుషులందరరూ
సమానమన్న సమాజ ముండాలి… !! కర్మభూమిలో!!

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

2 thoughts on “యుగ యుగాల మహిళల ఆత్మ ఘోష…”కర్మభూమిలో పూసిన ఓ పువ్వా”

  1. రఘు గారి వ్యాసం వర్తమాన సమాజాన్ని చిత్రికపట్టింది.హత్రాస్ ఘటననేపథ్యంలో వ్యాసానికి ప్రాసంగికతఉంది.కలెకురికవిత్వం దివిటిలాంటిది.అది రఘు గారి చేతిలో కాగడఅయింది.
    b.v.n.swamy

  2. స్త్రీ కి జరిగిన అన్యాయాన్ని కలెకూరి గారు….మనసు కదిలే లా రాస్తే. … గురువుగారు…రఘు సార్…గుండెలు అవిసెలా….టెలియపృచారు….
    మీ సాహిత్య పరిశీలన…అమోఘం…ఆదర్శనీయం సర్….నా చిన్నప్పుడు విన్న పాటను తెలియపరిచి ఏడిపించారు….👏

Leave a Reply