కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం

దేశంలో కొవిడ్‍ వైరస్‍ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దవాఖానాలు పుల్‍, స్మశానాలు పుల్‍, ఊపిరాడటం లేదు. నేడు కరోనా గాఢ పరిష్వంగంలో ఎప్పుడు ఎవరు వాలిపోతారో, ఎక్కడ ఎవరు రాలిపోతారో తెలియని హృదయ విధారకరమైన పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులు దేశం ముందెన్నడు చూడని భయానక పరిస్థితిని చూస్తున్నది. పాజిటివ్‍ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ దశలో ఈ వైరస్‍ని నియంత్రించకపోతే కల్లోల పరిస్థితులు తప్పవని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేవీ పనికి రాకుండా పోయాయి. రెండో ఉధృతిని అంచనా వేయలేకపోయాయి. భయానక పరిస్థితులు తలెత్తకుండా చూడలేకపోయాయి. పైగా కుంభమేళాలకు, ఎన్నికల రాజకీయాల ప్రదర్శనకు మాత్రం వెనుకాడటం లేదు. ఆక్సిజన్‍ కొరతలు, వాక్సిన్‍ కొరతల విషయంలో ఒకరిపై ఒకరు నిందలతో సరిపెట్టుకుంటున్నారు. కరోనా కట్టడిలో ఉమ్మడి నిర్ణయాలు, ఉమ్మడి చర్యలు లేవు. మన దేశంలో ప్రజారోగ్యం కోసం నిధులు మొదటి నుంచి తక్కువే. గత ఏడాది కరోనా పరిణామాల అనుభవం దృష్ట్యా కూడా ఈసారి ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. వైద్య ఆరోగ్య రంగాలకు నిధుల కేటాయింపు అంతంత• మాత్రంగానే ఉన్నప్పుడు ప్రజారోగ్యం మెరుగుపడేది ఎలా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

కొవిడ్‍ బారినపడటంలో భారత దేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నా కొవిడ్‍ మరణాల్లో కూడా పెద్ద స్థానంలోనే ఉన్నాం. మహారాష్ట్ర, చత్తీస్‍గఢ్‍, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‍, కేరళలతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ బెంబేలెత్తిస్తోంది. ఆసుపత్రులలో శవాల కుప్పలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కరోనా బారినపడిన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు తెలిసి కూడా ఈ సమయానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం దారుణం. 7,8 నెలల వ్యవధి చిక్కినా వైద్య రంగ సదుపాయాలు మెరుగుపరుచుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కనీసం ఆక్సిజన్‍ ఉత్పత్తిని, దాని స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో శ్రద్ధ పెట్టలేదు. ఆసుపత్రులు పెంచుకోవడం ఎంత ముఖ్యమో వాటికి అందుబాటులో ఆక్సిజన్‍ ఉండేలా చూడడం అంతే ప్రాధాన్యత గల అంశం. ఈ రెండింటిలో వైఫల్యం చెందడం అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపుగా 14 కోట్ల 63 లక్షల మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అందులో 12 కోట్ల 41 లక్షల 31 వేల 699 మంది రికవరీ అయ్యారు. ప్రపంచంలో దాదాపుగా 31 లక్షల 15వేల మంది వరకు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. దేశంలో ఏప్రిల్‍ 27 నాటి వరకు కోటీ 66 లక్షల 10 వేల 481 మందికి కరోనా పాజిటివ్‍ వచ్చింది. కోటీ 38 లక్షల 67వేల 997 మంది రికవరీ అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా మరణించారు. 25 లక్షల 52వేల 940 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 3,87,106 మందికి కరోనా సోకగా, అందులో 3 లక్షల 26వేల 997 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1921 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ రేటు 86.16 శాతం ఉంటే, మరణాల రేటు 0.51 శాతం ఉంది. దేశంలో రికవరీ రేటు 83.5 శాతం ఉంటే, మరణాల రేటు 1.1 శాతం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రోజుకు కరోనా పరీక్షల సంఖ్య లక్ష దాటుతుండగా, వ్యాక్సినేషన్‍ కూడా రోజుకు లక్ష డోసులు దాటుతున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా టీకాల నిల్వలు కొరత ఏర్పడుతోంది. టీకాల కొరత కారణంగా ఒక రోజు కరోనా వ్యాక్సినేషన్‍ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‍ చేశారు. టీకాల కొరత సమస్య ఒకవైపు సాగుతుండగా, ఆక్సిజన్‍ కొరత పెద్దసమస్యగా మారింది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‍ కొరత కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్‍ నిల్వల కోసం ఉక్క కర్మాగారాలు, చమురు రిఫైనరీల్ని ఆశ్రయిస్తున్న కేంద్రం, రెమ్‍డిసివర్‍ లాంటి మందులు అర్థాంతరంగా బ్లాక్‍లోకి వెళ్లాయి.

ప్రపంచ దేశాల్లో ఒకవైపు వాక్సినేషన్‍ జరుగుతున్నా కరోనా విలయం కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా నమోదు కేసుల్లో భారత్‍ రెండో స్థానం నుంచి కిందకు దిగడం లేదు. రెండో దశలో కొత్త కేసులు పైపైకి ఎగబాగుతున్నాయి. దేశంలో ఏప్రిల్‍ 25న 24 గంటల్లోనే 3,46,786 మందికి కరోనా సోకింది. మరో 2,624 మంది కరోనా తీవ్రతకు బలయ్యారు. వరుసగా మూడో రోజు భారత దేశంలో 3 లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి. దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు పురుడు పోసుకున్నాక ప్రపంచంలో ఏ రోజూ ఏ దేశంలోనూ ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. విపత్తు ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే, ప్రాణవాయువుకోసం హాహాకారాలను, పడకలకోసం పడిగాపులనూ, బాధితుల అఖరి చూపుకోసం బంధువుల ఆర్తనాదాలనూ మనం వింటున్నాం, చూస్తున్నాం. చావు వాకిట్లోకొచ్చి తలుపు తడుతుంటే జనం భయంతో వణికిపోతున్నారు.

ఇప్పటి వరకు దేశంలో 13 కోట్ల 86 లక్షల 79 వేలకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. ఉత్తరప్రదేశ్‍ను వదలడం లేదు, ఢిల్లీలో పరిస్థితి ఆగమ్యగోచరం. ప్రధాని సిఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‍ ఆక్సిజన్‍ సరఫరా విషయంలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం, మాస్క్లు సరిగ్గా వాడకపోవడం వల్లనే దేశంలో ఇటీవల కరోనా పాజిటివ్‍ కేసుల సంఖ్య బాగా పెరిగింది. మహమ్మారి కబంధ హస్తాల నుంచి పూర్తిగా బయటపడటానికి ఇంకా నిఘా, జాగ్రత్తలు, నియంత్రణలు అవసరం అని వీడియో సమావేశంలో వ్యక్తమయింది. వ్యాక్సినేషన్‍ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కరోనా నుంచి ప్రాణహాని లేకుండా అందరూ సురక్షితమయ్యేంత వరకు ఏ ఒక్కరూ నిబ్బరంగా ఉండే వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే చెబుతూనే ఉంది. మరికొన్నాళ పాటు కనీస జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకతను తెలియజెబుతూ, టీకాలపై ప్రజానీకంలో భయాలు అపోహలు అనుమానాల నివృత్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు వేగవంతం చేయాలి.

‘ఒకే దేశం-ఒకే పన్ను – ఒకే భాష- ఒకే మతం…’ ఇలా చెప్పే పాలకులు ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్‍కు మాత్రం మూడు రకాల రేట్లెందుకు నిర్ణయిస్తున్నారు? వ్యాక్సిన్‍ కొరత వెంటాడుతుంటే కేంద్ర ప్రభుత్వం సరఫరాలను పెంచకుండా, అమ్మకాలను సరళీకరించడం, ధరలపై నియంత్రణను ఎత్తివేయడం కార్పొరేట్ల లబ్ది కోసమేనన్నది సుస్పష్టం. వాస్తవానికి నేడు దేశంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి సార్వత్రిక, సామూహిక వ్యాక్సినేషన్‍ కార్యక్రమం చేపట్టాలి. వ్యాక్సిన్‍ తయారు చేసిన ఆరునెలల్లోగా వినియోగించకపోతే కొవిడ్‍ టీకాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. టీకాల పంపిణీ, వాటి వినియోగంపై ప్రధాన దృష్టి సారించాలి. తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.

మోడీ వ్యాక్సిన్‍ ఉత్పత్తిదార్లతో సమావేశమై, వారి చర్చల్లో ‘కుదిరిన’ ఒప్పందం మేరకే అలా ప్రకటించినట్టు ఇప్పుడు బోధపడుతోంది. ప్రధాని ప్రసంగించిన మరుసటి రోజునే కొవిషీల్డ్ వ్యాక్సిన్‍ ఉత్పత్తిదారు సీరం ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా తన ధరలను ప్రకటించింది. ఒక మోతాదు వ్యాక్సిన్‍ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు విక్రయిస్తామని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం 150 రూపాయలకే లభిస్తుందని పేర్కొంది. కరోనా టీకాను కేంద్ర ప్రభుత్వానికిచ్చే రేటుకన్నా దాదాపు మూడింతల అధిక ధరను రాష్ట్ర ప్రభుత్వాల నుండి వసూలు చేస్తామనడం దారుణం. దేశ ప్రజలందరికీ అవసరమైన టీకాను కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యతను విడనాడిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వివక్షాపూరిత విధానానికి తెర తీయడం తగని పని.

ప్రపంచానికే వ్యాక్సిన్‍ రాజధానిగా పేరుగాంచిన ఇండియా ఇప్పటికే దేశంలో రెండు డోసులూ ఇచ్చింది 0.7 శాతం మందికే. తొలి టీకా తీసుకున్నవారి సంఖ్య 6 లేదా 7శాతం లోపే. ప్రతి రోజు అర కోటీ టీకాలు అందిస్తే తప్ప కొవిడ్‍పై పోరులో ధీమాగా పురోగమించలేమని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లపై జనంలో గల భయసందేహాల్ని పటాపంచలు చేస్తున్నా అవసరమైన మేరకు రాష్ట్రాలకు టీకాలు అందుబాటులోకి రాకపోవడం ఇబ్బందికరమే. టీకా తీసుకొంటే కొవిడ్‍పై సమరానికి శరీరం సన్నద్దంగా ఉంటుందని, ప్రాణాప్రాయం నుంచి బయటపడవచ్చునని సందేశాన్ని జన సామాన్యానికి ఇంకా విస్తృతంగా చేరవేయాల్సి ఉంది ప్రభుత్వాలే. వ్యాక్సిన్‍ పరిశోధన-అభివృద్ధి తయారీలో నిమగ్నమైన దేశీయ కంపెనీలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు మిషన్‍ కొవిడ్‍ సురక్ష పథకాన్ని టీకాల కోసం బడ్జెట్‍లో రూ.35 వేల కోట్లను ప్రకటించిన కేంద్రం దేశ ప్రజలకు అందరికీ టీకా అందించడమే లక్ష్యంగా వేగంగా కదలాలి. పైజర్‍, మోడర్నాల, స్పుత్నిక్‍ టీకాల ధరలు ఇక్కడి ప్రజలకు చుక్కలు చూపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మే 1వ తేదీ నుండి యువజనులందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి తగిన నిల్వలు కేంద్రం వద్దగానీ, ఉత్పత్తి సంస్థల వద్దగానీ ఉన్నాయా? ఉత్పత్తిదారులు వెల్లడించిన సమాచారం ప్రకారం మే నెలలో ఎదురయ్యే డిమాండ్‍కు సరిపడా వ్యాక్సిన్లను ఉత్పత్తిదారులు అందించే అవకాశం కనిపించడం లేదు. 30 కోట్ల మందికి తాము వ్యాక్సిన్లను అందిస్తామని కేంద్రం చేసిన వాగ్దానం ఏమైనట్టు? ఏప్రిల్‍ 29 నాటికి మొదటి డోస్‍ తీసుకున్న వారు 8 శాతం మాత్రమే ఉన్నారు. ఒక శాతం మందికి మాత్రమే రెండు డోస్‍లు ఇవ్వగలిగారు. జనవరి 16 నుండి ఇంతవరకు 12.4 కోట్ల డోస్‍లను మాత్రమే ఇవ్వగలిగారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‍ ఇవ్వడం ఏప్రిల్‍ 1 నుండి ప్రారంభమైంది. మొదట నెమ్మదిగా ప్రారంభమై ఏప్రిల్‍ 5వ తేదీ నాటికి రోజుకు 4.5 లక్షల డోస్‍లు ఇచ్చారు. ఇంత విపత్తు వచ్చినప్పటికీ ప్రధానమంత్రి ఎన్నికల ప్రచార సభలకు వెళ్లడం కరోనా వ్యాప్తికి దోహద పడింది. పాలనా బాధ్యతలు నిర్వహించవలసిన ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రికి ఎన్నికలే ప్రధానమైనట్టు ప్రజలు భావిస్తున్నారు.

భారత ప్రభుత్వం టీకా ముడి సరుకులు సరఫరా చేయాలని ఏప్రిల్‍ రెండవ వారంలో అమెరికాను మనం కోరగా అక్కడ అమల్లో ఉన్న యుద్ధకాలపు రక్షణ చట్టాన్ని ప్రస్తావించి నిరాకరించింది. భారత్‍ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నామని అంటూనే ముందుగా తమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పడం లేదని ప్రెసిడెంట్‍ జో బైడెన్‍ ప్రభుత్వం మన అభ్యర్థనను మర్యాదగా తిరస్కరించింది. ఇప్పుడు అమెరికా తన జనాభాలో మెజారిటీకి టీకాలు వేసుకున్నది గనుక మనకు టీకా ముడి సరుకును, ఇతర కొవిడ్‍ వైద్య పరికరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రెసిడెంట్‍ బైడెన్‍, ప్రధాని మోడీ ఫోన్‍లో మంచిగా మాట్లాడుకున్నారు. ఇంకా బ్రిటన్‍, ఆస్ట్రేలియా, యూరప్‍, సౌదీ అరేబియా, సింగపూర్‍ తదితర దేశాలూ భారత దేశాన్ని ఆదుకోడానికి సిద్ధమయ్యాయి. ఈ విధంగా ముందు స్వాతిశయంతో గొప్పలు చెప్పుకొని ప్రపంచానికే అభయ హస్తం చాచి, ఇప్పుడు చతికిలపడిపోయి విశ్వం ముందు మోకరిల్లవలసిన స్థితిని తెచ్చుకున్నందుకు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఏమనాలి?

ప్రపంచ మీడియా సంచలన కథనాలు :
నాలుగు మాసాల క్రితం ప్రపంచానికి ప్రాణదాతనని ఘనంగా చెప్పుకున్న భారత దేశాన్ని ఇప్పుడు దేశ దేశాలన్నీ జాలిగా చూస్తున్నాయి. ఇక్కడ కొవిడ్‍ విజృంభిస్తున్న తీరును, మన పాలకుల వల్లమాలిన నిర్లక్ష్యాన్ని పక్కపక్కన ఉంచి చూపిస్తూ మన స్వయంకృతాపరాధాన్ని అంతర్జాతీయ మీడియా ఎండగడుతున్నది. ఇంగ్లాండుకు చెందిన ‘ది గార్డియన్‍’ పత్రిక భారత దేశంలో వ్యవస్థ కుప్ప కూలిపోయిందని, ప్రజలు కొవిడ్‍ నరకంలో కూరుకుపోయారని వ్యాఖ్యానించింది. జనం పెద్ద ఎత్తున ఒక చోట చేరకూడదని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కొవిడ్‍ నివారణ నియమాలు గట్టిగా చెబుతుంటే బెంగాల్‍లో ఒక ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ ‘ఇంతటి మహా జన ముద్రాన్ని నేనెప్పుడూ చూడలేదని’ ఆశ్చర్యపోయి పలికిన పలుకులను ప్రస్తావించి ది గార్డియన్‍ ఎద్దేవా చేసింది. గుజరాత్‍, ఉత్తరప్రదేశ్‍ ప్రభుత్వాలు కొవిడ్‍ మృతుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని, అవి చెబుతున్న దానికి ఆసుపత్రుల శవాగారాలలో (మార్చురీలు) కుప్పలు పడి ఉన్న మృతదేహాల లెక్కకు పొంతన కుదరడం లేదని ఎత్తి చూపింది. ‘న్యూయార్క్ టె•మ్స్’ పత్రిక ఇండియాలో అదుపు తప్పిన కొవిడ్‍ గురించి అనేక కథనాలు ప్రచురించింది.

తొందరపడి కూసిన కోయిలలా కొవిడ్‍పై విజయం సాధించినట్టు భారత ప్రభుత్వం ముందుగానే ప్రకటించుకొని ఆ తర్వాత దాని విష కోరలకు తన ప్రజలను విందుగా అందిస్తున్నదని న్యూయార్క్ టె•మ్స్లో ఒక ప్రసిద్ధ కాలమిస్టు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ మహా మృత్యు సంక్షోభానికి కారణమని భోపాల్‍లో శవ దహనాలు 1984లో యూనియన్‍ కార్బైడ్‍ విష వాయువు లీక్‍ సంభవించినప్పటి దృశ్యాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హరిద్వార్‍లో కుంభమేళాను అనుమతించడాన్ని ఏకి పారేశారు. అలాగే ఫ్రాన్సు పత్రిక లీ మాండ్‍, బ్రెజిల్‍కు చెందిన ఓ గ్లోబో, జపాన్‍ పత్రిక జపాన్‍ టె•మ్స్, సిడ్నీ మార్నింగ్‍ హెరాల్డ్ (ఆస్ట్రేలియా), గల్ఫ్ టె•మ్స్ (కతార్‍) వంటి పత్రికలు భారత దేశంలో కొవిడ్‍ రెండో కెరటం ఉధృతిని గురించి ప్రచురిస్తూ మోడీ ప్రభుత్వం చేతగాని తనాన్ని, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించాయి.

ముగింపు :
జనాభాలో కనీసం 70 శాతానికి టీకా వేస్తేగానీ రక్షక కణాలు (యాంటీబాడీస్‍) పెరిగి, వ్యాప్తి చేసే గొలుసు తెగి మూక నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగదు. వ్యాధి వ్యాప్తి ఆగదు. ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి టీకా వెయ్యాలనే లక్ష్యం చేరటానికి రోజుకి కనీసం 35 లక్షల డోసులు అవసరం. కాగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్‍ సహకారంతో పూణెలోని సీరమ్‍ ఇనిస్టిట్యూట్‍, హైద్రాబాద్‍లోని భారత్‍ బయోటెక్‍ కల్సి రోజు వారీ ఉత్పత్తిని 22 లక్షల డోసులకు మించటం లేదు. అంటే రోజుకి దాదాపు 15 లక్షల డోసుల కొరత ఉంది. దీనికి సాయం వ్యాక్సిన్‍ ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థాలను అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో తగ్గించింది. దేశంలో అవసరాలపై ముందు చూపు లేకుండా పలుకుబడి కోసం ప్రభుత్వం 6 కోట్ల డోసులను 84 దేశాలకు పంపించింది. దీనికి తోడు తీవ్ర విపత్కర పరిస్థితులెదుర్కొంటున్న మహారాష్ట్ర, ఢిల్లీ, చత్తీస్‍ఘర్‍ రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు కావటంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‍, ఆక్సిజన్‍ సరఫరాలో వివక్షత చూపుతున్నది.

మే నెల నుండి భారీగా వ్యాక్సిన్లు అవసరమవుతాయి. కనీస డిమాండ్‍ మేరకు వ్యాక్సిన్‍లు అందించాలంటే ప్రతినెల పదికోట్ల డోస్‍ల కొవిషీల్డును సీరం సంస్థ సరఫరా చేయవలసి ఉంటుంది. ఇన్ని వ్యాక్సిన్లను జూలైకి ముందు అందించలేమని సీరం సంస్థ తెలియజేసినట్టు సమాచారం. కొవ్యాక్సిన్‍ను ఉత్పత్తి చేసే భారత బయోటిక్‍ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతానికి ఏడాదికి 20 కోట్ల డోస్‍లు మాత్రమే. ప్రస్తుతం నెలకు కోటి డోస్‍లు సరఫరా చేస్తోంది. బెంగుళూరు యూనిట్‍లో ఉత్పత్తికి మరో రెండు, మూడు నెలలు పడుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత ఏడాదికి 70 కోట్ల డోస్‍లను ఉత్పత్తి చేయగలదని, అప్పుడు నెలకు 6 కోట్ల డోస్‍లు సరఫరా చేయగలమని ఆ సంస్థ తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు మే 1 నుండి కావలసినన్ని వ్యాక్సిన్‍లు అందక ప్రజలు ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

వ్యాక్సిన్‍ ఉత్పత్తి చేసే సంస్థలు 50 శాతం కేంద్రానికి తక్కిన 50 శాతం రాష్ట్రాలు, ఇతర సంస్థలకు సరఫరా చేయాలన్న నిబంధనను విధిగా పాటిస్తాయా? వ్యాక్సిన్‍ సరఫరాలో ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. ఇక ఇతర దేశాల నుండి వ్యాక్సిన్‍లను దిగుమతి చేసుకుని వాటిని పరీక్షించకుండానే ప్రజలకు వేస్తారా? ఎప్పుడు దిగుమతి చేసుకుంటారు. ఈలోపు వైరస్‍ మరింతగా విస్తరిస్తే పరిస్థితి ఏమిటి? ఎన్నో సందేహాలను ప్రశ్నలను కేంద్ర సరళి లేవనెత్తుతున్నది. తొలి నుండి అస్పష్టత, ప్రణాళిక లేమి కొనసాగుతోంది. ఈ ప్రజారోగ్య విపత్తుతో పాటు అనివార్యంగా తోడై ఉన్న మరో ప్రమాదం ఆర్థిక దుస్థితి, ఉపాధి విధ్వంసం. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మోడీ ప్రభుత్వం తన సంకుచిత, వేర్పాటువాద, ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు, ఫాసిస్టు హిందూత్వ దృక్పథాన్ని, ధోరణిని విడనాడాలి. అన్ని రకాల వనరులను సమీకరించి ప్రజలకు సాయపడాలి. చివరికి విషమిస్తున్న ప్రజల పరిస్థితులకు స్పందించి కోర్టులు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వాలు కదలనిస్థితి బహుశా ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదేమో…

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

4 thoughts on “కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం

  1. Our rulers wants only VOTE ,NOTE& CORPORATE guests…. then how they are protect people…. good informative essay sir..

  2. నిజమే సర్ , ఈ దేశంలో ప్రజలంటే పాలకులకు పురుగులకన్నా హీనం . వాళ్ళు ఎం చేసినా ఇక్కడి ప్రజలు ఎదిరించలేరనే నమ్మకం. ఈ దేశంలోని నిరక్షరాస్యత, మూఢమమ్మకాలే వాళ్లకు ఆయుధాలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏలాంటి చర్యలు తీసుకోక పోగా, వాళ్ళను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది.

  3. కాలానుగుణంగామారుతున్న రాజకీయ పరిస్థితులను ఎత్తిచూపుతూ వాస్తవాలను సమగ్రంగా విశ్లేషిస్తున్నారు .

Leave a Reply