కన్నీటిగాథ

విప్పబడ్డ నా వస్త్రాన్ని
దేశం నడిబొడ్డున
వాడెన్నిసార్లు
రెపరెపలాడించిన
మీరు జేజేలు పలకుతూనే ఉండండి

పొగరెక్కిన ఆ మదపుటేనుగు
నా రక్తాన్ని చిందించిన కథను
కన్నీళ్ళసిరాతో
ఎన్నిసార్లు రాసినా
మీరు చిత్తుకాగితాల్లా
చించిపారేస్తూనే ఉండండి

ఇంకెన్ని కన్నీటిగాథలను
మీముందు జాతీయగీతాలుగా
ఆలపించాలి
ఏ చప్పట్ల మధ్య
నా బాధను ఊరేగించితే
మీలో ఓ ఆలోచనలమొక్క
నాటుకుంటుంది

అన్నల్లారా
తమ్ముల్లారా
చిరాకుగా చూడకండి
పరాకుగా అనుకోకండి
ఆఖరుగా ఈ ఒక్కమాట వినండి!

పగబట్టినట్టే వెంటబడుతూ
బుసలు కొడుతున్న
విషనాగుల మీద
ఓ కన్నేసి ఉంచండి

పాడుబడ్డ బుద్దుల్లోకి జారుతున్న
యవ్వనపు సెలయేళ్ళ
దారిని కాస్త మళ్ళించండి

చీకటయిపోయిన
మా బతుకులను
రోడ్లపైన వెలిగించి
సానుభూతిగీతాన్ని ఎత్తుకోకండి

చేతనైతే
ఆరిపోబోతున్న జీవితాలకు
కొవ్వొత్తులై ఎదురెళ్ళి
కాంతినింపండి

ఛానెల్స్ రేటింగ్ లకు
రెక్కలు తొడగాలనో
ప్రయోజనాల మూటలను
పొట్లం కట్టుకోవాలనో

పీక్కుతినబడ్డ
మా శవాల ముచ్చటను
రచ్చబండ కీడ్చి
రాజకీయపుచ్చకంపులో
కొట్టుకుపోకండి

పుట్టింది పెద్ద గూడూరు; తల్లి తండ్రులు: శ్రీహరి, పుష్పలీల; చదువు: ఎం.ఎ, బిఎడ్, (పిహెచ్.డి); ఉద్యోగం : స్కూల్ అసిస్టెంట్, తెలుగు; పాఠశాల పేరు : జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల వి.ఎస్ లక్ష్మీపురం. ప్రస్తుత నివాసం: మహబూబాబాద్. సెల్: 8978439551. రచనలు : 1. నీటి దీపం (కవిత్వం) 2. ఇన్ బాక్స్ (కవిత్వం). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, విమర్శ- పరిశీలన అనే అంశంపై డా.ఎస్.రఘు గారి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నాడు.

One thought on “కన్నీటిగాథ

Leave a Reply