కథ

భోజనంచేసి తట్టుకుర్చిల కూర్చుండి సిగరెట్టు ముట్టించాడు నారాయణ రావు… బయట ఎండ మండిపోతోంది. ఎదురుంగ ఎడ్ల కొట్టంమీద బెంగుళూరు పెంకలు మండుతున్నాయి. ఇల్లు ఎల్లిపోయిన దాని తీర్గున్నది. కలాపి జల్లినోడు లేడు. ఊడ్సెటోల్లు లేరు….సిగరెట్టు పొగలాగే మనుసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

“దండాలు దొరవారు” అన్నమాట వినిపించింది…. ఈ మాట వినక సానొద్దు లాయె – సిగరెట్టు పొగల మధ్యనుంచే కండ్లు చిన్నవిచేసి కనుబొమ్మలు ముడిచి అరుగు కిందికి చూసిండు.

ఇద్దరు మనుషులు చేతులు జోడించి నిలుచున్నారు. ఇద్దట్లో ఒకనిది అమ్మోరు మచ్చల మొఖం – ఎర్రగా బక్కగా ఉన్నాడు. వేడిమూతి నెత్తికి గంపంత రుమాలు చుట్టి ఉన్నది. జబ్బకు వీణ వేలాడుతోంది. రెండవవాడు పొట్టిగా నల్లగా కుదిమట్రంగా ఉన్నాడు. నల్లటి ముఖంమీద మీసాలున్నాయి. నడ్డి ముక్కు. ఇద్దరికి తిరుమని గౌర నామాలున్నాయి. మెడకాయకు విబూది ఏలుతోటి రాసున్నది…. నల్లవాని జబ్బకు బుడుగుజంగం బుర్ర వేలాడుతోంది.

“బుడుగు జంగ మోల్లముండి – నా పేరు ఈరయ్య – మావోని పేరు దమ్మడు” అన్నాడు ఎర్రటి పొడుగోడు…

“ఒహో గంగని మనమలా?” అన్నాడు గుర్తుకు తెచ్చుకుంటూ…

“ఔ దొరా!” అన్నాడు దమ్మయ్య….

“ఏం పనిమీదొచ్చినట్టు?” నారాయణరావు అటెటో చూస్తూ

“బుడుగు జంగపోల్లకు పనులేముంటయి. తమరి పేరు మీద కథ చెప్పుతం…” వీరయ్య.

“కథలా! ఔ నాటకాడాటాడంగ మద్దెలగాన్ని తేలు కుట్టినట్టు గిప్పుడు కతలేందిర్ర – నేను సెక్కర్లున్న…..”

“గట్లనకుండ్లి…రెండేండ్ల కింద తమరు పెద్దొర్సాని దినాలకు కథ చెప్పిచ్చి గోదానం క్రింద లేగను దానమిచ్చిండ్లు. అన్నదానం, వస్త్రదానం చేసిండ్లు – మీ అసొంటోల్లు గట్లంటే మేం ఏడబోవాలె?”

“నను విసిగించకుండ్లి కతలు గితలు జాన్తనయి” అన్నాడు.

అన్నదమ్ములిద్దరు ఒకల మొఖాలొకరు చూసుకున్నారు.

నారాయణరావు ఏదో యాదికొచ్చి ఇంట్లకు లేచిపోయాడు. లోపల పందిరి మంచంమీద చినదొర్సాని కృష్ణవేణి బోర్లా పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటోంది….

“ఇగో గ పుస్తకాలు చదువొద్దనే నేను చెప్పేది…” చిరచిరలాడాడు.

కృష్ణవేణి అయిష్టంగానే లేచి నిలుచుండి పైట సర్దుకున్నది.

కృష్ణవేణి లేచిన పందిరి మంచంలో నారాయణరావు పండుకున్నాడు.

కృష్ణవేణికి తను చదువుకున్న రోజులు గుర్తొచ్చినయ్. నారాయణరావు అన్న కొడుకుతో తన పెండ్లి – ఆ తరువాత నారాయణరావు తన అన్న కొడుకైన కాంతారావును జిత్తులమారిగ చంపించి తనను తెచ్చుకోవడం – ఇక్కడ ఉంచు కున్నడన్న పేరు… నారాయణరావుకు మాత్రం రైతులు – సంఘాలు గుర్తొచ్చినయ్.

‘ఎట్లుండె బతుకు? యేటా అయ్యగార్లను బిలిపిచ్చి హరికథలు చెప్పిచ్చేటోడు… సిందోల్లతోని భాగోతాలాడిచ్చెటోడు – గోత్రాలోల్లతోని నాటకా లేపిచ్చేటోడు – మాట్లోల్ల తోని పాండవుల కత చెప్పిచ్చేటోడు – ముష్టోనితోని బమ్మం గారి చరిత్ర చెప్పిచ్చేటోడు… మూడేండ్లాయె – ఆటలేదు, పాటలేదు. ఏడ మొసదీసుకోనిచ్చిండ్లు – ఏమంట భూలచ్చిమికాడ వాళ్లచ్చి మీటింగు బెట్టిండ్లో – అప్పటి నుంచి పాటలు ఆటలన్నీ ఆళ్లయే అయినయ్ …. ఇదివరకు తను ఆడిచ్చేటోడు….” ఇట్లా సాగుతున్నాయి అతని మనుసులో విచారాలు.

“ఈ పాడుబడ్డ ఇంట్ల నేనుండలేను…..” నాలెచూపులు చూస్తూ క్రిష్ణవేణి చెప్పింది….

“బంగుళ గట్టియ్యమంటవ్ – నీదేంబోతంది?… ఇప్పటికే ఆ లం… కొడుకులు” నారాయణరావు.

బుడుగు జంగాలిద్దరు ఇంటి ముంగట కొట్టంల కూసున్నరు….

“గోడలు గూలిపోతన్నయి. పైసలన్ని ఏంజేసిండో? గోడలన్న కట్టించ్చుకుంట లేడు- ” వీరయ్య.

“అబ్బో వీడా! ఉసికెల పాపెరగాడు – మొన్న పట్నంల యాభయెకరాలు కొన్నడంట. ‘కొత్త పెళ్లి ఊళ్లి కరంటు మోటర్ల పైరవీ మీన్నే ఎయిలు సంపాయించిండు. అడివి దొంగ కట్టె సరేసరి’ వీడు కొట్టుకున్నంత, అమ్ముకున్నంత. ఊరి పంచాతుల దండుగులు బందయినయ్ గని లాపోతెనా!” దమ్మయ్య.

“మెల్లెగ! మెల్లెగరా?”

“ఔగని ఈడగూడ ఆఖరెత్తు పారేటట్టులేదు.”

“ఇంతే సంగతులు – గాన దండములు – బుర్రలు బలిగేసుడే – రైతులు సంఘపోల్ల పాటలు తప్ప మన కతలినేటట్టులేదు…మనకా ఆ పాటలు పాడరాదు – దొరలు మునుపటి తీర్గ కతలు చెప్పియ్యరు…..”

“నేనంట మనకెందుకు సంఘపోల్ల కతలు సెప్పరాదు?….”

“ఏమంట సెప్పుతవురా? మనకేమెరుకని.”

“ఏంది ఎరుకలేంది? సిన్నప్పటినుంచి సూసినయేనాయే. నెల్లాల్లాయే ఊళ్లు తిరుగబట్టి.. ఏవూళ్లె జూసిన అద్దం తీర్గ గన్పడ్తనే ఉన్నది కండ్ల ముంగట.”

“ఏందిర గన్పడేది? సాలుసాలు పోలీసోల్లచ్చి హత్‌కడీలేసి పట్టుకపోతే దెలుత్తది…. సాలుసాలు.”

“పోతేబోతం – మన కతలినేటోల్లు – మనకు ఇన్నేండ్లు కూడుబెట్టి సాదుకచ్చినోల్లే సెక్కర్లుంటే మనదో లెక్కా…. తినేది మొగని సొమ్ము పాడేది బాలనాగమ్మ పాట – నానుంచి గాదన్న….”

“నాలికెండుక పోతంది…. గిన్నన్ని నీల్లన్న బోసే దిక్కులేదు గదా! ఊరు కగ్గిదల్గ…”

“ఈన్నేమె ఊరు బహిష్కరించింది. ఈని పనులన్నీ బందు – కాంతారావును అన్నకొడుకనే గురుత్తం లేకుంట సంపించ్చిండు గాడ్ది కొడుకు. అన్న కొడుకు భార్య కోడలు వరుస, కోడలునే బాలనాగమ్మ తీర్గ సెరబట్టిండు. ఆమెను బయటికి రానియ్యడు… పోదాంపా….”

“ఆగురా! ఇంట్లకెల్లి బయటికత్తడేమొ ఆఖరి సారడుగుదాం…..”

“అడిగినా… ఇగో నేను మరింకే కత జెప్ప…” దమ్మయ్య తెగేసి చెప్పిండు…

“పోనీ నువ్వనే కథే చెప్పుదామనుకో – ఏమంట చెప్పుతవు, ఎట్ల చెప్పుతవు? కొసేడ, మొదలేడ?”

“కొసేంది మొదలేంది? ఖిలా వనపర్తిల సూళ్ళేదా? ఖిలా వనపర్తిల పజలకోసం పాణాలిచ్చిన దేవేందర్ రెడ్డి పజల దేవయ్య కథే చెప్పుదాం – బలుగురు కొండయ్య – ఏడుగురు మరాఠీలది – బాలవద్దిరాజుది – పసుల బాలరాజుది కథలు చెప్పంగ – గిది చెప్పుడు సుతారమా? గీనే ఈరాధి ఈరుడు ధరణీ కుమారుడు.”

“కతలు సెప్పిచ్చేది దొరలు – నువ్వు సెప్పేది నక్సలైటు దేవయ్య కథంటే చెప్పూడబీకుతరు. అచ్చే పైసలట్లిడిసి పెట్టి – నీ మాటింటె జేలుకాన తయారు.”

“జనాలకు నచ్చుతె కడుపుల బెట్టుకుంటరు. మొదటి నుంచి నీ కతలిన్నదెవలు? దొరలా ప్రజలా?”

ఇంతలోనే నారాయణరావు బయటకొచ్చిండు.

“ఇంక బోలేదుర్ర?”

“ఏడికి బోతముండ్లి? తిరిగి తిరిగి యాస్టకొచ్చింది. మా కతలు ఇనే నాథుడే దొరుకుతలేడు…. పెద్ద లోకులేమో?….”

“సరే ఊళ్లె గాడ్ది కొడుకులకు గమండి పెరిగింది బంచత్ – మీకేమేమి కతలొస్తయిరా?”

వీరయ్య ముందుకు జరిగి – “బాలనాగమ్మ, బొబ్బిలికథ, బలుగురు కొండయ్య కథ, ఏడుగురు మరాఠీల కథ, పసులబాలరాజు కథ ” ఇట్లా చెప్పుకొచ్చిండు.

చిన్నోడు అందుకని “దేవయ్య కథ-” అందిచ్చాడు.

“సరే గా కథలన్నీ ఇన్న కథలే – మీవోడు చెప్పిందేదో కొత్తగున్నది…వారీ మీరెప్పుడన్న సంగపోల్ల పాటలిన్నరా? అగో వాటికన్న ఘాటు గుండాలె ఇన్నరా?”

పెద్దోడు ఏదో చెప్పబోయిండు…. చిన్నోడు అడ్డొచ్చి “తమరు వింటరుగదా? గిది కొత్తకత. ఇంకేడ జెప్పలే – మీతోనే మొదలు….”

“సరె సరె – నేనే పరేషాన్లున్న – సూసిండ్లు గద – మందనుకుంటరు దొరకేందని? నా ఇల్లు – కొట్టాలు సూస్తిరి గదా! ముప్పయి రూపాయలిస్త.”

“ఇద్దరం నాత్రంత జెప్పాలెగాదుండ్లి….”

“మీ ఇష్టమురా? అలిమా బలిమా? చెప్పుతే మూడు పానాదులు కాడ… చెప్పుండ్లి..”

“కాసిన్ని మంచినీళ్ళు దొరా!” చిన్నోడు.

“దొర్సాని నిదుర బోతంది.”

అన్నదమ్ములిద్దరు బయటకు నడిచిండ్లు.

“వారీ దమ్మ. నీకేమన్న పుర్రెల పురుగు మెసులుతందారా?” వీరయ్య.

“లాపోతేంది. నెల రోజుల నుంచి తిరుగుతున్నం – ఎప్పుడన్న ఇసారం జేసినవా? జనం మన కతలెందుకు చెప్పిత్త లేరో? నెల నుంచి తిరుగుతున్నవ్ ఊరూరికి – గాలి దుమారం లేవంగ ఇగో గాలికి చెట్టు మొదలుతో ఊగంగ ఆకు నేనూగనంటె కలువది. అన్నింటితో పాటు తానూ ఊగాలె…” దమ్మయ్య….

“సావచ్చిందిరా?” అన్నడు అన్న. అట్లా అన్నాడే కాని మనుసులో దేవయ్య కథ మెదులుతోంది…. రాగం పోటెత్తుతోంది. ముఖంలో అదో విధమైన ఉద్విగ్నత మెదులుతోంది.

ఇద్దరు బయటకు రాగానే పిల్లలు చుట్టుముట్టారు.

దమ్మయ్య పిల్లలతో కలిసిపోయి కులాసాగా నవ్వుతున్నాడు. ఇద్దరు బజాట్ల నడుస్తున్నరు. కరంటు లైన్మెన్ రాజయ్య గుర్తుపట్టి –

“ఏమోయి బుడుగు జంగాలు జబ్బలు జారేసుకొని తిరుగుతండ్లు” అన్నాడు.

“ఏం జెయ్యమంటరు? మమ్ముల కానినోడెవడు లేడు గదా!”

“ఊళ్లల్ల మందేమొ కేసులు గీసులని పోలీసు ఠానాల చుట్టూ, కోర్టులసుట్టూ తిరుగుతుంటే మీరేమో పసుల బాలరాజు కథలు చెప్పితిరి. ఆడోల్లు మొగోల్లు దెబ్బలు దింటాంటే మాయల పక్కరోడంటిరి….”

“మీ సుతి కథలు వినేటోల్ల సుతి కలుత్తలేదోయి” అన్నాడు రాజయ్య.

“నాలికెండుకపోతంది కాసిన్ని మంచి నీళ్ళు బొయ్యరా?” పెట్టాడు.

ఇద్దరిని తనింటికి తీసుకపోయాడు. బుర్ర, వీణ పక్కకు బెట్టి గోడ నీడన అన్నతమ్ములిద్దరు కూర్చున్నారు.

నీల్లు దాగిండ్లు. దమ్మయ్య ఊళ్ల కథ చెప్పుతున్నట్లు చెప్పిండు. లైన్ మెన్ రాజయ్య దమ్మయ్య మాటల్లో పడిపోయారు.

వీరయ్య గోడపక్క కొరిగిండు, కండ్లు మూసుకున్నాడు. తను మాదిగ సాయిలు ఇంటికి పెండ్లి గురువుగ ఖిలావనపర్తికి పోవడం – దేవయ్యను చూడడం – ఆ మాటలు… ఆ తరువాత సాయంత్రం పోలీసులు రావడం…. కొట్టుకోల్లు మొత్తుకోల్లు అమీను పిస్తోలు కాల్వడం – దేవయ్య నెత్తురు మడుగులో పడిపోవటం – శవాన్ని పోలీసులు తీసుకపోవడం – మాదుగులు కంటికే ధార మింటికే ధారగా ఏడ్వడం – మరునాడు శవాన్ని వాళ్ల తల్లిదండ్రులకిస్తే తను అందరితో పాటు శవం దీసుకొని దేవన్న పుట్టినూరు రాణాపుర పోవడం. రాణాపురంలో ఇసుక జల్లుతే రాలని జనం – ఎన్నివేలో – శవాన్నెత్తుకుని ఊరేగింపు – ఊరేగింపుల అరుపులు – శవాన్ని ఆఖరిసారిగా చూడడం కోసం వచ్చిన జనం ఏడుపులు…. అందులో పొట్టిగా ఉన్న పిర్రల గట్టయ్య లేచి “ఎందుకేడుత్తర్రా? ఇదేమన్న కొత్తా… కాదు – కాదురొరే కాదు – ముమ్మాటికి కాదు…. నాకెన్నేండ్లు…. నాకండ్ల ముంగట సానామంది సానాతీర్ల సావంగ సూసిన – కనిగీసావు గసొంటి సావుగాదు. ఎద్దు బతుకుతది – ఈగ బతుకుతది. పిల్లల గంటది. కని పందోలె పదేండ్లు బతికేం భాగ్గెం…. నందోలె నాలిగేండ్లు బతుకు…. మా అల్లుడు రామడెందుకు సచ్చిండు? మాదిగోల్లను కుప్పేసినందుకు. గిది ఇప్పటి మాటకాదు – పీరడెందుకు సచ్చిండు? భూమెట్ల గుంజుకున్నవన్నందుకు. ఎగులాస పురంల జంజెర్ల రాయమల్లడెట్ల సచ్చిండు – తను నీల్లుమోసి పెంచిన అడివిల మోపెడు పుల్ల లేరుకున్నందుకు? కనుక నేను బతుకుతనని నిలబడితె సంపుతరు. బాంచెనంటె – ఆళ్ల సేవలు సేత్తే నిన్నేమనరు. కని అట్ల నీ నెత్తురు తాగుతరు… నీ మాంసం తింటరు. అట్లా సత్తవు… ఇంకో సంగతున్నది – ఆడెవడో ఇందిరమ్మగారు మీనున్నదని సెయ్యి గురుతు బెట్టుకచ్చి ఏమన్నడు? గీ సర్కారు మీది – మీకు భూములిప్పిత్తం, జాగ లిప్పిత్తం – నా లంజెపియి ఇప్పిత్తమన్నరు – మన ఊళ్లల్ల పరం పోగులు దున్ను కొమ్మన్న దేవన్నను తుపాకినేసి సంపిండ్లు – దున్నెటోనికి భూమి గావాలన్నోన్ని సంపిండ్లు… ఎన్‌కౌంటర్ జేసి సంపిండ్లు.”

“ఓ దేవన్నో – నా దేవన్న – మమ్ముల నట్టనడిమిల ఇడిసిపోతివా దేవన్న – నీకు గడుకండి పెడుత రావు దేవన్న – నా పెద్దకొడుకు వనుకున్నగాదు దేవన్న – ముదుగాటి బుక్కనీకు బెట్టిన గాదు దేవన్న – ఓ దేవన్న” ఒక స్త్రీ రాగం తీసుకుంట ఏడుస్తోంది….

“సయిసె – సయిసు – ఏడుత్తె అత్తడా? ఆరుత్తే అత్తడా?” గట్టయ్య.

“నీకెరుక లేదుర గట్టు నాయినా? మన బతుకు తెల్లారి పోయిందిర గట్టు నాయినా? ఆళ్ల సేతులకు జెట్టలు నరుప్పలు బుట్టగదురో దేవుడా? ఆళ్ల కాడుగాల గదురో దేవుడా! వాళ్లనాము నరుక గదురో దేవుడా? ఓ అయ్యలారా… మీరంత నా దేవన్నను సంపంగ మిలమిల సూసిండ్లు గదరా నా దేవుడా!” అరుసుకుంట కనిపిచ్చిన వాళ్ళమీదల్లా పడి ఏడుస్తోంది….

వీరయ్య ముఖం కమిలిపోయింది. గోడనీడ జారిపోయింది. చుట్టూ చూసిండు ఎవరులేరు… దమ్మయ్య, రాజయ్య కలసి ఏటో పోయారు…. మోకాళ్ల మీద తల పెట్టుకొని కూర్చున్నాడు. అతని కళ్లు చెప్పరాని ఉద్విగ్నతలో నీళ్లతో నిండిపోయాయి.

“పిస్సోల్లారా! మాలసిమి పెనిమిటి సచ్చిండు – ఆగిందా? ఆగలేదు… ఒరే – జాగర్త గినుండ్లి….ఇంటికి పెద్దోడే! మన ఊళ్లల్ల పెద్దోడే కాదన – కని ఇంటి పెద్దోడు సత్తె ఎవుసాయమాగుద్దారా? దున్నాలే దోకాలె పంట బెట్టాలే – గిదిగంతే…”

“ఇంటికి పెద్ద ఒరిగి పోయెనని
ఏడిసి ఫలమేమి
అయ్యో ఏడిసి ఫలమేమి –
తందానో – తానె తందానా….” వీరయ్య గొంతులో నుండి రాగం బయటకు వెళ్లింది.

పడమటి దిక్కు సూర్యుడు కుంకాడు… పక్షులు రొద చేస్తున్నాయి.

***

నెల సింతల మీది కచ్చింది. సాకలవ్వ ఊరు దిరిగి పోయింది. మూడు పానాదుల కాడ సుంకరోల్లిద్దరు తెచ్చేసిన తక్తు బల్లమీద వీరయ్య, దమ్మయ్య కూచున్నారు.

దమ్మయ్య ‘తపతప’ బుర్రగొట్టిండు. వీరయ్య వీణ టింగు టింగున మీటిండు. ఎడమ చేతి పెద్దవేలుకున్న గజ్జెలు లయగా మోగినయి.

ఆటలాడే పిల్లలు తొక్కిసలాడిండ్లు — వీరయ్య గొంతెత్తిండు.

“అగజానన పద్మార్కం….” రాగం తీగలాగా సాగుతోంది. ఆ రాగం ఇల్లిల్లు దిర్గింది…

జనాలు ఒక్కొక్కరే సంచి బొంతలు, ఈతసాపలు బట్టుకొని మూడు పానాదుల కాడికి రాసాగిండ్లు – కాసేపటికి మూడు పానాదుల కాడ వీరయ్య, దమ్మయ్య సుట్టు జనం నిండిపోయిండ్లు…. ఆఖరున సుంకరోడు కుర్చీ మోసు కొచ్చిండు. నారాయణ రావొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

జనంలో గుసగుసలు…

“ఒరే అన్నా! కుంటి, గులాపు కాపులు, పెర్కలు, గొల్ల, సాకలి, మంగలి సబ్బండ వర్నాలు వచ్చినట్టే – ఇగ కథ మొదలు బెట్టు….” దమ్మయ్య చిత్రమైన హాస్యంతో.

“వొరే అందరచ్చిండ్లంటవు అక్కలాలా! సెల్లెండ్లాలా! తల్లులాలా! తండ్రులారా! మాకు పిడికెడు బువ్వబెట్టి పాడుమన్నరు. పాడ్తన్నమ్… ఏంకథ చెప్పుమంటవ్….?”

“ఎల్లికి మల్లి బుట్టిందని మల్లికి ఎల్లి బుట్టిందని సెప్పేటిదే సెప్పరాదు…..”

“వారీ! నేం జెప్పేకతలు అట్లుంటయనారా?”

“కోప్పడకు నేనంటలేను మందంటండ్లు -”

“ఊరి దొరవారు దేవయ్య కత సెప్పుమన్నడు.”

“సెప్పేదేదో సెప్పరాదు.” మందిలనుంచి –

వీరయ్య గొంతు సవరించుకున్నాడు. వీణ మీటిండు గజ్జెలూపిండు….

“అరె పెద్ద పెల్లిలో ఉత్తరాదిన –

పేరెన్నికగల పల్లే – నాయనా!” కంఠం ఖంగుమంది.

ఇట్లా కథ మొదలయ్యింది. ఊరు ఎక్కడున్నదో – ఊరు ఎంత సుందరంగా ఉన్నదో చెప్పుకొచ్చిండు. ఊళ్లె బతికే వివిధ వృత్తులవారి గురించి చెప్పుకొచ్చిండు. అందులో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులగురించి చెప్పుకొచ్చిండు – వారిద్దరికి పుట్టిన రెండవ కొడుకే దేవయ్య. దేవయ్య పసితనంలో ఆటలు – చెప్పుకొచ్చాడు.

కథ సాగుతోంది. మధ్యమధ్యలో దమ్మయ్య పిట్టకతలు చెప్పి జనాన్ని నవ్విస్తున్నాడు – రామయ్య రైతు! అతను భూమికోసం పడే తిప్పలు – దేవయ్య పెద్ద చదువుల కోసం తాలూకాకు బోవడం – అక్కడ చదువు.

ఇది ఇట్లా ఉండంగ – జంజెర్ల రాయమల్లు అనే మాదిగవాని జీవితం – అతనికి కొడుకు పుడుతాడు. తల సవరు లేదు – దగ్గర్లో ఉన్న అడివికి పోయి కట్టెలు తెచ్చి తాలూకాలో అమ్మి నూనె తెద్దామనుకుంటాడు. అడవిలోకి చౌకీదారొస్తాడు…. అడవిలో కర్రలు తెచ్చావని ఝాడిచ్చి పురుషాలమీద తంతాడు.

“అరె – గిలగిల తన్నుక తన్నుక
పానం ఒదిలిండా…..” అంటూ అతి హృదయవిదారకంగా వర్ణించాడు… చౌకీదారు అడవి కట్టె అమ్ముకొని జిల్లాల పెద్ద బంగుళ కట్టినట్టు చెప్పాడు….

అది తెలిసిన సదువుకునే పిల్లలు అన్యాయమన్నారు. సచ్చిన రాయమల్లు, శవాన్ని పెట్టుకొని జనం ఊరేగింపు తీశారు… అందులో దేవయ్య ఉన్నాడు…

ఆ తరువాత దేవయ్య మీద కేసులు బెట్టడం పోలీసులు కొట్టడం…. దేవయ్య బేల్ (జామీను) మీద విడుదల కావడం… కథ అందరికి తెలిసిందే –

“ఆపుండ్లిరా?” నారాయణరావు గర్జించాడు – దమ్మయ్య బుర్రాగింది – వీరయ్య వీణ ఆగింది. రాగ మాగింది…

“మీరు పాడేది గిదా! నీతల్లి – పోలీసోల్ల పిలిపిచ్చి….” నారాయణరావు తిడుతున్నాడు….

నిశబ్దం – నారాయణరావు చెప్పులు తొడుక్కున్నాడు…. సుంకరోడు తట్టు కుర్చీ మలిసిండు…. ఇద్దరు సుంకరోల్లు తక్తు బల్ల ఎత్తుకున్నరు… నారాయణరావు కోపంతో విసవిస వెళ్లిపోయాడు.

అంతలోనే జనంలో కలకలం… “ఈరయ్య, దమ్మయ్య కథాపకుండ్లి – చెప్పుండ్లి” అన్నారు…

ఎవరోపోయి పెద్ద బండి తెచ్చి పెట్టిండ్లు –

వీరయ్య, దమ్మయ్య బండి మీద కూర్చున్నారు. మళ్ళీ రాగం సాగింది –

అమరుడు దేవయ్య పేరు దేవేందర్ రెడ్డి అయ్యింది. సదువు విడిచి పెట్టి సంఘాలు బెట్టిండు. దేవేందర్ రెడ్డి గురించి దమ్మయ్య పిట్టకతలు చెప్పిండు… కథ మాంచి ఊపుమీద సాగింది.

తెల్లారే సుక్క పొడిచేదాక కథ సాగింది. జనం ఏడ్చిండ్లు, నవ్విండ్లు, పండ్లు గొరికిండ్లు, పిడికిల్లు బిగించిండ్లు –

కథయి పోయింది…

కరంటు లైన్మెన్ రాజయ్య వీరయ్యను కౌగలించుకున్నాడు…. వీరయ్య కండ్ల పొంట నీళ్లు. జనం వాళ్లిద్దరి చుట్టూ చేరి…

అప్పటికప్పుడు తోచినంత తలాకొంత జమ చేసిండు. యాభయి రూపాయలైనాయి…

“బిడ్డా! మంది కత సెప్పుండ్లి – మీకు బువ్వ కరువుండది-” అన్నాడో ముసలోడు…

నారాయణరావు పాడుబడిన ఇండ్లల్లో కాలుగాలిన పిల్లోలె…. నిప్పుతొక్కిన కోతోలె ఎగురుతూనే ఉన్నాడు….

సుంకరోలిద్దరు మల్ల కథకాడికచ్చి కథవిన్న సంగతి నారాయణరావుకు తెలియదు.

(సృజన మాస పత్రిక మే, జూన్ 1982)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply