ప్రభా అని మిత్ర బృందం చేత పిలవబడే ప్రభాకర్ రావు యుద్ధం మాట వింటే చాలు ఉడుకుతున్న నీటి తపేలా మీద మూతలాగా గడగడలాడిపోతున్నాడు. కారణం ప్రస్తుతం జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుధ్ధ పరిణామాలు. స్థితప్రజ్ఞుడే కాని, ఈ యుద్ధంతో అతనికి కాస్త స్థిమితం తప్పింది. మూడో ప్రపంచ యుధ్ధం తప్పదని, అదే జరిగితే భూమే వుండదని ప్రభాకర్ తనకు తానే నొక్కి వక్కాణించి, ఒక్కండు, ఒక్కండును నీ మొర ఆలకింపడు అని పద్యాలు పాడి మరీ మనసును కంట్రోల్ చేసుకునే సాధన చేస్తున్నాడు. అయినా మనసు కదా, అతని మాట అదెందుకు వింటుంది. ప్రభాకర్ ని మరింత యుధ్ధ భయోత్పాతం వైపు నడిపించి తమాషా చూస్తోంది.
ఆ క్రమంలో రంగ ప్రవేశం చేసింది టీవీ. యుద్ధం పట్ల ప్రభాకర్ కి ఉన్న కోపం.. విచారం.. అసహనం.. అశాంతి.. గందరగోళం ఇంకా అనేకానేక సైడెఫ్ట్స్ ని పదింతలు చేసింది టీవీ. దీంతో ప్రభాకర్ కు యుద్ధం మీద కోపం టీవీ మీదకి మళ్లింది. అది రాను రాను కట్టలు తెంచుకుని ఆ బుల్లి స్క్రీన్ ని చించి చెండాడాలన్నంత రేంజిలో ప్రకోపించింది. . యుద్ధ వార్తల కంటే ఛానల్ వాళ్ళు చేసే యుద్ధ భీభత్సం ఎక్కువ. అసలు సైనికుల కంటే తమ ఛానల్ రిపోర్టర్లే ప్రాణాలకు తెగించి వార్తలందిస్తున్నారని ఒకటే ఊదరగొడుతున్నారు. అదిగో బాంబు పడింది..ఇదిగో యుధ్ధ విమానం నా పక్కనుంచే వెళ్ళిందని సదరు రిపోర్టర్లు వాయింపుడు. అసలే వార్ ఫోబియాతో చివికి చిక్కిపోతున్న ప్రభాకర్ కి ఇలాంటివి చూసి చూసి రోత పుట్టింది. ఒకానొక ప్రశాంత ఉదయ వేళ, స్ట్రాంగ్ కాఫీ తాగుతూ, అసలు యుద్ధ వార్తలు చూడకూడదు అని, ఒకానొక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏం చేసినా అతని ఫ్రెండ్ రాజారావుకి చెప్తాడు.
“మా భలే పని చేవుశారా. నేను కూడా అదే పని చేయాలి. చిరాకు దొబ్బుతుంది.”
ఒరే ఆగరా రాజా. నేను చేసిన పని మంచిదే కానీ, మా టీవీ చేసిన పనేం బాగోలేదురా.
“అదేం చేసింది ప్రభా, అసలే నోరు లేనిది.”
“నోరు లేనిదా? నా మీద కుట్ర పన్నిందిరా బాబూ. నేను తీసుకున్న నిర్ణయం దానికి నచ్చలేదల్లే వుంది. నేను ఏ ఛానల్ పెట్టినా యుద్ధమే కనపడేలా చాలా వ్యూహాత్మకంగా ఇంటర్నల్ సాఫ్ట్ వేర్ మార్చేసింది. . పాటల ప్రోగ్రాం పెడితే యుద్ధం పాటలు. సినిమాల ఛానల్ పెడితే యుద్ధం సినిమాలు.. కార్టూన్ ఛానల్ పెడితే అక్కడా డిష్షుం డిష్షుం యుద్ధమే. బాంబులు..మిసైళ్ళు..విమానాలు..టాంకులు…ఇదే గోల. ఏం చేయాలో బుర్ర పనిచేయట్లేదురా రాజా. పోనీ ఏ డిస్కవరీ ఛానలో తిప్పితే, వాటీజ్ వార్, వారీజ్ వాట్ అంటా ప్రపంచంలో జరిగిన యుద్ధాల చిట్టా విప్పి తాట తీసి మరీ, నన్నొక ఆట ఆడుకుంటోందిరా నాయనా.”
“ఇదేదో వింత రోగమే పట్టిందిరా నీ టీవీకి. ఎవరికైనా చూయించకపోయావా?”
“చూపించాన్రా… ఎవడొచ్చినా వాడున్నంత సేపూ ఏమెరగనట్టు వుంటుది. వాడు వెళ్ళాక చూస్తే వచ్చిన టెక్నీషియనే యాంకర్ గా టీవీలో కనిపిస్తాడు. ఉక్రెయిన్ లో యుద్ధం.. ప్రపంచ శాంతికి శ్రాద్ధం.. ఇలా చెత్త చెత్త పదబంధాల ప్రాసాలంకారాలతో నా చిన్ని మెదడు మీద అంమాంతం దాడి చేస్తాడు.”
రాజారావుకి ఏదో తేడా కొడుతోంది. నమ్మబుద్ధికావడం లేదు. ‘ఒకసారి మా ఇంటికొచ్చి మా టీవీ చూడు. అప్పుడు ఆలోచిద్దాం’ అన్నాడు.
అలాగే అనుకుంటూ రాజా ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేసి చూశారు.
ఆశ్చర్యం… అక్కడ టీవీలో కూడా వార్ విజువల్స్… వార్ న్యూస్… వార్ సాంగ్స్… అంతా బ్రేకింగ్… బ్రేకింగ్…
రాజారావు ఎగిరిపడ్డాడు.
“ఒరే.. రాత్రి కూడా ప్రైమ్ లో మాంచి సినిమా చూసి, నెట్ ఫ్లిక్స్ లో కొత్త సీరియల్ చూసి, ఆహా పెట్టి హాయిగా నిద్రపోయాను కదరా..ఇదేంట్రా బాబూ నీది ఐరన్ లెగ్ లాగుంది. మా టీవీకి కూడా యుద్ధ రోగం పట్టుకుంది.”
“ఒరే రాజుగా నేను చెబితే నమ్మలేదు కదరా. అందరి టీవీలకీ ఇదే జబ్బు వచ్చి వుంటుంది. ఎవడూ పైకి చెప్పడం లేదు. చెప్తే పక్కనోళ్ళు ఇంటికి రానివ్వరని ఎవడి బిల్డప్ లు వాళ్ళవిరా బాబూ. ఒరే నువ్వు నమ్మితే నమ్ము లేకుంటే లేదు. ఇది మనుషులకు కరోనా వైరస్ వచ్చినట్టు, టీవీలకి వార్ వైరస్ సోకిందేమోరా. గ్యారంటీగా అంతే. కావాలంటే వర్మగాడింటికి పోయి చూద్దాం నడు.”
ప్రభాకర్ మాటలకి కొంత తేరుకున్నాడు రాజా. ఓకే అంటే ఓకే అనుకుని వర్మ దగ్గరికి వెళ్ళారు. కాలింగ్ బెల్ నొక్కారు. వర్మ భార్య ఊరెళ్ళింది. తీరిగ్గా మాంచి మసాలా సినిమా చూస్తుండగా ఈ కాలింగ్ బెల్. ‘ఓరోరి మీరేట్రా..ఏవిటీవేళప్పుడు దయచేసేరు?’
‘ఏమీ లేదు గానీ ఏదైనా ఒక ఛానల్ పెట్టు చూద్దాం.’
‘ఓసంతేనా. చూడండి’ అని వెంటనే టీవీ ఆన్ చేశాడు. అంతకు ముందు చూసిన ఛానల్ ఓపెన్ అయ్యింది. నాలుక్కరుచుకున్నాడు. కానీ సీన్లు మారాయి. అక్కడిప్పుడు యుద్ధంలో పరాజితుల భార్యల మీద విజేతల సైనికులు సాగిస్తున్న పైశాచిక లైంగిక దాడులు టెలికాస్టవుతున్నాయి. వర్మ అదిరిపోయి కుర్చీలోంచి ఎగిరి కిందపడ్డాడు.
ఒరే మీకు దండం పెడతాను. నేను చూసింది ఇది కాదురా నాయనా. అంటూ వర్మ అటూ ఇటూ అనేక ఛానల్సు మార్చి మార్చి చూశాడు. ఎటు చూసినా యుద్ధ దృశ్యాలే. ప్రభా, రాజా జరిగిందంతా వర్మకి పూస గుచ్చినట్టు చెప్పారు. ‘మరేం చేద్దామంటార్రా ఇప్పుడు?’ వర్మ అమాయకంగా అడిగాడు.
ముందు ఇళ్ళల్లో చూద్దామని, కొన్ని చోట్ల అనధికారికంగా, కొన్ని చోట్ల అధికారికంగా టీవీలు తనిఖీలు చేసేరు. అంతటా ఇదే వరస. వార్ వైరస్ పూర్తిగా టీవీలను వ్యాపించింది. ఎందుకైనా మంచిది, ఏదైనా టీవీ స్టూడియోకి పోయి చూసొద్దాం అనుకుని టీవీ 009 కి వెళ్ళారు. అక్కడ సీను చూసిన ముగ్గురూ మూర్ఛపోయి ఎప్పుడు తేరుకున్నారో తెలియదు. తెప్పరిల్లాక తీరుబడిగా స్టూడియోలో జరిగిందంతా గుర్తు చేసుకున్నారు.
ముందు మెయిన్ డెస్క్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ కంటెంట్ రైటర్స్,ఎడిటర్సు, అందరూ సిస్టమ్స్ లో వార్ గేమ్స్ ఆడుకుంటున్నారు. యాంకర్లు, వాయిసోవర్ ఆర్టిస్టులు యుద్ధ వార్తల్ని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. మెయిన్ స్టూడియో రౌండ్ టేబుల్ దగ్గర మెగా డిస్కషన్ నడుస్తోంది. చర్చలో పాల్గొన్న వారంతా మెషిన్ గన్స్ పట్టుకున్నారు. యాంకర్ ముందు ఏకంగా ఒక పెద్ద వార్ ట్యాంకే వుంది. ఎవరైనా రెచ్చిపోతున్నారనుకున్నప్పుడు ఆ యాంకర్, టాంక్ ని అటు వైపు తిప్పుతుంది. అయినా వాళ్ళని ఆపడం ఆమె వల్ల కావడం లేదు. ఇంతలో ఒక గెస్ట్, జేబులోంచి చిన్న ఉండలాంటిది తీసి ‘నా దగ్గర అణు బాంబు వుంది, చరిత్రలో మీరు కనీవినీ ఎరగని పరిణామాలుంటాయ్ ఖబడ్దార్’ అన్నాడు. ఎవరూ బెదరిపోలేదు. నా దగ్గరుందంటే నా దగ్గరుందని అందరూ జేబుల్లోంచి అణుబాంబులు తీశారు. గెస్టులంతా చేతుల్లో బాంబులు పట్టుకున్నారు. యాంకర్ మాయమైంది. టేబుల్ కింద కూర్చుని తీరుబడిగా సెల్ చూసుకుంటూ నవ్వుకుంటోంది. ఇక అక్కడ మిషన్ గన్ మోతలు..బాంబుల మోతలు ఢాం..ఢాంఢాం..ఢాంఢాంఢాం. ఇంత జరుగుతున్నా ఎవరికీ చీమ కుట్టినట్టు లేదు. మేకప్ రూంలో అందరూ ఆయుధాలకి మేకప్ వేస్తున్నారు. ఇన్ పుట్ సెక్షన్ లో వార్ ఫీల్డ్ లో ఉన్న తమ రిపోర్టర్లకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. “ అసలు సైనికులు మీరే. డెడ్ బాడీ నుంచి వార్ ఫ్లైట్ దాకా ఒక్క విజువల్ మిస్ కాకూడదు. లీడర్ నుంచి సోల్జర్ దాకా ఒక్క కామెంట్ చేజారకూడదు. కమాన్ కమాన్ ! ప్రాణాలకు తెగించి సైనికులు తమ దేశ విజయం కోసం పోరాడుతున్నారు. మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి మన టీవీ టీయార్పీని విజయాకాశంలో నిలబెడుతున్నారు.”
ఈ గొడవేమీ అర్థం కాని ఆ ముగ్గురూ సి.ఈ.ఓ.సింగినాథ శర్మ ఉన్న క్యాబిన్ వైపు వెళ్ళారు. ఆ క్యాబిన్ కి అటాచ్డ్ గా ఒక మినీ హాలు వుంటుంది. దాని పేరు వార్ రూం. అక్కడ అన్ని డిపార్ట్ మెంట్ హెడ్స్ ని కూర్చోబెట్టి , వారి తలకాయల మీద మిగిలిన తలాకాస్త వెంట్రుకలన్నీ కలిపి ఒక తాడుతో కట్టి అది తన చేత్తో పట్టుకున్నాడు సింగినాథ శర్మ. తన రివాల్వింగ్ చైర్ వెనక గోడ మీద స్క్రీన్ ఆన్ చేసి, టీయార్పీ వార్ గేమ్ ఎలా ఆడాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. మధ్య మధ్యలో తాడు లాగుతున్నాడు. అప్పుడు ఆ హెడ్స్ అన్నీ ఒకటికొకటి ఢీకొడుతూ ఊకొడుతున్నాయి. “ రన్నింగే ఛానల్ ఈజ్ మోర్ దేన్ రన్నింగే వార్. ప్లాన్,స్ట్రాటజీ, వర్క్ సైకాలజీ,ఫిలాసఫీ, డివోషన్,డెడికేషన్ (తొక్క, తోటకూర అంటూ హెడ్స్ లోపల్లోపలే వంతపాడగా)” ఇలా ఏవో హూంకరిస్తున్నాడు సీయీవో.
“చెప్పండి మీ దగ్గరున్న ప్లాన్లేంటి చెప్పండి. పక్క బిల్డింగ్ మీద బాంబు పడింది. మీరేం చేస్తారు చెప్పండి కమాన్ ..మీ దగ్గర ఏం ప్లాన్ లేదు. అందుకే మీ తలకాయలన్నీ ఒక తాడుతో కట్టేశాను. ఒక బ్రేకింగ్ ప్లేట్ తిరగేసి బోర్లేసి, చిలకలాంటి యాంకర్ ని కూర్చోబెట్టి చిలకపలుకులు చెప్పిస్తారంతేగా. నాకు తెలుసు. మీ బుర్రల్లో స్టఫ్ లేదు. వాటి కంటే స్టఫ్డ్ పీతలు బెటర్.(ఆయన వాటిని లొట్టలేసుకు తింటాడు) నేను ఛానల్ పెట్టకపోతే మీరు బఠానీలమ్ముకోడానికి బస్టాండుల్లో కూడా ఎంట్రీ దొరికేది కాదు.” ఇలా సీయీవో తెగ చెలరేగిపోతుంటే నిజంగానే బాంబు శబ్దం వినిపించింది. రూంలోకి పొగ వచ్చింది. అందరూ కళ్లు నులుముకుని చూసారు. సీయీవో ఒక్క ఛలాంగుతో గల్లంతు.. గాయబ్..డిస్పరేటెడ్లీ డిజప్పియర్డ్. ఆయన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బంకర్లోకి దూరిపోయాడన్న మాట. సీయీవో ప్లానింగ్ కెపాసిటీ అర్థమైన హెడ్స్ అంతా సైలెంట్ స్మైల్స్ తో హ్యాట్సాఫ్ బాస్ అని అరుస్తూ తమ తమ డబ్బాల్లాంటి క్యాబిన్ల వైపు వెళ్ళి పోయారు.
“ఒరే బాబాయ్ మనం ఇంకాసేపు ఇక్కడుంటే పిచ్చ లేసి మానవ బాంబుల్లా మారిపోయినా ఆశ్చర్యం లేదు పోదాం పదండి” అని వర్మ కంగారు పెట్టాడు.సరే అంటే సరే అనుకుని ముగ్గురూ వాళ్ళ కాలనీకి వెళ్ళి, ఒక మర్రి చెట్టు కింద కూలబడి యుద్ధము..శాంతి అనబడే బృహత్తర టాపిక్ మీద చర్చ మొదలు పెట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా కాశ్మీరు లోయంత లోతుగా, హిమగిరి శిఖరమంత ఎత్తుగా కిందా మీదా పడి, వారు ఒక విషయాన్ని తేల్చిపారేసేరు. ఏమిటంటే, యుద్ధం అనివార్యం అని. మానవుడు ఏమాత్రం మాన్యుఫేక్చిరింగ్ డిజైన్ మార్చడానికి అనువుగా లేనంత భస్మారుడైపోయాడని వారు ఫైనల్ గా డిసైడయ్యారు. అనగా భూమి సర్వనాశనం ఏ రేంజిలో వుంటుందో చూడ్డానికి ఒక్క మానవుడూ మిగిలి చావడని అన్న మాట.
మరైతే ఏం చేద్దామని రాజారావుని చూస్తూ వర్మ, ప్రభాకర్ ని అడిగాడు..
“ఏం లేదురా. దేవుడనే వాడున్నాడు కదా. వాడు అన్నీ చూస్తున్నాడు కదా. ఆయనగారికి ఒక అర్జీ పెట్టుకుంటే పోలేదా..? ఈ యుధ్ధాలు అవీ లేకుండా చేయమని. ఆ మాత్రం భూమి కోసం చేయలేడా ఏమిటి?”
ప్రభాకర్ చెప్తుంటే వర్మా, రాజా అలాగే నవ్వుతూ చూస్తున్నారు. దైవ భక్తిలో ముగ్గురికి ముగ్గురే.
“అది సరే గాని, ప్రభా, ఏ దేవుడికి అర్జీ పెడదామంటావూ? యుద్ధం విషయంలో దేవుళ్ళకే ఒక ఏకాభిప్రాయం లేదు కదరా అబ్బాయ్. ఒకాయన చెంపకి చెంప చూపించమంటాడా? మరొకాయన ఒక చెంపకి ఒక చెంప మాత్రమే తీసుకోమంటాడా? ఇంకొకాయన ఏ చెంపా నీది కాదు, వాయించడమే నీవంతు అంటాడా? వీరిలో ఏ దేవుడికి అర్జీ ఏమని పెడదాం చెప్పు?”
వర్మ మాటలు విని, ఇదేదో ఆలోచించాల్సిన పాయింటేరా ప్రభా అని గమ్మునున్నాడు రాజా.
“ఈ భూమి నాశనం అయిన తర్వాత మరో భూమిని సృష్టించాల్సిన బాధ్యత దేవుళ్ళ మీదైతే వుంది కదా?” ప్రభాకర్ తగ్గేదే లే అన్నట్టున్నాడు.
“సృష్టి లేకుంటే ముఖ్యంగా ఈ భూమి అనేది వుంది చూశారూ అది లేకుంటే, దేవుళ్ళకి ఇంక పనేం వుంటుంది చెప్పు? స్వర్గం..నరకం..లాంటివి కూడా ఖాళీ అయిపోవూ? అప్పుడు దేవుళ్లకి ఆటా పాటా పోయి..విందులూ పొందులూ కరువై..పిల్లాజల్లా లేక దేవ లోకం అయోమయమైపోదూ. అందుకే సృష్టి విలాసం దేవుళ్ళకి అత్యవసర కార్యం. సో..మై పాయింట్ ఈజ్..మళ్ళీ తిరిగి ఈ భూమిని సృష్టించేటప్పుడు ముందు జరిగిన తప్పులు లేకుండా చూసుకోమని దేవుడికి అర్జీ పెడదాం.”
ప్రభాకర్ చెప్పిన ఈ పాయింటు దగ్గర ముగ్గురూ ఏకాభిప్రాయానికి వచ్చారు. దేవుడికి అర్జీ రాసే కార్యక్రమాన్ని రాత్రికి పోస్టుపోన్ చేసి ఎవరింటికి వారు వెళ్ళి తీరుబడిగా డిన్నర్ తర్వాత వర్మ ఇంట్లో ముగ్గురూ కూర్చున్నారు. సిస్టం ఆన్ చేసి టైప్ చేయడానికి రాజా సిద్ధంగా వున్నాడు. కూర్చోవడం అయితే కూర్చున్నారు గానీ, ఎలాంటి భూగోళాన్ని సృష్టించాలనే విషయం మీద ముగ్గురికీ ఒక్క పాయింటు దగ్గరా కుదిరి చావడం లేదు. భూమి ఆకారం దగ్గరే గంటల తరబడి చర్చ నడిచింది. అది కాస్తా రచ్చగా మారి ఎవరి జుట్టు వారు కాక, ఒకరి జుట్టు ఒకరు పీక్కునే దాకా సాగింది. అదీ కాదు, ఇదీ కాదని చివరికి ఒక సింగిల్ లైన్ ప్లీ అనగా ఒక ఏక వాక్య అర్జీని తయారు చేశారు. అదేమంటే…
“భగవంతుడా భూమిని మీరు ఎలా సృష్టించినా, మనుషుల్ని మీరు ఎలా తయారు చేసినా, యుద్ధాలు జరగని భూమిని నిర్మించాలి ప్రభూ” అని వారు వేడుకున్నారు. యుద్ధాలు లేకుంటే ఆయుధాల అవసరం రాదు.ఆయుధాలు లేకుంటే సైనికుల పనే ఉండదు.సైనికులే లేకుంటే సరిహద్దుల ఊసే వుండదు. సరిహద్దులే లేకుంటే, పాస్ పోర్టులు,వీసాలు,ఎంబసీల ఉనికే వుండదు. ఇక మనుషులు విమానాల కంటే వేగంగా, పక్షుల కంటే స్వేచ్ఛగా ఎటు నుంచి ఎటైనా ఎగురుతారు. ఇకప్పుడు దేశాల్లో ఆయుధాల గుట్టల స్థానంలో సంపద, గుట్టలు గుట్టలుగా పోగుపడిపోతుంది. అప్పుడు భాషలు… రంగులు… జాతులు… మతాలు… సంస్కృతులు వగైరా వగైరా అన్నీ మిక్స్ అయిపోయి ఎల్ల లోకము ఒక్క ఇల్లైపోతుంది. ఆ క్రమంలో రాజ్యమూ రాజ్యాంగమూ లేని భూమ్మీద ప్రేమ సువాసనలు సోకి ఇతర గ్రహాంతర వాసులు చుట్టాలుగా వచ్చి చూసిపోతుంటారు. ఇలా ఆలోచిస్తేనే ఆ ముగ్గురూ ఒకటే మురిసిపోయారు… “కేవలం యుద్ధం లేకపోతే భూమి స్వర్గమే కదరా, అంటే యుద్ధం సైతానన్న మాట.” అనుకుని ముగ్గురూ పరమానందభరితులై జన్మ చరితార్థమైనట్టు ఫీలయ్యారు.
దీంతో పాటు ఒక్క మాట మీద ముగ్గురూ ఒక పర్సనల్ అర్జీ కూడా పెట్టుకున్నారు. వాళ్ళ ఊళ్ళు మాత్రం యధాతథంగా ఎక్కడున్నాయో అక్కడే వుంచాలని, ఎప్పుడైనా తాము ఏ ఆత్మల రూపంలోనో భూమికి విచ్చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా వుంటుందని వారు కోరుకున్నారు.
రాయడమైతే రాశారు కానీ దాన్ని ఎవరి ద్వారా దేవుళ్ళకి పంపాలా అన్న ధర్మ సందేహంలో పడిపోయారు. పాలకులను,కార్పొరేట్లను రెండు కళ్ళతో కటాక్షించే స్వామీజీల జోలికి పోవద్దని కఠినంగా అనుకున్నారు.
“దేవుడికి మన అర్జీ చేరేవేసే అసలు సిసలు పోస్టు మేన్ వుంటాడు. కానీ నేనే దేవుడి వార్తాహరుణ్ణి అని ఆయన చెప్పుకోడు. అలాంటి సాధు జీవి ఏ హిమాలయాల్లోనో అడవుల్లోనో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ వుంటాడు. ఆయన్ని పట్టుకుందాం పదండి” అని ప్రభాకర్ చాలా నమ్మకంగా అనే సరికి వర్మ, రాజా ఇద్దరూ కంగారుపడ్డారు.
ఏంటి? మనం ఇప్పుడు హిమాలయాలకు పోవాలంటావా? మా వల్ల కాదురా అబ్బాయ్. ముగ్గురం సంతకాలు పెట్టాం. ఫోన్ నెంబర్లు, అడ్రస్సులూ కింద రాశాం. ఇక నీ ఇష్టం. వర్మ, రాజా ఇద్దరూ ఖరాఖండిగా చెప్పేసారు. ప్రభాకర్ ఒక్కడే తీర్థయాత్రలకు పోయి వస్తానని ఇంట్లో చెప్పి బయలు దేరాడు. ప్రభాకర్ కు ఈ ప్రపంచంలో కొందరు గొప్ప వ్యక్తులుంటారని, వారు భగవంతుడితో నిత్యం అనుసంధానమై వుంటారని ప్రగాఢ నమ్మకం. కొండలు..అరణ్యాలు..ఆశ్రమాలు తిరగడం అతనికి అలవాటే. అనేక ప్రాంతాలు తిరిగి తిరిగి ఎక్కడో నేపాల్ లో హిమాలయాల దగ్గర ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న ఒక రుషి చేతుల్లో సీలు చేసిన కవరు పెట్టి, అంతా ఆయనకు వివరించి వెనక్కి చూడకుండా వచ్చేశాడు ప్రభాకర్.
సీన్ కట్ జేస్తే…
ఇప్పటిదాకా మీరు చదివిందంతా జరిగింది కాదని, అది ప్రభాకర్ అనే వ్యక్తికి వచ్చిన కల అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదే విషయాన్ని ప్రభాకర్ తన దోస్తులు రాజారావుకి, వర్మకి వినిపించాడు. అదిగో పొట్ట పగిలేట్టు ముగ్గురూ నవ్వుకుంటున్నారు చూడండి.
“భలేటోడివే ప్రభా..ఇందులో కలేముంది? ఆ పరిస్థితి వస్తే నువ్వు నిజంగానే తీర్థయాత్రలకి బయలుదేరతావు.” రాజా జోక్ చేసినట్టే అన్నాడు కానీ సీరియస్ గానే వుంది టోన్.
‘నిజమే అంతటి ఘనుడే మన ప్రభాకర్ ’ వర్మ ముక్తాయింపు ఇచ్చాడు. ఇంతలో ముగ్గురి సెల్ ఫోన్లూ ఒకే సారి మోగాయి. ముగ్గురికీ అన్ నోన్ నెంబర్ల నుంచే ఫోన్ వచ్చింది. ఎవరి ఫోన్ వారు పట్టుకుని ముగ్గురూ మూడు వైపులకు వెళ్ళారు. విషయం ఏమిటంటే ముగ్గురికీ ముగ్గురు దేవుళ్ళ నించీ ఫోన్ వచ్చింది. మీరు పంపిన అర్జీ అందిందని, కొత్త సృష్టి అవసరపడినప్పుడు అప్పటికప్పుడు తడుముకోకుండా ఇప్పటినుంచే దాని మీద కసరత్తు ప్రారంభించడం మంచిదని తాము గ్రహించామని, నిపుణులతో కమిటీలు వేశామని, మీ కోరిక తప్పక నెరవేరుతుందని, ఇంతటి బాధ్యతతో మాకు మీరు విలువైన సలహాలిచ్చినందుకు ధన్యవాదాలని ఆ ఫోన్ల సారాంశం.
సెల్ కట్ అయిన తర్వాత ముగ్గురూ ఒక చోటకి చేరి, ఒకరినొకరు తదేకంగా చూసుకున్నారు.
ఇంతకీ ఇది కలా నిజమా..? వర్మతో పాటు అదే డౌటు రాజారావు కూడా వ్యక్తం చేశాడు.
‘ఇది మాత్రం నిజమే.’ ప్రభాకర్ ఆన్సర్.
“మరి ఈ ఫోన్ల సంగతేంటి ప్రభా?” రాజా, వర్మ ఏక కంఠంతో గద్దించారు.
‘ఫోన్లు కల కావొచ్చు,’ ప్రభాకర్ బుర్ర గోక్కున్నాడు.
“అయితే మనం నిజమా..కలా..?” వర్మ, రాజా కంఠాలు పెరిగాయి.
“మనం నిజమే.” ప్రభాకర్ ధీమా కూడా పెరిగింది.
వర్మ, రాజా ఇద్దరూ ఏదో కూడబలుక్కోని ‘మమ్మల్నింత ఎర్రిపప్పల కింద జమకట్టేవేంట్రా’ అని ఆ పక్కనే ఏవో కర్రలుంటే తలొకటి తీసుకుని ప్రభాకర్ మీద పడ్డారు. ప్రభాకర్, ‘నేను చెప్పేది నిజం, నమ్మండ్రా’ అంటున్నా వినడం లేదు. తాను కూడా కర్ర తీసుకుంటే గానీ కుదిరేలా లేదని ప్రభాకర్ వారి మీద ఎదురు తిరిగాడు. ముగ్గురూ ఒకరినొకరు ఎదుటి వారి పుట్టుపూర్వోత్తరాల నుంచి మొదలు పెట్టి ఒకరి బండారాలను ఒకరు బయట పెట్టి అక్కడికక్కడే ఒక వార్ జోన్ క్రియేట్ చేశారు. ఒకరి మీద ఒకరు నమ్మకం లేకుండా ముప్పయ్యేళ్ళు సావాసం అప్రతిహతంగా కొనసాగించినందుకు యుద్ధం వారిని చూసి నవ్వింది. చొక్కాలు చించుకుని, రక్తాలు కార్చుకుని ఇళ్ళకు వెళ్లారు. ఏంటంటే ‘యుద్ధం… యుద్ధం… యుద్ధం’ అని భార్యల మీద అరిచారు.
మనుషుల్లోని అపనమ్మకం అనైక్యత అభద్రతా భావం వలన మిత్తులైనా కొట్టుకు చచ్చే తత్వం దేశాల మధ్య కూడా వచ్చి యుద్ధాలు పుడుతున్న తీరును satiricalగా బాగా చెప్పారు సర్. పతంజలి గారు గుర్తొచ్చారు..