ఔకాద్

నిజమే
నన్ను నేనెపుడూ నిర్వచించుకోలేదు!
ప్రతిక్షణం ..తేరి ఔకాద్ క్యాహై?
అని ఇంటా బయటా చేసే
అవమానాల నడుమా
నన్ను నేను నిర్వచించుకోలేదు!
డెబ్బైల మహిళల పోరాట చరిత్ర
నేనెపుడూ చదవలేదు
ఎన్నెన్ని అన్యాయాలకు గురయినా
నా చేతిలో తూణీరాలను గురిపెట్టలేదు!
వారియర్ అంటే నువ్వేనని
ముద్రలేసుకున్న నువ్వు
ఇవాళ హఠాత్ గా
నినాదమై శబ్దిస్తున్న నన్ను
ఆశర్య పడి చూస్తున్నవు!
నేను అమ్మ లోపల ఉన్నప్పుడే
ఉనికి కోసం యుద్ధం చేయడం నేర్చుకున్న దాన్ని!
అమ్మల గర్భాశయాలే …
బిడ్డల మొదటి యుద్ధ మైదానాలు!
కాళ్ళ కింద నేల కదులుతుంటే
నిన్ను కన్న దాన్ని….. యుద్దాన్నీ కనలేనా?

( షాహీన్ బాగ్ మహిళల కోసం… )

కవయిత్రి, కథా రచయిత. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'ముస్లింవాద కవిత్వం - వస్తు రూప వైవిధ్యం'పై (ఎం.ఫిల్), 'తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై' (పీహెచ్ డీ) పరిశోధన చేశారు. రచనలు: నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం), చాంద్ తార(స్కైబాబతో కలిసి), దర్దీ కవితా సంకలనాలు ప్రచురించారు. అలావా(ముస్లిం సంస్కతి కవిత్వం)కు సహ సంపాదకులుగా ఉన్నారు. పది కథలు, ఎన్నో వ్యాసాలు రాశారు. 'తెలుగులో ముస్లింవాద సాహిత్యం' పుస్తకం రాబోతున్నది.

Leave a Reply