ఓ పుస్తకాన్ని…

ఇంట్లో బియ్యం నిండుకున్నాయి
రేపటికి తినడానికి గింజలు లేవు.
అప్పు తప్పేలా లేదు
కానీ ఎలాగైనా నిన్ను జ్వలింప చేసే
ఓ పుస్తకాన్ని నీకోసం కొనాలి…

పాప పాలన్నీ అయిపోయాయి
ఖాళీ జేబులు నన్ను వెక్కిరిస్తున్నాయి
దాచుకున్న డబ్బులు కూడా
ఎప్పుడో ఖర్చయిపోయాయి.
అయినా సరే
నీ లోపల మహాసముద్రాన్ని పుట్టించే
ఓ ఎర్రటి పుస్తకాన్ని ఎలాగైనా నీకు ఇప్పించాలి…

నా కండ్లద్దాలు కూడా గీతలతో మసకబారిపోయాయి
పగిలిన ఈ అద్దాల్లోనుంచి చూపు సరిగా లేదు.
ఇంకా నన్ను వీడని దారిద్ర్యానికి
ఇదొక సాక్ష్యం…

కానీ…

నీ చుట్టూ నిర్మానుష్య పంజరాన్ని బద్దలు కొట్టే
ఓ నిషేధిత పుస్తకాన్ని తప్పక కొనివ్వాలి నీకు

దేహాన్ని అకస్మాత్తుగా
ఎవరో తోసినట్లు దిగ్భ్రమ కలుగుతుంది
బహుశా నా నెత్తురులో చక్కెర పోగు పడినట్లుంది
పరీక్షించుకొను స్థితికూడా లేదు

అయినా కానీ…

నీ పిడికిలికి మహాబలాన్నిచ్చే
ఓ పుస్తకాన్ని నీకోసం తప్పక కొనాలి

ఔనూ…

పుస్తకాలు మన ఏకాంతంలోని దీపాలు
మన ప్రేమకు నిండైన ప్రతిరూపాలు

Leave a Reply