ఒక వీరుని దార్శనికత

దార్శనికత ఉన్న మనుషుల మాటలు, ఆలోచనలు, ఆచరణలు ఎప్పుడూ గుర్తుకువస్తుంటాయి. వాళ్లెంత కాలం జీవించిపోయారు, ఎంత ఆలోచించారు, ఎన్ని మాటలు చెప్పిపోయారు అనే వాటితో నిమిత్తం లేకుండా. ఆరిద్ర పువ్వు జీవితమే తొలకరికి, వ్యవసాయ జీవితానికి ఆలంబన గనుక అట్లా నేల చాళ్లలోనూ, విత్తనం విస్ఫోటనంలోను ప్రతిఫలిస్తూ ఉంటుంది. నా కొడుకు ఆరిద్ర పువ్వు అన్నది తల్లి ఐలవ్వ అమరుడు వీరాస్వామి ‘ఎన్ కౌంటర్’ తర్వాత ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో. ఆ తల్లి నోట్లో నుంచి ఊడిపడ్డ బిడ్డలా ఉండేవాడు వీరాస్వామి. వొత్తి చివర చమురు చిదిమి దీపం పెట్టినట్లు ఆమె, సందమామ వంటి మొహం, చురుకు చూపులు, సూటియైనవి, మెత్తటివి. నిష్కల్మషమైనవి. నిష్కర్షవి. కాని 1999 మార్చ్ నెలలో చూసిన తర్వాత పరహారేళ్లకు 2015 జనవరిలో కోతుల నడుమకు పోయినపుడు ఆమె ఎట్లా ఉన్నది. ఎస్.సి. (మాదిగ) కాలనీలో ఒకే ఒక్క గదిలో కుక్కి మంచంలో పిడికెడు మనిషి. లేవలేని స్థితి, నవిసి ఉన్నది. శరీరం దుర్గంధం వేస్తున్నది. పిలిస్తే కళ్ళు తెరచి చూసింది. ఊసు కళ్లలోంచి తల్లి కడుపుకోత కన్నీళ్లు ఎండిన శుష్కించిన చెంపలమీద. కాసేపు కూర్చొని తిరిగి వస్తుంటే కూలికిపోయి, నేను వచ్చానని తెలిసి వస్తున్న వీరాస్వామి వదిన కనిపించింది. అన్న డ్రైవర్ కదా. లారీ మీద పనికి పోయాడు. మేము పోయిన సందర్భం సుప్రసిద్ధ రచయిత తాడిగిరి పోతరాజు మరణం. కోతుల నడుమ (హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా)లో ఆయనే రూపొందించిన శాంతినగర్లో ఇంచుమించు పరిపూర్ణ జీవితం గడిపి క్యాన్సర్తో పోయాడు. గుంటూరు జిల్లా నుంచి అరవై ఏళ్ల క్రితమే వచ్చి, తెలంగాణను తన మనశ్శాంతి మాగాణంగా మార్చుకున్న రచయిత. అయితే ఆ తేడా అక్కడ కనిపిస్తున్నది. మేడలు, మిద్దెలు, ఆవరణలు, గడ్డి కప్పులు, పశువులు, తోటలు, సస్యశ్యామలమైన భూములు – కాకతీయ కెనాల్ ఫలాలు పూర్తిగా అనుభవిస్తూ పొందించిన శాంతినగర్. అక్కడ నేను విప్లన రచయిత తాడిగిరి పోతరాజును స్మరిస్తూ గుర్తుచేసుకున్న విప్లవకారుడు ఎర్రోళ్ల వీరాస్వామి. మేం చెప్పిన వాళ్లమే కానీ విప్లవం ఆచరించిన వాడు వీరాస్వామి. ఆయన ఆలోచనకు, రచనకు ఆయన ఆచరణ రూపమని. ఆ మాటలతో ఆసరా దొరికినట్లు ఉన్నది. వీరాస్వామి వరుస సోదరుణ్నని ఒక యువకుడు ముందుకు వచ్చి మమ్ములని కోతుల నడుమలో ఎస్.సి. కాలనీకి తీసుకుపోయాడు.

అక్కడ మాదిగ దండోరా ప్రభావం ఉంది. తెలంగాణ – సెటిలర్స్ సందర్భంలో మళ్లీ ఒకసారి వీరాస్వామి సందర్భం గుర్తుకొచ్చింది. వీరాస్వామి రచనలు ‘ఆరుద్ర పువ్వు’కు ఈ ‘నేలకు పుట్టిన గడ్డిపువ్వు’ అని సత్యం రాసిన ముందుమాట గుర్తుకొచ్చింది. గడ్డిపువ్వు రాలిపోతుంది. గడ్డి ఏపుగా పెరిగితే మునుం పెట్టి కోయనూవచ్చు. కానీ గడ్డి తలవంచదు. కాళ్లకింద నలిగినా తలవంచదు. మళ్లీ తలఎత్తి నిటారుగా నిలబడుతుంది. ఆ గడ్డి మొలవడానికే కాదు, వరి పంటకు సకల పంటలకు వ్యవసాయానికి భరణి కార్తెలో పనంత మేఘం గర్జిస్తే మృగశిర కార్తెలో ఉత్తర మెరుస్తుంది. రైతు గంప ఎత్తుకుంటాడు. కార్తె కలిసొస్తే మృగశిర ప్రవేశంలో జూన్ 7న వర్షం కురుస్తుంది. ఆరిద్ర రుతువులో నేల చాళ్లలో నేల పూసిన పువ్వుల వలె ఆరిద్ర పురుగులు బిలబిల పుట్టుకొస్తాయి. పురుగు ఎటువంటి ప్రాణి అంటే అది ప్రతి ఒక్కటీ వ్యవసాయ జీవితానికి సహకరించేవే. మిణుగురు పురుగు, కుండల పురుగు, గొంగడి పురుగు… – ఒకటేమిటి – ప్రాణిని గౌరవించడం నేర్చుకుంటే ప్రాణి విలువ తెలుస్తుంది. పురుగయితే ఏమిటి, పువ్వుయితే ఏమిటి? అప్పుడు వసంత రుతువు అంటే భరణి కార్తెనే కాదు, వసంత మేఘ గర్జన గుర్తుకొస్తుంది. నక్సల్బరీ మే 23-25, 1967 గుర్తుకొస్తాయి, వర్షాకాలం అంటే శ్రీకాకుళం గుర్తుకొస్తుంది – ”మేరిమి కొండల్లో మెరిసింది మేఘం” గుర్తుకొస్తుంది. ”కురుపాము కొండల్లో కురిసింది మేఘం” గుర్తుకొస్తుంది. జగిత్యాల జైత్రయాత్ర – (సెప్టెంబర్ 1, 1978)కు ముందు నూటా యాభై ఊళ్లల్లో భూమి లేని నిరుపేదల నాగేటి చాళ్లలో గుండెధైర్యపు జెండాలుగా ఎగిరిన ఎర్రజెండాల దృశ్యాలు దూరం నుంచి ఆరుద్ర పువ్వుల తోటల వలె మనసులో దృశ్యమానమవుతాయి.

1990 మే 5, 6 వరంగల్ రైతు కూలీ సంఘం సభల తర్వాత హనుమకొండ నుంచి హైదరాబాదుకు వస్తూ భోనగిరి దాకా రోడ్డుకిరువైపులా కనిపిస్తున్న వేలాది ఎర్రజెండాలు నాగేటి చాళ్లలో బిలబిల పారుతున్న ఆరిద్ర పువ్వులనిపించాయని గతంలో రాసాను కూడా. వీరాస్వామి అటువంటి భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ జీవితం నుంచి వ్యవసాయ విప్లవంలోకి రావడంలో ఆశ్చర్యమేమున్నది. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. తల్లిదండ్రులకు చివరి కొడుకు. అక్క గోదావరిఖనిలో స్టవ్ పేలి చనిపోయింది. అన్న కుమారస్వామి ఎక్కడో లారీ క్లీనర్ గా పని చేసుకొని బతుకుతున్నాడు. ”ఉన్న ఇల్లు కూలిపోయింది. పందిరి కింద బతుకుతున్నం. సాకుతాడని బమిసిన కొడుకు కాకుండా పోయిండని” గుండె చెరువయ్యాడు తండ్రి ఎర్రోళ్ల మైసయ్య. వీరాస్వామి పుట్టిన కాలమటువంటిది. ఒకవైపు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వలన విద్యావకాశాల వలన ప్రతిభ ప్రదర్శించగలిగే అవకాశం వచ్చి నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్, డిగ్రీ, హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ., ఎం.ఫిల్ చేసాడు. 1991 వాటికి ఎం.ఎ. పూర్తి చేసాడంటే ఆయన ఎమర్జెన్సీ ప్రొడక్ట్. అయితే అంటరానివాళ్ల జీవితాలకు ఆరుగాలం ఎమర్జెన్సీయే. తెలంగాణకు, తెలుగు సమాజానికి మాత్రం అది 1976లో ‘విప్లవానికి బాట’ వేసింది. కనుక వీరాస్వామి హుజూరాబాదు, జమ్మికుంట, కొత్తగట్టు, మాణిపూర్ లు నడిచిన ‘జగిత్యాల జైత్రయాత్ర’ నాగేటి చాళ్లలో కళ్లు తెరిచిన ‘ఆరిద్ర పువ్వు’ అయ్యాడు. పందొమ్మిది వందల తొంభైవ దశాబ్దపు ప్రతి ప్రజా ఉద్యమంలోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రోగ్రెసిన్ స్టూడెంట్ గా, రాడికల్ విద్యార్థిగా ఆయన పాల్గొన్నాడు. విప్లవకారుడుగా ఇంకా విశాలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాడు. ఆయన రచనల నుంచి, సత్యం రాసిన ముందుమాట నుంచి, నేను రోహిత్ వేముల అమరత్వం సందర్భంగా వీరాస్వామి అవసరాన్ని గుర్తుచేస్తూ రాసిన వ్యాసం నుంచి ఒక మేరకు ఆ విషయాలను మనం అవగాహన చేసుకోవచ్చును.

అయితే రోహిత్ వేముల ‘ఆత్మహత్య’ ముందూ వెనుకల పరిణామాలు, కె.ఎస్.యు. కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ మొదలైన వారి అరెస్టు ముందువెనుకల పరిణామాలు ఇదే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అమరుడు వీరాస్వామి విప్లవ ఆచరణను, జేఎన్ యూలో నవీన్ బాబు విప్లవ ఆచరణను మాత్రం ఎంతో అవసరంగా ముందుకు తెస్తున్నాయి. మాటకారి కన్హయ్య కుమార్ ”నాకు అఫ్జల్ గురు కాదు రోహిత్ వేముల రోల్ మాడల్” అన్నాడు గానీ, రోహిత్ వేములకైనా రోల్ మోడల్ కాదగినవాడు ఏర్రోళ్ల వీరాస్వామి. కన్హయ్యకు, డీఎస్ యూకు రోల్ మోడల్ కాదగినవాడు నవీన్ బాబు. కశ్మీర్ వంటి జాతి విముక్తి పోరాటాన్ని నవీన్ బాబు ఎట్లా అర్థం చేసుకుని విశ్లేషించి సమర్థించాడో జె.ఎన్.యు. విద్యార్థి ఉద్యమ చరిత్ర, ఆర్ఎస్ యూ, ఏఐఆర్ఎస్ఎఫ్ పోరాటాల చరిత్ర చదివి ఉంటే కన్హయ్య ఇండియా మే ఆజాద్ దగ్గరే తన విషయంలో ఆగిపోయేవాడేమోకానీ, అఫ్జల్ గురు విషయంలో తన సహ విద్యార్థులు కశ్మీరీల విషయంలో అది ప్రాతినిధ్య-స్వరం కాజాలదు. ముఖ్యంగా ఆ విద్యార్థులు కూడా తనకు ఓటువేసి, విద్యార్థి సంఘం అధ్యక్షుణ్ణి చేసి ఉంటే. వాళ్లు తనకు ఓటు వేయకపోయినా ప్రజా ప్రతినిధిగా ఇది ఆయన బాధ్యతే.

స్పష్టంగా మార్క్సిస్టు – లెనినిస్టు అవగాహనతో విద్యారంగ సమస్యలనే కాకుండా ప్రజా సమస్యలన్నింటినీ అర్థం చేసుకుని, విశ్లేషించి, చెప్పగలిగి, పోరాటాలు ఆ మార్గంలో చేపట్టగలిగిన పూర్తి పరిణతితో వీరాస్వామి 94 నుంచి 99లో అమరత్వం దాకా కొనసాగాడు. ఎన్టీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక 94 డిసెంబర్ నుంచి 95 మార్చ్ దాకా సాగిన చరిత్రాత్మకమైన జైలు పోరాటంతో మొదలై 95 ఆగస్టులో వైస్రాయి హోటల్ ప్రపంచ బ్యాంకు విరచిత కుట్ర ద్వారా అధికారానికి వచ్చిన ప్రకటిత ప్రపంచ బ్యాంకు సిఇవో చంద్రబాబు మొదటి ఐదేళ్ల కాలమంతా వీరాస్వామి పోరాట చరిత్రే. అది సబ్సిడీల ఎత్తివేత కావచ్చు. సంక్షేమ హాస్టళ్ల ఎత్తివేత కావచ్చు. బీభత్సమైన ఎన్ కౌంటర్లు, రాజ్యహింసే కావచ్చు, పీపుల్స్ వార్ నిషేధం కావచ్చు. సునీత ఆత్మహత్య సందర్భంగా హైదరాబాదు యూనివర్సిటీలో దాని ప్రతిఫలనాలు కావచ్చు. ఇవన్నీ వీరాస్వామిని తీవ్ర అశాంతికి, అలజడికి గురిచేసి పూర్తికాలపు విప్లవ జీవితాన్ని ఎంచుకుని రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా అజ్ఞాత జీవితానికి వెళ్లడానికి పురికొల్పాయి. ఎన్ కౌంటర్లకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఆయన విద్యార్థిగా పోరాడాడో అటువంటి ‘ఎన్కౌంటర్’ లో ఆర్ఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి అనంతపురం ఎస్.కె. యూనివర్సిటీ ‘లా’ విద్యార్ధి భుజంగరెడ్డితో పాటు 7 మార్చ్ 1999లో అమరుడయ్యారు. ఎఐఆర్ఎస్ఎఫ్ (ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్) అధ్యక్షుడు జయరామచంద్రన్ తో పాటు ఈ ఇద్దరినీ కర్నూలు జిల్లా మంత్రాలయం బస్టాండ్ లో అరెస్టు చేసి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్, లింగాల మొదలైన పోలీసు స్టేషన్లలో చిత్రహింసలు పెట్టి లింగాల అడవుల్లో చంపేసారు. వీళ్ల అరెస్టుకు ప్రత్యక్ష సాక్షి, తమిళనాడు మధురైకు చెందిన ‘లా’ విద్యార్థి జయరామ చంద్రన్ ను వేరుచేసి ఈ విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరించి ట్రెయినెక్కించి మద్రాసుకు పంపించి వేసారు. ఆర్ఎస్ యూ స్థాపనలో భాగమైన గిరాయిపల్లి (మెదక్ జిల్లా) అమరులు సూరపనేని జనార్దన్, లంకా మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్ల ఎన్ కౌంటర్ కు ప్రత్యక్ష సాక్షి భిక్షపతి (వడ్డేపల్లి) సిపిఐ(ఎంఎల్) నాయకుడు నీలం రామచంద్రయ్య, పిడిఎస్ యు నాయకుడు జంపాల ప్రసాద్ ల ఎన్ కౌంటర్ కు ప్రత్యక్ష సాక్షి కె. లలిత మిగిలి జస్టిస్ భార్గవా కమిషన్ ముందు సాక్ష్యం చెప్పినట్లుగా ఒక జుడిషియల్ కమిషన్ ముందో, కోర్టులోనో సాక్ష్యం చెప్పే అవకాశం మాత్రం జయరామచంద్రన్ కు రాలేదు.

చిన్న తేడా ఏమిటంటే గిరాయిపల్లి ఎన్ కౌంటర్లో 1975 జూన్ 24-25 రాత్రి గిరాయిపల్లి (ములుగు… మెదక్ జిల్లా) అడవుల్లో అయిదుగురిని చెట్లకు కట్టివేసి నలుగురిని కాల్చివేసి ఐదవ వ్యక్తి వడ్డెపల్లి భిక్షపతిని వదిలేసారు. 1975 నవంబర్ లో గుంటూరు జిల్లాలో లారీలో ప్రయాణం చేస్తున్న నీలం రానుచంద్రయ్య, జంపాల ప్రసాద్, కె.లలితలను వేరు చేసి మొదటి ఇద్దరిని కాల్చి చంపారు. ఆమె తనతో పాటు ఆ ఇద్దరి అరెస్టుకు మాత్రమే ప్రత్యక్ష సాక్షి. ఎన్ కౌంటర్ హత్యకు కాదు. అట్టే జయ రామచంద్రన్ కూడా మంత్రాలయం దగ్గర తనతోపాటు వీరాస్వామి (మహేశ్) ని రెండు వ్యాన్ లలో వచ్చిన పోలీసులు అరెస్టు చేసారని పత్రికా సంపాదకులకు లేఖ రాసాడు. అది 19 మార్చ్ 6 రాత్రి 9.30 సమయం. అదే మధ్యాహ్నం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లినపుడు భుజంగరెడ్డి(సూర్యం)ని ఇదే పోలీసులు అరెస్టు చేసారని కూడా రాసాడు. జీపులో వీళ్లిద్దరినీ కళ్లకు గంతలుకట్టి చిత్రహింసలు పెట్టారు. 7వ తేదీ ఉదయం దాకా ఈ ముగ్గురినీ ఒకే పోలీసు స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. 7వ తేదీ ఉదయంగానీ, తనను ఇద్దరి నుంచి వేరు చేసి వంగూరు (కల్వకుర్తి దగ్గర) పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. అక్కడ ఏపీ పోలీసు క్యాంపు కూడా ఉంది. మార్చ్ 10వ తేదీ ఉదయం సిబిఐ అధికారులు జయరామచంద్రన్ ను ఎఐఆర్ఎస్ఎఫ్ నుంచి దూరమై ప్రాణాలు కాపాడుకొమ్మని బెదిరించి ఆ రాత్రి 10 గంటలకు రాయచూర్ తీసుకువెళ్లి మద్రాసు రైలెక్కించారు. ఎపిలో తిరిగి ప్రవేశించవద్దని హెచ్చరించారు. కనుక ఆ ఇద్దరినీ వేరుచేసి చంపుతారనే భయాందోళనలతో కోర్టులో హాజరుపరచాలని విజ్ఞప్తిచేస్తూ తమిళనాడు నుంచి ఏపీ మీడియాను ఎడిటర్లను సంబోధిస్తూ ఇంగ్లీషులో లేఖ రాసాడు. కాని పోలీసులు అప్పటికే అంటే ఆ ఇద్దరిని జయరామచంద్రన్ నుంచి వేరు చేయగానే మార్చ్ 7వ తేదీ రోజే లింగాల అడవుల్లో కాల్చి చంపి, తల్లిదండ్రులకు కూడా తెలపకుండా దహనం చేసి కానీ ‘ఎన్ కౌంటర్’ ప్రకటించలేదు. జయరామచంద్రన్ ఎడిటర్లకు ఉత్తరం రాస్తూ నాకు కూడా 10 మార్చ్ న గానీ వీరాస్వామి, భుజంగరెడ్డిల అరెస్ట్ గురించి సమాచారం ఇచ్చాడు. నేను 11 మార్చ్ న పత్రికలకు వీళ్ల అక్రమ అరెస్టు గురించి తెలియజేసేప్పటికే వీరాస్వామి, భుజంగరెడ్డిల ‘ఎన్ కౌంటర్’, దహన క్రియ అంతా ఏకపక్షంగా పోలీసులు చేసేసారు. ఇద్దరి తల్లిదండ్రులు మార్చ్ 15న వెళ్లి వాళ్ల బూడిద మాత్రం తెచ్చుకోగలిగారు. ఈ వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. వీటిపై ఆధారపడి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్కు వీరాస్వామి టీచర్లు, జి. హరగోపాల్, బి. చంద్రశేఖరరావు, డి. ఈశ్వరయ్య, కె.వై. రత్నం, సెబాస్టియన్, ప్రవీణ్ రావుతో పాటు లేఖ రాసారు. ప్రొఫెసర్ హరగోపాల్ వీరాస్వామికి రీసెర్చ్ సూపర్ వైజర్ కూడా.

”చరిత్రను వర్తమానం గత, భవిష్యత్తులతో జరిపే సంభాషణ” అన్నాడు మార్క్సిస్టు చరిత్రకారుడు ఇ.ఎచ్.కార్. ఎంత నిజం. వీరాస్వామి విద్యార్థి జీవితాన్ని, పోరాటాన్ని సన్నిహితంగా చూసి, ఆయన ‘చట్ట వ్యతిరేక హత్యపై న్యాయవిచారణ కోరిన కె.వై రత్నం ‘వెలివాడ’లో బహిష్కరింపబడిన విద్యార్థుల పోరాటంతో ఉన్నాడు. రోహిత్ వేముల ఆత్మహత్య కూడా మనుస్మృతి బద్దహత్య అని న్యాయవిచారణ కోరి తాను ఆ పోరాటంలో భాగమై సస్పెండ్ అయిన తన విద్యార్థితో పాటు జైలు పాలయ్యారు. ప్రొఫెసర్ గా సస్పెండ్ అయ్యాడు. ప్రొఫెసర్ చంద్రశేఖరరావు ఈ పోరాటంలో ఉన్నాడు. ప్రొఫెసర్ హరగోపాల్ ను, నన్ను, ప్రొఫెసర్ లక్ష్మినారాయణతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి వెనుక ‘కుట్రదారుల’ మంటున్నది. సంఘ పరివార్ వీరాస్వామి నుంచి రోహిత్ వేముల దాకా చరిత్ర చలనానికి సాక్షిభూతులం కావడం ఎంత గర్వకారణం. కె.వై. రత్నం వంటి వాళ్లు చరిత్రతో పాటు పయనించి ఇవ్వాళ ఆ పోరాట నిర్మాణంలో భాగం కావడం అప్పటికిప్పటికి ప్రొఫెసర్ కావడం కన్న ఇంకెంత గర్వకారణం!

అయితే ప్రజాసంఘాలైనా ప్రజా ఉద్యమాలైనా వీరాస్వామి, భుజంగరెడ్డి ‘ఎన్ కౌంటర్’ను, కేరళలో ఎమర్జెన్సీలో ఇంజనీరింగు విద్యార్థి రాజన్ ఎన్ కౌంటర్ వలె, 70లలో ఒక వర్గీస్ ‘ఎన్కౌంటర్’ వలె, కనీసం గిరాయిపల్లి విద్యార్థుల ఎన్ కౌంటర్ వలె, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్ ఎన్ కౌంటర్ వలె ఒక న్యాయ పోరాట చరిత్రగా మలచలేకపోయారు. అమెరికాలో రోజేనర్డ్ దంపతులు ఉరిశిక్షలు మళ్లీ తిరగదోడి న్యాయ విచారణ జరివి వాళ్ళు నిర్దోషులని తేల్చినట్టుగా, కేరళలో వర్గీస్ ను చంపిన పోలీసు కానిస్టేబుల్ పశ్చాత్తాపం చెంది తనకు ఆదేశమిచ్చిన డిఎస్ పేరు చెప్పి కేసు తిరగదోడేలా చేసి శిక్ష పడేలా చేసినట్లుగా ఇపుడు ప్రత్యక్ష సాక్షి జయరామచంద్రన్ న్యాయవాదిగా మధురై హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూఉన్నాడు గనుక విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలు ఈ న్యాయ పోరాటాన్ని మళ్లీ చేపట్టడం సాధ్యమేనేమో ఆలోచించాలి. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పెల్లుబికిన ప్రజా ఉద్యమం, దానిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రాజ్యహింస సందర్భంగా వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ మధురైలో అరెస్టయిన సందర్భంలో జయరామచంద్రన్ హైకోర్టు మధురై బెంచి ముందు వాదించి వాళ్లకు బెయిల్ సాధించిన వారిలో ఉన్నాడు. ఈ పుస్తకంలో ఈ వివరాలు మళ్లీ చదువుతూ ఉంటే ఇటువంటి ప్రయత్నం మళ్లీ ఒకటి చేయవచ్చునేమో అనిపించింది. సునీత ఆత్మహత్య విషయంలో, లేదా రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో కొనసాగిన, కొనసాగుతున్న ఉద్యమాల వంటివి వీరాస్వామి, భుజంగరెడ్డిల ‘ఎన్ కౌంటర్’ విషయంలో కూడా జరిగి ఉండాల్సింది. కనీసం న్యాయ పోరాటమైనా సాధ్యమేనా? న్యాయనిపుణులు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని విజప్తి.

విద్యార్ధి, యువకుల దార్శనికత ప్రస్తావనతో ప్రారంభించాను. వీరాస్వామి దార్శనికతకు మనకు మిగిలిన ఆధారాలు ఈ రచనలు. ఇందులో ముప్పై ఆరు పేజీల కవిత్వం ఉంది. ఎనిమిది వ్యాసాలు ఉన్నాయి. ఒక లేఖ, సెటైర్, కల, రెండు గల్పికలు ఉన్నాయి. కవితలు 17 ఉన్నాయి. వచన రచనలు 12 ఉన్నాయి. మొత్తం వీరాస్వామి రచనలు అప్పటికి లభ్యమైనవి ముప్ఫై ఇందులో ఉన్నాయి. అన్నీ వివిధ పోరాటాల్లో పాల్గొంటూ నాలుగైదేళ్ల కాలంలో రాసినవే. కవిత్వంలోగానీ, వచనరచనల్లోగానీ ఐదేళ్ల కాంలో ఎంతో పరిణతి కనిపిస్తుంది. కవిత్వంలో వ్యంగ్యం, శైలి, శిల్పం, కవి సమయాలు, కవిత్వం హృదయ సంబంధిత అనుభూతి విశేషమని గ్రహింపు, చిక్కనవుతూ కనిపిస్తాయి. స్పష్టమైన విప్లవ అవగాహన రూపొందడం గురించి చెప్పనక్కరలేదు. వరంగల్ జిల్లా ములుగులో పుట్టి హైదరాబాద్లో రాడికల్ ఉద్యమ నిర్మాణం చేస్తూ అజ్ఞాత జీవితంలోకి వెళ్లి హైదరాబాదు పీపుల్స్ వార్ సిటీ కమిటీ సభ్యుడుగా ఎదిగిన పల్లె అశోకును పోలీసులు బూటకపు ఎనికౌంటర్లో చంపిన సందర్భంగా రాసిన కవిత అటువంటి పరిణతికి ఒక ఉదాహరణ. అట్లాగే రాడికల్ మార్చ్’ అనే పేరుతో ఉన్న కవిత శీర్షిక చూస్తే… ఆర్ఎస్ యూ, ఆర్ వైఎల్ లు కలిసి నడిపిన పత్రిక గురించి అనిపిస్తుంది గానీ 98 జూన్ లో పదకొండు రోజుల పాటు ఆర్ఎస్ యూ వర్క్ షాపు గురించి ఒక కవితలో చెప్పిన పద్ధతి దానికదిగా ఒక సృజనాత్మక ఎడ్యుకేషన్ గా ఉన్నది. ఒక కథనంలా సాగే కవిత్వంగా మలచిన రిపోర్టింగ్. ఆయన పల్లె గురించి రాసిన కవితలేవీ నాస్టాల్జియా కాదు. గ్రామాలకు తరలండి’ అని రాడికల్స్ ఇచ్చిన పిలుపునందుకుని గ్రామాలకు తరలిన విద్యార్థి యువజనులు, సాంస్కృతిక కార్యకర్తలు రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేసి గానీ, ఏర్పడి ఉన్న వాటితో గాని కలిసి చేసిన విప్లవ భూసంస్కరణల పోరాట సృజన, గల్పికలు రెండే ఉన్నాయి గానీ కొ.కు., షహీదా గల్పికల వలె సూటిగా, చురుగ్గా ఉన్నాయి. ఇంక రచనల్లో వైశాల్యం విస్తృతి, వైవిధ్యం కోసం కవిత్వం, వచన రచన అన్నీ దాఖలాలే. సినిమా సమీక్షలున్నాయి. సంక్షేమ పథకాల సమీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీలు మొదలు సునీత ఆత్మహత్యదాకా విద్యార్థుల సమస్యలు పోరాటాలే కాదు, మద్య నిషేధం దాకా మహిళల, ప్రజల సమస్యలపై పోరాటాలలో భాగస్వామ్య ఆచరణ రచనలు అద్భుతమైన విశ్లేషణతో ఉన్నాయి. సుహార్తోను గద్దె దించే దాకా ఇండోనేషియా విద్యార్థులు చేసిన వీరోచిత పోరాటాల చరిత్ర, విషయం, సమాచారం, విశ్లేషణ, అవగాహన దృక్పథా దృష్ట్యా ఒక అద్భుతమైన రచన. రిజర్వేషన్లు ‘కుక్క బిస్కట్లు’ కావు అనే రచన 1986లో ఎన్టీఆర్ బిసిలకు ఇరవై అయిదు శాతం రిజర్వేషన్లు పాపులిస్టు చర్యగా ప్రకటించినప్పటి నుంచి అది దళిత, బడుగు వర్గాల హక్కుగా విద్యార్థులను సంఘటితం చేసి పోరాడిన, పోరాడుతున్న రాడికల్ విద్యార్థుల అవగాహనకు అద్దం పడుతుంది.

1997 జూన్ 5న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేధావులపై క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయాలకు ఒక ఫర్మానా పంపించింది. ఆ మేధావులు, ఎవరో కాదు – ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో పని చేస్తున్న వాళ్లు. అప్పటికే పన్నెండేళ్లుగా డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డి, నర్రా ప్రభాకరరెడ్డిలపై విశ్వవిద్యాలయాల బయట చంపేసే చర్య తీసుకునే ఉన్నది ప్రభుత్వం. కాకతీయ విశ్వవిద్యాలయం లెక్చరర్ డాక్టర్ కె. బాలగోపాల్ ఎపిసిఎల్ సి కార్యదర్శిగా హత్యాప్రయత్నం నుంచి బయటపడి జైలు పాలయి, వరంగల్ వదిలి, ఉద్యోగం వదలాల్సి వచ్చింది. ఈ ఉత్తర్వుపై అద్భుతమైన వ్యంగ్య రచన ఇవ్వాళ మళ్లీ దేశవ్యాప్తంగా ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మొదలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో (వీరాస్వామి చదివిన హెచ్సీయులో ఇప్పుడిద్దరు ప్రొఫెసర్లు అటువంటి క్రమశిక్షణా చర్యకింద సస్పెండ్ అయ్యారు. జాబితాలో ఇంకా చాలామంది ఉన్నారు) ఎందరో మేధావులు ఈ క్రమ శిక్షణా చర్యలనెదుర్కుంటున్నారు.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చాలా సోపపత్తికంగా తన డైరీలో రాసుకున్న దానిని చదివితే సత్యం రాసిన ముందు మాటలో గానీ, సంస్మరణ సభలో గానీ చాలా మంది వీరాస్వామిని దగ్గరగా తెలిసిన వాళ్లు అందరూ ప్రస్తావించే వీరాస్వామి నిరంతరం ఆలోచించే, చర్చించే స్వభావానికి చక్కగా సరిపోతుందనిపిస్తుంది. చివరగా తనకొచ్చిన ఒక “కల” గురించి రాసాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎన్ కౌంటర్ గురించి, పల్లె అశోక్ ‘ఎన్కౌంటర్’ గురించి ప్రత్యేకించి, మొత్తంగానే ఎదురు కాల్పుల, ఉరిశిక్షలు, ఆత్మహత్య ప్రేరణల వ్యవస్థ గురించి రాసిన వీరాస్వామి ‘తన ‘ఎన్కౌంటర్’ గురించి కూడా తాను విప్లవోద్యమంలో ఎంత తీవ్రంగా నిమగ్నమయితే అంత సంసిద్ధతతో తాను మృత్యువును ఊహించుకుంటున్నట్లుగా వచ్చిన కల అది. అందుకే ఇది వాస్తవానికి కల, కాని చాలా కలల మాదిరిగా వాస్తవానికి చాలా దూరంగా మాత్రం ఉందని నేను భావించడం లేదు. ఎందుకంటే స్టేట్ రిప్రెషన్ గురించి, స్టేట్ టెర్రరిజం గురించి నిరంతరం ఆందోళన చెందుతున్న నాకు అలాంటి కల రావడం వలన తాను కలగా మాత్రం భావించడం లేదని తేల్చేసాడు.

‘ప్రజలు మీద రెండు రకాలైన వయెలెన్స్ ను స్టేట్ ప్రయోగిస్తుంది. ఒకటి విజిబుల్ వయెలెన్స్, రెండవది ఇన్విజిబుల్ వయెలెన్స్. నా కల రెండవ కోవకు చెందినది. స్టేట్ తనకు వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ల మీద ప్రయోగించే ఇన్విజిబుల్ వయెలెన్స్ గా దీనిని భావించడం సబబుగా ఉంటుందని అనుకుంటున్నాను.”

సరిగ్గా 2015 డిసెంబర్ 18న విసి అప్పారావుకు రోహిత్ వేముల రాసిన లేఖ ఈ ‘కల’ వంటిదే. ‘నేనింకా బతికే ఉన్నాను’ అని తన శరీరం మీద, మనసు మీద పోలీసులు ప్రయోగించిన భౌతిక, మానసిక (నిన్ను చంపేస్తాం' అన్న ఎస్ఐ హెచ్చరిక) గురించి వాంగ్మూలమిచ్చిన ఉదయభాను లేఖ అటువంటిదే. తేడాఅల్లా కనిపించే హింస. కనిపించని హింస. ఒకటి ఇప్పటికే జరిగిన రాజ్యహత్య. మరొకటి నెత్తిమీద వేళ్లాడుతున్న కత్తి. అందులోనూ షహీద్ భగత్ సింగ్ వలెసర్ పె కఫన్ బాంధ్ కే` విప్లవంలో దూకిన వీరాస్వామి విప్లవ స్వప్నాలతో పాటు తన ఎన్ కౌంటర్ కలగనడానికి గతితార్కిక చారిత్రక సంబంధమున్నది. ఎందుకంటే ఆయన విప్లవకారుడు.

– వరవరరావు (ఏప్రిల్ 10, 2016)

(ఆరిద్ర పువ్వు వీరాస్వామి రచనలు పుస్తకం నుంచి. ఎర్రోళ్ల వీరాస్వామిని 1999 మార్ఛ్  7న పోలీసులు కాల్చిచంపారు.)

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003).

Leave a Reply