ఏమయిపాయే నా జీవనది! ఎందుకిట్లాయే!!

సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుబడు ఈ నేల పూరించు వేనవేల
ధిక్కారధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల…
అమరుడేమాయెరా – ఆతని ఆశయమ్మేమయిపాయే – కనుకోలుకులలో
రాలిపడిపడు అగ్నితప్తఅశ్రుజలాధారాల మహోజ్వల పొరుకెరటాలేమైపాయే..
నాగడ్డ బొందల గడ్డయిపోయే, పేగు తెంచుకు త్యాగాన్ని ముద్దాడిన బిడ్డ కల
తడియారకనేపాయే! ఏమయిపాయే నా జీవనది.. ఎందుకిట్లాయే!!!

పోరాట ధ్వనిలోన ఎగిరెగిరి దుంకిన గజ్జెలేమయిపాయే, గంభీర కంఠస్వర
కుత్తుకలన్ని నేలరాలిపోయెనా – మొలలు తెగనరుకుకొని మూలకు కూసునెన,
పదియారు పట్నాలు పదినూర్ల గ్రామాలు ఒక్కపెట్టున చిచ్చులేపిన
చిర్రెచిటికెలేమయిపాయే! భేరీలు రణభేరీలు రౌద్రమ్ములొలికించి సాగించినా
సమరమ్మేమయిపాయే. ఏమయిపాయే నా జీవనది.. ఎందుకిట్లాయే!

పరిసెరాముండ్ల జెట్టలన్నీ పుట్టి చేతులిరిగిపాయేనా, కళాలకు
పక్షవాతమ్ములొచ్చేనా పాండురోగమ్ములొచ్చేనా, దాశరథి కాళోజి నాయాత్మయని
పలికిన కూటమ్ములేమాయే – నివ్వెరపోయెనా నిర్ఘాంతపోయెనా ఆకాశమ్ములే
తెగిపడిన ఒడిసిన సిరాపాళీల రక్తమ్ము నింపి రచనారహదారుల సాగింతు
కవ్వింపు కాదిది కదనమ్మని భీషణ భాషణల్జేసిన కూపస్థ
మండూకాలేమయిపాయే – శిలనాభిలో చిక్కుకుపాయేనా – రాకాసుడపహరించేనా
బాలనాగమ్మ బంధీయైన తీర..ఏమయిపాయే.. నా జీవనది ఎందుకిట్లాయే!

జననం: బ్రాహ్మణ వెల్లెంల, నార్కెట్ పల్లి మండలం, నల్లగొండ జిల్లా. కవి, రచయిత.  విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకుడు. రచనలు: నరమాంస భక్షణ(దీర్ఘ కవిత), కైవారం.

Leave a Reply