ఏతులోడు

“ఏతులదొర ఎక్కడున్నవ్, అంత మంచేనా?” అనుకుంటా పిచ్చియ్య పంతులు గడీలకు పోయిండు.

“నాకేమైంది మంచిగున్న, ఊర్లే అందరు సుతం మంచిగున్నరు. ఏమైందివయా పిచ్చిపంతులు మా ఇంటిపేరు “ఏతుల”ని పిలువొద్దని చెప్పిన్నా! మల్ల గట్లనే అంటున్నవ్” అని దొర గరం గరమైండు.

ఏతుల దొర, పిచ్చయ్య పంతులు చిన్నప్పటి నుంచి మంచి జిగిరి దోస్తులు. బల్లెకుపోయినప్పటి నుంచి దొరకు బాగా గొప్పలు చెప్పకునుడు అలవాటయింది. ఊర్లే అందరూ దొరకు ఏతులు చెప్పుట్ల వాళ్ల తాత లచ్చణాలు పడ్డయని అనుకునేటోళ్లు. తనకు పూట గడవనీకి పిచ్చయ్య పంతులు “నీకు రాజయోగం ఉంద”ని, ఏతుల దొరకు అప్పుడపుడు చెప్పెటోడు. గీ ముచ్చట మనుసుల పడ్డప్పటి నుండి ఊర్లే అందరికీ గొప్పలు చెప్పుడు ఇంకా ఎక్కవ చేసిండు దొర. కొన్నిరోజులకు సర్పంచ్ ఎలక్షన్లు రానే వచ్చినయ్. ఇంటింటికి తిరిగి దొర ఓట్ల ముచ్చట్లు చెప్తుంటే అమ్మలక్కలు మస్తు ఖుషీ కావట్టిండ్రు. ఎవుసం చేసుకునే రైతుల్ని కూడా బాగా ఉబ్బిచ్చిండు. సదువుకున్న పోరగల్లను దుబాయ్, అమెరికా పంపిత్తని బోల్తా కొట్టిచ్చిండు. జనాలు కూడా ఏతులోడయినా మన ఊరోడని ఓట్లేసి సర్పంచి గద్దె ఎక్కించిండ్రు జనాలు. పదవీ స్వీకారంనాడు ఊరంతా హడావుడిగా ఉంది. గ్రామ సచివాలయంలో సర్పంచి కుర్చీల శివాంట ఒక్కసారి పిచ్చయ్య పంతులును కూసుండబెట్టిండు దొర. పట్టుశాలువ కప్పి దిల్ దార్ గ సత్కరించి, బోర్లబొక్కల పడి పిచ్చిపంతులు కాళ్ళు మొక్కిండు. గడీల పనిచేసే లట్టుగాడు, పొట్టుగాడు అందర్నీ ఖుషి చేసిండు. పక్క దేశాల్లో కనిపించని పులి ప్రజల్ని మింగుతుందని వార్తలు విని ఊర్లో జనాలు గుబులు గుబులు అయితున్నరని గ్రామ సభలో వార్డుమెంబర్ ఉత్తరెడ్డి లొల్లి బెట్టిండు.

“వొచ్చె…వొచ్చే… కనిపించని పులి పక్క ఊరుదాక వచ్చిందట, సర్పంచిగా ఏం జేత్తున్నవ్” అన్నడు.

ఉత్తరెడ్డి మాటలకు ఏతులదొరకు ఒళ్లంత శిటశిట పెట్టింది. ఊగిపోయిండు. “ఏంది వయా, ఏమోచ్చింది? ఒక్క బుల్లెటు గోలేస్తే దానిపని ఖతం, ఎందుకువయా దానికి భయం” అని దైర్నం చెప్పిండు ఏతుల దొర.

“కనిపించని పులి దేశంల ఎక్కడికొచ్చినా ఇక్కడకు రాదు, ఎందుకంటే మన ఊర్లకు పులిరాకుండా నేను చూసుకుంట గదా” అని మాటిచ్చిండు సర్పంచ్.

“ఢిల్లీ దాక ఒచ్చిందట, ఏదన్న చేయాలే దొరా!” అని జనాలు గుబులుతోని అడగవట్టిండ్రు.

“పనిలేనోళ్లంత మోపైనారు! ఏమొచ్చిందయ్యా! ఎక్కడికొచ్చింది? మేం లేమా?”ని దొర అనంగనే గడీల దొరెనక కూసున్న జీతగాళ్లంత ఇకిలిచ్చి నవ్విండ్రు.

” అధ్యచ్చా! నిజంగానే రోజు రోజుకు ఆ కనిపించని పులి ఎక్కువ మందిని కాటేస్తందని” ఉత్తరెడ్డి అన్నడు.

“కవచాలు, తుపాకులు లేకుండా నా జీతగాళ్లందరిని నిలబెట్టి కాపాడుతవయా! మీకేం భయం లేదని” భరోసా ఇచ్చిండు సర్పంచు.

“హే రాములు జరా… గా ఎడ్డి జనాలకు నీవన్న నమ్మెటట్టు పేపర్ల మంచిగ రాయ రాద!” అన్నడు దొర.

“సరే, తప్పకుండా రాస్త సారు!” ఏతుల ముచ్చట్లకు ఇలేకరి రాములు తన మనుసుల కిలకిల నవ్వుకుండు.

సభల కూసున్నోళ్ల నుంచి గడబిడ ముచ్చట్లు దొరకు ఇనిపించినయ్. మళ్లా మాట అందుకున్నడు దొర.

“ఎందకయా? అనవసరంగా మాట్లాడుతర”ని దొర ఇలేఖర్లను దబాయించిండు. రెండు అర్రల మంచం ఇండ్లకు ఆశపడ్డ ఇలేఖర్లు మూతి మీద వేలు తీయకుండా బెల్లంకొట్టి రాయోలిగే సూత్తండ్రు.

“ఎవ్వలు గుడిసెలకెళ్లి బయటకు రావొద్దు, బతికుంటే బలుసాకు తినొచ్చు, దండంబెట్టి చెప్తన్న” అని దొర చేతులెత్తి మొక్కిండు.

అబ్బ గా పెద్దాయన మనకోసమే చెప్తండురాబై అనుకున్నరు జనాలు.

“సార్… సార్… ఇక్కడ కనిపించని పులి! అక్కడ పులి… అందరినీ కాటేస్తందని” జనాలు మల్ల మొరపెట్టుకున్నరు.

“ఇగో నేను చెప్పేది బాగా ఇనండి! హే… బాబు మీకేనయా!” అంటూ గడీల గద్దె మీద కూసున్నడు దొర.

“ఎన్కట గిలాంటియి మస్తుగ వొచ్చినయ్, పోయినయ్. ఆ మృగాలను మా తాత మస్తు ఉర్కిచ్చి సంపిండట! ఏం మాట్లాడినా తెలుసుకోని మాట్లాడుర్రయా!”ని దొర గట్టిగ అన్నడు.

“పులితోని కల్సి బతకడం నేర్సుకోవాలే, తప్పదు. అసలే పంచాయితీ ఆఫీసుకు గవ్వరాకడ లేదు” అన్నడోలేదో లోపల్ని నుండి బుల్లి దొర తుసుక్కున తుమ్మిండు. దొర కూడా తన ముక్కును కుడిచేయితోని ఓసారి, ఎడం చేయితోని ఓసారి బర్రబర్ర తుడుసుకున్నడు.

ఆ అంటూ… “వారం రోజుల్ల మంచి శుభవార్త ఇంటరని” చెప్పి, రాత్రి కావడంతో దొర గడీలకు పోయిండు. ఏం మంచి వార్త చెప్తడోనని ఊర్లే రకరకాలుగా ముచ్చట్లు. ఆ వాడకు, ఈ వాడకు ఒక్కొక్కడు పులి కాటు పడ్డా పట్టించుకునేటోడు లేడాయెనని జనాలకు శెక పుడుతున్నది.

ఇగ రాడాయే అగ రాడాయేనని ఒకటే దొర ముచ్చట కోసం జనం ఎదురు చూపులు. వారం రోజులకు గడీల కూడా ఆ కనిపించని పులి చొరబడిందని పుకార్లు ఒచ్చినయ్. దొరను కలుద్దామని రోజు మాదిరిగానే పోలీసు పటేల్ పుల్లయ్య గడీలకు పోయిండు. దొర పండుకునే అర్రల అడుగు పెట్టిండు, అటూ ఇటూ చూసిండు. ఖాళీ కల్లు కుండలు, శెనిగ గుడాలు, తినేసిన కోడి శియ్య బొక్కలు కనవడ్డయి పుల్లయ్యకు. అర్ర అంతా చిందరమందరగా కనిపిస్తుంది. దొర పండుకునే మంచం మీద ఒంటేలుకు పోసుకున్న వాసనొస్తుంది. పోలీస్ పటేల్ పుల్లయ్యకు కూడా లోపల భయం జొర్రింది. మొఖం మీద చెమటలు పడుతున్నయి. కనిపించని పులి దొరను గోకిందని అర్దం చేసుకున్నడు. పిల్లోలిగే మెల్లగా బయటకొచ్చి ఎవలికి చెప్పకుండ పంచాయితీ ఆఫీసు దిక్కు పోయిండు.

దొర గడీల లేడంటే అప్పటికే అర్దమైతంది. రాత్రికి రాత్రే దొర ఎవుసం దొడ్డికాడికి పోయిండని. పసుల కొట్టంల ఒక్కడే ఖల్… ఖల్… మని దగ్గుతూ, తుస్సూ… తుస్సూ… మని తుమ్ముకుంటా కూసున్నడు. తాను జనాలకు చెప్పిన డాంబికాల గురించి ఆలోచనల పడ్డడు దొర.

మొఖమంతా గుంజుకపోయి, సర్దికి ముక్కు శీది శీది పుప్పడి కాయంత పెద్దగయింది. గరం గరం ఆవు ఉచ్చలో శొంటి, దాల్చిన చెక్క, తులసాకు రసం కలుపుకొని తాగాలని పిచ్చిపంతులు ఫోన్ల వైద్యం చెప్పిండు. మూడు పూటలు ఆవు పెండ గోలీలు చేసుకొని గొంతులో ఏసుకొమన్నడు. తౌడు జావ చేసుకొని వేడి వేడిగ తాగాలని సలహాలిచ్చిండు.

గడీల ఎవ్వలు లేకపోయేసరికి నిశ్శబ్దంగా ఉంది.

ఊర్లే జనాలు రచ్చబండ కాడ, పంచాయతీ ఆఫీసు దగ్గర పనిపాటలేనోళ్లంతా కనిపించని పులి గురించి దొర చెప్పిన ముచ్చట్లు యాజ్జేసుకుంట కూసున్నరు. కొందరు దొర గడీ నుంచి ఏం శుభవార్త వస్తదోనని ఇంకా ఉత్కంఠగా ఎదురుచూస్తూ కూసున్నరు.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

13 thoughts on “ఏతులోడు

 1. Superb. వాడికి సిగ్గు వుంటే గదా
  మనుషుల జీవితాలు సర్వనాశనం అవుతుంటే గవే మాటలు.
  సాయుధ పోరాటానికి సిద్ధం కాకపోతే మళ్ళీ గా రోజులే.
  గోల్కొండ ఖిల్లా కింద కట్టాల్సిందే

 2. Good present situation this poem suitable for more feelings persons…anna simply superb…🙏

 3. Maa Satyam
  ముందుగా కొలిమి వారికి అభినందనలు
  కుమార స్వామి రచించిన “ఏతులోడు”
  సామాజిక స్పృహ తో తేనెలొలుకు తెలంగాణ భాషలో స్వీకరించిన కథావస్తువు సింబాలిక్గా, రచనా శైలి విధానం చదివి పాఠకుని చదివించేలా ఉంది. మీరు స్వీకరించిన వస్తువు లో కింద పేర్కొంటున్న విషయాలను కూడా”ఏతులోడు” కథలు పేరుకొని ఉంటే బాగుండేది.అధికారం చేపట్టిన సంవత్సరంలోనే నవ యవ్వనం లో ఉన్న ముక్కుపచ్చలారని పిల్లల్ని అత్యంత దారుణంగా ఎన్ కౌంటర్ చేశారు.
  తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణ అభివృద్ధి , ప్రాజెక్టుల కొరకు,ప్రతి సమావేశంలో ‘ఏతులోడు’ అత్యంత తెలివిని ప్రదర్శిస్తూ సింగల్ టెండర్ , సింగల్ టెండర్ అని చెప్పేవాడు.
  చివరికి ఆ సింగల్ అధినేత ఎవరో ప్రజల అందరికీ తెలిసి పోయింది. భూకబ్జాలు, నయీమ్ ఎన్ కౌంటర్ వెనుక జరిగిన తతంగాన్ని, అతని నుంచి స్వాధీనం చేసుకున్న ప్రజా డబ్బుని, భూమికి సంబంధించిన పత్రాలను, అతని వెనుక ఉన్న రాజకీయ నాయకులను కూడా కథలో ఎక్స్పోజ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది, మరో కథలో నైనా ఈ సంఘటనను ఇతివృత్తంగా స్వీకరించి రచించాలని, ఇలాగే తెలంగాణ మాండలిక భాషలు మీ రచనలు కొనసాగాలని ఇంకా లోతుగా తెలంగాణ మాండలిక పద జాలాన్ని వెలికితీయాలని, మాండలిక భాష కనుమరుగు కాకుండా ఇలాగే రచనలో ప్రతిఫలింప చేయాలి. తెలుగు సాహిత్యంలో
  ” చేనేత వృత్తి జీవన చిత్రణ పై” పరిశోధన చేస్తున్నందుకు ఉద్యమాభి వందనాలు.

 4. ముక్కు దొర గురించి సక్కగా చెప్పినవ్ అన్న.

 5. దోర మాటలు నమ్మి మోసపోయిన వారి కి మీ కథ తో కళ్ళు తెరుకుంటాయని భావిస్తూన్నాం సార్…
  ఇలాంటి కథలు మీరు ఎన్నో రాయాలని ఆశిస్తున్నాం…

 6. కుమార స్వామి గారు చాలా చాలా బాగా రాశారు.

Leave a Reply