ఎవరు?

చూపు తెగినపోయిన చోట
చీకటి రూపు కడుతున్న చోట
చిన్నబోయిన ఆకాశానికి
చిరునవ్వును అరువిచ్చిన వాళ్లు
ఎవరు?

దిగులు గుండెల్లో
ఆశల దీపాలు నాటి
శత కోటి తారల్ని వెలిగించిన వాళ్లు
ఎవరు?

చెమ్మ‌గిల్లే మ‌నిషికోసం
చ‌రిత్ర నిర్మిస్తున్న‌వాళ్లు
వసంతాల్ని లెక్కిస్తూ
ప్ర‌భాతాన్ని ప్రేమిస్తున్న‌వాళ్లు
ఎవరు?

నేల దుఃఖాన్ని త‌మ‌లోకి ఒంపుకున్న వాళ్లు
వేల యోజ‌నాల ముందే వెలివేయ‌బ‌డ్డ వాళ్లు
దేశ‌భ‌క్తి వ‌డ‌పోత‌లో రాజ‌ద్రోహులైన వాళ్లు
ఎవరు?

బంధిఖానాలో భాష‌ను కోల్పోయిన‌వాళ్లు
ఉరిపోసుకున్న అక్ష‌రాల‌కు ఊపిర‌యిన‌వాళ్లు
రేప‌టి కోసం రేయిని ర‌గిలిస్తున్న‌వాళ్లు
ఎవ‌రు?

క‌శ్మీరు క‌ల‌త వాళ్లు
పాల‌స్తీనా గాయం వాళ్లు
నాగేటి చాళ్లు వాళ్లు
విముక్తి గేయం వాళ్లు

పుట్టింది న‌ల్ల‌గొండ జిల్లా న‌క్రేక‌ల్‌. పాత్రికేయుడు. విర‌సం స‌భ్యుడు. రచనలు: క‌ల‌త నిద్దురలో (క‌వితా సంక‌ల‌నం), అన‌గ‌న‌గా అడ‌విలో - హిడ్మే మ‌రికొంద‌రు (వ్యాస సంక‌ల‌నం).

Leave a Reply