ఎవరు

ఇంతకీ
నేనెవరిని ప్రేమించి ఉంటాను
ఊహ తెలిసిన రోజు నుండి
ఎన్ని పరిచయాలు !
ఎన్ని పరిమళాలు !
అమ్మ, నాన్న, అన్న, అక్క
మిత్రుడు, శత్రువు
గురువు జాబితా మాత్రం చాలా ఉంది
మునిమాపు వేళ
సాయంత్రాల కంటి రంగు
దేహానికి అంటుకున్నట్టు
నేనెవరిని హత్తుకున్నట్టు ?

ఎవరో
ఒకర్ని నేను
అమితంగా
ఇష్టపడే ఉంటాను

అద్దెఇల్లు
ఖాళీ చేసి పోయినట్టు
ఎన్నో పరిచయాలు
ఎగిరి పోయి ఉంటాయి
తీరంలో రాసిన పేర్లను

అలలు చేరిపేసినట్టు
ఎవరెవరో
చెదిరిపోయిఉంటారు

కచ్చితంగా ఎవర్ని ప్రేమించానో
తెలియడం లేదు
ఎవరో
ఒకరు
నన్ను
శుభ్రపరిచి ఉంటారు
ఆత్మను
అద్భుతంగా వెలిగించి ఉంటారు
వర్షం కురిసినట్టు
ఎండ కాసినట్టు
చలి పుట్టినట్టు
కాలంతో ఉండే ఉంటారు

ఇంతకీ
నేనెవర్ని
ప్రేమించినట్టు రూడి కాలేదు
ఉన్నట్టుండి
ఒక
ఒంటరి గాలి
చెవిలో
చెప్తూ ఉంది
ఆమెనే
ఆమెనే అని

బహుశా
ఆమెనే
ప్రేమించి
వుండొచ్చు

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

4 thoughts on “ఎవరు

Leave a Reply