ఎవరు నువ్వు?

జనరల్ మహాశయా, మీ యుధ్ధ ఫిరంగి మహా శక్తివంతమైనది
అది అడవులని నేలమట్టం చేయగలదు, వందలాది మంది మనుషులని తొక్కేయగలదు
ఒక్కటే లోపముంది దానికి
దాన్ని నడిపేందుకు ఒక మనిషి కావాలి

జనరల్ మహాశయా, మీ బాంబర్ విమానం బహు గొప్పది
పెనుతుపానుకంటే వేగంగా ఎగిరిపోగలదు, ఏనుగుకంటే ఎక్కువ బరువులు మోయగలదు
ఒకే ఒక్క కొరత దానికి
బాగుచేసేందుకు ఒక మెకానిక్ కావాలి

జనరల్ మహాశయా, మనిషి చాలా పనికొస్తాడు
అతడు ఎగరడం ఎలాగో తెలిసినవాడు, చంపడం ఎలాగో తెలిసినవాడు
ఒక్కటే లోపం అతనికి
వాడికి ఆలోచించడం తెలుసు…

  • బెర్తోల్ట్ బ్రెహ్ట్

మనుషులు, ఆలోచించే మనుషులు పాలకుల దృష్టిలో, ప్రభుత్వాల దృష్టిలో ప్రమాదకరమైనవాళ్లు. ఆలోచించే మనుషులు లేవనెత్తే ఇబ్బందికరమైన ప్రశ్నలు రాజద్రోహంగా, దేశద్రోహంగా కనిపిస్తాయి. ప్రశ్నలని చాలా సందర్భాలలో మనుషుల కలలకి ఒక వ్యక్తీకరణగా చూడవచ్చునేమో. ఖైదీలు అందరూ గొప్ప స్వాప్నికులని రచయిత దొస్తోయెవ్ స్కీ అంటాడు. ఆలోచనాపరులైన మనుషుల ప్రశ్నలకీ, కలలకీ అద్దం పట్టిన ఒక వుత్తరం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం.

ఈ ఒక్క వుత్తరం గురించి మాట్లాడుకోవాలంటే, ఇద్దరు వ్యక్తుల గురించి, రెండు దేశాల గురించి, నిరంతర యుద్ధ బీభత్స వాతావరణపు విషాద వుద్విగ్న నేపధ్యంలో ఆలోచనపరులైన వ్యక్తుల మానవీయ స్పందనల గురించీ మాట్లాడుకోవాలి. ఒకరు యువల్ లోటెమ్, ఇజ్రాయల్ దేశస్తుడు. మరొకరు ఇమద్ సబీ, పాలస్తీనీయుడు.

ఇద్దరు మనుషులు

సంఘటన జరిగిన 1997 నాటికి యువల్ లోటెమ్ కి 40 సంవత్సరాలు. తానొక రిజర్వు సైనికుడు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువు తర్వాత, సినిమా నిర్మాణం, స్క్రిప్టు కూర్పు రంగాలలో పనిచేశాడు. రిజర్వు వుద్యోగిగా మారక ముందు, సైన్యంలో లెఫ్టినెంట్ స్థాయిలో పనిచేశాడు. సైనిక విధుల నిర్వహణ అనంతరం దేశాదేశాలు పర్యటించాడు, ఆఫ్రికాలో రెండేళ్ళు గడిపాడు. జర్మన్లు ఎవరైనా కలిస్తే, యూదుల వూచకోతకి ప్రేరేపించిన కారణమేమిటా అని ఆసక్తిగా అడిగేవాడు. ‘అందరూ ఆ వూచకోత హత్యలలో పాల్గొన్నార’నే సమాధానం విన్నప్పుడల్లా, ప్రశ్నించకుండా ఎటు నడిపిస్తే అటు నడిచే మూక మనస్తత్వం గురించీ, అందులో ప్రమాదం గురించీ ఆలోచించేవాడు.

సైన్యంలో రెగ్యులర్ విధులలో పనిచేసినప్పుడుగానీ, రిజర్వు వుద్యోగిగా పనిచేసిన సందర్భాలలోగానీ, ఇజ్రాయల్ ఆక్రమితప్రాంతాలలో బాధ్యతల నిర్వహణకి నిరాకరించేవాడు. ఒక్కోసారి పై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించేవాళ్లు. 1993లో గాజా ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించ నిరాకరించినందుకు 28 రోజుల సైనిక కారాగార శిక్ష అనుభవించాడు. రిజర్వు వుద్యోగిగా మళ్ళీ 1997లో సైనిక విధుల నిర్వహించాల్సి వచ్చినప్పుడు తాను 1967 పూర్వ సరిహద్దులు (గ్రీన్ లైన్) దాటి పనిచేయబోనని చెప్పాడు. అప్పుడు, తనకి మెగిద్దో జైలులో పని అప్పగించారు. మెగిద్దో గ్రీన్ లైన్ పరిధిలోపలే వున్నా, అందులో అనేక మంది పాలస్తీనా ఖైదీలు, ప్రత్యేకించి ఎలాంటి నేరారోపణలూ, న్యాయ విచారణా ప్రక్రియా లేకుండా నిర్బంధంలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలు వున్నారనే విషయం యువల్ లోటెమ్ కి తెలుసు (అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్ గా పిలిచే ఈ నిర్బంధ విధానాన్ని ఇండియాలో టాడా, ఉపా చట్టాల నిర్బంధ విధానంతో పోల్చుకోవచ్చు). ఇక యువల్ లోటెమ్ మెగిద్దో జైలులో పని చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో, విధి నిర్వహణకి నిరాకరించిన నేరానికి గాను యువల్ లోటెమ్ కి 28 రోజుల జైలు శిక్ష విధించారు.

అంతరాత్మ సాక్షిగా ఇలాంటి అన్యాయమైన విధులకి అంగీకరించని సైనికుల రాజకీయ వుద్యమం, ‘యెష్ గ్వుల్’ (Yesh Gvul) ఇజ్రాయెల్ లో 1982 నుంచీ పనిచేస్తూవుంది. యువల్ లోటెమ్ ని నిర్బంధించిన వార్త ఈ సంస్థ ద్వారా ఇజ్రాయెలీ దినపత్రిక హారెట్జ్ (Ha’aretz) లో వెలుగులోకి వచ్చింది. ఈ వార్త పాలస్తీనా పత్రిక అల్ కుద్స్ (Al Quds) లో జూలై 8, 1997న అచ్చయింది. ‘రాజకీయ ఖైదీలని ఎలాంటి విచారణ లేకుండా బంధించి వుంచే జైలులో వార్డరుగా పని చేసేకంటే, నేను జైలులో ఖైదీగా వుండడమే సరైనదనుకుంటాన’న్న యువల్ లోటెమ్ మాటలని అల్ కుద్స్ వార్త ఉటంకించింది. ఈ వార్త షారోన్ జైలులో బందీగా నిర్బంధంలో వున్న పాలస్తీనా ఖైదీ ఇమద్ సబీ దృష్టిలోకి వచ్చింది.

35 యేళ్ళ ఇమద్ సబీ అప్పటికి 20 నెలలుగా షారోన్ జైలులో ఎలాంటి విచారణకీ నోచుకోకుండా మగ్గుతున్నాడు. పాలస్తీనా విముక్తి ప్రజా సంఘటనలో (పి.ఎఫ్.ఎల్.పి) ఒక సీనియర్ మిలిటెంట్ అన్నది తనపై మోపిన ఆరోపణ. అందుకు ఎలాంటి రుజువులూ లేవు, కోర్టులో విచారణా లేదు. అరెస్టుకి ముందు తాను ఒక పరిశోధనా సంస్థకి అధ్యక్షుడిగానూ, యూనివర్సిటీ మహిళా అధ్యయన కేంద్రంలో అనువాదకుడిగానూ పనిచేస్తూ వున్నాడు. హాలండ్ దేశంలో ఆర్ధిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చదువుకోసం తనకి 1996 సెప్టెంబర్ నుంచి స్కాలర్‌షిప్ మంజూరైవుంది. నిర్బంధం మూలంగా తాను చదువుని కొనసాగించలేకపోయాడు. తనకి చదువుకొనసాగించే అవకాశాన్ని ఇవ్వాలనీ, తనని విడుదల చేస్తే, ఆక్రమిత ప్రాంతాలకి వెళ్లబోననీ విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్ అధికారులు పట్టించుకోలేదు. తనని ఇరవై నెలలుగా నిర్బంధంలోనే వుంచారు. ఇమద్ సబీ జైలులో హీబ్రూ భాష నేర్చుకున్నాడు. ఇజ్రాయెల్ సంస్కృతినీ, పత్రికలనీ అధ్యయనం చేసేవాడు. జైలు నిర్బంధంలో వున్నప్పటికీ అరబిక్, హీబ్రూ భాషలలో సాహిత్యాన్ని విస్తారంగా రాసేవాడు. ఇంకా తన కూతురు కోసం ఒక డైరీని కూడా రాసేవాడు. ఇజ్రాయెలీ పత్రికల సంపాదకీయాలని గురించి చర్చించేవాడు. 1996 నవంబరులో హారెట్జ్ పత్రిక ఒక వ్యాసంలో ఇమద్ సబీ ఫోటోను ప్రచురించింది (అప్పటికి ఈ విషయం యువల్ లోటెమ్ కి తెలియదు).

యువల్ లోటెమ్ నిర్బంధపు వార్త ఇమద్ సబీని కదిలించింది. అల్ కుద్స్ పత్రికకి తాను వెంటనే ఒక బహిరంగ లేఖని రాశాడు. ‘పేరు తెలియని ఒక ఇజ్రాయెలీ అధికారికి’ ‘షారోన్ జైలు నుంచి’ ఇమద్ సబీ 13 జూలై 1997న రాసిన లేఖ ఇదీ.

పాలస్తీనా ఖైదీ ఇమద్ సబీ లేఖ

ఎవరు నువ్వు? ఆఫీసర్, నువ్వెవరు?

నీకు నేనొక ఉత్తరం రాద్దామనుకొంటున్నాను. అయితే, ముందు నువ్వెవరో నాకు తెలియాలి. ఇలా ప్రవర్తించేలా నిన్ను పురికొల్పిన విషయమేమిటో నాకు తెలియాలి. నువ్వు చిత్తశుద్ధితో, ఈ సూత్రబద్ధమైన నిర్ణయానికి ఎలా వచ్చావో తెలుసుకోవాలి. వూహకే అందని అత్యంత విలక్షణమైన ఈ తిరుగుబాటుకి నువ్వు ఎలా పూనుకున్నావు?

అసలు నువ్వు ఎవరు?

నీ పేరేమిటి? నువ్వెక్కడ వుంటావు? నీ వృత్తి ఏమిటి? నీ వయసెంత? పిల్లలు వున్నారా నీకు? సముద్రమంటే నీకు ఇష్టమేనా? నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతావు? నిన్ను నిర్బంధించిన జైలు గదిలో ఇప్పుడు, ఈ క్షణాన నువ్వు ఏంచేస్తున్నావు? సరిపడా సిగరెట్లు నీదగ్గర వున్నాయా? నీ అభిప్రాయాలతో అంగీకరించేవాళ్లెవరైనా అక్కడ నీతో వున్నారా? ‘నేను ఈ తిరుగుబాటు చేసినందుకు ఇంతటి మూల్యం చెల్లించవలసిందేనా’ అని నీకెప్పుడైనా అనిపించిందా? చుట్టూ మూసుకుపోయిన గోడల మధ్య నీ హృదయంలో ముసురుకున్న అనుభూతులు ఎలాంటివి? నువ్వు నాకు తెలుసా? మనం ఎప్పుడైనా కలుసుకున్నామా?

నీ జైలు గది కిటికీలోనుంచి చందమామా, నక్షత్రాలూ కనిపిస్తాయా? బరువైన తాళపుచెవుల సవ్వడీ, కిర్రుమంటున్న తాళాలు, ఫెడేల్మంటున్న బరువైన ఇనుప తలుపుల చప్పుడూ నీ చెవులకి అలవాటు అయిపోయాయా? విచారణలలో నిన్నేమని అడిగారు? నువ్వేమని జవాబు చెప్పావు? గాలికి వూగుతున్న గోధుమ పొలాలూ, ఆ కంకుల గుత్తులూ నీకు నిద్రలో కనిపిస్తున్నాయా? పొద్దుతిరుగుడు పూల చేలు కనిపిస్తున్నాయా? ఆ పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగులు నీ కళ్ళకి ఇంపుగా కనిపిస్తున్నాయా… సూర్యుడి ఎండ వేడి చురచురమంటున్నదా? నిద్రలో నువు చిరునవ్వు నవ్వుతున్నావా, జైలు గది గోడలు కదిలి, కూలిపోతున్నాయా, ఎవరో ఒక అపరిచితుడు సుదూరంగా నిలబడి నీవైపు చేతులు వూపుతూ కనిపిస్తున్నాడా?

లెఫ్టినెంట్, ఇంతకీ నువ్వు ఎవరు? ఎలాంటి నేరారోపణ గానీ, విచారణ గానీ లేకుండా మమ్మల్ని నిర్బంధిస్తున్న విషయం అంత ముఖ్యమైనదని నీకు ఎందుకు అనిపించింది?

ప్లీజ్, నువ్వెవరో నాకు చెప్పవా? నా స్వేచ్ఛ నీకు అంత ముఖ్యమైనదనిపించిందా?

జైలు వార్డరు బాధ్యత నిన్ను నిజంగా కుంగదీసివుండేదా? ఒక్క వారం, మహా అయితే ఇంకో రెండు, మూడు వారాలపాటు కళ్ళు మూసుకుని నీ రిజర్వు ఉద్యోగాన్ని నువ్వు చేసివుంటే, మళ్ళీ నువ్వు వెనక్కి, నీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోయివుండేవాడివి. నువ్వు మౌనంగా, మాట్లాడకుండా వుండివుండవచ్చు. కోపాన్ని నియంత్రించుకుని, ఉద్వేగాలని అదుపులో వుంచుకుని, ఒక మెత్తటి వార్డరుగా, ఖైదీలతో మర్యాదగా, జాగ్రత్తగా, మృదువుగా వ్యవహరించి వుండవచ్చు. నువ్వు అలా పని చేసి వుంటే ఏం జరిగేది?

ఇప్పుడు చెప్పు, నువ్వెవరురు?

జైలు వార్డర్లు నిన్ను ఎలా చూస్తున్నారు? నీ భార్య లేదా నీ స్నేహితురాలు, మీ అమ్మ, నీ పిల్లలు నిన్ను చూడడానికి వస్తారా? నువు వుత్తరాలు రాస్తావా? రాస్తే ఎవరికి రాస్తావు?నువు ప్రేమించిన వ్యక్తికి రాసే వుత్తరాన్ని ఎలా మొదలుపెడతావు? నా గురించి ఆలోచిస్తావా? నా స్వేచ్ఛ నీకు ఎందుకు ముఖ్యమైంది? నీ దృష్టిలో అసలు స్వేచ్ఛ ఎంత ముఖ్యమైంది? ఈ స్వేచ్ఛకంటే ‘జాతీయ భద్రత’మరింత ముఖ్యమైనది కాదా? ఒకవేళ నేను నిజమైన టెర్రరిస్టునైవుంటే ఏమయి వుండేది? అప్పుడు నువ్వేమని జవాబు చెబుతావు?

నువు చేసిన పని విషయంలో నీకు పశ్చాత్తాపమేమీ లేదు కదా? ‘వాళ్ళు ప్రమాదకరమైన (పాలస్తీనా సాయుధ బృందం) హమాస్ సభ్యులు, ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ సభ్యులు’ అని వాళ్ళు చెప్పినప్పుడు నీకెలాంటి అనుమానం రాలేదా? మీ పోలీసులమీద నీకు నమ్మకం లేదా? అమాయకులని నిర్బంధిస్తున్నారని నువ్వు నిజంగా అనుకుంటున్నావా?

ఇంతకీ ఎవర్నువ్వు?

నువు ఇప్పుడు నిద్రపోతున్నావా? వెల్లకిలా పడుకుని, జైలు గది పైకప్పు వంక చూస్తూ ఆలోచనలలో మునిపోయావా? నీ కళ్ళు ఏ రంగులో వుంటాయి? నువు పొట్టిగా వుంటావా? పొడవుగా వుంటావా? దేనితో నీకు సంతోషం అనిపిస్తుంది? ఏమంటే నీకు కోపం వస్తుంది? వాళ్ళు నీకు పుస్తకాలని ఇచ్చేందుకు అనుమతినిస్తారా? రోజూ చదువుకోవడాని దినపత్రికలని ఇస్తారా? జైలు వార్డర్ల కళ్ళలో నీకేం కనిపిస్తుంది? నువు ఎక్కువగా నవ్వుతావా? వేకువజామున పక్షుల కువకువల సవ్వడి నీకు వినపడుతుందా? జైలు దుప్పట్లు సరిగా వున్నాయా? అసలు శాంతి నెలకొంటుందా? ఓస్లో ఒప్పందం శాంతిని సాధిస్తుందా? లికుడ్ పార్టీకి అసలు శాంతి పట్ల ఆసక్తి వుందా? లేబర్ పార్టీకైనా అలాంటి ఆసక్తి వుందా? జైలులో నీ నిజ జీవిత అనుభవం నువు వూహించినట్లుగానే వుందా?

నువు నాకు తెలుసునని ఎందుకనిపిస్తున్నది? మనం ఇంతకుమునుపు వుత్తరాలు రాసుకున్నామా? ఎలాంటి నేరారోపణ గానీ, విచారణ గానీ లేకుండా నిర్బంధించే విధానానికి వ్యతిరేకంగా రాసే మిత్రుడొకరు నాకు తెలుసు. అతను నీకు కూడా స్నేహితుడేనా? నిన్ను కలవడానికి మహిళా న్యాయవాదులు వస్తారా? (మహిళా న్యాయవాది అని నేనెందుకు రాశానంటే, మగ న్యాయవాదులకంటే మహిళా న్యాయవాదులు సున్నితంగా, శ్రద్ధగా వుంటారు, పట్టింపుతో పనిచేస్తారు).

‘నేరం రుజువయ్యేవరకూ ఆ వ్యక్తి నిరపరాధియే’… అని బెంజమిన్ నెటన్యాహు రాసిన మాటలని చదువుతూ వుంటే చిత్రంగా అనిపించడంలేదూ? నిజమే, నేరం చేసినట్లు రుజువు అయ్యేదాకా ఎవ్వరినైనా నిరపరాధులుగానే పరిగణించాలి. మనిషి మనస్సులో వున్న ఆలోచనల మాటేమిటి? ఆ మనిషి నేరంచేయని నిరపరాధేనని నువు నమ్ముతున్నావా? మరి ‘జాతీయ భద్రత’ మాటేమిటి? అసలీ గొడవంతా నీకెందుకు? నువ్వు ఎందుకింత మొండిగా వున్నావు? ఇతరులందరిలాగా నువ్వెందుకు పనిచేయలేదు? నీకు తెలియని మనుషులని సమర్ధించాలని నువ్వెందుకు అనుకుంటున్నావు?

ఈ ప్రశ్నలన్నిటికీ నీదగ్గర సమాధానాలు వున్నాయా? అయితే, ముందుగా నాకొక విషయం చెప్పు. నువ్వెవరు? లెఫ్టినెంట్, నా ప్రశ్నలు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాయా? ఈ ప్రశ్నలన్నిటితో నేను నిన్ను ఎందుకు ఇబ్బందిపెట్టాలి?

నేనెరుగని లెఫ్టినెంట్ అధికారీ, నీ పేరు ఏదైనా కానీయి. నీకు కమ్మటి నిద్ర పట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆ నిద్ర, ఎలాంటి అపరాధభావనా లేకుండా, స్వచ్ఛమైన అంతరాత్మతో ప్రశాంతంగా నిద్రించే మనిషి నిద్ర. నీ పేరు నేను తెలుసుకుంటాను. నీ పేరు తెలుసుకున్నాక, నీకు ఒక సుదీర్ఘమైన వుత్తరం రాస్తాను. అది, ఒక ఖైదీ మరొక ఖైదీకి రాసే వుత్తరం. ‘శాంతి కలుగుగాక, ప్రియ …’ అన్న సంబోధనతో మొదలుపెట్టి, ‘ఇట్లు నీ విధేయుడు, ఇమద్’ అని నేను ఆ వుత్తరాన్ని ముగిస్తాను.

వుత్తరం తర్వాత

1997 జూలై చివరలో యువల్ లోటెమ్ జైలు నుంచి విడుదలయ్యాక, హారెట్జ్ పత్రిక విలేఖరి దాలియా కార్పెల్ తనని ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంలో తనకి ఇమద్ సబీ లేఖనీ, తన ఫోటోనీ చూపించింది. తన చిన్న కూతురుతో ఇమద్ సబీ వున్న ఫోటోతో పాటు, ఇమద్ సబీ రాసిన లేఖని చదివి యువల్ లోటెమ్ ఎంతో చలించిపోయాడు. ‘నేను చేసిన పని సరైనదేననీ, నేను జైలులో వుండాల్సి వచ్చినా, మూల్యం చెల్లించాల్సి వచ్చినా అది సరైనదేననీ అనిపిస్తున్నద’ని అన్నాడు.

యువల్ లోటెమ్ మాటలలో చెప్పాలంటే, ‘ఆ వుత్తరం హృదయంలోనుంచి సూటిగా వచ్చింది. పంట పొలాల మధ్య జీవిస్తూ, పైరగాలి పీలుస్తూ, స్వేచ్ఛ గురించీ, తన చిన్నారి కూతురు గురించీ కలలు గనే మనిషి రాసిన వుత్తరం అది. …తాను నవ యవ్వనంలో వున్న మనిషి, తన అనుభూతులని వ్యక్తీకరించడానికి భయపడని మనిషి. తాను నాకు రాసిన వుత్తరం కూడా భయం లేకుండా, తన అనుభూతులని వ్యక్తం చేస్తూ వుంది. ఆ వుత్తరం, తాను భయం లేకుండా పోరాటం చేస్తానని ప్రకటించే ఒక స్వాతంత్ర్య పోరాట యోధుడి ఆగ్రహ, ఆవేశ ప్రకటన కాదు. తన భయాలనీ, కలలనీ సబీ అందులో వ్యక్తీకరించాడు.’

తర్వాత ఇజ్రాయెలీ పత్రిక ఇమద్ సబీ లేఖతో పాటు మొత్తం సంఘటనలపై ఒక పెద్ద వ్యాసాన్ని ప్రచురించింది. యువల్ లోటెమ్ సబీ కి ఒక సుదీర్ఘమైన జవాబు రాశాడు. సబీ భార్యని వ్యక్తిగతంగా కలుసుకుని పరామర్శించాడు. యువల్ లోటెమ్ ని సబీ భార్య భోజనానికి ఆహ్వానించింది. సబీ మిత్రులు చాలామంది వచ్చి తనని చూశారు. హారెట్జ్ పత్రిక వ్యాసాలు, ప్రపంచ వ్యాపితంగా వచ్చిన ప్రతిస్పందన ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని, (అప్పటి పరిస్థితులలో) కొంత ఆత్మ రక్షణలోకి నెట్టాయి. ఆగస్టు 26, 1997 న అంతిమంగా ఇమద్ సబీ విడుదలయ్యాడు. చిత్రంగా, అది యువల్ లోటెమ్ పుట్టిన రోజు కూడా…

విడుదలయిన వెంటనే, ఇమద్ సబీ తన చదువులకోసం హాలండ్ వెళ్లిపోయాడు, భార్య, కూతురుతో సహా. ఇద్దరి మధ్యా వుత్తరాలు కొనసాగేయి. 1998 జనవరిలో యూరప్ పర్యటనలో భాగంగా యువల్ లోటెమ్ హాలండ్ వచ్చిన సందర్భంలో ఇద్దరూ కలుసుకున్నపుడు దిగిన ఫోటోని ఇక్కడ చూడ వచ్చు.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

2 thoughts on “ఎవరు నువ్వు?

  1. very moving Kiran! There arr so many such prisoners languishing behind the bars without any trail.

Leave a Reply